21, ఫిబ్రవరి 2009, శనివారం

జ్ఞాపకమొచ్చెలే...బాల్య స్మృతులన్నీ....1

మేము ఒక చిన్న పల్లెటూరు నుండి టౌన్ కి వచ్చేటప్పటికి నేను నాలుగో తరగతి చదువుతున్నాను. అయితే మేము ఉంటున్న కాలనీలో పిల్లలందరి వయస్సు ఆరు నుండి పన్నెండేళ్ళు మధ్య ఉంటాయి. అందరూ కాన్వెంట్ లలో చదువుతున్నవారే. కాని నాన్న మాత్రం నన్ను కాలనీ దుంపల బడిలోనే వేసారు. అదేనండి ప్రభుత్వ స్కూళ్ళు. వాటిని మా టౌన్లో అలాగే అనేవారు. ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు ఉండగా ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకని నాన్న ఉద్దేశం. మా కాలనీ నాగావళి నది ఒడ్డున ఉండేది. దానికి మంగువారి తోట అని పేరు. పేరుకు తగ్గట్టుగానే కాలనీకి ఎడమ వైపు మామిడి తోట ఉండేది. వెనక వైపు తాటాకు గుడిసెల్లో ఉన్న కుటుంబాలు ఉండేవి. ఏటి ఒడ్డున ఉండటం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఇసక ఎక్కువ గా ఉండేది. మా బడిలో దాదాపుగా అందరూ పూరి పాకల్లో ఉండే పిల్లలే. అందువల్ల నా స్నేహితుల్లో పూరి గుడిసె పిల్లల నుండి అంతస్తుల్లో ఉండే పిల్లల వరకూ అందరూ ఉండేవారు. కాలనీ ఎప్పుడూ పిల్లలతో సందడిగా ఉండేది.

ఆటల
సరదాలు.....


దుంపల బడిలో సాయింత్రం నాలుగింటికే వదిలేసేవాళ్ళు. ఇంక అప్పుడు చూస్కోండి..ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. పూల కుండీని విరగ్గొడతావేమో లేక పూల మొక్కని తొక్కుతామో అని తెగ భయపడేవారు. మాకు యూనిఫాం లేకపోవటం వల్ల, అదే బట్టలతో ఆటకి రెడి. మా కాన్వెంట్ స్నేహితులు అప్పటికి స్కూలు నుండి వచ్చేవారు కాదు. స్కూలు మిక్సీలో తిప్పబడుతుండే వారు. నేను, నా మాస్ స్నేహితులు మంచి కర్రలు, దొంగాటలో దాక్కోడానికి కొత్త కొత్త ప్రదేశాలు వెతికే పనిలో ఉండేవాళ్లము. ఎలాంటి ప్రదేశాలు అంటే కాలనీలో ఉండే వాళ్లకు తెలిసేవి కావు. కాసేపయ్యాక కాన్వెంట్ నుండి మిగతావాళ్ళు యునిఫాంతో అలానే వచ్చేసేవారు.

ఇక అందరూ దొంగాటకి రెడి. స్వచ్చందంగా మొదటిసారి ఒకడు అంకెలు లెక్కపెట్టే వాడు. ఎవరు చివరికి దొరికితే వాడు సాయింత్రం కి హీరో అన్నమాట. మేమందరం ముందే వెతికి పెట్టుకున్న జాగాల్లోకి పోయి దాక్కునే వాళ్ళం. ఇక చూడాలి...అప్పుడు కష్టాలు స్టార్ట్...మేము దాక్కున్న ప్రదేశాల్లో చీమలు...దోమలు....జేర్రిలు చాలా రకాల జీవులు మాకంటే ముందే అక్కడ సిద్దంగా ఉండేవి మా రాక కోసం. ఎక్కడ పడితే అక్కడ కుట్టేవి. మరి సాయింత్రంకి హీరో కావాలంటే మాత్రం భరించాలి కదా! చివరిగా దొరికితే రోజు అందరూ చుట్టూ ముట్టి ఒరేయ్.. ప్లేసు నీకు ఎలా తెలుసురా.. అని మనల్ని సెలబ్రిటిని చేసి ప్రశ్నల వర్షం కురిపించేవారు.

ఒక్కోసారి నా దుంపల బడి స్నేహితులు చాక్లెట్లకు, తాండ్ర లకు, ఉప్పుకారం వేసిన మామిడి ముక్కలకు ఆశ పడి నేను ఎంతో జాగ్రత్తగా చూస్కున్న ప్లేస్ ప్రత్యర్దికి చెప్పేసేవాళ్లు. అప్పుడు మనం దాక్కున్న ప్లేస్ కనుక్కున్న వాడు హీరో అయిపోయేవాడు. అందరూ దొరికిపోయేక దొరికిన ఆర్డర్లో పేర్లు చెప్పాలి. ప్రత్యర్ది మనల్ని పట్టేసాడు అన్న అక్కసుతో ఘట్టాన్ని మేము రసాబాసగా చేసేసే వాళ్ళం. వాడు ఆర్డర్లో పేర్లు చెప్పక పొతే మళ్లీ వాడే దొంగలను వెతకాలన్న మాట. అందుకని వాడిని గందరగోళం లో పడేసేవాళ్ళం. వాడు కరెక్టగానే చెప్పినా మేము తప్పు తప్పు అని గోల చేసి మళ్లీ వాడిచేతే అంకెలు లెక్కబెట్టించేవాళ్లము. ఘట్టాన్ని కింత్రీ చేయటం అంటారు. అన్నట్టు... ఆటలో...'ఆటలో అరటి పండు' అనే జాబితా ఆటగాళ్ళు కూడా ఉండేవారు. అంటే..వీళ్ళు మొదట దొరికినా వారు దొంగలను పట్టుకోరన్నమాట...ఫ్యుచర్లో ఎలా కింత్రీ చెయ్యాలో నేర్చుకుంటున్న పిల్లగాళ్ళు అన్నమాట.

ఇక కర్రాట... అదేనండి...కర్రని రాయిమీద ఉంచుతూ ప్రత్యర్ది కర్రను కొడుతుండాలి..ప్రత్యర్ది కర్ర కొడుతున్నప్పుడు వాడు మనల్ని పట్టేస్తే, వాడి కర్ర ఉన్న ప్లేస్ నుండి ప్రారంభ లొకేషన్ కు కుంటూ కుంటూ వాడు రావాలి. తర్వాత, దొరికిన వాడి కర్రని అందరూ కొడుతుంటారు. ఇక్కడే మాకు పాత కక్ష్యలు గుర్తొచ్చేవి. పెద్ద పెద్ద బండలు చూసుకొని ప్రత్యర్ది కర్రను మొత్తం బలం ఉపయోగించి ఒక అర కిలోమీటరైనా ఎగిరి పడేటట్టు కొట్టే వాళ్లము. పాపం ప్రత్యర్ది కాలు, కాలు మార్చుకుంటూ కష్టపడి కుంటేవాడు. ఇక కింత్రీ రాయుల్లైతే...జేబుల్లో రాళ్ళు పెట్టుకునే వారు. ఒక వేళ కర్ర పడివున్న ప్రదేశానికి దరిదాపుగా రాల్లేవీ లేక పొతే జేబులో వున్న రాళ్ళు విసిరి కర్ర దగ్గరకు చేరుకునే వాళ్లు. ఆటలో రూల్స్ ఉన్నవి పక్కవాడు పాటించడానికే తప్ప మనకు కాదు అన్న క్లారిటీ అందరకూ ఉండేది.

వైకుంటపాళి....దాదాపు న్యూస్ పేపర్ అంత ఉన్నవైకుంటపాళి ని ఇంటి అరుగుపై పెట్టుకుని ఒక పది మంది ఆడేవాళ్ళం.
అప్పుడు ఉండేది అసలైన గోల...ఎవడైనా పెద్ద పాము మింగి మళ్లీ మొదటికోచ్చాడో వాడిని తెగ ఆట పట్టించేవాళ్ళం. అందరూ చింత పిక్కలు గిలకరించి వేసేముందు పాము బారిన పడకుండా మంత్రాలు అవి చదివి అప్పుడు వేసేవాళ్ళు.
పరీక్షలప్పుడు కూడా దేవుణ్ణి స్మరించి ఎరుగం. అలాంటిది వైకుంటపాళి అంటే దేవుళ్ళందరిని స్మరించాల్సిందే.

ఇంకా చాలా ఆటలు....గిల్లీ దండ, గోలీలు, క్రికెట్, ఏడు పెంకులాట....చాలానే ఉన్నాయి.

మా ఆటల గాంగ్ లో పేద, ధనిక అన్న బేధం ఉండేది కాదు. మాటకొస్తే.... వయసు పిల్లల్లో ఎవ్వరికీ ఉండదు. కానీ మాలో కొంతమంది తల్లిదండ్రులు మేము పూరి గుడిసె పిల్లలతో కలసి ఆడటానికి ఒప్పుకునేవారు కాదు. తీవ్రంగా కోప్పడేవారు. ఒకసారి గడప దాటితే అందరం ఇవన్నీ మర్చిపోయి హాయిగా చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్ళము.

ఆదివారాలు, సెకండ్ శనివారాల మజా ......

పిల్లలు అందరూ రెండు రోజులు సెలవులు వస్తే మద్యాహ్నం పడుకోవాలి అన్న ఉద్దేశంతో ఎవ్వరి ఇంట్లోనూ బయటకు పంపించేవారు కాదు. ఇంట్లో అందరూ పడుకున్నారని నిర్దారించుకున్నాక, నెమ్మదిగా మేడ ఎక్కి, కాలి మడమలతో గబ గబా డాబాపై నడిచేవాడిని. అది నాకు, మా పక్కింటి పిల్లలకు ఒక రకమైన సైన్ అన్నమాట. పక్క వాటాలో పిల్లలు ఇంటిలోపల సౌండ్ విని నేను మేడ మీద ఉన్నానని తెలుసుకొని నాన్న పక్క లోంచి జారుకునే వారు. అలా మేము అందరి ఇళ్ళపైకి వెళ్లి సౌండ్ చేసి వారిని లేపేసేవాళ్ళము.

గాంగ్ మళ్లీ తయార్. తక్షణ కర్తవ్యం ఆలోచించేవాళ్ళము. ఒక చురుకైనవాడు "ఒరేయ్...మన వెనకింటి ఆంటీ డాబాపై ఉరేసిన మామిడి ముక్కలు ఎండబెట్టారురా.." అని చెప్పిన వెంటనే అందరికీ నోట్లో నీళ్లు ఊరేవి . పిల్ల సైన్యం ను రంగంలోకి దించేవాళ్ళం. కట్ చేస్తే ....అందరూ మామిడి ముక్కలు లోని ఇంకి వున్న ఉప్పు నీటిని జుర్రుకుని తినటం... కార్యక్రమం అయిన తర్వాత ఏటి ఒడ్డున అందరం కూర్చొని అవతలి ఒడ్డు గురించి రకరకాల కధలు చెప్పుకునే వాళ్లము. ఒకడేమో అవతలి ఒడ్డున పెద్ద అడవి ఉందని, పులులు, సింహాలు ఉంటాయని చెప్తే, ఇంకొకడు మేము ఎలా అక్కడకు చేరుకోవాలా అని ప్లాన్ చేస్తుండేవాడు. మా గాంగ్లో ఉన్నచిన్నపిల్లకాయలు ఆసక్తిగా వింటుండేవారు.

.......మిగతావి తర్వాత టపాల్లో

15, ఫిబ్రవరి 2009, ఆదివారం

బ్లాగుల చుట్టూ తిరిగే కొన్ని తెలుగు సినిమా పేర్లు, వాటి కధలు టూకీగా....

బ్లాగులు ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత, అవే తెలుగు సినిమా కి కధా వస్తువు అయితే ఎలా వుంటుందో అన్న చిలిపి ఊహకి తట్టిన ఆలోచనే టపా. ఎవ్వరినీ ఉద్దేశించి, కించ పరచాలన్న భావంతో రాసింది ఎంతమాత్రం కాదు. మరింకెందుకు ఆలస్యం చూడండి మరి...

టైటిల్ ఒకటి:

" బ్లాగానులే..! "

పదవతరగతిలో ఉండే అబ్బాయి తన క్లాస్ మేట్ ని ప్రేమిస్తాడు. అమ్మాయి మనోడ్ని తిరస్కరిస్తుంది. చదువు సంధ్యా లేని కుంక అని నానా రకాలుగా తిట్టి పోస్తుంది. మనోడు పదో తరగతి తర్వాత అమ్మాయికి మొహం కూడా చూపించడు. అమ్మాయికి ఎప్పటినుండో బ్లాగురాసే అలవాటు ఉంటుంది. అలా బ్లాగులోకంలో పరిచయాలు పెరిగి ఒకతనితో ప్రేమలో పడుతుంది. అతని రచనలంటే ఆమెకి విపరీతమైన పిచ్చి. అభిప్రాయాలు పంచుకోవడమే గాని ఒకరి నొకరు చూసుకోవటం గాని , కలుసుకోవటం గాని జరగదు. ఒక ఫైన్ డే ఇద్దరూ కలుసుకోవాలని అనుకుంటారు. అమ్మాయి పార్క్ లో అతనికోసం చూస్తూవుంటుంది. అతను రానే వచ్చాడు. ఒక్కసారి అతన్ని చూస్తూ ఆశ్చర్య పడుతుంది. నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. అతను ఎవరో కాదు...చిన్నప్పుడు మన హీరోయిన్ చేత పదోతరగతిలో తిరస్కరింపబడ్డ యువకుడు.

అమ్మాయి అతన్ని ఒప్పుకుంటుందా లేకా మళ్ళీ తిరస్కరిస్తుందా అనేది వెండితెరపై చూడాల్సిందే......
******

టైటిల్ రెండు:
" స్లం బ్లాగర్ మిలేనియర్ "

టైటిల్ చూసి మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది. దీని కదా ఏంటో అని....గిరిజన తండాలో మురికి వాడలో పెరిగిన ఒక యువకుడు తన బ్లాగు రచనల ద్వారా ఎలా పాపులర్ అయ్యాడు, ప్రపంచపు దృష్టిని ఎలా ఆకర్షించాడు, తద్వారా గూగిల్, యాహూ లాంటి బడా కంపనీలు అతని బ్లాగులో వ్యాపార ప్రకటనలని చొప్పించడానికి ఎలా పోటీ పడ్డాయి....అవి అతనిని ఎలా మిలేనియర్ని చేసాయి అన్నది చిత్ర కధాంశం.
******
టైటిల్ మూడు:
" బ్లాగు నీది..టెంప్లేట్ నాది "

ఇది కొంచం కుటుంబ కధా చిత్రాల కోవలోకి వచ్చిన కామెడీ చిత్రం. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు తను త్వరలో ప్రారంబించ బోయే బ్లాగు కోసం తన రచనలను, మనస్తత్వాన్ని ప్రతిబంబించేలా ఒక టెంప్లేట్ కోసం నెట్ ఆంతా వెతికి ఫెయిల్ అవుతాడు. చివరికి అతని మనసెరిగిన సహోద్యోగి రాత్రింబవళ్ళూ కష్టపడి ఒక టెంప్లేట్ తయారుచెయ్యాలని పూనుకొంటుంది. ఆమె అతని మనసుకు తగ్గ టెంప్లేట్ చెయ్యగలిగిందా, అతను బ్లాగు మొదలు పెట్టి పాపులర్ అయ్యాడా?, ఆ టెంప్లేట్ వారిద్దరి స్నేహాన్ని ఎటువైపు తీసుకెళ్ళింది అన్నది 'పది పైసలు' బ్యానర్ పై త్వరలో రిలీజ్ కాబోతున్న " బ్లాగు నీది..టెంప్లేట్ నాది " చిత్రం చూడాల్సిందే.
******

టైటిల్ నాలుగు:
" బ్లాగేశ్వర రెడ్డి "
ఓ ఫ్యాక్షన్ సినిమా......

బ్లాగుల టపాల నేపధ్యంలో జరిగే ఫ్యాక్షన్ కధ ఇది. ఒక సీమ బ్లాగరి, బ్లాగ్సేనా రెడ్డి తన బ్లాగులో తన ప్రత్యర్ది బ్లాగేశ్వర రెడ్డి గురించి, వారి కుటుంబం గురించి రక రకాలుగా రాసి ఇబ్బంది పెడుతుంటాడు. సహనం నశించిన బ్లాగేశ్వర రెడ్డి " ఇక తల తెగుడే... " అనే టపా రాసి తన ప్రత్యర్దిని పోరాటానికి సిద్దం చేస్తాడు. రెండు మూడు సుమోలను గాల్లోకి లేపిన తర్వాత బ్లాగేశ్వర రెడ్డి అనుచరుడు ఇకపై తమ ఊళ్ళో వాళ్ళెవ్వరూ బ్లాగర్ ని ఓపెన్ చెయ్యలేరని, ఇంటర్నెట్ నడిపే వాడిని లేపేసారని, ప్రత్యర్ది బ్లాగరి ఇకపై టపాలు రాయలేడని చెప్పటంతో ఇంక కత్తులతో పని లేదని బ్లాగేశ్వర రెడ్డి వాటిని పడేసి వెనుతిరుగుతాడు. అయితే ఈ చర్య బ్లాగ్సేనా రెడ్డి ని మార్చిందా లేకా డేటా కార్డ్ తో తన టపాలను తిరిగి కొనసాగించాడా అన్నది తెరపై చూడాల్సిందే.
******

టైటిల్ ఐదు:
" బ్లాగవే మయూరి "

చిన్నప్పుడే తల్లీ తండ్రి కోల్పోయిన ఒక యుక్త వయసు అమ్మాయి తన బాబాయి దగ్గర పెరుగుతుంటుంది. స్వతహాగా రచనా నైపుణ్యాన్ని ఒంటబట్టించుకున్న ఆ అమ్మాయి ఫ్రీ లాన్స్ బ్లాగర్ గా మిగతా బ్లాగర్లకు అప్పుడప్పుడూ టపాలు రాస్తూ పాకెట్ మనీ సంపాదించుకుంటుంది. తాగుబోతైన బాబాయి తన పాకెట్ మనీ కూడా కాజేస్తూ ఇంకా ఇంకా ఎక్కువరాసి డబ్బు సంపాదించమని వేదిస్తుంటాడు. తన లక్ష్యం సాదించనీయకుండా ప్రతి దశలో అడ్డుకున్టుంటాడు. తన బాబాయి చెర నుండి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుని తన లక్ష్యాన్ని చేరుకుందో మల్టిప్లెక్స్ లో వీక్షించాల్సిందే.
******
టైటిల్ ఆరు:
" బ్లాగుతో రా... "

తెలుగు బ్లాగర్ల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి బ్లాగశ్రీ కుమార్తెను, తన పేరుకూడా సరిగ్గా రాసుకోలేని ఒక యువకుడు ప్రేమిస్తాడు. అయితే బ్లాగశ్రీ తన అల్లుడు పాపులర్ బ్లాగర్ అయివుండాలని, అప్పుడే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తుంది. చివరికి ఏమైంది? బ్లాగశ్రీ పాపులర్ బ్లాగర్ని తన అల్లుడుగా చేసుకుందా లేక ఆ యువకుడు బ్లాగుతో బ్లాగాశ్రీ ని ఇంప్రెస్స్ చేసి ఆవిడ కుమార్తెను దక్కించుకున్నాడా అన్నది మిగతా భాగం. ఈ సినిమాని జరిగిన కధ ఆధారంగా తీసారని నిర్మాత చెబుతున్నారు. మరి "బ్లాగుతో రా..." బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు చేస్తుందో వేచి చూడాల్సిందే.
******

ఇంకా కధల చర్చల్లోనే ఉన్న టైటిల్స్ :

౧) బ్లాగాయణంలో బఠానీల వేట
౨) బ్లాగు బాబ్జీ
౩) బ్లాగు భందం


8, ఫిబ్రవరి 2009, ఆదివారం

బామ్మ సంతోషం కోసం పెళ్లి చేసుకోవాలా ?

అనీల్....తను ఎక్కడుంటే అక్కడ ఆనందం వెల్లివిరియాల్సిందే. తన స్నేహ ప్రపంచంలో ఇగోకు అస్సలు స్థానం వుండదు. అందరికిలానే నాకు కూడా తను మంచి స్నేహితుడు. బిజీ బతుకుల వల్ల నెలకు ఒక్కసారి తప్పకుండా మాట్లాడు కుంటాం. మాటల ప్రవాహంలో ఎన్నో ఉసులు, భావాలు ఒకరినుండి ఒకరికి బదిలీ అవుతుంటాయి. మొన్న వాడికి పెళ్లి కుదిరిందని చెప్పాడు. అందరిలానే నేను సంతోషించాను. అయితే సంతోషం తనలో కొంచం తక్కువగా వుందనిపించింది. మాటలు ప్రవాహం పెరుగుతూ ఉంది. దానికి అడ్డుకట్ట వేసి అసలు విషయం రాబట్టడానికి ప్రయత్నించాను.

అనీల్ మొన్ననే తన ఉద్యోగం మారాడు. అయితే కొత్త ఉద్యోగంలో కొత్త భాద్యతలు వచ్చాయి. అవి తనకి పూర్తిగా కొత్త. వాటికి తోడు పని ఒత్తిడి, చావు గీతలు సరేసరి... పరిస్థితిలో తను కొన్నాళ్ళు పనికి అలవాటు పడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని, ఇంకొద్ది రోజులు ఆఫీస్ లో సెలవు అడిగే పరిస్థితి కూడా లేదని ఇంట్లోవాళ్ళకి చెప్పేసాడు. అయితే మన వాళ్లు అర్ధంచేసుకుని కొద్దిలో కొద్దిగా సహకారం అందింద్దామనుకునేలోపే వాళ్ల చుట్టూ పని పాటలేని వాళ్లు, ఇంటివిషయాలు వదిలి పక్కింట్లో ఏమిజరుగుతుందో ఆసక్తిగా గమనించే ఔత్సాహిక అమ్మలక్కలు, పదవీ విరమణ చేసి చాదస్తాన్ని వంటబట్టించుకునే అంకుల్స్, ముఖ్యంగా రాబందుల్లా అవతలివారి మనోభావాలు పట్టించుకోకుండా మాటల తూటాలతో హృదయాన్ని చీల్చి చెండాడే బంధుగణం ఉరికే వుంటారా ? మీ వాడికి వయసుమీరుతుందేమో అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇంతమందికి సమాదానం చెప్పుకోలేని నిస్సహాయ తల్లిదండ్రులు మనోడికి తొందరగా పెళ్లి చేసేస్తే పని అయిపోతుందని ఫిక్స్ అయిపోయారు.

మనోడి పరిస్థితితో సంబంధం లేకుండా పిల్లని చూడ్డం, ఖాయం చేసుకోవడం అన్ని చక చకా జరిగిపోయాయి. తర్వాత విషయం వాడికి తెలిసింది. ఇప్పుడు నాకు పెళ్లి వద్దురో మొర్రో అన్నందుకు పెద్ద రభసే జరిగింది. పెద్దవాళ్ళ ఏడుపులు పెడబొబ్బలు సరేసరి. మొత్తానికి మా వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు. అయితే తనకి కొన్ని నెలల సమయం కావాలన్నాడు. కానీ అమ్మాయి నాన్నమ్మ వీడి పాలిట విలన్ అయింది. ఆవిడ బతికుండగా పెద్ద మనవరాలి పెళ్లి చూసేయ్యాలని కోరికంట. అందుకని త్వరగా లగ్నాలు పెట్టించారు. మా వాడి వాళ్ళమ్మ గారికి ఒక వేళ పెళ్లి వాయిదా వేసి నట్టయితే, లోపు బామ్మగారు హరీ అంటే వీళ్ళని అంటారని, పరువు ప్రతిష్టల సమస్యలోస్తాయేమో అన్న భయం. వాడికి సెలవులు కూడా కుదరవని చెప్పినా అమ్మాయి తండ్రి 'మీకు సెలవులు లేకపోతె మీ సిటీ కే వచ్చి పెళ్లి జరిపిస్తాము బాబు' అంటూ తల్లి పట్ల తన విధేయతను కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ వారి వారి కోణాలనుంచి, వారి సంతోషం, భయాలు గురించి ఆలోచించుకున్నవారే కాని ఒక్కరు కూడా వీడి గురించి ఆలోచించలేదు.

ఇదీ సంగతి.

ఇంకో నెలలో పెళ్లి అయినా మా వాడు ఇంకా తన హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోలేదు. నేను అడిగే వరకు తను అస్సలు దాని గురించే ఆలోచించ లేదట. అసలు పెళ్లి అవుతుందన్న ఆనందం మనసులో ఉప్పొంగితే కదా ఇలాంటి ఆలోచనల వైపు మనసు మళ్ళుతుంది. వాడి బుర్ర నిండా ఇప్పుడు ఒక్కటే ఆలోచన ....పని మీద మంచి గ్రిప్ తెచ్చుకొని నైటౌట్లు,ఒత్తిడి లేకుండా వుండటం.

వీడి పరిస్థితి ఇలావుంటే అక్కడ అమ్మయి పరీక్షల సమయంలో పెళ్లి జరగబోతున్నందుకు అస్సలు పెళ్లి ఆనందంతోనే లేదట. ఇక్కడ అబ్బాయికే మెడలు వంచిన వారు అమ్మాయి గురించి కొంచమైనా ఎందుకు ఆలోచిస్తారు?

అసలు పెళ్లి అంటే జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందమైన, మధురమైన ఘటన. అలాంటి పెళ్ళే ఎవరెవరి ఆనందంకోసమో, పరువు ప్రతిష్టల కోసమో చేసుకుంటుంటే మన జీవితానికి ఏమైనా అర్ధం వుంటుందా? ఉన్నా అలాంటి జీవితం మనకు సంతోషం తెచ్చి పెడుతుందా?

ఎంతమంది 'అనీల్' లు ఇలా మౌనంగా బాధపడుతున్నారో, చెప్పుకుందామన్నా అర్ధం చేసుకునేవాళ్ళు లేక గుండె గూటిలో పెల్లుబికని లావాలా వేదనను దాచుకుంటున్నారో......

మనకు చిన్నప్పుడు నచ్చిన ఆటను ఆడుకోనివ్వరు.....చదువుకున్నప్పుడు గ్రూప్ తీసుకోవాలో మనల్ని నిర్ణయించుకోనివ్వరు....ఇంజనీరింగా లేకా ఫైన్ ఆర్ట్స్ అన్నది కూడా చేతుల్లోవుండదు.....సాఫ్టవేర్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబా అన్నది కూడా మనం డేసిసన్ తీసుకోం.....చివరికి జీవితంలో ముఖ్యమైన పెళ్లి కూడా మనకు నచ్చినట్టు జరగదు.....

ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఉందంటారా?

4, ఫిబ్రవరి 2009, బుధవారం

కాదేదీ వాళ్లకు అసాధ్యం .....

వాళ్లు భౌతికంగా అందరిలాంటి వారు కాకపోయినా ప్రతిభా పాటవాల్లల్లో మాత్రం అందరి కంటే ముందు వరసలోనే వుంటారు. ఒకరు తమ గాన మాధుర్యంతో మనల్ని పరవశింప జేస్తే ఇంకొకరు తమ బహుముఖ ప్రతిభతో మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తారు. పోటీనుండి తప్పుకోవలసి వచ్చిన, సహ పోటీదారున్ని మెచ్చుకునే గొప్పమనసుతో మనం చిన్న బుచ్చుకునేలా ప్రవర్తించగలరు. వారి అవరోదాన్ని అదికమించిన తీరుతో మనలో స్ఫూర్తినీ నింపగలరు. వాళ్లు జాబిల్లిని చూడలేక పోవచ్చు. కాని 'చందమామ రావే...జాబిల్లి రావే...' అని పాడి మన కళ్ళ ముందు వెన్నెలని ఆవిష్కరింపజేయగలరు. సరిగమలు, రాగాలలోనే సప్తవర్ణాలు చూడగలరు. వీరందరూ ఎవరో కాదు ఒక ప్రముఖ టెలివిజన్ సంస్థవారు అంధుల కోసం రూపొందించిన పాటల కార్యక్రమంలో పాల్గొన్నవారు.

" Black...The colors of music "

మొదట్లో కార్యక్రమం ప్రోమో వస్తుందంటే అసలు వీరికి అభ్యర్దులు దొరుకుతారా అని అనిపించింది. కాని మొదటి ఎపిసోడ్ చూసిన తర్వాత తెలిసింది మన రాష్ట్రంలో ఇంతమంది ప్రతిభవున్న గాయకులు వున్నారని. వీరిలో చాలామందికి పాడటం ఒక్కటే వచ్చు అనుకుంటే మీరు పొరబడినట్టే. గాత్రంతో పాటు వివిధ వాద్య పరికరాలనూ వాయించగలరు. మిమిక్రి చేయగలరు. అయితే ఇవన్ని వారికి గురువులు నేర్పించలేదు. నేర్చుకునే స్తోమత ,వెసులుబాటు కూడా కొంత మందికి వుండుండదు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన దిగువ మధ్య తరగతి వారే.

టీవీ వైపు చూడకుండా ఒక్కసారి వారి పాటను వింటే ఇదేదో ఇంకో పాటల కార్యక్రమము అని అనుకుంటాము తప్పితే ఎక్కడా కూడా ఇదేదో అంధుల కోసం రూపొందించిన ప్రోగ్రాం అని ఎక్కడా అనిపించదు. వారి టాలెంట్ స్థాయిలో వుంటుంది. వాళ్ళల్లో ఎవరికీ వారి లోపాన్ని గురించి అస్సలు దిగులు లేదని కార్యక్రమం చూస్తుంటే ఇట్టే అర్ధమైపోతుంది. అది వారి ఆత్మవిశ్వాసం వారికి ఇచ్చిన భరోసా. ఒకసారి ఒక అమ్మాయి 'ముకుందా ముకుందా ...' పాట పాడిన తర్వాత యాంకర్ ఆమెకు మీకు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటారు అని అడిగితే ఆమె ఏమి సమాదానం చెప్పుంటుందో ఊహించగలరా? కళ్లు ఇమ్మని అడుగుతుందని అనుకుంటున్నారా? తను మంచి గాయని కావాలని అడుగుతానని అమ్మాయి చెప్పింది. ఇంతకంటే ఏమి రుజువు కావాలి వారి మనోబలం ముందు వైకల్యం తల వంచుకు వుందని.

అయితే ఇటువంటి ప్రోగ్రామ్స్ కి ప్రజల ఆదరణ వుంటుందో లేదో అన్న సందేహం కాబోలు..వారానికి ఒక్కసారికి మాత్రమే పరిమితం చేసారు. సాదారణంగా 'సరిగమప' లోనో, లేదా 'సప్తస్వరాలు' లోనో పాడేవారికి ఎలిమినేట్ అవ్వడానికి ముందు చాలా సార్లు అవకాశం ఇస్తారు. వైల్డ్ ఎంట్రీ అని...అదని ఇదని చాలా చేస్తారు..ఎపిసోడ్ లను పెంచటానికి కాబోలు. కానీ ప్రతిభా మూర్తుల కార్యక్రమం లో అటువంటి అవకాశమే లేదు. ప్రోగ్రాం మొదలైన రెండవ భాగం నుండే ఎలిమినేట్ చేసేస్తున్నారు. అయినా విషయంలో నిర్వాహకులను అనేకంటే ముందు తెలుగు ప్రేక్షకులను అనాలి. ఇలాంటివి మనం చూస్తేనే కదా టీ.ఆర్.పీ రేటింగులు పెరిగేవి. అప్పుడేమరి ఎపిసోడ్ లను పెంచాలి అని నిర్వాహకులకు అనిపిస్తుంది. తద్వారా కార్యక్రమంలో పాల్గొన్న వారికి వారి ప్రతిభను మరింత సాన పెట్టుకునే అవకాశం వస్తుంది. వారిని ప్రోత్సహిస్తున్నట్టు వుంటుంది.

ఒక్క ఎపిసోడ్ తోనే వెనుతిరిగే వారిని చూస్తుంటే చాలా కష్టంగా అనిపించక మానదు. అసలే మన టీవీ వాళ్లు లేక లేక ఇలాంటి కార్య క్రమంను ప్రసారం చేస్తున్నారు. చేసిన వారు కూడా ప్రజల స్పందనను చూసి వెనక్కి తిరిగితే ఎంతో మంది ప్రతిభా మూర్తుల టాలెంట్ తెరమరుగు అవుతుంది.

అయినా వాళ్లందరూ ఎప్పుడో జీవితంలో గెలిచిన వారు. ఒక వేదిక నిర్ణయించే 'విజేత' అనే గుర్తింపు వాళ్లు నిజజీవితంలో గెలిచిన ట్రోఫీ ముందు చిన్నదే.