21, మార్చి 2009, శనివారం

'పల్లేటి' -- చెదరని, ఎప్పటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకం....

ఈ ప్రాంతం వరద ముంపుకు గురైయ్యే అవకాశం ఉన్నందున ఇక్కడున్న వాళ్లందరూ త్వరగా ఈ ప్రదేశం నుండి సురక్షిత ప్రదేశానికి వెళ్లాల్సిందిగా కోరడమైనది....ఇట్లు..జిల్లా కలెక్టర్...శ్రీకాకుళం...అంటూ రాత్రి ఏడింటికి రిక్షాలో ఒకావిడ కూర్చొని కాలనీ అంతా తిరుగుతూ మైక్ లో చెబుతుంది. నాకు భయం వేసి పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళా.... ఇంటికి దగ్గరలో ఉన్న పూరి పాకల్లో ఉండే కొంతమంది అమ్మగోరు...ఈ కొన్ని సామానులు మీ అటక మీద పెట్టారా...అని మా అమ్మని అడుగుతున్నారు. అప్పటికే వారి గుడిసెలు నీట మునిగిపోయాయి. అమ్మ సరేననటంతో ఒక్కొక్కరుగా వారి వారి సామానులు మా అటక మీద పెడుతున్నారు. చివరిగా రాములమ్మ తన సామానులు పెట్టడానికి సిద్దపడింది. ఒరేయ్...గొల్లిగా ...ఎక్కడ చచ్చావురా...అని తన కొడుకుని పిలిచింది. అమ్మా...డొక్కలో నొప్పిగా ఉందే...సామానులు మొయ్యలేను..అని అంటూనే ఒక్కొక్కటి పైన పెడుతున్నాడు. ఇదంతా విన్న మా అమ్మ వాడికి ఒక రొట్టె ముక్క ఇచ్చింది. వాడు ఆబగా దాన్ని తిన్నాడు. వాళ్ళ ఇళ్లులు పొద్దున్నే మునిగిపోవటంతో ఉదయం అంతా దగ్గరలో శివాలయం దగ్గర ఉన్న రావి చెట్టు క్రింద తలదాచుకుని గుడి ఆవరణలో ఉన్న బావి నీళ్ళే తాగి ఉన్నారు. విషయం తెలుసుకున్న అమ్మ అప్పటికప్పుడు అన్నం వండి వారికి పెట్టింది. ఇదంతా చూస్తున్న నేను ఆ పిల్లాడికి నీ పేరు ఏమిటి అని అడిగాను....'పల్లేటి ' అని చెప్పి మళ్ళీ తినడంలో మునిగిపోయాడు. వాళ్ళతో పాటు గుడిసెల్లో ఉన్న చాలా మంది తలో దిక్కుకి వెళ్లిపోయారు. వాళ్లకు చుట్టాలెవరూ లేక పోవటంతో అమ్మ కోరికపై మా ఇంటిలోనే తలదాచుకున్నారు. వేకువ ఝామున మూడింటికి మా కాలనీలో ఉన్న డాబాలన్నీ నెమ్మది నెమ్మదిగా వరద నీరు కొద్ది అడుగుల వరకూ ముంచటంతో ఇహ ఇక్కడ ఉండటం మంచిది కాదని మేము, పల్లేటి, వాళ్ళ అమ్మ, నాన్న మా పిన్నీ వాళ్ళింటికి వెళ్లి పోయాము. అలాంటి విపత్కర పరిస్థితులలో నాకు పల్లేటి పరిచయం అయ్యాడు.

ఇంటిలో ఎప్పుడైనా ఏదైనా అవసరం వుంటే పల్లేటిగాడే తెచ్చేవాడు. అప్పుడప్పుడూ అమ్మ ఏదైనా చేస్తే ఇద్దరకూ ఒకేసారి ఇచ్చేది. స్కూలుకు ఇద్దరం కలిసే వెళ్ళే వాళ్ళం. ఎవరైనా స్కూల్లో నన్ను కొట్టడానికి వస్తే వాడే నా తరపున గొడవ పడేవాడు. అవసరం అయితే దెబ్బలు కూడా తినేవాడు. మా స్కూలుకి వెళ్ళే దారిలో ఉన్న మామిడి తోటలో మేమిద్దరం మామిడి కాయలు కోసుకుని తోటలోనే ఉన్న బావి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం. ఒకసారి ఎప్పటిలాగే మేము కాయలు కోసుకుని తింటుండగా ఆ తోట యజమాని వచ్చి నేను అమాయకంగా మొహం పెట్టేసరికి నన్నొదిలి పల్లేటిగాడిని పట్టేసుకున్నాడు. వాడి చొక్కా పట్టుకుని లెంప కాయ కొట్టాడు. ఇంకా కొట్టబోతుండగా ...ఇంతలో అటువైపు నుండి ఎవరో మా లాగే కాయలు కొడుతుండటంతో వీడిని వదిలేసి అటు పరిగెత్తాడు. ఇంక మేమిద్దరం అక్కడనుండి జంప్ జిలానీ......దొంగాటలో ఎప్పుడైనా నేను మొదట కనిపిస్తే పట్టుకోకుండా కిట్టూ...నేను ఎవ్వరికీ చెప్పనులే..నువ్వెళ్ళి వేరే చోటులో దాక్కో...అని చెప్పి, వాడు మిగిలిన వారి కోసం వెతికే వాడు.

అవి దీపావళి దగ్గర పడుతున్న రోజులు...పిల్లలందరం గన్ లో కేపులు పెట్టి తెగ కాలుస్తున్న రోజులు....పల్లేటి వాళ్ళ గుడిసెల్లో ఒకాయన చిచ్చు బుడ్లు, మతాబులు, పిచ్చుకలు..వగైరా తయారుచేస్తుండే వాడు. అది చూసి వీడు ఒరేయ్..మనం పిచ్చుకలు తయారుచేద్దాము రా.....నేను పౌడర్ కొని తెస్తాను....మనం చేద్దాం...ఈ గన్ లు విసుగ్గా ఉన్నాయిరా అన్నాడు. కాని డబ్బులు ఎలా..?? నెమ్మదిగా నా డబ్బులు పిడతని డాబాపైకి తీసుకెళ్ళి, దాన్ని బోర్లించి, పైకి ఎత్తి ఒక సన్నని పుల్లతో చిల్లర తీసాము. పగల కొడితే అమ్మకు తెలుస్తుంది కదా... ఒక అయిదు రూపాయలు తీసాము. వెంటనే ఆ డబ్బులతో పల్లేటి పౌడర్, చిన్న చిన్న మట్టి ఉండలు తీసుకొచ్చాడు. ఈ ఉండల్లో చిచ్చు బుడ్డి లాగ పౌడర్ని నింపి దాని కన్నం దగ్గర పేపర్ అంటించి పిచ్చుకలు తయారు చేసాము. ఎండలో వాటిని ఆరోజు ఉంచి తర్వాత రోజు వాటిని టెస్ట్ చేసాము. ఒక ఊదొత్తి పుల్ల పట్టుకుని పిచ్చుక మూతికి అంటించి సర్రున పైకి వదలాలి. పల్లేటిగాడు బాగానే వదులుతున్నాడు. నావి మాత్రం నేల పైనే పడిపోతున్నాయి. ఇక లాభం లేదనుకుని ఒక పిచ్చుకని నిప్పు అంటించి బలంగా పైకి విసిరాను. పైకి విసిరాను అని నేననుకున్నాను గాని అది సరాసరి ఒక గుడిసె మీద పడింది. ఆ గుడిసె వరద రాకుండా గోడ కడుతున్న కూలీల విశ్రాంతి కోసం వేసింది. మధ్యాహ్నం కావటంతో కూలీలందరూ పనుల్లో ఉన్నారు. మేము ఆ విషయం వదిలేసి మా పిచ్చుకలు వదులుతూనే ఉన్నాము. ఇంతలో చూస్తుండగానే ఆ గుడిసె కప్పు నుండి మంటలు పెద్ద ఎత్తున లేచాయి. విషయం అర్ధం అయిన మేము చుట్టూ చూసి ఎవరూ మమ్మల్ని చూడలేదని నిర్దారించుకుని ఇంట్లోకి పరుగో పరుగు......

తర్వాత అందరిలాగే మేము ఆ గుడిసె చూడటానికి వెళ్ళాము....కూలీలు చుట్ట ఏదో తాగి గుడిసెలో పడేయటంవల్ల కాలి ఉంటుందని పబ్లిక్ టాక్....పల్లేటిగాడు 'చిత్రం భళారే విచిత్రం' లో బ్రహ్మానందం లాగా నా వైపు చూసి కనుబొమ్మలు ఎగరేసాడు....మేము పిచ్చుకలు వదులుతున్న సంగతి పల్లేటి వాళ్ళ నాన్నకి తెలుసు...ఆయనకి జరిగిందేమిటో అర్ధమైంది. వీడు ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న పెద్ద కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాడు....అది చూసి వాడు రోడ్డు మీదకి పరుగందుకున్నాడు....అయినా వాడిని పట్టేసుకుని వాళ్ళ నాన్న బాదుడే...బాదుడు.. అలాంటి పరిస్థితిలో వాడు నేనే ఆ పిచ్చుక వదిలేనని నోరైన విప్పి చెప్పలే....వాళ్ళ నాన్న ఎందుకు కొడుతున్నాడో తెలియక గుడిసెలో వాళ్లందరూ వింతగా చూస్తున్నారు. పాపం....నా మూలంగా వాడు దెబ్బలు తినాల్సి వచ్చింది.

నా స్నేహితులందరిలోనూ పల్లేటి గాడు ప్రత్యేకం. వాళ్ల నాన్న జాలారి. ఒకసారి వేసవిలో మా ఇంటికి వచ్చి కిట్టు... ( కొంచం హుషారు గా ఉండటం వల్ల మా బలగం నా పేరును "కిట్టిగాడు" సీరియల్ ప్రభావంతో అలా పిలిచేవారు ) కిట్టు...అని పరిగెత్తుకుని వచ్చాడు. మా అమ్మ పక్కనే ఉండటం చూసి పక్కకు రమ్మని సైగ చేసాడు. నాకు చేపల పిచ్చి అని వాడికిబాగా తెలుసు. కిట్టు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల నది నీరు పాయలు పాయలుగా చీలిపోయింది..మనం చేపలు పడదాం రారా...అని పిలిచాడు. ఇంకేం...వాడిని ఫాలోఅయిపోయాను. ఇసకలో కొంత దూరం నడిచాక ఒరేయ్...అదిగో చిన్న పాయ చూడు..అక్కడైతే మనకు వీజీగా దొరుకుతాయి చేపలు అని చెప్పాడు. కొద్ది సేపు తర్వాత నదిపాయ దగ్గరకు చేరుకున్నాము. చిన్న చిన్న చేపలు క్రిస్టల్ క్లియర్ నీటిలో గబ గబా తిరిగేస్తున్నాయి. వాడు నీటిలో దిగి, ఒడ్డుకు కొంతదూరం నుండి నీటిని ఒడ్డు వైపుకు వేగంగాతోసాడు. నీళ్లు మళ్లి వెనక్కు చేరుకున్నాక రెండు మూడు చేప పిల్లలు ఒడ్డున గెంతుతున్నాయి. ఇద్దరికీ గొప్ప సంబరంగా అనిపించింది. వెంటనే పాలిథీన్ కవర్ లో నీళ్లు నింపి చేపపిల్లలను అందులో వేసాము. నేనేమో 'తారే జమీన్ పర్' సినిమాలో కుర్రాడిలా పాలిథీన్ కవర్ వైపు అలాగే చూస్తుండి పోయాను. ఒరేయ్...రారా నువ్వు కూడా పట్టు అన్న పల్లేటిగాడి మాటతో నీటిలోకి దిగాను. ఇద్దరం కలిసి కనీసం పాతిక పైగా చేప పిల్లలను పట్టి ఉంటాము. నేను మళ్లి కవర్లో చేప పిల్లల వైపు అలా చూస్తుండి పోయాను...ఇంతలో పేద్దశబ్దం...ఎంటా అని వెనక్కి తిరిగి చూసాను....పల్లేటి వాళ్ల నాన్న. వాడి వీపు పై ఒక్కటిచ్చాడు. వాళ్ళ నాన్న కోపం అంతటితో ఆగలేదు. పక్కనే చాకలి వాళ్లు బట్టలు ఉడకబెడుతున్న పొయ్యి నుండి కాలిఉన్న కట్టెను తెచ్చి వాడి కాలికి చురక పెట్టాడు. వాడు దెబ్బలు తిన్నది నన్ను నది దగ్గరకు వెంటబెట్టుకుని వచ్చినందుకు. వాళ్ళమ్మ మా ఇంటిలోపని చేస్తుంది. విషయం తెలిస్తే గొడవ పెడతారని ఆయన భయం. నేను మాత్రం ఇంటికి విషయం చెప్పకుండా ఆక్వేరియం లోని చేపలని నమ్మించేసాను. వాళ్ల నాన్న మా ఇంటిలోచెప్పలేదు. పాపం వాడు మాత్రం పెద్ద శిక్షకే బలైపోయాడు.

ఒక సారి ఏదో పని మీద మా ఊరు వచ్చిన మామయ్య నా చదువు గురించి ఆరా తీసినప్పుడు మాటల మధ్యలో అమ్మ నా చేపల వేట గురించి చెప్పింది. నా ఆసక్తి గమనించిన మామయ్య వెళ్ళిపోతున్నప్పుడు
ఏటి దగ్గరకు వెళ్ళొద్దని చెప్పి ఒక వంద రూపాయలు ఇచ్చి ఆక్వేరియం కొనుక్కోమన్నారు. దానితో ఆక్వేరియం, రెండు పిల్ల చేపలు కొన్నాను. పాపం బుల్లివి నేను ఒండుకు తినేస్తానని అనుకున్నాయేమో...తెచ్చిన తర్వాత రోజే నీటి మీదతేలాయి. ఆక్వేరియం నీళ్ళు తప్పించి ఇంకేమీ లేకుండా వారం దాకా అలానే ఉండి పోయింది. ఇంతలో మాపల్లేటిగాడు మళ్లీ సీన్ లోకి వచ్చాడు. జరిగినదంతా విన్న తర్వాత ఒరేయ్...మీ మామయ్య ఏటి దగ్గరకు వెళ్ళకు అన్నాడు గాని వేరే చోటుకు వెళ్ళొద్దని అనలేదుగా...అని అన్నాడు..నాఆక్వేరియంలాగే నా బుర్ర కూడా బ్లాంక్ గా ఉందప్పుడు. నాతో రారా..నీకు బోలెడు చేపలు ఇస్తాను అని చెప్పి ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఒక కిలోమీటరు నడిపించాడు.

ఏదో కొత్తగాకడుతున్న కాలనీ అది. పొలాలు మధ్యలో అక్కడక్కడా ఇళ్లు ఉన్నాయి. అక్కడక్కడా పొలాల్లోకి నీరు చేరేందుకు కాలువ గట్లు ఉన్నాయి. ఒక కాలువ దగ్గరకు వెళ్ళాం ఇద్దరు. కాలువనీటి అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. నీటి మొక్కలు కాలువ ప్రవాహానికి లయబద్దంగా ఊగుతున్నయి. మొక్కల మధ్యలో చిన్న చిన్న చేపలు ఉత్సాహంగా తిరుగుతున్నాయి. నా మొహం ఫ్లడ్ లైట్ లాగా ఒక్కసారి హై వోల్టేజ్ తో వెలిగింది. కాని మోకాలు కంటే కొంచం ఎక్కువ లోతున్న నీటిలో ఎలా చేపలు పట్టేది. ఒక్కసారి నా బ్లాంక్ అక్వేరియం కళ్ళముందు కనపడింది. పల్లేటికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. కాలువ నీరు ఒక పొలం నుండి మరొక పొలంలోకి పంపుతున్నప్పుడు మధ్యలో రోడ్డు వస్తే దాని కింద గొట్టాలు అమర్చి పంపుతున్నారు. గొట్టం ఒక చివరి దగ్గరకు వచ్చి చూస్తే బోలెడు చేపలు అక్కడ గుంపుగా ఉన్నాయి. పల్లేటి ఎంతైనా జాలారి కొడుకు కదా...ఓ నాలుగైదు చేపలు మాతో పాటు తెచ్చిన అక్వేరియం నెట్ తో ఒడుపుగా పట్టాడు. వాటిని కవర్లో వేసి, కొన్ని నీటి మొక్కలతో ఇంటికి వెనుతిరిగాము. నా అక్వేరియమ్ ను నీటిమొక్కలు, రాళ్ళతో అలంకరించి చేపలు వేశాను. అంతా అయ్యక చూస్తే ఒక మిని నీటి ప్రపంచం మా ఇంట్లో ఉన్నట్టనిపించింది. నా క్రియేటివిటి చూసి మా అమ్మమురిసిపోయింది. ఆ సంతోషంలో పల్లేటి అమ్మగారూ....ఆ చేపలు నేనే పట్టాను తెలుసా...అవి ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు అని అసలు విషయం చెప్పేసాడు. ఒక్క నిమిషం భయం వేసింది. అమ్మ ఏమీ అనలేదు. కాని మా పెరట్లో అంట్లు తోముతున్న పల్లేటి వాళ్ళమ్మ రాములమ్మ ఈ విషయం వింది.

ఆ తర్వాత రోజు కరెంట్-షాక్ ఆట ఆడుతుంటే వాడు ఎందుకో కుంటుతున్నట్టు అనిపించి ఏమైందిరా అని అడిగితే నేను మళ్లీ చేపలు పట్టడానికి వెళ్లానని మా అమ్మ అయ్యతో చెప్పేసిందిరా....అది విని ఎదవకి కాలో చెయ్యో విరగ్గొడితే గాని దారిలోకి రాడు అని కూర్చున్న పీటని కోపంతో అయ్య నా వైపు విసిరాడు.....అని చెప్పి మళ్లీ ఆటలో మునిగిపోయాడు.

మేమిద్దరం ఇంచుమించు కలసిన ప్రతిసారి నేను చేసిన ఎదవ పనులకి, వాడు చేసిన వాటికి అన్నింటికీ వాడే దెబ్బలు తినేవాడు...స్కూల్లో అయినా సరే....ఇంటిదగ్గర అయినా సరే....

ఒక సాయింత్రం రాములమ్మ మా ఇంటి వరండాలో కూర్చొని ఉంది. అమ్మ ఆవిడకు తన పాత చీరలు, ఇంటిలో కొన్ని చెక్క సామానులు ఇచ్చేస్తుంది. అప్పుడే ఆటనుండి తిన్నగా ఇంటికి వస్తున్న నేను వంటి మీద, తల మీద బండెడు ఇసక ఉండటంవల్ల తల విదిల్చుకుంటూ ఇంటిలోకి వెళుతూ అమ్మ ఎందుకు ఇవి రాములమ్మకు ఇచ్చేస్తున్నావ్? అని అడిగాను. బాబు....కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇలా ఇసకలో ఆడలేవు....ఆ పల్లేటి గాడితో చెట్ల వెంట, పుట్టల వెంట గాలికి తిరగలేవు...మీరు ఇల్లు మారి పోతున్నారు అని రాములమ్మ చెప్పింది. విని ఒక్క క్షణం నేను అవునా....అవునా...అంటూ అమ్మని కాళ్ళ దగ్గర కుదిపేస్తూ అడిగాను. అవునన్నట్టు తలూపింది.

ఇల్లు మారే టైం రానే వచ్చింది......
ఆ కొత్త ఇల్లు రోడ్డుకు ఆనుకుని ఉంటుందని....అక్కడ ఆట స్థలాలు, తోటలు ఏమీ లేవని....ఇసక మచ్చుకు అయినా కనిపించదని నాన్న రాత్రి పడుకొని తన కాళ్ళ మీద నన్నుఉయ్యాలు ఊపుతు చెప్పారు.

సామానులు అన్ని ఒక్కక్కటిగా లారీ ఎక్కిస్తున్నారు. నా ఆట గాంగ్ అంతా మా ఇంటి ముందు చేరి ఉన్నారు. నేను చాలా బాధగా ఉన్నాను.
సామానులన్నీ లారీలో వెళ్ళిపోయాక నాన్న రిక్షాని పిలిచి దానిలో చిన్న చిన్న పూల కుండీలు పెట్టించారు. అమ్మ అందరి ఇంటికి వెళ్లి చెప్పి వస్తుంది. ఒరేయ్....మీ స్నేహితులకు టాటా చెప్పెయ్ రా అని నాన్న రిక్షాలో కూర్చొని చెబుతున్నారు. అందరూ ఒక్కసారిగా కిట్టూ.....సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడికి రా రా ...మనం అప్పుడు ఆడుకుందాము...అని అన్నారు. కాని పల్లేటి మాత్రం చాలా మౌనంగా ఉన్నాడు. మా రిక్షా కదిలింది. కొద్ది దూరం వెళ్ళాకా తెలిసింది...పల్లేటి మా రిక్షాని ఫాలో అవుతున్నాడని...కిట్టూ..రోజూ స్కూల్లో నాకు కనిపిస్తావా? నీకు చేపలు అవసరం అయితే చెప్పూ..మనం మళ్ళీ పడదాం..అమ్మగారూ..మీకు ఏదైనా అవసరం అయితే కబురు పెట్టండి...అలా పరిగెడుతూనే మాటలాడుతున్నాడు. అమ్మ ఇక సరే లేరా..ఇంటికి వెళ్ళు..అని చెప్పినా సరే వాడు మాత్రం చాలా దూరం మా రిక్షాని ఫాలో అయ్యాడు. నాకు కూడా మనసులో స్పష్టంగా ఇది అని చెప్పుకోలేని వెలితి...వాడు బాగా అలసి పోయాక ఒక చోట ఆగిపోయాడు...

రిక్షాలో కొంత దూరం వెళ్ళాక నాన్న చెప్పారు...నేను స్కూలు మారుతున్నానని...ఇంకో మూడేళ్ళల్లో టెంత్ క్లాసు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారని. నా స్నేహితులు, నా ఆటలు, తోటలో అల్లర్లు..ఇవన్నీ వదిలి వచ్చేస్తున్నాను అన్న విషయాలు ఇంకా మింగుడు పడక ముందే చెప్పటంతో నాన్న చెప్పిన విషయం నేను అంతగా పట్టించుకోలేదు.

నాన్న స్కూల్లో టీ. సి. ఇంకా తీసుకోకపోవటంతో నేను, పల్లేటి రోజూ స్కూల్లో కలుసుకునే వాళ్ళం. అమ్మ ఏదైనా ప్రత్యేక వంటకం చేస్తే పల్లెటికి ఇవ్వమని నా కారియర్లో పెట్టేది. వాడు నేను ఏదో తెస్తానని చూసేవాడు.. ఒక రోజు నాన్న నువ్వు రేపటినుండి వేరే స్కూలుకు వెళ్తున్నావు...అని చెప్పి అమ్మతో నా స్కూలు గురించి ఏదో మాట్లాడటంలో మునిగి పోయారు. పాపం..రేపటి నుండి ఇంక స్కూలుకు రాను అని వాడితో ఒక్క మాటకూడా చెప్పలేదు...

అప్పటి వరకూ గవర్నమెంట్ స్కూల్లో ఆడిందే ఆట...పాడిందే పాట...నాలుగింటికి ఇంటికి రావటం....ఏడింటి వరకూ ఆటలు...కబుర్లు..ఇలా ఉండేది జీవితం. ప్రైవేటు స్కూల్లో అయిదింటి వరకూ తరగతులు..రాత్రి ఎనిమిది వరకూ స్టడీ అవర్స్..మళ్ళీ పొద్దున్నే ఎనిమిదిన్నరకు స్కూలు..ఈ గాప్ లో అసైనమేంట్లు...హోం వర్క్లు......క్లాసులోని పిల్లలు అందరూ ఎప్పుడూ ఆ లెసన్..ఈ లెసన్..ఆ ప్రాబ్లం..ఈ ప్రాబ్లం అంటూ మాట్లాడే వారే తప్ప ఒక్కళ్ళు కూడా ఆటల గురించి, సరదాల గురించి మాట్లాడే వారు కాదు. ఒక్క సారి నరకంలో పడ్డట్టు అనిపించేది రోజు....స్నేహితులు లేరు..ఆటలు లేవు...ఎంతసేపూ చదువు...చదువు...చదువు....అప్
పటివరకు చదువులో చురుకుగా ఉన్న నేను ఇలాంటి వాతావరణంలో చాలా డల్ గా అయిపోయాను.....ఇంటిలో వాళ్లకు నా భాదేంటో అర్ధమయ్యేది కాదు...సాయింత్రం స్కూల్లో స్టడీ అవర్స్ లో పుస్తకం ముందేసుకుని కూర్చున్నప్పుడు నా పాత స్నేహితులు, ఆటలు, చేపల వేటలు, పల్లేటి గాడు గుర్తొచ్చి ఏడిచేవాడిని. ఇలాగే ఒక ఏడు నెలలు గడిచిపోయాయి. పల్లేటి గాడితో నా సంభందాలు పూర్తిగా తెగిపోయాయి.

రోజూ ఉండే ఫ్రస్ట్రేషన్ తోనే ఒక రోజు సైకిల్ పై స్కూలికి వెళ్తుంటే మా పాత ఇంటిలో మా పక్కనే ఉన్న తారక కనిపించాడు. చాలా రోజుల తర్వాత నా గ్యాంగ్ లోని ఒకడిని చూడగానే చాలా సంతోషం వేసింది. అందరి గురించి అడిగేక పల్లేటి ఎలా ఉన్నాడురా అని అడగక ముందే....నీకు తెలీదా ఈ విషయం ...అని తారక నన్ను అడిగాడు. పల్లేటి, నువ్వు స్కూలు మారిపోయాక, వాడు స్కూలు కి రెగ్యులర్ గా వెళ్ళక పోవటంతో తన పేరు తీసేసారు....వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వలేకపోవటంతో ఇంటిదగ్గరే చాలా రోజులు ఉన్నాడు. ఇంటిపట్టున ఎందుకులే అని అతనితో పాటు సముద్రంలో చేపల వేటకి తీసుకెళ్ళాడు...సముద్రంలో తుఫాను కారణంగా నాటు పడవ మునిగి పల్లేటి చనిపోయాడు....అని చెప్పి వాడికి స్కూలు టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్క సారి శరీరం వణికింది..కళ్ళముందు ఏమీ కనిపించటంలేదు...ఒక మబ్బులా కమ్ముకొంది...అలానే సైకిల్ తొక్కుతూ ఒక రిక్షాని గుద్ది కింద పడిపోయాను. స్కూలు కి వెళ్లానే గాని మనసంతా నా ఆదీనంలో లేదు. మనిషిని మాత్రమే క్లాసులో ఉన్నాను. శూన్యం లోకి చూస్తూ అలా క్లాసులన్నీ గడిపేశాను....ఆ శూన్యంలో కూడా వాడితో ఆటలు, సరదాలు, నా మూలంగా వాడు దెబ్బలు తింటూ అవి తాళలేక రోడ్డు వైపు పరిగెత్తటం....ఇవే కనిపిస్తున్నాయి. ఒక్క క్లాసులో కూడా డిక్టేట్ చేస్తున్న నోట్స్ రాయలేదు. అది గమనించిన మా ప్రిన్సిపాల్ నన్ను బెత్తంతో ఒక పది నిమిషాలు కొడుతూనే ఉన్నాడు. విచిత్రంగా మనసులో నేను అనుభవిస్తున్న భాద ముందు అదేమీ అంత భాదించలేదు. క్లాసులో గట్టిగా అరచి ఏడవాలనిపించింది. గతంలో నా వల్ల ఎన్నో దెబ్బలు తిన్నాడు వాడు.... ఆ రోజు వాడి ఆలోచనల మూలంగా నేను దెబ్బలు తింటున్నప్పుడు మనసులో భాధ ఉన్నా చాలా ఆనందం వేసింది.

33 కామెంట్‌లు:

Hima bindu చెప్పారు...

ఒక్కసారే దుఃఖం వచిందండి . ప్రళయకావేరి కథలో లోలాకు పాత్ర గుర్తోచిందండి . మరిచిపోలేనట్లుగా మనస్సులోకి వచ్చింది.

పరిమళం చెప్పారు...

ఇంకా ఆసక్తిగా చదువుతూండగానే ....కళ్ళను చెమరింప చేసేశారు .

MURALI చెప్పారు...

may be this is what a life is. We meet so many people and love so many mates. But at one point we depart. I know what a depart really means in my life. anywayz awesome work. innellayina palleTi memories alane fresh ga unnayante karanam vadu mi mida chupina selfless prema. may his sole rest in peace.

సుజాత వేల్పూరి చెప్పారు...

అబ్బ, కళ్ళు చెమర్చాయి. ఈ మధ్య వరసగా అన్నీ ఇలాంటివే ఎదురవుతున్నాయి నాకు, దూరమైన నా మిత్రుడి జ్ఞాపకాలనుంచి ఇంకా తేరుకోకముందే!

మురళి చెప్పారు...

అద్భుతంగా రాశారు.. కాదు..కాదు.. పల్లేటి మీచేత రాయించాడు.. నాక్కూడా 'ప్రళయ కావేరి' కథల్లో 'లోలాకు' గుర్తొచ్చాడు.. గుండె పట్టేసిందండి.. ఈ పూటకి మరే బ్లాగూ చదవలేను..

ramya చెప్పారు...

అద్భుతంగా రాసారు, చదువుతూ ఓసారి మీ పల్లేటిని ఆ ఊరినీ చూసి తీరాల్సిందే అనుకుంటూ ఉన్నాను...అంతలోగా...

GIREESH K. చెప్పారు...

గుండెల్ని పిండేసిందండీ...నాకు తెలీకుండానే కళ్ళు చెమర్చాయి. చాలా చక్కగా వ్రాసారు.

Unknown చెప్పారు...

హత్తుకునేలా వ్రాశారు.
కొన్ని అనుభవాలు అంతే. ఎప్పటికీ మరచిపోలేము.

ఈగ హనుమాన్ (హనీ), చెప్పారు...

మిత్రమా సంఘటనను చాలా రమ్యంగా చెప్పారు.
ప్రాకృతిక పరిసరాల్లొంచి మనిషి ఎదిగిరావాలి గాని ఎదగదానికి కృత్రిమ వాతావరణం సృష్తించుకుంటే ఎమౌతుందో చక్కగా కథా రూపంలొ చెప్పారు, శుభాకాంక్షలు.
చక్కని సాహిత్యాన్ని ప్రేమించే..
ఈగ హనుమన్ naolu.blogspot.com

మోహన చెప్పారు...

చాలా బాగా రాసారు. చదివాక బాధగా అనిపించింది. కానీ తరువాత కలిగిన ఒక ఆలోచనతో మనసంతా నిశ్శబ్దం ఆవరించింది.

సముద్రంలో చిక్కుకున్నప్పుడు పల్లేటికి చివరిగా వచ్చిన ఆలోచన.............

ఎక్కడినుండి పుడుతుందండీ ఇంత అభిమానం? మీరంటే పల్లేటికి ఎందుకంత వల్లమాలిన ప్రేమ?

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@చిన్ని గారు,
చివరి పేరా రాస్తున్నప్పుడు నాకు తెలీకుండానే రెండు కన్నీటి బొట్లు , టైపు చేస్తున్నప్పుడు, నా చేతి మడమలపై పడ్డాయండి. అంత భావోద్వేగానికి లోనయ్యాను. ప్రళయ కావేరి కదల గురించి ఇది వరకు మీరు ఏదైనా రాసుంటే నాకు ఆ లింక్ ఇవ్వగలరు.
ధన్యవాదములు.
------------------------------------------------
@పరిమళం గారు,
ఇంకా ఎన్నో జ్ఞాపకాలు హృదయ పొరల్లో ఉన్నాయండి. టపా ఇంకా పెద్దది అవుతుందని అవి రాయలేదు.
ధన్యవాదములు.
-------------------------------------------------
@MURALI గారు,
అవునండి మీరు చెప్పింది నిజమే....అసలు ఆ వయసులో ఏమి చేసినా అవి కల్మషం లేకుండా ఉంటాయి.
ధన్యవాదములు.
-------------------------------------------------
@మురళి గారు,
మీరన్నది నిజమే...వాడి జ్ఞాపకాల ప్రవాహంలో అలా రాస్తూ పోయాను.
ప్రళయ కావేరి కదల గురించి మీరేదైనా టపా రాసుంటే దాని లింకు ఇవ్వగలరు.
ధన్యవాదములు.
-------------------------------------------------
@ramya గారు,
@GIREESH K గారు,
@ప్రవీణ్ గార్లపాటి గారు,
@సుజాత గారు,
ధన్యవాదములు.
-------------------------------------------------
@ఈగ హనుమాన్ (హనీ),
ధన్యవాదములు.
ఇది కధ కాదండి. నా హృదయం పై గడ్డకట్టి ఉన్న ఒక కన్నీటి బొట్టు.
-------------------------------------------------
@మోహన గారు,
>>>సముద్రంలో చిక్కుకున్నప్పుడు పల్లేటికి చివరిగా వచ్చిన ఆలోచన.............
ఊహించడానికే నాకు చాలా భయంగా ఉంది.
>>>ఎక్కడినుండి పుడుతుందండీ ఇంత అభిమానం? మీరంటే పల్లేటికి ఎందుకంత వల్లమాలిన ప్రేమ?
పల్లేటి ని మా ఇంట్లో అందరూ నాకు చూసినట్టే చూసేవారు. అమ్మ పిండి వంటలు ఏమి చేసినా వాడికి ఇవ్వమని చెప్పి రాములమ్మకి ఇచ్చేది. మా అక్కా వాళ్ళు ఉళ్లో సంవత్సరానికి ఒక్కసారి పెట్టె ఎగ్జిబిషన్ కి కూడా నాతొ పాటే తీసుకెళ్ళేవారు. అక్కడ మేమందరం తీసుకున్న ఫోటో ఇప్పటికి నా దగ్గర పదిలంగా ఉంది. మా కాలనీలో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలను పల్లేటి తో రాసుకు పూసుకు తిరగడానికి ఒప్పుకునేవారు కాదు. బహుసా నేను, మా ఇంట్లో వాళ్ళు వాడిని ఒక తక్కువ స్థాయి కుర్రాడిలా చూడకపోబట్టేమో..వాడికి అంత అభిమానం.....
ధన్యవాదములు.

మోహన చెప్పారు...

ఫోటో స్కాన్ చేయించి పెట్టగలరా? పల్లేటిని ఒక సారి చూడాలని ఉంది. ఒకవేళ నాకు మెయిల్ చెయ్యాలనుకుంటే visalay@gmail.com కు పంపండి.

Hima bindu చెప్పారు...

ప్రళయకావేరి కథలు చాల బాగుంటాయండి,సం .వె.రమేష్ రాసినవి ,ఆయన హోసురులో తెలుగు వారి కోసం ,బాష కోసం ఒక వుద్యమమే చేపట్టారు .అంత పులికాట్ సరస్సులోని ద్వీపం ల అనుభవాల సారమే "ప్రళయకావేరి"కథలు నెల్లూరి ,రాయలసీమ మాండలికంలో వుంటాయి .ఎక్కడ దొరుకుతాయో చెప్తాను.

సిరిసిరిమువ్వ చెప్పారు...

అంతా కళ్లముందు జరిగినట్టుగానే చక్కగా చెప్పారు. చివరి పేరా చదువుతుంటే నాకు తెలియకుండానే నా కళ్లల్లో కన్నీరు. జీవితంలో ఇలాంటి స్నేహితులు ఒక్కరున్నా చాలు అనిపిస్తుంది. నాకూ లోలాకు గుర్తుకొచ్చాడు. ప్రళయకావేరి కథల గురించి పుస్తకంలో నేను వ్రాసిన ఓ చిరు పరిచయం ఇక్కడ చదవగలరు-http://pustakam.net/?p=365

కొత్త పాళీ చెప్పారు...

అద్భుతం

cbrao చెప్పారు...

ఇది గుండెలోతుల్లోంచి, స్పందనతో రాసినది కావటంవల్లే ఇంతగా ఇంతమందిని కదిల్చింది. నదిలో విహారాలు, కాలవలో చేపలు పట్టడం నాకూ అనుభవమే బాల్యంలో. గుండెలోతులను తట్టారు; బాల్యం, అమాయకత్వం, అప్యాయత కలపోసి. అభినందనలు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మోహన గారు,
ఆ ఫోటో ఊళ్ళో మా ఇంటి ఆల్బంలో ఉందండీ. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకువస్తాను. నా కంటే ముందు నా మిత్రుడు మా ఊరు వెళితే వాడి చేతనైన తెప్పిస్తాను. అప్పుడు మీకు పంపుతాను.
---------------------------------------------------
@సిరిసిరిమువ్వ గారు,
మీరు రాసిన ఆర్టికల్ ఇప్పుడే చదివేనండి. చాలా బావుంది. ఈ వారాంతం విరజాజి గారు తెలుగుపీపుల్ లో ఇచ్చిన లింకు చూస్తాను. మంచి పుస్తకం గురించి తెలియజేసిన మీకు, నెట్లో అవి ఎక్కడ లభ్యమవుతాయో చెప్పిన విరజాజి గారికి కృతజ్ఞతలు.
-------------------------------------------------
@కొత్త పాళీ గారు,
మనసులో ఫీలింగ్ ని ఉన్నది ఉన్నట్టు నేను ప్రెజెంట్ చెయ్యలేదేమోనని ఇప్పటికీ నాకు డవుటే నండి. తెలుగు భాష మీద నా పరిజ్ఞానం అంతంత మాత్రమే. ఎలా మొదలు పెట్టాలి...ఎలా ముగించాలి అన్న వాటి మీద కూడా నాకు తెలిసింది చాలా తక్కువ. మీరంతా పెద్ద మనసుతో బావుంది అనటం నాకు చాలా ఆనందంగా ఉంది.
ధన్యవాదములు.
------------------------------------------------
@cbrao గారు,
థాంక్సండి
------------------------------------------------
@చిన్ని గారు,
ప్రళయ కావేరి కధల గురించి పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
------------------------------------------------

Chakravarthy చెప్పారు...

Bava... Pindav ra!!! Office lo nidravastunna naku nee blog chadivi burra tirigindi, nidra poyindi...
'మీ స్నేహితులకు టాటా చెప్పెయ్ రా అని నాన్న రిక్షాలో...' ikkada nunchi modalaindi ra bava oka teliyani bada gunde ninda...
This was a great blog bava (as per my little knowledge on blogs)...
I initially thought this story was too long but after reading through I felt the emotions and the feelings were not completely expressed... if that would have been there it would have been awesome!!! This is an area of improvement for you...
Way to go BAVA!!!

lalitha చెప్పారు...

చాలా బాగా చెప్పారు. కళ్ళ ముందు నా చిన్న తనం మళ్ళి కదిలిందీ. ఒక్కసారి గుర్తుతూ వచ్చాయీ.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

andaru cheppesaru kada ani cheppakunda vundalenu.................chalaaaaaaaaaaaaaaaaaaaaaaaa baagundi................
palleti.............ni naku choodalani vundi...........dont forget to upload his pic...........

Mauli చెప్పారు...

బాబోయ్ మీరు రాసేవి నిజాలా అసలు? ఈ సారి కామెంట్స్ చదవక ముందే అడిగేస్తున్నా..తర్వాత చాన్సు ఉండదేమో నని .

ఇప్పుడనిపిస్తుంది, చిన్నప్పుడు నాకు తెలిసి చనిపోయిన ఫ్రెండ్సు తో నాక్కోడా ఇంత కన్నా గొప్ప relation ఏ ఉండి ఉంటుంది మర్చిపోయాను అని ...లాభం లేదు గుర్తు రాకున్న రాసేస్తా !!!!! ...కిడ్డింగ్ :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మౌళీ గారు,

మీరు ఒక్క విషయం చెబుతారా? మీరు పెరిగింది బాల్యంలో సిటీలోనా లేకా పల్లెటూళ్ళోనా? తొంభై తొమ్మిది శాతం సిటీలోనే అన్నది నాకనిపిస్తుంది. ఎందుకో చెప్పమంటారా? సిటీల్లో పెరిగే చాలామందికి పల్లెటూళ్ళ లో ఉండేవారి సెన్సిబిలిటీస్ అర్ధం కావు. అవి కధల్లానే ఉంటాయి. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఇతరుల మనోభావాలు కొంచెం పరిగణనలోకి తీసుకోమని నా మనవి. లేదంటే ఎటువంటి వివరణ లేకుండా వ్యాఖ్యలు తొలగించబడతాయని గమనించగలరు.

Swetha చెప్పారు...

shekar gaaru,

Mee blog gurinchi, especiallu ee post gurinchi Murali gaari blog lo chadivi, visit chesaanandi

abba entha baaga raasaarandi....gundelni pindesaaru.....meeru, palleti vidipoyinappudu, athanu chanipoyina vishayam telisinappudu meeru react ayina vidhaanam chadivinappudu naaku baada kadupulonchi thannukocchindandi....edo teliyani baada, velithi anipinchaayi

intha goppa snehithudi snehaanni kaneesam koddi kaalamaina pondinanduku meeru chaala adrushtavanthulandi.

Rao S Lakkaraju చెప్పారు...

చాలా బాగా మ్రుడుత్యం గ సెలయేరు లో హుందా గ వెళ్ళే నావ లాగా ఒడుదుడుకులు లేకుండా భావాలు వ్యక్తం చేసారు.

Rao S Lakkaraju చెప్పారు...

కాక పోతే ఇది నిజా మయ్యి ఉండదని ఉద్వేగాన్ని అణిచి వేసు కున్నాను. థాంక్స్ ఫర్ ది స్టొరీ.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శ్వేత గారు,
సారీ మిమ్మల్ని అంతలా భాద పెట్టినందుకు...అవునండి చిన్నప్పుడు స్నేహితుల విషయంలో నేను అదృష్టవంతుడినే...వాళ్ళతో ఆడిన ఆటలు, కొట్లాటలు, చేసిన అడ్వెంచర్స్, ఎక్స్ప్లోరింగ్స్ ఎన్నెన్నో..అందుకే ఆ రోజులను తలుచుకోవటం అంటే నాకు భలే ఇష్టం...అలా తలంపు వచ్చిన క్రమంలో రాసినదే ఈ టపా..
థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్..

@Rao S Lakkaraju గారు,
థాంక్యూ..

వీరేంద్ర సుంకవల్లి చెప్పారు...

ముందుగా మురళి గారికి కృతజ్ఞతలండి. ఆయన బ్లాగులో మీ గురించిన పరిచయం చూసి ఇలా రావడంతో నాకిది చదివే అదృష్టం కలిగిందండి.
నిజ్జం! పిండేసారండి.ఊహల్లో తేలించి కన్నీటిలో పడేసారు.
బ్లాగుని చోరి చేసానని అనుకోకండి.ఈ కధని వెంటనే కాపీ చేసేసి మా టీంలోని తెలుగు వాళ్ళ అందరికి పంపించేసానండి (మీ బ్లాగు పేరు పెట్టాలెండి) వాళ్ళు దీనిని మిస్ కాకూడదని !
మరొక్కసారి మీకు నా బ్లాగ్వందనాలు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@వీరేంద్ర సుంకవల్లి గారు,
థాంక్యూ...కొన్ని కొన్ని మొమోరీస్ అలా వెంటాడుతూనే ఉంటాయి...ఎన్నేళ్ళైనా మరవలేము వాటిని.

Venkat చెప్పారు...

Shekar Garu
chala Badesindandi
idi nijam kakapote bagundu anukuntunnanu
edipinchesaru meeru
nijamga chinnanati gnapakalu maruvalenivi

స్నిగ్ధ చెప్పారు...

శేఖర్ గారు,ఒక్క సారి బాల్యాన్ని గుర్తు తెచ్చారండీ.మీ చిన్ననాటి స్నేహితుడి ముచ్చట్లు,మీరు కలిసి చేసిన అల్లర్లు చాలా బాగున్నాయండీ. మీరు ఇల్లు మారినది చదివినప్పుడే ఎందుకో ఒక అనుమానం మొదలయ్యింది,ఇంత వరకు మీ ఇద్దరి ముచ్చట్లు చెప్తూ వచ్చారు చివరకి పల్లేటి గారికి ఎమయ్యిఉంటుందా అని..ఎనుకో టపా చివరకి రాగానే మనసు భారం అయ్యిందండీ...చెయ్యి ముందుకు వెళ్ళడం లేదు టైప్ చెయ్యడానికి...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@venkat గారు,
థాంక్యూ..

@స్నిగ్ధ గారు,
ప్రతీ టపా చదువుతూ స్పందన తెలుపుతున్న మీకు బోల్డన్ని థాంకులండీ...ఇక మొన్ననే వాడితో మేము ఎగ్జిబిషన్లో కలిసి తీసుకున్న ఫోటో ఇంటి దగ్గరనుండి తెచ్చుకున్నాను..కానీ ఫోటో పెట్టి మిమ్మల్నందరినీ మరింత ఉద్వేగానికి లోనుచేయటం ఇష్టంలేక వదిలేసాను....

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అసలే మనస్సేమీ బాగోలేని సమయంలో చదివానేమో చివరిపేరా సగం చదివాక ఆగి కళ్ళు తుడుచుకుని పూర్తి చేయవలసి వచ్చింది. చాలా బాగా రాశారు. చివర్లో మీ బాధ దానిని వ్యక్తపరిచిన విధానం ఎంత విపరీతమైన ఉద్వేగానికి గురిచేసిందంటే మీ టపా చదివిన గంటకి తేరుకుని కామెంట్ రాయగలుగుతున్నాను. ఆ దేవుడికి అస్సలు జాలిలేదు అని మరోసారి నిరూపించుకున్నాడు.

ఈ టపా నేను ఇంతవరకూ చదవకుండా ఎంత మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యాను. ఇంకా నేను చదవాల్సిన టపాలు చాలా ఉన్నాయి మీ బ్లాగ్ లో, వీలు చూసుకుని చదవాలి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@వేణూ శ్రీకాంత్ గారు,
సారీ అండీ..అసలే మనసేం బాలేని సంధర్బంలో నా టపా మిమ్మల్ని మరింత భాద పెట్టినందుకు...అలాగే ఆలస్యంగా ప్రతిస్పందిస్తున్నందుకు కూడా...ఇక చివరి పేరా విషయానికొస్తే చిన్నప్పుడు నేను చాలా సెన్సిటివ్..దానికి తోడు స్నేహితులే ప్రపంచంగా ఉండేది అప్పుడు...ఏమాత్రం వారికి ఏ వేసవి సెలవులకో దూరం అయితే మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు కలుస్తానో అన్నట్టు ఉండేవి...