20, మార్చి 2010, శనివారం

బుల్లి పిచ్చుక

అవి చుట్టు పక్కల ఎక్కడైనా గుంపులు గుంపులుగా కిచ కిచ మని అరిస్తే, వాటిని చూసినప్పుడల్లా కనీసం ఒక్కటైనా నాకు మచ్చికయితే ఎంత బావుణ్ణో అని మనసులో అనుకోని సంధర్బం బహుశా నాకు తెలిసి లేదేమో! అంతిష్టం అవంటే...అంత కలర్ ఫుల్ గా లేక పోయినా వాటి అమాయక చూపులు, కరెంట్ తీగల మీదో లేకపోతే బట్టలు ఆరేసుకునే తాళ్ళ మీదో వాటి గొడవలు, చిట్టి రొమాన్స్...వాటిల్లో అవి చేసుకునే స్నేహాలు...ఇవన్నీ నాకు భలే నచ్చేవి. ఎప్పుడైనా వాటిల్లో కనీసం ఒక్కదాన్ని నా చేతిల్లోకి తీసుకుని ప్రేమగా ఓ సారి దాని రెక్కలు నిమిరి, ఓ గుప్పెడు వడ్ల గింజలు దాని నోటికి అందించకపోతానా అన్న ఆశతో కాలం వెళ్ళదీస్తున్న రోజులవి. అవే చిట్టి పొట్టి పిచ్చుకలు...

ఓ సారి మేము ఇళ్ళు మారే క్రమంలో కొత్త ఇంటిలోకి వచ్చాము. ఆ ఇళ్ళు ఇది వరకటి ఇంటితో పోల్చితే ఏరుకు దగ్గరగా ఉండేది. చుట్టూ కొంత దూరం వరకు ఇంకే ఇళ్ళూ ఉండేవి కాదు. అక్కడ మా బెడ్ రూంలో వెంటిలేటర్లు మూడు వైపులా ఉండేవి. వెలుతురు, ఎండ ఎక్కువగా ప్రసరిస్తున్నందున, మా ఇంటి ఓనరు గారు ఏరువైపు తెరుచుకునున్న వెంటిలేటర్ను ఓ రేకు ముక్కతో గోడకు అవతలవైపు మూయించేశారు. బెడ్ రూం లోపల నుండి చూసినప్పుడు ఆ వెంటిలేటర్ ఒక గూటిలాగ తయారైంది.

ఓ వేసవి మధ్యాహ్నం, ఎండలో తిరిగి ఆడుతామని, తలుపుకు పైన గడియ పెట్టేసి, పెద్దక్క బలవంతంగా నన్ను పడుకోబెట్టడానికి ప్రయత్నించింది. ఆ గడియ నాకు అందదు కనుక ఇక పడుకోక తప్పేట్టు లేదని అలా అటూ ఇటూ మంచంపై దొర్లుతున్నాను. ఇంతలో ఓ తెరిచిన కిటికీ తలుపుపై ఓ పిచ్చుక, నోటితో చిన్న గడ్డి పరక పట్టుకుని, అటూ ఇటూ చూస్తూ, మద్య మద్యలో కిచ్ కిచ్ మంటూ, ఎవ్వరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాక సరాసరి మా వెంటిలేటర్లోకి దూరింది. వెంటనే కళ్ళని పావు వంతు మాత్రమే తెరచి, పడుకున్నట్టు నటిస్తూ అటువైపే చూస్తున్నాను. పిచ్చుక గడ్డిపరకని లోపల పేర్చేసి బయటకు వచ్చింది.. మళ్ళీ కిటికీ మీద కూర్చొంది..ఇంతలో ఇంకో పిచ్చుక కిచ్ కిచ్ మంటూ సన్నటి గుడ్డపీలికలను నోటితో పట్టుకుని సరాసరి వెంటిలేటర్లోకి దూరింది. పిచ్చుక అక్కడ గూడు పెడుతుందని నాకు తెలియడానికి అట్టే సమయం పట్టలేదు.

పక్కింట్లో ఉండే ప్రసాద్ గాడికి ఈ విషయం చెప్పాను. వాడు "ఒరేయ్...ఆ పిచ్చుక పిల్లల్లో నా కొకటి...నీ కొకటి...ఇద్దరం పెంచుకుందామే.." అన్నాడు. రోజు రోజుకు ఆ గూడు సైజు పెరుగుతూనే ఉంది. ఇంకా ఇంకా ఏవో పుల్లలు, కొబ్బరి పీచు, దూది పింజలు ఆ రెండు పిచ్చుకలు నోటకరచుకుని గూటిలోకి దూరి వదిలేసి వస్తూనే ఉన్నాయి. నాకేమో అవి ఎప్పుడు పిల్లలు పెడతాయో, ఆ పిల్లలు ఎప్పుడు పెద్దవవుతాయో, వాటిని నేను ఎప్పుడు చేత్తో పట్టుకుంటానో అని ఒకటే ఆశగా ఉండేది.

ప్రసాద్ వాళ్ళమ్మ మా ఇంట్లో అమ్మతో మాట్లాడుతూ ఉండగా, పిచ్చుకలు పుల్లలతో వెంటిలేటర్ లోకి దూరటం గమనించినట్టుంది. పిచ్చుకలు అలా ఇళ్ళల్లో గూళ్ళు కట్టడం అంత మంచిది కాదని, అందులో పిచ్చుక గుడ్లు పెట్టక ముందే తీసేస్తేసరి అని అమ్మతో అంది. అసలే ఇలాంటి విషయాల్లో రెండో ఆలోచనకు తావివ్వని అమ్మ ఆ గూడును తీసేద్దామని చీపురు పట్టుకుంది. వెంటనే నేను అమ్మతో అందులో పిల్లలు ఉన్నాయని, వాటి అరుపులు కూడా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయని అబద్దం చెప్పేసి బేర్ మని ఏడవటం మొదలుపెట్టాను. ఇంక అమ్మకి కూడా గూడు తీయడానికి మనసొప్పినట్టు లేదు. చీపురుని కింద పడేసింది. హమ్మయ్య అని అనుకొన్నాను.

ఓ రోజు నేను టిఫిన్ తింటుండగా ఆడ పిచ్చుక నోటితోని ఓ పురుగుని పట్టుకుని గూటిలోకి దూరింది. అది అలా దూరగానే నిజంగానే కిచకిచమని చిన్న చిన్న అరుపులు వినపడ్డాయి. పిచ్చుక గుడ్లు పొదిగిందని అర్దమై, వెంటనే ఈ విషయం ప్రసాద్ గాడితో చెప్పాలని టిఫిన్ టేబుల్ మీద పడేసి పరిగెత్తాను. "ఒరేయ్..పిచ్చుకను పట్టుకోడానికి పెద్ద కష్టం పడకుండానే మనకు త్వరలో దొరకబోతోందిరా..." అని అన్నాడు వాడు. పిచ్చుకను పట్టుకున్నాక దాన్ని పెట్టడానికి అట్టముక్కలతో చిన్న ఇల్లు కూడా సిద్దం చేసేసాను నేను. ఇంక అది పెద్దదవ్వటమే ఆలస్యం..

ఓ రాత్రి గూడులో పిల్లలు ఎలా ఉన్నాయో చూడాలనిపించింది. ఒకటి రెండు సార్లు కిటికీ దగ్గర నిలబడి 'హుష్..హుష్' అని అన్నాను..ఒకవేళ పెద్ద పిచ్చుక అందులో ఉంటే పిల్లను తీసి చూడటం కుదరదు కదా...అందుకన్నమాట...ఆ పాటికే పెద్ద పిచ్చుక ఉంటే బయటకు వచ్చేసేది...రాలేదంటే లేదని అనుకుని, ఓ పొడుగాటి స్టూల్ కిటికీ దగ్గర వేసుకుని, నెమ్మదిగా గూటిలోకి చెయ్యి పెట్టాను...ఏదో మాంసం ముద్దలాగ చెయ్యికి తగిలింది...కొంచెం అదోలా అనిపించింది...అయినా ఆత్రుత ఆపుకోలేక దాన్ని బయటకు తీసాను...ఈకలు లేకుండా ఒట్టి చర్మంతో, మూతికి ఇరువైపులా పసుపురంగుతో వికృతంగా కనిపించింది. నేను దాని మూతి దగ్గర వేలితో తాకితే తల్లి ఆహారం ఏదో పెడుతుందనుకొని పెద్దగా నోరు తెరిచి, కిచ్..కిచ్..మంది. కొంచెం భయమేసి గూటిలో పెట్టేసాను. అప్పుడే తెలిసింది పుట్టిన వెంటనే పక్షికి ఈకలు ఉండవని....పిచ్చుక పిల్లలు కొంచెం పెద్దవవుతున్న కొద్దీ అవి ఒకదాన్ని ఇంకోటి తోసుకుని గూటిలోంచి బయటకు చూసేవి. ముద్దు ముద్దుగా భలే కనిపించేవి నాకు.

కొద్దిరోజులు తర్వాత వాటికి కొంచెం ఎగరగలిగే శక్తి రావటం వల్ల గూడు వదిలి బయటకు వచ్చేసాయి. కొన్ని ఏటో వెళ్ళిపోయాయి. ఇదే సరైన సమయం పిచ్చుకను పట్టుకోడానికి అని గూటిలో చెయ్యి పెడదామని అనుకుంటుండగా, మా టీ.వి స్టాండు వెనుక సరిగ్గా ఎగరటం చేతగాని ఓ పిల్ల కనిపించింది. వాళ్ళమ్మ అక్కడికే దానికి ఆహారం తెచ్చి నోట్లో పెడుతుంది. అదేమో వాళ్ళమ్మ ఎగిరిపోతున్నప్పుడు దాని వెనకే ఎగరడానికి ప్రయత్నిస్తుంది. ఇంక దాన్ని అలాగే వదిలేస్తే ఎగిరిపోతుందని పట్టుకోబోయాను. అది కప్పగెంతులు వేసుకుంటూ నడిచి, కొద్ది దూరం ఎగిరింది. ఇలా లాభం లేదని ప్రసాద్ గాడిని పిలిచాను. వాడు పిచ్చుకని అటువైపు కాపు కాస్తే నేను ఇటువైపు నుండి దాని పట్టుకోగలిగాను. ఇంకో పిచ్చుక పిల్ల ప్రసాద్ గాడి కోసమని నేను ఆ రాత్రి గూటిలో చెయ్యి పెడితే ఒక్కటి కూడా లేదు.

నా కల నిజమైన రోజు వచ్చేసిందని గొప్ప ఆనందం వేసింది. నేను దాన్ని ఇదివరకు తయారు చేసిన అట్ట ఇంట్లో ఉంచాను. నాకు పక్షులంటే పిచ్చి అని అక్క వాళ్ళకి తెలీటంతో చూసి చూడనట్టు వదిలేసారు..అమ్మ మాత్రం "పాపం రా..అలా పట్టుకోకూడదు" అనేది. నేను మాత్రం కొద్దిరోజుల తర్వాత దాన్ని వదిలేస్తాను అని చెప్పటంతో అమ్మ ఒప్పుకుంది. కొద్ది రోజులు పెద్ద పిచ్చుక అట్ట ఇంటి బయటనుండే దానికి ఆహారం తినిపించేది. తర్వాత అది పెద్దది అవ్వటం వల్లనేమో తల్లి రావటం మానేసింది. పిచ్చుక పిల్ల బాగా పెద్దది అయ్యింది. రెక్కలు బాగా ఎదిగాయి. దాని మూతికి ఇరువైపులా పసుపు రంగు కొంచెం మిగిలేఉంది. రోజూ దాన్ని చేతిలోకి తీసుకుని, వడ్ల గింజలు నోటికి అందించేవాళ్ళం...నేనూ ప్రసాద్ గాడూనూ...

ఓ సారి సడన్ గా తల్లి పిచ్చుక, తండ్రి పిచ్చుక నా అట్ట ఇంటి చుట్టూ ప్రదక్షణ చేయటం మొదలు పెట్టాయి...అవి కిచ కిచ మని అరిస్తే ఇది కూడా లోపలి నుండి అరిచేది. ఎందుకో జాలేసింది..ప్రసాద్ గాడితో వదిలేద్దాం రా దాన్ని అన్నాను. వెంటనే దాన్ని బయటకు తీసి అరుగుమీద పెట్టాను. ఎగరటం నేర్చుకుంటున్న దశలో మేము పట్టుకోవటం వల్లనేమో అది అటూ ఇటూ చూసింది గానీ ఎగరలేదు. మేమిద్దరం కొంచెం దూరం నుండి దాన్ని చూస్తునే ఉన్నాం. ఇంతలో పెద్ద పిచ్చుకలు రెండూ దాని దగ్గరకు వచ్చాయి. పిల్ల పిచ్చుక దాని రెక్కలు కొంచెం ఉబ్బినట్టుపెట్టి వాటి దగ్గర తెగ గారాలు పోయింది. కొంచెం సేపు మూడు కలిసి కుచ్..కుచ్ అని అరిచాయి. మొదట మగ పిచ్చుక ఎగిరింది..దాని వెనుక తల్లి పిచ్చుక ఎగిరింది...ఆ వెంటనే పిల్ల పిచ్చుక వాటిని అనుసరిస్తూ ఎగిరిపోయింది.***********


PS: ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం...పాపం..అమాయకమైన ఈ పక్షులు ఇప్పుడు అంతరిస్తున్న పక్షుల జాబితాలోకి చేరిపోయాయట....ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఇవి ఇప్పుడు మాత్రం తమ ఉనికేనే కోల్పోబోతున్నాయట...ఇవన్నీ చదవగానే ఒక్కసారి ఆ బుల్లి పిచ్చుకతో నా అనుభందం గుర్తొచ్చి ఇలా టపా అయింది. ఆ బుల్లి పక్షుల జీవనంలో మళ్ళీ పూర్వ వైభవం రావాలని ఆకాంక్షిద్దాం.

25 వ్యాఖ్యలు:

అక్షర మోహనం చెప్పారు...

శెఖర్ గారు..బుల్లిపిచ్చుకతో మీకున్న అనుభవం బాగా రాసారు. నేనేమో గతంలో హైకూలు రాసాను.
ఆ టైటిల్ అంటేనే నాకు ప్రాణం. మీకు నెనరులు.

మురళి చెప్పారు...

పిచుకలు అంతరించి పోడానికి సెల్ ఫోన్ల వైబ్రేషన్స్ ఒక కారణం అని చెబుతున్నారండీ.. ఇదే నిజమైతే మీ (మన) కోరిక తీరడం కష్టమేనేమో..
ఎప్పటిలాగే టపా చాలా బాగుంది..

రాధిక(నాని ) చెప్పారు...

శేఖర్ గారు ,మాఇంటివద్ద కరెంట్ మీటర్లో పిచుకలు గూళ్ళు పెడుతూఉంటాయి .
ఎప్పుడైనా అక్కడ గడ్డిపరకలు అవీకనపడితే గూళ్ళు పెట్టాయని అనుకుంటాము . పిల్లలుకూడా ఆగుడ్లు అవీ ఆనందంగా చూస్తూంటారు.ఫొటోలు చాలా బాగున్నాయి. ఒకసారి నాబ్లాగ్ చూసి మీసలహాలు,సూచనలు ఏవైనా తెలియచేయండి.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీ సచిత్ర కథనం చాలా బాగుంది. నేనూ ఇక్కడ మీతో గొ౦తు కలిపాను..www.sahavaasi-v.blogspot.com

SRRao చెప్పారు...

శేఖర్ గారూ !
పిచ్చుకలతో చిన్నప్పటి జ్ఞాపకాల్ని తట్టిలేపారు. ఇక అవి జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయేమో !

..nagarjuna.. చెప్పారు...

చిన్నప్పుడు మాఇంటి చుట్టుపక్కల బిల్డింగులు,టవర్లు లేకపొవడం వల్ల తెగ తిరిగేవి ఇవి, చిన్న పిచ్చుకలతో పాటు ఉడత సైజులోవుండే పెద్ద పిచుకలు కూడా తిరిగేవి.It was delighting to watch them move around.క్రమేనా అవి కనిపించడం మానేసాయి నెను మాత్రం ఆత్రంగా వాటి కొసం ఎదురుచుసేవాణ్ణి తరువాత ‘పెద్దతనపు’ పనుల్లోపడి పట్టించుకోవడం మానేసాను.
చాలా ఏళ్ళ తరువాత ఇక్కడ ఖరగ్‌పూర్‌లొ బస్టాండు దగ్గర అగుపించాయి నాకైతే చెప్పలేని ఆనందం కలిగింది. కెమెరాలో ఫోటొ తీసుకుందామనుకునేలోపు తుర్రుమన్నాయి... :)

Your post was nostalgic...very thanks for reviving them.

మాలా కుమార్ చెప్పారు...

బుజ్జి పిచుకల గురించి చాలా బాగా చెప్పారు . మా చిన్నప్పుడు వాటిని చూస్తూ ,బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్ర్ మన్నది అని తెగ పాడుకునే వాళ్ళము . పోస్ట్ బాగుంది .

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగా రాశారు శేఖర్ గారు :-) బోల్డన్ని ఙ్ఞాపకాలను కదల్చారు.

నిషిగంధ చెప్పారు...

శేఖర్, బుజ్జి పిచ్చుకతో మీ అనుబంధం చాలా బావుందండీ.. అసలు అవి చిట్టి చిట్టి గా ఉండి ఎంత ముద్దొస్తాయో కదా! పావురాలు, చిలకలు మచ్చిక అయినట్లు అవి ఎందుకు మచ్చిక కావోనని చిన్నప్పుడు తెగ బాధేసేది..

Friend చెప్పారు...

మా చిన్నప్పుడు మా అమ్మ వరండాలో కూచుని బియ్యం ఏరుతూ వండ్ల గింజలు కింద పడేస్తుండేది. అవి తినటానికి బుజ్జి పిచ్చుకలు వచ్చేవి. ఇది చూసి నేను రోజుకో గుప్పెడు బియ్యం వల పరిచి బోయవాడు చల్లినట్లు కింద చల్లేదాన్ని. వల ఒకటే తక్కువ. అవి చాలా తెలివి గలవి దగ్గరలో ఉన్నంతసేపు అక్కడకి వచ్చేవి కావు అవతలకి పోగానే వచ్చి ముక్కుతో గింజల్ని ఎగరేసుకుపోయేవి. ఈ లోపు నాకు మాత్రం బియ్యం గుప్పెళ్ళు గుప్పెళ్ళు పారబోస్తున్నానని వీపు విమానం మోత మోగించేది అమ్మ. ఈ పిచ్చుకలతో నా ముచ్చట తీరినట్లే అని చివరకు చిన్న చిన్న కోడిపిల్లల్ని తెచ్చుకుని కొన్నాళ్ళు వాటికి ఇలా గింజలు నీళ్ళు పెట్టి ముచ్చట తీర్చుకున్నా. కొద్దిగా పెరిగాక అవి ఇల్లంతా తిరుగుతుంటే గంప కింద పెట్టలేక బయటకి వదల లేక అమ్మ గోల పడలేక మా ఫ్రెండువాళ్ళకి ఇచ్చేసా.

పాపం పిచ్చుకలు మాత్రం చాలా సార్లు మా వరండాలో తిరిగే ఫ్యాన్ లో పడుతున్నాయని మా నాన్నగారు ఆ ఫ్యాన్ కూడా తీయించేసారు. నిజమే ఈ మధ్య ఈ పక్షులు అంతరించటం వల్లనేనేమో ఎక్కువ కనిపించటం లేదు..:(

అజ్ఞాత చెప్పారు...

శేఖర్ గారూ, ఇలా అంతరించిపోయే పక్షుల జాబితా పెరుగుతూ పోయేదేకానీ తరిగేదికాదండీ
రాబందులు, పావురాలు, పాలపిట్టలు, కోకిలమ్మలు ....ఇవన్నీ జ్ఞాపకాల్లో మాత్రమే మిగులుతాయని విన్నప్పుడు చాలా బాధేస్తుంది.
మనం అంతస్తులమీద అంతస్తులు కట్టేస్తూ అంత బుజ్జి పక్షి తాను గూడుపెట్టుకోటానికి జానెడు స్తలం చూపించలేకపోతున్నాం.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మోహన రాం ప్రసాద్ గారు,
థాంక్యూ..మీ బుల్లి పిచ్చుక హైకూ చదివానండి. బాగున్నాయి ఆ రెండు పిచ్చుక హైకూలు.

@మురళి గారు,
అవునండీ..ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్లో 3G టెక్నాలజీ వచ్చింది కదా..దాని వల్ల రేడియేషన్ మరింత పెరుగుతుందంట..అదే జరిగితే వీటి సంతతి మరింత త్వరగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది.
థాంక్యూ..

@రాధిక(నాని) గారు,
ఒకప్పుడు ఇంటి చూరులే ఆవాసాలుగా చేసుకుని బ్రతికిన ఇవి ఆ తర్వాత్తర్వాత ఎలక్ట్రిక్ స్తంభాల మీద, వాటి లైట్ల లోపల, కరెంట్ మీటర్ల లోపల పెట్టుకోవటం మొదలెట్టాయి.
మీ బ్లాగు చూశానండి..బాగుంది..ఫోటో బ్లాగు చాలా చక్కగా ఉంది.
థాంక్యూ..

@కెక్యూబ్ వర్మ గారు,
మీ కవిత చదివాను..బాగా రాసారండి..
థాంక్యూ..

@SR Rao గారు,
అవునండీ..ఇంక అవి జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయేమో!
థాంక్యూ..

@నాగార్జునాచారి గారు,
మీరు కూడా పిచ్చుకలకు ఫాన్ అన్నమాట...
>>>‘పెద్దతనపు’ పనుల్లోపడి పట్టించుకోవడం మానేసాను...
ఒక్క పిచ్చుకలే కాదండీ..‘పెద్దతనపు’ పనుల్లోపడి చిన్న చిన్న ఆనందాలను ఎన్నో పట్టించుకోవడం మానేసాం మనలాంటివాళ్ళం...
మీ బ్లాగు చూశాను..చాలా బాగుంది...
థాంక్స్ ఫర్ ద రెస్పాన్స్...

@మాలా కుమార్ గారు,
నాకు ఆ పాట తెలుసండీ...నాకు గుర్తున్నది కరెక్టే అయితే అది ఇలా ఉంటుంది..
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది...
అత్త ఇంట కాపరం చెయ్యనన్నది..
మొగుడితో మొట్టికాయలు తింటానన్నది..

:)
మా అమ్మ పాడేది మా చిన్నప్పుడు..
థాంక్యూ..

@వేణు గారు,
థాంక్యూ... :)

@నిషిగంధ గారు,
అవునండి అవి అస్సలు మచ్చిక కావు..ఒకవేళ మనం వాటిని ఏ పంజరంలో పెట్టినా అరుస్తూనే ఉంటాయి...కానీ మనషుల మద్యనే తిరుగాడుతూ, పిల్లలను కంటూ భయం లేకుండా చక్కగా బ్రతికేస్తుంటాయి.
థాంక్యూ..

@Friend,

మీ అనుభవాలన్నీ కూర్చితే ఓ మంచి టపా అయ్యేటట్టు ఉందండి...చాలా బాగున్నాయి...నేను కూడా కోడి పిల్లలతో నా ముచ్చట తీర్చుకున్నానండీ...రూపాయికొక కోడి పిల్ల చొప్పున రెండు రంగు కోడి పిల్లలు కొనుక్కున్నాను. వాటితో నా ఆటల గురించి ఓ టపానే రాయొచ్చు. వీలయితే మీ కోడి పిల్లల అనుభవాలు రాయండి...
మా ఇంటి దగ్గర ఒకటి రెండు పిచ్చుకలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయండి నాకు..
థాంక్యూ..

@లలిత గారు,
కరెక్ట్ గా చెప్పారు...మనం అంతస్థుల మీద అంతస్థులు కట్టేసుకొని వాటి ఆవాసాలను నిర్దాక్షణ్యంగా కొల్లగొడుతున్నాం... రాబందులు అయితే చాలా వరకు తగ్గిపోయాయి...పాలపిట్టలు కూడా..ఎంత అందంగా ఉంటాయో పాలపిట్టలు...మన రాష్ట్ర పక్షి అయినప్పటికీ దాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యారు...అప్పుడప్పుడూ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కనిపిస్తుంటాయి..
అయినా మనిషి ప్రకృతితో మమేకమై బ్రతకటం ఎప్పుడో మర్చిపోయాడండి...అందుకేగా ఇలాంటి పరిణామాలు..
థాంక్యూ..

Hima bindu చెప్పారు...

ఎప్పటిలానే చక్కగా చెప్పారు మీ బుల్లిపిచుక గురించి .నాకు ఊహ తెలిసినప్పటినుండి పిచుకలతో మంచి అనుభంధం వుంది .ఇక్కడ అప్పుడప్పుడు చాల చిన్న పిచుకలు మా చెట్ల మీదకి వస్తుంటాయి ,కాని అవి పిచుకలు కాదు అంటారు మావాళ్ళు .ఒక కాకిపిల్ల నాకు బాగా అలవాటయ్యి ఉదయాన్నే నేను కనబడి పలకరించేవరకి పిలుస్తూనే వుంటుంది అది ఇప్పుడు పెద్దకాకి అయ్యింది దానికి జీడిపప్పులో ,బిస్కట్లో పెట్టి తిను అనాలి అనకపోతే పొరపాటున ముట్టుకోదు చిన్నపిల్లలు ఉంగా అన్నట్లు గరాలుపోతు మాటకి మాట చెప్తుంది ,నాతో తప్పించి మా పాప తో కాని మావారితో కాని మాట్లాడదు కదలకుండా ఆలకిస్తూ చుస్తది .ముందు ముందు ఈ పిచుకుల మాదిరి కాకులు అంతరిస్తాయేమో..ఏమైనా పర్యావరణాన్ని జీవరాశిని కాపాడుకోవాల్సిన భాద్యత మనందరిపై వుంది .

ప్రణీత స్వాతి చెప్పారు...

చిన్నతనంలో నేను కూడా పిచ్చుకలతో బాగానే సావాసం చేశానండీ. ఇప్పుడు కనీసం ఒక్కసారి చూద్దామన్నా పిచ్చుకలు మచ్చుక్కి కూడా కనిపించడం లేదు.

బాగుందండీ టపా. ఫోటోలు చాలా బాగున్నాయ్.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@చిన్ని గారు,
కాకిని విసుక్కోకుండా అన్ని తినే పదార్ధాలు పెట్టడం గ్రేట్ అండి....పిచ్చుకల కంటే ఇంకా చిన్న పక్షులు (Humming Bird)ఉన్నాయండీ..అవి మందార పువ్వుల్లాంటి పూలలోని మకరందాన్ని తాగుతుంటాయి...కాకుల అంతరించటం విషయానికి వస్తే... పక్షుల్లో కాకంత రఫ్ అండ్ టఫ్ పక్షి ఇంకేదీ ఉండదేమోనండీ :)...
థాంక్యూ..

@ప్రణీత గారు,
హైదరాబాదులో ఉండి పిచ్చుకను చూస్తే ఆశ్చర్యం గానీ చూడకపోతే పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదండి...ఈ విషయంలో నేను కొంచెం అదృష్టవంతుడినేనండీ..మా ఏరియాలో ఒకటి రెండు కనిపిస్తాయండీ అప్పుడప్పుడూ...
థాంక్యూ..

జయ చెప్పారు...

నిజ్జంగా, ఒట్టండి...పిచ్చుకని ఏనాడు చూశానో నాకైతే గుర్తే లేదు. మీ అరచేతి లోని ఆ బుజ్జి పిచ్చుకమ్మని చూస్తుంటే ఇట్టే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తోంది. ఏవైనా పక్షుల్ని చేత్తో పట్టుకోవాలంటే ఎంత భయమో...దగ్గరగా ఉండి వాటి కదలికల్ని గమనిస్తూ ఉంటే వాటితోపాటే నేనూ అడుకుంటున్న తృప్తి నాది. మా కాలేజ్ గార్డెన్ లో అప్పుడప్పుడూ తిరుగుతూ రకరకాల పక్షుల్ని గమనిస్తూ ఉంటాను. ఎన్ని రకాల కూతలో వినిపిస్తూ ఉంటాయి. మా వాళ్ళకి చెప్పాలి పిచ్చుకల్ని కూడా తెచ్చి పెంచమని.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

జయ గారు,
మా అక్కకి కూడా మీలానే వాటిని చేత్తో పట్టుకోవటం అంటే భయమండీ..చివరికి కోడి పిల్లలనైనా సరే...అన్నట్టు ఆ అరచేయి నాది కాదండీ..గూగులయ్యను :) విసిగించి, నస పెట్టి అడిగితే ఎట్టకేలకు నాక్కావలసిన ఫోటో ఇచ్చాడు.

>>>మా కాలేజ్ గార్డెన్ లో అప్పుడప్పుడూ తిరుగుతూ రకరకాల పక్షుల్ని గమనిస్తూ ఉంటాను..
గుడ్ హాబీ అండి...

నేస్తం చెప్పారు...

మొన్న ఇండియా వెళ్ళినపుడు మా ఇంటి మల్లె పందిరిలో చిన్న గూడు లాంటిది ఏర్పాటు చేసి రోజూ రెండు కప్పుల ధాన్యం వేస్తున్నారు నాన్నా,మా అక్క పెద్ద కూతురూ ..ఒకటే పిచ్చుకలు.. భలే వస్తున్నాయిలే .. వాటి కోసం ప్రత్యేకం గా ధాన్యం కొంటున్నారు నాన్న.. మా ఆయనతో రోజూ పోరు పెడతా సెల్ ఎక్కున వాడద్దు ఎంతో అవసరమైతే తప్ప అని ..ఎక్కువ వాడితే పిచ్చుకలు అంతరించిపోతాయంట కదా :( హూం

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@నేస్తం గారు,
మల్లెపందిరి ఉందంటే చాలండీ..పిచ్చుకలు ఇక వాటి లోపల దూరి ఒకటే అల్లరి చేసేస్తాయి...మీ నాన్న గారు వాటికి ధాన్యం కొని మరీ ప్రత్యేకంగా ట్రీట్ చేయటం గ్రేట్...ఇక సెల్ ఫోన్ వాడకం అంటారా..దాన్ని ఎంత తక్కువ వాడదామకుకుంటే అంత అవసరం పడుతుంది ఎవరికైనా...
థాంక్యూ..

Raj చెప్పారు...

ఊర పిచ్చుకల మీద చాలా బాగా వ్రాసారు.. నిజానికి నా గతం లోని అనుభావాన్నిమీరు నా మదిలోకి తొంగిచూసి కాపీ చేసారా - అనేటంతా గొప్పగా, హృద్యముగా వ్రాసారు..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@రాజ్ గారు,
పల్లెటూళ్ళో ఉండే ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడో ఇలాంటి అనుభవాన్ని ( కొద్దిపాటి తేడాతో ) అనుభవిస్తారంటే అతిశయోక్తి కాదేమో...బహుశా అందుకే మీకలా అనిపించి ఉండవచ్చు...
థాంక్యూ ఫర్ యువర్ రెస్పాన్స్..

రాధిక చెప్పారు...

"బుల్లి పిచ్చుక" పేరు బాగా నచ్చి టపా చదవడం మొదలు పెట్టాను.. చదువుతుంటే చాలా రిలీఫ్ గా అనిపించింది, మీరు ఎంత అదృష్టవంతులండి....మీకు ఎన్ని విలువైన జ్ఞాపకాలు...

నా చిన్నప్పుడు ఒకసారి మా ఇంటి ముందు వర్షానికి ఒక పిచుక పడి,వణికిపోతుంటే దాన్ని రెండ్రోజులు మాఇంట్లో అట్టే పెట్టుకున్నాను..అది బాగయ్యాక వదిలిపెట్టాను.

నాణేనికి మరో వైపు మా పెద్దమ్మ వాళ్ళింట్లో వాసర కి పిచుక గూళ్ళు ఉండేవి, పిల్లలంతా వాటిలోని పిచుకలను వెల్లగోట్టేవాళ్ళం...నేను వాళ్ళలో ఒకదాన్ని :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@'పిల్లనగ్రోవి' రాధిక గారు,
- ముందుగా మీకు చాలా చాలా థాంక్స్..ఎందుకంటారా...టపాలు చదివేసి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని క్రమం తప్పకుండా తెలుపుతున్నందుకు...
- నా టపాలు చదివి నాకన్నీ విలువైన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయని అనుకోకండి..బాల్యంలో అక్కడక్కడా కొన్ని విషాదమైనవి ఉన్నాయి..మాయని మచ్చలా ఉన్నవీ ఉన్నాయి...
- మా పిల్ల గ్యాంగ్ లో కూడా చాలా మంది పిచ్చుకలను వెళ్ళగొట్టేవాళ్ళండీ...అదో సరదా...:)

Unknown చెప్పారు...

ప్రపంచ పిచ్చికల దినొత్సవం మార్చి-20

పిచ్చుక చిన్నదే, అయినా దీన్నిబ్రతికించుకోవాలి

పిచ్చుక చిన్నదే అయినా దీన్నిబ్రతికించుకోవాలి “ పిచుకంతలేవు. ఎందుకురా అలా ఎగురుతావు?” అనేది పల్లెటూరిజీవనంలో ఊతపదం మర్చిపోయే పరిస్తితి వచ్చింది. ఎందుకంటే పిచ్చుకే పిచ్చుకంతయిపోయింది. కాబట్టి మనం అందరం కలసే పిచ్చుకని బ్రతికించుకోవాలి. పిచ్చుక సాధారణంగా మన ఇళ్లలోనే తిరుగుతాయి. మనుషులమద్య కలివిడిగా తిరుగుతూవుంటాయి. మనలోఒకటిగా కలసి పోతుంది. కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారిలేకపోతే పెగుతున్న సాంకేతికవిప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మనఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్తితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం. దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకుపోవడానికి కారణాలు 1) ఇంధన కాలుష్యం 2) గృహనిర్మాణంలో మార్పులు 3) పెరుగుతున్న అపార్టమెంటు కల్చరు 4) సాంకేతిక మార్పులతొపాటు సెల్ టవర్లు నిర్మాణం (వీటితరంగాల వలన తగ్గు తున్న ఉత్పత్తి).
గృహనిర్మాణం
సాధారణంగా పిచ్చుకలు ఇంటి కప్పులక్రింద, పూర్వం రోజులలో పెంకులు అడుగుభాగంలో, 90 శాతం ఇళ్లలోనే గూళ్లు నిర్మించుకుంటాయి. ఆడ, మగ పిచ్చుకలు కలసి జీవనం సాగించుకోవడానికి నిర్నయించుకున్న తరువాత గూడు నిర్మాణం చేపడుతాయి. రెండూ కలసి కష్టపడి గూడు నిర్మాణం చేసి గుడ్లుపెట్టి పిల్లలు ఎదిగేవరకు కలసి భాద్యత వహించుతాయి. ఇవిఎక్కువగా ధాన్యం తింటాయి. ప్రతిధాన్యంగింజా వలుచుకొని బియ్యంగింజని మాత్రం తింటాయి, అత్యంతవేగంగా గమ్మత్తుగా తింటాయి


ప్రపంచ దేశాలలో పిచ్చుకలు
సాధారణంగా పిచ్చుకలు మనదేశంలోనే కాకుండా ఆశియా, ఆఫ్రికా యూరప్ ఖండాల్లొ కూడా కనిపించుతున్నాయి. భారతదేశంలో కర్ణాటకా, గుజరాత్, మహారాష్ట్ర, తమిలనాడ్, పశ్చిమబెంగాల్ ఒడిశ్సా రాష్ట్రాలలో విరివిగా కనిపించుతాయి.
యువతకి విజ్ఞప్తి
ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చికల దినొత్సవం జరుపుకోవడమే కాదు, పిచ్చుకలుతొపాటు అన్ని పక్షి జాతులను కాపాడుకోవాలి " యువత పక్షి ప్రేమికులుగా మారాలే తప్పా ప్రేమ పక్షులుగా మారకూడదు"
నాగురించి
మాతాత తండ్రులద్వారా పక్షులను ప్రేమించడం అలవాటు చేసుకున్నాను. అదేధోరణిలో నేటికీ పక్షులను ప్రేమిస్తూ పక్షిప్రేమికుడుగా వీలైనంతవరకూ అన్ని పక్షుల ఆలనా పాలనా చూస్తున్నాను. అద్ది ఇళ్ళలో ఇబ్బందులు ఎదుర్కుంటునే పిచ్చుకలును ఆదరించాను. ప్రతిరోజూ నాఇంటికి అధితిలా వచ్చి ధాన్యంగింజలు తిని కదుపునిండా నీళ్లు త్రాగి వెళుతుంటే ఆ ఆనందం మధురానుభూతమైనది. ఆ ఆనందం కలకాలం నిలవాలనే విశాఖపట్నం, మధురవాడలో రెవిన్యూ కాలనిలో నిర్మించుకున్న ఇంటికిముందు కొంతకాళిస్తలం వదిలి చెట్లు పెంచుతున్నాను. చిన్న ప్లేటులలో నీరు పెడుతుంటాను నీళ్ళు త్రాగడానికి రకరకాల పక్షులు వస్తున్నాయి పక్షుల జీవనానికి అవసరమైన కుత్రిమ గూళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాను. వాటిలోకూడా గూళ్ళూ పెడుతున్నాయి. ముఖ్యంగా రాబోవువేసవిలో పక్షులు నీళ్ళు దొరకక చాల ఇబ్బందులుపడతాయి. కావున ఇంటిజాలీలపై, షేడులపై చిన్న ప్లేటులలో నీరుపెడితే నీళ్ళు త్రాగడానికి రకరకాల పక్షులు తప్పక వస్తాయి. కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో నిర్మించుకున్న నాఇంటి చుట్టూ రక రకాల పక్షులు కూతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యోదయానికి స్వాగతం పలుకుతాయి. పక్షి ఏదైనా దాన్ని బ్రతికించుకోవాలి. అందమైన చిలుకా గోరింక, నెమలే కాదు, చూడగలిగితే కాకి గుడ్లగూబ తీతువ కూడా అందంగానే వుంటాయి.అపశకున పక్షి తీతువపిట్ట
తీతువపిట్ట అరుపు అపశకునమని, ఆ అరుపువింటే ఎవరోఒకరు మరణిస్తారనీ నమ్మకం. కాని తీతువ ప్రతిరోజు ఉదయం అరుస్తూ నాఇంటిచుట్టూ తిరుగునేవుంటాది. ఇంత అపశకున పక్షీ చాల అందంగా వుంటుందని నాకిప్పుడే తెలిసింది. అలాగే పావురం అరుపు ఇంటిలో వినబడకూడదంటారు. కాని పావురం మాంసం మాత్రం రుచిగానేవుంటాదంటారు.
ఆపదలోఆలంబన
విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో పక్షి ఏదైనా ఆపదలోవున్నా అ పాయస్థితిలోవున్నా నాకు తెలియచేయండి. సత్వరసేవలుచేయడానికి మాకుటుంబం సిద్ధంగావుంటాది. వివరాలు ఈ నెంబర్లకు 9885124679 / 9491606502 కి తెలియచేయండి.
సాయిప్రకాష్ (విశాఖపట్నం)
ఫొటోలు- నరేంద్ర, గౌ తమి


టి. యస్. ప్రకాశరావు,
ఇం. నెం . 2-116/50, సాయికుటీర్
రెవెన్యూ కాలనీ
మిధిలాపురి కాలని
మధురవాడ
(విశాఖపట్నం)
530041


Unknown చెప్పారు...

ప్రపంచ పిచ్చికల దినొత్సవం మార్చి-20

పిచ్చుక చిన్నదే, అయినా దీన్నిబ్రతికించుకోవాలి

పిచ్చుక చిన్నదే అయినా దీన్నిబ్రతికించుకోవాలి “ పిచుకంతలేవు. ఎందుకురా అలా ఎగురుతావు?” అనేది పల్లెటూరిజీవనంలో ఊతపదం మర్చిపోయే పరిస్తితి వచ్చింది. ఎందుకంటే పిచ్చుకే పిచ్చుకంతయిపోయింది. కాబట్టి మనం అందరం కలసే పిచ్చుకని బ్రతికించుకోవాలి. పిచ్చుక సాధారణంగా మన ఇళ్లలోనే తిరుగుతాయి. మనుషులమద్య కలివిడిగా తిరుగుతూవుంటాయి. మనలోఒకటిగా కలసి పోతుంది. కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారిలేకపోతే పెగుతున్న సాంకేతికవిప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మనఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్తితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం. దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకుపోవడానికి కారణాలు 1) ఇంధన కాలుష్యం 2) గృహనిర్మాణంలో మార్పులు 3) పెరుగుతున్న అపార్టమెంటు కల్చరు 4) సాంకేతిక మార్పులతొపాటు సెల్ టవర్లు నిర్మాణం (వీటితరంగాల వలన తగ్గు తున్న ఉత్పత్తి).
గృహనిర్మాణం
సాధారణంగా పిచ్చుకలు ఇంటి కప్పులక్రింద, పూర్వం రోజులలో పెంకులు అడుగుభాగంలో, 90 శాతం ఇళ్లలోనే గూళ్లు నిర్మించుకుంటాయి. ఆడ, మగ పిచ్చుకలు కలసి జీవనం సాగించుకోవడానికి నిర్నయించుకున్న తరువాత గూడు నిర్మాణం చేపడుతాయి. రెండూ కలసి కష్టపడి గూడు నిర్మాణం చేసి గుడ్లుపెట్టి పిల్లలు ఎదిగేవరకు కలసి భాద్యత వహించుతాయి. ఇవిఎక్కువగా ధాన్యం తింటాయి. ప్రతిధాన్యంగింజా వలుచుకొని బియ్యంగింజని మాత్రం తింటాయి, అత్యంతవేగంగా గమ్మత్తుగా తింటాయి


ప్రపంచ దేశాలలో పిచ్చుకలు
సాధారణంగా పిచ్చుకలు మనదేశంలోనే కాకుండా ఆశియా, ఆఫ్రికా యూరప్ ఖండాల్లొ కూడా కనిపించుతున్నాయి. భారతదేశంలో కర్ణాటకా, గుజరాత్, మహారాష్ట్ర, తమిలనాడ్, పశ్చిమబెంగాల్ ఒడిశ్సా రాష్ట్రాలలో విరివిగా కనిపించుతాయి.
యువతకి విజ్ఞప్తి
ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చికల దినొత్సవం జరుపుకోవడమే కాదు, పిచ్చుకలుతొపాటు అన్ని పక్షి జాతులను కాపాడుకోవాలి " యువత పక్షి ప్రేమికులుగా మారాలే తప్పా ప్రేమ పక్షులుగా మారకూడదు"
నాగురించి
మాతాత తండ్రులద్వారా పక్షులను ప్రేమించడం అలవాటు చేసుకున్నాను. అదేధోరణిలో నేటికీ పక్షులను ప్రేమిస్తూ పక్షిప్రేమికుడుగా వీలైనంతవరకూ అన్ని పక్షుల ఆలనా పాలనా చూస్తున్నాను. అద్ది ఇళ్ళలో ఇబ్బందులు ఎదుర్కుంటునే పిచ్చుకలును ఆదరించాను. ప్రతిరోజూ నాఇంటికి అధితిలా వచ్చి ధాన్యంగింజలు తిని కదుపునిండా నీళ్లు త్రాగి వెళుతుంటే ఆ ఆనందం మధురానుభూతమైనది. ఆ ఆనందం కలకాలం నిలవాలనే విశాఖపట్నం, మధురవాడలో రెవిన్యూ కాలనిలో నిర్మించుకున్న ఇంటికిముందు కొంతకాళిస్తలం వదిలి చెట్లు పెంచుతున్నాను. చిన్న ప్లేటులలో నీరు పెడుతుంటాను నీళ్ళు త్రాగడానికి రకరకాల పక్షులు వస్తున్నాయి పక్షుల జీవనానికి అవసరమైన కుత్రిమ గూళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాను. వాటిలోకూడా గూళ్ళూ పెడుతున్నాయి. ముఖ్యంగా రాబోవువేసవిలో పక్షులు నీళ్ళు దొరకక చాల ఇబ్బందులుపడతాయి. కావున ఇంటిజాలీలపై, షేడులపై చిన్న ప్లేటులలో నీరుపెడితే నీళ్ళు త్రాగడానికి రకరకాల పక్షులు తప్పక వస్తాయి. కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో నిర్మించుకున్న నాఇంటి చుట్టూ రక రకాల పక్షులు కూతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యోదయానికి స్వాగతం పలుకుతాయి. పక్షి ఏదైనా దాన్ని బ్రతికించుకోవాలి. అందమైన చిలుకా గోరింక, నెమలే కాదు, చూడగలిగితే కాకి గుడ్లగూబ తీతువ కూడా అందంగానే వుంటాయి.అపశకున పక్షి తీతువపిట్ట
తీతువపిట్ట అరుపు అపశకునమని, ఆ అరుపువింటే ఎవరోఒకరు మరణిస్తారనీ నమ్మకం. కాని తీతువ ప్రతిరోజు ఉదయం అరుస్తూ నాఇంటిచుట్టూ తిరుగునేవుంటాది. ఇంత అపశకున పక్షీ చాల అందంగా వుంటుందని నాకిప్పుడే తెలిసింది. అలాగే పావురం అరుపు ఇంటిలో వినబడకూడదంటారు. కాని పావురం మాంసం మాత్రం రుచిగానేవుంటాదంటారు.
ఆపదలోఆలంబన
విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో పక్షి ఏదైనా ఆపదలోవున్నా అ పాయస్థితిలోవున్నా నాకు తెలియచేయండి. సత్వరసేవలుచేయడానికి మాకుటుంబం సిద్ధంగావుంటాది. వివరాలు ఈ నెంబర్లకు 9885124679 / 9491606502 కి తెలియచేయండి.
సాయిప్రకాష్ (విశాఖపట్నం)
ఫొటోలు- నరేంద్ర, గౌ తమి


టి. యస్. ప్రకాశరావు,
ఇం. నెం . 2-116/50, సాయికుటీర్
రెవెన్యూ కాలనీ
మిధిలాపురి కాలని
మధురవాడ
(విశాఖపట్నం)
530041