మనసు మాట విను...
( పూర్తిగా కథ చదవడానికి టపాపై మౌస్‌తో క్లిక్ చేసి, స్ర్కోల్ చేయండి )
తొమ్మిదవడానికి ఓ అరగంట టైం ఉంది. రాత్రి హరి రూంలో అర్ధరాత్రి దాటాకకూడా మేల్కొని ఉండి లైట్ ఆఫ్ చేయలేదు. సరిగ్గా నిద్ర పట్టక పొద్దున్నే లేవటం వల్ల ఆఫీస్ కి తొందరగా వచ్చేసాను. కేఫ్టేరియాలోకి అడుగు పెడుతుండగా...
"హాయ్...రవి" అంటూ నా కొలీగ్ శ్వేత కాఫీ కప్పుతో పలకరించింది.
"హాయ్.." అన్నాన్నేను.
శ్వేత ఇది వరకు నా టీంలోనే పనిచేసేది. ప్రాజెక్ట్ పూర్తవ్వటంతో తనని హరి చేస్తున్న ప్రాజెక్ట్ లో వేసారు. అప్పుడప్పుడు కేంటీన్ లోనో, కేఫ్టేరియాలో కలిసినప్పుడు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటాం.
కాసేపు హైక్ ల గురించి, తను కొత్తగా చేరిన టీం గురించి, ఆఫీస్ విషయాలు మాట్లాడుకున్నాం.
"హరి ఎలా చేస్తున్నాడు పని" అని మాటల మద్యలో అడిగాను.
" ఏంటి హరినా...." అంటూ నవ్వబోయి మళ్ళీ తను నా ఫ్రెండ్ అని గుర్తొచ్చి బలవంతంగా ఆపుకుంది శ్వేత.
"నీకో విషయం అడగనా....."
"అడుగు"
"తను ఎమైనా లవ్ లో ఫెయిల్ అయ్యాడా....ఎప్పుడు చూసినా మూడీగా ఉంటాడు. కాస్త పలకరిద్దామంటే మొహం ఎప్పుడూ అదోలా పెట్టుకుని ఉంటాడు....మీటింగ్స్ కి వచ్చినప్పుడు కూడా పరద్యానంగా ఎటో చూస్తుంటాడు...ఏవో ఆలోచిస్తున్నట్టు కనపడతాడు. డెడ్ లైన్ ఉన్నాసరే అస్సలు పని తొందరగా చేయడానికి ప్రయత్నించడు...మొన్న మేనేజర్ అంటున్నాడు తనని ప్రాజెక్ట్ నుండి తప్పించి బెంచ్ మీద పెట్టాలి అని...చెప్పు బాస్ తనకి...ఇలా అయితే ఫైర్ చేస్తారని...అసలే పరిస్థితులు బాలేవు కదా! " అంటూ ఇంకా ఏవో మాట్లాడదామనుకుండగా తన మేనేజర్ ఇటువైపు రావటం చూసి "కాచ్ యు లేటర్" అంటూ వెళ్ళిపోయింది.
ఆరోజు నాకు ఆఫీస్లో పెద్దగా పని లేకపోవటం వల్ల సాయింత్రం తొందరగానే రూం కి చేరుకున్నాను. ఫ్రెష్ అయ్యి డాబా మీదకు వెళ్ళాను. చల్లని గాలి అలా మోముని తాకుతూ పోతుంది. పొద్దున శ్వేత, హరి గురించి అన్న మాటలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా తను నాతో అన్న
"ఫైర్ చేస్తారు.." అన్న మాట మీదే నా దృష్టంతా. జేబులోంచి ఓ సిగరెట్ తీసి వెలిగించాను. ఓ దమ్ము గట్టిగా లాగి వదిలాను. నా ఆలోచనలు ఏటో సాగిపోతున్నాయి.
* * * * * * * * * *
హరి నాకు ఇంటర్మీడియెట్ లో స్నేహితుడు. చాలా తెలివైనవాడు. వాడి ఆలోచనాదోరణి ఎరిగిన నాకు క్లాసులో అందరికంటే వాడు కొంచేం డిఫరెంట్ గా కనిపించేవాడు. వాళ్ళ కుటుంబాల్లొ ఫారిన్ లో సెటిల్ అయినవారు, డాక్టర్లు, సైంటీస్ట్ లు ఇంటికి కనీసం ఒక్కరైనా ఉంటారు. ఇంట్లో వీడే పెద్దవాడు కావటంతో, వాళ్ళ ఇంట్లో వాడి చదువు విషయంలో ఎక్కువగా పట్టించుకునేవారు. ఎప్పుడు చూసిన పుస్తకాలు ముందేసుకుని కూర్చొకపోతే ఒప్పుకునేవారు కాదు.
ఒకసారి మాథ్స్ పరీక్ష కోసం నాకు తెలియనివి వాడిదగ్గర నేర్చుకుందామని వెళ్ళాను. వాడు డాబా పైన ఉన్నాడు. పుస్తకం వైపు తదేకంగా చూస్తూ చదువుతున్నట్టు కనిపించాడు.
"ఒరేయ్ మరీ అంతలా చదివెయ్యకు..పుస్తకం కాలిపోతుంది" వాడి పక్కన కూర్చోబోతూ అన్నాను.
నా మాటకు హరి వెటకారంగా ఓ నవ్వు నవ్వాడు.
"నువ్వు కూడా మా ఇంట్లో వాళ్ళ లాగే నేను పుస్తకం ముందేసుకుని కూర్చొంటే చదివాస్తాననుకుంటున్నావా" అంటూ చదువుతున్న పుస్తకం మూసాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ...
"ఇందాక సూర్యాస్తమయం చూసావా?..ఎంత బాగుందో...దూరంగా కొండల మధ్యనుండి సూర్యుడు కిందికి వెళ్ళిపోతున్నాడు..పక్షులన్నీ గుంపులు గుంపులుగా గూళ్ళకి చేరుకుంటున్నాయి..ఏటిలో పడవ ఇటువైపు వాళ్ళని అటువైపుకు తీసుకెళుతుంది...వహ్..ఎంత మనోహరమైన దృశ్యాలు అవి...ఇంత అందమైన దృశ్యాలు ఆస్వాదించకుండా వదిలేసి మనమేమో ఎంతసేపూ మరో ప్రపంచం లేదన్నట్టుగా ఎంసెట్..ఆసెట్..ఈసెట్..ఐ.ఐ.టీ ఫిజిక్స్ అంటూ సాయింత్రాలు గడిపేస్తుంటాము."
"పుస్తకం వైపు చూసి ఇదా నువ్వు ఆలోచిస్తుంది...సర్లే నువ్వు ఇలా ఆలోచిస్తుంటే ఐ.ఐ.టీ కాదు కదా ఎంసెట్ లో కూడా రాంక్ రాదు" అన్నాను వాడితో సగటు ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని తలపిస్తూ....
ప్రకృతిని పరిశీలించటం, ఆస్వాదించటం అంటే నాకు కూడా ఇష్టమే. ఆ విషయం హరికి కూడా తెలుసు. అందుకే ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వచ్చినా హరి నాతోనే పంచుకుంటాడు. అయితే అలాంటి ఆలోచనలు నాకు వచ్చినప్పుడల్లా అమ్మ నాకు క్లాసు పీకుతున్నట్టు గుర్తొచ్చి వాటిని బలవంతంగా ఆపేసే ప్రయత్నం చేస్తాను నేను.
స్వతహాగ గ్రాహకశక్తి ఎక్కువగా ఉండటం వల్ల మేము ఎంతలా చదివినా వాడికే మాకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి. వాడికి ఏ కాన్సెప్ట్ అయినా క్లాసులోనే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం డాబా పైన కూర్చొని, పుస్తకాలు ముందేసుకుని...వెన్నెల..సూర్యోదయం అంటూ ఆలోచిస్తూ ఏవేవో రాతలు రాస్తుంటాడు.
ఓసారి వాడు వాళ్ళ ఇంటి ముందు ఉన్న గడ్డిపూవ్వు పై ఓ కవిత రాసి, వాడి నోట్స్ చివరి పేజిలో ఉంచాడు. స్టడీ అవర్లో లెక్చరర్ చూసి, అది వాడు ఏ అమ్మయికో రాసుంటాడని అనుకుని పేరెంట్స్ ని తీసుకురమ్మని నానా గొడవా చేసాడు.
వాడితో నేను కంబైన్డ్ స్టడీ చేసిన అప్పుడప్పుడూ ఫలానా సినిమాలో ఆ షాట్ చూశావా?..లొకేషన్ బ్యుటిఫుల్ గా ఉంది...అక్కడ అలా కాదురా..ఇక్కడ ఇలా తీసుంటే బాగుంటుంది....లాంటి సినిమాల గురించి కబుర్లు, కవితలు వినటాలు తప్పించి చదువు అంతగా సాగేది కూడా కాదు.
* * * * * * * * * *
ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు అప్పట్లో సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ లేనందున అందరూ రాజధానికే వెళ్ళాల్సి ఉండేది. ట్రైన్ లో ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళేందుకు బయలుదేరాం. ట్రైన్ కదిలి చాలా దూరం వెళ్ళాక కూడా వాడు నాతో ఏమీ మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు. నిశ్శబ్ధాన్ని చేదిద్దామని నేనే మాటలు మొదలుపెట్టాను.
"ఒరేయ్..మనిద్దరికీ ఒకే చోట సీటు వస్తే బాగుంటుంది కదా! ఎంచక్కా మళ్ళీ ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చదవొచ్చు"
"......"
"ఏంటిరా...ఏమీ మాట్లాడవు...ఓ పక్క మనం ఇంజనీరులం అయిపోబోతున్నాం అని నేను సంతోషం పట్టలేకపోతుంటే నువ్వేంటి ఇలా" అని వాడి జబ్బ మీద ఓ పంచ్ ఇచ్చి అన్నాను.
"రవీ...నాకెందుకో ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి లేదురా!...కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇంజనీరింగ్ కాకుండా ఏమి చదివినా జీవితం నాశనం అవుతుందని అంటున్నారు...నాకేమో ధియేటర్ ఆర్ట్స్ వైపు వెళ్ళాలని ఉంది. పూనే ఫిల్మ్ ఇన్సిట్యూట్ అప్లికేషన్ తెచ్చుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళతో చెప్పలేక అలా ఉంచేసాను దాన్ని...."
"అదేంటిరా అలా అంటున్నావు....మీ కుటుంబాల్లో చూడు...ఇంజనీరింగ్ చదివి ఎంతెంత మంచి పొజిషన్ లో ఉన్నారో...మనం కూడా అలానే ఉంటాం భవిస్యత్తులో...నువ్వు అనవసర ఆలోచనలు మానెయ్య్" అంటూ ఇంట్లో కౌన్సిలింగ్ కి వెళ్ళేముందు హరి వాళ్ళ కుటుంబాన్ని ఉదహరిస్తూ అమ్మ చెప్పిన మాటల్నే వాడితో అన్నాను.
వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే నేను మాట్లాడటం వల్లనేమో హరి మారు మాట్లాడకుండా, బెర్త్ వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు.
హరికి, నాకు ఒకే యూనివర్సిటీలో వేర్వేరు బ్రాంచీల్లో సీట్లు వచ్చాయి. ఇద్దరం అడ్మిషన్ తీసుకున్నాము.
* * * * * * * * * *
ఇంజనీరింగ్ వేరే ఊరిలో చదవాల్సిరావటంతో మేమిద్దరం ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అక్కడ మాకు "ఇది చదువు..అది చదువు అని చెప్పేవాళ్ళు లేకపోవటంతో చాలా స్వేచ్చగా ఉండేవాళ్ళం. హరిగాడైతే అర్ధరాత్రిల్లు వెన్నెల, పంటపొలాలు అంటూ ఎప్పటిలాగే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు పెన్ను, పేపర్ పట్టుకుని పొలాల్లోకి పోయి ఏవేవో రాసేసుకునేవాడు. సెమిష్టర్ పరీక్షలు అయినపుడు మాత్రం పుస్తకం పట్టుకునేవాడు...అప్పటివరకూ ఆ ఊళ్ళో ఉన్న లైబ్రరీలోనుండి ఏవేవో పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాడు. నేనేమో ఈవినింగ్ కాలేజీలో షటిల్ ఆడటానికి వెళ్ళేవాణ్ణి. మేమిద్దరం ఒకే రూంలో ఉన్నామన్న సంగతే గానీ ఇదివరకటిలా ఎప్పుడూ ఒకరి భావాలు మరొకరం షేర్ చేసుకునేవాళ్ళం కాదు. వాడి రాతలను కూడా ఏనాడూ చూసిన పాపాన పోలేదు.
ఓ సారి ఏందుకో నా పుస్తకం వాడి బుక్ షెల్ఫ్ లో ఉందేమో అని గాభరాగా వెతికేసరికి ఓ బుక్ లో ఉన్న విడి కాగితాల గుంపు చెల్లా చెదురుగా కింద పడింది. ఓ పేపర్ తీసి చదివాను. అందమైన కవిత ఉంది దానిలో. ఇంకో పేపర్..ఓ చిన్న భావోద్వేగ వ్యక్తీకరణ..ఇంకో దానిలో ఓ కధ...ఇలా ఆ కాగితాలన్నీ కవితలు, కధలు.....అప్పుడేప్పుడో ఇంటర్మీడియట్ లో వాడు రాసిన చిన్న చిన్న కవితలు, కధలు చదివానంతే. ఆ తర్వాత ఎప్పుడూ నేను "నువ్వు రాసినవి ఏవి" అని అడిగింది లేదు...వాడు నాకు చూపించింది లేదు...నేనెప్పుడూ రూంలో వాడి దగ్గర ఫలాన పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నాను...ఈ సెమిస్టర్లో టాప్ చెయ్యాలి...ఫలానా సార్ ఇంటర్నల్స్ ఇలా వేసారు...లాంటి మాటలు మాట్లాడటం వల్లనేమో హరికి తన సున్నిత భావాలను నాతో పంచుకుందామన్న ఆలోచన వచ్చి ఉండదు. ఆ రోజు షటిల్ కి వెళ్ళలేదు. వాడు రాసిన కాగితాలన్నీ చదివాను. ఓ నిమిషం నాకు సిగ్గేసింది....ఇంత మంచి రాతలను నా స్నేహితుడే రాస్తుంటే ఇన్నాళ్ళూ చదవనందుకు...బయటకెళ్ళి రూంకి వచ్చిన వాడితో "ఒరేయ్...భలే రాసావురా!..ఎంత బావున్నాయో తెలుసా నీ కధలు...ఒక ప్రొఫెషెనల్ రైటర్ రాసినట్టనిపించిదిరా.."అని నేను అన్నప్పుడు వాడి మొహంలో ఓ గొప్ప సంతృప్తి కనిపించింది. వాడి రాతలు ఇంకొకరు గుర్తించటం వల్లనేమో ఆ రోజు చాలా ఆనందంగా కనపడ్డాడు. వాడిలోని అంత సంతృప్తి మా ఇద్దరికీ ఎంసెట్ లో మంచి ర్యాంక్లు వచ్చినప్పుడు కూడా చూడలేదు.
* * * * * * * * * *
మా ఇంజనీరింగ్ నాలుగేళ్ళు పూర్తికావొచ్చింది. ఓ సాయింత్రం స్నేహితులందరం చదువయ్యక ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నాం.
"నేను యూ.ఎస్. వెళ్ళి ఎమ్మెస్ చెయ్యాలిరా...మా నాన్న ఎంత డబ్బైనా పర్లేదన్నాడు.. " జీ.ఆర్.ఈ లో క్లాసులో అందరికన్నా తక్కువ స్కోరు వచ్చిన జగన్ అన్నాడు.
"అదేంటిరా....నీకు బిజినెస్ అంటే ఇష్టం అన్నావుకదా..." అని అంకిత్ అడిగాడు.
"అరే ఫూల్...ఇష్టం కాదురా ఇక్కడ కావల్సింది..ఫ్యూచర్లో ఏది హాట్ గా ఉంటుంది అన్నది పాయింట్" అని స్పందించాడు జగన్.
"ఏమోరా భయ్..మా అయ్య నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాపోతే తలెత్తుకోలేనన్నాడు ...మా ఇలాకాలో సానామంది సాఫ్ట్ వేర్ వాళ్ళే..." తప్పుల్లేకుండా ఓ చిన్న సీ ప్రోగ్రాం కూడా రాయలేని యాదగిరి అన్నాడు.
ఒకడు గవర్నమెంట్ జాబ్ అని..ఇంకోడు సాఫ్ట్ వేర్ అని..మరొకడు స్టేట్స్ లో ఎమ్మెస్ అని ఇలా అందరూ ఎవరనుకున్నది వాళ్ళు చెబుతున్నారు. హరి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో హరికి ఫోన్ వచ్చింది. "నాన్న కాలింగ్..." అని చూసి "మీ నాన్నగారు రా.." అంటు మొబైల్ ని వాడి చేతిలో పెట్టాను. ఇన్ఫోసిన్ లో ఫ్రెషర్స్ ఉద్యోగాలు ఉన్నాయని హరి కజిన్ వాళ్ళ నాన్నతో చెప్పటంతో, ఆయన విషయం వాడితో చెప్పడానికి చేసిన కాల్ అది. కాల్ పూర్తయిన వెంటనే సెల్ ఫోన్ ను పక్కకి గిరాటేసాడు. వాడు చిరాగ్గా ఉన్నాడని తెలిసి ఏమీ అడగలేదు. తర్వాత వాడే కొంచెం సేపు తర్వాత "అసలు ఈ పెద్ద వాళ్ళకి మన ఇష్టా ఇష్టాలతో ఎందుకురా పని ఉండదు? ఏం చదవాలో..ఏం చెయ్యాలో కూడా వీళ్ళే చెబుతారు..." అంటూ గొంతుపూడిక పోయి మాట్లాడుతుంటుంటే వాడి కంట్లో ఎప్పుడూ చూడని ఓ పల్చటి తడి పొరని గమనించాను.
ఇంజనీరింగ్ టీ.సి తీసుకోడానికి కాలేజీకి వెళ్తూ హరి గాడికోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బయట వాలుకుర్చీలో పేపర్ పట్టుకుని హరి వాళ్ళ నాన్న ఉన్నారు. నన్ను చూసి "రావోయ్...రవి..కంగ్రాచ్యులేషన్...ఇన్ఫోసిస్ కి సెలక్ట్ అయ్యావంట కదా...కాస్త మా వెదవకి బుద్ది చెప్పు...సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చెయ్యడానికి ఇష్టం లేదంట...మా అన్నయ్య కొడుకు క్రిందటేడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి ఈ ఏడు అమెరికా వెళ్ళాడు. వేలకి వేలు జీతాలు తీసుకుని ఏ.సీ రూంలో కూచొని పనిచేయడానికి పోయేకాలం వీడికి... ఏ గుమస్తాగిరో చేస్తే గానీ ఈ ఎదవకి బుద్ది రాదు.." అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు. "అది కాదంకుల్...హరికి ధియేటర్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది..అటువైపు...." అని నెమ్మదిగా ఏదో చెబుతుండగా ఆయన కోసం ఎవరో గేటు తీసుకుని లోపలి వస్తూండటంతో వాళ్ళని రిసీవ్ చేసుకోడానికి కుర్చీ లోంచి లేచి వెళ్ళిపోయారు.
* * * * * * * * * *
నేను వెలిగించిన సిగరెట్ చివరికి వచ్చేసి, రెండు వేళ్ళ మద్య చురుక్కుమని కాలటంతో, ఆలోచనల నుండి బయటకు వచ్చాను. అప్పటికే ఎనిమిదయ్యింది. హరి వచ్చేసే టైం అయ్యింది. డాబా మీద నుండి క్రిందకు దిగి రూంలోకి వెళ్ళాను. ఇంతలో హరి రానే వచ్చాడు. ఎప్పటిలాగే చిరాగ్గా మెడలోంచి అయిడీ కార్డ్ ఓ మూలకు గిరాటేసాడు. ఇద్దరం ఏమీ మాట్లాడకోకుండానే భోజనాలు కానిచ్చాం.
"హరి..నేను డాబా పైకి వెళ్తున్నాను..నువ్వు వస్తావా?.. " అంటూ అడిగాను.
"మూడ్ లేదురా.."
"రేయ్...మర్చిపోయావా...ఈ రోజు మూన్ రెగ్యులర్ గా వచ్చే సైజుకంటే పెద్దగా వస్తుందంట....నేను పైకి వెళ్తున్నాను..నీ ఇష్టం...." అన్నా వాడి వీక్‌నెస్ మీద దెబ్బకొడుతూ...
మూన్ పెద్ద సైజు అనేసరికి మారు మాట్లాడకుండా నా వెనకాలే వచ్చేసాడు డాబా పైకి....
కాసేపు వెన్నెలను ఆస్వాదించాం ఇద్దరం....
డాబా మీద ఓ కార్నర్లో ఉన్న చిన్న చిన్న కుక్కపిల్లలు క్యూట్ గా మూలుగుతున్నాయి. వాటిలో ఓ దాన్ని తీసుకుని ముద్దులాడుతుండగా....
"రవీ..." అని హరి పిలిచాడు...హరి వైపు చూసాను..
"నీతో ఓ విషయం మాట్లాడాలిరా...." అన్నాడు
చేతిలో ఉన్న కుక్క పిల్లను క్రిందకు దించబోతే అది కుయ్..కుయ్ అని దిగనని మారాం చేయటంతో దాన్ని భుజాలకెత్తుకుని హరి కూచున్న చోటికి వెళ్ళాను.
"చెప్పరా..."
"నాకు రేపో ఎల్లుండో పింక్ స్లిప్ ఇస్తారు...ఇక నేను మహా అయితే ఓ వారం రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్తాను....నువ్వు నాకు ఓ హెల్ప్ చెయ్యాలి....ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పకు..ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళతో....."
నాకు హరి పరిస్థితి ముందే శ్వేత మాటల్లో అర్దమవ్వటంతో ఎందుకు..ఏమిటీ..లాంటి విసిగించే ప్రశ్నలు వెయ్యలేదు.
* * * * * * * * * *
ఓ రోజు మధ్యాహ్నం శ్వేత నా క్యుబికల్ కు వచ్చింది. స్వేత మొహంలో ఓ రకమైన ఆందోళన కనిపించింది..
"రవీ..చూసావా...నేనన్నట్టుగానే అయ్యింది...హరిని ఫైర్ చేసారు...ఆ దొంగ మొహం మేనేజర్ గాడు కనీసం తనని బెంచ్ మీద కూడా పెట్టలే....ఇలా చేస్తాడనుకోలేదు.."
"ఇప్పుడు హరి ఎక్కడ ఉన్నాడు.." హరిని కలవాలన్న ఉద్దేశంతో సిస్టం ని షట్ డవున్ చేస్తూ అడిగాను.
"విషయం తెలియగానే తను ఆఫీస్ నుండి బయటకు వెళ్ళాడు...I think..he might have gone to room...." అంది.
ఎందుకో హరి విషయం తెలియగానే ఒక్క నిమిషం కూడా పని చెయ్యబుద్ది కాలేదు..ఒంట్లో బాలేదని మేనేజర్ కి రిపోర్ట్ చేసి నేను రూంకి బయలుదేరాను.
రూంకి వెళ్ళగానే తలుపు కొట్టాను. ఎందుకో మనసు కీడు శంకించింది...ఎంత సేపటికీ తలుపు తియ్యడే...ఓ పక్క గుండెలు లబ్ డబ్ మని కొట్టుకుంటున్నాయి. అసలే వాడు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు. ఏదైనా చేసుకుంటున్నాడా...అని ఒకటే పిచ్చి ఆలోచనలు....
కాసేపయ్యాక తలుపు తీసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నేను డోర్ నాక్ చేసే టైంకి తను బాత్రూంలో స్నానం చేస్తున్నాడని చెప్పకనే తెలిసింది. హరిని చూడగానే ఒక్కసారి మనసు కుదుటపడింది.
అప్పటి నుండి హరితో ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో అస్సలు అర్ధమయ్యేది కాదు. తను మాత్రం రోజు రోజుకు జీవితం మీద నిరాసక్తంగా తయారవుతున్నాడన్న విషయం మాత్రం నాకు తెలుస్తూనే ఉంది. కొద్దిరోజులు మా మద్య నిశ్శబ్దమే మిగిలింది.
* * * * * * * * * *
ఓ ఆదివారం నేనూ, హరీ కలిసి మార్కెట్ కి వెళ్ళి తిరిగొస్తున్నాం. నేను ఓ పాన్ షాప్ దగ్గర ఆగి ఓ తెలుగు మాగజీన్ కొన్నాను. ఇద్దరం ఇంటికి వెళ్ళాం...నేను స్నానానికని బాత్రూంకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను...మధ్యలో ఓ సారి హరి ఏం చేస్తున్నాడో చూశాను....వాడు నేను తెచ్చిన పుస్తకం టీ పాయ్ మీద పడేసి పేపర్ చదువుతున్నాడు...మరికాసేపు వరకు నేననుకున్నది జరగదని నిర్ధారించుకుని బాత్రూంలోకి వెళ్ళాను...ఆ రోజు ఆదివారం కావటంతో నిదానంగా తల స్నానం చేసుకుంటున్నాను...హరి ఫోన్ మ్రోగిన చప్పుడు అయ్యింది....ఏదో సంభాషణ వినిపించింది...స్నానం ముగించుకుని బయటకు వస్తుంటే..
"ఏంటిరా....ఎవరెవరో ఫోన్ చేసి...కంగ్రాట్స్ అంటారు...కధ అంటారు....బాగా రాసారంటారు...బహుశా ఏ రైటర్ కో చెయ్యాల్సిన కాల్ నాకు చేస్తున్నట్టున్నారు...." విసుగ్గా మొహం పెట్టి అన్నాడు....
ఇంతలో మళ్ళీ హరి ఫోన్ మోగింది...ఈ సారి కూడా అవతల మళ్ళీ కంగ్రాంట్స్ చెప్పినట్టున్నారు...హరి గాడికి కోపం నషాళానికి అంటింది...వాడెక్కడ అవతల మనిషిని తిడతాడో అని వెంటనే ఫోన్ అందుకున్నాను....స్పీకర్ ఆన్ చేసాను...
"ఏమండీ...హరి గారేనా మాట్లాడేది..." అవతల ఓ మహిళ గొంతు...
"అవునండీ..ఇది హరి గారి ఫోన్ నెంబరే...ఇంతకు మీరెందుకు కాల్ చేసారు..." అని ఆమెని అడిగాను..హరి నా ప్రక్కనే నిలబడి ఫోన్ సంభాషన వింటున్నాడు....
"ఎంత చక్కని కధ అండీ అది...ఇప్పటికి ఓ రెండు సార్లు చదివాను కధని...ప్రధమ బహుమతికి అన్ని విధాల అర్హమైన కధ అది.." అంటూ అవతలి ఆమె మాట్లాడింది. హరి గాడు మరింత అయోమయంగా చూస్తున్నాడు....
"ఇంతకూ మీరు ఆ కధని ఏ మాగజీన్లో చూశారు...హరి గారు బయటకెళ్ళారు...మీ అభినందనలు తనకు తెలుపుతాను" అని ఆమెతో అన్నాను....
ఆమే మేగజీన్ పేరు చెప్పి ఇంకోసారి అభినందనలు చెప్పి కాల్ ముగించింది.....ఆ కాలర్ చెప్పిన మేగజీన్ మేం పొద్దున కొన్న మేగజీన్ ఒకటే కావటంతో హరిగాడు గబ గబా ఆ పత్రిక ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు...నేను వాడి పక్కనే సోఫాలో కూచొని ఏమీ తెలీనట్టు నటిస్తున్నాను...కవర్ పేజీ మీద 'ఉగాది కధల పోటీ' ఫలితాలు అని పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి....అది చూసి మరింత కంగారుగా హరి పత్రికను ఓపెన్ చేసాడు...చూడాల్సిన పేజీనే ఓపెన్ చేసినట్టున్నాడు...అక్కడ ప్రధమ బహుమతి పొందిన కధ రచయిత హరి అని ఉంది...అపనమ్మకంగా ఆ కధని కూడా చదవటం మొదలెట్టాడు...
"అదేంటిరా...ఇది నా కధ కదా...అప్పుడేప్పుడో రాసుకున్నాను...మరి వీళ్ళకెలా తెలిసింది....పైగా నా పేరుతోనే వేసారు..." అంటూ కాస్త ఆనందం, అయోమయం కలగలిసిన మొహంతో అడిగాడు....
ఇంకెందుకని అసలు విషయం చెప్పేసాను...."నేనే పంపించానురా...అప్పుడెప్పుడో ఈ మేగజీన్ ని ఆఫీస్లో తిరగేస్తుంటే కధలపోటీ అని ఉంది...సరే నీ దగ్గర కొన్ని కధలు ఉన్నాయి కదా...ఒకటి పంపిస్తే ఏం పోయిందని పంపించాను....." అని చెబుతుండగా నా మాటలు పూర్తి కాకుండానే మళ్ళీ హరి ఫోన్ మ్రోగింది....ఈ సారి హరి కాల్ అటెండ్ చేసాడు... మొహం సూర్యుడిలా వెలిగిపోతూ కనిపిస్తుంది ....మా ఇద్దరికీ ఉమ్మడి ఫ్రెండ్స్ అందరినీ ముందే నేను కాల్ చేసి రమ్మనటంతో వాళ్ళు గోలా చేసుకుంటూ వచ్చి హరిగాడిని ఎత్తేసారు....అందరం కలిసి ఆ పూటకి రెస్టారెంట్ వెళ్ళాము.
ఆ రోజు హరి చాలా ఆనందంగా ఉన్నాడు...వాడిని కొంచెం మమూలు మనిషిని చేసినందుకు నాకు కూడా ఆనందం వేసింది...ఒక చిన్న సక్సెస్ నిరాశలో ఉన్న మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాన్నేను...
రాత్రి హరి కుర్చీలో కూచొని మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నట్టు కనపడ్డాడు...
"ఏం ఆలోచిస్తున్నావురా..." అని వాడితో అన్నాను...కొద్దిసేపు ఎటువంటి స్పందన లేదు....కాసేపయ్యాక
వెంటనే కుర్చీలోంచి లేచి ఓ చిన్న పిల్లాడిలా గట్టిగా హత్తుకున్నాడు నన్ను...
* * * * * * * * * *
కధకు మొదటి బహుమతి రావటం అనేది హరిని మరింత డిప్రెషన్లోకి నెట్టేయకుండా ఆపగలిగింది. వాడు కూడా ఆ తర్వాత నుండి ఉద్యోగం పోయిన విషయం గురించి పెద్దగా భాదపడినట్టు కూడా లేడు. ప్రతీరోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడల్లా రూంలో రీడింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏవేవో రాస్తున్నట్టు కనపడేవాడు.
ఓ వీకెండ్ సాయింత్రం ఇద్దరం డాబా మీద మాట్లాడుకుంటుంటే మాటల మద్యలో
"ఒరేయ్..రవీ..'బిగ్ సినిమాస్' వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు రా...ఇంకో పదిహేను రోజుల్లో దానికి మన ఫిల్మ్ పంపించేయాలి..వచ్చిన ఎంట్రీల్లోనుండి బెస్ట్ మూడింటికి వాళ్ళే ప్రొడ్యూస్ చేసి విన్నర్స్ తో పిక్చర్ తీస్తారంట..." అని చెప్పాడు.
ఆ పదిహేను రోజులూ ఆర్టిస్తులతో, పెద్ద పెద్ద లైటింగ్స్ తో మా రూం ఒక మినీ స్టూడియో అయిపోయింది...మొత్తానికి తను షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసేసి కాంటేస్ట్ కి పంపిచేసాడు...ఆ టైంలో నా ప్రాజెక్ట్ డెలివరీ ఉండటం వల్ల బిజీ అయిపోయి నేను ఆ ఫిల్మ్ ని చూడలేదు...
ఓ రోజు ఆఫీస్లో పెద్దగా పనిలేకపోతే లాప్ టాప్ లో సినిమాలు ఎమైనా ఉన్నాయేమో అని చూస్తుంటే హరి షార్ట్ ఫిల్మ్ కనపడింది. ఇది వరకు నేను దాన్ని చూడకపోవటంతో ప్లే చేశాను. నాతో పాటూ నా టీం వాళ్ళందరూ దాన్ని చూశారు. చూడటం పూర్తయిన వెంటనే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు...అందరిదీ ఒకటే ప్రశ్న.."ఎవరు ఈ షార్ట్ ఫిల్మ్ తీసారు" అని...నేను హరి పేరు చెప్పగానే...."ఏంటి?..శ్వేత ప్రాజెక్టులో ఉండి ఫైర్ చేయబడిన ఆ డల్ హరినా! ఆయనలో ఇంత టాలెంట్ ఉందా?" అని అందరి నోటి నుండి ఒకటే ప్రశ్న మళ్ళీ.....హరిని మరోలా అర్ధం చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు వాడిని పొగుడుతుంటే నాకు చాలా ఆనందం కలిగింది.
* * * * * * * * * *
బిగ్ సినిమాస్ ప్రొడక్షన్లో తీస్తున్న సినిమా డైరెక్షన్ పనిలో హరి చాలా బిజీగా ఉన్నాడు....అప్పుడప్పుడు అర్ధరాత్రుల్లు సినిమా విశేషాలు నాతో చెప్పేవాడు...సినిమా ఇంకో నెలరోజుల్లో పూర్తయిపోతుందని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొద్ది రోజులుంటుందని, ఈ సినిమాకి నిర్మాత అనుకున్న బడ్జెట్ కంటే తక్కువకే అయిందని, ఐనప్పటికీ క్వాలీటిలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని, త్వరలోనే రిలీజ్ అని ఓ కాల్ లో చెప్పాడు...ఇవన్నీ విన్నప్పుడు వాడి కల నెరవేరుతున్నందుకు, మనసుకు నచ్చినపని చేస్తున్నందుకు నాకెంత ఆనందంగా ఉండేదో మాటల్లో చెప్పలేను.
ఆఫీస్లో ఉండంగా కొరియర్ ఒకటి వచ్చింది...కవర్ ఓపెన్ చేసి చూస్తే ముంబాయికి ఫ్లయిట్ టికెట్స్...హరి పంపించాడు...తను సినిమాకి సంభందించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని, ఈ నెల మూడోవారంలో తన సినిమా ప్రివ్యూ షో ఉందని, దానికి నేను తప్పకుండా రావాలనీ మెసేజ్ పెట్టాడు...
వారం రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి హరి దగ్గరికి ముంబాయి బయలుదేరాను...ప్రివ్యూ షో ముందు రోజు ఇద్దరం జుహు బీచ్ కి వెళ్ళాం....
"ఒరేయ్..చాలా టెన్షన్ గా ఉందిరా...సినిమా ఏమవుతుందో అని...ఇది సక్సెస్ అయితేనే నేను మా ఇంట్లో వాళ్ళకు మొహం చూపించగలనురా..."
"తప్పకుండా సక్సెస్ అవుతుందిరా....నువ్వు ఎంత సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టుంటావో నేను ఊహించగలను...."
* * * * * * * * * *
ప్రివ్యూ షో పూర్తయింది...సినిమా చూసి నేనైతే నమ్మలేకపోయాను..హరినేనా ఇది తీసింది అని...సరిగ్గా తను ఏ విషయంలో అయితే సంఘర్షణకు గురయ్యాడో అదే పాయింట్ తో సినిమా తీసాడు. సినిమా అయిపోగానే హరికి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు...
"మొదటి నుండీ మన సమాజంలో పిల్లలు పెరుగుతున్న విధం చూస్తే చాలా భాదేస్తుంది....వాళ్ళకి వాళ్ళుగా తమదైన ప్రపంచం ఊహించుకోవల్సిన ఒక దశలో పెద్ద వాళ్ళే స్వయంగా 'నీ ప్రపంచం ఇలానే ఉండాలి ' అని వాళ్ళు ఊహిస్తున్న ప్రపంచాన్ని బలవంతంగా పిల్లల మెదళ్ళలోకి ఎక్కించేస్తున్నారు. ఫలితంగా తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రపంచంలో బతికేస్తూ, అదే ప్రపంచం అనుకుని వాళ్ళ అసంతృప్తికి కారణం ఏంటో తెలుసుకోలేక, దానిలోనే ఉండి రోజూ సతమతమవుతున్నారు. ఏ కొద్దిమందో వాళ్ళ ప్రపంచం ఏంటన్నది తర్వాత తెలుసుకున్నా, దానిలోకి ధైర్యంగా అడుగుపెట్టలేకపోతున్నారు...ఒక్కసారి వాళ్ళు వారి పూర్తి మనసు పెట్టి దేన్ని చేయడానికి ఇష్టపడుతున్నారో గమనించండి... నా తొలి సినిమాలో ఇదే విషయాన్ని ప్రస్తావిద్దామనుకున్నాను..ఈ సినిమా చూసి కొద్ది మంది తల్లిదండ్రులైనా పిల్లల ఇష్టా ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలిగానీ కుటుంబాల్లో స్థిరపడిన వ్యక్తులను చూపించో లేక చుట్టూ సమాజంలోని మిగిలిన తల్లిదండ్రులు వారి పిల్లలను ఏం చేస్తున్నారనో చూడకూడదని తెలుసుకుంటారని అనుకుంటున్నాను"
హరి మాట్లాడటం పూర్తయినవెంటనే దియేటర్ అంతా చప్పట్లతో మారుమ్రోగింది...హరి మాటలు విని అప్రయత్నంగానే నా కళ్ళు తడిసాయి...వచ్చిన అతిధులు తనకు మంచి భవిష్యత్తు ఉందని దీవించారు...
ఇద్దరం కారులో హరి ఇంటికి వెళ్ళాము....
"ఏంటిరా ఏమీ మాట్లాడటం లేదు..." డోర్ ఓపెన్ చేస్తూ అడిగాడు హరి.
కాసేపయ్యాక...
ఈ సారి నేను హరిని చిన్న పిల్లాడిలా గట్టిగా హత్తుకున్నాను...
#----------- ** ** ** --------------#