23, ఆగస్టు 2009, ఆదివారం

మా ఇంటి గణపయ్య...



బొజ్జ గణపయ్య
నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదకు దండు బంపు
కమ్మని నేయియను కడు ముద్దపప్పును
బొజ్జ విరగగ దినుచు పొరలు కొనుచు



"పుస్తకాలు దేవుడు దగ్గర పెట్టండర్రా..!!" అమ్మ వంటిల్లో కుడుములు చేస్తూ అంది.

నేను, నా ఫ్రెండ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ముసిముసిగా నవ్వుకున్నాం.

"
వయసులో పుస్తకాలు ఏముంటాయి ఆంటీ..కావాలంటే నా లాప్ టాప్ పెట్టనా..అందులో మా ప్రాజెక్ట్ ఉంది. ఎప్పటి నుండో ఉన్న మొండి బగ్గులు ఫిక్స్ అవుతాయేమో.. " మా ఫ్రెండు గాడు అమ్మతో అన్నాడు.

"
ఒరేయ్..నీ ప్రాజెక్ట్ లో బగ్ లు అన్నీ ఫిక్స్ అయిపోతే, అక్కడ క్లైయింట్ గాడు ఉద్యోగులను తగ్గించమని మైల్ కొడితే అసలుకే ఎసరు..నీ ఇష్టం మరి" అన్నానేను.

"
అవున్రోయ్...అలా అయితే మన బ్లాగులు లాప్ టాప్ లో ఓపెన్ చేసి పెట్టి వినాయకుడు దగ్గర పెడదాం" అన్నాడు వాడు.

మనసులో నేను- వీడికి కొంపదీసి మెదడు వాపు రాలేదు కదా! ఇంత క్రియేటివ్ గా ఆలోచించేస్తున్నాడేంటబ్బా!!

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో నా బ్లాగు, మోజిల్లాలో వాడి బ్లాగు ఓపెన్ చేసి వినాయకుడు దగ్గర లాప్ టాప్ పెట్టాం.

"
ఏంటర్రా..మాటలేనా..ఉండ్రాళ్ళు చుట్టే ఆలోచన ఏమైనా ఉందా" అన్న అమ్మ మాటలతో మా సోదికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టి పనిలో పడ్డాము.

అప్పటి వరకు అమ్మ చుట్టి వదిలేసిన ఉండ్రాళ్ళు నున్నగా, గుండ్రంగా వస్తే మేమిద్దరం చుట్టిన ఉండ్రాళ్ళు అంగారక గ్రహంలో దొరికిన Objects లాగ వచ్చాయి.


ఫోటో తీసింది/కళ : తోట తరణి బ్రదర్స్ -- ఎవరా అని ఆశ్చర్యపోకండి...మా మిత్ర ద్వయం...అప్పుడప్పుడు అలా ఫీలవుతుంటాం లెండి :))


****


బ్లాగ్మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

15, ఆగస్టు 2009, శనివారం

నువ్వు లేక నేను లేను



నా మనసు భావాలు నీ మాటల పలుకులవుతుంటే
మౌనమే
నా భాష కాదా!!


నువ్వు నా పక్కన ఉంటే
వసంతం రాకపోకల గురించి నాకెందుకు?

నీ కురులు సుతారంగా మోమును తాకిన వేళ
నన్ను నేనే మైమరచి పోయా

మనం మరింత దగ్గరైనప్పుడు
నీ శ్శాస రుచిని కూడా చూడగలను నేను

నీ చేతి స్పర్శ ఎన్నో భావాలు పలుకగలదు
భావాలు అందుకున్న నా మనసు ఒక్కసారిగా తేలికైపోదూ!!!

ఇన్నాళ్ళకు మనల్ని విడదీయడం ద్వారా
కాలం తన అక్కసుని వెళ్ళగక్కింది

నువ్వు లేని ఒంటరితనం లో
నేను ఉన్నా లేనట్టే


4, ఆగస్టు 2009, మంగళవారం

మరపురాని భందం...మరిచిపోలేని అనుభందం

రాఖీ పండుగ వచ్చిందంటే పిల్లలందరం నీ రాఖీ చూపించంటే నీ రాఖీ చూపించు అని, నీ రాఖీ పెద్దదా లేక నా రాఖీ పెద్దదా అని పోల్చుకుంటూ తెగ సందడి చేసే రోజులవి. ఆ సందండి లోనూ మనసు ఫీలయ్యే మరో ఆనందం ఉండేది. ఎందుకంటే రోజా ఎంతో కష్టపడి ఎన్నెన్నో షాపులు తిరిగి నా మనసుకు నచ్చుతుంది అని నిర్ధారించుకున్నకే రాఖీ కొనేది. నిజంగా తను నా చేతికి కట్టిన రాఖీ నా స్నేహితులందరు కట్టుకున్న దానికంటే చాలా బాగుండేది. పిల్లలందరు "ఒరేయ్..నీ రాఖీ చాలా బావుందిరా" అని అంటున్నప్పుడు నా మొహంలో కనపడే ఆనందం చూసి రోజా మురిసిపోయేది.

రోజా నాకు అక్క. నాకంటే తొమ్మిదేళ్ళు పెద్ద. కానీ ఎందుకో తను నాతో ఉన్నప్పుడు చిన్నపిల్లయిపోయేది. అలా దగ్గరితనం వల్లనేమో నేను తనని రోజా అనే పిలిచేవాడిని. తను కూడా ఎప్పుడూ అక్క అని పిలవమని బలవంతం చెయ్యలేదు.

ఆరేళ్ళ వయసు నుండి నేను ఏదైతే వద్దంటారో దాన్నే చేసేవాడిని. దానికి తోడు నాన్నకేమో ముక్కు చివరనే కోపం ఉండేది. రెండు మూడు రోజులకొకసారి తప్పనిసరిగా దెబ్బలు పడేవి. నా ప్రవర్తన, ఏడుపు అలవాటు పడిపోయిన అమ్మ నేను వెక్కి వెక్కి ఏడుస్తే పెద్దగా పట్టించుకోకుండా తన రోజువారి పనిలో నిమగ్నమై ఉండేది. అలాంటి టైంలో రోజా నన్ను ఎత్తుకుని వరండా అవతలకి తీసుకొచ్చి కబుర్లు చెప్పి నా ఏడుపును తొందరగానే ఆపించేది. తన ఒడిలో కూర్చొబెట్టుకుని ఏవేవో కబుర్లు చెప్పటం వల్ల నాకు నాన్న మీద కోపం పోయి చాలా సాంత్వనగా ఉండేది. ఎప్పుడైనా తను ఖాళీగా ఉన్నప్పుడు వీపు మీద గుమ్మడి పండు వేయించుకుని ఇల్లంతా తిప్పేది. ఇంట్లో అటకల మీద కూర్చోబెట్టేది.

రోజా ముగ్గులు బాగా వేసేది. తన దగ్గర ఒక పెద్ద ముగ్గుల కలెక్షనే ఉండేది. ప్రతీ కొత్త సంవత్సరం తను ఓ రెండు, మూడు ముగ్గులు తనకు నచ్చినవి నాదగ్గరకు తీసుకొచ్చి ఏ ముగ్గు బాగుందిరా అని అడిగేది. ఇంచుమించుగా ప్రతీసారి నేను చెప్పిన ముగ్గునే వేసేది. రంగులు తను అద్దుతూ నాకు ఇచ్చి అద్దమనేది. అలా తను ముగ్గు వేస్తూ రంగులు అద్దినంతవరకూ నేను తన పక్కనే ఉండేవాడిని. తెచ్చుకున్న రంగులు, ముగ్గు పిండి అయిపోతే రయ్యిన ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళి తేవటం, వేసిన ముగ్గుకు చమ్కీ పొడి అద్దటం వంటివి చేసేవాడిని.

నాలుగో తరగతి వరకు పాడటమంటే ఇంట్లోని, ఎవరైనా చుట్టాలు వస్తే, స్కూల్లో పాడటం మాత్రమే నాకు తెలుసు. ఓసారి ఏదో పేపర్ లో పాటల పోటీలు జరుగుతున్నాయి అని చూసి రోజా నాకు చెప్పింది. ఆ రోజు స్కూలుకి వెళ్ళనీయకుండా మా ఇంటికి చాలా దూరంలో ఉన్న పోటీ జరిగే ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడ చూస్తే అందరు పెద్దవాళ్ళే ఉన్నారు. నాకు భయం వేసింది. రోజ ఆ విషయం గమనించి నన్ను స్టేజి వెనుకకు తీసుకెళ్ళింది. నన్ను ఒక పాట పాడమంది. కొన్ని తప్పొప్పులు సరిచేసింది. ధైర్యం చెప్పింది. నువ్వు పాడిన తర్వాత అందరు మెచ్చుకుంటారు అని ప్రోత్సహించింది. తను అలా చెప్పేసరికి నేను ఎటువంటి బెరుకు లేకుండా చంటి సినిమాలోని "జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమెలే...." అనే పాట పాడాను. పాట పూర్తయ్యాక రోజా దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో కూర్చొన్నాను. వెంటనే అందరూ అక్క ముందర నన్ను పొగుడుతుంటే తను ఎంతో ఆనందంగా కనిపించేది. పోటీ అయిపోయేక ఇంటికి వచ్చేదారిలో నేను ఏవి కొనమంటే అవి కొనేసేది.

రోజా తన ఇంటర్ తర్వాత కొన్నాళ్ళు ఒక స్కూల్లో టీచర్ గా పనిచేసేది. ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే అలవాటు ఎవ్వరికీ లేదు. బాగా చిన్నప్పుడు నాన్న బట్టలు కొనేవారు గాని ఆ తర్వాత్తర్వాత అది కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే రోజ సంపాదించటం మొదలు పెట్టిందో అప్పటినుండి ప్రతీ సంవత్సరం తనే నాకు పుట్టినరోజుకు బట్టలు కొనేది. ఇంచుమించు తన జీతం మొత్తం నా బట్టలకే ఖర్చు చేసేసేది. బట్టలు మాత్రమే కాకుండా నా అభిరుచికి తగ్గట్టు ఓ స్కెచ్ పెన్ పెకెట్టో, వాటర్ కలర్సో గిఫ్ట్ గా ఇచ్చేది. ఓ సారి రాఖీ పౌర్ణమి రోజు తన శక్తికి మించిందే అయినా నాకు వెండి రాఖీ ఒకటి కొని కట్టింది. మా ఇంటి చుట్టు పక్కన ఉండేవాళ్ళు రోజమ్మ వాళ్ళ తమ్ముడికి వెండి రాఖీ కట్టింది అని ఓ సంవత్సరం చెప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే తనతో ఎన్నో ఆత్మీయ అనుభవాలు...

అలా మా ఇంట్లో నాకు, రోజాకి మధ్య మిగిలిన అక్కలకు నాకు ఉన్న సంభందం కంటే ఒక ప్రత్యేకమైన అనుభందం ఉండేది. మిగిలిన అక్కలకు పూర్తి భిన్నంగా ఉండేది నా పట్ల తన ప్రవర్తన. అసలు ఒక మనిషి ప్రేమ పొందినప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందో తనవల్లే నాకు మొదట తెలిసివచ్చింది. నాకు బాగా గుర్తు. నాకప్పుడు పదేళ్ళు ఉంటాయి. తను నాకు ఎన్నెన్నో ఇష్టమైనని కొనిస్తుంది అని ఓ రోజు పిడతలో ఉన్న రెండు రూపాయలతో జడకి ఇరువైపులా పెట్టుకునే క్లిప్పులు కొనిచ్చాను. ఇవ్వడంలో ఉన్న ఆనందం మొదటిసారి తెలుసుకున్న రోజది. రోజ కూడా ఎంతో మురిసిపోయి అవి పాడైనంత వరకు కూడా రోజు స్కూలుకి పెట్టుకునే వెళ్ళేది.

నేను పదో తరగతి చదువుకునే రోజులవి. ఓసారి ఎందుకో రోజాకి బాగా జ్వరం వచ్చింది. మామూలు జ్వరం అని అనుకుని ఇంట్లో మాత్రలు వేశారు. రెండు మూడు రోజులయ్యింది. అయినా తనకి జ్వరం తగ్గలేదు. ఓ రాత్రి అందరం మంచి నిద్రలో ఉన్న వేళ తను హటాత్తుగా లేచి గుండేల్లో నొప్పంది. అమ్మ, అక్క చాతీమీద మర్ధన చెస్తే పడుకుంది. కానీ కాసేపటికే మళ్ళీ నొప్పి అని లేచింది. అర్ధరాత్రి టైం మూడవుతుంది. ఆ టైంలో మా ఊర్లో డాక్టర్లు ఉండరు. అందుకని కొంచెం తెల్లవారయితే హాస్పిటల్ కి తీసుకువెళ్ళొచ్చు అని నాన్న అనుకున్నారు. నాకు ఆ టైం లో తగినంత మెచ్యురిటీ లేకపోవటం వల్లనేమో మధ్యలో ఓసారి లేచి మూమూలు పరిస్థితే అనుకుని ముసుగుతన్ని పడుకున్నాను. తెల్లవారుతుందనగా రోజకి గుండెల్లో పెయిన్ ఎక్కువయ్యి, చాలా నీరసించిపోయి నాన్న భుజాలకు ఎత్తుకుని హాస్పటల్ కి తీసుకెళుతున్నరనగా నాన్న భుజాల మీదే ప్రాణాలు వదిలింది. అప్పుడు నాకు నిద్ర మత్తు వదిలి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను. కొన్నిరోజుల వరకు తను లేదన్న విషయంలో నాకు నమ్మకం కుదరలేదు.

తను ఎక్కడ ఉన్నా నా అభివృద్దిని చూస్తుంటుంది. పది మందికి నా గురించి గొప్పగా చెప్పుకుని ఆనందిస్తూ ఉంటుంది. చేతికి తనుకట్టిన రాఖీ లేకపోతేనేం....తను వెండి రాఖీ కట్టిన జ్ఞాపకం ఇంకా వాడిపోకుండా స్వచ్చంగానే ఉందికదా....అది చాలు.