28, అక్టోబర్ 2009, బుధవారం

అజ్ఞాత భక్తులూ... కాస్త ఆలోచించరూ...!!

మనిషికి ఏదైనా కష్టం వస్తే వెంటనే చేసేది దైవాన్ని తల్చ్చుకోవటం..ఆపై ప్రార్ధించి మన కష్టాన్ని గట్టేక్కిస్తే తనను దర్శించుకుంటానని మొక్కుకోవటం. కాస్త ఉన్నోళ్ళు అయితే కళ్యాణం చేయిస్తామనో, తృణమో పణమో చెల్లించుకుంటామనో వేడుకుంటారు. ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు, వాళ్ళ మనోభావాలను అనుసరించి వారి వారి మొక్కులు తీర్చుకుంటారు. పాత తరం లోనిది ఈతరంలో మారకుండా ఉన్నది ఏదైనా ఉందంటే అది ఈ మొక్కులు తీర్చుకునే కార్యక్రమమే అని అనిపిస్తుంది.

ప్రసిద్ది దేవాలయాలు తప్పించి చిన్న చిన్న గుడులకు భక్తులు హుండీలో వేసిన డబ్బులే గుడి నిర్వహణకి వాడతారు. ఇతరత్రా ఇంకేమీ ఆదాయమార్గాలు ఉండవు. అలాంటి గుళ్ళకు శక్తి మేరకు కానుకలు సమర్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తిరుపతి దేవుని విషయం తీసుకుంటే ఆ దేవాలయానికి ప్రభుత్వాల శ్రద్ద(అది ఏ రకమైనది అన్నది పక్కన పెడితే) మెండుగా ఉంటుంది. దాన్ని చూసుకోడానికి ఒక సంస్థ కూడా ఉంది. నిత్యం భక్తులు నుండి వచ్చే కానుకలు విలువ కోట్ల లోనే ఉంటాయి. వాటితో టీ.టీ.డీ వారు అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, హాస్పటల్లు ఇలా ఎన్నో నిర్మిస్తుంటారు. అవి కూడా తిరుపతిలోనే ఉంటాయి తప్పించి( కళ్యాణ మండపాలు మినహాయిస్తే..అవి కూడ డబ్బులకే ఇస్తారు)ఒక్క ఊళ్ళో నైనా ఫలాన స్కూలు టీ.టీ.డీ వాళ్ళు కట్టారు..ఫలాన గ్రామానికి నిత్యం త్రాగు నీరు టీ.టీ.డీ వాళ్ళు ఏర్పాటు చేసేరని మీరు విన్నారా? లేదంటే అంటురోగాలు ప్రబలిన గిరిజన ఊళ్ళో మందులు ఉచితంగా పంచివ్వటం చూశారా?

"అజ్ఞాత భక్తుడు మూడు కోట్ల విలువైన వస్తువు సమర్పించాడు.."

"అజ్ఞాత భక్తుడు ఆరుకోట్ల విలువైన వజ్రాలు స్వామి వారికి ఇచ్చారు.."

"తిరుపతి హుండీలో వెయ్యినోట్ల కట్టలు భారీగా కనుగొన్న ఆలయ నిర్వాహకులు.."

ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే/చూస్తూనే ఉంటాం. అంత పెద్ద పెద్ద మొత్తం వేసిన వారు పేరు ఎందుకు గోప్యంగా ఉంచుతారనేది పక్కన పెడితే అంతలా అభివృద్ది చెందిన దేవాలయానికి కోట్లు కోట్లు కుమ్మరించే బదులు వారి వారి ఊళ్ళకు ఏదైనా చెయ్యొచ్చు కదా అని అనిపించకమానదు. గతంలో ఓ సారి ఈనాడులో ఓ భక్తుడు తిరుపతి హుండీలో కోటి రూపాయలు వేశాడు అని వార్త పడింది. మరుసటి రోజే ఓ నిరుపేద గ్రామీణ అమ్మాయి ఆ అజ్ఞాత భక్తుడకు లేఖ రాసి ఈనాడుకు పంపించింది. దాన్ని ఈనాడులో మరుసటి రోజు ప్రచురించారు కూడా. ఆ లేఖలో ఆ అమ్మాయి 'అన్నికోట్లు దేవుని హుండీలో వేసే బదులు నాలాంటి కూలి చేసుకుని చదువంటే ఆసక్తి ఉన్నా చదవలేని వారికి కాసింత ఆర్ధికపరమైన అండ ఇచ్చి చదివించొచ్చు కదా' అని అడిగింది. ఆ అమ్మాయి కోరిక సబబైనదే. కాదంటారా?

ఓ కోటి రూపాయల్తో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎప్పుడూ బురదగా ఉండే రోడ్లు ను బాగు చేసి సిమెంట్ రోడ్డు వెయ్యిచ్చు. మంచి నీళ్ళకోసం కిలో మీటర్లు కాలినడకన వెళ్ళే ప్రాంతల్లో సురక్షిత నీరు ట్యాంకులు కట్టించి అందించవచ్చు. ఓ ప్రభుత్వ స్కూలుకు మంచి లైబ్రరీ సమకూర్చవచ్చు..భర్త పీడిత మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చెయ్యొచ్చు.. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. మనసుంటే మార్గాలెన్నెన్నో.. పైగా దేవుని హుండీలో వేస్తే వచ్చే తృప్తి కంటే వేల రెట్లు తృప్తి మన సొంతం అవుతుందంటే అతిశయోక్తికాదేమో! మనం చేసే పనిని దైవం తప్పక హర్షిస్తుంది.

కాబట్టి అజ్ఞాతలు కాస్త ఆలోచించండి. కోట్ల రూపాయలు వెచ్చించి దేవుడిని సంతోషపెడతారా లేక ఆ డబ్బుని మీ గ్రామ అభివృద్దికి గానీ, నిరుపేద వ్యక్తుల అభివృద్దికి గానీ వాడతారా? మీ ఎంపిక మొదటిదే అయితే మీరు చేస్తున్న పనికి ఏ దేవుడు ఎంతమాత్రం సంతోషపడడు. ఆయనను సంతోషపర్చాను అన్న భ్రమే మీకు మిగులుతుంది. మీ భక్తికి పెద్ద పెద్ద కానుకలు కొలమానంగా ఎప్పటికీ నిలవవు.

నాకు అనిపించిదేమిటంటే ఇకపై ఎప్పుడైనా వెంకన్నను గానీ మరే దేవుడిని గానీ మొక్కుకోవలసి వచ్చినప్పుడు నావంతుగా ఓ వెయ్యిరూపాయలు నీతరపున వేరే వాళ్ళకి అని మొక్కుకుంటాను...కోరిక తీరిన వెంటనే ఆ డబ్బును ఏదైనా అనాధ ఆశ్రమం వారికి పళ్ళు, స్వీట్లు పంచడమో, వచ్చినన్ని వంటసామాను కొనివ్వటమో లాంటివి చేస్తాను. అంతేగానీ హుండీలో మాత్రం వెయ్యకూడదనుకుంటున్నాను.

16, అక్టోబర్ 2009, శుక్రవారం

చీకటి వెలుగుల రంగేళి...మా ఊళ్ళో దీపావళికి ఓ నెల రోజుల ముందునుండే వీదిలో ఉండే షాపుల్లో రంగు రంగుల, రకరకాల గన్ లు అమ్మేవారు. రోజూ స్కూలుకి వెళుతూ ఆ గన్ ల వైపు ఆశగా చూడటం...ఎప్పుడు నాన్న అవి కొంటారో అని ఓ నిట్టూర్పు విడిచి మళ్ళీ స్కూలువైపుకి అడుగులు పడటం...ఇలా నాన్న గన్ కొనేంత వరకు ఎదురుచూపులు తప్పేవి కావు నాకు. అయితే అమ్మ మాత్రం దీపావళి చాలా రోజులు ఉందనగా గన్ కొననిచ్చేది కాదు...ఎందుకు ఇంత తొందరగా కొనేయటం..మద్యాహ్నాలు పడుకోకుండా ఢాం..ఢాం అంటూ గన్ లు పేల్చుకుంటూ టాపులేపేస్తారు పిల్లలందరూ కలసి అని నాన్నతో అనేది.

అయితే మా కాలనీలో పిల్లలందరూ అప్పటికే కొనుక్కుని పోటా పోటీగా గన్ లో కేపులు పెట్టి కాల్చేవారు. ఒక్కొక్కడు చేతిలో ఉన్న గన్ లతో హీరోల్లాగా ఫీలయిపోయేవారు. అందరు ఇళ్ళల్లోనూ లో క్వాలిటీ అంతగా ఉండని, నల్లరంగు వేసి ఉన్న గన్ మాత్రమే కొని పేట్టేవారు. దీని ధర మూడు రూపాయలే ఉన్నందున ఎవరింట్లోనూ ఆరు రూపాయల ధరతో టిప్ టాప్ గా కనిపించి మెరిసే బాడీ ఉన్న స్టీలుగన్ కొనేవారు కాదు. పిల్లలందరిలో ఎవరి దగ్గరైతే ఆ స్టీలు గన్ ఉంటుందో వాడు 'దొంగా పోలీస్' ఆటలో ఎప్పుడూ పోలిసే అన్నమాట. నాసిరకం నల్ల రంగు గన్ లు ఉన్నోళ్ళకు ఎప్పుడోగానీ పోలీస్ అయ్యే చాన్స్ వచ్చేదికాదు.

అయితే గన్ లు కొనుక్కోవటం ఒక ఎత్తైతే దానిలో కాల్చడానికి పెట్టే కేపులు కొనుక్కోవటం ఇంకో ఎత్తు. నేనైతే అమ్మ దగ్గర నుండి ఓ పావలా రాబెట్టడానికి చాలా కష్టపడాల్సివచ్చేది. తీరా అమ్మ పావలా ఇచ్చే టైంకి నా స్నేహితులందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇచ్చే పావలాతో అప్పటికే కేపులు కొనేసుకుని ఎగా దిగా, పోటా పోటీగా కాల్చేసి, కేపుల డబ్బా అయిపోయిన వెంటనే ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, బోరుకొట్టేసి ఏ ఇసకలోకో ఆడటానికి పోయేవారు. మరి నేను ఒక్కడినే గన్ కాలిస్తే మజా ఏమి ఉంటుంది..అందుకని తర్వాత రోజుకి కేపులు ఉంచుకుని ఆడుకోవడానికి నేను ఆ మట్టి దగ్గరకే పోయేవాడిని.

కేపులు రెండు రకాలుగా దొరికేవి. బొట్టుబిళ్ళంత సైజులో విడి విడిగా ఉండి ఓ గుండ్రటి చిన్న డబ్బాలో వాటిని పేక్ చేసి అమ్మేవారు. అందులో సగం పైగా కేపులకి మందు ఉండేది కాదు. రెండో రకం కేపులు రీలు మాదిరి ఉండేవి. ఇవి కొంచెం ఖరీదైనవి. మామూలు కేపులు పావలాకి ఒక డబ్బా వస్తే రీలు టైపు కేపులు ముప్పావలా ఖరీదు ఉండేవి. రీలు కేపులు ఒక్కసారి గన్ లో లోడ్ చేస్తే ఢాం..ఢాం అని కంటిన్యూస్ గా కాల్చవచ్చు. తొందరగా అయిపోతాయి కూడా...వాటితో మేము ఊహించుకుంటున్న హీరోయిజం వచ్చేది. అయితే అందరిళ్ళల్లోనూ పావలానే మొహాన కొట్టేవాళ్ళు. గుండ్రటి కేపులు విడి విడిగా ఉండి ఒకటి తర్వాత ఒకటి గన్ లో పెట్టుకుని కాల్చుకోవటం వల్ల ఎక్కువ టైం పట్టి ఆరోజు గడిచిపోయేది. మళ్ళీ మళ్ళీ పావలా అని అదే రోజు ఇంట్లో వాళ్ళని పీక్కుతినే అవకాశం ఉండేది కాదు.

గన్ లు కొద్ది రోజులకే పాడయ్యేవి...పాడయ్యేవి అనేకంటే మేము దాన్ని అదే పనిగా కాల్చటంతో దీపావళి రాకముందే హరీ అనేవి...అప్పుడు మాత్రం మేము తగ్గుతామా....ఒక నట్టు, బోల్టు తీసుకుని నట్టు మీద గుండ్రటి కేపు పెట్టి దాని మీద బోల్టు బిగించి పై నుండి వదిలితే అది ఢాం..అంటూ పేలేది. ఈ ప్రాసెస్ గన్ తో పోలిస్తే కొంచేం ఈజీ...గన్ లు బాగా ఉన్న పిల్లకాయలు కూడా ఈ పద్దతికి వచ్చేసేవారు...ఇక చూడండి..పెద్దవాళ్ళ గుండెల్లో రైల్లు పరిగెత్తేవి...ఏ స్కూటర్కో లేక సైకిల్ కో ఉన్న నట్లు..బోల్టులు తీసేస్తామేమో అని....పిల్లకాయల కళ్ళు ఎక్కడ నట్టు దొరుకుతుందా అని వెతికేవి.

కాస్త ఎదిగి నిక్కర్లు వేసుకునే వయసు నుండి ప్యాంట్ వేసుకునే వయసు వచ్చేసరికి మందు కొనుక్కుని మేమే చిచ్చుబుడ్లు, మతాబులు తయారు చేసుకునేవాళ్ళం..అందుకే దీపావళికి కొన్ని రోజులు ముందు ఆ హడావిడి ఉండేది. అప్పటికి చెడ్డీలేసుకున్న కుర్రోళ్ళందరూ గన్ లు కాల్చుకుంటూ మాకు వారసులుగా తయారు అయ్యేవారు. అప్పుడు చూడాలి...మేము వాళ్ళు మా ముందు గన్ లు కాలిస్తే వాళ్ళ చేతిలోని గన్ లు లాగేసుకుని ఏడిపించేవాళ్ళం. ఏరా..ఇంకోసారి మనుషులకి దగ్గరగా కాలుస్తారా అని వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాళ్ళం. వాళ్ళు కాస్త భయపడి దూరంగా వెళ్ళి కాల్చుకునేవారు. మేము మాత్రం అప్పుడే వస్తున్న మీసాలను మెలేసుకుని చిన్నపిల్లలకు భయపేట్టేమంటే మనం పెద్దవాళ్ళం అయిపోయినట్టేరా అని అనుకునేవాళ్ళం. రాత్రి వెలిగించే చిచ్చుబుడ్లు తయారు చేసుకున్నవి కావటంతో చాలా సేపు వెలిగేవి. అవి అంతసేపు కాలటం చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తే గొప్పగా అనిపించేది. ఇలా పదో తరగతి దాకా ప్రతీ దీపావళికి చిన్న చిన్నవిగా అనిపించే గొప్ప ఆనందాలు మా సొంతం.

కాలేజీకి వెళ్ళే వయసులో మా దీపావళి ఆనందాలను వీక్లీ ఎగ్జామ్స్, ఎంసెట్టు హరించేసేది. ఆ తర్వాత ఇంజనీరింగ్..మా దురదృష్టమో ఏమో గానీ మా సెమిష్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడూ దీపావళి టైంలోనే పడేవి. ప్రపంచం అంతా కాలుస్తుంటే బుక్కు ముందేసుకుని చదువుతున్నప్పుడు నాలో ఒక అపరిచితుడు బయటకు వచ్చేవాడు... డిగ్రీ అయ్యాక ఉద్యోగాలు వెంటనే రాకపోవటం...అది కలిగించే అభద్రత..ఇంకెవడికో మనకంటే ముందే వచ్చేసిందన్న భాద..వెరసి ఇవన్నీ బోల్డంత ఫ్రీ టైం ఉన్నప్పటికీ దీపావళి వచ్చినా ఎంజాయ్ చెయ్యాలన్న మనసు ఉండేది కాదు... ఆ తర్వాత ఇంక చెప్పేదేముంది? ఉద్యోగాలు రావటం...మన పక్కింటోడు ఏం చేస్తాడో కూడా తెలుసుకోలేని బిజీ జీవితాలు...ఇంటికి దూరంగా ఉండటం వల్ల దీపావళి అనే ఒక పండగ వచ్చి పోయింది అని అనుకునే వరకే ఉండేది పండగ సంబరం...పండగ పూట కూడా ఆఫీసుల్లో పని చేయటాలు లాంటివి దీనికి అదనం...

అందుకే అన్నారు ఓ పెద్దాయన....చీకటి వెలుగుల రంగేళి....జీవితమే ఒక దీపావళి...

బ్లాగ్మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు