31, డిసెంబర్ 2009, గురువారం

డిసెంబర్ 31 రాత్రి, జ్ఞాపకాల రంగవల్లి

- ఒక డిసెంబర్ 31
సాయింత్రం ఆరుగంటలు...
చిన్న చెడ్డీలో బొడ్డు కనిపించే బనీను వేసుకుని నేను...

మా రోజక్క బోల్డన్ని ముగ్గుల పుస్తకాలు, పేపర్లో వచ్చే వాటి కటింగ్స్ అన్నీ కుప్పగా ముందేసుకుని కూర్చొనుంది. ఏ ముగ్గు వేద్దామా అని ఆలోచిస్తూ...
"రోజా ఇది బాగుంది.." పక్కింటి ఆంటీగారు అప్పుడే వంట పూర్తి చేసుకుని వచ్చారు.
"అక్కా ఇది సూపర్.." వెనకింటి అమ్మాయి తన నిర్ణయం తెలిపేసింది.
"టీచర్..దిస్ ఈస్ గుడ్.." ట్యూషన్ కుర్రాడి మాటలు..

రోజక్క స్వతహాగా ఆర్టిస్ట్ కావటం వల్ల తను ముగ్గులు చాలా వీజీగా వేసేది.

చీకటి పడుతుందనగా ముగ్గులపోటీకి మేం సిద్దం అని సంకేతాలిస్తూ ఒక్కొక్కళ్ళ వాకిళ్ళు పేడనీళ్ళ కళ్ళాపుతో తడిసేవి...

ఇంటి అటక మీద ముగ్గు దిద్దడానికి ఉంచిన రంగుల పొట్లాలు అన్నీ తీసి ఒక ఇత్తడి పల్లెంలో పెట్టేది అమ్మ. అటకమీద ఎందుకు పెట్టేదంటే మాకు అందినంత ఎత్తులో ఉంటే వాటితో మధ్యాహ్నానికే యాపీ న్యూయియర్ అంటూ ఎక్కడపడితే అక్కడ సొట్ట సొట్టగా రాసిపడేస్తాం కదా..అందుకన్నమాట...చిన్న చిన్న తెరిచిన పొట్లాలలో ఉన్న రంగులు పల్లెంలోనే ఒక ఇంధ్రధనస్సు ఏర్పడిందా అన్నట్టు ఉండేవి. ఇంతలో చమ్కీ పొడి కొనలేదా అంటూ పెద్దక్క హడావిడి..."రోజమ్మా.. ఆ ధనలక్ష్మి(ముగ్గుల్లో అక్క కాంపిటేటర్) ఈ సారి నీకంటే పెద్ద ముగ్గేసి అందరు చేత పొగిడించుకోవాలని తెగ ఆరాటం పడుతుంది.." అని మా పనమ్మాయి చాడీలు ఒక పక్క...

చీకటి చిక్కగా పరుచుకున్నాక...కాలనీలో అందరి వాకిళ్ళో కళ్ళాపు కొంచెం ఆరాక ఒక్కో ఇంటి నుండి ఒక్కొక్కలు వచ్చి ముగ్గుపెట్టడం మొదలెట్టేవారు. చలి బాగా ఉండటం వల్ల పిల్లకాయలం అందరం మొహానికి దొంగోళ్ళలా మంకీ కేప్ లు వేసుకుని, నాన్నమ్మ సాలువానో తాతయ్య సాలువానో కప్పుకుని ముగ్గుల విజిటింగ్ కి వెళ్ళాం....ఒక్కోసేపు ఒక్కో ముగ్గు దగ్గర నిలబడటం...చూసిన ముగ్గుని వేరే వాళ్ళు వేసిన దానితో పోల్చి చూసుకోవటం..ఎవరిది గొప్ప అంటే ఎవరిది గొప్ప అని...మా ఎదిరింటి అనసూయమ్మ గారు మాత్రం ఓ అయిదు రెక్కలున్న ముగ్గు తొందరగా వేసేసి వాళ్ళ వాకిట్లో ఉన్న ముద్ద బంతి, చీమ బంతి పూలను రెక్కలు రెక్కలుగా విడగొట్టి వాటిని ముగ్గును నింపడానికి వాడేది. అది చూసి పెద్దవాళ్ళందరూ "అబ్బో..ఏమి పిసినారితనం" అంటూ బుగ్గలు నొక్కుకుంటుంటే పిల్లలందరూ ఆంటీ మీరు ఎప్పుడూ రంగులతో ఎందుకు ముగ్గు పెట్టరు అని డైరెక్టుగా అడిగేసేవారు. పాపం ఆవిడ ఏమి చెప్పాలో తెలియక పిల్లలను "ఇక్కడ నుండి ఎల్లండెల్లండి.." అంటూ మొహం మాడ్చుకుని తరిమేసేది.

మా ఇంటి ముందు ముగ్గు వేసేసేటప్పుడు చాలా మంది గుమిగూడేవారు. ఎందుకంటే అప్పటికే అక్క వేసిన ముగ్గులు వరసగా మూడు సంవత్సరాలు ఉత్తమ ముగ్గుగా కాలనీ వాళ్ళ ప్రశంసలు పొందాయి. ఈ సారి ఏ ముగ్గు వేస్తుందో చూద్దామని జనాల ఆరాటం....అందరికంటే లేటుగా అక్క ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసినా తొందరగా వేసేసేది. అదికూడా ముగ్గురక్కలు రంగులు దిద్దటంలో తలో చెయ్యి వెయ్యటం వల్ల తొందరగానే అయిపోయేది. నేనేమో రంగులు దిద్దుతానని ఒకటే అల్లరి చేసేవాణ్ణి. అమ్మేమో వీడికి చమ్కీలు అద్దే పని ఇవ్వండర్రా అంటూ అక్కలకు నన్ను సిఫారసు చేసేది. కానీ అక్కవాళ్ళు ఆ చాన్స్ కూడా ఇవ్వక హాపీ న్యూ ఇయర్ రాసే అక్షరాలలో ఏ పీ లెటరో వై లెటరో దిద్దమని ఇచ్చేవారు. కనీసం ముగ్గులో ఒక వైపు ఉన్న పువ్వో, ఫలమో, ఆకో రంగులద్దడానికి కావాలి అన్నది నా ప్రధాన డిమాండ్లు...ఇవ్వకపోతే ముగ్గు చెరిపేస్తా అంటూ బెదిరించేవాణ్ణి. కానీ చిన్నక్క నా చెయ్యిని గట్టిగా పట్టేసుకుని నాకు చెరిపే అవకాశం ఇచ్చేదికాదు..అలా ప్రతీసంవత్సరం చెరిపే చాన్స్ మిస్సయ్యేది.

తొమ్మిదయితే సగం రంగులు అద్ది అందరూ భోజనాలకి వెళ్ళి పిల్లకాయలను ఆవులు గట్రా ముగ్గును తొక్కకుండా కాపలాగా పెట్టేవారు. మా అక్క అయితే "ఒరేయ్..రంగులేమైనా అద్దావో వీపు పగిలిపోద్ది.." అంటూ హెచ్చరిక జారీ చేసి కాపలా ఉండమంది. నాకేమో రంగులద్దాలని తెగ కోరికగా ఉండేది. చేసేదేంలేక వంటిట్లోకి దొంగలా వెళ్ళి, మైదా పిండిని ఓ చిన్న పేకట్ కట్టుకుని పరిగెత్తాను. ఏ డొంకల్లోనో ఓ చిన్న ప్లేస్ చూసుకుని మూడు చుక్కలు మూడు వరసల ముగ్గేసి, ధనలక్ష్మి ఇంటికెళ్ళి ముగ్గు దగ్గర ఎవ్వరూ లేరని అనుకున్నాక అక్కడ ఉంచిన రంగులు కొంచెం కొంచెం కొట్టేసి పొట్లం చుట్టి తెచ్చుకుని దానికి రంగులు నింపాను. ఓ కళాఖండం రెడీ అయిపోయింది. నా చెడ్డీ దోస్తులకి దాన్ని చూపిద్దామని వాళ్ళని పిలవడానికని వెళ్ళాను. వాళ్ళను వెంటేసుకుని నేను వేసిన ముగ్గు దగ్గరకు వెళ్ళాను. కానీ విచిత్రంగా అక్కడ నా మూడు చుక్కల ముగ్గులేదు కానీ ఆవు పేడ అయితే ఉంది..ప్చ్..నా ముగ్గేమయిందో!!. మళ్ళీ వేసుకున్నాను..కానీ ఈ సారి బ్లాక్ అండ్ వైట్ మూడు చుక్కల ముగ్గుతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

అందరు ఇళ్ళల్లో ఒంటి గంట రెండు వరకు లైట్లు వెలుగుతూనే ఉండేవి. పాటలు..ఆటలతో తెగ సందండి...మా అక్క చేత వాళ్ళింటి ముందర ముగ్గు పెట్టించుకోడానికి ఓ ఇద్దరు ముగ్గురు మా ఇంటిలో ఉండేవారు. అందరి ముగ్గుల కార్యక్రమం అయ్యాక చూస్తే వీధి లైట్లలో ముగ్గులన్నీ చమ్కీపొడితో ధగ ధగ మెరిసిపోయేవి. కొంత సేపటికి ముగ్గును సన్నటి మంచుతెర కప్పుతుంటే మసకగా మెరిసిపోతూ కన్పించే ముగ్గు చాలా అందంగా ఉండేది. ఆ టైంలో అమ్మ అందరికీ టీ పెట్టి ఇచ్చేది. నాకు ప్రత్యేక గ్లాసులో ఇవ్వక తను కొంచెం తాగి ఇచ్చింది. అప్పుడే అర్ధమైంది...తొందరగా పెద్దయిపోవాలి..లేదంటే ఫుల్ గ్లాసు టీ ఇవ్వరని.

ముగ్గులు చూడడానికి పక్క కాలనీవాళ్ళు, మా కాలనీ వాళ్ళు కూడా ఇంటింటికీ తిరిగేవారు. కాలనీ అంతా ఏదో తిరనాళ్ళలా ఉండేది. ఎప్పటిలాగే అందరూ మా ఇంటి ముందున్న ముగ్గు దగ్గర కొంచెం ఎక్కువసేపు ఆగి మా అక్కని మెచ్చుకునేవారు. నేను ఇదిగో ఆంటీ నా ముగ్గు కూడా చూడండి అంటూ నా మూడు చుక్కలు మూడు వరసల ముగ్గు చూపించాను. కానీ ఒక్కరూ మెచ్చుకోలే...కనీసం అనసూయమ్మ ముగ్గుకంటే బాగుందని కూడా చెప్పలే...గొప్ప కోపం వచ్చింది ఆ టైంలో...

న్యూఇయర్ అయిపోయాక ప్రతీ వాళ్ళు ఇంటి ముందు కొత్త ముగ్గు వెయ్యక ఓ రెండు రోజులు అదే ముగ్గు ఉంచేవారు. కళ్ళముందు ఎప్పుడైనా చీపురుతో పాతముగ్గును అక్క తుడిచేస్తున్నప్పుడు నాలో ఒక బాల కళాకారుడు జారిపోతున్న చెడ్డీ ఎత్తుకుంటూ లేచేవాడు. చాలా భాద వేసేది. "అందుకేనమ్మా..నేను అంత కష్టపడి ముగ్గుపెట్టి రంగులద్దను...ఎప్పటికైనా తుడిచేయాల్సిందేగా.." అనసూయమ్మగారు అమ్మతో అనటం సన్నగా వినిపించేది.
బ్లాగ్మిత్రులందరికీ పేరు పేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు

7, డిసెంబర్ 2009, సోమవారం

ప్రేమ పేరుతో బంధీని చేస్తే....వీకెండ్ కావటంతో ఫ్రెండ్స్ అందరం ఎప్పటిలాగానే ఒకరి ఇంట్లో కలవటం...పిచ్చాపాటి కబుర్లు...జోకులు...చెణుకులు మధ్య హాయిగా గడిచిపోయింది. తెలంగాణ బంద్ వల్ల దియేటర్లు, షాపింగ్ సెంటర్లు, గోకార్టింగ్ లాంటి ఎంటర్టైన్మంట్ జోన్స్ మూసెయ్యటం మా ఆనందాల మీద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సాయింత్రం అందరం కలిసి సరదాగా కారులో అంతర్జాతీయ విమానాశ్రయంకి బయలుదేరాం. ఏ ప్లేస్ కి వెళ్ళినా మొదట అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లు పై పడటం మా వాళ్ళకు అలవాటు. ఎప్పటిలాగే వినడానికి వింతగా ఉండే అయిటేమ్స్ మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో ఆర్డర్ ఇచ్చేసి బాతాఖానీలో పడ్డాం. అయిటెమ్స్ రాగానే మారుమాట్లాడకుండా అందరం మెక్కుతూ కూర్చున్నాం...ఇంతలో మా అశ్విన్ గాడు బర్గర్ ని చేతిలోకి తీసుకుని కొంచెం సాస్ పోసి అభిమానంగా "ఏరా శేఖ్...తింటావా" అని నన్ను అడిగాడు. అంతే ఆ దృశ్యం చూసిన అశ్విన్ వాళ్ళావిడ ప్రణవి "తింటావా అని నన్నడకుండా శేఖర్ ని అడుగుతావా" అంటూ అలిగింది. మిగిలిన వాళ్ళకు ఏమీ అర్ధం కాలేదు. "ఎదురుగా నేను కనపడుతుంటే నన్నడకుండా వాడిని అడుగుతావా" అని మరోసారి అంది. అప్పుడువాడు బర్గర్ ని తనకు ఇవ్వబోయాడు. అంతే తను కోపంగా తిరస్కరించింది. నువ్వు ఇంకోబర్గర్ ని తింటావేమో అని నిన్నడగలేదు అని తను ఏదో వివరణ ఇవ్వబోతుండగా "ఎప్పుడైనా నువ్వు తినకుండా నేను తిన్నానా? ప్రతీసారి మనం షేర్ చేసుకుంటాం కదా" అని అంది. అంతే మా గ్యాంగ్ లోని మిగిలినవాళ్ళు నేను ప్రణవికి సవతిపోరు కలిగించానా అని ఆశ్చర్యంగానూ, వాడు నాకు ఇస్తున్నప్పుడు ప్రణవికి ఇవ్వరా అని వీడెందుకు అనలేదు అన్నట్టు వింతగానూ చూశారు.

ప్రణవికి అశ్విన్ మీద పొసెసివ్ నెస్ చాలా ఎక్కువ. తను ఎంత ఎక్కువగా అశ్విన్ ని ఇష్టపడుతుందో అంతే ఇదిగా అశ్విన్ కూడా తనను చూసుకోవాలని అనుకుంటుంది. అయితే అశ్విన్ కూడా తనపై అంతకు రెట్టింపు ప్రేమ చూపిస్తాడు. కానీ చిన్న విషయాలను కూడా ప్రణవి, అశ్విన్ కి తనపై ఉన్న ప్రేమని బేరీజువేసుకోడానికి ఉపయోగించటం వల్ల అశ్విన్ లైఫ్లో ఇలాంటి సంఘటనలు జరగటం మామూలు అయిపోయింది.

పొసెసివ్ నెస్....అంటే ఎదుటివాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని మనకు నచ్చినట్టు ప్రవర్తించేలా చేసుకోవటం ఏమో అని అనిపిస్తుంటుంది నాకు.

నిజానికి పొసెసివ్ నెస్ అనేది నిత్యం మనం చుట్టు ప్రక్కల మనుషుల్లో చూస్తునే ఉంటాం. ఒక తల్లి తన కొడుకు ఎప్పుడూ తనకి అడిగే అన్నీ కొనాలంటుంది. ఎప్పుడైనా వీలుకాక అడిగికొనటం కుదరకపోతే అతను ఏ పరిస్థితిలో తనని అడగలేదు అని ఆలోచించి అర్ధం చేసుకోడానికి ప్రయత్నించదు. తనపై గౌరవమర్యాదలు తగ్గటం వల్లే అలా చేసాడని ఫీలవుతుంది.

ఓ భార్య తనను ప్రతీరోజు ఆఫీసు నుండి ఇంటికి తీసుకొచ్చే భర్త ఏరోజైనా "నా చిన్నప్పటి స్నేహితుణ్ణి కలవాలి...ఈ రోజు నువ్వు ఆటోలో వెళ్ళు" అని గొంతులో స్నేహితుణ్ణి కలవబోతున్నానన్న ఆనందం చూపి చెబితే అర్ధం చేసుకోకుండా తెగ కోపం తెచ్చుకుంటుంది. పైగా తనకంటే స్నేహితుడే ఎక్కువా అంటూ వాదనకు దిగుతుంది.

ఓ పాతికేళ్ళ కుర్రాడు రూంలో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బయటకు వెళ్ళిన ప్రతీసారి తనతో ఎక్కడికి వెళుతున్నాడో చెప్పి వెళ్ళాలని ఆశిస్తాడు. ఎప్పుడైనా చెప్పకపోతే స్నేహితుడు మారిపోయాడని అనుకుంటాడు. అంతేగానీ తిరిగి వచ్చిన తర్వాత తనతో విషయాలన్నీ చెబుతాడు అన్న భరోసాతో ఉండడు.

ఎదుటివాళ్ళ స్వేచ్చకి భంగం కలగకుండా చూపించే ప్రేమ/అభిమానం అన్ని విధాల మంచింది. ఎప్పుడైతే మనం ప్రేమ/అభిమానం పేరుతో వాళ్లని వాళ్ళుగా ఉండనీకుండా కట్టడి చేస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమ పేరుతో విధించిన సంకెళ్ళను తెంచుకోడానికే ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పొసెసివ్ నెస్ వల్ల ప్రాక్టికాలిటీనీ మిస్సవుతాం. ఎవరైనా అశ్విన్ లాంటి ఒకలిద్దరు మాత్రం ఆ ప్రేమని అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చేస్తారంతే. మిగిలిన వాళ్ళు వారినుండి తప్పించుకోడానికి విషయాలను దాచిపెట్టడం, అబద్దాలతో మేనేజ్ చేసుకోవటం, నస కేసురా బాబు అంటూ వేరొకరిదగ్గర గోడు వెళ్ళబోసుకోవటం లాంటివి చెయ్యాల్సివస్తుంది.