2, జులై 2010, శుక్రవారం

వారాంతంలో ఒక అనుభవం...

సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే ఇంటి నుండి బయటకు కదలడానికి అస్సలు ఇష్టపడను నేను. ఒకవేళ ఏ భూటాన్ బంపర్ లాటరీవాడో ఫోన్ చేసి 'సార్ మీకు ఓ పది లక్షలు తగిలాయ్..ఈ రోజే ఆఫీస్ కి వచ్చి మనీ తీసుకెళ్ళండి..లేదంటే మీ ప్రైజ్ మనీ పోతుంది' అని అన్నాడే అనుకుందాం..ఉహూ..అప్పటికీ కదిలే ప్రసక్తే ఉండదు...'ఇదిగో బాబు..మండే తీసుకోవటం అవుతుందా' అని వాడిని కూల్ గా అడుగుతాను తప్పించి పీ.టీ ఉష కి కజిన్ లా లగెత్తను గాక లగెత్తను. వారంలో అయిదు రోజులు చుట్టూరా ఉరుకులు పరుగుల మనుషులను, గంటల కొద్దీ ట్రాఫిక్ జాంలు, ఆఫీస్ పని చేయటం లాంటివి ఎలాగూ తప్పించుకోలేం కాబట్టి వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మయ్య ఈ ప్రపంచంతో నాకు సంభందం లేదు' అని అనుకోవటంలో ఓ కిక్ ఉంటుంది నాకు. ఒక్క మా గ్యాంగ్ వాళ్ళు ఔటింగ్ కి పిలిచినప్పుడు మాత్రం 'వీకెండ్ ఇల్లు కదలకపోవటం' అనే విషయంలో మినహాయింపువేసుకుంటాను.

ఆ రోజు ఎప్పటిలానే వీకెండ్ ఎంజాయ్ చేయటంలో భాగంగా మధ్యాహ్నం నిదానంగా భోజనం చేస్తూ, అమ్మతో పాటు నేను కూడా డైలీ సీరియల్ చూస్తున్నాను. మద్య మద్యలో ఎవరు ఎవరికి రెండో భార్యో, ఎవరు భర్త లాంటి భర్తో, చనిపోయిన మూడో భర్త అమ్మ మొదటి భార్య కొడుకును ఎందుకు ఎండ్రిన్ తాగమని ప్రోత్సహిస్తుందో, ముసలివేషంలో ఉన్న ఇరవై ఏళ్ళ అమ్మాయి సొంత జడతో ఉందా లేక సవరం వేసుకుందా లాంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటుంటాను. నేనలా కొశ్చన్స్ మీద కొశ్చన్స్ వేస్తుంటే అమ్మ ఎంతో ఉత్సాహంగా చెబుతుంది. నేను చూసేది ఒక్క శనివారం మాత్రమే..అది కూడా అప్పుడప్పుడు... అమ్మ రెగ్యులర్ గా ఫాలో అయ్యే సీరియల్స్ కావటంతో ఆ టైంలో నేను వేరే చానల్ పెట్టడానికి ఇష్టపడను. బలవంతంగా నాకు నేనుగా సీరియల్ అమ్మతో కలిసి చూసేసుకుని ఆ వారాంతం కామెడీ సినిమా చూడలేనిలోటుని తీర్చుకుంటానన్నమాట.

ఓ ఏభై నిమిషాల్లో భోజనం ముగించేసి, కంచం తీసుకుని సింక్ లో తోముతుంటే, 'రారా..చెంతకు రారా..' అంటూ నిద్రాదేవి చంద్రముఖి వేషంలో బ్యాక్ గ్రౌండ్లో పాడుతుంటే భుక్తాయాసంతో ఉన్నవారెవరికైనా నిద్ర రాక చస్తుందా! అందులోనూ మిట్ట మధ్యాహ్న సమయం...ఎలాగోలా కంచం కడిగేసి, డిష్ కంటెయినర్ లో పడేసి, బెడ్ రూంలోకి దూరిపోయి, ఫ్యాన్ మేగ్జిమమ్ స్పీడుతో పెట్టేసుకుని ఇలా పడుకున్నానో లేదో చెవిలో ఆ తర్వాత సీరియల్ టైటిల్ సాంగ్ వినిపించింది. దుప్పటి కప్పుకుందామంటే ఉక్కబోస్తుందని భయం. చెవిని చేతితో మూసుకుని పడుకున్నాను. "ఆడదే ఆధారం..ఆమే ఓంకారం..ఆడదే ఆధారం..మన సృష్టికి శ్రీకారం.." ఇంకా ఆ పాట వినిపిస్తునే ఉంది...అప్పుడే మొదటి సారిగా తెలిసింది ఆడవాళ్ళకు నాకు తెలియని చాలా డెఫినిషన్స్ ఉన్నాయని..ఆ పాట దెబ్బకు చంద్రముఖిలా ఉన్న నిద్రాదేవి పారిపోయింది..ఇక లాభం లేదనుకొని ఆమె ప్రియ శిష్యుడు కుంభ కర్ణుణకు ప్రార్ధించాను. 'మన ఫ్యామీలీ మెంబర్ ఎవడో నన్ను పిలుస్తున్నాడు' అని ఆయనకు సిగ్నల్స్ వెళ్ళాయి.. కొద్దిసేపటికే నాకు తెలీకుండానే సమ్మగా నిద్ర పట్టేసింది. ఓ రెండు గంటలవరకు నా నెట్ వర్క్ కి, బయట నెట్ వర్క్ కి సంభందాలు పూర్తిగా తెగిపోయాయి.

రెండు గంటల తర్వాత ఇలా లేచానో లేదో ఎదురింటిలోని పిల్లలు, మరికొంత మంది చిన్నపిల్లలు గోల చేయటం వినిపించింది. ఓ కంటిని పాక్షికంగా తెరిచి బాల్కనీలోకి వెళ్ళాను..జనరల్ గా నేను నిద్ర లేచిన వెంటనే రెండు కళ్ళనూ తెరవను..ఓ అరగంట వరకు ఏదో ఒక కన్ను మాత్రమే తెరచి ఉంచుతాను..అది కూడా పాక్షికంగా...ప్రొఫెషనల్ గా చెప్పాలంటే కళ్ళకు నిద్ర లేచిన వెంటనే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూపించి స్ట్రెయిన్ కి గురి చేయటం నాకు అస్సలు నచ్చదు..ఈ మాత్రం దానికే గిట్టని వాళ్ళు నన్ను 'లేజీ ఫెలో' అని ముద్దుగా అంటుంటారులెండి...ఆ పిల్లల్లో ఓ అబ్బాయి 'అన్నా..ఆ క్రిందన చూడు కుక్కని..' అని అన్నాడు. పై నుండే చూశాను. ఊర కుక్క అది...మరీ అంత పెద్దది ఏమీ కాదు. పుట్టి ఓ మూడు నెలలు అయ్యుంటుంది అప్పటికి. ఓ వైపు పడుకుని ఉండి కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. పొట్ట మీద ఓ గాయం ఉండి, ఆ ప్రాంతంలో రక్తం గడ్డ కట్టేసి ఉంది. అప్పటికీ నాకింకా నిద్ర మత్తు ఒదలలేదు. సరే ఓ సారి క్రిందకు పోయి చచ్చిందో, బ్రతికిందో చూద్దాం అనుకుని సెల్లార్ లోకి వెళ్ళి నేల మీద పడిఉన్న దాన్ని చూసాను. ఒక్కసారిగా నిద్రమత్తు ఒదిలేసింది. దానికి కడుపులో చాలా లోతైన గాయం అయ్యింది. బహూశా పై ఫ్లోర్ నుండి పడుతున్నప్పుడు మద్యలో ఏ ఇనుప ఊస పుల్లో గుచ్చినట్టు ఉంది. రక్తం ఆ భాగంలో గడ్డకట్టి ఉంది. చాలా కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. పొద్దున్నుంచి అది అలానే ఉందని ఓ కుర్రాడు చెప్పాడు. క్రింద పడిన వెంటనే అది చచ్చిపోయున్నా బాగుండేది. కానీ ప్రాణంతో ఉండి అలా విలవిలలాడుతుంటే మనసుకు చాలా కష్టంగా అనిపించింది.

ఓ నిమిషం పాటు బుర్ర బ్లాంక్ అయ్యింది. ఇది వరకు ఎప్పుడో, ఏదో ఇంటర్వ్యూలో అమల అక్కినేని, వాళ్ళ సంస్థ బ్లాక్రాస్ తరపున జంతువులకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారని చెప్పినట్టు గుర్తు వచ్చింది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా గబ గబా పైకి వెళ్ళి నెట్ ఆన్ చేసాను. అప్పటికి టైం నాలుగు నలభై అయిదు నిమిషాలు కావొస్తుంది. నెట్ ఆన్ అయ్యింది. గూగిల్ ఓపెన్ చేసి 'బ్లాక్రాస్, హైదరాబాద్' అని టైప్ చేసాను. ఓ ఫోన్ నెం. కనిపించింది. ఇదంతా చేస్తున్నాను గానీ నాకు మనసులో ఒకటే సందేహాలు..వాళ్ళు నిజంగా వస్తారా లేదా? ఫోన్ ఎత్తుతారా అసలు? అలాంటివన్నీ డబ్బున్నోళ్ళు పబ్లిసిటీ కోసం, కాలక్షేపం కోసం చేసుకుంటారు కదా...ఇలా ఎన్నెన్నో అనుమానాల మద్య బ్లూ క్రాస్ కి ఫోన్ చేసాను. రింగవుతూనే ఉంది. ఎవరు ఎత్తటం లేదు. ఆ నెం.కే మళ్ళీ ట్రై చేశాను. టైం అయిదు అయింది. మళ్ళీ మ్రోగుతూనే ఉంది.. ఫోన్ పెట్టేదామనుకునేంతలో ఎవరో లిఫ్ట్ చేసారు. వివరంగా మొత్తం చెప్పాను. 'సారీ అండీ అయిదు వరకు మాత్రమే మా సేవలు..మీరు రేపు ఉదయం దాన్ని తీసుకురండి..అయిదు తర్వాత ఒక్క ఎమర్జన్సీ మాత్రమే చూస్తాం' అని అన్నారు.

కుక్క పరిస్థితి పూర్తిగా ఇంకోసారి చెప్పాను. ఇప్పుడు గానీ దానికి ట్రీట్ మెంట్ ఇవ్వకపోతే అది చచ్చిపోతుంది అని చెప్పాను. వెంటనే ఆయన మా ఏరియా అడిగి, ఇక్కడ ఉన్న వాలంటీర్ల నెంబర్ ఇచ్చారు. వెంటనే ఫోన్ కట్ చేసి ఆయన ఇచ్చిన వాలంటీర్ నంబర్ కు డయల్ చేసాను. ఆయన వెంటనే అన్ని వివరాలు అడిగారు. ఓ అరగంటలో వస్తామని చెప్పారు. నాకైతే అప్పటికీ నమ్మకం లేదు...అసలే వీకెండ్..ఎంత వాలంటీర్లు జంతు ప్రేమికులైనా వీకెండ్ ఓ సినిమాకో,పార్టీకో పోతారు కదా...'సరేలే మన పని మనం చేసాం' అని అనుకుని టీవీకి అతుక్కుపోయాను.

కొద్దిసేపు తర్వాత ఎందుకో మనసు ఆగక క్రిందకు వెళ్ళి కుక్క ఎలాఉందో చూశాను. పాపం దాని తల్లి అక్కడక్కడే కొద్దిసేపు తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ వాలంటీర్ కి ఫోన్ చేశాను..వాళ్ళ టీం అంతా బయలు దేరారని, ఇంకొద్దిసేపట్లో నేను చెప్పిన ప్లేస్ లో ఉంటారని చెప్పాడు...ఇంతలో మా గ్యాంగ్ లోని ఒకడు ఫోన్ చేశాడు..సాయింత్రం అందరం నెక్లస్ రోడ్ దగ్గర కలుస్తున్నామని..నేను రెడీ అవుతుండంగా మళ్ళీ ఫోన్ మ్రోగింది..ఈ సారి ఆ బ్లూ క్రాస్ వాలంటీర్..వాళ్ళు మా ఏరియాకి వచ్చేసారని చెప్పాడు. గభ గభా క్రిందకు వెళ్ళి నేను చెప్పిన లాండ్ మార్క్ దగ్గరకు వెళ్ళాను.

ఇరవై, ఇరవై అయిదేళ్ళ కంటే ఎక్కువ వయసు ఉండని ఓ ముగ్గురు కుర్రాళ్ళు, ఓ అమ్మాయి కనిపించింది..అందులో మెయిన్ వాలంటీర్ మేము ఇంటికి వెళ్ళే దారిలోనే కుక్కకి సంభందించి చాలా ప్రశ్నలు వేశాడు..నాకు తెలిసిన వివరాలు చెప్పాను..వాళ్ళందరూ వారి వారి డిగ్రీల్లో ఫైనలియర్ చదువుతున్నవారు...మాట్లాతుండంగానే ఇంటికి వచ్చేసాము..సెల్లార్ లో కుక్క ఉన్న ప్లేస్ దగ్గరకు తీసుకెళ్ళాను వాళ్ళని..చాలా కంగారు పడ్డారు దాన్ని చూడగానే...అందులో అమ్మాయికైతే కుక్కని చూసి చూడగానే కళ్ళల్లో సన్నటి కనీ కనిపించని కన్నీటి పొర..ఒక వాలంటీర్ కుక్కని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు..పాపం నొప్పికి అది కుయ్..కుయ్ అంది. ఇంకో వాలంటీర్ దాని పరిస్థితి క్రిటికల్ గా ఉందని, ఆపరేషన్ అవసరమని తేల్చాడు...వెంటనే నలుగురు కుక్కని తీసుకుని బయలుదేరారు..నేను వాళ్ళని అనుసరించాను...కుక్కని ఎక్కడికి తీసుకెళ్ళాలో మాట్లాడుకుంటున్నారు..ఓ వాలంటీర్ చెప్పిన డాక్టర్ నెం.కి ఇంకో వాలంటీర్ కాల్ చేసి ఆవిడ ఆపరేషన్ ధియేటర్ అవైలబుల్ గా ఉందా లేదో, ఆవిడ ఇప్పుడు ఇంట్లో ఉందో లేదో కనుక్కున్నాడు. ఆ డాక్టర్ లేకపోయేసరికి వేరే ఆమెకు కాల్ చేసారు. మద్యలో ఇంకో వాలంటీర్ కుక్క తలని నిమురుతూ 'ఏం కాదులే నీకు..కొంచెం ఓర్చుకో..' అంటూ, మిగిలిన వారి వైపు చూసి ఆలస్యం చేయకుండా మనం వెళ్ళాలి అంటూ గాభరా పడుతున్నాడు. నలుగురు మొహల్లో కూడా దానికి ఏమీ కాకూడదన్న తాపత్రయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇదంతా చూస్తున్న నాకు అప్రయత్నంగా కళ్ళలో ఓ నీటి పొర చూపును కప్పేసింది.

ఓ ఆటోని పిలిచి కుక్కని వాళ్ళు తీసుకెళ్ళబోతున్న ప్లేస్ గురించి వాడికి చెప్పి, ఆటో ఎక్కబోయారు. అందులో మెయిన్ వాలంటీర్ నా వైపు చూసి 'మీరు కూడా ఇంక మా గ్రూప్ లో చేరిపోవచ్చు..ఆసక్తి ఉంటే నా నెం. కు ఫోన్ చెయ్యండి' అని ఆటోలోకి దూరాడు. 'నాకంత సీన్ లేదు' అని చెప్పకుండా దానికి ఈక్వలెంట్ నవ్వు నవ్వాను...ఏదో ఆ కుక్కకి కాసింత సాయం చేసినందుకు నేను కూడా వాళ్ళ టైపే అన్న భ్రమలో పడిపోయినట్టున్నారు...ఒకవేళ అదే టైంలో మా గ్యాంగ్ వాళ్ళు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తే నేను కూడా దాన్ని చూసి, అందరిలాగే చిటికెడు జాలి విదిల్చి, సగటు మనిషిలా అక్కడే దాన్ని వదిలేసి వెళ్ళిపోతానని తెలిస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో...ఈ ఫోన్ చెయ్యడాలు గట్రా అప్పుడు ఉండవుమరి...

ఇంటికి వచ్చేయబోతూంటే బుర్రలో ఏవేవో ఆలోచనలు....మానవత్వం, సాటి వారిపై దయ, ఎదుటి వాడి కష్టాన్ని అర్దం చేసుకోలేని వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఏమీ కానీ, పైసా లాభం కూడా తెప్పించని ఓ మూగ జంతువు ప్రాణం, అది కూడా ఓ వీధి కుక్క ప్రాణం నిలపటం కోసం వాళ్ళు పడుతున్న తపన చూసినప్పుడు, వారి సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ఆ నిమిషంలో వాళ్ళంతా మనుషులకంటే ఎక్కువగా కనిపించారు..దేవుని పటం కనిపిస్తే, ఎప్పుడూ ఎవరో చెప్తే తప్ప స్వతహాగ దణ్ణం పెట్టుకోవాలని అనిపించని నాకు, అప్రయత్నంగా మనస్సులోనే వారందరికీ దణ్ణం పెట్టుకోవాలనిపించింది...