31, డిసెంబర్ 2009, గురువారం

డిసెంబర్ 31 రాత్రి, జ్ఞాపకాల రంగవల్లి

- ఒక డిసెంబర్ 31
సాయింత్రం ఆరుగంటలు...
చిన్న చెడ్డీలో బొడ్డు కనిపించే బనీను వేసుకుని నేను...

మా రోజక్క బోల్డన్ని ముగ్గుల పుస్తకాలు, పేపర్లో వచ్చే వాటి కటింగ్స్ అన్నీ కుప్పగా ముందేసుకుని కూర్చొనుంది. ఏ ముగ్గు వేద్దామా అని ఆలోచిస్తూ...
"రోజా ఇది బాగుంది.." పక్కింటి ఆంటీగారు అప్పుడే వంట పూర్తి చేసుకుని వచ్చారు.
"అక్కా ఇది సూపర్.." వెనకింటి అమ్మాయి తన నిర్ణయం తెలిపేసింది.
"టీచర్..దిస్ ఈస్ గుడ్.." ట్యూషన్ కుర్రాడి మాటలు..

రోజక్క స్వతహాగా ఆర్టిస్ట్ కావటం వల్ల తను ముగ్గులు చాలా వీజీగా వేసేది.

చీకటి పడుతుందనగా ముగ్గులపోటీకి మేం సిద్దం అని సంకేతాలిస్తూ ఒక్కొక్కళ్ళ వాకిళ్ళు పేడనీళ్ళ కళ్ళాపుతో తడిసేవి...

ఇంటి అటక మీద ముగ్గు దిద్దడానికి ఉంచిన రంగుల పొట్లాలు అన్నీ తీసి ఒక ఇత్తడి పల్లెంలో పెట్టేది అమ్మ. అటకమీద ఎందుకు పెట్టేదంటే మాకు అందినంత ఎత్తులో ఉంటే వాటితో మధ్యాహ్నానికే యాపీ న్యూయియర్ అంటూ ఎక్కడపడితే అక్కడ సొట్ట సొట్టగా రాసిపడేస్తాం కదా..అందుకన్నమాట...చిన్న చిన్న తెరిచిన పొట్లాలలో ఉన్న రంగులు పల్లెంలోనే ఒక ఇంధ్రధనస్సు ఏర్పడిందా అన్నట్టు ఉండేవి. ఇంతలో చమ్కీ పొడి కొనలేదా అంటూ పెద్దక్క హడావిడి..."రోజమ్మా.. ఆ ధనలక్ష్మి(ముగ్గుల్లో అక్క కాంపిటేటర్) ఈ సారి నీకంటే పెద్ద ముగ్గేసి అందరు చేత పొగిడించుకోవాలని తెగ ఆరాటం పడుతుంది.." అని మా పనమ్మాయి చాడీలు ఒక పక్క...

చీకటి చిక్కగా పరుచుకున్నాక...కాలనీలో అందరి వాకిళ్ళో కళ్ళాపు కొంచెం ఆరాక ఒక్కో ఇంటి నుండి ఒక్కొక్కలు వచ్చి ముగ్గుపెట్టడం మొదలెట్టేవారు. చలి బాగా ఉండటం వల్ల పిల్లకాయలం అందరం మొహానికి దొంగోళ్ళలా మంకీ కేప్ లు వేసుకుని, నాన్నమ్మ సాలువానో తాతయ్య సాలువానో కప్పుకుని ముగ్గుల విజిటింగ్ కి వెళ్ళాం....ఒక్కోసేపు ఒక్కో ముగ్గు దగ్గర నిలబడటం...చూసిన ముగ్గుని వేరే వాళ్ళు వేసిన దానితో పోల్చి చూసుకోవటం..ఎవరిది గొప్ప అంటే ఎవరిది గొప్ప అని...మా ఎదిరింటి అనసూయమ్మ గారు మాత్రం ఓ అయిదు రెక్కలున్న ముగ్గు తొందరగా వేసేసి వాళ్ళ వాకిట్లో ఉన్న ముద్ద బంతి, చీమ బంతి పూలను రెక్కలు రెక్కలుగా విడగొట్టి వాటిని ముగ్గును నింపడానికి వాడేది. అది చూసి పెద్దవాళ్ళందరూ "అబ్బో..ఏమి పిసినారితనం" అంటూ బుగ్గలు నొక్కుకుంటుంటే పిల్లలందరూ ఆంటీ మీరు ఎప్పుడూ రంగులతో ఎందుకు ముగ్గు పెట్టరు అని డైరెక్టుగా అడిగేసేవారు. పాపం ఆవిడ ఏమి చెప్పాలో తెలియక పిల్లలను "ఇక్కడ నుండి ఎల్లండెల్లండి.." అంటూ మొహం మాడ్చుకుని తరిమేసేది.

మా ఇంటి ముందు ముగ్గు వేసేసేటప్పుడు చాలా మంది గుమిగూడేవారు. ఎందుకంటే అప్పటికే అక్క వేసిన ముగ్గులు వరసగా మూడు సంవత్సరాలు ఉత్తమ ముగ్గుగా కాలనీ వాళ్ళ ప్రశంసలు పొందాయి. ఈ సారి ఏ ముగ్గు వేస్తుందో చూద్దామని జనాల ఆరాటం....అందరికంటే లేటుగా అక్క ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసినా తొందరగా వేసేసేది. అదికూడా ముగ్గురక్కలు రంగులు దిద్దటంలో తలో చెయ్యి వెయ్యటం వల్ల తొందరగానే అయిపోయేది. నేనేమో రంగులు దిద్దుతానని ఒకటే అల్లరి చేసేవాణ్ణి. అమ్మేమో వీడికి చమ్కీలు అద్దే పని ఇవ్వండర్రా అంటూ అక్కలకు నన్ను సిఫారసు చేసేది. కానీ అక్కవాళ్ళు ఆ చాన్స్ కూడా ఇవ్వక హాపీ న్యూ ఇయర్ రాసే అక్షరాలలో ఏ పీ లెటరో వై లెటరో దిద్దమని ఇచ్చేవారు. కనీసం ముగ్గులో ఒక వైపు ఉన్న పువ్వో, ఫలమో, ఆకో రంగులద్దడానికి కావాలి అన్నది నా ప్రధాన డిమాండ్లు...ఇవ్వకపోతే ముగ్గు చెరిపేస్తా అంటూ బెదిరించేవాణ్ణి. కానీ చిన్నక్క నా చెయ్యిని గట్టిగా పట్టేసుకుని నాకు చెరిపే అవకాశం ఇచ్చేదికాదు..అలా ప్రతీసంవత్సరం చెరిపే చాన్స్ మిస్సయ్యేది.

తొమ్మిదయితే సగం రంగులు అద్ది అందరూ భోజనాలకి వెళ్ళి పిల్లకాయలను ఆవులు గట్రా ముగ్గును తొక్కకుండా కాపలాగా పెట్టేవారు. మా అక్క అయితే "ఒరేయ్..రంగులేమైనా అద్దావో వీపు పగిలిపోద్ది.." అంటూ హెచ్చరిక జారీ చేసి కాపలా ఉండమంది. నాకేమో రంగులద్దాలని తెగ కోరికగా ఉండేది. చేసేదేంలేక వంటిట్లోకి దొంగలా వెళ్ళి, మైదా పిండిని ఓ చిన్న పేకట్ కట్టుకుని పరిగెత్తాను. ఏ డొంకల్లోనో ఓ చిన్న ప్లేస్ చూసుకుని మూడు చుక్కలు మూడు వరసల ముగ్గేసి, ధనలక్ష్మి ఇంటికెళ్ళి ముగ్గు దగ్గర ఎవ్వరూ లేరని అనుకున్నాక అక్కడ ఉంచిన రంగులు కొంచెం కొంచెం కొట్టేసి పొట్లం చుట్టి తెచ్చుకుని దానికి రంగులు నింపాను. ఓ కళాఖండం రెడీ అయిపోయింది. నా చెడ్డీ దోస్తులకి దాన్ని చూపిద్దామని వాళ్ళని పిలవడానికని వెళ్ళాను. వాళ్ళను వెంటేసుకుని నేను వేసిన ముగ్గు దగ్గరకు వెళ్ళాను. కానీ విచిత్రంగా అక్కడ నా మూడు చుక్కల ముగ్గులేదు కానీ ఆవు పేడ అయితే ఉంది..ప్చ్..నా ముగ్గేమయిందో!!. మళ్ళీ వేసుకున్నాను..కానీ ఈ సారి బ్లాక్ అండ్ వైట్ మూడు చుక్కల ముగ్గుతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

అందరు ఇళ్ళల్లో ఒంటి గంట రెండు వరకు లైట్లు వెలుగుతూనే ఉండేవి. పాటలు..ఆటలతో తెగ సందండి...మా అక్క చేత వాళ్ళింటి ముందర ముగ్గు పెట్టించుకోడానికి ఓ ఇద్దరు ముగ్గురు మా ఇంటిలో ఉండేవారు. అందరి ముగ్గుల కార్యక్రమం అయ్యాక చూస్తే వీధి లైట్లలో ముగ్గులన్నీ చమ్కీపొడితో ధగ ధగ మెరిసిపోయేవి. కొంత సేపటికి ముగ్గును సన్నటి మంచుతెర కప్పుతుంటే మసకగా మెరిసిపోతూ కన్పించే ముగ్గు చాలా అందంగా ఉండేది. ఆ టైంలో అమ్మ అందరికీ టీ పెట్టి ఇచ్చేది. నాకు ప్రత్యేక గ్లాసులో ఇవ్వక తను కొంచెం తాగి ఇచ్చింది. అప్పుడే అర్ధమైంది...తొందరగా పెద్దయిపోవాలి..లేదంటే ఫుల్ గ్లాసు టీ ఇవ్వరని.

ముగ్గులు చూడడానికి పక్క కాలనీవాళ్ళు, మా కాలనీ వాళ్ళు కూడా ఇంటింటికీ తిరిగేవారు. కాలనీ అంతా ఏదో తిరనాళ్ళలా ఉండేది. ఎప్పటిలాగే అందరూ మా ఇంటి ముందున్న ముగ్గు దగ్గర కొంచెం ఎక్కువసేపు ఆగి మా అక్కని మెచ్చుకునేవారు. నేను ఇదిగో ఆంటీ నా ముగ్గు కూడా చూడండి అంటూ నా మూడు చుక్కలు మూడు వరసల ముగ్గు చూపించాను. కానీ ఒక్కరూ మెచ్చుకోలే...కనీసం అనసూయమ్మ ముగ్గుకంటే బాగుందని కూడా చెప్పలే...గొప్ప కోపం వచ్చింది ఆ టైంలో...

న్యూఇయర్ అయిపోయాక ప్రతీ వాళ్ళు ఇంటి ముందు కొత్త ముగ్గు వెయ్యక ఓ రెండు రోజులు అదే ముగ్గు ఉంచేవారు. కళ్ళముందు ఎప్పుడైనా చీపురుతో పాతముగ్గును అక్క తుడిచేస్తున్నప్పుడు నాలో ఒక బాల కళాకారుడు జారిపోతున్న చెడ్డీ ఎత్తుకుంటూ లేచేవాడు. చాలా భాద వేసేది. "అందుకేనమ్మా..నేను అంత కష్టపడి ముగ్గుపెట్టి రంగులద్దను...ఎప్పటికైనా తుడిచేయాల్సిందేగా.." అనసూయమ్మగారు అమ్మతో అనటం సన్నగా వినిపించేది.
బ్లాగ్మిత్రులందరికీ పేరు పేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు

7, డిసెంబర్ 2009, సోమవారం

ప్రేమ పేరుతో బంధీని చేస్తే....వీకెండ్ కావటంతో ఫ్రెండ్స్ అందరం ఎప్పటిలాగానే ఒకరి ఇంట్లో కలవటం...పిచ్చాపాటి కబుర్లు...జోకులు...చెణుకులు మధ్య హాయిగా గడిచిపోయింది. తెలంగాణ బంద్ వల్ల దియేటర్లు, షాపింగ్ సెంటర్లు, గోకార్టింగ్ లాంటి ఎంటర్టైన్మంట్ జోన్స్ మూసెయ్యటం మా ఆనందాల మీద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సాయింత్రం అందరం కలిసి సరదాగా కారులో అంతర్జాతీయ విమానాశ్రయంకి బయలుదేరాం. ఏ ప్లేస్ కి వెళ్ళినా మొదట అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లు పై పడటం మా వాళ్ళకు అలవాటు. ఎప్పటిలాగే వినడానికి వింతగా ఉండే అయిటేమ్స్ మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో ఆర్డర్ ఇచ్చేసి బాతాఖానీలో పడ్డాం. అయిటెమ్స్ రాగానే మారుమాట్లాడకుండా అందరం మెక్కుతూ కూర్చున్నాం...ఇంతలో మా అశ్విన్ గాడు బర్గర్ ని చేతిలోకి తీసుకుని కొంచెం సాస్ పోసి అభిమానంగా "ఏరా శేఖ్...తింటావా" అని నన్ను అడిగాడు. అంతే ఆ దృశ్యం చూసిన అశ్విన్ వాళ్ళావిడ ప్రణవి "తింటావా అని నన్నడకుండా శేఖర్ ని అడుగుతావా" అంటూ అలిగింది. మిగిలిన వాళ్ళకు ఏమీ అర్ధం కాలేదు. "ఎదురుగా నేను కనపడుతుంటే నన్నడకుండా వాడిని అడుగుతావా" అని మరోసారి అంది. అప్పుడువాడు బర్గర్ ని తనకు ఇవ్వబోయాడు. అంతే తను కోపంగా తిరస్కరించింది. నువ్వు ఇంకోబర్గర్ ని తింటావేమో అని నిన్నడగలేదు అని తను ఏదో వివరణ ఇవ్వబోతుండగా "ఎప్పుడైనా నువ్వు తినకుండా నేను తిన్నానా? ప్రతీసారి మనం షేర్ చేసుకుంటాం కదా" అని అంది. అంతే మా గ్యాంగ్ లోని మిగిలినవాళ్ళు నేను ప్రణవికి సవతిపోరు కలిగించానా అని ఆశ్చర్యంగానూ, వాడు నాకు ఇస్తున్నప్పుడు ప్రణవికి ఇవ్వరా అని వీడెందుకు అనలేదు అన్నట్టు వింతగానూ చూశారు.

ప్రణవికి అశ్విన్ మీద పొసెసివ్ నెస్ చాలా ఎక్కువ. తను ఎంత ఎక్కువగా అశ్విన్ ని ఇష్టపడుతుందో అంతే ఇదిగా అశ్విన్ కూడా తనను చూసుకోవాలని అనుకుంటుంది. అయితే అశ్విన్ కూడా తనపై అంతకు రెట్టింపు ప్రేమ చూపిస్తాడు. కానీ చిన్న విషయాలను కూడా ప్రణవి, అశ్విన్ కి తనపై ఉన్న ప్రేమని బేరీజువేసుకోడానికి ఉపయోగించటం వల్ల అశ్విన్ లైఫ్లో ఇలాంటి సంఘటనలు జరగటం మామూలు అయిపోయింది.

పొసెసివ్ నెస్....అంటే ఎదుటివాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని మనకు నచ్చినట్టు ప్రవర్తించేలా చేసుకోవటం ఏమో అని అనిపిస్తుంటుంది నాకు.

నిజానికి పొసెసివ్ నెస్ అనేది నిత్యం మనం చుట్టు ప్రక్కల మనుషుల్లో చూస్తునే ఉంటాం. ఒక తల్లి తన కొడుకు ఎప్పుడూ తనకి అడిగే అన్నీ కొనాలంటుంది. ఎప్పుడైనా వీలుకాక అడిగికొనటం కుదరకపోతే అతను ఏ పరిస్థితిలో తనని అడగలేదు అని ఆలోచించి అర్ధం చేసుకోడానికి ప్రయత్నించదు. తనపై గౌరవమర్యాదలు తగ్గటం వల్లే అలా చేసాడని ఫీలవుతుంది.

ఓ భార్య తనను ప్రతీరోజు ఆఫీసు నుండి ఇంటికి తీసుకొచ్చే భర్త ఏరోజైనా "నా చిన్నప్పటి స్నేహితుణ్ణి కలవాలి...ఈ రోజు నువ్వు ఆటోలో వెళ్ళు" అని గొంతులో స్నేహితుణ్ణి కలవబోతున్నానన్న ఆనందం చూపి చెబితే అర్ధం చేసుకోకుండా తెగ కోపం తెచ్చుకుంటుంది. పైగా తనకంటే స్నేహితుడే ఎక్కువా అంటూ వాదనకు దిగుతుంది.

ఓ పాతికేళ్ళ కుర్రాడు రూంలో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బయటకు వెళ్ళిన ప్రతీసారి తనతో ఎక్కడికి వెళుతున్నాడో చెప్పి వెళ్ళాలని ఆశిస్తాడు. ఎప్పుడైనా చెప్పకపోతే స్నేహితుడు మారిపోయాడని అనుకుంటాడు. అంతేగానీ తిరిగి వచ్చిన తర్వాత తనతో విషయాలన్నీ చెబుతాడు అన్న భరోసాతో ఉండడు.

ఎదుటివాళ్ళ స్వేచ్చకి భంగం కలగకుండా చూపించే ప్రేమ/అభిమానం అన్ని విధాల మంచింది. ఎప్పుడైతే మనం ప్రేమ/అభిమానం పేరుతో వాళ్లని వాళ్ళుగా ఉండనీకుండా కట్టడి చేస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమ పేరుతో విధించిన సంకెళ్ళను తెంచుకోడానికే ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పొసెసివ్ నెస్ వల్ల ప్రాక్టికాలిటీనీ మిస్సవుతాం. ఎవరైనా అశ్విన్ లాంటి ఒకలిద్దరు మాత్రం ఆ ప్రేమని అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చేస్తారంతే. మిగిలిన వాళ్ళు వారినుండి తప్పించుకోడానికి విషయాలను దాచిపెట్టడం, అబద్దాలతో మేనేజ్ చేసుకోవటం, నస కేసురా బాబు అంటూ వేరొకరిదగ్గర గోడు వెళ్ళబోసుకోవటం లాంటివి చెయ్యాల్సివస్తుంది.

24, నవంబర్ 2009, మంగళవారం

ఓటు - లోకం తీరు

"ఏంటే సుబ్బులూ...ఇయ్యాల ఏ కూరొండినావ్...."

"నీ కిట్టం అని బొమ్మిడాయల పులుసు సేసినాను మావ.."

"తొందరగా ఎట్టే...సేపల పులుసు ఇనగానే ఆకలి దంచేస్తుంది.."

సుబ్బులు తన భర్త ఎంకయ్య ముందు కంచం పెట్టి భోజనం వడ్డించింది.

"ఏమాటకామాటే సెప్పుకోవాలి...నీ సేత్తో సేసిన పులుసు కూర ముందు జేజమ్మల వంట కూడా దిగదుడుపేనే....అవునే...యపార్ట్ మెంట్ లో అలికిడి లేదేంటే...సానా మట్టుకు ఫ్లాటుల్లో లేట్లు ఎలగట్లేదేంటే...." పులుసు ముక్క సప్పరిస్తూ అడిగాడు ఎంకయ్య...

"ఇంకెక్కడి జనాలు మావ...ఫాట్లలో సానామందికి ఈ రోజు ఆపీసుల్లేవుగదా....ఓట్లు ఏస్తారని సెలవు ఇచ్చీరు...వరసగా మూడు రోజులు సెలవుల వల్ల అందరూ సొంతూళ్ళకు, ఇహార యాత్రలకు పోనారు...." కంచంలో మరికొంచెం అన్నం వడ్డిస్తూ చెప్పింది సుబ్బులు...

"ఈ రోజు పోలింగ్ బూతుకాడ సూసినావే....సదూకున్నోల్లు ఒక్కలైనా అగుపించారా?...మరి ఈల్లకు సెలవులెందుకే...ఆలే ఓటు ఎయ్యకపోతే మనలాంటోళ్ళు ఎవరేస్తారే?.."

"అట్టా అనకు మావ....కూసింత మనలాటోల్లే ఓట్లు ఎయ్యడానికి పోతారు...ఆలెందుకు ఏస్తారు...రేట్లెంత పెంచినా తిట్టుకుంటూ కొనుకుంటారు...కడుపు నింపుకుంటారు...కడుపునిండినోళ్ళకి ఏడకైనా పోయి సికారు చెయ్యాలనిపిత్తాది...లేపోతే టీవీకాడ కూకొని ఏ సినిమానో సూత్తారు గానీ ఈ రోజు ఓటేయ్యాల..అని ఎందుకు అనిపిస్తది మావ..."

"కరెస్ట్ గా సెప్పినావే...మన యపాట్మెంట్ ఎనకాల ఉన్న పేదల బస్తీలో ఉన్న గుడిసోల్లు శానామంది బూత్ కాడకి వచ్చినారు...అదే మన సుట్టూ పెద్ద పెద్ద సదువులు సదూతున్నోల్లు, ఉజ్జోగాలు సేసుకునే వాళ్ళు సగం మందైనా బూత్ కాడకి రానేదు...అంతేలే ఎంతసేపు సంపాదన..ఆల్ల జీవితాలు ఆల్లు సూసుకోడానికి సూపించుకుంటున్న శద్ద నగర అభివుద్దికి ఎందుకు సూపిత్తారులే....అయినా ఇట్టాంటి ఇసయాల్లో సదూకున్న ఆలికి మనకి పెద్దగా తేడా ఏమీలేదే సుబ్బులు"

"అవును మావ....ఈళ్ళ ఓట్లన్ని రిగ్గింగ్ సేసేసి అవి కూడా లెక్కల్లోకి కలిపేత్తారు....దానివల్ల మంచోడు ఎవడో రాడానికి బదులు ఏ తలమాసినోడో గెలిచి మన పానాలు తోడేస్తాడు....ఆల్లెవరో ఓటు ఎయ్యకపోవటం వల్ల మన జీవితాలు నాశనమవుతాయి....ఆల్లంతా బానే ఉంటారు....ఎటొచ్చి మనలాంటోల్లకే ఏది జరిగినా..."

"అవునే...సుబ్బులు..."

"సరేగానీ మాటల్లో పడి నువ్వు సక్కగ తిన్నావా మావ?"

"తిన్నానే...నీ పులుసు తింటున్నాను కాబట్టే బుర్ర బాగా పనిచేసి ఇయాల నీకు బదులు సెప్పగలుగుతున్నాను....లేపోతే నువ్వు ఇట్టాంటి ఇసయలా మీద మాటాడినట్టు నేనెలాగ మాటాడగలనే.."

"పో మావ...నీకన్నీ పరాచికాలే...." అంటూ తన చీర కొంగుతో ఎంకయ్య మూతి తుడిచి ఆప్యాయంగా అతడిని హత్తుకుంది సుబ్బులు.

12, నవంబర్ 2009, గురువారం

హ్యాపీడేస్ -- 'నెరజాణ'

నేను అశోక్..అందరూ బండ వెదవ అని అంటుంటారు..కానీ ఆ బక్కోడు శేఖర్ గాడు మాత్రం నా గాళ్ ఫ్రెండ్ ముందు అలా పిలవడానికి భయపడతాడు. అదిగోండి అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడే...వాడే శ్రీను గాడు...పొడుగ్గా సన్నగా ఉండి అన్నింటికీ ఒకటే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడు చూశారూ..వాడే విజయ్...అదిగోండీ మాటల్లోనే వచ్చాడు మా మదుగాడు..వాడి గాళ్ ఫ్రెండ్ ఇప్పుడు వాడిని బయటకు వదిలినట్టుంది...ఏంటి ఈ బక్కోడిని పరిచయం చేయలేదంటారా? వాడు మీకు తెలుసు కదండీ..వాడి రాతలతో ఓ బ్లాగు పెట్టి మీ సహనాన్ని పరీక్షిస్తుంటాడు...just kidding రా శేఖ్...మేమందరం ఇంజనీరింగ్ లో రూమ్మేట్స్...ఇప్పుడు సోల్ మేట్స్..సరేగానీ శ్రీను నువ్వు చెప్పరా మన 'నెరజాణ' గురించి...

'నెరజాణ' పేరు ఎత్తగానే గ్యాంగ్ లో అందరూ చుట్టూ వచ్చేశారు చూశారా?

అవి మేము ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులు..ఓ చిన్న పల్లెటూళ్ళో అయిదుగురం రూం తీసుకొని ఉండేవాళ్ళం...ఓ సారి కార్తీకంలో వీధి వాకిట్లో మా రూం ముందు తెరలు తెరలుగా మంచు పడుతోంది. అప్పుడు సమయం అయిదు గంటలు కావస్తోంది. ఎప్పటి లాగానే చదవటం కోసం నేను వాకిట్లో ఉన్న గడప మీద కూర్చి వేసి కూర్చొన్నాను. మామూలుగా అయితే ఆ టైంలో శేఖ్ గాడు కూడా లేచి చదువుతాడు..కానీ కాస్త చలిగా ఉండటంతో అశోక్ గాడి కంబలిని లాగేసుకుని, వంటికి చుట్టేసుకుని పందికి కజిన్ లాగా పడుకున్నాడు. చుట్టూ అల్లంత దూరంలో మంచు...ఇంటి ముందు వాకిట, అక్కడే ఉన్న సన్నజాజి మొక్క తప్పించి రోడ్డుకి అవతల వైపు ఉన్న చెరువు, పంటపొలాలు ఏమీ కనపడుట లేదు....కొద్ది సేపు తర్వాత సూర్యుడు లేలేత కిరణాలు మంచు బిందువులను ముద్దాడి నేలను తాకుతున్నాయి.

కాసేపటికి చదువుతూ చదువుతూ తలపైకెత్తి చూశాను. రోడ్డు మీద పొలం పనులు చేసుకునే వారు నడిచిపోతున్నారు. చెరువు కూడా మెరుస్తూ కనపడుతుంది. అకస్మాత్తుగా నా చూపు ఓ యుక్తవయసు అమ్మయిల గుంపు మీద పడింది. అందరూ ఇంచుమించు పదహారు,పదిహేడు వయసు మద్యనే ఉంటారు. ఒక్కొక్కరు స్టీలు కారియరు, గంప, పార పట్టుకుని చెప్పులైనా లేకుండా నడిచి పనులకు వెళుతున్నారు. మెరుపువేగంతో అందులో ఉన్న ఓ అమ్మాయి మీద నాదృష్టి పడింది. ఆమె పసుపు వర్ణ చాయ సూర్యుని లేలేత కిరణాలకు బంగారంలా మెరుస్తూ ఉంది. స్వచ్చమైన నవ్వు..చందమామ లాంటి మోము...పాదాలైతే ఆ కంకర తేలిన రోడ్డు మీద కందిపోతాయేమో అన్నంత సుతిమెత్తగా కనపడ్డాయి...సాదా సీదా మాసిన లంగా జాకెట్ వేసుకుని ఉంది. ఓ అప్సరస ఆ గుంపులో తిరుగుతుందేమో అన్నంత ఆశ్చర్యం కలిగింది నాకు. చూసి చూడగానే నాకు తెలీకుండానే ఏదో పాటలో ఉన్న చిన్న లిరిక్ పాడేసుకున్నాను.

"నే గనక నీరైతే నీ నుదుటిపైనే జారీ..అందాల నీ యదపై హుందాగ కొలువుంటా.."

కొన్ని రోజుల వరకు రూమ్మేట్స్ ఎవరికీ ఆ అమ్మాయి గురించి చెప్పలేదు.

"రేయ్ అశోక్ తర్వాత రోజు ఏమి జరిగింది?..."

చెప్తా..చెప్తా...ఇది నేనే చెప్పాలి..ఎందుకంటే ఆ రోజు శేక్ గాడు మొహంలో ఎక్స్ ప్రెషన్స్, వాడి కవితలు నాకింకా గుర్తున్నాయి..

శ్రీను గాడు కొద్దిరోజుల తర్వాత మా గుంపులో ఆ అప్సరస గురించి అందరికీ చెప్పాడు. ఎప్పుడూ తొమ్మిదింటికి కాలేజీ అయితే ఎనిమిదిన్నరకు ముందు ఎప్పుడూ లేవని నేను ఆ రోజు వేకువ ఝామునే లేచాను...శేఖర్, శ్రీను తో పాటు చదివేద్దామని.. కాదు ఆ అమ్మాయిని చూద్దామని..పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. శేఖ్ గాడు, నేను ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి కనపడుతుందా అని బుక్కు వైపు, రోడ్డు వైపు మార్చి మార్చి చూస్తున్నాము. కాసేపయ్యాక మాకు విసుగొచ్చి చదవటంలో మునిగిపోయాము.."రేయ్..అటు చూడండి" అన్న శ్రీను గాడి మాటతో రోడ్డువైపు చూశాము. ఓ నిమిషం ఇద్దరం ఆమెను చూస్తూ అలా ఉండిపోయాం. "గోదావరిలో మునకలు వేసే నిండు చందమామా...నేను చూసిన తొలి అందం నీ రూపం..ప్రకృతిలోని అందమంతా నీ రూపు దాల్చింది..నీ అందాన్ని వర్ణించ భాష లేదు నాలో.." అని శేఖ్ గాడు సినిమాలోని కవితలన్నీ చదివేస్తున్నాడు. నేనేం తక్కువ తిన్నానా? Every night in my dreams...I see u..I feel u...అని టైటానిగ్ సాంగ్ అందుకున్నాను. "నెల్లూరు నెరజాణ..నే కుంకమల్లే మారిపోనా..నువ్వు స్నానమాడు పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే.." అని శ్రీను గాడు మళ్ళీ పాట అందుకున్నాడు. నిజంగా ఆ అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఆ అమ్మాయి మట్టి పనులు చేసుకోడానికి వెళుతుందంటే మాకు అస్సలు నమ్మకం కుదరలేదు. శ్రీనుగాడు 'నెరజాణ' అని పేరు పెట్టేసాడు.

రోజూ అందరం అరుగు మీద చదివిన ప్రతీసారీ ఆ అమ్మాయికి సైటు కొట్టుకునేవాళ్ళం...ఓ సారి శ్రీను గాడు రొటీన్ కి భిన్నంగా మేడ ఎక్కి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే "ఓయ్.." అని గట్టిగా అరిచాడు 'దిల్ సే' సినిమా అప్పటికే చాలా సార్లు చూసిన అనుభవంతో...ఆ అమ్మాయి చూసింది. వాళ్ళ గుంపులో వాళ్ళు కూడా చూశారు..చూసి ముసి ముసిగా నవ్వుకుని వెళ్ళిపోయారు. ఇలా రోజూ వీడు మేడ మీదకెక్కి అరవటం..ఆ నెరజాణ చూడటం..ఓ సారి వీడు అరిచిన "ఓయ్" శభ్దం పక్కింటి అక్క(ఓనరుగారి అమ్మాయి) విని మా దగ్గరకు వచ్చింది. "ఏంటర్రా ఎవర్నో పిలుస్తున్నాడు శ్రీను.." అని అడిగింది. విషయం చెప్పి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాము...పేరు తనకు తెలీదు అంది..వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ "చూసుకోండర్రా..ఈ ఊరులో ఉన్న ఎవరైనా ఇలా మీరు అల్లరి చేయటం చూస్తే గుంపులుగా వచ్చి కొట్టడానికి చూస్తారు...అది మాత్రమే కాదు కాలో చెయ్యో తీసేయడానికి కూడ వెనుకాడరు...కాస్త జాగ్రత్త" అని చెప్పింది.

అక్క మాటలు విన్న విజ్జుగాడు, మధు గాడు సైటు కొట్టడం మానేసారు. ఆ అమ్మాయి అందం ముందు అక్క మాటలేవీ మా ముగ్గురి చెవికి ఎక్కలేదు. పొద్దున్న,సాయింత్రం ఫ్రీగా సైటు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం.

ఎప్పుడూ కాస్తంత దూరం నుండే ఆ అమ్మాయిని చూడటం...ఓ సారి రూంలో వంటకి సామానులు కావాలంటే నేను,శేఖ్ గాడు, శ్రీను గాడు ముగ్గురం రెండు సైకిళ్ళమీద చెరువు గట్టు పక్కనుండీ బజారుకు వెళుతున్నాము. సాయింత్రం అయిదు అవుతుంది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ నెరజాణ అండ్ బృందం ఎదురుపడ్డారు...వాళ్ళ గుంపు ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు, మేము ఎదురెదురు వచ్చాక ఆ అమ్మాయిని దగ్గరనుండి తినేసేటట్టు చూశాం..మా చూపులకి ఆ అమ్మాయి తలదించుకుంది...రావే అంటూ ఆ అమ్మాయిని మిగిలిన అమ్మాయిలు లాక్కొనిపోతున్నారు. మేము మాత్రం సైకిల్ దిగి అక్కడే ఉన్నాము. కొద్ది సెకనుల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి, ఆ గుంపులో మిగిలిన వాళ్ళు మా వైపు చూశారు...మేము చూస్తున్నామని గమనించి వెంటనే తలలు ముందుకు తిప్పేశారు...ఏవేవో మాట్లాడుకుంటూ, ముసి ముసి నవ్వులు కురిపిస్తూ వెళ్ళిపోతున్నారు...అయినా ఇంకా మేము అక్కడే ఉన్నాము...ఈ సారి నెరజాణ మాత్రమే వెనక్కి తిరిగి చూసింది మళ్ళీ...మా ముగ్గురి హృదయాల్లో ఏ.ఆర్ రెహమాన్ హై పిచ్ లో శాక్సాఫోన్ వాయించాడు.

కొద్దిరోజుల తర్వాత ఓ రోజు మేము ఫైనల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే పక్కింటి అక్క మా ఇంటికి వచ్చింది. "తెలుసా...మీ నెరజాణకి పెళ్ళి అయిపోయింది." అని చెప్పింది. పెళ్ళికొడుకు వాళ్ళు అంకుల్ కి తెలుసంట....ఆ మాట విన్న శేఖర్ గాడు లేక లేక ఉతుకుతున్న వాడి టవల్ ని అలాగే పడేసి పరిగెత్తుకొచ్చాడు...బుక్ చదువుతున్న శ్రీనుగాడు అజంతా శిల్పంలాగ వార్త విన్న వింటనే అలా ఉండిపోయాడు. నేను తలను గోడకి ఆన్చేసి విచారం ప్రకటించాను. అంతలోనే "ఎవరక్కా ఆ అబ్బాయి" అని అడిగాను.
"ఆ అబ్బాయి తాపీ మేస్త్రీ అట..టౌన్ లోనే పనిచేస్తున్నాడు.." అని చెప్పింది అక్క. "తాపీ మేస్త్రీ" అన్న పదం మా ముగ్గురి చెవిన పడగనే మొదటి సారి అనిపించింది మాకు....అనవవరంగా ఇంజనీరింగ్ చదువుతున్నామని...అదే టౌన్లో తాపీమేస్త్రీ చేసుకునుంటే మా ముగ్గిరిలో ఎవరో ఒకరం 'నెరజాణ' ని చేసుకునేవాళ్ళం కదా అని. బెడ్ రూంలో నుండి విజ్జుగాడి గొంతు "విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేనని.." సన్నగా పాడుతోందప్పుడు. ఆ సుకుమారి ఓ తాపీమేస్త్రీ చేతిలో పడటం అనే విషయం జీర్ణించుకోడానికి మాకు చాలా రోజులే పట్టింది.

28, అక్టోబర్ 2009, బుధవారం

అజ్ఞాత భక్తులూ... కాస్త ఆలోచించరూ...!!

మనిషికి ఏదైనా కష్టం వస్తే వెంటనే చేసేది దైవాన్ని తల్చ్చుకోవటం..ఆపై ప్రార్ధించి మన కష్టాన్ని గట్టేక్కిస్తే తనను దర్శించుకుంటానని మొక్కుకోవటం. కాస్త ఉన్నోళ్ళు అయితే కళ్యాణం చేయిస్తామనో, తృణమో పణమో చెల్లించుకుంటామనో వేడుకుంటారు. ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు, వాళ్ళ మనోభావాలను అనుసరించి వారి వారి మొక్కులు తీర్చుకుంటారు. పాత తరం లోనిది ఈతరంలో మారకుండా ఉన్నది ఏదైనా ఉందంటే అది ఈ మొక్కులు తీర్చుకునే కార్యక్రమమే అని అనిపిస్తుంది.

ప్రసిద్ది దేవాలయాలు తప్పించి చిన్న చిన్న గుడులకు భక్తులు హుండీలో వేసిన డబ్బులే గుడి నిర్వహణకి వాడతారు. ఇతరత్రా ఇంకేమీ ఆదాయమార్గాలు ఉండవు. అలాంటి గుళ్ళకు శక్తి మేరకు కానుకలు సమర్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తిరుపతి దేవుని విషయం తీసుకుంటే ఆ దేవాలయానికి ప్రభుత్వాల శ్రద్ద(అది ఏ రకమైనది అన్నది పక్కన పెడితే) మెండుగా ఉంటుంది. దాన్ని చూసుకోడానికి ఒక సంస్థ కూడా ఉంది. నిత్యం భక్తులు నుండి వచ్చే కానుకలు విలువ కోట్ల లోనే ఉంటాయి. వాటితో టీ.టీ.డీ వారు అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, హాస్పటల్లు ఇలా ఎన్నో నిర్మిస్తుంటారు. అవి కూడా తిరుపతిలోనే ఉంటాయి తప్పించి( కళ్యాణ మండపాలు మినహాయిస్తే..అవి కూడ డబ్బులకే ఇస్తారు)ఒక్క ఊళ్ళో నైనా ఫలాన స్కూలు టీ.టీ.డీ వాళ్ళు కట్టారు..ఫలాన గ్రామానికి నిత్యం త్రాగు నీరు టీ.టీ.డీ వాళ్ళు ఏర్పాటు చేసేరని మీరు విన్నారా? లేదంటే అంటురోగాలు ప్రబలిన గిరిజన ఊళ్ళో మందులు ఉచితంగా పంచివ్వటం చూశారా?

"అజ్ఞాత భక్తుడు మూడు కోట్ల విలువైన వస్తువు సమర్పించాడు.."

"అజ్ఞాత భక్తుడు ఆరుకోట్ల విలువైన వజ్రాలు స్వామి వారికి ఇచ్చారు.."

"తిరుపతి హుండీలో వెయ్యినోట్ల కట్టలు భారీగా కనుగొన్న ఆలయ నిర్వాహకులు.."

ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే/చూస్తూనే ఉంటాం. అంత పెద్ద పెద్ద మొత్తం వేసిన వారు పేరు ఎందుకు గోప్యంగా ఉంచుతారనేది పక్కన పెడితే అంతలా అభివృద్ది చెందిన దేవాలయానికి కోట్లు కోట్లు కుమ్మరించే బదులు వారి వారి ఊళ్ళకు ఏదైనా చెయ్యొచ్చు కదా అని అనిపించకమానదు. గతంలో ఓ సారి ఈనాడులో ఓ భక్తుడు తిరుపతి హుండీలో కోటి రూపాయలు వేశాడు అని వార్త పడింది. మరుసటి రోజే ఓ నిరుపేద గ్రామీణ అమ్మాయి ఆ అజ్ఞాత భక్తుడకు లేఖ రాసి ఈనాడుకు పంపించింది. దాన్ని ఈనాడులో మరుసటి రోజు ప్రచురించారు కూడా. ఆ లేఖలో ఆ అమ్మాయి 'అన్నికోట్లు దేవుని హుండీలో వేసే బదులు నాలాంటి కూలి చేసుకుని చదువంటే ఆసక్తి ఉన్నా చదవలేని వారికి కాసింత ఆర్ధికపరమైన అండ ఇచ్చి చదివించొచ్చు కదా' అని అడిగింది. ఆ అమ్మాయి కోరిక సబబైనదే. కాదంటారా?

ఓ కోటి రూపాయల్తో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎప్పుడూ బురదగా ఉండే రోడ్లు ను బాగు చేసి సిమెంట్ రోడ్డు వెయ్యిచ్చు. మంచి నీళ్ళకోసం కిలో మీటర్లు కాలినడకన వెళ్ళే ప్రాంతల్లో సురక్షిత నీరు ట్యాంకులు కట్టించి అందించవచ్చు. ఓ ప్రభుత్వ స్కూలుకు మంచి లైబ్రరీ సమకూర్చవచ్చు..భర్త పీడిత మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చెయ్యొచ్చు.. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. మనసుంటే మార్గాలెన్నెన్నో.. పైగా దేవుని హుండీలో వేస్తే వచ్చే తృప్తి కంటే వేల రెట్లు తృప్తి మన సొంతం అవుతుందంటే అతిశయోక్తికాదేమో! మనం చేసే పనిని దైవం తప్పక హర్షిస్తుంది.

కాబట్టి అజ్ఞాతలు కాస్త ఆలోచించండి. కోట్ల రూపాయలు వెచ్చించి దేవుడిని సంతోషపెడతారా లేక ఆ డబ్బుని మీ గ్రామ అభివృద్దికి గానీ, నిరుపేద వ్యక్తుల అభివృద్దికి గానీ వాడతారా? మీ ఎంపిక మొదటిదే అయితే మీరు చేస్తున్న పనికి ఏ దేవుడు ఎంతమాత్రం సంతోషపడడు. ఆయనను సంతోషపర్చాను అన్న భ్రమే మీకు మిగులుతుంది. మీ భక్తికి పెద్ద పెద్ద కానుకలు కొలమానంగా ఎప్పటికీ నిలవవు.

నాకు అనిపించిదేమిటంటే ఇకపై ఎప్పుడైనా వెంకన్నను గానీ మరే దేవుడిని గానీ మొక్కుకోవలసి వచ్చినప్పుడు నావంతుగా ఓ వెయ్యిరూపాయలు నీతరపున వేరే వాళ్ళకి అని మొక్కుకుంటాను...కోరిక తీరిన వెంటనే ఆ డబ్బును ఏదైనా అనాధ ఆశ్రమం వారికి పళ్ళు, స్వీట్లు పంచడమో, వచ్చినన్ని వంటసామాను కొనివ్వటమో లాంటివి చేస్తాను. అంతేగానీ హుండీలో మాత్రం వెయ్యకూడదనుకుంటున్నాను.

16, అక్టోబర్ 2009, శుక్రవారం

చీకటి వెలుగుల రంగేళి...మా ఊళ్ళో దీపావళికి ఓ నెల రోజుల ముందునుండే వీదిలో ఉండే షాపుల్లో రంగు రంగుల, రకరకాల గన్ లు అమ్మేవారు. రోజూ స్కూలుకి వెళుతూ ఆ గన్ ల వైపు ఆశగా చూడటం...ఎప్పుడు నాన్న అవి కొంటారో అని ఓ నిట్టూర్పు విడిచి మళ్ళీ స్కూలువైపుకి అడుగులు పడటం...ఇలా నాన్న గన్ కొనేంత వరకు ఎదురుచూపులు తప్పేవి కావు నాకు. అయితే అమ్మ మాత్రం దీపావళి చాలా రోజులు ఉందనగా గన్ కొననిచ్చేది కాదు...ఎందుకు ఇంత తొందరగా కొనేయటం..మద్యాహ్నాలు పడుకోకుండా ఢాం..ఢాం అంటూ గన్ లు పేల్చుకుంటూ టాపులేపేస్తారు పిల్లలందరూ కలసి అని నాన్నతో అనేది.

అయితే మా కాలనీలో పిల్లలందరూ అప్పటికే కొనుక్కుని పోటా పోటీగా గన్ లో కేపులు పెట్టి కాల్చేవారు. ఒక్కొక్కడు చేతిలో ఉన్న గన్ లతో హీరోల్లాగా ఫీలయిపోయేవారు. అందరు ఇళ్ళల్లోనూ లో క్వాలిటీ అంతగా ఉండని, నల్లరంగు వేసి ఉన్న గన్ మాత్రమే కొని పేట్టేవారు. దీని ధర మూడు రూపాయలే ఉన్నందున ఎవరింట్లోనూ ఆరు రూపాయల ధరతో టిప్ టాప్ గా కనిపించి మెరిసే బాడీ ఉన్న స్టీలుగన్ కొనేవారు కాదు. పిల్లలందరిలో ఎవరి దగ్గరైతే ఆ స్టీలు గన్ ఉంటుందో వాడు 'దొంగా పోలీస్' ఆటలో ఎప్పుడూ పోలిసే అన్నమాట. నాసిరకం నల్ల రంగు గన్ లు ఉన్నోళ్ళకు ఎప్పుడోగానీ పోలీస్ అయ్యే చాన్స్ వచ్చేదికాదు.

అయితే గన్ లు కొనుక్కోవటం ఒక ఎత్తైతే దానిలో కాల్చడానికి పెట్టే కేపులు కొనుక్కోవటం ఇంకో ఎత్తు. నేనైతే అమ్మ దగ్గర నుండి ఓ పావలా రాబెట్టడానికి చాలా కష్టపడాల్సివచ్చేది. తీరా అమ్మ పావలా ఇచ్చే టైంకి నా స్నేహితులందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇచ్చే పావలాతో అప్పటికే కేపులు కొనేసుకుని ఎగా దిగా, పోటా పోటీగా కాల్చేసి, కేపుల డబ్బా అయిపోయిన వెంటనే ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, బోరుకొట్టేసి ఏ ఇసకలోకో ఆడటానికి పోయేవారు. మరి నేను ఒక్కడినే గన్ కాలిస్తే మజా ఏమి ఉంటుంది..అందుకని తర్వాత రోజుకి కేపులు ఉంచుకుని ఆడుకోవడానికి నేను ఆ మట్టి దగ్గరకే పోయేవాడిని.

కేపులు రెండు రకాలుగా దొరికేవి. బొట్టుబిళ్ళంత సైజులో విడి విడిగా ఉండి ఓ గుండ్రటి చిన్న డబ్బాలో వాటిని పేక్ చేసి అమ్మేవారు. అందులో సగం పైగా కేపులకి మందు ఉండేది కాదు. రెండో రకం కేపులు రీలు మాదిరి ఉండేవి. ఇవి కొంచెం ఖరీదైనవి. మామూలు కేపులు పావలాకి ఒక డబ్బా వస్తే రీలు టైపు కేపులు ముప్పావలా ఖరీదు ఉండేవి. రీలు కేపులు ఒక్కసారి గన్ లో లోడ్ చేస్తే ఢాం..ఢాం అని కంటిన్యూస్ గా కాల్చవచ్చు. తొందరగా అయిపోతాయి కూడా...వాటితో మేము ఊహించుకుంటున్న హీరోయిజం వచ్చేది. అయితే అందరిళ్ళల్లోనూ పావలానే మొహాన కొట్టేవాళ్ళు. గుండ్రటి కేపులు విడి విడిగా ఉండి ఒకటి తర్వాత ఒకటి గన్ లో పెట్టుకుని కాల్చుకోవటం వల్ల ఎక్కువ టైం పట్టి ఆరోజు గడిచిపోయేది. మళ్ళీ మళ్ళీ పావలా అని అదే రోజు ఇంట్లో వాళ్ళని పీక్కుతినే అవకాశం ఉండేది కాదు.

గన్ లు కొద్ది రోజులకే పాడయ్యేవి...పాడయ్యేవి అనేకంటే మేము దాన్ని అదే పనిగా కాల్చటంతో దీపావళి రాకముందే హరీ అనేవి...అప్పుడు మాత్రం మేము తగ్గుతామా....ఒక నట్టు, బోల్టు తీసుకుని నట్టు మీద గుండ్రటి కేపు పెట్టి దాని మీద బోల్టు బిగించి పై నుండి వదిలితే అది ఢాం..అంటూ పేలేది. ఈ ప్రాసెస్ గన్ తో పోలిస్తే కొంచేం ఈజీ...గన్ లు బాగా ఉన్న పిల్లకాయలు కూడా ఈ పద్దతికి వచ్చేసేవారు...ఇక చూడండి..పెద్దవాళ్ళ గుండెల్లో రైల్లు పరిగెత్తేవి...ఏ స్కూటర్కో లేక సైకిల్ కో ఉన్న నట్లు..బోల్టులు తీసేస్తామేమో అని....పిల్లకాయల కళ్ళు ఎక్కడ నట్టు దొరుకుతుందా అని వెతికేవి.

కాస్త ఎదిగి నిక్కర్లు వేసుకునే వయసు నుండి ప్యాంట్ వేసుకునే వయసు వచ్చేసరికి మందు కొనుక్కుని మేమే చిచ్చుబుడ్లు, మతాబులు తయారు చేసుకునేవాళ్ళం..అందుకే దీపావళికి కొన్ని రోజులు ముందు ఆ హడావిడి ఉండేది. అప్పటికి చెడ్డీలేసుకున్న కుర్రోళ్ళందరూ గన్ లు కాల్చుకుంటూ మాకు వారసులుగా తయారు అయ్యేవారు. అప్పుడు చూడాలి...మేము వాళ్ళు మా ముందు గన్ లు కాలిస్తే వాళ్ళ చేతిలోని గన్ లు లాగేసుకుని ఏడిపించేవాళ్ళం. ఏరా..ఇంకోసారి మనుషులకి దగ్గరగా కాలుస్తారా అని వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాళ్ళం. వాళ్ళు కాస్త భయపడి దూరంగా వెళ్ళి కాల్చుకునేవారు. మేము మాత్రం అప్పుడే వస్తున్న మీసాలను మెలేసుకుని చిన్నపిల్లలకు భయపేట్టేమంటే మనం పెద్దవాళ్ళం అయిపోయినట్టేరా అని అనుకునేవాళ్ళం. రాత్రి వెలిగించే చిచ్చుబుడ్లు తయారు చేసుకున్నవి కావటంతో చాలా సేపు వెలిగేవి. అవి అంతసేపు కాలటం చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తే గొప్పగా అనిపించేది. ఇలా పదో తరగతి దాకా ప్రతీ దీపావళికి చిన్న చిన్నవిగా అనిపించే గొప్ప ఆనందాలు మా సొంతం.

కాలేజీకి వెళ్ళే వయసులో మా దీపావళి ఆనందాలను వీక్లీ ఎగ్జామ్స్, ఎంసెట్టు హరించేసేది. ఆ తర్వాత ఇంజనీరింగ్..మా దురదృష్టమో ఏమో గానీ మా సెమిష్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడూ దీపావళి టైంలోనే పడేవి. ప్రపంచం అంతా కాలుస్తుంటే బుక్కు ముందేసుకుని చదువుతున్నప్పుడు నాలో ఒక అపరిచితుడు బయటకు వచ్చేవాడు... డిగ్రీ అయ్యాక ఉద్యోగాలు వెంటనే రాకపోవటం...అది కలిగించే అభద్రత..ఇంకెవడికో మనకంటే ముందే వచ్చేసిందన్న భాద..వెరసి ఇవన్నీ బోల్డంత ఫ్రీ టైం ఉన్నప్పటికీ దీపావళి వచ్చినా ఎంజాయ్ చెయ్యాలన్న మనసు ఉండేది కాదు... ఆ తర్వాత ఇంక చెప్పేదేముంది? ఉద్యోగాలు రావటం...మన పక్కింటోడు ఏం చేస్తాడో కూడా తెలుసుకోలేని బిజీ జీవితాలు...ఇంటికి దూరంగా ఉండటం వల్ల దీపావళి అనే ఒక పండగ వచ్చి పోయింది అని అనుకునే వరకే ఉండేది పండగ సంబరం...పండగ పూట కూడా ఆఫీసుల్లో పని చేయటాలు లాంటివి దీనికి అదనం...

అందుకే అన్నారు ఓ పెద్దాయన....చీకటి వెలుగుల రంగేళి....జీవితమే ఒక దీపావళి...

బ్లాగ్మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు

23, ఆగస్టు 2009, ఆదివారం

మా ఇంటి గణపయ్య...బొజ్జ గణపయ్య
నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదకు దండు బంపు
కమ్మని నేయియను కడు ముద్దపప్పును
బొజ్జ విరగగ దినుచు పొరలు కొనుచు"పుస్తకాలు దేవుడు దగ్గర పెట్టండర్రా..!!" అమ్మ వంటిల్లో కుడుములు చేస్తూ అంది.

నేను, నా ఫ్రెండ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ముసిముసిగా నవ్వుకున్నాం.

"
వయసులో పుస్తకాలు ఏముంటాయి ఆంటీ..కావాలంటే నా లాప్ టాప్ పెట్టనా..అందులో మా ప్రాజెక్ట్ ఉంది. ఎప్పటి నుండో ఉన్న మొండి బగ్గులు ఫిక్స్ అవుతాయేమో.. " మా ఫ్రెండు గాడు అమ్మతో అన్నాడు.

"
ఒరేయ్..నీ ప్రాజెక్ట్ లో బగ్ లు అన్నీ ఫిక్స్ అయిపోతే, అక్కడ క్లైయింట్ గాడు ఉద్యోగులను తగ్గించమని మైల్ కొడితే అసలుకే ఎసరు..నీ ఇష్టం మరి" అన్నానేను.

"
అవున్రోయ్...అలా అయితే మన బ్లాగులు లాప్ టాప్ లో ఓపెన్ చేసి పెట్టి వినాయకుడు దగ్గర పెడదాం" అన్నాడు వాడు.

మనసులో నేను- వీడికి కొంపదీసి మెదడు వాపు రాలేదు కదా! ఇంత క్రియేటివ్ గా ఆలోచించేస్తున్నాడేంటబ్బా!!

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో నా బ్లాగు, మోజిల్లాలో వాడి బ్లాగు ఓపెన్ చేసి వినాయకుడు దగ్గర లాప్ టాప్ పెట్టాం.

"
ఏంటర్రా..మాటలేనా..ఉండ్రాళ్ళు చుట్టే ఆలోచన ఏమైనా ఉందా" అన్న అమ్మ మాటలతో మా సోదికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టి పనిలో పడ్డాము.

అప్పటి వరకు అమ్మ చుట్టి వదిలేసిన ఉండ్రాళ్ళు నున్నగా, గుండ్రంగా వస్తే మేమిద్దరం చుట్టిన ఉండ్రాళ్ళు అంగారక గ్రహంలో దొరికిన Objects లాగ వచ్చాయి.


ఫోటో తీసింది/కళ : తోట తరణి బ్రదర్స్ -- ఎవరా అని ఆశ్చర్యపోకండి...మా మిత్ర ద్వయం...అప్పుడప్పుడు అలా ఫీలవుతుంటాం లెండి :))


****


బ్లాగ్మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

15, ఆగస్టు 2009, శనివారం

నువ్వు లేక నేను లేనునా మనసు భావాలు నీ మాటల పలుకులవుతుంటే
మౌనమే
నా భాష కాదా!!


నువ్వు నా పక్కన ఉంటే
వసంతం రాకపోకల గురించి నాకెందుకు?

నీ కురులు సుతారంగా మోమును తాకిన వేళ
నన్ను నేనే మైమరచి పోయా

మనం మరింత దగ్గరైనప్పుడు
నీ శ్శాస రుచిని కూడా చూడగలను నేను

నీ చేతి స్పర్శ ఎన్నో భావాలు పలుకగలదు
భావాలు అందుకున్న నా మనసు ఒక్కసారిగా తేలికైపోదూ!!!

ఇన్నాళ్ళకు మనల్ని విడదీయడం ద్వారా
కాలం తన అక్కసుని వెళ్ళగక్కింది

నువ్వు లేని ఒంటరితనం లో
నేను ఉన్నా లేనట్టే


4, ఆగస్టు 2009, మంగళవారం

మరపురాని భందం...మరిచిపోలేని అనుభందం

రాఖీ పండుగ వచ్చిందంటే పిల్లలందరం నీ రాఖీ చూపించంటే నీ రాఖీ చూపించు అని, నీ రాఖీ పెద్దదా లేక నా రాఖీ పెద్దదా అని పోల్చుకుంటూ తెగ సందడి చేసే రోజులవి. ఆ సందండి లోనూ మనసు ఫీలయ్యే మరో ఆనందం ఉండేది. ఎందుకంటే రోజా ఎంతో కష్టపడి ఎన్నెన్నో షాపులు తిరిగి నా మనసుకు నచ్చుతుంది అని నిర్ధారించుకున్నకే రాఖీ కొనేది. నిజంగా తను నా చేతికి కట్టిన రాఖీ నా స్నేహితులందరు కట్టుకున్న దానికంటే చాలా బాగుండేది. పిల్లలందరు "ఒరేయ్..నీ రాఖీ చాలా బావుందిరా" అని అంటున్నప్పుడు నా మొహంలో కనపడే ఆనందం చూసి రోజా మురిసిపోయేది.

రోజా నాకు అక్క. నాకంటే తొమ్మిదేళ్ళు పెద్ద. కానీ ఎందుకో తను నాతో ఉన్నప్పుడు చిన్నపిల్లయిపోయేది. అలా దగ్గరితనం వల్లనేమో నేను తనని రోజా అనే పిలిచేవాడిని. తను కూడా ఎప్పుడూ అక్క అని పిలవమని బలవంతం చెయ్యలేదు.

ఆరేళ్ళ వయసు నుండి నేను ఏదైతే వద్దంటారో దాన్నే చేసేవాడిని. దానికి తోడు నాన్నకేమో ముక్కు చివరనే కోపం ఉండేది. రెండు మూడు రోజులకొకసారి తప్పనిసరిగా దెబ్బలు పడేవి. నా ప్రవర్తన, ఏడుపు అలవాటు పడిపోయిన అమ్మ నేను వెక్కి వెక్కి ఏడుస్తే పెద్దగా పట్టించుకోకుండా తన రోజువారి పనిలో నిమగ్నమై ఉండేది. అలాంటి టైంలో రోజా నన్ను ఎత్తుకుని వరండా అవతలకి తీసుకొచ్చి కబుర్లు చెప్పి నా ఏడుపును తొందరగానే ఆపించేది. తన ఒడిలో కూర్చొబెట్టుకుని ఏవేవో కబుర్లు చెప్పటం వల్ల నాకు నాన్న మీద కోపం పోయి చాలా సాంత్వనగా ఉండేది. ఎప్పుడైనా తను ఖాళీగా ఉన్నప్పుడు వీపు మీద గుమ్మడి పండు వేయించుకుని ఇల్లంతా తిప్పేది. ఇంట్లో అటకల మీద కూర్చోబెట్టేది.

రోజా ముగ్గులు బాగా వేసేది. తన దగ్గర ఒక పెద్ద ముగ్గుల కలెక్షనే ఉండేది. ప్రతీ కొత్త సంవత్సరం తను ఓ రెండు, మూడు ముగ్గులు తనకు నచ్చినవి నాదగ్గరకు తీసుకొచ్చి ఏ ముగ్గు బాగుందిరా అని అడిగేది. ఇంచుమించుగా ప్రతీసారి నేను చెప్పిన ముగ్గునే వేసేది. రంగులు తను అద్దుతూ నాకు ఇచ్చి అద్దమనేది. అలా తను ముగ్గు వేస్తూ రంగులు అద్దినంతవరకూ నేను తన పక్కనే ఉండేవాడిని. తెచ్చుకున్న రంగులు, ముగ్గు పిండి అయిపోతే రయ్యిన ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళి తేవటం, వేసిన ముగ్గుకు చమ్కీ పొడి అద్దటం వంటివి చేసేవాడిని.

నాలుగో తరగతి వరకు పాడటమంటే ఇంట్లోని, ఎవరైనా చుట్టాలు వస్తే, స్కూల్లో పాడటం మాత్రమే నాకు తెలుసు. ఓసారి ఏదో పేపర్ లో పాటల పోటీలు జరుగుతున్నాయి అని చూసి రోజా నాకు చెప్పింది. ఆ రోజు స్కూలుకి వెళ్ళనీయకుండా మా ఇంటికి చాలా దూరంలో ఉన్న పోటీ జరిగే ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడ చూస్తే అందరు పెద్దవాళ్ళే ఉన్నారు. నాకు భయం వేసింది. రోజ ఆ విషయం గమనించి నన్ను స్టేజి వెనుకకు తీసుకెళ్ళింది. నన్ను ఒక పాట పాడమంది. కొన్ని తప్పొప్పులు సరిచేసింది. ధైర్యం చెప్పింది. నువ్వు పాడిన తర్వాత అందరు మెచ్చుకుంటారు అని ప్రోత్సహించింది. తను అలా చెప్పేసరికి నేను ఎటువంటి బెరుకు లేకుండా చంటి సినిమాలోని "జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమెలే...." అనే పాట పాడాను. పాట పూర్తయ్యాక రోజా దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో కూర్చొన్నాను. వెంటనే అందరూ అక్క ముందర నన్ను పొగుడుతుంటే తను ఎంతో ఆనందంగా కనిపించేది. పోటీ అయిపోయేక ఇంటికి వచ్చేదారిలో నేను ఏవి కొనమంటే అవి కొనేసేది.

రోజా తన ఇంటర్ తర్వాత కొన్నాళ్ళు ఒక స్కూల్లో టీచర్ గా పనిచేసేది. ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే అలవాటు ఎవ్వరికీ లేదు. బాగా చిన్నప్పుడు నాన్న బట్టలు కొనేవారు గాని ఆ తర్వాత్తర్వాత అది కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే రోజ సంపాదించటం మొదలు పెట్టిందో అప్పటినుండి ప్రతీ సంవత్సరం తనే నాకు పుట్టినరోజుకు బట్టలు కొనేది. ఇంచుమించు తన జీతం మొత్తం నా బట్టలకే ఖర్చు చేసేసేది. బట్టలు మాత్రమే కాకుండా నా అభిరుచికి తగ్గట్టు ఓ స్కెచ్ పెన్ పెకెట్టో, వాటర్ కలర్సో గిఫ్ట్ గా ఇచ్చేది. ఓ సారి రాఖీ పౌర్ణమి రోజు తన శక్తికి మించిందే అయినా నాకు వెండి రాఖీ ఒకటి కొని కట్టింది. మా ఇంటి చుట్టు పక్కన ఉండేవాళ్ళు రోజమ్మ వాళ్ళ తమ్ముడికి వెండి రాఖీ కట్టింది అని ఓ సంవత్సరం చెప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే తనతో ఎన్నో ఆత్మీయ అనుభవాలు...

అలా మా ఇంట్లో నాకు, రోజాకి మధ్య మిగిలిన అక్కలకు నాకు ఉన్న సంభందం కంటే ఒక ప్రత్యేకమైన అనుభందం ఉండేది. మిగిలిన అక్కలకు పూర్తి భిన్నంగా ఉండేది నా పట్ల తన ప్రవర్తన. అసలు ఒక మనిషి ప్రేమ పొందినప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందో తనవల్లే నాకు మొదట తెలిసివచ్చింది. నాకు బాగా గుర్తు. నాకప్పుడు పదేళ్ళు ఉంటాయి. తను నాకు ఎన్నెన్నో ఇష్టమైనని కొనిస్తుంది అని ఓ రోజు పిడతలో ఉన్న రెండు రూపాయలతో జడకి ఇరువైపులా పెట్టుకునే క్లిప్పులు కొనిచ్చాను. ఇవ్వడంలో ఉన్న ఆనందం మొదటిసారి తెలుసుకున్న రోజది. రోజ కూడా ఎంతో మురిసిపోయి అవి పాడైనంత వరకు కూడా రోజు స్కూలుకి పెట్టుకునే వెళ్ళేది.

నేను పదో తరగతి చదువుకునే రోజులవి. ఓసారి ఎందుకో రోజాకి బాగా జ్వరం వచ్చింది. మామూలు జ్వరం అని అనుకుని ఇంట్లో మాత్రలు వేశారు. రెండు మూడు రోజులయ్యింది. అయినా తనకి జ్వరం తగ్గలేదు. ఓ రాత్రి అందరం మంచి నిద్రలో ఉన్న వేళ తను హటాత్తుగా లేచి గుండేల్లో నొప్పంది. అమ్మ, అక్క చాతీమీద మర్ధన చెస్తే పడుకుంది. కానీ కాసేపటికే మళ్ళీ నొప్పి అని లేచింది. అర్ధరాత్రి టైం మూడవుతుంది. ఆ టైంలో మా ఊర్లో డాక్టర్లు ఉండరు. అందుకని కొంచెం తెల్లవారయితే హాస్పిటల్ కి తీసుకువెళ్ళొచ్చు అని నాన్న అనుకున్నారు. నాకు ఆ టైం లో తగినంత మెచ్యురిటీ లేకపోవటం వల్లనేమో మధ్యలో ఓసారి లేచి మూమూలు పరిస్థితే అనుకుని ముసుగుతన్ని పడుకున్నాను. తెల్లవారుతుందనగా రోజకి గుండెల్లో పెయిన్ ఎక్కువయ్యి, చాలా నీరసించిపోయి నాన్న భుజాలకు ఎత్తుకుని హాస్పటల్ కి తీసుకెళుతున్నరనగా నాన్న భుజాల మీదే ప్రాణాలు వదిలింది. అప్పుడు నాకు నిద్ర మత్తు వదిలి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను. కొన్నిరోజుల వరకు తను లేదన్న విషయంలో నాకు నమ్మకం కుదరలేదు.

తను ఎక్కడ ఉన్నా నా అభివృద్దిని చూస్తుంటుంది. పది మందికి నా గురించి గొప్పగా చెప్పుకుని ఆనందిస్తూ ఉంటుంది. చేతికి తనుకట్టిన రాఖీ లేకపోతేనేం....తను వెండి రాఖీ కట్టిన జ్ఞాపకం ఇంకా వాడిపోకుండా స్వచ్చంగానే ఉందికదా....అది చాలు.

19, జులై 2009, ఆదివారం

గణితంతో తకధిమితోం


లెక్కలు సబ్జెక్ట్ అనగానే అప్పటివరకు లయబద్దంగా కొట్టుకుంటుండే గుండెకాయ కాస్త శ్రీలక్ష్మి పాట లాగ అపశృతిలో కొట్టుకునేది. అంకెలు, కూడికలు, హెచ్చవేతలు, భాగాహారాలు..ఈ పేర్లు వింటేనే చెయ్యి నాకు తెలీకుండానే బుర్రమీదకు పరిగెత్తేది. కళ్ళేమో నా మనస్థితిని తెలుపాలన్నట్టుగా రంగులరాట్నంలా తిరిగేసేవి. కొట్టడం, తిట్టడం వల్ల లాభం లేదనుకున్న ప్రవేటు టీచర్ భాగ్యలక్ష్మి నేను కొంచెం సిగ్గరి అని తెలుసుకుని, ఇవన్నీ నేర్చుకోకపోతే చొక్కాతీసి (నిక్కరుకు కన్సెషన్ ఇచ్చేసి) రోడ్డుమీద నిలబెట్టిస్తాను అని భయపెట్టి, ఒకటికి పదిసార్లు నాతో లెక్కలు చేయించటం మొదలుపెట్టింది. ఎప్పుడైనా అర్ధం కాక త్వరగా నేర్చుకోకపోతే నాకంటే పెద్దపిల్లలతో "ఒరేయ్ వీడి నిక్కరు విప్పి రోడ్డుమీద నిలబెట్టించండి" అనేసరికి ఏడుపు తన్నుకొచ్చేసేది. ఆవిడ భయపెట్టడం వల్లో లేక ఆవిడ అర్ధమయ్యే రీతిలో ఒకటికి రెండుసార్లు చెప్పటం వల్లో తెలీదుగానీ ఆరేళ్ళకే నేను అన్నీ నేర్చేసుకున్నాను. స్కూల్లో జాయిన్ అవడానికి అమ్మతో వెళ్ళినప్పుడు హెడ్మాస్టర్ చిన్న పరీక్ష పెట్టి "ఈ అబ్బాయిని మూడో తరగతిలో జాయిన్ చేయండి" అని మా అమ్మతో చెప్పి నన్ను మూడో తరగతి క్లాసులో కూర్చొబెట్టించారు.

ఇంక అప్పటినుండి నా లెక్కల కష్టాలు మళ్ళీ మొదలు. తరగతిలో ఓ ఏభైమందికి పైగా పిల్లలు ఉన్న దుంపలబడి స్కూల్లో ఎవడూ పట్టించుకోకపోవటంతో నా లెక్కల నాలెడ్జ్ నిధులు లేక సగం కట్టి ఆపేసిన గవర్నమెంట్ బిల్డింగ్ లా భాగ్యలక్ష్మీ టీచర్ వేసిన పునాది దగ్గరే ఆగిపోయింది.

నాలుగో తరగతి లో ప్రతీరోజు ఓ రెండు లెక్కలు క్లాసులో చెప్పనివి హోం వర్క్ ఇచ్చి మరుసటిరోజు చేసుకురమ్మనేవారు. ఇంట్లో అక్కావాళ్ళకు కూడా లెక్కల్లో పెద్ద ప్రావీణ్యం లేకపోవటంతో, నా బుర్రలో గుడ్డిలో మెల్లగా ఉన్న నాలెడ్జ్ ని బలవంతంగా బయటకు లాగినా ప్రయోజనం లేకపోవటంతో టెక్స్ట్ బుక్ వెనుక ఉన్న ఆన్స్ ర్ వేసి, దానికి ముందు ఓ నాలుగు పిచ్చి స్టెప్లు వేసేసి మరుసటి రోజు స్కూలుకి పోయేవాడిని. అప్ప్పుడప్పుడూ దొరికినప్పుడు మాత్రం 'జనకు జన పాయల్ భాజే' అయ్యేది. ('సీతాకోక చిలుక' సినిమాలో చిన్న ఆలీని వాళ్ళమ్మ కొట్టే సీను గుర్తుకుతెచ్చుకోండి)

అలా ఓ మూడు బూతు స్టెప్ లు, ఆరు కిట్టించిన ఆన్సర్ల తో సాగిపోతున్న నా లెక్కల ప్రయాణంలో విధి టీ.సి లాగా ఎంటరయ్యింది నవోదయ పరీక్ష రూపంలో.... "మీ అబ్బాయి బాగా చదువుతాడు కదా, అందుకని ఒకలిద్దరి పిల్లలకోసం నవోదయ అప్లికేషన్ తెచ్చి ఉంచాను. మీ వాడి చేత నింపిన ఫారాలు పంపించండి" అని మా హెడ్ లేని మాస్టారు మా నాన్నకు నవోదయ అప్లికేషన్ ఇచ్చారు. అంతే ఆ సాయింత్రం మా నాన్న బుక్ షాపుకు తీసుకెళ్ళి పేద్ద నవోదయ గైడ్ కొన్నారు. అందులో అన్నీ విభాగాలు ఇంటరెస్టింగ్ గానే ఉండేవి...ఒక్క లెక్కలు తప్ప..ఓర్నాయనో..మళ్ళీ ఈ లెక్కల భాద తప్పేట్టు లేదు అనుకొని అయిష్టం గానే చూశాను. "ఫలానాది సాధించండి..."--"దీన్ని తిప్పి కొడితే ఏమవుతుంది"--"దాన్ని తిరగేసి మరగేస్తే ఏమవుతుంది" లాంటి ప్రశ్నలు చూసి జడుసుకొని మళ్ళీ ఎప్పుడు ఆ సెక్షన్ మొహం చూడలే.

ఓసారి నాన్న నా నవోదయ ప్రిపరేషన్ ఏస్థాయిలో ఉందో అని బుక్ తీసి లెక్కల్లో కొన్ని ప్రశ్నలు వేశారు.

నాన్న: పన్నెండుకి క.సా.గు (కనిష్ట సామాన్య గుణిజం L.C.F) ఎంత?

నేను : లెక్కల్లో సామాన్య శాస్త్రం ఎందుకొచ్చిందబ్బా అని డవుట్ వచ్చి పిచ్చి చూపులు...

నాన్న : చెప్పు ( గట్టిగా గద్దిస్తూ..)

నేను : £$%‌&*$£‌%$

----టంగ్----( గుడిలో గంటలాగ నా బుర్ర మీద మొట్టికాయ శబ్దం )

నాన్న : వంద రూపాయల్ని ఇద్దరు 2:3 నిష్పత్తి ( Ratio ) లో పంచుకుంటే ఒక్కక్కరికి ఎంత వస్తుంది?

నేను: సమానం గా పంచుకోకుండా పత్తిలాగా పంచుకోవటం ఏంటో అనుకుని కె.ఏ. పాల్ గారి లాగ నోటికొచ్చిన సమాధానం చెప్పాను.

----టంగ్------

మా నాన్నకు విషయం అర్ధమయ్యింది. ఆ రోజు ప్రతీ లెక్క నాకు అర్ధం అవుతుందో లేదో కూడా తెలుసుకోకుండా దగ్గరుండి చెబుతూ మధ్య మధ్య లో బుర్ర మీద గుడి గంటలు మోగిస్తూ ఓ పాతిక లెక్కలు వరసపెట్టి చెప్పారు. నాకేమో ఒక లెక్క అర్ధమయ్యేసరికే మొదడు మోకాళ్ళలోకి జారిపోయేది. అంతా అయ్యాక చూస్తే నాకు మిగిలింది ఖాళీ బుర్ర మీద మొట్టికాయల తీపిగుర్తులు. నా వయసు నవోదయ పరీక్ష రాయడానికి సరిపోదని తర్వాత అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. అప్పటినుండి జింబకు జిల్లో...జింబకు జిల్లో...అని పాడుకుంటూ, తలాండించుకుంటూ ఎప్పటిలాగే ఆటకి సిద్దం అయిపోయాను.

ఏడో తరగతిలో ఓ రిటైర్డ్ లెక్కల లెక్చరర్ దగ్గర నాకు ట్యూషన్...ఆయన తప్పు చెబితే చాలు చెవి చివర తెగ చిక్కేసేవాడు. సహనం తక్కువ, కోపం ఎక్కువ ఆయనకి. అక్కడకెళ్ళే కంటే మా నాన్న దగ్గర లెక్కలు చెప్పించుకొని గుడి గంటలు మోగించుకోవటమే బెటర్ అనిపించేది నాకు. ఎప్పుడు చూసినా నీకు బేసిక్స్ రావు అని సంకలన తత్సమాంసం(association laws) అంటే ఇది... గుణకార తత్సమాంసం అంటే ఇది....గాడిద గుడ్డుమాంసం అంటే ఇది అని తెగ విసిగించేవారు. ఆయన చిక్కుడు భరించలేక ఓ సారి నేనే ఓ పేపర్ లో టెక్స్ట్ బుక్ చూసి ప్రశ్నలు,జవాబులు రాసేసి, మంచి మార్కులు వేసుకుని, ట్యూషన్ లో పరీక్ష పెట్టారని నాన్నకు, స్కూల్లో పరీక్ష పెట్టారని ట్యూషన్ సార్ కి అబద్దం చెప్పేసి కొంచెం ఇంప్రెషన్ కొట్టేసరికి ఆయన చిక్కుడు కొంచెం తగ్గింది.

ఏడో తరగతి పబ్లిక్ పరీక్ష కావటంతో ఫైనల్ పరీక్షలు అయ్యాక రిజల్ట్ వచ్చినప్పుడు నాన్న స్కూలుకి వెళ్ళి నా మార్కులు కనుక్కొన్నారు. మా హెడ్మాస్టర్ "మీ అబ్బాయికి అన్నింటిలోనూ ఇంచు మించు ఎనభై శాతం మార్కులు వచ్చాయి..కానీ లెక్కల్లో మాత్రం నలభై అయిదు శాతం వచ్చాయి...కొంచెంలో స్కూలు టాపర్ అవ్వటం మిస్సయ్యాడు" అని చెప్పటంతో లెక్కల్లో వీడి రేంజ్ ఇంతే అని నాన్న ఫిక్స్ అయిపోయారు.

మొదటిసారి ధర్మారావు మాస్టారు లెక్కలు చెబుతుంటే ఏందుకో చాలా ఇంటరెస్ట్ కలిగింది. ఆయన చెబితే ఎవ్వరికైన అర్ధం అవ్వాల్సిందే అని నాన్నకు ఎవరో చెప్పినట్టు ఉన్నారు. ఎనిమిదిలో నన్ను అక్కడ ట్యూషన్ పెట్టించారు. ఆయన లెక్కలను దేనికో ఒక దానికి అన్వయించి చెప్పేవారు. అలా లెక్కలపట్ల నాలో కొంచెం ఆసక్తి కలిగింది. ఆ తర్వాత దుంపలబడి వదిలి ప్రవేటు స్కూలు చేరటంతో ట్యూషన్ కి టైమింగ్ కుదరక వెళ్ళటం కాలేదు. సరిగ్గా ఇక్కడే కంచికి వెళుతుందనుకున్న నా లెక్కల కధ ట్రాఫిక్ జాం లో ఇరుక్కుని కోటీ మార్కెట్ దగ్గరే ఆగిపోయింది.

మనకి ఒక మాథ్స్ టెక్స్ట్ బుక్ చూస్తేనే భయం...అలాంటిది ఆ స్కూల్లో తొమ్మిదో తరగతిలోనే తొమ్మిది,పది తరగతుల మాథ్స్ ( కొన్ని చాప్టర్లు ) చెప్పేసేవారు. అసలు ఒక్క మాథ్స్ టెక్స్ట్ బుక్ తోనే నాకు బాలయ్య సినిమా కనపడేది. అలాంటిది రెండు మాథ్స్ బుక్ లు...అంటే రెండు బాలయ్య సినిమాలు...ఇంక నా కష్టాలు దేవుడికెరుక...క్లాసులో ఎప్పుడూ నన్నే నిలబెట్టి లెక్కల టీచర్ ప్రశ్నలు వేసేది. ఏదో ఒకటి చెప్పమని బెత్తంతో కొట్టేది. భయంతో నేను సౌండ్ లేకుండా లిప్ మూమెంట్ ఇచ్చేసరికి ఆవిడకి ఒళ్ళు మండి ఆన్సర్ చెప్పమంటే మంత్రాలు చదువుతావేమిరా అని నాలుగు పీకేది. ఇలా తొమ్మిదో తరగతి లెక్కల క్లాసంతా పిచ్చి చూపులు, జడ్డి హావభావాలతో అప్పుడప్పుడూ రొటీన్ కి భిన్నంగా ఆర్. నారాయణమూర్తి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ గడిపేశాను.

పదిలో మళ్ళీ ధర్మారావు మాస్టారి ట్యూషన్. పొద్దున్నే ఆరింటికే ట్యుషన్ అవ్వటం వల్ల అక్కడకు వెళ్ళడానికి వీలయ్యేది. ఆయన లెక్కలు చెబితే మనమే సొంతంగా చెయ్యాలి అన్న ఆసక్తి ఆటోమేటిగ్గా వచ్చేసేది. ట్యూషన్ లో అందరూ ప్రాబ్లం కి స్టెప్స్ చెప్పటానికి పోటీ పడేవారు. అలా ఉండేది ఆయన క్లాసు. కోటీ మార్కెట్ దగ్గరే ఆగిపోయిందనుకున్న నా కధ మళ్ళీ ప్రారంభమయ్యింది. మాస్టారి పుణ్యమాని నెమ్మది నెమ్మదిగా లెక్కల మీద పట్టు రావటం మొదలైంది. సాయింత్రం స్టడీ అవర్స్ లో అప్పుడప్పుడూ మా లెక్కల టీచర్ లెక్కల విషయంలో నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అనేది.

ఇంతలో పదో తరగతిలో మొదటి మంత్లీ ఎగ్జాం రానే వచ్చింది. అన్నీ పరీక్షలు అయిపోయాయి. నా లెక్కల పేపర్ దిద్దినప్పుడు మా టీచర్ కి బాలయ్య కొండ ఎక్కి కుందేలుని రక్షించే సీన్ చూపించకుండానే మూర్చవచ్చినంత పనైంది. నా పేపరేనా అని రెండు మూడు సార్లు నా పేరు చూసుకుందట. కారణం టెస్ట్ లో లెక్కల పేపర్-1 మరియు పేపర్-2 లో నూటికి నూరు మార్కులు రావటమే. నాకైతే ఏ దశలోనూ హిట్టు కాని నా లెక్కల సినిమా ఆ రోజు సూపర్ హిట్టు అవ్వటం వల్ల ప్రపంచాన్ని జయించినంత ఆనందం. అటు తర్వాత కొన్ని రోజులకి టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్....అక్కడ కూడా 96 మార్కులతో లెక్కలు పాసవటం...ఇంక అప్పటి నుండి లెక్కల్లో ఎప్పుడూ తొంభై శాతం మార్కులకు తక్కువ కాకుండా( ఎంసెట్ తో సహా) తెచ్చుకోవటం వల్ల నా లెక్కలు సినిమా మెగా హిట్టుకి చేరువైంది. ఇలా ఒక వయసు వచ్చేవరకు గణితం నన్ను తకధిమితోం ఆడించింది.

28, జూన్ 2009, ఆదివారం

టైలర్ చిట్టిబాబు...కాప్షన్ : వీడి పేరు చెబితే కత్తెర కూడా జడుసుకుంటుంది

చిన్నప్పుడు పండక్కి కొత్త బట్టలు కొంటున్నారంటే గొప్ప ఆనందంగా ఉండేది. ఈ విషయంలో అందరికీ ఉండే ఆనందం కంటే నాకు రెండాకులు ఎక్కువే సంతోషం. దానికి కారణం నాన్న రెడీమేడ్ బట్టలు కొనడం, గుడ్డ తీసి మా కాలనీలో ఉండే టైలర్ చిట్టిబాబుకి ఇచ్చి కుట్టించాల్సిన అవసరం లేకపోవడం. అందుకే మరి ఆ రెండాకులు ఎగస్టా ఆనందం. చిట్టిబాబు...ఎవరి పేరు చెబితే మీటరు గుడ్డ అరమీటరుకు కుచించుకుపోతుందో...చిన్న పిల్లలు కొత్తబట్టలు( వాడు కుట్టినవి ) వేసుకునే కంటే నంగగా ఉండటానికి ఇష్టపడతారో...ఆడవాళ్ళు కొత్త జాకెట్ కుట్టించుకునే కంటే పాతదే వాడుకుంటే పోలే అని సిల్లీగా కాంప్రమైజ్ అయిపోతారో, ఎవడు పట్టుకుంటే కత్తెర అష్టవంకరులుగా బట్టని కత్తిరిస్తుందో వాడే చిట్టిబాబు. మూతి పైన కుంకుడు గింజంత నల్లటి ఉలిపిరి కాయతో సిఫాన్ గుడ్డలాగ నిగనిగలాడుతూ కనపడతాడు.

నలుగురు ఆడపిల్లలున్న ఏ ఇంటిలో అయినా కొంచం ఆచి తూచి ఖర్చుపెడతారు కదా..అలాగే మా ఇంటిలో కూడా నాన్న సంవత్సరానికి రెండేసార్లు కొత్త బట్టలు కొనేవారు. అక్కావాళ్ళు వారి బట్టలు ఫ్రెండ్స్ చెప్పిన టైలర్ కు కాలేజీకు వెళుతూ ఇచ్చేసేవారు. పెద్దవాళ్ళు చొక్కాలు, పేంట్ లు చిన్నపిల్లలకు ఎడ్జస్ట్ చేసి బాగా కుడతాడు అన్న ఫాల్స్ టాక్ చిట్టిబాబుకు ఉండేది. అందువల్ల కాలనీలో సగం మంది పిల్లలకి చిట్టిబాబు సైజ్ చేసిన బట్టలే తొడగాల్సిన అగత్యం. నాన్న తను కొత్తగా కుట్టించుకుని, తర్వాత అవి నచ్చక వేసుకోని షర్ట్లు, పేంట్లు మా బిరువా నిండా ఉండేవి. అమ్మ ఎప్పుడైనా బీరువా సర్దుతున్నప్పుడు నాన్న వాడని బట్టలు చూడగానే వెంటనే వీటిని ఏం చెయ్యలి అన్న ఆలోచన వచ్చిందే తడవుగా బూమర్ లాంటి బుడగలో అమ్మకు చిట్టిబాబుగాడు కనపడేవాడు.

చిట్టిబాబు రావటం..బట్టలు తీసుకెళ్ళటం..అవి వాడి దగ్గర రెణ్ణెళ్ళ పాటు ముక్కుతూ ఉండటం...ఏం కుట్టలేదు అని అడిగితే అప్పుడు మన ముందు షర్ట్ కత్తిరించటం..చిట్టిబాబు టైలరింగ్ అల్గారిధం లో మొదటి స్టెప్ ఇది. తొందర పెట్టిన పెట్టక పోయినా పెద్దవాళ్ళ బట్టలు పిల్లలకి సైజ్ చెయ్యటం అనే ప్రక్రియలో వాడు ఖచ్చితంగా ఫాలో అయ్యే స్టెప్ అది. మొత్తానికి అమ్మ ఇచ్చిన బట్టలు ఒక శుభముహుర్తాన ( వాడికి..మనకు కాదు ) తీసుకొచ్చాడు. కవర్ ఓపెన్ చేసి షర్ట్ తొడుకున్నా..ఒక్క గుండీకి కూడా దాని అనుబంద కాజా దానికి ఎదురుగా కుట్టలేదు. కొంచం కిందికి కుట్టడంతో షర్ట్ కాస్తా స్క్రర్ట్ లాగా ఉగ్గు ఉగ్గులుగా వచ్చింది. ఒకసారి అద్దం ముందుకెళ్ళీ కొంచం వెనక్కి తిరిగి చూసుకున్న..మా నాన్న కాలరే యధతధంగా ఉంచి దానికి మధ్యలో మడతపెట్టి, పొట్టిగా చేసి నాకు కుట్టేసాడు. ఆ సమయంలో చిట్టిబాబు బుర్రని ఒక బండ రాయితో కొట్టాలనిపించింది. అప్పటి నుండి చిట్టిబాబుని చూస్తే, నాకు కుట్టిన పాత షర్ట్ లన్నీ రింగులు రింగులుగా గుర్తొచ్చి, వాడిని ఏమీ చెయ్యలేక దుంఖం తన్నుకు వచ్చేది.

ఒకసారి నాన్న బట్టలకు తనకు అవసరం అయిన దానికన్న ఎక్కువ గుడ్డ తీసుకున్నారు. మిగిలిన గుడ్డ నాకు షర్ట్ అవుతుందని చిట్టిబాబుకు పిలిపించారు. నాకు చిట్టి బాబు వద్దు...అని గట్టిగా అరిచాను..ఆ తర్వాత నాన్న 'ఏంటీ' అన్న గంభీరమైన మాట విని పిల్లి అయిపోయాను. చిట్టిబాబు రావటం..గుడ్డ తీసుకెళ్ళటం..మా నాన్న ఇవ్వటంతో దాన్ని వారం తిరిగే లోపలే కుట్టి తీసుకురావడం అన్నీ చక చకా జరిగిపోయాయి. నాన్న నన్ను వేసుకోమన్నారు. తీరా చూస్తే ముమైత్ఖాన్ లాగా నా బొడ్డు కనిపించేటట్టు కుట్టాడు. మళ్ళీ వళ్ళు మండింది. కానీ నాన్న పక్కన ఉండటంతో 'మ్యావ్' అని ఊరుకున్నాను. చిట్టిబాబు వెకిలి నవ్వు ఒకటి నవ్వి 'గుడ్డ సరిపోలేదు సార్' అని నాన్నతో అనటంతో వస్తున్న నవ్వుని నాకు తెలీకోడదని ఆపుకుని 'వెదవ ఇంట్లో వేసుకుంటాడులే' అనేసారు. కొద్దిరోజుల తర్వాత నేను ఇసకలో ఆడటానికి వెళ్తే అక్కడ మా చిట్టిబాబుగాడి చిన్న కూతురిని చూసి అవాక్కయ్యాను. ఆ అమ్మాయి గౌనుకు చేతులు, కుచ్చిలు నా షర్ట్ క్లాత్ నుండే తీసుకుని కుట్టేసాడు. ఆ రోజు అదేషర్ట్ నేను వేసుకోవడంతో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను 'అమ్మాయి క్లాత్ ని వీడు షర్ట్ కుట్టించుకున్నాడురా' అని ఏడిపించారు.

వేసవి సెలవుల తర్వాత, చిరిగిపోయి ఉన్న నా బ్యాగు చూసి నాన్న కొత్తది కొంటాను అని చెప్పారు. అదేంటో గాని కొత్త వస్తువులు కొంటున్నామంటే ఏదో తెలియని గొప్ప ఆనందం. ఒరేయ్ రేపటి నుండి నేను కొత్త బ్యాగు తో స్కూలుకి వస్తాను అని దోస్తు గాళ్ళతో చెబుతున్నప్పుడు ఓ రకమైన గొప్ప ఫీలింగ్ ఉంటుంది. కాని నా ఆనందాన్ని దూరం చేయ్యడానికి చిట్టిబాబుకు నిక్కరు వంకరగా కుట్టినంత టైం పట్టలేదు. ఇంట్లో కర్టేన్ లు కుట్టడానికి అప్పటికే మా ఇంట్లో కిటికీలు కొలతలు తీసుకుంటున్న చిట్టిబాబుకు ఈ విషయం తెలిసి 'అయ్యో! కొత్త బ్యాగు ఎందుకండి? మీ పాత ప్యాంటు ఏదైనా ఉంటే ఇవ్వండి...ఓ రెండు స్కూలు బ్యాగులు కుట్టి తెస్తాను' అని నాన్నతో అన్నాడు. దాంతో నాన్న కొత్త బ్యాగు కొనాలన్న ఆలోచనని మానుకుని వాడి చేతిలో ఒక ప్యాంటు పెట్టారు. ఇది చూసిన నాకు తిక్క రేగింది. వెంటనే మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న పొట్టెమ్మ, మా పక్కింటిలో పనిచేసే పనావిడ, అంతకుముందు పక్కింటి ఆంటీతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ' అమ్మా! ఆ చిట్టిబాబు దొంగ సచ్చినోడు జాకెట్ కుట్టమని ఇస్తే చూడమ్మా ఎలా కుట్టాడో...వెనక్కు ఎత్తేస్తుంది ' అని తను వేసుకున్న అష్ట అవకారాలు ఉన్న జాకెట్ చూపించి ' ఆ గొల్లిగాడు ఇటేపు వస్తే ఓ సుట్టు సెప్పమ్మా' అని ఆవేశంతో ఊగిపోతూ ఆంటీతో చెప్పింది. ఇది గుర్తుకు రావటం తరువాయి రయ్యిన పొట్టెమ్మ ఇంటికి వెళ్ళి చిట్టిబాబు మా ఇంట్లో ఉన్నట్టు చెప్పాను. వెంటనే పొట్టెమ్మ ఉన్న పళాన జాకేట్ తీసుకుని పరిగెత్తి మా ఇంటికి వచ్చింది. ఇక చూస్కోండి...చిట్టిబాబు గాడిని తిట్టి కొట్టినంత పని చేసింది. మళ్ళీ కొత్తది ఇస్తానని చెప్పిన తర్వాత గాని వాడిని వదలలేదు. చిట్టి బాబుగాడి మీద ఎప్పటినుండో నాకున్న కోపం ఆ రోజు కొంచం తీరింది.

తర్వాత కుట్టి తెచ్చిన స్కూలు బ్యాగులు కూరగాయలు తీసుకెళ్ళడానికి తప్ప బుక్స్ తీసుకుపోవడానికి పనికి రాదన్నట్టుగా కుట్టాడు. ఇలా మా కాలనీలో ఉన్న అందరి పిల్లల ఆనందంతో చిట్టిబాబు ఆటలాడుకున్నాడు. స్కూలు యునిఫాం లాగుకి కిస్తా అవసరమైనదాని కన్న ఎక్కువ కుట్టడం....టీ.వి కవర్ కుడతానని చెప్పి హార్మోనియం పెట్టెకు సూటయ్యే కవర్ కుట్టడం....లాగు కుట్టరా అంటే.....త్రీ ఫోర్త్ పేంట్ లేదా తెలుగుసినిమా హీరోయిన్ వెసుకునే పొట్టి నిక్కరు కుట్టడం...కొంచం తిండికే వాడుకుట్టే లాగు కడుపుదగ్గర టైట్ గా పట్టేసి కాస్త చిన్న పిల్లలు అర్జెంటు అయినప్పుడు లాగు విప్పుకోవటంలో కష్టపడుతూ
( పెద్ద గుండీకి చిన్న కాజా కుట్టడం మూలాన వచ్చిన చిక్కది ) నిక్కరులోనే రెండో పని కానిచ్చేయటం...ఇలా ఉండేవి చిట్టిబాబు ఘనకార్యాలు. పొరపాటున పెద్దవాళ్ళు రోడ్డు మీద టైలర్ కి అంతదూరం వెళ్ళి ఏమిస్తాములే అని బద్దకించారా ఇక అంతే సంగతులు. వాడు సరిగ్గ కుట్టేవరకూ బట్టలు రెండు, మూడు సార్లు ఇటు..అటూ..తిరగాల్సిందే.

మొత్తానికి మేము వేరే కాలనీకి మారిన తర్వాతే చిట్టిబాబు భాద తప్పింది. అసలు విషయం ఏంటంటే..ఒకప్పుడు చిట్టిబాబుకి పని పాట లేనప్పటికీ, సంభందం చూసి, వీడికి టైలరింగ్ వచ్చని అబద్దమాడి, పెళ్ళి చేసేశారు. ఆ తర్వాత నెలరోజులు ఇంకొకరి దగ్గర ఓ నెలపాటు అసిస్టెంట్ గా పనిచేసి, మామ గారు ఇచ్చిన కొత్త మిషన్ తొక్కడం పారంభించాడు. గత్యంతరం లేక టైలరింగ్ నే వృత్తిగా చేసుకున్నాడు. మా కాలనీ కూడా టౌన్ కి దూరంగా ఉండటం వల్ల, దరిదాపుల్లో టైలర్లు ఎవరూ లేకపోవడంతో చిట్టిబాబు అదే మంచి స్పాట్ అని ఫిక్స్ అయిపోయి అందర్నీ ఓ ఆట ఆడుకున్నాడు.

ఇప్పుడు చిట్టిబాబు అదే కాలనీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సొంతంగా ఓ షాపు పెట్టి వాడితో పాటు ముగ్గురు టైలర్లను పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా పాత ప్యాంట్లు, షర్ట్లు తీసుకుని చిన్నపిల్లలకి కుడుతున్నావా అని అడిగితే..'ఎక్కడ బాబు..ఈ కాలం చిన్నపిల్లలు మీరు ఉన్నట్టు ఎక్కడ ఉన్నారు...పుట్టగానే పుల్ ప్యాంట్ వేయందే ఒప్పుకోరు కదా' అని నిట్టూర్చాడు. నేను వెళ్ళిపోతున్నప్పుడు 'బాబు మీ లాప్ టాప్ కి ఓ కవర్ కుట్టనా' అని అడిగాడు. అయ్యబాబోయ్ అని చిట్టిబాబు వంక చూసేసరికి, ఇద్దరం గట్టిగా నవ్వేసుకున్నాం.

6, జూన్ 2009, శనివారం

నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి....( శభాష్ ప్రణీత )


గత సంవత్సరం డిసెంబర్ లో ఓ ఇద్దరు అమ్మయిలపై వరంగల్ లో ఒక మానవ మృగం యాసిడ్ దాడి చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. దాడిలో తీవ్రంగా గాయపడ్డ స్వప్నిక పరిస్థితులతో పోరాడి మరణించగా ఇంకో అమ్మాయి ప్రణీత కూడా చావు బతుకులు మధ్య కొట్టుమిట్టాడి చివరికి ప్రాణాలు నిలుపుకుంది. కొద్ది నెలలు ఆస్పత్రిలోనే గడిపిన ఆ అమ్మాయి తన ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఎనభై మూడు శాతం మార్కులతో డిస్టింక్షన్ లో పాసయ్యింది. ఇన్ఫోసిస్ లో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఎందరో అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది.

మామూలుగా అయితే అమ్మాయిలపై దాడులు జరిగినప్పుడు తల్లిదండ్రులుకు పరిస్థితులను ఎలా డీల్ చెయ్యాలో తెలియక చాలా డిప్రషన్ లో,షాక్ లో ఉండిపోతారు. దానికి తోడు చుట్టు పక్కల వాళ్ళల్లో కూడా అమ్మాయి సరిగ్గా ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అనే మూర్ఖశిఖామనులు ఉండనే ఉంటారు. తన చుట్టూ ఉన్న వాతావరణం ఆ విధంగా ఉండటంతో భాదితులు మరింత కుంగిపోతారు. మన వల్లే కదా అమ్మా, నాన్నఇలా భాదపడుతున్నారు అని తమలో తామే మధనపడి జరిగిన సంఘటనను పదే పదే తలుచుకుని కన్నీటిని ఆశ్రయిస్తారు. అలాంటి పరిస్థితులలో వారు ఏదో సాదించటం సంగతి పక్కన పెడితే...తిరిగి మామూలు మనిషిగా మారటానికే చాలా సమయం పడుతుంది. భవిష్యత్తు గురించి వారు కన్న కలల సౌధం కూలిపోయిందని, తాము ఇంకేమీ చెయ్యలేమని..ఇలా రకరకాల ఆలోచనలు వారి మనస్సును తొలిచేస్తుంటే ఇది వరకు ఉన్న ఆత్మవిశ్వాశాన్ని తిరిగి పొందటం ఎవరికైనా కష్టమైన పనే. ఒకవేళ పొందినా సంవత్సరాల సమయం తీసుకుంటుంది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రణీత తల్లిదండ్రులు, భందువులు ఇతరులకు భిన్నంగా జరిగిన సంఘటనను తీసుకున్నారు. మనసులో భాద తొలిచేస్తున్నా ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదనే ఉద్దేశంతో పంటి బిగువున తమ భాదని దిగమింగి ధైర్యం అందించారు. తల్లి ప్రణీతకి భౌతికంగా సపర్యలు చేస్తూ, జోక్స్ వేస్తూ పక్కన ఉంటే, తండ్రి, అన్నయ్య, మామయ్య తనకి మానసికోల్లాసాన్ని అందించి తను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటంలో సహకరించారు. పరీక్షల సమయంలో కాలేజీ లెక్చరర్ల తోడ్పాటు, స్నేహితుల పోద్భలం, సహాయం తోడైయ్యింది. ప్రణీత ఆస్పత్రిలో చాలా తక్కువ సార్లు మాత్రమే ఏడిచిందని చెప్పే వాళ్ళమ్మ గారి మాటలే ఇందుకు నిదర్శనం. సంవత్సరం వృధా కాకూడదన్న పట్టుదలతో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరీక్షలుకు సిద్దమైంది. ఫలితం....ఒక విద్యాకుసుమం మళ్ళీ వికసించింది..తను ఎదుర్కొన్న తీరుతో రాష్ట్ర మహిళల గుండెల్లో స్పూర్తిని నింపింది...పరిస్థితులకు ఆత్మవిశ్వాసం తో ఎదురీదటం పెద్ద కష్టం కాదని నిరూపించింది. మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్దంలో అతికొద్ది నెలలోనే విజేతగా నిలిచింది.

దాడి జరిగి ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆంధ్ర అంతా వారి ఇంటిలోన అమ్మాయికే జరిగినట్టు భాదపడ్డారు. ఎంతో మంది తను తొందరగా కోలుకోవాలని ప్రార్ధించారు. తను డిస్టింక్షన్ తో పాసయ్యిందని తెలియగానే ఎంతో సంతోషించారు. TV9 లో ఈ రోజు పొద్దున్న ప్రణీత తన కుటుంబసభ్యులతో పాల్గొన్న 'నింగి నేల నాదే' అన్న కార్యక్రమంలో తనకు వచ్చిన ఫోన్ కాల్సే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.

భవిష్యత్తులో సివిల్స్ రాయటమే తన లక్ష్యం అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్న ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తను అనుకున్న ఆశయాన్ని సాదించాలని ఆకాంక్షిద్దాం.

9, మే 2009, శనివారం

మళ్లీ...చందమామతో ఒక ఆట ఆడాలి...ఒక పాట పాడాలి...

సాయింత్రం ఏడవుతుంది..అరుగు మీద కూర్చొని రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళు నాలుగు అంటూ టాప్ లేచి పోయేటట్టు చదువుతున్నాను. నాతో పాటు మరో పది మంది పిల్ల సైన్యం చదువుతో ( గోలతో )ఆ అరుగు అంతా రణభేరిని తలపిస్తుంది. ఇంతలో సడన్ గా కరెంటు పోయింది. ఓ..ఓ..ఓయ్..అంటు పిల్లకాయలు అందరూ ఎక్కడ పుస్తకాలు అక్కడ పడేసి అరుగు దిగి ఇంటి ముందున్న వాకిలిలో చేరి ఆటలు మొదలు పెట్టేశారు. కొద్దిసేపట్లోనే అందరి ఇళ్ళ ముందు ఒకేసారి నులక మంచాలు బయట వెయ్యబడాయి. చీకట్లో ఆడటానికి భయం ఉన్నవాళ్ళు ఆ మంచాలపై పోటా పోటీగా తమ ప్లేస్ ను ముందుగా ఆక్రమంచుకుంటున్నారు. అలా నేను కూడా ఆ పోటీలో ఉండి ప్లేస్ ను సాధించుకుని మంచంలో ఒక పక్కకు తిరిగి పడుకుని చుట్టూరా చూసాను. అంతవరకు నా దృష్టి గోల మీదనే ఉంది. అంతలోనే చుట్టూ వాతావరణం నా దృష్టిని తీసుకుంది. అల్లంత దూరంలో ఆడుతున్న జోగారావు కనిపిస్తున్నాడు. పెరట్లో కూరగాయలు కడిగిన నీరుని పారబోస్తున్న అమ్మ వాకిలి నుండే చక్కగా కనిపిస్తుంది. అరె...ఎప్పుడూ లేనిది ఏమిటిది...రోజు వాకిలి అంతా చీకటి పరచుకుని ఉంటుంది. గొల్లభామలు కీచు కీచు మని అరుస్తుంటాయి. ఈ రోజేంటి ఇలా మొత్తం వెలుగు కనిపిస్తుంది....ఇలా ఆలోచనల మధ్య ఒక్కసారి ఆకాశం వైపు చూశాను. అప్పుడే వాడు ఆకాశంలో కనిపించాడు. వాడినే అలా చూస్తూ ఉన్నాను. పక్కన కూర్చొని ఉన్న అమ్మ అది చూసి ఏంటమ్మా...అలా అకాశం వైపు చూస్తున్నావు? చందమామనా? అంటూ నాన్న వైపు తిరిగి గుర్తుందా...వీడు నాలుగేళ్ళప్పుడు రోజూ చందమామని చూపించమనేవాడు...వెన్నెల నుండి ఇంట్లోకి తేగానే "అక్కలకు పద" అని వాకిలి చూపిస్తూ చాలా గోల చేసేవాడు అంది. నేను వాడిని చూస్తున్నాననో ఏమో వాడు దరిదాపుల్లో మేఘాలు ఉన్నప్పటికీ బుల్లి బుల్లి మేఘాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో నవ్వుతున్నట్టుగా ఉన్నాడు. ఒరేయ్..మనం ఆడుకుందామా అని వాడిని అడగాలనిపించింది. నా మనస్సును వాడు అర్ధం చేసుకున్నట్టు వున్నాడు..వెంటనే నన్ను ముట్టుకో అంటూ సవాలు విసిరి మబ్బుల చాటు నుండి పరిగెత్తుతూ ఉన్నాడు. నా కళ్ళు వాడిని వెంబడిస్తునే ఉన్నాయి. ఇద్దరం అలసిపోయాము. వాడు ఒక చోట ఆగిపోయాడు. రా కన్నా బువ్వ తిందువు గాని అని అమ్మ నన్ను ఎత్తుకుని వరండాలో నీల్చొని అన్నం ఉండలుగా చుట్టి నా నోట్లో పెడుతుంది. వాడిని వదిలేసి వచ్చానని దిగులుతో అన్నం సరిగా తినలే. ఓ నాలుగు ముద్దలు తిని మళ్ళీ వాకిట్లో మంచం మీద పడుకుని ఆకాశంలో వాడి గురించి వెతికాను. ఒక పెద్ద మబ్బు వెనకాల దాక్కున్నాడు. చాలా సేపయ్యింది. కాని వాడు మబ్బు వెనకాల నుండి బయటకు రాలేదు. నేను వాడిని వదిలేసి వెళ్ళిపోయినందుకు నా మీద అలిగాడు. రారా....నా వైపు చూడరా..అని బ్రతిమిలాడిన తర్వాత నెమ్మదిగా మబ్బు వెనకాల నుండి బయటపడ్డాడు. వాడితో ఊసులాడుతూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. అలా మొదలయ్యింది మా స్నేహం. కొద్ది రోజులయ్యాక వాడు కనిపించటం మానేసాడు. అప్పుడు నాన్న దగ్గరకు వెళ్ళి నాన్న మొన్నటిలాగా ఎందుకు వెలుగు వాకిట్లో లేదు అని అడిగాను. వాడు నెలకు ఒకసారే వస్తాడని నాన్న చెప్పారు. వాడు ఎప్పుడు వస్తాడా అని రోజూ వాకిట్లో కి వెళ్ళి ఆకాశం వంక చూసే వాడిని. నాన్న చెప్పినట్టే నెలకోసారి వచ్చేవాడు. మేమిద్దరం కబుర్లు చెప్పుకునే వాళ్ళం. వాడు నా మీద అలిగితే ఎలా మబ్బుల వెనక ఉండేవాడో నేను వాడు చాలా రోజుల తర్వాత కనిపిస్తే అలిగి కొబ్బరిమట్ట వెనకాల నుండి వాడిని చూసేవాడిని. అలా చిన్న వయసులోనే వాడితో మానసిక బంధం ఏర్పడిపోయింది.

కొంచం పెద్దయ్యాక మేము వేరే ఊరికి వెళ్ళిపోయాము. సాయింత్రం ట్యూషన్లు, చదువుల వల్ల కొన్ని సార్లు వాడిని మిస్ అయ్యేవాడిని. అదేంటో గాని కరెంట్ పోయినప్పుడు మాత్రమే వాడి ఉనికి ఉండేది. మిగిలిన సమయాల్లో వీధి దీపాలు, ఇళ్ళ వెలుగులు మధ్య వాడి ఉనికి ఆకాశంలో మాత్రమే
ఉన్నట్టు ఉండేది. అలాంటి సమయంలో ఒక కొత్త అతిధి లాగా కనిపించేవాడు. మేము ఉన్న ఊళ్ళో ఎప్పుడయినా కరెంట్ పోయిందంటే, వాడు ఆకాశంలో ఉంటే చాలు మా కాలనీ పిల్లలందరం తోటలో ఉన్న ఇసుక దగ్గరకు పరిగెత్తేవాళ్ళం. ఎంతో ఉత్సాహంతో ఇసుక దగ్గరకు పరిగెడుతున్న మమ్మల్ని చూసి వాడికి కూడా ఆడుకోవాలనిపించేదో ఏమో గాని ఆకాశంలో ఉన్న నక్షత్రాల మధ్యకు పరిగెత్తేవాడు. వాడి ఉత్సాహం చూసి గాలి కూడా నేనేం తక్కువ తిన్నాన అన్నట్టు మా మొహాలను గబగబా తాకుతూ పరిగెత్తేది. అల్లంత దూరంలో ఉన్న ఏటిలో, అవతలి ఊరువాళ్ళు వారి వారి ఊళ్ళకి వెళ్ళటానికి పడవ సిద్దంగా ఉండేది. అవతలి ఊరుకు పోవటంకోసం జనాలు పడవ దగ్గరకు వెలుతుండేవారు. ఇదంతా వాడి వెలుగులో వర్ణ చిత్రం లా కనిపించేది. ఇసుకలో రకరకాల గూళ్ళు కట్టేవాళ్ళం. నేనేమో నేను కట్టిన ఇసుకగూడులో వాడు లోనికి వచ్చేటట్టు గూడు పైన ఒక చిన్న కిటికీ లాగా ఉంచేవాడిని. చీకటిగా ఉన్న గూడులో వాడి వెన్నెల పైన కిటికీ ద్వారా చేరి లోపల మొత్తం పరచుకునేది. నా గూడు పక్కన అలానే ఇసకలోనే పడుకుని వాడి వైపు చూస్తూ ఊసులాడుతూ, ఏటి వైపు చూస్తూ అలా ఉండిపోయే వాడిని. ఏం మహత్తు ఉందో గాని వాడు కురిపించే చల్లని వెన్నెల్లో గడుపుతుంటే గొప్ప మానసిక ఆనందం ఉండేది. అంతలోనే కరెంట్ వస్తే పిల్లలందరూ వారి వారి గూడులను విరిచేసి ఇంటికి బయలుదేరేవారు. నాకు మాత్రం వాడి సమక్షంలో అక్కడే అలా ఉండిపోవాలనిపించేది. ఇలాంటి అనుభవాల వల్ల వాడంటే మరింత ఇష్టం వచ్చేసింది.

ఇంజనీరింగ్ చదువంతా ఒక పల్లెటూరిలో సాగింది. అక్కడ ఎప్పుడూ కరెంట్ కోతే. సాయింత్రం సరిగ్గా చదవడం మొదలెట్టే సమయానికి పవర్ తీసేసేవాడు. బయటేమో వెన్నెల. లోపల ఉక్కపోత. రూమ్మేట్స్ అందరం డాబా పైకి ఎక్కి అనుభూతులు, ఆలోచనలు పంచుకునే వాళ్ళం. మా రూం ఎదురుగా ఉన్న కాలువగట్టు, పంట పొలాలు, కల్లు కోసం కుండలు కట్టివున్న పొడువాటి తాటి చెట్లు, చుట్టు పక్కల ఫ్యాక్టరీ లలో పని చేసుకుని ఇళ్ళకు గబ గబా మట్టిరోడ్డున వెళుతున్న కార్మికులు...ఇవన్నీ వెన్నెలలో చూస్తుంటే రెట్టింపు అందంతో కనపడేవి. వెన్నెలతో ఇంతకు ముందు ఎలాంటి అనుభవం లేని నా రూమ్మేట్స్ ( సిటీ నుండీ వచ్చినవారు ) ఈ దృశ్యాలను మొదటి సారి చూడటం వల్ల ఎంతో ఆనందపడేవారు. ఇలా కాదు వెన్నెల రాత్రులను ఎంజాయ్ చెయ్యటం అని అనుకుని అందరం ఓసారి దగ్గర్లోని పంట పొలాల్లోకి వెళ్ళాం. వెలుతున్న దారిలో ఒక చెట్టు కింద నీడలో మిణుగురు పురుగులు గుంపులు గుంపులుగా మిణుకు మిణుకు మని ఒకే చోట మెరుస్తున్నాయి. ఇంక ఎవ్వరికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ దృశ్యం మా మనసులలో చెరగని ముద్ర వేసింది. ఎలాగోలా మనసుని దాని నుండి మళ్ళించి ఒక గట్టు మీద కూర్చొని గ్రామాన్ని చూస్తుంటే ఆ గ్రామం అంతా ఎవరైనా వెండి పూత పూసారా అన్నట్టు సందేహం వచ్చింది. అప్పటినుండి వాడి మీద ఉన్న అభిమానం కాస్తా పిచ్చి అభిమానం అయింది. పరీక్షల రోజు వాడు కనిపించినా సరే ఈ అనుభూతులను ఎవ్వరం మిస్ చేసుకునేవాళ్ళం కాదు..ముఖ్యంగా నేను.

చదువు పూర్తయిన తర్వాత ఒకసారి మా రూమ్మేట్ వాడి సిటీలో బోర్ కొడితే, మమ్మల్ని ( రూమ్మేట్స్ లో ఇంకోడు మా ఊరి వాడే ) చూడాలని పించి మా ఊరు వచ్చాడు. రాత్రి ఎనిమిది అవుతుంది. ఆ రోజు అకాశంలో మా వాడు కనిపించాడు. అది చాలదా మాకు సేద తీరేందుకు...అందుకే ఎప్పటినుండో వెన్నెల్లో సముద్రం చూడాలన్న కోరికని ఆ రోజు నిజం చేసుకోవాలనిపించింది. ముగ్గురం ఒకే బైక్ ఎక్కి ఆ సమయంలో దగ్గరలోని బీచ్ కి బయలు దేరాము. దారిలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో తప్పించి మిగిలిన రోడ్డు అంతా వెన్నెల పరచుకుని ఉంది. అప్పటికే తొమ్మిది దాటడంతో రోడ్డు మీద ఒక్క వాహనం కూడా లేదు. అలా ప్రశాంతంగా ఉన్న రోడ్డు మీద బైక్ మీద పోయిన మార్గమంతా ఆకాశంలో వాడిని చూస్తునే ఉన్నాను. వెన్నెల వర్షంలో తడిసి ముద్దవుతున్న పచ్చని చెట్లు, పంట పొలాలు, అక్కడక్కడా పిల్ల కాలువలు కూడా మాలాగే వాడి వెన్నెలను ఆస్వాదిస్తున్నాయనుకుంటా....హోరున వీచే సముద్రం గాలికి మనసంతా తేలిపోతున్నట్టు ఉంది. బీచ్ కి కొంత దూరంలో బైక్ ఉంచి ఇసుకలో సముద్రం వైపు నడిచాము. నా దృష్టి ఆకాశం మీద పడింది. ఇంకొంచం కిందికి దిగితే వాడు సముద్రాన్ని తాకేసేలా ఉన్నాడు. వాడి సైజ్ కూడా కొంచం పెద్దగా ఉంది. వాడి వెన్నెల్లో కెరటాలు ఎగిసి పడుతున్న ప్రతీసారి మెరుస్తూ నురగలో నక్షత్రాలను దాచుకున్నట్టు ఉన్నాయి. ఎంతో రొమాంటిక్ గా ఉంది వాతావరణం. ఒంటిపై ఉన్న షర్ట్, పాంట్ తీసేసి లోదుస్తులతో ఒడ్డున పడుకున్నాను. తాకనా వద్దా అన్నట్టు అలలు ఒంటిని తాకుతుంటే వాడిని చూస్తూ ఉండిపోయాను. ఈ సారి ఎందుకో వాడు స్నేహితుడు లాగా కనపడలే. కవ్విస్తున్న చెలి లాగా కనిపించాడు. అప్రయత్నంగానే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను. యూ నాటీ అనే ప్రియురాలిలాగా సిగ్గుపడుతూ మబ్బుల చాటుకు పోయాడు. అలా మా ముగ్గురు స్నేహితులం తమదైన ప్రపంచాల నుండి బయటకు వచ్చి వెనుతిరిగాము.


అది సోమాజీగూడ బస్టాప్.....రాత్రి తొమ్మిదవుతుంది...ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళటం కోసం బస్టాప్ లో నిలబడివున్నాను. వాహనాల శబ్దం చెవులను వద్దంటున్నా తాకుతున్నాయి. బస్టాప్ లో ఆగిన ప్రతీ బస్సు జనాలతో కిక్కిరిసి ఉంది. చుట్టూ అంతా షాపింగ్ మాల్స్ లైటింగ్. ఆఫీస్ లో క్లిష్టమైన బగ్ ఫిక్స్ చేయటంతో బుర్రలో దానితాలుకు ఆలోచనలే తిరుగాడుతున్నాయి. చాలా అలసిపోయివున్నాను. క్యాజువల్ గా తల పైకెత్తి చూసాను. వాడు కనిపించాడు. వెంటనే తల కిందకు తిప్పేసాను. ఎప్పుడూ వాడు కనిపిస్తే ఊసులాడాలని ప్రయత్నించే మనసు ఈ సారి అసలు వాడి గురించే అలోచించటంలే. ఆఫీస్ వ్యవహారాలు.. ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం వలన వాడిని చూసి ఆస్వాదించే సున్నితత్వాన్ని నా మనసు కోల్పోయింది. ఇంతలో త్వరలో మాకు ఇవ్వబోయే హైక్స్ మీదకి ఆలోచనలు మళ్లాయి. దాని తర్వాత ఈ సారి అయినా బస్సు ఖాళీగా వస్తే బావుణ్ణు...ఇంటికి తొందరగా వెళ్ళి పడుకోవాలి అన్న ఆలోచనలు..రోజులన్నీ ఇలాగే గడిచిపోతున్నాయి. ఒక్కసారి కాదు...రెండు సార్లు కాదు...దాదాపుగా వాడు ఆకాశంలో ఉన్న ప్రతీసారి మనసు ఎదో ఒక ఆలోచనల్లో ఉంటుంది. కొన్నిసార్లు అయితే వాడు వచ్చాడో లేదో కూడా తెలియదు. చుట్టూ ఉన్న అపార్ట్ మెంట్స్ కప్పేస్తుంటాయి. రకరకాల ఆలోచనలు, భాద్యతలు, భయాలు, వాడిని ఆస్వాదించే పరిస్థితుల లేమి....ఇవన్నీ నాలో ఉన్న వాడి స్నేహితుడిని చంపేశాయి. ఒకసారి వాడితో నాకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని నాలో ఉన్న వాడి స్నేహితుడికి మళ్ళీ ప్రాణంపోసే ప్రయత్నమే ఈ టపా.

16, ఏప్రిల్ 2009, గురువారం

మొదటిసారి సంతృప్తిగా ఓటు వేసాను.....

గతంలో నేను ఓటు వేయాల్సి వచ్చినప్పుడు చాలా భాద పడ్డాను. ఎందుకంటే అప్పుడు రెండే పార్టీలు...నిలబడ్డ అభ్యర్దులు ఎదవలు అని తెలిసిన కూడా తప్పకుండా ఎవడో వెధవని ఎన్నుకోవాలి. అయ్యో...ఎవరికీ వెయ్యకుండా అభ్యర్దులు నచ్చలేదు అని చెప్పే ఆప్షన్ ఉంటే బావుండేదే...అని నాలో నేను ఒక వంద సార్లు అనుకుని ఉంటాను. అలా అనాసక్తి, అసంతృప్తి ఉన్నప్పటికీ ఓటు వెయ్యాలి అన్న స్పృహ ఉండటంతో తప్పనిసరై ఒక వెధవకి ఓటు వెయ్యాల్సి వచ్చింది. ఇది గతం..

ఒకసారి టీవీలో యువ సినిమా చూస్తున్నాను. అందులో పీ.హెచ్.డీ చదువుతున్న సూర్య రాజకీయాల్లో మార్పు తేవటానికి కృషి చేస్తుంటాడు. తనతో పాటు కొంతమంది సహ విద్యార్దులు కూడా తన అడుగుజాడల్లో నడుస్తుంటారు. ఎన్నికల్లో కొంత మందిని నిలబెడతాడు. అయితే ఫలితాలు వచ్చినప్పుడు సూర్యతో పాటు ఎన్నికల బరిలో నిలబడ్డ సహ విద్యార్దులు అతని దగ్గరకు వచ్చి మనం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదంటారు. అప్పుడు సూర్య ఇలా అంటాడు...."ఏం పరవాలేదు...మనం ఎవరిమో..ఎందుకోసం ఎన్నికల్లో నిలబడ్డామో ప్రజలకు మరింత వివరంగా తెలియజేద్దాం..మళ్లీ వచ్చే ఎన్నికల్లో నిలబెడదాం..". నిజానికి ఆ ఎన్నికల్లో వారి టీంలో వారందరూ గెలుస్తారు.

ఆ సీన్ చూసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. రాజకీయాల్లోకి ఇలా మంచి చదువుకున్న, జనం గురించి ఆలోచించే మేధావులు వస్తే ఎంతో బావుంటుంది అని అనిపించింది. కాని అది సినిమా కాబట్టి అలా జరిగిందిలే అని సరి పెట్టుకున్నాను. కాని ఆ ఊహ నాకు చాలా బాగా నచ్చేది.

ఈసారి జే.పీ గారు ఎన్నికల్లో నిలబెడతారు అని తెలిసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఓటు వేస్తానా అని నెలల ముందు నుండి ఆరాటపడ్డాను. ఇంతకు ముందు నుండే ఆయన శైలి నాకు బాగా నచ్చేది. ఈ టీవి లో గతంలో ప్రతిధ్వని అని చర్చా కార్యక్రమం వచ్చేది. అందులో జే.పీ. గారే వ్యాఖ్యాత. ఎప్పుడూ చర్చ కార్యక్రమాలు చూడని నేను అతని వ్యాఖ్యానాలు కోసం రెగ్యులర్గా ఫాలో అయిపోయేవాడిని. ఆతర్వాత అతని గురించి మరింత సమాచారం సంపాదించి చదివిన తర్వాత పెద్ద ఫాన్ అయిపోయాను. గతంలో నేను ఒక రాజకీయ నాయకుడను ఇష్టపడటం అనేది ఒక పెద్ద జోక్ నాకు.

ఇప్పుడు నా అస్త్రాన్ని వాడుకునే టైం వచ్చింది. ముందునుండే ఎవరికీ వెయ్యాలో క్లారిటీ ఉండటంతో చాలా సంతృప్తిగా ఓటు వేసి వచ్చాను. గతంలో ఎంత అసంతృప్తిగా వేసానో ఇప్పటికీ గుర్తుంది. దాని స్థానంలో ఇప్పుడు వోటు వేసిన సంతృప్తి పాత అసంతృప్తిని పూర్తిగా తుడిచిపెట్టేసింది.

4, ఏప్రిల్ 2009, శనివారం

మనసుంటే మార్గం ఉండి తీరుతుంది.....

అనగనగా ఒక అడవి...అందులో ఒక చిన్న నత్త...ఒక సారి జంతువులన్నీఒక చోట చేరి ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. విషయం తెలుసుకున్న ఆ నత్త ఆ ప్రదేశానికి జంతువులు చేరుకున్న చాలా సేపటికి వెళ్ళింది. అక్కడ ఒక జిత్తుల మారి నక్క నత్త రాకను గమనించి "చూసారా స్నేహితుల్లారా...ఈ నత్త జీవితంలో ఎప్పుడూ వేగంగా నడిచింది లేదు, నడవటమే సరిగ్గా రానిది ఇంకేపనైనా ఎలా చేస్తుంది. పాపం...నత్తను చూస్తె జాలేస్తుంది" అంది. జంతువులన్నీ అవునవును అంటూ తలలు ఆడించాయి. నక్క మాటలు విన్న మిగిలిన జంతువులు కూడా నత్త ఏ పనీ చెయ్యలేదని, వాటిల్లాగా సమర్దవంతమైనది కాదని అన్నాయి. మిగిలిన జంతువులు కూడా తనకు వంత పాడటంతో నక్క మరింత రెచ్చి పోయింది. మిగతా పనులు చేసుకోవటం గురించి దేవుడెరుగు...ఇదిగో ఇక్కడ రెండు కట్టె ముక్కలు ఉన్నాయి చూడండి....ఒక దాని నుండి ఇంకో దానికి వెళ్ళమని చెప్పండి...అంత చిన్న పని కూడా చెయ్య లేదు అంటూ బిగ్గరగా నవ్వి మరింత అవహేళన చేసింది. నత్త కుంగి పోకుండా తన సామర్ద్యం నిరూపించుకుని నక్క, మిగిలిన జంతువుల నోరు మూయించాలనుకుంది.


నక్క చూపించిన రెండు కట్టేల్లో ఒక దాని మీద నిల్చుంది."ఎలా వెళ్ళాలబ్బా......మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటే ఎలా పోయేది చెప్మా.....ఛా..ఏమీ తెలియటంలేదు. అనవసరంగా పట్టుదలకు పోయేనా??...లేదు..లేదు...ఎలాగైనా నక్కకు బుద్ది చెప్పాలి, నా సామర్ధ్యం ఏంటో వీళ్ళకు తెలియాలి" అని అనుకుంటూ చుట్టూ చూసింది.
".....అయిడియా వచ్చింది. ఇలా ప్రయత్నిస్తాను....నేననుకున్న వాటిల్లో ఇదే మంచి పద్దతి....దేవుడు నా కిచ్చిన అన్నింటినీ చక్కగా ఉపయోగించుకుంటాను" అని ఇంకో సారి మనసులో గట్టిగా అనుకుంది.
తనకొచ్చిన ఐడియాని ఒక క్రమపద్దతిలో అమలుపరుస్తూ ఉంది నత్త. కాళ్ళు ఒక కట్టెపై ఉంచి మొత్తం శరీరాన్ని ముందుకు కదిలించడానికి ప్రయత్నించింది.
ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. తన ప్రయత్నం ఫలిస్తుంది అన్న విషయం నత్తకు అర్ధం అయింది.


మొత్తానికి ఇటువైపు ఉన్న కట్టే మీదకు నత్త రాగలిగింది.

తన శక్తి సామర్ధ్యాలు కూడదీసుకుని నక్క చెప్పిన పనిని అందరిముందూ చేసి చూపించింది. తనను గేలి చేసిన వారి మాటలు తప్పని నత్త నిరూపించింది. చిన్నబోయిన నక్క జంతువుల మధ్య నుండి నెమ్మదిగా జారుకుంది. మిగతా జంతువులు నత్తపై తాము చూపించిన ప్రవర్తనకు సిగ్గుపడుతూ తమ కరతాళ ధ్వనుల మధ్య నత్తను సత్కరించాయి.


*****

### ఫోటోలు అంతర్జాలం నుండి తీసుకున్నవి.

27, మార్చి 2009, శుక్రవారం

ఉగాది పండగ...2040

"ఏం చేసున్నావే అమ్మాయ్" ఇంటర్నెట్ లో ఏదో బుక్ చేస్తున్న కోడలు నిశల్య ని యాభై ఏళ్ళ అత్తగారు నికిత శర్మ అడిగింది. ఓ మై గాడ్....అన్ని ఆన్లైన్ స్టోర్ లలో మామిడి కాయల బుకింగ్ అయిపోయాయ్...ఎల్లుండి ఉగాది కి పచ్చడి ఎలా చేసేది...అని బయటకు అనుకుంటూ నిశల్య సిస్టం ని లాగ్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చింది. విషయం విన్నఅత్తగారు గూగిల్ కుకట్ పల్లి ఆప్షన్లో గాని, మన కాలనీ వెబ్సైట్ లో గాని చూడలేక పోయావా? నా స్నేహితుడు తెలుగు ఫెస్టివల్ సైట్లో మొత్తం ఉగాది పచ్చడి చెయ్యడానికి కావలసిన అన్ని ఇన్గ్రెడియన్ట్స్ నెల రోజుల ముందు బుక్ చేసాడంట... అయినా చివరి నిమిషంలో ఆఫీస్లో సెలవు దొరక్క ఆర్డర్ కాన్సిల్ చేసుకున్న వాళ్లు ఉంటారు కదా...అప్పుడు దొరుకుతుందిలే ....అని తన ముందున్న లాప్ టాప్ లో తన పాత స్నేహితుడు పంపించిన మెయిల్ ని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినటంలో మునిగి పోయింది అత్తగారు.
*******
"ఈ ఎలక్షన్లో మేము అధికారంలోకి వస్తే తెలంగాణా తీసుకు వస్తాం, మా తాతగారు కే. సి. ఆర్ ఆశయాన్ని సాదిస్తాం" ఏదో వబ్సైట్లో న్యూస్ వింటున్నాడు సౌరబ్.
ఒరేయ్ సౌరబ్ ...మన బ్రిట్నీ ఆన్లైన్ ట్యూషన్ అయిపోయాక రోజూ ఎక్కడికో వెళ్తుంది..నీకేమైనా తెలుసా..కొడుకుని అడిగింది. ఓ అదా...ఉగాది వస్తుంది కదా...వెల్కం ఆర్ట్ నేర్చుకోడానికి వెళ్ళింది అని చెప్పి మళ్లీ న్యూస్ హెడ్ లైన్స్ చూడటంలో మునిగిపోయాడు. వెల్కం ఆర్ట్ ...అదేమీ ఆర్ట్ రా..నేనెప్పుడూ వినలేదే అని నికిత శర్మ ఆశ్చర్యకరంగా అడిగింది. అదేనండి...ముగ్గు పెట్టడం...మనం పిండితో ఇంటి ముందు వేసేవాళ్ళం కదా....ఇప్పుడు మట్టి వాకిట లేదు కాబట్టి సిమెంట్ గచ్చు మీద టాటూ లాగ వేస్తారన్నమాట...అని నిశల్య అత్తగార్కి వివరించింది.
*********
"అక్క..చూలు..నా కొత్త జీన్స్......మరేమో...టుడే...ఐ సా ఎ సింగింగ్ క్రో ( కోకిల )" అంటూ ముద్దు ముద్దు మాటలతో ఇంటి ముందు వెల్కం ఆర్ట్ వేస్తున్న బ్రిట్నీ ని చుట్టేసాడు రెండేళ్ళ రాం చరణ్. వంటింట్లో ఇంకా ఉగాది పచ్చడి చెయ్యలేదని నిశల్య తెగ కంగారు పడుతుంది. తనకు పచ్చడి సామగ్రి డెలివరీ అయిందో లేదో అని మెయిల్ ఇంకో సారి చెక్ చేసింది. సారి..వీ ఆర్ అనేబుల్ టు ఢిలివెర్..అన్న మెయిల్ చూసి కూర్చిలో అలా కూర్చుండి పోయింది. ఇంతలొ తన సెల్ కి వాయిస్ మెసేజ్ వచ్చిందని చూసి ఓపెన్ చేసింది. "మామిడి కాయలు, వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి చెయ్యలేక పోయారా..అయితే మా స్వగృహ స్టోర్ లో ఇప్పుడే ఆన్లైన్ ఆర్డర్ చేయడి, థాంక్ యు..బీప్...బీప్...బీప్.." ఇది మెసేజ్. వెంటనే సౌరబ్ మెసేజ్ లో చెప్పినట్టు ఉగాది పచ్చడి ఆన్లైన్ లో బుక్ చేసాడు.

"ఇలాంటి పరిస్తితి వస్తుందని నా చదువుకునే టైం లోనే అనుకున్నాను...ఎవ్వరూ పచ్చదనం కోసం ఆలోచించేవారు కాదు....ఎక్కడి చెట్లు అక్కడే నరికి విల్లాలు నిర్మించారు. కాలుష్యాన్ని పెంచారు. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు చిప్కో ఉద్యమం అని పర్య వరణం కోసం ఉద్య మించారు. ఆ తర్వాత అలాంటి వాటి గురించి ఆలోచించే నాదుడే కరువయ్యాడు. దాని పర్యవసానం ఇలా ఉంది. ఎక్కడో...కొన్ని కిలోమీటర్ల దూరంలో వేప..మామిడి చెట్లు....ఉన్న వాటిలో కొన్ని మాత్రమె పూత పూసి కాయలు దాకా వచ్చేది. మిగతావి కాలుష్య కోరల్లో చిక్కుకుని పిందె దశలోనే రాలిపోవటం..మరికొన్ని అసలు పూతే వెయ్యక పోవటం...వేపాకుది అదేపరిస్తితి...అసలు చెట్ల పరిస్థితే అలా ఉంది ఇప్పుడు. దాని ఫలితం....కాయలు, పువ్వుల కొరత....సంప్రదాయ పండుగలు జరుపుకోలేని పరిస్తితి...ఉగాది పచ్చడి కోసం ఆన్లైన్ బూకింగ్లు...." అంటూ బామ్మ నికిత శర్మ నిట్టూరిస్తూ అన్న మాటలు బ్రిట్నీ ఆసక్తిగా వింటోంది.

సంవన్ ఇస్ వెయిటింగ్ బిఫోర్ ది డోర్..సంవన్ ఇస్ వెయిటింగ్ బిఫోర్ ది డోర్....అంటూ ఇంట్లో ఉన్న డోర్ అలారం చెప్పటంతో బ్రిట్నీ వెళ్లి డోర్ తీసింది. మేడం...వి ఆర్ ఫ్రం స్వగృహ ఆన్లైన్ స్టోర్....హియర్ ఇస్ యువర్ ఉగాది చట్నీ..అంటూ ఉగాది పచ్చడి డెలివరీ అందించాడు. బామ్మ నికిత శర్మ అల్ప సంతోషం తో పరిగెత్తి పచ్చడి తీసుకుని ఇంటిల్ల పాదికీ ప్లాటినం చెంచాతో చేతిలో పెట్టింది. మొత్తానికి ఎలాగోలా పండగ జరుపుకున్నాం అన్న ఆనందం వారి మొహాల్లో కనిపిస్తుంది.

21, మార్చి 2009, శనివారం

'పల్లేటి' -- చెదరని, ఎప్పటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకం....

ఈ ప్రాంతం వరద ముంపుకు గురైయ్యే అవకాశం ఉన్నందున ఇక్కడున్న వాళ్లందరూ త్వరగా ఈ ప్రదేశం నుండి సురక్షిత ప్రదేశానికి వెళ్లాల్సిందిగా కోరడమైనది....ఇట్లు..జిల్లా కలెక్టర్...శ్రీకాకుళం...అంటూ రాత్రి ఏడింటికి రిక్షాలో ఒకావిడ కూర్చొని కాలనీ అంతా తిరుగుతూ మైక్ లో చెబుతుంది. నాకు భయం వేసి పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళా.... ఇంటికి దగ్గరలో ఉన్న పూరి పాకల్లో ఉండే కొంతమంది అమ్మగోరు...ఈ కొన్ని సామానులు మీ అటక మీద పెట్టారా...అని మా అమ్మని అడుగుతున్నారు. అప్పటికే వారి గుడిసెలు నీట మునిగిపోయాయి. అమ్మ సరేననటంతో ఒక్కొక్కరుగా వారి వారి సామానులు మా అటక మీద పెడుతున్నారు. చివరిగా రాములమ్మ తన సామానులు పెట్టడానికి సిద్దపడింది. ఒరేయ్...గొల్లిగా ...ఎక్కడ చచ్చావురా...అని తన కొడుకుని పిలిచింది. అమ్మా...డొక్కలో నొప్పిగా ఉందే...సామానులు మొయ్యలేను..అని అంటూనే ఒక్కొక్కటి పైన పెడుతున్నాడు. ఇదంతా విన్న మా అమ్మ వాడికి ఒక రొట్టె ముక్క ఇచ్చింది. వాడు ఆబగా దాన్ని తిన్నాడు. వాళ్ళ ఇళ్లులు పొద్దున్నే మునిగిపోవటంతో ఉదయం అంతా దగ్గరలో శివాలయం దగ్గర ఉన్న రావి చెట్టు క్రింద తలదాచుకుని గుడి ఆవరణలో ఉన్న బావి నీళ్ళే తాగి ఉన్నారు. విషయం తెలుసుకున్న అమ్మ అప్పటికప్పుడు అన్నం వండి వారికి పెట్టింది. ఇదంతా చూస్తున్న నేను ఆ పిల్లాడికి నీ పేరు ఏమిటి అని అడిగాను....'పల్లేటి ' అని చెప్పి మళ్ళీ తినడంలో మునిగిపోయాడు. వాళ్ళతో పాటు గుడిసెల్లో ఉన్న చాలా మంది తలో దిక్కుకి వెళ్లిపోయారు. వాళ్లకు చుట్టాలెవరూ లేక పోవటంతో అమ్మ కోరికపై మా ఇంటిలోనే తలదాచుకున్నారు. వేకువ ఝామున మూడింటికి మా కాలనీలో ఉన్న డాబాలన్నీ నెమ్మది నెమ్మదిగా వరద నీరు కొద్ది అడుగుల వరకూ ముంచటంతో ఇహ ఇక్కడ ఉండటం మంచిది కాదని మేము, పల్లేటి, వాళ్ళ అమ్మ, నాన్న మా పిన్నీ వాళ్ళింటికి వెళ్లి పోయాము. అలాంటి విపత్కర పరిస్థితులలో నాకు పల్లేటి పరిచయం అయ్యాడు.

ఇంటిలో ఎప్పుడైనా ఏదైనా అవసరం వుంటే పల్లేటిగాడే తెచ్చేవాడు. అప్పుడప్పుడూ అమ్మ ఏదైనా చేస్తే ఇద్దరకూ ఒకేసారి ఇచ్చేది. స్కూలుకు ఇద్దరం కలిసే వెళ్ళే వాళ్ళం. ఎవరైనా స్కూల్లో నన్ను కొట్టడానికి వస్తే వాడే నా తరపున గొడవ పడేవాడు. అవసరం అయితే దెబ్బలు కూడా తినేవాడు. మా స్కూలుకి వెళ్ళే దారిలో ఉన్న మామిడి తోటలో మేమిద్దరం మామిడి కాయలు కోసుకుని తోటలోనే ఉన్న బావి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం. ఒకసారి ఎప్పటిలాగే మేము కాయలు కోసుకుని తింటుండగా ఆ తోట యజమాని వచ్చి నేను అమాయకంగా మొహం పెట్టేసరికి నన్నొదిలి పల్లేటిగాడిని పట్టేసుకున్నాడు. వాడి చొక్కా పట్టుకుని లెంప కాయ కొట్టాడు. ఇంకా కొట్టబోతుండగా ...ఇంతలో అటువైపు నుండి ఎవరో మా లాగే కాయలు కొడుతుండటంతో వీడిని వదిలేసి అటు పరిగెత్తాడు. ఇంక మేమిద్దరం అక్కడనుండి జంప్ జిలానీ......దొంగాటలో ఎప్పుడైనా నేను మొదట కనిపిస్తే పట్టుకోకుండా కిట్టూ...నేను ఎవ్వరికీ చెప్పనులే..నువ్వెళ్ళి వేరే చోటులో దాక్కో...అని చెప్పి, వాడు మిగిలిన వారి కోసం వెతికే వాడు.

అవి దీపావళి దగ్గర పడుతున్న రోజులు...పిల్లలందరం గన్ లో కేపులు పెట్టి తెగ కాలుస్తున్న రోజులు....పల్లేటి వాళ్ళ గుడిసెల్లో ఒకాయన చిచ్చు బుడ్లు, మతాబులు, పిచ్చుకలు..వగైరా తయారుచేస్తుండే వాడు. అది చూసి వీడు ఒరేయ్..మనం పిచ్చుకలు తయారుచేద్దాము రా.....నేను పౌడర్ కొని తెస్తాను....మనం చేద్దాం...ఈ గన్ లు విసుగ్గా ఉన్నాయిరా అన్నాడు. కాని డబ్బులు ఎలా..?? నెమ్మదిగా నా డబ్బులు పిడతని డాబాపైకి తీసుకెళ్ళి, దాన్ని బోర్లించి, పైకి ఎత్తి ఒక సన్నని పుల్లతో చిల్లర తీసాము. పగల కొడితే అమ్మకు తెలుస్తుంది కదా... ఒక అయిదు రూపాయలు తీసాము. వెంటనే ఆ డబ్బులతో పల్లేటి పౌడర్, చిన్న చిన్న మట్టి ఉండలు తీసుకొచ్చాడు. ఈ ఉండల్లో చిచ్చు బుడ్డి లాగ పౌడర్ని నింపి దాని కన్నం దగ్గర పేపర్ అంటించి పిచ్చుకలు తయారు చేసాము. ఎండలో వాటిని ఆరోజు ఉంచి తర్వాత రోజు వాటిని టెస్ట్ చేసాము. ఒక ఊదొత్తి పుల్ల పట్టుకుని పిచ్చుక మూతికి అంటించి సర్రున పైకి వదలాలి. పల్లేటిగాడు బాగానే వదులుతున్నాడు. నావి మాత్రం నేల పైనే పడిపోతున్నాయి. ఇక లాభం లేదనుకుని ఒక పిచ్చుకని నిప్పు అంటించి బలంగా పైకి విసిరాను. పైకి విసిరాను అని నేననుకున్నాను గాని అది సరాసరి ఒక గుడిసె మీద పడింది. ఆ గుడిసె వరద రాకుండా గోడ కడుతున్న కూలీల విశ్రాంతి కోసం వేసింది. మధ్యాహ్నం కావటంతో కూలీలందరూ పనుల్లో ఉన్నారు. మేము ఆ విషయం వదిలేసి మా పిచ్చుకలు వదులుతూనే ఉన్నాము. ఇంతలో చూస్తుండగానే ఆ గుడిసె కప్పు నుండి మంటలు పెద్ద ఎత్తున లేచాయి. విషయం అర్ధం అయిన మేము చుట్టూ చూసి ఎవరూ మమ్మల్ని చూడలేదని నిర్దారించుకుని ఇంట్లోకి పరుగో పరుగు......

తర్వాత అందరిలాగే మేము ఆ గుడిసె చూడటానికి వెళ్ళాము....కూలీలు చుట్ట ఏదో తాగి గుడిసెలో పడేయటంవల్ల కాలి ఉంటుందని పబ్లిక్ టాక్....పల్లేటిగాడు 'చిత్రం భళారే విచిత్రం' లో బ్రహ్మానందం లాగా నా వైపు చూసి కనుబొమ్మలు ఎగరేసాడు....మేము పిచ్చుకలు వదులుతున్న సంగతి పల్లేటి వాళ్ళ నాన్నకి తెలుసు...ఆయనకి జరిగిందేమిటో అర్ధమైంది. వీడు ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న పెద్ద కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాడు....అది చూసి వాడు రోడ్డు మీదకి పరుగందుకున్నాడు....అయినా వాడిని పట్టేసుకుని వాళ్ళ నాన్న బాదుడే...బాదుడు.. అలాంటి పరిస్థితిలో వాడు నేనే ఆ పిచ్చుక వదిలేనని నోరైన విప్పి చెప్పలే....వాళ్ళ నాన్న ఎందుకు కొడుతున్నాడో తెలియక గుడిసెలో వాళ్లందరూ వింతగా చూస్తున్నారు. పాపం....నా మూలంగా వాడు దెబ్బలు తినాల్సి వచ్చింది.

నా స్నేహితులందరిలోనూ పల్లేటి గాడు ప్రత్యేకం. వాళ్ల నాన్న జాలారి. ఒకసారి వేసవిలో మా ఇంటికి వచ్చి కిట్టు... ( కొంచం హుషారు గా ఉండటం వల్ల మా బలగం నా పేరును "కిట్టిగాడు" సీరియల్ ప్రభావంతో అలా పిలిచేవారు ) కిట్టు...అని పరిగెత్తుకుని వచ్చాడు. మా అమ్మ పక్కనే ఉండటం చూసి పక్కకు రమ్మని సైగ చేసాడు. నాకు చేపల పిచ్చి అని వాడికిబాగా తెలుసు. కిట్టు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల నది నీరు పాయలు పాయలుగా చీలిపోయింది..మనం చేపలు పడదాం రారా...అని పిలిచాడు. ఇంకేం...వాడిని ఫాలోఅయిపోయాను. ఇసకలో కొంత దూరం నడిచాక ఒరేయ్...అదిగో చిన్న పాయ చూడు..అక్కడైతే మనకు వీజీగా దొరుకుతాయి చేపలు అని చెప్పాడు. కొద్ది సేపు తర్వాత నదిపాయ దగ్గరకు చేరుకున్నాము. చిన్న చిన్న చేపలు క్రిస్టల్ క్లియర్ నీటిలో గబ గబా తిరిగేస్తున్నాయి. వాడు నీటిలో దిగి, ఒడ్డుకు కొంతదూరం నుండి నీటిని ఒడ్డు వైపుకు వేగంగాతోసాడు. నీళ్లు మళ్లి వెనక్కు చేరుకున్నాక రెండు మూడు చేప పిల్లలు ఒడ్డున గెంతుతున్నాయి. ఇద్దరికీ గొప్ప సంబరంగా అనిపించింది. వెంటనే పాలిథీన్ కవర్ లో నీళ్లు నింపి చేపపిల్లలను అందులో వేసాము. నేనేమో 'తారే జమీన్ పర్' సినిమాలో కుర్రాడిలా పాలిథీన్ కవర్ వైపు అలాగే చూస్తుండి పోయాను. ఒరేయ్...రారా నువ్వు కూడా పట్టు అన్న పల్లేటిగాడి మాటతో నీటిలోకి దిగాను. ఇద్దరం కలిసి కనీసం పాతిక పైగా చేప పిల్లలను పట్టి ఉంటాము. నేను మళ్లి కవర్లో చేప పిల్లల వైపు అలా చూస్తుండి పోయాను...ఇంతలో పేద్దశబ్దం...ఎంటా అని వెనక్కి తిరిగి చూసాను....పల్లేటి వాళ్ల నాన్న. వాడి వీపు పై ఒక్కటిచ్చాడు. వాళ్ళ నాన్న కోపం అంతటితో ఆగలేదు. పక్కనే చాకలి వాళ్లు బట్టలు ఉడకబెడుతున్న పొయ్యి నుండి కాలిఉన్న కట్టెను తెచ్చి వాడి కాలికి చురక పెట్టాడు. వాడు దెబ్బలు తిన్నది నన్ను నది దగ్గరకు వెంటబెట్టుకుని వచ్చినందుకు. వాళ్ళమ్మ మా ఇంటిలోపని చేస్తుంది. విషయం తెలిస్తే గొడవ పెడతారని ఆయన భయం. నేను మాత్రం ఇంటికి విషయం చెప్పకుండా ఆక్వేరియం లోని చేపలని నమ్మించేసాను. వాళ్ల నాన్న మా ఇంటిలోచెప్పలేదు. పాపం వాడు మాత్రం పెద్ద శిక్షకే బలైపోయాడు.

ఒక సారి ఏదో పని మీద మా ఊరు వచ్చిన మామయ్య నా చదువు గురించి ఆరా తీసినప్పుడు మాటల మధ్యలో అమ్మ నా చేపల వేట గురించి చెప్పింది. నా ఆసక్తి గమనించిన మామయ్య వెళ్ళిపోతున్నప్పుడు
ఏటి దగ్గరకు వెళ్ళొద్దని చెప్పి ఒక వంద రూపాయలు ఇచ్చి ఆక్వేరియం కొనుక్కోమన్నారు. దానితో ఆక్వేరియం, రెండు పిల్ల చేపలు కొన్నాను. పాపం బుల్లివి నేను ఒండుకు తినేస్తానని అనుకున్నాయేమో...తెచ్చిన తర్వాత రోజే నీటి మీదతేలాయి. ఆక్వేరియం నీళ్ళు తప్పించి ఇంకేమీ లేకుండా వారం దాకా అలానే ఉండి పోయింది. ఇంతలో మాపల్లేటిగాడు మళ్లీ సీన్ లోకి వచ్చాడు. జరిగినదంతా విన్న తర్వాత ఒరేయ్...మీ మామయ్య ఏటి దగ్గరకు వెళ్ళకు అన్నాడు గాని వేరే చోటుకు వెళ్ళొద్దని అనలేదుగా...అని అన్నాడు..నాఆక్వేరియంలాగే నా బుర్ర కూడా బ్లాంక్ గా ఉందప్పుడు. నాతో రారా..నీకు బోలెడు చేపలు ఇస్తాను అని చెప్పి ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఒక కిలోమీటరు నడిపించాడు.

ఏదో కొత్తగాకడుతున్న కాలనీ అది. పొలాలు మధ్యలో అక్కడక్కడా ఇళ్లు ఉన్నాయి. అక్కడక్కడా పొలాల్లోకి నీరు చేరేందుకు కాలువ గట్లు ఉన్నాయి. ఒక కాలువ దగ్గరకు వెళ్ళాం ఇద్దరు. కాలువనీటి అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. నీటి మొక్కలు కాలువ ప్రవాహానికి లయబద్దంగా ఊగుతున్నయి. మొక్కల మధ్యలో చిన్న చిన్న చేపలు ఉత్సాహంగా తిరుగుతున్నాయి. నా మొహం ఫ్లడ్ లైట్ లాగా ఒక్కసారి హై వోల్టేజ్ తో వెలిగింది. కాని మోకాలు కంటే కొంచం ఎక్కువ లోతున్న నీటిలో ఎలా చేపలు పట్టేది. ఒక్కసారి నా బ్లాంక్ అక్వేరియం కళ్ళముందు కనపడింది. పల్లేటికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. కాలువ నీరు ఒక పొలం నుండి మరొక పొలంలోకి పంపుతున్నప్పుడు మధ్యలో రోడ్డు వస్తే దాని కింద గొట్టాలు అమర్చి పంపుతున్నారు. గొట్టం ఒక చివరి దగ్గరకు వచ్చి చూస్తే బోలెడు చేపలు అక్కడ గుంపుగా ఉన్నాయి. పల్లేటి ఎంతైనా జాలారి కొడుకు కదా...ఓ నాలుగైదు చేపలు మాతో పాటు తెచ్చిన అక్వేరియం నెట్ తో ఒడుపుగా పట్టాడు. వాటిని కవర్లో వేసి, కొన్ని నీటి మొక్కలతో ఇంటికి వెనుతిరిగాము. నా అక్వేరియమ్ ను నీటిమొక్కలు, రాళ్ళతో అలంకరించి చేపలు వేశాను. అంతా అయ్యక చూస్తే ఒక మిని నీటి ప్రపంచం మా ఇంట్లో ఉన్నట్టనిపించింది. నా క్రియేటివిటి చూసి మా అమ్మమురిసిపోయింది. ఆ సంతోషంలో పల్లేటి అమ్మగారూ....ఆ చేపలు నేనే పట్టాను తెలుసా...అవి ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు అని అసలు విషయం చెప్పేసాడు. ఒక్క నిమిషం భయం వేసింది. అమ్మ ఏమీ అనలేదు. కాని మా పెరట్లో అంట్లు తోముతున్న పల్లేటి వాళ్ళమ్మ రాములమ్మ ఈ విషయం వింది.

ఆ తర్వాత రోజు కరెంట్-షాక్ ఆట ఆడుతుంటే వాడు ఎందుకో కుంటుతున్నట్టు అనిపించి ఏమైందిరా అని అడిగితే నేను మళ్లీ చేపలు పట్టడానికి వెళ్లానని మా అమ్మ అయ్యతో చెప్పేసిందిరా....అది విని ఎదవకి కాలో చెయ్యో విరగ్గొడితే గాని దారిలోకి రాడు అని కూర్చున్న పీటని కోపంతో అయ్య నా వైపు విసిరాడు.....అని చెప్పి మళ్లీ ఆటలో మునిగిపోయాడు.

మేమిద్దరం ఇంచుమించు కలసిన ప్రతిసారి నేను చేసిన ఎదవ పనులకి, వాడు చేసిన వాటికి అన్నింటికీ వాడే దెబ్బలు తినేవాడు...స్కూల్లో అయినా సరే....ఇంటిదగ్గర అయినా సరే....

ఒక సాయింత్రం రాములమ్మ మా ఇంటి వరండాలో కూర్చొని ఉంది. అమ్మ ఆవిడకు తన పాత చీరలు, ఇంటిలో కొన్ని చెక్క సామానులు ఇచ్చేస్తుంది. అప్పుడే ఆటనుండి తిన్నగా ఇంటికి వస్తున్న నేను వంటి మీద, తల మీద బండెడు ఇసక ఉండటంవల్ల తల విదిల్చుకుంటూ ఇంటిలోకి వెళుతూ అమ్మ ఎందుకు ఇవి రాములమ్మకు ఇచ్చేస్తున్నావ్? అని అడిగాను. బాబు....కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇలా ఇసకలో ఆడలేవు....ఆ పల్లేటి గాడితో చెట్ల వెంట, పుట్టల వెంట గాలికి తిరగలేవు...మీరు ఇల్లు మారి పోతున్నారు అని రాములమ్మ చెప్పింది. విని ఒక్క క్షణం నేను అవునా....అవునా...అంటూ అమ్మని కాళ్ళ దగ్గర కుదిపేస్తూ అడిగాను. అవునన్నట్టు తలూపింది.

ఇల్లు మారే టైం రానే వచ్చింది......
ఆ కొత్త ఇల్లు రోడ్డుకు ఆనుకుని ఉంటుందని....అక్కడ ఆట స్థలాలు, తోటలు ఏమీ లేవని....ఇసక మచ్చుకు అయినా కనిపించదని నాన్న రాత్రి పడుకొని తన కాళ్ళ మీద నన్నుఉయ్యాలు ఊపుతు చెప్పారు.

సామానులు అన్ని ఒక్కక్కటిగా లారీ ఎక్కిస్తున్నారు. నా ఆట గాంగ్ అంతా మా ఇంటి ముందు చేరి ఉన్నారు. నేను చాలా బాధగా ఉన్నాను.
సామానులన్నీ లారీలో వెళ్ళిపోయాక నాన్న రిక్షాని పిలిచి దానిలో చిన్న చిన్న పూల కుండీలు పెట్టించారు. అమ్మ అందరి ఇంటికి వెళ్లి చెప్పి వస్తుంది. ఒరేయ్....మీ స్నేహితులకు టాటా చెప్పెయ్ రా అని నాన్న రిక్షాలో కూర్చొని చెబుతున్నారు. అందరూ ఒక్కసారిగా కిట్టూ.....సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడికి రా రా ...మనం అప్పుడు ఆడుకుందాము...అని అన్నారు. కాని పల్లేటి మాత్రం చాలా మౌనంగా ఉన్నాడు. మా రిక్షా కదిలింది. కొద్ది దూరం వెళ్ళాకా తెలిసింది...పల్లేటి మా రిక్షాని ఫాలో అవుతున్నాడని...కిట్టూ..రోజూ స్కూల్లో నాకు కనిపిస్తావా? నీకు చేపలు అవసరం అయితే చెప్పూ..మనం మళ్ళీ పడదాం..అమ్మగారూ..మీకు ఏదైనా అవసరం అయితే కబురు పెట్టండి...అలా పరిగెడుతూనే మాటలాడుతున్నాడు. అమ్మ ఇక సరే లేరా..ఇంటికి వెళ్ళు..అని చెప్పినా సరే వాడు మాత్రం చాలా దూరం మా రిక్షాని ఫాలో అయ్యాడు. నాకు కూడా మనసులో స్పష్టంగా ఇది అని చెప్పుకోలేని వెలితి...వాడు బాగా అలసి పోయాక ఒక చోట ఆగిపోయాడు...

రిక్షాలో కొంత దూరం వెళ్ళాక నాన్న చెప్పారు...నేను స్కూలు మారుతున్నానని...ఇంకో మూడేళ్ళల్లో టెంత్ క్లాసు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారని. నా స్నేహితులు, నా ఆటలు, తోటలో అల్లర్లు..ఇవన్నీ వదిలి వచ్చేస్తున్నాను అన్న విషయాలు ఇంకా మింగుడు పడక ముందే చెప్పటంతో నాన్న చెప్పిన విషయం నేను అంతగా పట్టించుకోలేదు.

నాన్న స్కూల్లో టీ. సి. ఇంకా తీసుకోకపోవటంతో నేను, పల్లేటి రోజూ స్కూల్లో కలుసుకునే వాళ్ళం. అమ్మ ఏదైనా ప్రత్యేక వంటకం చేస్తే పల్లెటికి ఇవ్వమని నా కారియర్లో పెట్టేది. వాడు నేను ఏదో తెస్తానని చూసేవాడు.. ఒక రోజు నాన్న నువ్వు రేపటినుండి వేరే స్కూలుకు వెళ్తున్నావు...అని చెప్పి అమ్మతో నా స్కూలు గురించి ఏదో మాట్లాడటంలో మునిగి పోయారు. పాపం..రేపటి నుండి ఇంక స్కూలుకు రాను అని వాడితో ఒక్క మాటకూడా చెప్పలేదు...

అప్పటి వరకూ గవర్నమెంట్ స్కూల్లో ఆడిందే ఆట...పాడిందే పాట...నాలుగింటికి ఇంటికి రావటం....ఏడింటి వరకూ ఆటలు...కబుర్లు..ఇలా ఉండేది జీవితం. ప్రైవేటు స్కూల్లో అయిదింటి వరకూ తరగతులు..రాత్రి ఎనిమిది వరకూ స్టడీ అవర్స్..మళ్ళీ పొద్దున్నే ఎనిమిదిన్నరకు స్కూలు..ఈ గాప్ లో అసైనమేంట్లు...హోం వర్క్లు......క్లాసులోని పిల్లలు అందరూ ఎప్పుడూ ఆ లెసన్..ఈ లెసన్..ఆ ప్రాబ్లం..ఈ ప్రాబ్లం అంటూ మాట్లాడే వారే తప్ప ఒక్కళ్ళు కూడా ఆటల గురించి, సరదాల గురించి మాట్లాడే వారు కాదు. ఒక్క సారి నరకంలో పడ్డట్టు అనిపించేది రోజు....స్నేహితులు లేరు..ఆటలు లేవు...ఎంతసేపూ చదువు...చదువు...చదువు....అప్
పటివరకు చదువులో చురుకుగా ఉన్న నేను ఇలాంటి వాతావరణంలో చాలా డల్ గా అయిపోయాను.....ఇంటిలో వాళ్లకు నా భాదేంటో అర్ధమయ్యేది కాదు...సాయింత్రం స్కూల్లో స్టడీ అవర్స్ లో పుస్తకం ముందేసుకుని కూర్చున్నప్పుడు నా పాత స్నేహితులు, ఆటలు, చేపల వేటలు, పల్లేటి గాడు గుర్తొచ్చి ఏడిచేవాడిని. ఇలాగే ఒక ఏడు నెలలు గడిచిపోయాయి. పల్లేటి గాడితో నా సంభందాలు పూర్తిగా తెగిపోయాయి.

రోజూ ఉండే ఫ్రస్ట్రేషన్ తోనే ఒక రోజు సైకిల్ పై స్కూలికి వెళ్తుంటే మా పాత ఇంటిలో మా పక్కనే ఉన్న తారక కనిపించాడు. చాలా రోజుల తర్వాత నా గ్యాంగ్ లోని ఒకడిని చూడగానే చాలా సంతోషం వేసింది. అందరి గురించి అడిగేక పల్లేటి ఎలా ఉన్నాడురా అని అడగక ముందే....నీకు తెలీదా ఈ విషయం ...అని తారక నన్ను అడిగాడు. పల్లేటి, నువ్వు స్కూలు మారిపోయాక, వాడు స్కూలు కి రెగ్యులర్ గా వెళ్ళక పోవటంతో తన పేరు తీసేసారు....వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వలేకపోవటంతో ఇంటిదగ్గరే చాలా రోజులు ఉన్నాడు. ఇంటిపట్టున ఎందుకులే అని అతనితో పాటు సముద్రంలో చేపల వేటకి తీసుకెళ్ళాడు...సముద్రంలో తుఫాను కారణంగా నాటు పడవ మునిగి పల్లేటి చనిపోయాడు....అని చెప్పి వాడికి స్కూలు టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్క సారి శరీరం వణికింది..కళ్ళముందు ఏమీ కనిపించటంలేదు...ఒక మబ్బులా కమ్ముకొంది...అలానే సైకిల్ తొక్కుతూ ఒక రిక్షాని గుద్ది కింద పడిపోయాను. స్కూలు కి వెళ్లానే గాని మనసంతా నా ఆదీనంలో లేదు. మనిషిని మాత్రమే క్లాసులో ఉన్నాను. శూన్యం లోకి చూస్తూ అలా క్లాసులన్నీ గడిపేశాను....ఆ శూన్యంలో కూడా వాడితో ఆటలు, సరదాలు, నా మూలంగా వాడు దెబ్బలు తింటూ అవి తాళలేక రోడ్డు వైపు పరిగెత్తటం....ఇవే కనిపిస్తున్నాయి. ఒక్క క్లాసులో కూడా డిక్టేట్ చేస్తున్న నోట్స్ రాయలేదు. అది గమనించిన మా ప్రిన్సిపాల్ నన్ను బెత్తంతో ఒక పది నిమిషాలు కొడుతూనే ఉన్నాడు. విచిత్రంగా మనసులో నేను అనుభవిస్తున్న భాద ముందు అదేమీ అంత భాదించలేదు. క్లాసులో గట్టిగా అరచి ఏడవాలనిపించింది. గతంలో నా వల్ల ఎన్నో దెబ్బలు తిన్నాడు వాడు.... ఆ రోజు వాడి ఆలోచనల మూలంగా నేను దెబ్బలు తింటున్నప్పుడు మనసులో భాధ ఉన్నా చాలా ఆనందం వేసింది.