13, ఫిబ్రవరి 2010, శనివారం

నేను నా కార్టూన్ సీరియల్స్....

తొమ్మిదేళ్ళ వయసప్పుడు కార్టూన్ సీరియల్లు వస్తున్నాయంటే మేము తప్పకుండా చూసి తీరాల్సిందే! ఇప్పటిలా బోల్డన్ని చానల్లు లేనందువల్ల దూరదర్శన్(నేషనల్) వాడు ఒక్క ఆదివారం మాత్రమే ఇచ్చే మోగ్లీ 'Jungle Book', అంకుల్ స్క్రూచ్ ఉండే 'Duck Tales', 'Ales in Wonderland' మొదలైన కార్టూన్లు రెప్పార్పకుండా చూసేవాళ్ళం. ఒక్క చూడ్డమే కాదండోయ్ 'జంగల్ జంగల్ బాత్ చలీహై పతా చలాహై...అరె చడ్డీ పెహన్ కె ఫూల్ కిలాహై..ఫూల్ కిలాహై...' అంటూ పాడుకుంటూ జారిపోతున్న చెడ్డీని ఎత్తుకుంటూ మోగ్లీగాడి boomrang లా వీ షేప్ లో ఉన్న కర్ర ముక్కతో అచ్చం వాడిలాగే పరిగెత్తిన సందర్భాలు కోకొల్లలు. కాస్త చిన్న పిల్లలు చెడ్డీకూడా వేసుకోకుండా మమ్మల్ని ఫాలో అయిపోయేవారు. అయితే ఈ కార్టూన్లన్నీ ఇంగ్లీష్ లోనో, హిందీలోనో వచ్చేవి. చిన్న ఊళ్ళల్లో దుంపలబడి చదువులు వెలగబెడుతున్న వాళ్ళకు అవి ఎంత అర్ధం అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.అయినా సరే కార్టూన్ కారెక్టర్ల కదలికలు బట్టి అక్కడ ఏం జరుగుతుందో అలవోకగా పట్టేసి అర్ధం చేసుకునేవాళ్ళం. ఒకవేళ అర్ధం కాకపోతే సొంతంగా కధ అల్లుకునో, ట్రాజెడీ సీన్ వస్తున్నప్పుడు పకపకా నవ్వేసో ఫాలో అయిపోయేవాళ్ళం. ఓ సారి దూరదర్శన్(hyd) వాడికి పందుల కార్యక్రమం ప్రసారం చేయటంలో ఎక్కువ శ్రద్ద పెట్టడంతో సడన్ గా మెదడువాపు వ్యాధి వచ్చింది. దాని ఫలితంగా జంగిల్ బుక్ తెలుగులో ప్రసారం చేయాలన్న కోరిక కలిగింది. అప్పటి వరకూ దూరదర్శన్ అంటే బ్లాక్ అండ్ వైట్ పాటలు, మొహానికి సున్నం పూసుకుని తలపై పిచిగ్గూడు మెయింటెయిన్ చేసే యాంకర్లు(eg: రోజా రమణి ఆంటీ, విజయ దుర్గ ఆంటీ), చీనీ నిమ్మతోటలు అని అనుకుంటుండే మాకు జంగిల్ బుక్ కార్టూన్ తెలుగులో చూసే సరికి దూరదర్శన్ వాడికి ఓ కర్పూరం వెలిగించి పూజించాలన్నంత ఆనందం కలిగింది.

చెడ్డీ వేసుకునే రోజులనుండి ప్యాంట్ వేసుకునే రోజులు వచ్చాయి. అప్పుడు కార్టూన్లకు బ్రహ్మరధం పట్టిన రోజులు పోయి స్టార్ మూవీస్ చూసే రోజులు మొదలయ్యాయి. ఆ టైంలో పెద్దగా ఫాలో అయిన కార్టూన్లు కూడా లేవు. కొద్ది రోజులు మాత్రం పుస్తకాల అట్టలపై మాత్రం కార్టూన్ కారెక్టర్ల లేబుళ్ళు అతికించేవాళ్ళం. ఓ సారి ఎంసెట్ ఎగ్జామ్ రాయటం కోసం మా అమ్మమ్మ వాళ్ళూరు వెళ్ళినప్పుడు 'బాబోయ్ డెన్నిస్' అనే కార్టూన్ చూస్తుంటే "ఇంకా చిన్న పిల్లడివి అనుకుంటున్నావా" అంటూ నా మనోభావాలు ఆవిడ గాయపరిచేసరికి కార్టూన్ ఫిల్ములు చూడటం చిన్నతనం కాబోలు అనుకుని ఎప్పటికీ వాటిని చూడకూడదనుకున్నాను. కార్టూన్లు చూడటంలో నేను మళ్ళీ నా పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటానని అప్పుడు నాకు తెలీదు.

అసలు కార్టూన్ ఫిల్మ్ వస్తుంటే టీ.వీకి అతుక్కుని చూడని పిల్లలు చాలా అరుదుగా ఉంటారు. అయితే పిల్లలతో పాటు పెద్దలు కూడా చూస్తూ ఆనందిస్తూ టీ.వికి అతుక్కునేలా చేసే ఒక కార్టూన్ ప్రోగ్రాం ఉందని ఓ సంవత్సరం క్రిందట తెలిసింది. అదే టామ్ అండ్ జెర్రీ. ఈ కార్టూన్ ఒకటుందని నాకు ఇదివరకే తెలిసినా కుటుంబ సమేతంగా చూసుకోదగ్గది అన్న విషయం కొంచెం లేటుగా తెలిసింది. ఒక చిన్న ఎలక మరియు పిల్లి మధ్య జరిగే గొడవలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లు, అల్లర్లు...ఇలా కొన్ని అంశాలను తీసుకుని వాటి మధ్య ఓ చిన్న చిన్న స్టోరీలను అల్లి తయారు చేసిన బుల్లి బుల్లి కార్టూన్ ఫిల్మ్స్.

ఓ సారి మాటల మద్యలో నా కొలీగ్ Tom n Jerry కార్టూన్ ఇప్పటికీ చూస్తానని చెప్పినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా చూడాలనిపించినా ఎవరైనా మా అమ్మమ్మలాగ అంటారేమోనని భయం నాకు. అలాంటిది వాడికి ఎవరూ ఏమీ అనరా అని ఆశ్చర్యం అన్నమాట. ఆ తర్వాత నా ఫ్లాష్ బాక్ ఒక్కసారి గుర్తొచ్చి Tom n Jerry కొన్ని ఎపిసోడ్లు డౌన్లోడ్ చేసుకుని చూసాను. ఎందుకో తెలీదు నేను ఈ కార్టూన్ని చిన్నప్పుడు చూడటం మిస్సయాను. బహుశా ఇంట్లో టీ.వీ ఎప్పుడు పడితే అప్పుడు చూసే వీలులేనందువల్ల కావచ్చు. ఇప్పుడు నేను ఆ కార్టూన్ అంటే పడిచచ్చేటైపు. మా ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ టైంలో టీ.వీ చానల్ మార్చుతున్నప్పుడు Tom n Jerry గానీ కార్టూన్ నెట్ వర్క్ చానల్లో వస్తే ఇంక దాన్నే ఉంచేసి ధైర్యంగా చూసేస్తాను. ఆ టైంలో నాతోపాటు ఇంచుమించు అక్కడున్న ప్రతీఒక్కరూ దాన్ని చూడటానికి ఇష్టపడేవారే.

టామ్ మరియు జెర్రీ ఇద్దరూ స్నేహితులే. కాకపోతే టామ్ చేసే ప్రతీ పనికి అడ్డం తగులుతూ దానికి కోపం తెప్పించి తనతో పోట్లాట పెట్టుకునేలా చేస్తుంది జెర్రీ..అదే విధంగా జెర్రీ విషయంలో కూడా టామ్ ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇంకేం ఇద్దరూ కొట్టుకునే సన్నివేశాలు క్రియేట్ అయ్యి మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఒక్క కొట్లాటలే కాదు...అవి చేసే తిక్క పనులు, తింగరి వేషాలు చూస్తే ఎవ్వరైనా నవ్వితీరాల్సిందే.

రెండు ప్రధాన కారెక్టర్లతో మాటలు వీలయినంత తక్కువగా పెట్టి చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా అర్ధమైయ్యేలా చూపటం ఈ కార్టూన్ ఫిల్మ్ ప్రత్యేకత. ఒకళ్ళు చెప్పేకంటే చూస్తేనే దీని మజా తెలుస్తుంది. ఇప్పటికే దీన్ని చూసినవాళ్ళకు ఆ విషయం తెలిసే ఉంటుంది.

ఈ వయసులో కార్టూన్ ఫిల్మ్ ఏం చూస్తాం అని అనుకోకండి. కూసింత పెద్దరికాన్ని గోద్రేజ్ బీరువాలో పెట్టేసి, ప్రస్తుతం మనం పెద్దవాళ్ళం అన్న విషయాన్ని మర్చిపోయి, పిల్లలుంటే వాళ్ళతో కలిసి ఎప్పుడైనా సరదాగా టామ్ అండ్ జెర్రీ చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది.


34 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

ఏ వయసైనా కార్టూన్లు కార్టూన్లే... నేను ఇప్పటికీ చూస్తాను. వొడాఫోన్ ఆడ్స్ కూడా నాకిష్టమే. రోజుకొక్కసారన్నా కార్టూన్ నెట్ వర్క్ చూడాల్సిందే. మీరు చాలా మంచి కార్టూన్స్ చూపించారు. థాంక్యూ.

Padmarpita చెప్పారు...

Tom & Jerry is my all time favorite.

సుజాత వేల్పూరి చెప్పారు...

ఆ మోగ్లీ పాట ఇంకా చెవుల్లో మారు మోగుతోంది శేఖర్! అంతేనా, షేర్ ఖాన్ చచ్చిపోయినపుడు ఏడ్చిన వాళ్లలో నేనూ ఉన్నా! ఆ తర్వాతెప్పుడో తెల్సింది షేర్ ఖాన్ కి నానాపటేకర్ డబ్బింగ్ చెప్పాడని!

కానీ ఎప్పటికీ, నా ఫేవరెట్ షో మాత్రం టామ్ అండ్ జెర్రీనే! ఎవర్ గ్రీన్! ఎవర్ గ్రీన్!వూడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్ లాగా మా అమ్మకి, తర్వాత నాకు, ఇప్పుడు మా పాపకి కూడా అదే ఫేవరెట్!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@జయ గారు,
మీరు కూడా కార్టూన్స్ చూస్తారా! బాగుంది. థాంక్యూ...

@పద్మ గారు,
అందరి ఆల్ టైం ఫేఫరేట్ అదే అయుంటుందండీ...దానితో సరితూగేది ఇంకో దశాబ్దం తర్వాత కూడా ఏదీ రాదేమో!
థాంక్యూ..

@సుజాత గారు,
షేర్ఖాన్ కి నానాపటేకర్ డబ్బింగా..గొప్ప గంభీరంగా ఉంటుంది వాయిస్...నేనైతే అయ్యో జంగిల్ బుక్ అప్పుడే అయిపోయిందే అని చాలా రోజులు భాద పడ్డాను.
అసలు టాం అండ్ జెర్రీ మీ పాప తర్వాత జనరేషన్ వాళ్ళని కూడా మెప్పిస్తుందని నా నమ్మకం.
థాంక్యూ..

మురళి చెప్పారు...

నిజమేనండీ కార్టూన్ చూడ్డానికి వయసు ఏమాత్రం అడ్డం కాదు.. నా వోటు కూడా మీకే.. కొంచం పెద్ద మనసు చేసుకుని మీ అమ్మమ్మగారిని క్షమించేయండి.. :):)

నేస్తం చెప్పారు...

అసలు కార్టూన్స్ గురించి నన్ను అడగండి..నెను చెప్తా.. pingu,dora the explorer,little bear,finding nemo,danny and daddy ,oswald,mr.bean, ఈ లిస్ట్ కి ఇంక అంతులేదు.. Finding Nemo కార్టున్ మూవి ఒక్కసారి చూడు శేకర్ చాలా బాగుంటుంది.. :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మురళి గారు,
అమ్మమ్మే కాదు..అలాంటి వారు ఎన్ని అన్నా చక్కగా చూసుకునే ధైర్యం ఇప్పుడు వచ్చేసింది. సో నో ప్రోబ్లం...
థాంక్యూ..

@నేస్తం గారు,
అయ్య బాబోయ్ మీ లిస్ట్ చాలా పెద్దదే...Finding Nemo ఇప్పటికీ ఇంగ్లీష్ లో ఓ మూడు సార్లు, తెలుగులో ఓ రెండు సార్లు చూశానండి. అంత గొప్ప కార్టూన్ సినిమా...అదంటే నాకు పిచ్చ పిచ్చగా ఇష్టం..దాని మీద రివ్యూ కూడా రాసి నా బ్లాగు డ్రాఫ్ట్ లో పెట్టుకున్నాను. మీరందరూ కార్టూన్స్ ఇష్టం అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
థాంక్యూ...

anagha చెప్పారు...

మా అమ్మాయి ఎక్కువుగా కార్టూన్ నెట్ వర్క్ పెట్టేది ,నాకేం న్యూస్ చానల్స్ చూడడం ఇష్టం .తను చుసినంతాసేపు చానల్ మార్చనిచ్చేది కాదు,నాకేమో బోర్ .ఒకరోజు తనతోపాటు యాదాలాపంగా చూడటం మొదలు పెట్టెను,చాల నచ్చాయి , అప్పట్నించి నేను చూస్తుంటాను టం &జెర్రీ నాకు ఇష్టం .అవి చూస్తుంటే మనసు ప్రశాంతంగా,హాపీగ ఉంటుంది . జయ గారు చెప్పినట్టు వొడఫోన్ అద్స్ అంటే నాకు చాల ఇష్టం ,ఎక్కడ ఉన్న టీవీ దగ్గరువచ్చేస్తా .

రాధిక(నాని ) చెప్పారు...

మా పిల్లలను అస్తమానూ కార్టూన్ చానల్ చూస్తూంటారు అంటాను.కాని టాం అండ్ జెర్రీ,పింక్ పాంతర్,ఇంటువంటివి వస్తే మాత్రం నేను కూడా వాళ్లతోపాటూ చూసేస్తాను. చిన్నప్పుడు ప్రతీ ఆదివారం దూరదర్శన్ లో వస్తే మిస్సవకుండా చూసేదానిని.అసలు టాం అండ్ జెర్రీ లాంటివి కాసేపైనా చూస్తే మన సమస్యలు కొద్దిగా ఐనా మరచిపోయి హాయిగా మనస్పూర్తిగా నవ్వుకోవచ్చు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@అనఘ గారు,
అవునండీ...టాం అండ్ జెర్రీ చూస్తుంటే ఆ కాసేపు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేసేస్తుంటాం..అదే ఆ కార్టూన్ ప్రత్యేకత...మీ పాప మూలన ఓ మంచి కార్టూన్ ని చూడగలుగుతున్నారన్నమాట...
థాంక్యూ..

@రాధిక గారు,
చాలా కరెక్ట్ గా చెప్పారు...టాం అండ్ జెర్రీ చూసిన ఆ కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు...మీకు వీలైతే finding nemo కూడా చూడండి...అది కూడా పెద్దవాళ్ళు తప్పకుండా చూడాల్సిన కార్టూన్...
థాంక్యూ..

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఆ జంగిల్ బుక్ వీడియో నా ఆర్కుట్ ఫేవరిట్ వీడియోలలో ఉంటుందండీ. టాం & జెర్రీ కార్టూన్ ఫిలిం వస్తుంటే నేను వయసు గురించి అస్సలు ఆలోచించను. నా మనవల్తో కూడా కలిసి కూర్చుని చూస్తానేమో :-) బాగుంది టపా.

Hima bindu చెప్పారు...

"ఒకవేళ అర్ధం కాకపోతే ,సొంతంగా కథ అల్లుకునో ,ట్రాజాడీ సీన్ వచ్చినప్పుడు పకపక నవ్వేసో ఫాలో అయిపోయే వాళ్ళం " నవ్వలేక చచ్చాను .చాల బాగా రాస్తారు .నేను ఎప్పుడయినా మా పాప చూస్తుంటే చూస్తాను .హ్యాపీ ఫీట్ ,ఆల్విన్ అండ్ చిప్మున్క్స్ నాకిష్టం .కార్టూన్ నెట్వర్క్ పిల్లలు చూస్తుంటే నా కళ్ళుకూడా అప్పగిస్తాను. పోస్ట్ చాల బాగుంది ఆహ్లాదంగా .

నిషిగంధ చెప్పారు...

"..జంగిల్ బుక్ కార్టూన్ తెలుగులో చూసే సరికి దూరదర్శన్ వాడికి ఓ కర్పూరం వెలిగించి పూజించాలన్నంత ఆనందం కలిగింది."
:)))

జయ గారి మాటే నాది కూడా! "ఏ వయసైనా కార్టూన్లు కార్టూన్లే!"

Tom & Jerry మన మాయాబజార్ లాంటిది.. ఎన్నిసార్లు చూసినా బావుంటుంది.. మీకు వీలైతే Iceage series and Madagascar series కూడా చూడండి..

మాలా కుమార్ చెప్పారు...

ఆ రోజులలో మా ఆబ్బాయి తో కలిసి , మోగ్లీ చూసి వాడి జంగల్ జంగల్ పాటలో నేనూ ఎంజాయ్ చేసాను . ఇప్పుడు , మనవడి తో , టాం అండ్ జెర్రీ , పవర్ రేంజే , బెన్ టెన్ అన్నీ చూస్తాను .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@వేణూ గారు,
:)
ఆ జంగిల్ బుక్ టైటిల్ సాంగ్ భలేఉంటుందండి...నాకూ చాలా ఇష్టం అది..
థాంక్యూ..

@చిన్ని గారు,
:)
ఓ మీరు కూడా మీ పాపతో కలిసి చూస్తారా...గ్రేట్..మీ అందరి కమెంట్లని మా అమ్మమ్మలాంటి వారికి చూపించి కళ్ళు తెరిపించాలని ఉంది నాకు...:-)
థాంక్యూ..

@నిషిగంధ గారు,
కరెక్ట్ గా చెప్పారు...T&J మయాబజారంత ఆహ్లాదకరమైంది..అయిస్ ఏజ్ సిరీస్ నేను చూశానండీ..మడగాస్కర్ సిరీస్ చూడాల్సిఉంది.
థాంక్యూ..

@మాలా కుమార్ గారు,
మీ మనవళ్ళతో కలిసి చూస్తారా...గ్రేట్..లాభం లేదు మా అమ్మమ్మని మీదగ్గరకు ఓ సారి తీసుకునిరావల్సిందేనండీ..:)
థాంక్యూ..

మధురవాణి చెప్పారు...

నేను జంగిల్ బుక్ చూళ్ళేదు కానీ... ఇప్పుడు పెద్దయ్యాక టాం అండ్ జెర్రీ కి పెద్ద ఫ్యాన్ ని అయ్యాను మీలాగే :)
మీరు చెప్పిన బాబోయ్ డెన్నిస్ నేను కూడా కొన్నిసార్లు చూసాను. అది కూడా బాగుంటుంది కదా ;-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మధురవాణి గారు,
'బాబోయ్ డెన్నీస్' కూడా భలే ఫన్నీగా ఉంటుందండి...డెన్నీస్ గాడు చేసే పనులు సరదాగా ఉంటాయి..మీరు కూడా T&J కి ఫేన్ అన్నమాట...:-)
థాంక్యూ..

తృష్ణ చెప్పారు...

జంగిల్ బుక్...భలే గుర్తు చేసారండీ...అప్పట్లో దూరదర్షన్లో వచ్చే ప్రతీదీ చూసేసేవాళ్ళం."జంగిల్ బుక్" సినిమా కూడా వచ్చింది. అప్పట్లో గోల్డ్ స్పాట్ కంపెనీ వారు మూతల వెనల్క్కాల జంగిల్ బుక్ సినిమాలోని ఒకో కేరక్తర్ బొమ్మలు ఇచ్చి అవి ఎన్ని కలక్ట్ చేస్తే ఏ ఏ బహుమతులు వస్తాయో ప్రకటన ఇచ్చెవారు.మేము చాలానే కలక్ట్ చేసాం.కొన్ని గిఫ్టులు కూడా కొట్టాం.

ఇక కార్టూన్ సినిమాలు అయితే ఇప్పటికీ మా ఫేవొరెట్లే. "టాం అంద్ జెర్రి" "చిప్ అండ్ డేల్" కొన్ని కార్టూన్లు నా బ్లాగ్లొ పెట్టాను కూడా. ఈ రెండూ నాకూ మా పాపకూ ఫేవొరెట్ కార్టూన్స్. చిప్ అండ్ డేల్ కార్టూన్స్ యూ ట్యూబ్ లో చాలా దొరుకుతాయి డౌన్లోడ్ చేసుకుని చూడండి వీలుంటే.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@తృష్ణ గారు,
'జంగిల్ బుక్' సినిమాలోని యానిమేషన్, కార్టూన్లో ఉన్నంత హత్తుకునేటట్టు ఉండవండి. సినిమా చూశాను.
అవునండి..అప్పట్లో దూరదర్శన్ లో అర్ధంకాని ప్రోగ్రాంలైనా కళ్ళప్పగించి చూసేసే వాడ్ని. చిప్ అండ్ డేల్ ఎప్పుడూ చూడలేదండి..యూ ట్యూబ్లో చూడాలి. ఆరోగ్యం బాలేకున్నా ఓపిక చేసుకుని మీ స్పందన తెలిపినందుకు థాంక్యూ సో మచ్..

మాలా కుమార్ చెప్పారు...

మీరెంత బాగా నన్ను , మా మనవడిని అర్ధం చేసుకొని మెచ్చుకున్నారా ? చూడండి , మావారు , మా అబ్బాయి , మమ్మలిని తిట్టి ఓ వారం టి .వి కట్ ఇచ్చారు ! వాళ్ళిద్దరిని మీ అమ్మమ్మ గారి పార్టీ లో చేర్చండి .

పరిమళం చెప్పారు...

శేఖర్ గారు , చాలా లేట్ గా చూశా మీటపా !మా ఇంట్లో రిమోట్ లో 1 పెట్టగానే వచ్చేది కార్టూన్ నెట్ వర్కే !అదీ టాం అండ్ జెర్రీ కోసమే ..ఎంతమంది ఎదిపించినా చూడటం మానను ....అంటే కాదు నువ్వు టాం అంటే నువ్వే టాం అని నేను నా ఫ్రెండూ ఎప్పుడూ కొట్టుకుంటాం :) :) నేనేనేమో అనుకున్నా నాతోపాటూ మీరందరూ ఉన్నారన్న మాట :) :)

పరిమళం చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మాలా కుమార్ గారు,
ఎంత పని జరిగింది...టీ.వీ చూడొద్దంటారా...మనలో మన మాట..వాళ్ళకి జెలసీ అండీ..మీరు ఎంచక్కా చిన్న పిల్లలో సులభంగా ఒకరై చూసేస్తున్నారని..మరే అందరూ అలా ఉండలేరు...అలా ఉండలేని వాళ్ళకు మన ఆనందం చూసి బోల్డంత జెలసీ పుట్టేస్తుందన్నమాట మా అమ్మమ్మకు లాగ...:-) టాం అండ్ జెర్రీలో బోల్డన్ని ట్రిక్కులు ఉంటాయి కదండీ..అందులో మచ్చుకు కొన్ని వాళ్ళమీద ప్రయోగించండి. :-)
థాంక్యూ..

@పరిమళం గారు,
మీరు కూడా T&J అభిమాని అన్నమాట...హా..హ..మీ ఫ్రెండుతో పోట్లాడతారా...నేను అప్పుడప్పుడు నా హావభావాల్లో టాం గాడిని ఇమిటేట్ చేస్తుంటాను..వాడంటే నాకు అంత ఇష్టం..ఎంతమంది ఏడిపించినా అస్సలు చూడటం మానొద్దండీ మీరు...అవసరమైతే T&J అభిమానులమందరం కలిసికట్టుగా అలాంటి వారి పని పడదాం..:-)
థాంక్యూ..

చదువరి చెప్పారు...

"రోజా రమణి ఆంటీ, విజయ దుర్గ ఆంటీ" - హా..హా..హా!

టామ్ అండ్ జెర్రీని మించిన కామిక్కు ఇంకోటి లేదు. ఓ వెయ్యి కామిక్కులు చూసినవాడైనా ఆ మాట చెబుతాడు. అది తప్ప మరో కామిక్కు మొహం ఎరగనివాడు కూడా ఆ మాటే చెబుతాడు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@చదువరి గారు,
కరెక్ట్ గా చెప్పారు..అవునండీ...టాం అండ్ జెర్రీకి మించిన కార్టూన్ ఇప్పటివరకూ రాలేదంటే అతిశయోక్తికాదేమో! పెద్దవాళ్ళ మనసులను కూడా గెలుచుకున్న అతికొద్ది కార్టూన్లలో T&J కూడా ఒకటి.
థాంక్యూ..

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

టపా అదుర్స్ శేఖర్ గారూ. ప్రతీ చెణుకూ ఒక పంచదారగుళిక,ఆనందరసమయం.
నా డిజిటల్ లైబ్రరీలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవి ఒకటి "టాం అండ్ జెర్ర్రి" రెండోది "మాయాబజార్" సినిమా.

రాధిక చెప్పారు...

జంగిల్ బుక్ చిన్నప్పుడు నచ్చేది.కానీ ఇప్పుడు కాదు.టాం అండ్ జెర్రీ చాలా సార్లు నవ్వొస్తుంది గానీ అంతకన్నా ఎక్కువగా భయం వేస్తుంది.అది చూసీ చూసీ వైల్డ్ గా అయిపోతారేమో పిల్లలు అని.ఐస్ ఏజ్ 1,2,3 మూడూ బావుంటాయి.కుంఫూ పాండా కూడా బావుంటుంది.బాంబీ సినిమా చూడండి వీలయితే.అదో దృశ్యకావ్యం లా వుంటుంది.

సుజాత వేల్పూరి చెప్పారు...

శేఖర్ గారూ,ఈ సారి ఈనాడులో బ్లాగు మీదే అని ప్లాన్ చేస్తున్నాను! ఇంతలో...ప్చ్!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు గారు,
థాంక్యూ...నా దగ్గర కూడా T&J డౌన్లోడ్ చేసినవి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయండి.

@రాధిక గారు,
T&J పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తుందంటే ఆశ్చర్యంగా ఉందండి..బహుశా కొన్ని ఎపిసోడ్స్ అలా ఉండి ఉండొచ్చు..వీలున్నప్పుడు కుంఫూ పాండా, బాంబీ సినిమా చూడాలి ఒకసారి..
థాంక్యూ..

@సుజాత గారు,
ఏంటోనండీ బ్లాగ్మిత్రులు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు...ఈ రోజు మురళీ గారి బ్లాగులో నా బ్లాగు టపాగా..మళ్ళీ మీరు ఇలా అనటం... :) థాంక్యూ..

భావన చెప్పారు...

నా ఆల్ టైమ్ ఫేవరేట్ టామ్ అండ్ జెర్రీ. నాకు లైన్ కింగ్ అన్నా చాలా ఇష్టం మా అబ్బాయి తో కలసి చూసి చూసి ముఫాసా మొహం లో ని గీతలతో సహా గుర్తుండీ పోయాయి. చిన్నప్పుడు మా అమ్మ చెప్పే పంచతంత్రం కధ ను వాల్ డిస్నీ వాడు ఏంత బాగా తీసేడో అని హాశ్చర్య పోయాను కూడా. by the way congratulations Sekhar garu. మురళి గారి బ్లాగ్ లో మంచి పరిచయం. You deserve it.

సుజాత వేల్పూరి చెప్పారు...

మురళీ గారంతటి బ్లాగర్ రాశాక నేను రాయడం అనేది ఎంత పేలవంగా ఉంటుందో అని భయ పడుతున్నాను.అంత బాగా రాయడం నా వల్ల అయ్యేపనేనా!ఈనాడు పాఠకులకు అదృష్టం ఉండొద్దూ!

పరిమళం చెప్పారు...

అభినందనలు శేఖర్ గారు !ఇప్పుడే నెమలికన్ను నుండి ఇటుకేసి వచ్చా ....మురళిగారివల్ల మీ టపాలు కడుపుబ్బా నవ్వించినవి ...కనీళ్ళు పెట్టించినవి ..మళ్ళీ చదివి సంతోషపడ్డాను .

అజ్ఞాత చెప్పారు...

నేను మాత్రం మురళి గారి బ్లాగు నుంచి రాలేదండోయ్....కోటిలింగాలు రేవులో గూటి పడవెక్కి ఇలా మీ ఏటి వడ్డుకి వచ్చేసా.....
చిన్నాప్పుడు మోగ్లీ , హీమేన్ , ఇష్టంగా చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలతోపాటూ వాళ్ళు చూసే కొత్త కొత్త కార్టూన్ లు చూస్తుంటా.
నేస్తం డోరా నాకూ నచ్చుతుంది. ( నీకన్నీ నా పోలికలే )

శేఖర్ శాంతి స్వరూప్ అంకుల్ గురించి రాయలేదేం !

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ముందుగా స్పందించిన మిత్రులకు ఆలస్యంగా ప్రతి స్పందిస్తున్నందుకు సారీ..

@భావన గారూ,
మీరందరూ కార్టూన్స్ మీ పిల్లలతో చూస్తారని చెబుతుంటే నాకు కొంచెం జెలసీగా ఉందండి..:)అవునండీ..పంచతంత్ర కధలు యానిమేషన్ లో భలే ఉంటాయి...నేను ఎప్పుడు సీ.డీ షాప్ కి వెళ్ళినా అవి కొనేయ్యాలన్నంత ఫీలింగ్ కలుగుతుంటుంది.
థాంక్యూ..


@పరిమళం గారు,
అన్నింటినీ ఓపిగ్గా చదివి మళ్ళీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ సో మచ్....

@లలిత గారు,
టపా అయినా కమెంట్ అయినా మీ స్టైల్లో భలే రాస్తారండి మీరు...అన్నట్టు ఆ నీలం రంగు ఆడ చేప పేరు డోరీ అండీ..డోరా కాదు..:-). ఇప్పుడు కార్టూన్లలో ఎక్కువగా సినిమాలోల్లా హిరోయిజం ని ఎలివేట్ చేస్తున్నారండీ...హా..హా శాంతి స్వరూప్ అంకుల్ కి పిచిగ్గూడు హెయిర్ స్టైల్ లేదు కదండీ..అందుకే వదిలేశా..:-)

@సుజాత గారు,
ఇది వరకు మీరు మహా మహుల బ్లాగులను, ఎక్కువ సంఖ్యలో టపాలు కలిగివున్న బ్లాగులను ఓ ఏడెనిమిది లైన్లలోనే ఎంత బాగా రాసారో మర్చిపోయారా...అవి చదివిన ప్రతీసారి అనుకునేవాడిని...ఓ బ్లాగు గురించి మొత్తంగా ఇలా తక్కువ వాక్యాలలో చెప్పటం చాలా కష్టమైన టాస్క్ అని(అప్పుటికి మీరని తెలీదు నాకు)..