2, జులై 2010, శుక్రవారం

వారాంతంలో ఒక అనుభవం...

సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే ఇంటి నుండి బయటకు కదలడానికి అస్సలు ఇష్టపడను నేను. ఒకవేళ ఏ భూటాన్ బంపర్ లాటరీవాడో ఫోన్ చేసి 'సార్ మీకు ఓ పది లక్షలు తగిలాయ్..ఈ రోజే ఆఫీస్ కి వచ్చి మనీ తీసుకెళ్ళండి..లేదంటే మీ ప్రైజ్ మనీ పోతుంది' అని అన్నాడే అనుకుందాం..ఉహూ..అప్పటికీ కదిలే ప్రసక్తే ఉండదు...'ఇదిగో బాబు..మండే తీసుకోవటం అవుతుందా' అని వాడిని కూల్ గా అడుగుతాను తప్పించి పీ.టీ ఉష కి కజిన్ లా లగెత్తను గాక లగెత్తను. వారంలో అయిదు రోజులు చుట్టూరా ఉరుకులు పరుగుల మనుషులను, గంటల కొద్దీ ట్రాఫిక్ జాంలు, ఆఫీస్ పని చేయటం లాంటివి ఎలాగూ తప్పించుకోలేం కాబట్టి వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మయ్య ఈ ప్రపంచంతో నాకు సంభందం లేదు' అని అనుకోవటంలో ఓ కిక్ ఉంటుంది నాకు. ఒక్క మా గ్యాంగ్ వాళ్ళు ఔటింగ్ కి పిలిచినప్పుడు మాత్రం 'వీకెండ్ ఇల్లు కదలకపోవటం' అనే విషయంలో మినహాయింపువేసుకుంటాను.

ఆ రోజు ఎప్పటిలానే వీకెండ్ ఎంజాయ్ చేయటంలో భాగంగా మధ్యాహ్నం నిదానంగా భోజనం చేస్తూ, అమ్మతో పాటు నేను కూడా డైలీ సీరియల్ చూస్తున్నాను. మద్య మద్యలో ఎవరు ఎవరికి రెండో భార్యో, ఎవరు భర్త లాంటి భర్తో, చనిపోయిన మూడో భర్త అమ్మ మొదటి భార్య కొడుకును ఎందుకు ఎండ్రిన్ తాగమని ప్రోత్సహిస్తుందో, ముసలివేషంలో ఉన్న ఇరవై ఏళ్ళ అమ్మాయి సొంత జడతో ఉందా లేక సవరం వేసుకుందా లాంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటుంటాను. నేనలా కొశ్చన్స్ మీద కొశ్చన్స్ వేస్తుంటే అమ్మ ఎంతో ఉత్సాహంగా చెబుతుంది. నేను చూసేది ఒక్క శనివారం మాత్రమే..అది కూడా అప్పుడప్పుడు... అమ్మ రెగ్యులర్ గా ఫాలో అయ్యే సీరియల్స్ కావటంతో ఆ టైంలో నేను వేరే చానల్ పెట్టడానికి ఇష్టపడను. బలవంతంగా నాకు నేనుగా సీరియల్ అమ్మతో కలిసి చూసేసుకుని ఆ వారాంతం కామెడీ సినిమా చూడలేనిలోటుని తీర్చుకుంటానన్నమాట.

ఓ ఏభై నిమిషాల్లో భోజనం ముగించేసి, కంచం తీసుకుని సింక్ లో తోముతుంటే, 'రారా..చెంతకు రారా..' అంటూ నిద్రాదేవి చంద్రముఖి వేషంలో బ్యాక్ గ్రౌండ్లో పాడుతుంటే భుక్తాయాసంతో ఉన్నవారెవరికైనా నిద్ర రాక చస్తుందా! అందులోనూ మిట్ట మధ్యాహ్న సమయం...ఎలాగోలా కంచం కడిగేసి, డిష్ కంటెయినర్ లో పడేసి, బెడ్ రూంలోకి దూరిపోయి, ఫ్యాన్ మేగ్జిమమ్ స్పీడుతో పెట్టేసుకుని ఇలా పడుకున్నానో లేదో చెవిలో ఆ తర్వాత సీరియల్ టైటిల్ సాంగ్ వినిపించింది. దుప్పటి కప్పుకుందామంటే ఉక్కబోస్తుందని భయం. చెవిని చేతితో మూసుకుని పడుకున్నాను. "ఆడదే ఆధారం..ఆమే ఓంకారం..ఆడదే ఆధారం..మన సృష్టికి శ్రీకారం.." ఇంకా ఆ పాట వినిపిస్తునే ఉంది...అప్పుడే మొదటి సారిగా తెలిసింది ఆడవాళ్ళకు నాకు తెలియని చాలా డెఫినిషన్స్ ఉన్నాయని..ఆ పాట దెబ్బకు చంద్రముఖిలా ఉన్న నిద్రాదేవి పారిపోయింది..ఇక లాభం లేదనుకొని ఆమె ప్రియ శిష్యుడు కుంభ కర్ణుణకు ప్రార్ధించాను. 'మన ఫ్యామీలీ మెంబర్ ఎవడో నన్ను పిలుస్తున్నాడు' అని ఆయనకు సిగ్నల్స్ వెళ్ళాయి.. కొద్దిసేపటికే నాకు తెలీకుండానే సమ్మగా నిద్ర పట్టేసింది. ఓ రెండు గంటలవరకు నా నెట్ వర్క్ కి, బయట నెట్ వర్క్ కి సంభందాలు పూర్తిగా తెగిపోయాయి.

రెండు గంటల తర్వాత ఇలా లేచానో లేదో ఎదురింటిలోని పిల్లలు, మరికొంత మంది చిన్నపిల్లలు గోల చేయటం వినిపించింది. ఓ కంటిని పాక్షికంగా తెరిచి బాల్కనీలోకి వెళ్ళాను..జనరల్ గా నేను నిద్ర లేచిన వెంటనే రెండు కళ్ళనూ తెరవను..ఓ అరగంట వరకు ఏదో ఒక కన్ను మాత్రమే తెరచి ఉంచుతాను..అది కూడా పాక్షికంగా...ప్రొఫెషనల్ గా చెప్పాలంటే కళ్ళకు నిద్ర లేచిన వెంటనే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూపించి స్ట్రెయిన్ కి గురి చేయటం నాకు అస్సలు నచ్చదు..ఈ మాత్రం దానికే గిట్టని వాళ్ళు నన్ను 'లేజీ ఫెలో' అని ముద్దుగా అంటుంటారులెండి...ఆ పిల్లల్లో ఓ అబ్బాయి 'అన్నా..ఆ క్రిందన చూడు కుక్కని..' అని అన్నాడు. పై నుండే చూశాను. ఊర కుక్క అది...మరీ అంత పెద్దది ఏమీ కాదు. పుట్టి ఓ మూడు నెలలు అయ్యుంటుంది అప్పటికి. ఓ వైపు పడుకుని ఉండి కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. పొట్ట మీద ఓ గాయం ఉండి, ఆ ప్రాంతంలో రక్తం గడ్డ కట్టేసి ఉంది. అప్పటికీ నాకింకా నిద్ర మత్తు ఒదలలేదు. సరే ఓ సారి క్రిందకు పోయి చచ్చిందో, బ్రతికిందో చూద్దాం అనుకుని సెల్లార్ లోకి వెళ్ళి నేల మీద పడిఉన్న దాన్ని చూసాను. ఒక్కసారిగా నిద్రమత్తు ఒదిలేసింది. దానికి కడుపులో చాలా లోతైన గాయం అయ్యింది. బహూశా పై ఫ్లోర్ నుండి పడుతున్నప్పుడు మద్యలో ఏ ఇనుప ఊస పుల్లో గుచ్చినట్టు ఉంది. రక్తం ఆ భాగంలో గడ్డకట్టి ఉంది. చాలా కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. పొద్దున్నుంచి అది అలానే ఉందని ఓ కుర్రాడు చెప్పాడు. క్రింద పడిన వెంటనే అది చచ్చిపోయున్నా బాగుండేది. కానీ ప్రాణంతో ఉండి అలా విలవిలలాడుతుంటే మనసుకు చాలా కష్టంగా అనిపించింది.

ఓ నిమిషం పాటు బుర్ర బ్లాంక్ అయ్యింది. ఇది వరకు ఎప్పుడో, ఏదో ఇంటర్వ్యూలో అమల అక్కినేని, వాళ్ళ సంస్థ బ్లాక్రాస్ తరపున జంతువులకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారని చెప్పినట్టు గుర్తు వచ్చింది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా గబ గబా పైకి వెళ్ళి నెట్ ఆన్ చేసాను. అప్పటికి టైం నాలుగు నలభై అయిదు నిమిషాలు కావొస్తుంది. నెట్ ఆన్ అయ్యింది. గూగిల్ ఓపెన్ చేసి 'బ్లాక్రాస్, హైదరాబాద్' అని టైప్ చేసాను. ఓ ఫోన్ నెం. కనిపించింది. ఇదంతా చేస్తున్నాను గానీ నాకు మనసులో ఒకటే సందేహాలు..వాళ్ళు నిజంగా వస్తారా లేదా? ఫోన్ ఎత్తుతారా అసలు? అలాంటివన్నీ డబ్బున్నోళ్ళు పబ్లిసిటీ కోసం, కాలక్షేపం కోసం చేసుకుంటారు కదా...ఇలా ఎన్నెన్నో అనుమానాల మద్య బ్లూ క్రాస్ కి ఫోన్ చేసాను. రింగవుతూనే ఉంది. ఎవరు ఎత్తటం లేదు. ఆ నెం.కే మళ్ళీ ట్రై చేశాను. టైం అయిదు అయింది. మళ్ళీ మ్రోగుతూనే ఉంది.. ఫోన్ పెట్టేదామనుకునేంతలో ఎవరో లిఫ్ట్ చేసారు. వివరంగా మొత్తం చెప్పాను. 'సారీ అండీ అయిదు వరకు మాత్రమే మా సేవలు..మీరు రేపు ఉదయం దాన్ని తీసుకురండి..అయిదు తర్వాత ఒక్క ఎమర్జన్సీ మాత్రమే చూస్తాం' అని అన్నారు.

కుక్క పరిస్థితి పూర్తిగా ఇంకోసారి చెప్పాను. ఇప్పుడు గానీ దానికి ట్రీట్ మెంట్ ఇవ్వకపోతే అది చచ్చిపోతుంది అని చెప్పాను. వెంటనే ఆయన మా ఏరియా అడిగి, ఇక్కడ ఉన్న వాలంటీర్ల నెంబర్ ఇచ్చారు. వెంటనే ఫోన్ కట్ చేసి ఆయన ఇచ్చిన వాలంటీర్ నంబర్ కు డయల్ చేసాను. ఆయన వెంటనే అన్ని వివరాలు అడిగారు. ఓ అరగంటలో వస్తామని చెప్పారు. నాకైతే అప్పటికీ నమ్మకం లేదు...అసలే వీకెండ్..ఎంత వాలంటీర్లు జంతు ప్రేమికులైనా వీకెండ్ ఓ సినిమాకో,పార్టీకో పోతారు కదా...'సరేలే మన పని మనం చేసాం' అని అనుకుని టీవీకి అతుక్కుపోయాను.

కొద్దిసేపు తర్వాత ఎందుకో మనసు ఆగక క్రిందకు వెళ్ళి కుక్క ఎలాఉందో చూశాను. పాపం దాని తల్లి అక్కడక్కడే కొద్దిసేపు తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ వాలంటీర్ కి ఫోన్ చేశాను..వాళ్ళ టీం అంతా బయలు దేరారని, ఇంకొద్దిసేపట్లో నేను చెప్పిన ప్లేస్ లో ఉంటారని చెప్పాడు...ఇంతలో మా గ్యాంగ్ లోని ఒకడు ఫోన్ చేశాడు..సాయింత్రం అందరం నెక్లస్ రోడ్ దగ్గర కలుస్తున్నామని..నేను రెడీ అవుతుండంగా మళ్ళీ ఫోన్ మ్రోగింది..ఈ సారి ఆ బ్లూ క్రాస్ వాలంటీర్..వాళ్ళు మా ఏరియాకి వచ్చేసారని చెప్పాడు. గభ గభా క్రిందకు వెళ్ళి నేను చెప్పిన లాండ్ మార్క్ దగ్గరకు వెళ్ళాను.

ఇరవై, ఇరవై అయిదేళ్ళ కంటే ఎక్కువ వయసు ఉండని ఓ ముగ్గురు కుర్రాళ్ళు, ఓ అమ్మాయి కనిపించింది..అందులో మెయిన్ వాలంటీర్ మేము ఇంటికి వెళ్ళే దారిలోనే కుక్కకి సంభందించి చాలా ప్రశ్నలు వేశాడు..నాకు తెలిసిన వివరాలు చెప్పాను..వాళ్ళందరూ వారి వారి డిగ్రీల్లో ఫైనలియర్ చదువుతున్నవారు...మాట్లాతుండంగానే ఇంటికి వచ్చేసాము..సెల్లార్ లో కుక్క ఉన్న ప్లేస్ దగ్గరకు తీసుకెళ్ళాను వాళ్ళని..చాలా కంగారు పడ్డారు దాన్ని చూడగానే...అందులో అమ్మాయికైతే కుక్కని చూసి చూడగానే కళ్ళల్లో సన్నటి కనీ కనిపించని కన్నీటి పొర..ఒక వాలంటీర్ కుక్కని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు..పాపం నొప్పికి అది కుయ్..కుయ్ అంది. ఇంకో వాలంటీర్ దాని పరిస్థితి క్రిటికల్ గా ఉందని, ఆపరేషన్ అవసరమని తేల్చాడు...వెంటనే నలుగురు కుక్కని తీసుకుని బయలుదేరారు..నేను వాళ్ళని అనుసరించాను...కుక్కని ఎక్కడికి తీసుకెళ్ళాలో మాట్లాడుకుంటున్నారు..ఓ వాలంటీర్ చెప్పిన డాక్టర్ నెం.కి ఇంకో వాలంటీర్ కాల్ చేసి ఆవిడ ఆపరేషన్ ధియేటర్ అవైలబుల్ గా ఉందా లేదో, ఆవిడ ఇప్పుడు ఇంట్లో ఉందో లేదో కనుక్కున్నాడు. ఆ డాక్టర్ లేకపోయేసరికి వేరే ఆమెకు కాల్ చేసారు. మద్యలో ఇంకో వాలంటీర్ కుక్క తలని నిమురుతూ 'ఏం కాదులే నీకు..కొంచెం ఓర్చుకో..' అంటూ, మిగిలిన వారి వైపు చూసి ఆలస్యం చేయకుండా మనం వెళ్ళాలి అంటూ గాభరా పడుతున్నాడు. నలుగురు మొహల్లో కూడా దానికి ఏమీ కాకూడదన్న తాపత్రయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇదంతా చూస్తున్న నాకు అప్రయత్నంగా కళ్ళలో ఓ నీటి పొర చూపును కప్పేసింది.

ఓ ఆటోని పిలిచి కుక్కని వాళ్ళు తీసుకెళ్ళబోతున్న ప్లేస్ గురించి వాడికి చెప్పి, ఆటో ఎక్కబోయారు. అందులో మెయిన్ వాలంటీర్ నా వైపు చూసి 'మీరు కూడా ఇంక మా గ్రూప్ లో చేరిపోవచ్చు..ఆసక్తి ఉంటే నా నెం. కు ఫోన్ చెయ్యండి' అని ఆటోలోకి దూరాడు. 'నాకంత సీన్ లేదు' అని చెప్పకుండా దానికి ఈక్వలెంట్ నవ్వు నవ్వాను...ఏదో ఆ కుక్కకి కాసింత సాయం చేసినందుకు నేను కూడా వాళ్ళ టైపే అన్న భ్రమలో పడిపోయినట్టున్నారు...ఒకవేళ అదే టైంలో మా గ్యాంగ్ వాళ్ళు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తే నేను కూడా దాన్ని చూసి, అందరిలాగే చిటికెడు జాలి విదిల్చి, సగటు మనిషిలా అక్కడే దాన్ని వదిలేసి వెళ్ళిపోతానని తెలిస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో...ఈ ఫోన్ చెయ్యడాలు గట్రా అప్పుడు ఉండవుమరి...

ఇంటికి వచ్చేయబోతూంటే బుర్రలో ఏవేవో ఆలోచనలు....మానవత్వం, సాటి వారిపై దయ, ఎదుటి వాడి కష్టాన్ని అర్దం చేసుకోలేని వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఏమీ కానీ, పైసా లాభం కూడా తెప్పించని ఓ మూగ జంతువు ప్రాణం, అది కూడా ఓ వీధి కుక్క ప్రాణం నిలపటం కోసం వాళ్ళు పడుతున్న తపన చూసినప్పుడు, వారి సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ఆ నిమిషంలో వాళ్ళంతా మనుషులకంటే ఎక్కువగా కనిపించారు..దేవుని పటం కనిపిస్తే, ఎప్పుడూ ఎవరో చెప్తే తప్ప స్వతహాగ దణ్ణం పెట్టుకోవాలని అనిపించని నాకు, అప్రయత్నంగా మనస్సులోనే వారందరికీ దణ్ణం పెట్టుకోవాలనిపించింది...

42 వ్యాఖ్యలు:

శిశిర చెప్పారు...

ఎప్పటిలాగే మీ టపా బాగుంది. సరదాగా మొదలుపెట్టి ఆలోచింపచేసే విధంగా ముగించారు. నిజంగా వాళ్ళు చేస్తున్న నిస్వార్ధ సేవకి దణ్ణం పెట్టవలసినదే.

కవిత చెప్పారు...

చాల మంచి పని చేసారు....Good work.నిజం గ వాళ్ళ నిస్వార్ధ సీవకు జూహార్లు .....

మధురవాణి చెప్పారు...

ఆ ముగ్గురు కరుణ హృదయలుకీ హ్యాట్సాఫ్! :-)
మీరు మాత్రం తెగ నవ్వించేశారు ఫస్ట్ మూడు పేరాల్లో! ;-)

రాధిక చెప్పారు...

మీ వీధి లోని చిన్న పిల్లలు,మీరు, ఆ నలుగురు...ఒక మంచి పని చేశారు.hats off 2 blue cross....మొదట్లో చాలా నవ్వు తెప్పించే విధం గా సాగింది మీ టపా, తర్వాత మేటర్ సీరియస్ కాబట్టి ఆలోచింపచేసే విధం గా సాగింది :-))
శేఖర్ గారు,
నా బ్లాగ్ ని ఒకసారి మీరు సందర్శించాలని చిన్న మనవి సుమా!! :-))

శ్రీనివాస్ చెప్పారు...

నా తరపున మీకు అభినందనలు మా రాయుడి తరపున భౌ భౌ .

ప్రేరణ... చెప్పారు...

టపా బాగుంది, మంచి పని చేసారు.

Vasuki చెప్పారు...

టపా బాగుంది. అలాగే ఒక కుక్క ప్రాణం కోసం మీరంతా తపించటం. ఇంతకీ తర్వాత దాని సంగతి ఏమయిందో కనుక్కొన్నారా?

శ్రీవాసుకి

మోహన చెప్పారు...

At your usual humour tempo.. చాలా నవ్వుకున్నాను. Nice one! :)

ఇక matter కి వస్తే, ఏం చేసాం అన్నది ముఖ్యం కాదేమో, ఎందుకు చేసాం అన్నదే ముఖ్యం ఏమో.. అనిపిస్తుంది నాకు.

People should take-up actions out of sheer pleasure of doing it. That adds divinity to the work.

Keep writing.

Ram Krish Reddy Kotla చెప్పారు...

మొత్తానికి ఆ కుక్క ప్రాణాలు కాపాడారు.. thats what counts..Good work..keep it up.

సవ్వడి చెప్పారు...

శేఖర్ గారు! మొదట బాగా నవ్వించేసరికి.. మొత్తం అలాగే ఉంటుందేమో అనుకున్నా.
కాని చివరకు చెప్పిన విషయం మనసుకు హత్తుకుంది.
ఆ నలుగురిని... వాళ్లతో పాటు మిమ్మల్ని అభినందిస్తునాను. నాకైతే మీలా ఫోన్ చెయ్యాలనే ఆలోచనైనా వస్తుందనుకోను. జాలిగా ఓసారి చూసేసి వదిలేసేవాడిని.
మీనుంచి సమాధానం రాలేదు.

Padmarpita చెప్పారు...

నవ్విస్తూ ఆలోచించేలా చేయడం మీకే చెల్లు.:)

వాత్సల్య చెప్పారు...

మంచి పని చేసారండీ బ్లూ క్రాస్ కి కాల్ చేసి.నిజంగా ఆ ముగ్గురూ,మీరూ అభినందనీయులు."ఆ నలుగురు" కలిసి కుక్క ప్రాణం కాపాడారన్నమాట.నిజంగా ఎప్పుడూ ఆఫీసు,వీకెండ్స్,షాపింగు అని బిజీగా తిరిగే మనల్ని ఒకోసారి ఇలాంటివి ఆలోచింపచేస్తుంటాయి.నిత్యం సంఘ సేవ కాకపోయిన ఇలాంటివి అప్పుడప్పుడు మనకి ఊరట.

జయ చెప్పారు...

హాయ్, చాలా రోజులయింది. ఏదో ఓ కుక్కపిల్ల కనిపించి వ్రాయమనే దాకా మెలుకువ రాకపోతే ఎలా? పాపం ఆ బుజ్జి కుక్కపిల్ల కి ఇప్పుడు బాగయిపోయిఉంటుందని నా ఆశ. ఏదైనా కూడా పైనుంచి కింది దాకా ఒకసారి స్క్రోల్ చేసి తరువాత చదవడం నా అలవాటు. బ్లూక్రాస్ నెంబర్ చూడగానే ఇదేదో జంతు ప్రేమకు సంబంధించింది అనుకున్నాను. అనుకున్నట్లుగానే మీ మానవత్వాన్ని చూపించారు. అంతేకాదు, చిన్నప్పటి నా అనుభవాన్ని కూడా గుర్తు చేశారు. స్కూల్ పక్కనే పడిఉన్న ఒక కుక్కపిల్లను చూసి దానికేమయిందో అని లోపలికి తీసుకెళ్ళి మా ఆయాని దానికి జ్వరం వచ్చిందేమో చూడమని చాలా గొడవచేసాను. ఈ లోపలే గట్టిగా స్కూల్ బెల్ మ్రోగటంతో, అంతవరకూ మొద్దునిద్ర పోతున్న కుక్కపిల్ల అదిరిపడిలేచి యమా స్పీడ్ గా పారిపోయింది. అప్పుడు మా ఆయా నన్ను చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేను:)

ప్రణీత స్వాతి చెప్పారు...

"అమ్మతో పాటు నేను కూడా డైలీ సీరియల్ చూస్తున్నాను. మద్య మద్యలో ఎవరు ఎవరికి రెండో భార్యో, ఎవరు భర్త లాంటి భర్తో, చనిపోయిన మూడో భర్త అమ్మ మొదటి భార్య కొడుకును ఎందుకు ఎండ్రిన్ తాగమని ప్రోత్సహిస్తుందో, ముసలివేషంలో ఉన్న ఇరవై ఏళ్ళ అమ్మాయి సొంత జడతో ఉందా లేక సవరం వేసుకుందా లాంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటుంటాను.." హ్హ హ్హ హ్హ హ్హ హ్హ..!!

ఎంత నవ్వించారో అంత ఆలోచింప చేశారండీ..చాలా మంచి పని చేశారు..వెరీ గుడ్..కీప్ ఇట్ అప్.

భావన చెప్పారు...

చాలా బాగా రాసేరండి. నిజమే మానవత్వమే కరువైన రోజుల్లో ఒక కుక్క కోసం అంత శ్రమ తీసుకోవటం మరి అరుదైన విషయమే కదా. మీ నలుగురికి ఆభినందనలు. మొదటీ రెండూ పేరాలు బాగా నవ్విచ్చాయి. "నేనలా కొశ్చన్స్ మీద కొశ్చన్స్ వేస్తుంటే అమ్మ ఎంతో ఉత్సాహంగా చెబుతుంది. " మా అమ్మ గుర్తొచ్చి మరీ మరీ నవ్వొచ్చింది ఆమె కూడా అంతే కాస్త ఏంటమ్మ అని అడిగితే ఐపోయామే.

రాధిక చెప్పారు...

అన్ని సమయాల్లోనూ అన్ని విషయాలకీ పాజిటివ్ గా స్పందించలేకపోవచ్చు.చిన్నదో చితకదో చేసిన సాయం మనకి చాలా తృప్తినిస్తుంది.మంచి పని చేసారు.

మేధ చెప్పారు...

శెబాసో!

కొత్త పాళీ చెప్పారు...

శేఖరా .. టోపీ తీసేశ్శా!! ఒకటి కాదు, చాలా

అజ్ఞాత చెప్పారు...

ఇంకా అలాంటి మనుషులు, సంస్థలు ఉన్నాయంటే ఆనందంగా ఉంది.
ఒక్కసారిగా వాళ్ళ స్థాయిలో సేవ చేయలేకపోయినా అంచలంచెలుగా అయినా అందరూ చేయాలి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శిశిర గారు,
అవునండి..ఖచ్చితంగా అది నిస్వార్ధ సేవే..
థాంక్యూ!!

@కవిత గారు,
థాంక్యూ..

@మధురవాణి,
ముగ్గురు కాదండీ వాళ్ళు..నలుగురు..ముగ్గురబ్బాయిలు..ఒక అమ్మాయి..
థాంక్యూ..

@'పిల్లనగ్రోవి' రాధిక గారు,
నిజంగా బ్లూ క్రాస్ చేస్తున్న సేవలు ప్రసంశనీయం..అందులో పని చేసే వాలంటీర్లకు హేట్సాఫ్ చెప్పొచ్చు.
ఇంక నేను మంచి పని చేశానంటారా...అంతలేదండీ..ముందే చెప్పానుగా ఆటైంలో నాకు ఏ కమిట్మెంట్ ఉన్న సింపుల్ గా ఇగ్నోర్ చేసుండేవాడినని..
మీ బ్లాగు సందర్శించానండీ..మీ కవితలు చాలా బాగున్నాయి. మిగిలిన అభిప్రాయం మీ బ్లాగ్లోనే చెబుతానండీ...
థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్..

@శ్రీనివాస్ గారు,
మీ అభినందనలన్నీ బ్లూక్రాస్ టీం కే చెందుతాయండి..రాయుడు గాడు కూడా వాడి స్పందన తెలిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది..వాడికి నా ముద్దులు..:-)
థాంక్యూ..

@ప్రేరణ గారు,
థాంక్యూ..

@శ్రీవాసుకి గారు,
దానికి చాలా పెద్ద గాయమే అయిందండీ..పక్కటెముకలు విరిగిపోయాయి..అందుకే నాకు వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ నెగటివ్ న్యూస్ వినాల్సివస్తుందన్న భయంతో ఫోన్ చేయలేదు వాళ్ళకి తర్వాత రోజు...అది క్షేమంగానే ఉండుంటుదని అనుకోవటమే నాకు బెటర్ గా అనిపించింది..
థాంక్యూ..

@మోహన
:-)
>>>People should take-up actions out of sheer pleasure of doing it. That adds divinity to the work..
చాలా బాగా చెప్పారు..కానీ ఆచరణలో అది అంత తేలీకైనా విషయం కాదండి...ఎంతో పరిణితి కావాలి...ముఖ్యంగా నాబోటి వాళ్ళకి..:-)
థాంక్యూ..

@రామకృష్ణ గారు,
థాంక్యూ..

@కృష్ణ( సవ్వడి )
థాంక్యూ...క్రెడిట్స్ ఆ బ్లూ క్రాస్ టీంకేనండి చెందుతాయి...
మీకు త్వరలోనే సమాధానం ఇస్తానండి..రీజన్ మీకు చెప్పాను కదా! ఎనీవేస్ ఆలస్యానికి సారీ..

@పద్మ గారు,
థాంక్యూ..

@రిషి గారు,
>>>నిజంగా ఎప్పుడూ ఆఫీసు,వీకెండ్స్,షాపింగు అని బిజీగా తిరిగే మనల్ని ఒకోసారి ఇలాంటివి ఆలోచింపచేస్తుంటాయి..
నా మనసులో ఉన్న ఫీలింగ్ ని మీరు క్యాచ్ చేసారు..థాంక్యూ..

>>నిత్యం సంఘ సేవ కాకపోయిన ఇలాంటివి అప్పుడప్పుడు మనకి ఊరట..
అవునండీ..నిజమే!

@జయ గారు,
హాయ్ అండి..
>>ఏదో ఓ కుక్కపిల్ల కనిపించి వ్రాయమనే దాకా మెలుకువ రాకపోతే ఎలా? ..
అదీ..అలా అడగండి..మీలాంటి మేడమ్స్ అప్పుడప్పుడూ బెత్తం పట్టుకుని అలా భయపడితే గానీ శేఖర్ టపాలు రాయడానికి బద్దకించడు..
ఇప్పుడది క్షమంగానే ఉండి ఉంటుందండీ..నేను ఆ విషయం మళ్ళీ వాకబు చేయలేదు..ఎక్కడ నెగటివ్ గా వినాల్సివస్తుందేమో అని...
కుక్క పిల్లతో మీ అనుభవం భలే ఉందండీ..పాపం అది మీ చిట్టి చేతులు మెత్తగా అనిపించి కళ్ళు తెరిచుండదు..స్కూల్ బెల్ డిస్టర్బ్ చేస్తే గానీ లేవలేదన్నమాట..:-)

@ప్రణీత స్వాతి గారు,
:-)
థాంక్యూ..

@ భావన గారు,
థాంక్యూ..
అవునండీ అరుదైన విషయమే..అది కూడా సిటీలో అత్యంత అరుదైన జాబితాలో పెట్టొచ్చు అలాంటి ఏక్టివిటీని...బ్లూక్రాస్ సంస్థకు మరింత ప్రచారం కూడా అవసరమండీ...
అమ్మలందరూ అలానే ఉంటారేమోనండీ..:-)
వాళ్ళు చూస్తున్నప్పుడు ప్రక్కన డిస్కషన్ కి ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా హేపీగా ఉంటుంది...మనమెలా అయితే నచ్చిన సినిమా చూస్తున్నప్పుడు పక్కవాళ్ళతో షేర్ చేసుకుంటామో అలా అన్నమాట..:)

@రాధిక గారు,
థాంక్యూ..

@మేధ గారు,
థాంక్యూ..

@కొత్తపాళీ గారు,
మాస్టారూ..నాదేం లేదండి..అంతా ఆ టీం వాళ్ళ గొప్పతనమే..అలాంటి కార్యక్రమాలు జంతువులకోసం పెట్టిన బ్లూక్రాస్ సంస్థని అభినందించాలి...
థాంక్యూ..

@భోనగిరి గారు,
అవునండీ..నిజమే..నిజానికి బ్లూక్రాస్ లాంటి సంస్థ గురించి చాలా తక్కువమందికి తెలుసండీ..ఆ సంస్థకు పబ్లిసిటీ అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం...

శివరంజని చెప్పారు...

ఎంత మంచి పని చేసారండి. సండే ఇంత మంచి పని చేసినందుకు మీకు అభినందనలు .ఫస్ట్ పేరా చదివినప్పుడు కామెడీ టపా అనుకున్నాను. ఇకపోతే మనుషులు అయితే తమ భాదలను చెప్పుకోగలవు కాని జంతువులు చెప్పలేవు కదా పాపం . ఈ విషయం లో hats off 2 blue cross...

అజ్ఞాత చెప్పారు...

ఓ కుక్కపిల్లకోసం మీ అమూల్యమైన సమయాన్ని ( వర్కింగ్ డేస్ కంటే హాలిడేస్ అమూల్యం కదా ) వెచ్చించారు కాబట్టి మీరు చేసింది కూడా తక్కువేం కాదు. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా మీకు కలిగే సంతృప్తి వెలకట్టలేనిది కదా .
అన్నట్టు మీ బ్లాగు ఈనాడు లో వచ్చినప్పుడు మీకు అభినందనలు తెలుపలేకపోయినందుకు చాలా బాధపడ్డానండీ . చాలా ఆలస్యంగా మీకు నా అభినందనలు

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శివరంజని గారు,
థాంక్యూ..

@లలిత గారు,
ఆ టీం వాళ్ళు చేసింది చూసినప్పుడు నేను చేసింది చాలా చిన్నది అనిపించిందండీ నాకు ఆ నిమిషంలో...
చాలా రోజులకు మీరు ఇటు వచ్చినందుకు ఆనందంగా ఉంది...ఈనాడు విషయం మర్చిపోకుండా అభినందనలు అందజేసినందుకు చాలా థాంక్సండీ..

హను చెప్పారు...

gud work anDI...

మోహన చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
మోహన చెప్పారు...

పరిణితి? May be one needs practice.

Btw - ఆ నలుగురు చేసిన పని ఎంత గొప్పదైనా మీ చేయి లేకపోతే అది సాధ్యం అయ్యి ఉండేది కాదు. Everybody has their own role. That's the beauty of working together.

So, చేసిన పని చిన్న-పెద్ద అని లెక్క వద్దు. పని చేసి కదిలిపోవటమే... ఏమంటారు?

పరిమళం చెప్పారు...

శేఖర్ గారూ ! ఇటువంటి సంఘటనే రెండేళ్ళ క్రిందట నాకూ ఎదురైంది . చిన్నపిల్ల కాదుగాని పెద్దకుక్కకే గాయాలైనాయ్ . జనం చూస్తూ వెళ్లి పోతున్నారు గాని పట్టించుకోవట్లేదు. ఏమైనా చేద్దామంటే దగ్గరికి రానివ్వడం లేదు . రక్తం ..చుట్టూ ఈగలు ...డెట్టాల్ కలిపిన నీళ్ళు దానిచుట్టూ చల్లి వస్తారా అని సందేహిస్తూనే బ్లూ క్రాస్ కి ఫోన్ చేశా ! సరిగ్గా ఒక గంట గడిచేసరికల్లా వాళ్ళ వేన్ వచ్చింది .కుక్కను తీసుకెళ్ళడమే కాదు . ఆ మరుసటిరోజు మీరు మానవత్వంతో స్పందించారు కాని దురదృష్టవశాత్తూ ఆ కుక్క చనిపోయిందని ఫోన్ చేసి చెప్పారు .అప్రయత్నంగానే నాకళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .నిజంగా మానవత్వం ఎక్కడుంది అని అడిగే వారికి ఇవ్వవలసిన చిరునామాల్లో ఇదొకటి !మీ టపా చదివాక మరోసారి వారికి శిరస్సువంచి నమస్కరించాలనిపిస్తోంది . అన్నట్టు మీరు కూడా ఇకమీదట ఏ ఫోన్ వచ్చినా అలా వదిలేసి వెళ్లిపోరని రాసిస్తానండీ....

మాలా కుమార్ చెప్పారు...

చాలా బాగుంది .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మోహన,
పరిణితి అని కాదు..నేను సరిగ్గా వ్యక్తపర్చలేకపోయాను మీకు...
ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా చర్య Conditional అని..వాళ్ళది Unconditional అని...

ఇంక నేనేమంటాను...మీరు అంత చక్కగా వివరించి చెప్పినప్పుడు...ఓ చిరునవ్వుతో తలని నిలువుగా ఆడించటం తప్ప..:-)
థాంక్యూ...

@పరిమళం గారు,
మీకు కూడా ఇలాంటి అనుభవం జరిగిందన్నమాట..కానీ నాకు మీలా దాని క్షేమ సమాచారం కనుక్కోవాలని అనిపించలేదండీ..ఎందుకో అది చచ్చిపోయింది(ఒకవేళ అదే జరిగుంటే) లాంటి వార్త వినాలనిపించలేదు..వాళ్ళూ నాకు ఫోన్ చెయ్యలేదు తర్వాత..అది బాగానే ఉండి ఉంటుందని అనుకోవటమే నాకు బెటర్ గా అనిపించింది.

>>నిజంగా మానవత్వం ఎక్కడుంది అని అడిగే వారికి ఇవ్వవలసిన చిరునామాల్లో ఇదొకటి..
చాలా బాగా చెప్పారండీ..నిజమే..ఈ టపా రాసే ఉద్దేశం కూడా బ్లూక్రాస్ అనే సంస్థ గాయపడిన/జబ్బుపడిన మూగజీవాలను చాలా కేరింగ్ గా చూసుకుంటుంది అని చెప్పటానికే...

>>>మీరు కూడా ఇకమీదట ఏ ఫోన్ వచ్చినా అలా వదిలేసి వెళ్లిపోరని రాసిస్తానండీ....
ఈ సంఘటన జరిగి, ఎన్నో ఆలోచనల సుడులు తిరిగాక నేను నిర్ణయించుకున్నది ఏంటంటే ఇక మీదట ఇలాంటి వాటి విషయాల్లో నా చేతలు పరిస్థితులతో సంభందం లేకుండా(Unconditional గా) ఉండాలి అని...ఆచరణలో అది ఎంతవరకూ వీలవుతుందో చూడాలి..

థాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్..

@మాలా కుమార్ గారు,
థాంక్యూ...

నేస్తం చెప్పారు...

ఈ పోస్ట్ ఎలా మిస్ అయ్యానబ్బా.. హూం ...శేఖర్ ఇలాంటి పోస్ట్లు రాసేసి మనసు భారం చేసేస్తావ్ అనుకో.. నిజం చెప్పాలంటే కనీసం పలానవారికి కాల్ చేయాలని తలంపు కూడా చాలా గొప్పది ..

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది మీ టపా. మీరు చాలా తమాషాగా మొదలు పెట్టి, చివరికి చెప్పాల్సింది చెప్పారు. very good writing skil you have. keep it up

చదువరి చెప్పారు...

"..వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మయ్య ఈ ప్రపంచంతో నాకు సంభందం లేదు' అని అనుకోవటంలో ఓ కిక్ ఉంటుంది నాకు..." -శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు! :)

ఒక ప్రాణిని కాపాడినందుకు అభినందనలు.

మురళి చెప్పారు...

అభినందనలు శేఖర్ గారూ..

నీహారిక చెప్పారు...

"..వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మయ్య ఈ ప్రపంచంతో నాకు సంభందం లేదు' అని అనుకోవటంలో ఓ కిక్ ఉంటుంది నాకు..."

మావారు కూడా ఇలాగే అనుకుని landline connection తీసేసి cnbc చూస్తూ గడిపేస్తారు.గోదారోళ్ళందరికీ ఇలాగే అనిపిస్తుందన్నమాట!!
Nice post.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@నేస్తం గారు,
మళ్ళీ మీ మనసు భారం చేసేసానా? ఏం చేయను మరి..ఇలాంటివి లైఫ్లో అరుదుగా ఫేస్ చేస్తాం కదా..అందుకే బ్లాగులో పెట్టేసాను...స్వతహాగ నాకు సరదాగా ఉండే టపాలు రాయటమే ఇష్టం..
థాంక్యూ..

@నాగ్ శీను గారు,
మీ కమెంట్ వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది...నిజానికి రాయటంలో నేనింకా అ, ఆ, ఇ, ఈ స్థాయిలోనే ఉన్నాను. థాంక్యూ సో మచ్..

@చదువరి గారు,
సారీ అండి..మీ పేరు గుర్తుకురావటం లేదు..
నన్ను మొట్టమొదటగా అలా దీవించింది మీరేనండీ..థాంక్యూ..పప్పన్నం పెట్టేటప్పుడు తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాను..:)

@మురళి గారు,
అన్ని పోస్ట్లు చదివి స్పందన తెలుపుతున్నందుకు చాలా థాంక్సండి..

@నిహారిక గారు,
ఏమన్నారూ..నన్ను గోదారి అబ్బాయిని అని అన్నారా..ప్లీజ్..మళ్ళీ మళ్ళీ అనరా? ఏంలేదండీ..నాకు గోదావరి జిల్లాలంటే ఇష్టం..అందులో నన్ను కూడా కలిపేసారు కదా..అందుకన్నమాట ఆనందం..:)

థాంక్యూ..

నేస్తం చెప్పారు...

అయ్య బాబోయ్ శేఖర్ అలా అని ఇలాంటి పోస్ట్లు రాయడం మానేయకేం..మీ ఫేన్స్ నన్ను బోలెడు తిట్టేసుకుంటారు..ఇంతకు నేను చేసిన ఘన కార్యం నీకు చెప్దామని నిన్న అనుకునే లోపల మావారు వచ్చారని సగం కామెంట్ పోస్ట్ చేసేసానన్నమాట..
మా క్రొత్త ఇంటి లో బెడ్రూం ఏసీ పెట్టుకునే డబ్బాలో ఒక గోరువంక గ్రుడ్లు పెట్టింది ..అందువళ్ళ చిన్న చిన్న పురుగులు మా బెడ్రూం నిండా తెగ తాండవం చేసేస్తున్నాయి..సర్లే పోని పురుగులమందు కొడితే కిల కిలాడే పక్షులు చచ్చిపోతాయని భయం..లేకపోతే ఇవి మీద పాకేసి ఒకటే కుట్టేయడం.. పోని టవున్ కౌన్సిల్ వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు పాపం బుజ్జి బుజ్జి పక్షిపిల్లలను తీసి ఎక్కడ పడేస్తారో అని ఇంకో భయం ..మొత్తానికి ఈ రోజువరకు మావారిని బ్రతిమాలి వాటిని ఏమి చేయకుండా భరించాం ..ప్రొద్దున్న టౌన్ కౌన్సిల్ వాడు వచ్చి చూసేటప్పుడు దేవుడా దేవుడా అవి ఎగిరిపోయి ఉండేటట్లు చూడూ అని దణ్ణం పెట్టుకున్నానా.. విచిత్రం లేవు .. ఇప్పుడు చెప్పు నేనూ కొంచెం మంచిదాన్నే కదా :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@నేస్తం గారు,
>>>..మీ ఫేన్స్ నన్ను బోలెడు తిట్టేసుకుంటారు..
కౌంటర్ వేసారు కదూ! మీరెప్పుడూ ఇంతే..నన్ను చిన్న పిల్లాడిని చేసి ఆడించేస్తారు..ఆ..(స్వర్ణకమలం సినిమాలో భానుప్రియతో వెంకటేష్ శిష్యుడు అనే మాడ్యులేషన్తో..) :) :P

ఓ..గ్రేట్..మంచి పని చేసారు..కొంచెం మంచేంటండీ..ఫుల్ మంచోల్లండి మీరు..ఆ మాటకొస్తే తూగోజీ అమ్మాయిలంతా ఇంతే! ఆయ్..:P

మనసు పలికే చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
మోహన చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
శ్రీనివాసరాజు చెప్పారు...

శేఖర్ గారు.. చాలా మంచి పని చేసారు.
ఆ బ్లూక్రాస్ వాళ్ళకి నిజంగా హేట్సాఫ్ అండి. విలువైన సమయం వెచ్చిస్తూ ఆ వాలెంటీర్స్ చేస్తున్న నిస్వార్ధసేవ చాలా గొప్పది.

ఆరోజు నేను చేయలేనిపనిని మీరు చెసారని సంతోషంగా వుంది.
నేనెప్పుడో రాసుకున్న పేజి ఇక్కడ చదవండి.
http://www.padamatigodavari.com/2006/06/blog-post_115070544405897501.html

సాయం అంటే మాట సాయం కూడానండీ.. మీ మాట ఒక మూగజీవి ప్రాణాన్ని నిలబెట్టలేదా.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శ్రీనివాసరాజు గారు,
ఇప్పుడే మీకామెంట్ చూస్తున్నానండి...ఎలా మిస్సయ్యానో...మీ టపా చూసాను...నేను కూడా చాలా సార్లు అలా అనుకునే ప్రయత్నాన్ని విరమించుకునేవాడిని...బహుశా పాత అనుభవాల గిల్టీఫీలింగ్ ఎక్కడో ఉండటం వల్లో గానీ ఇప్పుడు ఇలా స్పందించానేమో అని నాకు అనిపిస్తుంటుంది..

తృష్ణ చెప్పారు...

శేఖర్ గారూ ఏమయ్యారు?