8, ఆగస్టు 2010, ఆదివారం

మనసు మాట విను...( నా తొలి కథ )

( ఎప్పటినుండో ఓ పాయింట్ గురించి టపా రాయాలని ఉంది. అయితే టపాగా కంటే ఓ కథ రూపంలో చెప్తే బాగుంటుందని అనుకున్నాను. రాయటంలో ఇంకా అక్షరాభ్యాసం స్థాయిలోనే ఉన్న నేను కథ రాయలనుకోవటం సాహసమే అని తెలుసు. కానీ ప్రయత్నించాను. )

మనసు మాట విను...

( పూర్తిగా కథ చదవడానికి టపాపై మౌస్‌తో క్లిక్ చేసి, స్ర్కోల్ చేయండి )

తొమ్మిదవడానికి ఓ అరగంట టైం ఉంది. రాత్రి హరి రూంలో అర్ధరాత్రి దాటాకకూడా మేల్కొని ఉండి లైట్ ఆఫ్ చేయలేదు. సరిగ్గా నిద్ర పట్టక పొద్దున్నే లేవటం వల్ల ఆఫీస్ కి తొందరగా వచ్చేసాను. కేఫ్టేరియాలోకి అడుగు పెడుతుండగా...

"హాయ్...రవి" అంటూ నా కొలీగ్ శ్వేత కాఫీ కప్పుతో పలకరించింది.

"హాయ్.." అన్నాన్నేను.

శ్వేత ఇది వరకు నా టీంలోనే పనిచేసేది. ప్రాజెక్ట్ పూర్తవ్వటంతో తనని హరి చేస్తున్న ప్రాజెక్ట్ లో వేసారు. అప్పుడప్పుడు కేంటీన్ లోనో, కేఫ్టేరియాలో కలిసినప్పుడు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటాం.

కాసేపు హైక్ ల గురించి, తను కొత్తగా చేరిన టీం గురించి, ఆఫీస్ విషయాలు మాట్లాడుకున్నాం.

"హరి ఎలా చేస్తున్నాడు పని" అని మాటల మద్యలో అడిగాను.

" ఏంటి హరినా...." అంటూ నవ్వబోయి మళ్ళీ తను నా ఫ్రెండ్ అని గుర్తొచ్చి బలవంతంగా ఆపుకుంది శ్వేత.

"నీకో విషయం అడగనా....."

"అడుగు"

"తను ఎమైనా లవ్ లో ఫెయిల్ అయ్యాడా....ఎప్పుడు చూసినా మూడీగా ఉంటాడు. కాస్త పలకరిద్దామంటే మొహం ఎప్పుడూ అదోలా పెట్టుకుని ఉంటాడు....మీటింగ్స్ కి వచ్చినప్పుడు కూడా పరద్యానంగా ఎటో చూస్తుంటాడు...ఏవో ఆలోచిస్తున్నట్టు కనపడతాడు. డెడ్ లైన్ ఉన్నాసరే అస్సలు పని తొందరగా చేయడానికి ప్రయత్నించడు...మొన్న మేనేజర్ అంటున్నాడు తనని ప్రాజెక్ట్ నుండి తప్పించి బెంచ్ మీద పెట్టాలి అని...చెప్పు బాస్ తనకి...ఇలా అయితే ఫైర్ చేస్తారని...అసలే పరిస్థితులు బాలేవు కదా! " అంటూ ఇంకా ఏవో మాట్లాడదామనుకుండగా తన మేనేజర్ ఇటువైపు రావటం చూసి "కాచ్ యు లేటర్" అంటూ వెళ్ళిపోయింది.

ఆరోజు నాకు ఆఫీస్లో పెద్దగా పని లేకపోవటం వల్ల సాయింత్రం తొందరగానే రూం కి చేరుకున్నాను. ఫ్రెష్ అయ్యి డాబా మీదకు వెళ్ళాను. చల్లని గాలి అలా మోముని తాకుతూ పోతుంది. పొద్దున శ్వేత, హరి గురించి అన్న మాటలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా తను నాతో అన్న
"ఫైర్ చేస్తారు.." అన్న మాట మీదే నా దృష్టంతా. జేబులోంచి ఓ సిగరెట్ తీసి వెలిగించాను. ఓ దమ్ము గట్టిగా లాగి వదిలాను. నా ఆలోచనలు ఏటో సాగిపోతున్నాయి.
* * * * * * * * * *


హరి నాకు ఇంటర్మీడియెట్ లో స్నేహితుడు. చాలా తెలివైనవాడు. వాడి ఆలోచనాదోరణి ఎరిగిన నాకు క్లాసులో అందరికంటే వాడు కొంచేం డిఫరెంట్ గా కనిపించేవాడు. వాళ్ళ కుటుంబాల్లొ ఫారిన్ లో సెటిల్ అయినవారు, డాక్టర్లు, సైంటీస్ట్ లు ఇంటికి కనీసం ఒక్కరైనా ఉంటారు. ఇంట్లో వీడే పెద్దవాడు కావటంతో, వాళ్ళ ఇంట్లో వాడి చదువు విషయంలో ఎక్కువగా పట్టించుకునేవారు. ఎప్పుడు చూసిన పుస్తకాలు ముందేసుకుని కూర్చొకపోతే ఒప్పుకునేవారు కాదు.

ఒకసారి మాథ్స్ పరీక్ష కోసం నాకు తెలియనివి వాడిదగ్గర నేర్చుకుందామని వెళ్ళాను. వాడు డాబా పైన ఉన్నాడు. పుస్తకం వైపు తదేకంగా చూస్తూ చదువుతున్నట్టు కనిపించాడు.

"ఒరేయ్ మరీ అంతలా చదివెయ్యకు..పుస్తకం కాలిపోతుంది" వాడి పక్కన కూర్చోబోతూ అన్నాను.

నా మాటకు హరి వెటకారంగా ఓ నవ్వు నవ్వాడు.

"నువ్వు కూడా మా ఇంట్లో వాళ్ళ లాగే నేను పుస్తకం ముందేసుకుని కూర్చొంటే చదివాస్తాననుకుంటున్నావా" అంటూ చదువుతున్న పుస్తకం మూసాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ...

"ఇందాక సూర్యాస్తమయం చూసావా?..ఎంత బాగుందో...దూరంగా కొండల మధ్యనుండి సూర్యుడు కిందికి వెళ్ళిపోతున్నాడు..పక్షులన్నీ గుంపులు గుంపులుగా గూళ్ళకి చేరుకుంటున్నాయి..ఏటిలో పడవ ఇటువైపు వాళ్ళని అటువైపుకు తీసుకెళుతుంది...వహ్..ఎంత మనోహరమైన దృశ్యాలు అవి...ఇంత అందమైన దృశ్యాలు ఆస్వాదించకుండా వదిలేసి మనమేమో ఎంతసేపూ మరో ప్రపంచం లేదన్నట్టుగా ఎంసెట్..ఆసెట్..ఈసెట్..ఐ.ఐ.టీ ఫిజిక్స్ అంటూ సాయింత్రాలు గడిపేస్తుంటాము."

"పుస్తకం వైపు చూసి ఇదా నువ్వు ఆలోచిస్తుంది...సర్లే నువ్వు ఇలా ఆలోచిస్తుంటే ఐ.ఐ.టీ కాదు కదా ఎంసెట్ లో కూడా రాంక్ రాదు" అన్నాను వాడితో సగటు ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని తలపిస్తూ....

ప్రకృతిని పరిశీలించటం, ఆస్వాదించటం అంటే నాకు కూడా ఇష్టమే. ఆ విషయం హరికి కూడా తెలుసు. అందుకే ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వచ్చినా హరి నాతోనే పంచుకుంటాడు. అయితే అలాంటి ఆలోచనలు నాకు వచ్చినప్పుడల్లా అమ్మ నాకు క్లాసు పీకుతున్నట్టు గుర్తొచ్చి వాటిని బలవంతంగా ఆపేసే ప్రయత్నం చేస్తాను నేను.

స్వతహాగ గ్రాహకశక్తి ఎక్కువగా ఉండటం వల్ల మేము ఎంతలా చదివినా వాడికే మాకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి. వాడికి ఏ కాన్సెప్ట్ అయినా క్లాసులోనే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం డాబా పైన కూర్చొని, పుస్తకాలు ముందేసుకుని...వెన్నెల..సూర్యోదయం అంటూ ఆలోచిస్తూ ఏవేవో రాతలు రాస్తుంటాడు.

ఓసారి వాడు వాళ్ళ ఇంటి ముందు ఉన్న గడ్డిపూవ్వు పై ఓ కవిత రాసి, వాడి నోట్స్ చివరి పేజిలో ఉంచాడు. స్టడీ అవర్లో లెక్చరర్ చూసి, అది వాడు ఏ అమ్మయికో రాసుంటాడని అనుకుని పేరెంట్స్ ని తీసుకురమ్మని నానా గొడవా చేసాడు.

వాడితో నేను కంబైన్డ్ స్టడీ చేసిన అప్పుడప్పుడూ ఫలానా సినిమాలో ఆ షాట్ చూశావా?..లొకేషన్ బ్యుటిఫుల్ గా ఉంది...అక్కడ అలా కాదురా..ఇక్కడ ఇలా తీసుంటే బాగుంటుంది....లాంటి సినిమాల గురించి కబుర్లు, కవితలు వినటాలు తప్పించి చదువు అంతగా సాగేది కూడా కాదు.
* * * * * * * * * *


ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు అప్పట్లో సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ లేనందున అందరూ రాజధానికే వెళ్ళాల్సి ఉండేది. ట్రైన్ లో ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళేందుకు బయలుదేరాం. ట్రైన్ కదిలి చాలా దూరం వెళ్ళాక కూడా వాడు నాతో ఏమీ మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు. నిశ్శబ్ధాన్ని చేదిద్దామని నేనే మాటలు మొదలుపెట్టాను.

"ఒరేయ్..మనిద్దరికీ ఒకే చోట సీటు వస్తే బాగుంటుంది కదా! ఎంచక్కా మళ్ళీ ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చదవొచ్చు"

"......"

"ఏంటిరా...ఏమీ మాట్లాడవు...ఓ పక్క మనం ఇంజనీరులం అయిపోబోతున్నాం అని నేను సంతోషం పట్టలేకపోతుంటే నువ్వేంటి ఇలా" అని వాడి జబ్బ మీద ఓ పంచ్ ఇచ్చి అన్నాను.

"రవీ...నాకెందుకో ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి లేదురా!...కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇంజనీరింగ్ కాకుండా ఏమి చదివినా జీవితం నాశనం అవుతుందని అంటున్నారు...నాకేమో ధియేటర్ ఆర్ట్స్ వైపు వెళ్ళాలని ఉంది. పూనే ఫిల్మ్ ఇన్సిట్యూట్ అప్లికేషన్ తెచ్చుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళతో చెప్పలేక అలా ఉంచేసాను దాన్ని...."

"అదేంటిరా అలా అంటున్నావు....మీ కుటుంబాల్లో చూడు...ఇంజనీరింగ్ చదివి ఎంతెంత మంచి పొజిషన్ లో ఉన్నారో...మనం కూడా అలానే ఉంటాం భవిస్యత్తులో...నువ్వు అనవసర ఆలోచనలు మానెయ్య్" అంటూ ఇంట్లో కౌన్సిలింగ్ కి వెళ్ళేముందు హరి వాళ్ళ కుటుంబాన్ని ఉదహరిస్తూ అమ్మ చెప్పిన మాటల్నే వాడితో అన్నాను.

వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే నేను మాట్లాడటం వల్లనేమో హరి మారు మాట్లాడకుండా, బెర్త్ వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు.

హరికి, నాకు ఒకే యూనివర్సిటీలో వేర్వేరు బ్రాంచీల్లో సీట్లు వచ్చాయి. ఇద్దరం అడ్మిషన్ తీసుకున్నాము.

* * * * * * * * * *


ఇంజనీరింగ్ వేరే ఊరిలో చదవాల్సిరావటంతో మేమిద్దరం ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అక్కడ మాకు "ఇది చదువు..అది చదువు అని చెప్పేవాళ్ళు లేకపోవటంతో చాలా స్వేచ్చగా ఉండేవాళ్ళం. హరిగాడైతే అర్ధరాత్రిల్లు వెన్నెల, పంటపొలాలు అంటూ ఎప్పటిలాగే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు పెన్ను, పేపర్ పట్టుకుని పొలాల్లోకి పోయి ఏవేవో రాసేసుకునేవాడు. సెమిష్టర్ పరీక్షలు అయినపుడు మాత్రం పుస్తకం పట్టుకునేవాడు...అప్పటివరకూ ఆ ఊళ్ళో ఉన్న లైబ్రరీలోనుండి ఏవేవో పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాడు. నేనేమో ఈవినింగ్ కాలేజీలో షటిల్ ఆడటానికి వెళ్ళేవాణ్ణి. మేమిద్దరం ఒకే రూంలో ఉన్నామన్న సంగతే గానీ ఇదివరకటిలా ఎప్పుడూ ఒకరి భావాలు మరొకరం షేర్ చేసుకునేవాళ్ళం కాదు. వాడి రాతలను కూడా ఏనాడూ చూసిన పాపాన పోలేదు.

ఓ సారి ఏందుకో నా పుస్తకం వాడి బుక్ షెల్ఫ్ లో ఉందేమో అని గాభరాగా వెతికేసరికి ఓ బుక్ లో ఉన్న విడి కాగితాల గుంపు చెల్లా చెదురుగా కింద పడింది. ఓ పేపర్ తీసి చదివాను. అందమైన కవిత ఉంది దానిలో. ఇంకో పేపర్..ఓ చిన్న భావోద్వేగ వ్యక్తీకరణ..ఇంకో దానిలో ఓ కధ...ఇలా ఆ కాగితాలన్నీ కవితలు, కధలు.....అప్పుడేప్పుడో ఇంటర్మీడియట్ లో వాడు రాసిన చిన్న చిన్న కవితలు, కధలు చదివానంతే. ఆ తర్వాత ఎప్పుడూ నేను "నువ్వు రాసినవి ఏవి" అని అడిగింది లేదు...వాడు నాకు చూపించింది లేదు...నేనెప్పుడూ రూంలో వాడి దగ్గర ఫలాన పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నాను...ఈ సెమిస్టర్లో టాప్ చెయ్యాలి...ఫలానా సార్ ఇంటర్నల్స్ ఇలా వేసారు...లాంటి మాటలు మాట్లాడటం వల్లనేమో హరికి తన సున్నిత భావాలను నాతో పంచుకుందామన్న ఆలోచన వచ్చి ఉండదు. ఆ రోజు షటిల్ కి వెళ్ళలేదు. వాడు రాసిన కాగితాలన్నీ చదివాను. ఓ నిమిషం నాకు సిగ్గేసింది....ఇంత మంచి రాతలను నా స్నేహితుడే రాస్తుంటే ఇన్నాళ్ళూ చదవనందుకు...బయటకెళ్ళి రూంకి వచ్చిన వాడితో "ఒరేయ్...భలే రాసావురా!..ఎంత బావున్నాయో తెలుసా నీ కధలు...ఒక ప్రొఫెషెనల్ రైటర్ రాసినట్టనిపించిదిరా.."అని నేను అన్నప్పుడు వాడి మొహంలో ఓ గొప్ప సంతృప్తి కనిపించింది. వాడి రాతలు ఇంకొకరు గుర్తించటం వల్లనేమో ఆ రోజు చాలా ఆనందంగా కనపడ్డాడు. వాడిలోని అంత సంతృప్తి మా ఇద్దరికీ ఎంసెట్ లో మంచి ర్యాంక్లు వచ్చినప్పుడు కూడా చూడలేదు.

* * * * * * * * * *


మా ఇంజనీరింగ్ నాలుగేళ్ళు పూర్తికావొచ్చింది. ఓ సాయింత్రం స్నేహితులందరం చదువయ్యక ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నాం.
"నేను యూ.ఎస్. వెళ్ళి ఎమ్మెస్ చెయ్యాలిరా...మా నాన్న ఎంత డబ్బైనా పర్లేదన్నాడు.. " జీ.ఆర్.ఈ లో క్లాసులో అందరికన్నా తక్కువ స్కోరు వచ్చిన జగన్ అన్నాడు.
"అదేంటిరా....నీకు బిజినెస్ అంటే ఇష్టం అన్నావుకదా..." అని అంకిత్ అడిగాడు.
"అరే ఫూల్...ఇష్టం కాదురా ఇక్కడ కావల్సింది..ఫ్యూచర్లో ఏది హాట్ గా ఉంటుంది అన్నది పాయింట్" అని స్పందించాడు జగన్.
"ఏమోరా భయ్..మా అయ్య నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాపోతే తలెత్తుకోలేనన్నాడు ...మా ఇలాకాలో సానామంది సాఫ్ట్ వేర్ వాళ్ళే..." తప్పుల్లేకుండా ఓ చిన్న సీ ప్రోగ్రాం కూడా రాయలేని యాదగిరి అన్నాడు.

ఒకడు గవర్నమెంట్ జాబ్ అని..ఇంకోడు సాఫ్ట్ వేర్ అని..మరొకడు స్టేట్స్ లో ఎమ్మెస్ అని ఇలా అందరూ ఎవరనుకున్నది వాళ్ళు చెబుతున్నారు. హరి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో హరికి ఫోన్ వచ్చింది. "నాన్న కాలింగ్..." అని చూసి "మీ నాన్నగారు రా.." అంటు మొబైల్ ని వాడి చేతిలో పెట్టాను. ఇన్ఫోసిన్ లో ఫ్రెషర్స్ ఉద్యోగాలు ఉన్నాయని హరి కజిన్ వాళ్ళ నాన్నతో చెప్పటంతో, ఆయన విషయం వాడితో చెప్పడానికి చేసిన కాల్ అది. కాల్ పూర్తయిన వెంటనే సెల్ ఫోన్ ను పక్కకి గిరాటేసాడు. వాడు చిరాగ్గా ఉన్నాడని తెలిసి ఏమీ అడగలేదు. తర్వాత వాడే కొంచెం సేపు తర్వాత "అసలు ఈ పెద్ద వాళ్ళకి మన ఇష్టా ఇష్టాలతో ఎందుకురా పని ఉండదు? ఏం చదవాలో..ఏం చెయ్యాలో కూడా వీళ్ళే చెబుతారు..." అంటూ గొంతుపూడిక పోయి మాట్లాడుతుంటుంటే వాడి కంట్లో ఎప్పుడూ చూడని ఓ పల్చటి తడి పొరని గమనించాను.

ఇంజనీరింగ్ టీ.సి తీసుకోడానికి కాలేజీకి వెళ్తూ హరి గాడికోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బయట వాలుకుర్చీలో పేపర్ పట్టుకుని హరి వాళ్ళ నాన్న ఉన్నారు. నన్ను చూసి "రావోయ్...రవి..కంగ్రాచ్యులేషన్...ఇన్ఫోసిస్ కి సెలక్ట్ అయ్యావంట కదా...కాస్త మా వెదవకి బుద్ది చెప్పు...సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చెయ్యడానికి ఇష్టం లేదంట...మా అన్నయ్య కొడుకు క్రిందటేడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి ఈ ఏడు అమెరికా వెళ్ళాడు. వేలకి వేలు జీతాలు తీసుకుని ఏ.సీ రూంలో కూచొని పనిచేయడానికి పోయేకాలం వీడికి... ఏ గుమస్తాగిరో చేస్తే గానీ ఈ ఎదవకి బుద్ది రాదు.." అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు. "అది కాదంకుల్...హరికి ధియేటర్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది..అటువైపు...." అని నెమ్మదిగా ఏదో చెబుతుండగా ఆయన కోసం ఎవరో గేటు తీసుకుని లోపలి వస్తూండటంతో వాళ్ళని రిసీవ్ చేసుకోడానికి కుర్చీ లోంచి లేచి వెళ్ళిపోయారు.

* * * * * * * * * *


నేను వెలిగించిన సిగరెట్ చివరికి వచ్చేసి, రెండు వేళ్ళ మద్య చురుక్కుమని కాలటంతో, ఆలోచనల నుండి బయటకు వచ్చాను. అప్పటికే ఎనిమిదయ్యింది. హరి వచ్చేసే టైం అయ్యింది. డాబా మీద నుండి క్రిందకు దిగి రూంలోకి వెళ్ళాను. ఇంతలో హరి రానే వచ్చాడు. ఎప్పటిలాగే చిరాగ్గా మెడలోంచి అయిడీ కార్డ్ ఓ మూలకు గిరాటేసాడు. ఇద్దరం ఏమీ మాట్లాడకోకుండానే భోజనాలు కానిచ్చాం.

"హరి..నేను డాబా పైకి వెళ్తున్నాను..నువ్వు వస్తావా?.. " అంటూ అడిగాను.
"మూడ్ లేదురా.."
"రేయ్...మర్చిపోయావా...ఈ రోజు మూన్ రెగ్యులర్ గా వచ్చే సైజుకంటే పెద్దగా వస్తుందంట....నేను పైకి వెళ్తున్నాను..నీ ఇష్టం...." అన్నా వాడి వీక్‌నెస్ మీద దెబ్బకొడుతూ...
మూన్ పెద్ద సైజు అనేసరికి మారు మాట్లాడకుండా నా వెనకాలే వచ్చేసాడు డాబా పైకి....

కాసేపు వెన్నెలను ఆస్వాదించాం ఇద్దరం....

డాబా మీద ఓ కార్నర్లో ఉన్న చిన్న చిన్న కుక్కపిల్లలు క్యూట్ గా మూలుగుతున్నాయి. వాటిలో ఓ దాన్ని తీసుకుని ముద్దులాడుతుండగా....

"రవీ..." అని హరి పిలిచాడు...హరి వైపు చూసాను..

"నీతో ఓ విషయం మాట్లాడాలిరా...." అన్నాడు

చేతిలో ఉన్న కుక్క పిల్లను క్రిందకు దించబోతే అది కుయ్..కుయ్ అని దిగనని మారాం చేయటంతో దాన్ని భుజాలకెత్తుకుని హరి కూచున్న చోటికి వెళ్ళాను.

"చెప్పరా..."

"నాకు రేపో ఎల్లుండో పింక్ స్లిప్ ఇస్తారు...ఇక నేను మహా అయితే ఓ వారం రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్తాను....నువ్వు నాకు ఓ హెల్ప్ చెయ్యాలి....ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పకు..ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళతో....."

నాకు హరి పరిస్థితి ముందే శ్వేత మాటల్లో అర్దమవ్వటంతో ఎందుకు..ఏమిటీ..లాంటి విసిగించే ప్రశ్నలు వెయ్యలేదు.

* * * * * * * * * *


ఓ రోజు మధ్యాహ్నం శ్వేత నా క్యుబికల్ కు వచ్చింది. స్వేత మొహంలో ఓ రకమైన ఆందోళన కనిపించింది..

"రవీ..చూసావా...నేనన్నట్టుగానే అయ్యింది...హరిని ఫైర్ చేసారు...ఆ దొంగ మొహం మేనేజర్ గాడు కనీసం తనని బెంచ్ మీద కూడా పెట్టలే....ఇలా చేస్తాడనుకోలేదు.."

"ఇప్పుడు హరి ఎక్కడ ఉన్నాడు.." హరిని కలవాలన్న ఉద్దేశంతో సిస్టం ని షట్ డవున్ చేస్తూ అడిగాను.

"విషయం తెలియగానే తను ఆఫీస్ నుండి బయటకు వెళ్ళాడు...I think..he might have gone to room...." అంది.

ఎందుకో హరి విషయం తెలియగానే ఒక్క నిమిషం కూడా పని చెయ్యబుద్ది కాలేదు..ఒంట్లో బాలేదని మేనేజర్ కి రిపోర్ట్ చేసి నేను రూంకి బయలుదేరాను.

రూంకి వెళ్ళగానే తలుపు కొట్టాను. ఎందుకో మనసు కీడు శంకించింది...ఎంత సేపటికీ తలుపు తియ్యడే...ఓ పక్క గుండెలు లబ్ డబ్ మని కొట్టుకుంటున్నాయి. అసలే వాడు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు. ఏదైనా చేసుకుంటున్నాడా...అని ఒకటే పిచ్చి ఆలోచనలు....

కాసేపయ్యాక తలుపు తీసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నేను డోర్ నాక్ చేసే టైంకి తను బాత్రూంలో స్నానం చేస్తున్నాడని చెప్పకనే తెలిసింది. హరిని చూడగానే ఒక్కసారి మనసు కుదుటపడింది.

అప్పటి నుండి హరితో ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో అస్సలు అర్ధమయ్యేది కాదు. తను మాత్రం రోజు రోజుకు జీవితం మీద నిరాసక్తంగా తయారవుతున్నాడన్న విషయం మాత్రం నాకు తెలుస్తూనే ఉంది. కొద్దిరోజులు మా మద్య నిశ్శబ్దమే మిగిలింది.


* * * * * * * * * *


ఓ ఆదివారం నేనూ, హరీ కలిసి మార్కెట్ కి వెళ్ళి తిరిగొస్తున్నాం. నేను ఓ పాన్ షాప్ దగ్గర ఆగి ఓ తెలుగు మాగజీన్ కొన్నాను. ఇద్దరం ఇంటికి వెళ్ళాం...నేను స్నానానికని బాత్రూంకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను...మధ్యలో ఓ సారి హరి ఏం చేస్తున్నాడో చూశాను....వాడు నేను తెచ్చిన పుస్తకం టీ పాయ్ మీద పడేసి పేపర్ చదువుతున్నాడు...మరికాసేపు వరకు నేననుకున్నది జరగదని నిర్ధారించుకుని బాత్రూంలోకి వెళ్ళాను...ఆ రోజు ఆదివారం కావటంతో నిదానంగా తల స్నానం చేసుకుంటున్నాను...హరి ఫోన్ మ్రోగిన చప్పుడు అయ్యింది....ఏదో సంభాషణ వినిపించింది...స్నానం ముగించుకుని బయటకు వస్తుంటే..

"ఏంటిరా....ఎవరెవరో ఫోన్ చేసి...కంగ్రాట్స్ అంటారు...కధ అంటారు....బాగా రాసారంటారు...బహుశా ఏ రైటర్ కో చెయ్యాల్సిన కాల్ నాకు చేస్తున్నట్టున్నారు...." విసుగ్గా మొహం పెట్టి అన్నాడు....

ఇంతలో మళ్ళీ హరి ఫోన్ మోగింది...ఈ సారి కూడా అవతల మళ్ళీ కంగ్రాంట్స్ చెప్పినట్టున్నారు...హరి గాడికి కోపం నషాళానికి అంటింది...వాడెక్కడ అవతల మనిషిని తిడతాడో అని వెంటనే ఫోన్ అందుకున్నాను....స్పీకర్ ఆన్ చేసాను...

"ఏమండీ...హరి గారేనా మాట్లాడేది..." అవతల ఓ మహిళ గొంతు...

"అవునండీ..ఇది హరి గారి ఫోన్ నెంబరే...ఇంతకు మీరెందుకు కాల్ చేసారు..." అని ఆమెని అడిగాను..హరి నా ప్రక్కనే నిలబడి ఫోన్ సంభాషన వింటున్నాడు....

"ఎంత చక్కని కధ అండీ అది...ఇప్పటికి ఓ రెండు సార్లు చదివాను కధని...ప్రధమ బహుమతికి అన్ని విధాల అర్హమైన కధ అది.." అంటూ అవతలి ఆమె మాట్లాడింది. హరి గాడు మరింత అయోమయంగా చూస్తున్నాడు....

"ఇంతకూ మీరు ఆ కధని ఏ మాగజీన్లో చూశారు...హరి గారు బయటకెళ్ళారు...మీ అభినందనలు తనకు తెలుపుతాను" అని ఆమెతో అన్నాను....

ఆమే మేగజీన్ పేరు చెప్పి ఇంకోసారి అభినందనలు చెప్పి కాల్ ముగించింది.....ఆ కాలర్ చెప్పిన మేగజీన్ మేం పొద్దున కొన్న మేగజీన్ ఒకటే కావటంతో హరిగాడు గబ గబా ఆ పత్రిక ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు...నేను వాడి పక్కనే సోఫాలో కూచొని ఏమీ తెలీనట్టు నటిస్తున్నాను...కవర్ పేజీ మీద 'ఉగాది కధల పోటీ' ఫలితాలు అని పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి....అది చూసి మరింత కంగారుగా హరి పత్రికను ఓపెన్ చేసాడు...చూడాల్సిన పేజీనే ఓపెన్ చేసినట్టున్నాడు...అక్కడ ప్రధమ బహుమతి పొందిన కధ రచయిత హరి అని ఉంది...అపనమ్మకంగా ఆ కధని కూడా చదవటం మొదలెట్టాడు...

"అదేంటిరా...ఇది నా కధ కదా...అప్పుడేప్పుడో రాసుకున్నాను...మరి వీళ్ళకెలా తెలిసింది....పైగా నా పేరుతోనే వేసారు..." అంటూ కాస్త ఆనందం, అయోమయం కలగలిసిన మొహంతో అడిగాడు....

ఇంకెందుకని అసలు విషయం చెప్పేసాను...."నేనే పంపించానురా...అప్పుడెప్పుడో ఈ మేగజీన్ ని ఆఫీస్లో తిరగేస్తుంటే కధలపోటీ అని ఉంది...సరే నీ దగ్గర కొన్ని కధలు ఉన్నాయి కదా...ఒకటి పంపిస్తే ఏం పోయిందని పంపించాను....." అని చెబుతుండగా నా మాటలు పూర్తి కాకుండానే మళ్ళీ హరి ఫోన్ మ్రోగింది....ఈ సారి హరి కాల్ అటెండ్ చేసాడు... మొహం సూర్యుడిలా వెలిగిపోతూ కనిపిస్తుంది ....మా ఇద్దరికీ ఉమ్మడి ఫ్రెండ్స్ అందరినీ ముందే నేను కాల్ చేసి రమ్మనటంతో వాళ్ళు గోలా చేసుకుంటూ వచ్చి హరిగాడిని ఎత్తేసారు....అందరం కలిసి ఆ పూటకి రెస్టారెంట్ వెళ్ళాము.

ఆ రోజు హరి చాలా ఆనందంగా ఉన్నాడు...వాడిని కొంచెం మమూలు మనిషిని చేసినందుకు నాకు కూడా ఆనందం వేసింది...ఒక చిన్న సక్సెస్ నిరాశలో ఉన్న మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాన్నేను...

రాత్రి హరి కుర్చీలో కూచొని మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నట్టు కనపడ్డాడు...

"ఏం ఆలోచిస్తున్నావురా..." అని వాడితో అన్నాను...కొద్దిసేపు ఎటువంటి స్పందన లేదు....కాసేపయ్యాక

వెంటనే కుర్చీలోంచి లేచి ఓ చిన్న పిల్లాడిలా గట్టిగా హత్తుకున్నాడు నన్ను...

* * * * * * * * * *


కధకు మొదటి బహుమతి రావటం అనేది హరిని మరింత డిప్రెషన్లోకి నెట్టేయకుండా ఆపగలిగింది. వాడు కూడా ఆ తర్వాత నుండి ఉద్యోగం పోయిన విషయం గురించి పెద్దగా భాదపడినట్టు కూడా లేడు. ప్రతీరోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడల్లా రూంలో రీడింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏవేవో రాస్తున్నట్టు కనపడేవాడు.

ఓ వీకెండ్ సాయింత్రం ఇద్దరం డాబా మీద మాట్లాడుకుంటుంటే మాటల మద్యలో

"ఒరేయ్..రవీ..'బిగ్ సినిమాస్' వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు రా...ఇంకో పదిహేను రోజుల్లో దానికి మన ఫిల్మ్ పంపించేయాలి..వచ్చిన ఎంట్రీల్లోనుండి బెస్ట్ మూడింటికి వాళ్ళే ప్రొడ్యూస్ చేసి విన్నర్స్ తో పిక్చర్ తీస్తారంట..." అని చెప్పాడు.

ఆ పదిహేను రోజులూ ఆర్టిస్తులతో, పెద్ద పెద్ద లైటింగ్స్ తో మా రూం ఒక మినీ స్టూడియో అయిపోయింది...మొత్తానికి తను షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసేసి కాంటేస్ట్ కి పంపిచేసాడు...ఆ టైంలో నా ప్రాజెక్ట్ డెలివరీ ఉండటం వల్ల బిజీ అయిపోయి నేను ఆ ఫిల్మ్ ని చూడలేదు...

ఓ రోజు ఆఫీస్లో పెద్దగా పనిలేకపోతే లాప్ టాప్ లో సినిమాలు ఎమైనా ఉన్నాయేమో అని చూస్తుంటే హరి షార్ట్ ఫిల్మ్ కనపడింది. ఇది వరకు నేను దాన్ని చూడకపోవటంతో ప్లే చేశాను. నాతో పాటూ నా టీం వాళ్ళందరూ దాన్ని చూశారు. చూడటం పూర్తయిన వెంటనే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు...అందరిదీ ఒకటే ప్రశ్న.."ఎవరు ఈ షార్ట్ ఫిల్మ్ తీసారు" అని...నేను హరి పేరు చెప్పగానే...."ఏంటి?..శ్వేత ప్రాజెక్టులో ఉండి ఫైర్ చేయబడిన ఆ డల్ హరినా! ఆయనలో ఇంత టాలెంట్ ఉందా?" అని అందరి నోటి నుండి ఒకటే ప్రశ్న మళ్ళీ.....హరిని మరోలా అర్ధం చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు వాడిని పొగుడుతుంటే నాకు చాలా ఆనందం కలిగింది.

* * * * * * * * * *


బిగ్ సినిమాస్ ప్రొడక్షన్లో తీస్తున్న సినిమా డైరెక్షన్ పనిలో హరి చాలా బిజీగా ఉన్నాడు....అప్పుడప్పుడు అర్ధరాత్రుల్లు సినిమా విశేషాలు నాతో చెప్పేవాడు...సినిమా ఇంకో నెలరోజుల్లో పూర్తయిపోతుందని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొద్ది రోజులుంటుందని, ఈ సినిమాకి నిర్మాత అనుకున్న బడ్జెట్ కంటే తక్కువకే అయిందని, ఐనప్పటికీ క్వాలీటిలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని, త్వరలోనే రిలీజ్ అని ఓ కాల్ లో చెప్పాడు...ఇవన్నీ విన్నప్పుడు వాడి కల నెరవేరుతున్నందుకు, మనసుకు నచ్చినపని చేస్తున్నందుకు నాకెంత ఆనందంగా ఉండేదో మాటల్లో చెప్పలేను.

ఆఫీస్లో ఉండంగా కొరియర్ ఒకటి వచ్చింది...కవర్ ఓపెన్ చేసి చూస్తే ముంబాయికి ఫ్లయిట్ టికెట్స్...హరి పంపించాడు...తను సినిమాకి సంభందించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని, ఈ నెల మూడోవారంలో తన సినిమా ప్రివ్యూ షో ఉందని, దానికి నేను తప్పకుండా రావాలనీ మెసేజ్ పెట్టాడు...

వారం రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి హరి దగ్గరికి ముంబాయి బయలుదేరాను...ప్రివ్యూ షో ముందు రోజు ఇద్దరం జుహు బీచ్ కి వెళ్ళాం....

"ఒరేయ్..చాలా టెన్షన్ గా ఉందిరా...సినిమా ఏమవుతుందో అని...ఇది సక్సెస్ అయితేనే నేను మా ఇంట్లో వాళ్ళకు మొహం చూపించగలనురా..."

"తప్పకుండా సక్సెస్ అవుతుందిరా....నువ్వు ఎంత సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టుంటావో నేను ఊహించగలను...."

* * * * * * * * * *


ప్రివ్యూ షో పూర్తయింది...సినిమా చూసి నేనైతే నమ్మలేకపోయాను..హరినేనా ఇది తీసింది అని...సరిగ్గా తను ఏ విషయంలో అయితే సంఘర్షణకు గురయ్యాడో అదే పాయింట్ తో సినిమా తీసాడు. సినిమా అయిపోగానే హరికి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు...

"మొదటి నుండీ మన సమాజంలో పిల్లలు పెరుగుతున్న విధం చూస్తే చాలా భాదేస్తుంది....వాళ్ళకి వాళ్ళుగా తమదైన ప్రపంచం ఊహించుకోవల్సిన ఒక దశలో పెద్ద వాళ్ళే స్వయంగా 'నీ ప్రపంచం ఇలానే ఉండాలి ' అని వాళ్ళు ఊహిస్తున్న ప్రపంచాన్ని బలవంతంగా పిల్లల మెదళ్ళలోకి ఎక్కించేస్తున్నారు. ఫలితంగా తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రపంచంలో బతికేస్తూ, అదే ప్రపంచం అనుకుని వాళ్ళ అసంతృప్తికి కారణం ఏంటో తెలుసుకోలేక, దానిలోనే ఉండి రోజూ సతమతమవుతున్నారు. ఏ కొద్దిమందో వాళ్ళ ప్రపంచం ఏంటన్నది తర్వాత తెలుసుకున్నా, దానిలోకి ధైర్యంగా అడుగుపెట్టలేకపోతున్నారు...ఒక్కసారి వాళ్ళు వారి పూర్తి మనసు పెట్టి దేన్ని చేయడానికి ఇష్టపడుతున్నారో గమనించండి... నా తొలి సినిమాలో ఇదే విషయాన్ని ప్రస్తావిద్దామనుకున్నాను..ఈ సినిమా చూసి కొద్ది మంది తల్లిదండ్రులైనా పిల్లల ఇష్టా ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలిగానీ కుటుంబాల్లో స్థిరపడిన వ్యక్తులను చూపించో లేక చుట్టూ సమాజంలోని మిగిలిన తల్లిదండ్రులు వారి పిల్లలను ఏం చేస్తున్నారనో చూడకూడదని తెలుసుకుంటారని అనుకుంటున్నాను"

హరి మాట్లాడటం పూర్తయినవెంటనే దియేటర్ అంతా చప్పట్లతో మారుమ్రోగింది...హరి మాటలు విని అప్రయత్నంగానే నా కళ్ళు తడిసాయి...వచ్చిన అతిధులు తనకు మంచి భవిష్యత్తు ఉందని దీవించారు...

ఇద్దరం కారులో హరి ఇంటికి వెళ్ళాము....

"ఏంటిరా ఏమీ మాట్లాడటం లేదు..." డోర్ ఓపెన్ చేస్తూ అడిగాడు హరి.

కాసేపయ్యాక...

ఈ సారి నేను హరిని చిన్న పిల్లాడిలా గట్టిగా హత్తుకున్నాను...#----------- ** ** ** --------------#2, జులై 2010, శుక్రవారం

వారాంతంలో ఒక అనుభవం...

సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే ఇంటి నుండి బయటకు కదలడానికి అస్సలు ఇష్టపడను నేను. ఒకవేళ ఏ భూటాన్ బంపర్ లాటరీవాడో ఫోన్ చేసి 'సార్ మీకు ఓ పది లక్షలు తగిలాయ్..ఈ రోజే ఆఫీస్ కి వచ్చి మనీ తీసుకెళ్ళండి..లేదంటే మీ ప్రైజ్ మనీ పోతుంది' అని అన్నాడే అనుకుందాం..ఉహూ..అప్పటికీ కదిలే ప్రసక్తే ఉండదు...'ఇదిగో బాబు..మండే తీసుకోవటం అవుతుందా' అని వాడిని కూల్ గా అడుగుతాను తప్పించి పీ.టీ ఉష కి కజిన్ లా లగెత్తను గాక లగెత్తను. వారంలో అయిదు రోజులు చుట్టూరా ఉరుకులు పరుగుల మనుషులను, గంటల కొద్దీ ట్రాఫిక్ జాంలు, ఆఫీస్ పని చేయటం లాంటివి ఎలాగూ తప్పించుకోలేం కాబట్టి వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మయ్య ఈ ప్రపంచంతో నాకు సంభందం లేదు' అని అనుకోవటంలో ఓ కిక్ ఉంటుంది నాకు. ఒక్క మా గ్యాంగ్ వాళ్ళు ఔటింగ్ కి పిలిచినప్పుడు మాత్రం 'వీకెండ్ ఇల్లు కదలకపోవటం' అనే విషయంలో మినహాయింపువేసుకుంటాను.

ఆ రోజు ఎప్పటిలానే వీకెండ్ ఎంజాయ్ చేయటంలో భాగంగా మధ్యాహ్నం నిదానంగా భోజనం చేస్తూ, అమ్మతో పాటు నేను కూడా డైలీ సీరియల్ చూస్తున్నాను. మద్య మద్యలో ఎవరు ఎవరికి రెండో భార్యో, ఎవరు భర్త లాంటి భర్తో, చనిపోయిన మూడో భర్త అమ్మ మొదటి భార్య కొడుకును ఎందుకు ఎండ్రిన్ తాగమని ప్రోత్సహిస్తుందో, ముసలివేషంలో ఉన్న ఇరవై ఏళ్ళ అమ్మాయి సొంత జడతో ఉందా లేక సవరం వేసుకుందా లాంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటుంటాను. నేనలా కొశ్చన్స్ మీద కొశ్చన్స్ వేస్తుంటే అమ్మ ఎంతో ఉత్సాహంగా చెబుతుంది. నేను చూసేది ఒక్క శనివారం మాత్రమే..అది కూడా అప్పుడప్పుడు... అమ్మ రెగ్యులర్ గా ఫాలో అయ్యే సీరియల్స్ కావటంతో ఆ టైంలో నేను వేరే చానల్ పెట్టడానికి ఇష్టపడను. బలవంతంగా నాకు నేనుగా సీరియల్ అమ్మతో కలిసి చూసేసుకుని ఆ వారాంతం కామెడీ సినిమా చూడలేనిలోటుని తీర్చుకుంటానన్నమాట.

ఓ ఏభై నిమిషాల్లో భోజనం ముగించేసి, కంచం తీసుకుని సింక్ లో తోముతుంటే, 'రారా..చెంతకు రారా..' అంటూ నిద్రాదేవి చంద్రముఖి వేషంలో బ్యాక్ గ్రౌండ్లో పాడుతుంటే భుక్తాయాసంతో ఉన్నవారెవరికైనా నిద్ర రాక చస్తుందా! అందులోనూ మిట్ట మధ్యాహ్న సమయం...ఎలాగోలా కంచం కడిగేసి, డిష్ కంటెయినర్ లో పడేసి, బెడ్ రూంలోకి దూరిపోయి, ఫ్యాన్ మేగ్జిమమ్ స్పీడుతో పెట్టేసుకుని ఇలా పడుకున్నానో లేదో చెవిలో ఆ తర్వాత సీరియల్ టైటిల్ సాంగ్ వినిపించింది. దుప్పటి కప్పుకుందామంటే ఉక్కబోస్తుందని భయం. చెవిని చేతితో మూసుకుని పడుకున్నాను. "ఆడదే ఆధారం..ఆమే ఓంకారం..ఆడదే ఆధారం..మన సృష్టికి శ్రీకారం.." ఇంకా ఆ పాట వినిపిస్తునే ఉంది...అప్పుడే మొదటి సారిగా తెలిసింది ఆడవాళ్ళకు నాకు తెలియని చాలా డెఫినిషన్స్ ఉన్నాయని..ఆ పాట దెబ్బకు చంద్రముఖిలా ఉన్న నిద్రాదేవి పారిపోయింది..ఇక లాభం లేదనుకొని ఆమె ప్రియ శిష్యుడు కుంభ కర్ణుణకు ప్రార్ధించాను. 'మన ఫ్యామీలీ మెంబర్ ఎవడో నన్ను పిలుస్తున్నాడు' అని ఆయనకు సిగ్నల్స్ వెళ్ళాయి.. కొద్దిసేపటికే నాకు తెలీకుండానే సమ్మగా నిద్ర పట్టేసింది. ఓ రెండు గంటలవరకు నా నెట్ వర్క్ కి, బయట నెట్ వర్క్ కి సంభందాలు పూర్తిగా తెగిపోయాయి.

రెండు గంటల తర్వాత ఇలా లేచానో లేదో ఎదురింటిలోని పిల్లలు, మరికొంత మంది చిన్నపిల్లలు గోల చేయటం వినిపించింది. ఓ కంటిని పాక్షికంగా తెరిచి బాల్కనీలోకి వెళ్ళాను..జనరల్ గా నేను నిద్ర లేచిన వెంటనే రెండు కళ్ళనూ తెరవను..ఓ అరగంట వరకు ఏదో ఒక కన్ను మాత్రమే తెరచి ఉంచుతాను..అది కూడా పాక్షికంగా...ప్రొఫెషనల్ గా చెప్పాలంటే కళ్ళకు నిద్ర లేచిన వెంటనే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూపించి స్ట్రెయిన్ కి గురి చేయటం నాకు అస్సలు నచ్చదు..ఈ మాత్రం దానికే గిట్టని వాళ్ళు నన్ను 'లేజీ ఫెలో' అని ముద్దుగా అంటుంటారులెండి...ఆ పిల్లల్లో ఓ అబ్బాయి 'అన్నా..ఆ క్రిందన చూడు కుక్కని..' అని అన్నాడు. పై నుండే చూశాను. ఊర కుక్క అది...మరీ అంత పెద్దది ఏమీ కాదు. పుట్టి ఓ మూడు నెలలు అయ్యుంటుంది అప్పటికి. ఓ వైపు పడుకుని ఉండి కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. పొట్ట మీద ఓ గాయం ఉండి, ఆ ప్రాంతంలో రక్తం గడ్డ కట్టేసి ఉంది. అప్పటికీ నాకింకా నిద్ర మత్తు ఒదలలేదు. సరే ఓ సారి క్రిందకు పోయి చచ్చిందో, బ్రతికిందో చూద్దాం అనుకుని సెల్లార్ లోకి వెళ్ళి నేల మీద పడిఉన్న దాన్ని చూసాను. ఒక్కసారిగా నిద్రమత్తు ఒదిలేసింది. దానికి కడుపులో చాలా లోతైన గాయం అయ్యింది. బహూశా పై ఫ్లోర్ నుండి పడుతున్నప్పుడు మద్యలో ఏ ఇనుప ఊస పుల్లో గుచ్చినట్టు ఉంది. రక్తం ఆ భాగంలో గడ్డకట్టి ఉంది. చాలా కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. పొద్దున్నుంచి అది అలానే ఉందని ఓ కుర్రాడు చెప్పాడు. క్రింద పడిన వెంటనే అది చచ్చిపోయున్నా బాగుండేది. కానీ ప్రాణంతో ఉండి అలా విలవిలలాడుతుంటే మనసుకు చాలా కష్టంగా అనిపించింది.

ఓ నిమిషం పాటు బుర్ర బ్లాంక్ అయ్యింది. ఇది వరకు ఎప్పుడో, ఏదో ఇంటర్వ్యూలో అమల అక్కినేని, వాళ్ళ సంస్థ బ్లాక్రాస్ తరపున జంతువులకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారని చెప్పినట్టు గుర్తు వచ్చింది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా గబ గబా పైకి వెళ్ళి నెట్ ఆన్ చేసాను. అప్పటికి టైం నాలుగు నలభై అయిదు నిమిషాలు కావొస్తుంది. నెట్ ఆన్ అయ్యింది. గూగిల్ ఓపెన్ చేసి 'బ్లాక్రాస్, హైదరాబాద్' అని టైప్ చేసాను. ఓ ఫోన్ నెం. కనిపించింది. ఇదంతా చేస్తున్నాను గానీ నాకు మనసులో ఒకటే సందేహాలు..వాళ్ళు నిజంగా వస్తారా లేదా? ఫోన్ ఎత్తుతారా అసలు? అలాంటివన్నీ డబ్బున్నోళ్ళు పబ్లిసిటీ కోసం, కాలక్షేపం కోసం చేసుకుంటారు కదా...ఇలా ఎన్నెన్నో అనుమానాల మద్య బ్లూ క్రాస్ కి ఫోన్ చేసాను. రింగవుతూనే ఉంది. ఎవరు ఎత్తటం లేదు. ఆ నెం.కే మళ్ళీ ట్రై చేశాను. టైం అయిదు అయింది. మళ్ళీ మ్రోగుతూనే ఉంది.. ఫోన్ పెట్టేదామనుకునేంతలో ఎవరో లిఫ్ట్ చేసారు. వివరంగా మొత్తం చెప్పాను. 'సారీ అండీ అయిదు వరకు మాత్రమే మా సేవలు..మీరు రేపు ఉదయం దాన్ని తీసుకురండి..అయిదు తర్వాత ఒక్క ఎమర్జన్సీ మాత్రమే చూస్తాం' అని అన్నారు.

కుక్క పరిస్థితి పూర్తిగా ఇంకోసారి చెప్పాను. ఇప్పుడు గానీ దానికి ట్రీట్ మెంట్ ఇవ్వకపోతే అది చచ్చిపోతుంది అని చెప్పాను. వెంటనే ఆయన మా ఏరియా అడిగి, ఇక్కడ ఉన్న వాలంటీర్ల నెంబర్ ఇచ్చారు. వెంటనే ఫోన్ కట్ చేసి ఆయన ఇచ్చిన వాలంటీర్ నంబర్ కు డయల్ చేసాను. ఆయన వెంటనే అన్ని వివరాలు అడిగారు. ఓ అరగంటలో వస్తామని చెప్పారు. నాకైతే అప్పటికీ నమ్మకం లేదు...అసలే వీకెండ్..ఎంత వాలంటీర్లు జంతు ప్రేమికులైనా వీకెండ్ ఓ సినిమాకో,పార్టీకో పోతారు కదా...'సరేలే మన పని మనం చేసాం' అని అనుకుని టీవీకి అతుక్కుపోయాను.

కొద్దిసేపు తర్వాత ఎందుకో మనసు ఆగక క్రిందకు వెళ్ళి కుక్క ఎలాఉందో చూశాను. పాపం దాని తల్లి అక్కడక్కడే కొద్దిసేపు తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ వాలంటీర్ కి ఫోన్ చేశాను..వాళ్ళ టీం అంతా బయలు దేరారని, ఇంకొద్దిసేపట్లో నేను చెప్పిన ప్లేస్ లో ఉంటారని చెప్పాడు...ఇంతలో మా గ్యాంగ్ లోని ఒకడు ఫోన్ చేశాడు..సాయింత్రం అందరం నెక్లస్ రోడ్ దగ్గర కలుస్తున్నామని..నేను రెడీ అవుతుండంగా మళ్ళీ ఫోన్ మ్రోగింది..ఈ సారి ఆ బ్లూ క్రాస్ వాలంటీర్..వాళ్ళు మా ఏరియాకి వచ్చేసారని చెప్పాడు. గభ గభా క్రిందకు వెళ్ళి నేను చెప్పిన లాండ్ మార్క్ దగ్గరకు వెళ్ళాను.

ఇరవై, ఇరవై అయిదేళ్ళ కంటే ఎక్కువ వయసు ఉండని ఓ ముగ్గురు కుర్రాళ్ళు, ఓ అమ్మాయి కనిపించింది..అందులో మెయిన్ వాలంటీర్ మేము ఇంటికి వెళ్ళే దారిలోనే కుక్కకి సంభందించి చాలా ప్రశ్నలు వేశాడు..నాకు తెలిసిన వివరాలు చెప్పాను..వాళ్ళందరూ వారి వారి డిగ్రీల్లో ఫైనలియర్ చదువుతున్నవారు...మాట్లాతుండంగానే ఇంటికి వచ్చేసాము..సెల్లార్ లో కుక్క ఉన్న ప్లేస్ దగ్గరకు తీసుకెళ్ళాను వాళ్ళని..చాలా కంగారు పడ్డారు దాన్ని చూడగానే...అందులో అమ్మాయికైతే కుక్కని చూసి చూడగానే కళ్ళల్లో సన్నటి కనీ కనిపించని కన్నీటి పొర..ఒక వాలంటీర్ కుక్కని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు..పాపం నొప్పికి అది కుయ్..కుయ్ అంది. ఇంకో వాలంటీర్ దాని పరిస్థితి క్రిటికల్ గా ఉందని, ఆపరేషన్ అవసరమని తేల్చాడు...వెంటనే నలుగురు కుక్కని తీసుకుని బయలుదేరారు..నేను వాళ్ళని అనుసరించాను...కుక్కని ఎక్కడికి తీసుకెళ్ళాలో మాట్లాడుకుంటున్నారు..ఓ వాలంటీర్ చెప్పిన డాక్టర్ నెం.కి ఇంకో వాలంటీర్ కాల్ చేసి ఆవిడ ఆపరేషన్ ధియేటర్ అవైలబుల్ గా ఉందా లేదో, ఆవిడ ఇప్పుడు ఇంట్లో ఉందో లేదో కనుక్కున్నాడు. ఆ డాక్టర్ లేకపోయేసరికి వేరే ఆమెకు కాల్ చేసారు. మద్యలో ఇంకో వాలంటీర్ కుక్క తలని నిమురుతూ 'ఏం కాదులే నీకు..కొంచెం ఓర్చుకో..' అంటూ, మిగిలిన వారి వైపు చూసి ఆలస్యం చేయకుండా మనం వెళ్ళాలి అంటూ గాభరా పడుతున్నాడు. నలుగురు మొహల్లో కూడా దానికి ఏమీ కాకూడదన్న తాపత్రయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇదంతా చూస్తున్న నాకు అప్రయత్నంగా కళ్ళలో ఓ నీటి పొర చూపును కప్పేసింది.

ఓ ఆటోని పిలిచి కుక్కని వాళ్ళు తీసుకెళ్ళబోతున్న ప్లేస్ గురించి వాడికి చెప్పి, ఆటో ఎక్కబోయారు. అందులో మెయిన్ వాలంటీర్ నా వైపు చూసి 'మీరు కూడా ఇంక మా గ్రూప్ లో చేరిపోవచ్చు..ఆసక్తి ఉంటే నా నెం. కు ఫోన్ చెయ్యండి' అని ఆటోలోకి దూరాడు. 'నాకంత సీన్ లేదు' అని చెప్పకుండా దానికి ఈక్వలెంట్ నవ్వు నవ్వాను...ఏదో ఆ కుక్కకి కాసింత సాయం చేసినందుకు నేను కూడా వాళ్ళ టైపే అన్న భ్రమలో పడిపోయినట్టున్నారు...ఒకవేళ అదే టైంలో మా గ్యాంగ్ వాళ్ళు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తే నేను కూడా దాన్ని చూసి, అందరిలాగే చిటికెడు జాలి విదిల్చి, సగటు మనిషిలా అక్కడే దాన్ని వదిలేసి వెళ్ళిపోతానని తెలిస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో...ఈ ఫోన్ చెయ్యడాలు గట్రా అప్పుడు ఉండవుమరి...

ఇంటికి వచ్చేయబోతూంటే బుర్రలో ఏవేవో ఆలోచనలు....మానవత్వం, సాటి వారిపై దయ, ఎదుటి వాడి కష్టాన్ని అర్దం చేసుకోలేని వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఏమీ కానీ, పైసా లాభం కూడా తెప్పించని ఓ మూగ జంతువు ప్రాణం, అది కూడా ఓ వీధి కుక్క ప్రాణం నిలపటం కోసం వాళ్ళు పడుతున్న తపన చూసినప్పుడు, వారి సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ఆ నిమిషంలో వాళ్ళంతా మనుషులకంటే ఎక్కువగా కనిపించారు..దేవుని పటం కనిపిస్తే, ఎప్పుడూ ఎవరో చెప్తే తప్ప స్వతహాగ దణ్ణం పెట్టుకోవాలని అనిపించని నాకు, అప్రయత్నంగా మనస్సులోనే వారందరికీ దణ్ణం పెట్టుకోవాలనిపించింది...

15, మే 2010, శనివారం

బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా...!!

వర్షం సన్నగా పడుతోంది...నీటి బిందువులు ప్రతీ ఆకును ముద్దాడటంతో తడిసి, సాయం సంద్యా వెలుగులో పచ్చగా మెరిసిపోతున్నాయవి...ఆకాశమంతా ఉదారంగు మబ్బులు కమ్ముకొన్నాయి....చల్లని గాలి ఆమె మోమును సుతారంగా తాకటంతో పైట కొంగును తీసుకుని తలమీంచి కప్పుకుంది...ఇంటి పైకప్పు నుండి జాలు వారుతున్న నీరు నేలను తాకి నిశ్శబ్ధాన్ని చేదిస్తున్నాయి...అరుగుమీంచి లేచిందామె...ఎవరి కోసమో మరి...కొద్ది అడుగులు ముందుకు వేసింది...వాన చినుకులు ఆమెను నేనంటే నేనని తాకటంలో పోటీపడుతున్నాయి....ఏటో చూస్తూందామె...కాసేపయ్యాక వర్షం తగ్గింది..సన్నటి తుంపరలు మాత్రం శరీరాన్ని ఇంకా తాకుతున్నాయి....కొద్ది దూరంలో ఓ సెలయేరు, ప్రవాహపు మద్యలో ఉన్న రాళ్ళతో ఊసులు చెబుతున్నట్టుగా గలగలలు ఆమె చెవిని తాకాయి....ఎవరో గుర్తొచ్చారామెకు...మనసులో తెలీని సుతిమెత్తని భాధ...సాంత్వన కలిగించడానికేనా అన్నట్టు పెదవులు విచ్చుకున్నాయి...." పలుకులు నీ పేరే తలుచుకున్నా..పెదవుల అంచుల్లో అణుచుకున్నా..
మౌనముతో నీ మదిని భందించా...మన్నించు ప్రియా..

తరిమే వరమా...తడిమే స్వరమా...
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా...
వింటున్నావా...వింటున్నావా...వింటున్నావా... "

- అనంత శ్రీరాం


- సెలయేరుకు అటువైపు....

కదిలే మేఘాలు తనకోసం ఏవో తీసుకురావాలని అతను ఆశిస్తున్నాడు...ప్రతీ మేఘం ఇటే వస్తుంది...కానీ ఏమీ తేలేదన్నట్లుగా ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాయి...మనసు మెలిపెట్టినట్టుంది అతనికి...ఆమె ఎడబాటు భరించలేనిదిగా ఉంది...కాలితో ఓ రాయిని బలంగా తన్నాడు...కాసేపటికి వెలిసిందనుకున్న వాన మళ్ళీ మొదలైంది...కొన్ని చినుకులు అతన్ని సుతిమెత్తగా తాకాయి...ఏదో తెలుసుకుంటున్నట్టుగా అతను రెండు చేతులనూ చాచి, ఆకాశం వైపు చూస్తూ, చినుకులను తన గుండె మీదకు ఆహ్వానించాడు...మనసు మురిపెం పాటయ్యింది..." విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా...
తొలిసారి నీ మాటల్లో...పులకింతల పదనిసలు విన్నా...

చాలు చాలే..చెలియా..చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా...
ఓ..ఓ...బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా... "
- అనంత శ్రీరాం


............

.......

ఇది కొద్ది రోజులుగా ఓ పాట వింటున్నప్పుడు నా కళ్ళముందు కనిపిస్తున్న ఓ దృశ్యం...కొన్ని పాటలు వింటుంటే ఊహలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి...అప్రయత్నంగా కళ్ళ ముందు ఓ దృశ్యం అలా కనిపించేస్తుంది...ఆ విరహ వేదనలో మనమే ఉన్నామా అన్నంత భావోద్వేగానికి లోనయిపోతుంటాము. కొన్ని రోజులనుండి ఆ పాట అలాంటి అనుభూతినే కలిగించేస్తుంది. అసలే మన రహ్మాన్ ట్యూన్ చేసాడు ఆ పాటని. అనంత శ్రీరాం రాసిన అందమైన సాహిత్యానికి శ్రేయా ఘోషల్ గళం కలిపింది..అది కూడా కార్తీక్ తో కలిసి...అసలు ఈ అమ్మాయి ఉంది చూశారూ...తను పాడిన పాటలు వింటున్నప్పుడే, ఆ గొంతుతో మన మనస్సులోకి పర్మిషన్ తీసుకోకుండా దూరి, రకరకాల భావోద్వేగాలను కలిగించి, కుళ్ళ బొడిచి వదిలేస్తుంది ...సున్నిత మనస్కులు అయితే పాట వింటూ ఎవరో అమ్మాయి తన కోసమే పాడుతుందేమో అన్న భ్రమల్లోకి పోయినా పోతారు కాసేపు...ఇక ఆ కార్తీక్ అయితే "నీ మనసు నాకు తెలుసు సోదరా..దాని వ్యధ కూడా తెలుసు.." అంటూ మన భావాన్ని తన గొంతులో పలికిస్తూ మన వెర్షన్ పాడేస్తుంటాడు. ఇది చాలదన్నట్టు మన దర్శకులు శ్రేయా గొంతును సినిమాల్లో జెస్సీలాంటి ఓ అందమైన అమ్మాయికి తగిలించేస్తారు...ఇంక కష్టాలు అప్పుడు మెదలు నాకు...ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ, కళ్ళు మూసినా ఎదురుగా కనపడుతున్న దృశ్యం చూసుకుని, గొప్ప అనుభూతికి లోనయిపోయి, పాట అయిపోయిన వెంటనే "ఈ నిమిషం చచ్చిపోయినా పరవాలేదు" లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పుట్టేస్తుంటాయి...

అందుకే నేను ఇకపై శ్రేయా ఘోషల్ పాడిన కొన్ని విరహంతో కూడిన పాటలు వినకూడదనుకుంటున్నాను...ముఖ్యంగా కార్తీక్ తో తను పాడిన ఈ విరహ గీతం అస్సలు వినను...

మీకు నచ్చితే ఇక్కడ నుండి మీ కంప్యూటర్లోకి దింపుకోండి.

******

( ఐపాడ్ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నాను..ఓ సాంగ్ ప్లే చేశాను..చేతిలోని ఐపాడ్ నా వైపు అదోలా చూసింది...సాంగ్ ప్లే అవుతోంది...'తరిమే వరమా...తడిమే స్వరమా...ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా'..ఎభై ఒకటోసారి అదేపాట మంద్ర స్థాయిలో మళ్ళీ వినిపిస్తుంది శ్రేయా గొంతులోంచి జాలువారుతూ.. )

24, ఏప్రిల్ 2010, శనివారం

ఈనాడులో 'ఏటిగట్టు'

"ఓలమ్మో...ఓలమ్మో...నా మనవడు అగుపించట్లేదు...ఎటెళ్ళి పోనాడో ఏవిటో...ఓలైనా సూసినారా.." - అంటూ మా నాయనమ్మ గాభరా పడుతూ వాకిట్లోకి వచ్చింది.

ఆవిడ చేసిన హడావిడికి ఎక్కడ పని అక్కడ వదిలేసి ఓ పదిమంది మా కాలనీ ఆడోళ్ళు మా ఇంటి ముందు గుమిగూడారు.

"ఓలప్పా..ఏటైనాదే..నీ మనవడు అగుపించకపోవటం ఏటి..ఇల్లంతా ఎతికావా.." అడిగింది పరమేశ్వరి మామ్మ..

"ఈవిడ చాదస్తం కాకపోతే చెట్టంత మనవడు ఎక్కడికి పోతాడు..మొన్న కూడా ఇలానే కనపడకపోతే నానా రభసా చేసింది ముసలమ్మ...తీరా చూస్తే పెరట్లో పెద్ద మంచానికి నల్లుల కోసం టిక్ ట్వంటీ కొడుతూ దాని కింద కనపడ్డాడు..ఈవిడేమో ఎక్కడా సూడకుండా వాకిట్లో పంచాయితీ పెట్టేసింది..." సన్నగా గొణిగారు ఎవరో..

"అది కాదే..అప్పా..రేతిరంతా ఆ కంపూటర్ కాడ కూకుంటున్నాడని ఓ పిసర తిట్టానా..అందుక్కాని పోనాడా అని డెవుటొచ్చేసినాది..." అరుగుమీద కూర్చొంటూ అంది నాయనమ్మ.

"ఒసేయ్ నాయనమ్మా..నేను ఇక్కడున్నానే..చూడు.." అంటూ నా చేతిలో ఆడుకోడానికి తెచ్చుకున్న చింత పిక్కల్లో ఒకదాన్ని తీసుకుని నాయనమ్మ వైపు విసిరాను..అది సరాసరి వెళ్ళి ఆమె బోడిగుండుకు తగిలింది.

"ఎవడ్రా సన్నాసి ఎధవ నా గుండు మీద కొట్టింది" ఆవేశంగా అరుగుమీంచి లేచి చుట్టూ చూసింది.

"ఇటే..ఇటువైపు...పైకి...పైకి చూడు"

( జనరల్ గా నేను పట్టలేని ఆనందం వచ్చినప్పుడు తొమ్మిదో నెం. ఆకాశంపైకి ఎక్కేస్తుంటాను..ఈ మద్య తాగుబోతుల్లుకు కూడా దీని గురించి తెలిసిపోయినట్టుంది...ఫుల్ రష్ ఉంటుంది అక్కడ )

ఈ సారి కుంకుడు పిక్క విసిరితే నాయనమ్మకు పట్టలేని కోపం వచ్చి ఎదురుగా ఉన్న ఎవరినైనా పీకుతుందని ఆలోచించి విసరలేదు.

ఓ చెయ్యి నుదుటికి అడ్డుపెట్టుకుని, సోడా కళ్ళద్దాలను సర్దుకుంటూ, తలపైకెత్తి చూసింది..ఆమెతో పాటు మిగిలిన వాళ్ళూ పైకి చూశారు..

"ఒరేయ్..అల్లక్కడ ఏటి సేస్తున్నావ్ రా? నీ కోసం పెసరట్టేసా...ఫెష్ కొబ్బరి పచ్చడి సేసా..బేగి పారొచ్చెయ్.."

నన్ను చూసి మిగిలిన ఆడోళ్ళు గొణుక్కుంటూ వెళ్ళిపోయారు.

మా నాయనమ్మ పెసరట్టు,కొబ్బరి పచ్చడి అనగానే నోట్లో నీళ్ళూరాయి...తొమ్మిదో నెం. ఆకాశం నుండి పారాచూట్ సహాయంతో క్రిందకు దూకాను.

వేడి వేడి పెసరట్టుతో కొబ్బరి పచ్చడి తింటుంటే మళ్ళీ ఆ ఆకాశం నెం. తొమ్మిది మీదకు వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ అప్పుడే పెసరట్టు తిరిగేయటం వల్ల వేడి వేడిగా ఉన్న గరిటే నాయనమ్మ చేతిలో చూసి ఆ ప్రయత్నం మానుకున్నాను.

"ఆ...ఇప్పుడు సెప్పు....అల్లక్కడికెందుకు పోనావురా...లంకంత కొంప ఉంచుకుని..." ఇంకో పెసరట్టు వడ్డిస్తూ అడిగింది

"నానమ్మా...మరి...మరి...ఈరోజు నేను రాసే రాతల గురించి ఈనాడు పేపర్లో పడిందే..అందులో నా పేరు చూసుకునే సరికి కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళు తెరిచేసరికి ఆ ఆకాశం నెం. తొమ్మిదిలో ఉన్నాను.." కొబ్బరి పచ్చడి నాలిక్కి రాసుకుంటూ చెప్పాను.

నా సమాధానం విని నాయనమ్మ లేచి నిలబడింది..వెంటనే అరుగుమీదకు వెళ్ళి గట్టిగా - "ఏటేటీ..నీ రాతల గురించి పేపర్లో పడినాదా!...ఒసేయ్..రంగమ్మా..చిట్టేమ్మా...అప్పాయమ్మా...ఇలా రండే..మీకొక కవురు సెబుతాను..అజ్జెంటుగా పారొచ్చెయండి.." అని అరిచింది.

ఓ గంట 'నేను..నా మనవడు..నా వంశం' అనే అంశం మీద వచ్చిన వాళ్ళందరికీ సెమినార్ ఇచ్చింది. తర్వాత నా దగ్గరగా వచ్చి చెయ్యి భుజం మీద వేసింది. "పాపిట్టి దాన్ని..నువ్వు అర్ధరాత్రుల్లు ఆ కంపూటర్ డబ్బా ముందు కూకుంటే ఏటో అనేసుకుని తిట్టేసాను నిన్న...ఇవట్రా నువ్వు రాస్తుంది..." అని భాదపడుతూ ఆ పక్క టేబుల్ మీద ఉన్న గ్లిజరిన్ సీసాలోంచి రెండు చుక్కలు చేతి మీద వేసుకుని కళ్ళకు రాసుకుని ఏడ్చింది.

మళ్ళీ మాట్లాడింది..

"మన వంశంలో నేనొక్కదాన్నే రాయగలను..ఈ రాసే అలవాటు నా మనవళ్ళు, మనవరాళ్ళు లో ఎవరికి రాలేదేటబ్బా అని తెగ భాదపడిపోయేదాన్నిరా...ఇప్పుడు నువ్వు కూడా రాసేత్తున్నావంటే సానా ఆనందంగా ఉందిరా..."

మా నానమ్మ 'నేనూ రాస్తాను' అనే సరికి దిమ్మ తిరిగి తింటున్న కొబ్బరి పచ్చడి పెసరట్టు ముక్కతో సహా గొంతులోనే బ్లాక్ అయింది.

"ఏంటే...నువ్వు కూడా రాస్తావా.."

"మరి నానేటనుకుంటున్నావ్...ఒకటి కాదు రెండు కాదు..మూడు పుస్తకాలు రాసానురా.." కళ్ళెగరేస్తూ, చేతులు తిప్పుతూ చెప్పింది.

"నిజ్జంగా...నువ్వు గ్రేటే..ఇంతకూ ఏమీ రాసావు..దేని గురించి రాసావు..ఏవీ అవి చూపించు..." ఉత్సాహం అపుకోలేక అడిగాను.

"ఇంకేడ ఉంటాయిరా...నీ బాబు కాశీ తీసుకెళ్ళంగానే ఆడే ఇచ్చేసి రాలే..."

నాకేమీ అర్ధం కాలేదు..."కాశీలో ఇచ్చేయటమేంటే..నీ మొహం..అర్దమయ్యేలా చెప్పు.."

"మరి..రామకోటి రాసిన పుస్తకాలు రాయటం అయిపోనాక కాశీలో ఇచ్చేయాలిరా.." తాపీగా అసలు విషయం చెప్పింది..

"ఏంటి మాడు పుస్తకాల్లో రామకోటి రాసావా...ఇంకేమీ రాయలేదా?"

"ఆ..మూడో కెలాసు సదివిన నాను అంతకంటే ఏటి రాత్తాను...అయినా నీతో కవుర్లు సెప్పుకునే తీరికలేదు గానీ..మనసులో సానా ఆనందంగా ఉందిరా...నా వంశంలో రెండో మనిషివి రాస్తున్నావంటే...అందుకే నేను కూడా ఆ తొమ్మిదో నెం. ఆకాశంలోకి పోతున్నా" అంటూ లేచింది.

"ఇంకోసారి నిన్ను నువ్వు రైటర్ అని చెప్పుకున్నావనుకో నీ సోడా కళ్ళద్దాలు కిందపడేసి తొక్కుతా..." పచ్చడిలో ఉన్న మిరపకాయ నములుతూ అన్నాను..

ఏమీ వినిపించుకోనట్టుగా వెళ్ళిపోతుంది నానమ్మ..

"నాయనమ్మా..ఆగవే..నేనూ టిఫిన్ తినటం అయ్యాక అక్కడకే వెళ్తాను..ఇద్దరం కలిసే వెళదాం.."

నాయనమ్మ దగ్గరగా వచ్చి, ఓ పెసరట్టు ముక్కని పచ్చడిలో ముంచి నోటికి అందించింది...నేను గ్లిజరిన్ బోటిల్ కోసం చుట్టూ చూశాను.

*********


-( ఈ రోజు పొద్దున్నే నా బ్లాగు ఈనాడు పేపర్లో చూసి ఇంకేమీ ఆలోచించకుండా Cloud 9 లోకి వెళ్ళిపోయాను..ఇలాంటి టైంలో నాకొక బంగారుమురుగు కధలో లాంటి బామ్మ ఉంటే, ఆవిడ ఎలా ఫీలవుతుందో అని ఊహించి రాసాను...

నాచిట్టి బ్లాగును, దానిలోని రాతలను బయట ప్రపంచానికి పరిచయం చేసిన 'మనసులోమాట' సుజాత గారికి మన:పూర్వక కృతజ్ఞతలు..అలాగే నేను రాసిన రాతలను ఓపిగ్గా చదివి, అభిప్రాయం తెలిపి, కొండంత ప్రోత్సాహం అందించిన బ్లాగ్మిత్రులకు చాలా చాలా థాంక్స్. )

4, ఏప్రిల్ 2010, ఆదివారం

"సానియా ఇంట..మాలిక్ అంట..బిర్యానీ వంట" ( Exclusive Live Show )

సమయం ఎనిమిది గంటలు అవుతోంది...

నివారణ్ 99 టీవీ చానల్ ఆఫీస్ లోపల...చానల్ హెడ్ 'బ్రేకింగ్ న్యూస్' బాబూరావ్ పరుగు పరుగున న్యూస్ రీడర్ నస, రిపోర్టర్ కల్పిత రావు ఉన్న గదిలోకి వెళ్ళాడు....(ఇతను ఎలకకి ఒకతోక, ఒక తల ఉన్నాసరే ఆ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా మార్చగలిగే సమర్ధుడని ఆయన్ని చానల్లో సబార్డినేట్స్ అందరూ అలా పిలుస్తుంటారు)

"దొరికింది..దొరికింది...మీరిద్దరూ ఒకరి తల్లో ఒకరు పేలు తీసుకోకుండా కాలక్షేపం చేసుకునే న్యూస్ అయిటేం ఒకటి దొరికింది..తొందరగా వెళ్ళండయ్యా..." అంటూ హడావిడిగా హెడ్ రావటంతో ఇద్దరూ అలర్ట్ అయ్యారు..

"ఆ తకాతక్ హిందీ చానల్ వాళ్ళు సోయబ్ మాలిక్ హైదరాబాదుకు వచ్చిన విషయం..సానియా ఇంట్లోకి వచ్చిన విషయం బ్రేకింగ్ న్యూస్ గా వేసేస్తున్నారయ్యా...తెలుగు చానల్లో ఎవరూ ఈ విషయం వెయ్యకముందే మనం వెయ్యాలి...తొందరగా సానియా ఇంటి ముందు కెమెరా సెట్ చెయ్యండయ్యా..." అని 'బ్రేకింగ్ న్యూస్' బాబూరావ్ ఇంకా ఏదో చెబుతుండగా రిపోర్టర్స్ నస న్యూస్ రూంలోకి, కల్పితరావు లైవ్ వేన్లోకి జంప్ చేశారు....


కాసేపయ్యాక...

నస మొబైల్ కి కల్పిత్ ఫోన్ చేశాడు....

నస: ఆ...కల్పిత్ సానియా ఇంటి ముందు పరిస్థితి ఎలా ఉందో చెబుతావా?

కల్పిత్: ఏంటి చెప్పేది నా మొహం....

నస: ఓ పరిస్థితి చెండాలంగా ఉందన్నమాట....ఫోన్ పెట్టు..తొందరగా లైవ్లో ఈ విషయం చెప్పాలి...

కల్పిత్: ఓ నస...ఇక్కడ ఏమీ జరగటం లేదు...ఏమి చూపించమంటావ్...

నస: అయితే ఆ తకాతక్ వాళ్ళు మాలిక్ సానియా బాల్కనీలో సెల్ మాట్లాడుతున్న వీడియో, సానియాని వాళ్ళమ్మ బుజ్జగిస్తున్న వీడియో చూపిస్తున్నారు..వాటిని మనం స్క్రీన్ మీద చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించేద్దాం... నువ్వు విషయాన్ని నీ కళ్ళతో నువ్వే చూస్తున్నట్టు ఫీలయ్యి వీడియో చూస్తూ నాకు చెప్పేసెయ్...నేను కనపడిన వీడియో బట్టి ప్రశ్నలు అడిగేస్తాను..సరేనా....తొందరగా ఫోన్ పెట్టు..మన హెడ్ సంగతి తెలుసుగా...లేట్ చేస్తే మనల్ని చంపేసి దాన్నే బ్రేకింగ్ న్యూస్ గా వేసేస్తాడు...


నస బ్రేకింగ్ న్యూస్ లు చెప్పేటప్పుడు వేసుకునే ఎర్రకోటు వేసుకుంది...లైట్స్ ఆన్ అయ్యాయి...కెమెరా నస మొహం వైపు తిరిగింది....టీవీ స్క్రీన్ రెండు తెరలుగా విడిపోయింది...ఒక తెర మీద న్యూస్ రీడర్ నస..ఇంకో తెరమీద సానియా, మలిక్ ల వీడియో క్లిప్పింగ్లు...

న్యూస్ రీడర్ నస నసపెట్టడం మొదలు పెట్టింది....

"ఇప్పుడు మీరు చూడబోతుంది మా చానల్ 'నివారణ్ 99' లో మాత్రమే వీక్షించ గలిగే ఒక ప్రత్యేక లైవ్ ప్రోగ్రాం...ఆ ప్రోగ్రామే 'సానియా ఇంట..మాలిక్ అంట..బిర్యానీ వంట'...మరి మనకు వివరాలు అందించేందుకు మా ప్రతినిధి కల్పిత్ సానియా ఇంటి ముందు ఓ గుడారం వేసుకుని పళ్ళు కూడా ఇంకా తోముకోకుండా ఎప్పటి కప్పుడు తాజా వివరాలు మనకు అందించడానికి పొద్దునే అక్కడకు వెళ్ళిపోయాడు..మరి ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం"

"ఆ చెప్పు కల్పిత్...మాలిక్ సానియా ఇంటికి ఎప్పుడొచ్చాడు...."

"ఆ నస...మాలిక్, సానియా ఇంటికి, జెట్ ఎయిర్ వేస్ లో RAC సీటు కన్ఫర్మ్ కాకపోతే కింగ్ ఫిషర్ విమానంలో వచ్చాడు..ఆ విమానంలో ఎయిర్ హోస్టస్ ఎవరో తనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదంట...కనీసం నవ్వనైనా నవ్వలేదట...దానికి మాలిక్ హర్ట్ అయ్యి, ఆ విషయం వెంటనే సానియాతో చెబుదామని అర్ధరాత్రే వాళ్ళింటికి వచ్చేసాడు....అయితే ఆ టైంలో సానియా వీడియో గేం ఆడుతుండటంతో తనని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక రాత్రంతా మంచులో, చెవిలో దూది కూడా పెట్టుకోకుండా వాళ్ళింటి అరుగుమీదే పడుకున్నాడంట..." తను అల్లిన మొదటి కల్పిత వాక్యాలను మురిసిపోతూ చెప్పాడు..సార్ధక నామదేయుడు కల్పిత్

"ఓ అలాగా...సరేకానీ మాలిక్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నాడు వీడియోలో..ఏంటి విషయం..." కోటు సర్దుకుంటూ అడిగింది నస..

"మాలిక్ చాలా డిస్టర్బ్ డ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు...పొద్దున్న సానియా ఇంటిలో తనకు కబాబ్ లు చేసి పెట్టలేదని చాలా ఫీలయినట్టు వీడియో ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నది...ఆ విషయాన్ని పాకిస్తాన్లో ఉన్న వాళ్ళమ్మతో చెప్పుకుంటున్నాడు.."

ఇంతలో నస కళ్ళు వీడియోలో సానియా ఇంటి మీద వాలిన కాకి మీద పడింది...ఇంకేం నస కి స్పాంటేనియస్ గా కొశ్చన్ ఫ్రేం చేసుకోడానికి క్లూ దొరికినందుకు ఎగిరి గెంతినంత పని చెయ్యబోయి లైవ్ షో అని గుర్తొచ్చి మళ్ళీ కోటు సర్దుకుని

"కల్పిత్..వ్యవహారం చూస్తే మాలిక్..అదే అల్లుడు (అప్పుడే సానియాకి మొగుడ్ని..వాళ్ళమ్మ నాన్నకి అల్లుడిని చేసి పడేసింది న్యూస్ రీడర్)..ఇంటికి వచ్చినందున సానియా ఇంటిలో వంటలు ఎలాంటివి వండుతున్నారు..హైదరాబాదీ బిర్యాని అంటే మాలిక్ కి చాలా ఇష్టం కదా(ఈవిడితో సొయంగా చెప్పినట్టు)..మరి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.."

కల్పిత్ దృష్టి కూడా వీడియోలో ఉన్న కాకి పై పడినట్టుంది..

"నస..నేను కూడా ఇప్పుడు దాని గురించే చెప్పబోతున్నాను...ఇప్పుడు నువ్వు ఈ వీడియోలో చూసినట్టయితే సానియా ఇంటి మీద అరగంట క్రితం ఒక కాకి మాత్రమే వాలింది..ఇప్పుడు చూస్తే ఒకటికి పది కాకులు అయ్యాయి..అంటే ఆ ఇంట్లో కొత్తల్లుడుకు హైదరాబాదీ బిర్యాని చేస్తున్నారనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు...బిర్యానీ వాసనకే కాకులన్నీ మూకుమ్మడిగా వాలాయి.... మాలిక్ కి కూడా సెల్లో మాట్లాడుతూ బిర్యాని వాసన తగలటంతో టెంప్టేషన్ ఆపుకోలేక అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ విషయం కూడా వీడియోలో మనం చూడొచ్చు...."

తన స్పాంటేనియస్ కొశ్చన్ కి కత్తిలాంటి జవాబు ఇచ్చిన కల్పిత్ తెగ ముద్దొచ్చేశాడు నసకి....అనుకున్నంత పనీ చేద్దామనుకుంది..కానీ మళ్ళీ లైవ్ షో అని తెలిసి ఏమీ చెయ్యలేక కోటు జేబులో చెయ్యి పెట్టి వేయించిన అప్పడాలను టప టపా సౌండ్ వచ్చినట్టు నలిపింది..నస లైవ్ షో ఎప్పుడు చేసినా ఓ రెండు మూడు అప్పడాలు జేబులో పెట్టుకుని వస్తుంది...తను చెయ్యాలనుకుంది చెయ్యలేనప్పుడు ఇలా అప్పడాలను సింగిల్ హేండ్ తో, సింగిల్ జేబులో పిండి పిండి చేసేస్తుంది...

లైవ్ ప్రోగ్రాముల్లో తను చెయ్యగలిగింది ఒక్కటే..కోటు సర్దుకుని..మధ్య మద్యలో అప్పడాలు చిదుముతూ నోటికొచ్చిన ప్రశ్నలు మాట్లాడటం అని నసకి గుర్తొచ్చి కోటు సర్దుకుని మళ్ళీ కల్పిత్ ను ప్రశ్న అడిగింది...

"మరి ఆ ఇంకో వీడియోలో సానియా తల్లి ఆమెను గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతుంది కదా...దాని సంగతేంటీ..నాకెందుకో సానియా మాలిక్ నే చేసుకుంటాను అని తల్లితో అన్నట్టుంది...వాళ్ళమ్మ మా బంగారం కదూ... వాడు వద్దమ్మా...వాడికంటే ఒసామ బిన్ లాడెన్ ఎర్రగా బుర్రగా ఉంటాడు..అతనే బెటర్ అని బ్రతిమిలాడుతుంది కదూ..."

"నస..నేను కూడా అదే అనుకున్నాను... కానీ విషయం అది కాదు..నువ్వు పొరబడ్డావు...సానియా ఇంట్లో హైదరాబాదీ బిర్యానీ చేస్తున్నారని ఇందాకే మనకు తెలిసింది కదా..( వీడప్పుడే బిర్యానీ కాన్సేప్ట్ ని కన్ఫర్మ్ చేసి పడేసాడు)....వాళ్ళమ్మ సానియాతో బిర్యానీకి కావలసిన మసాలాను రోట్లో నూరమంటుంది..సానియా ఏమో నా వల్ల కాదు...నువ్వెన్ని చెప్పినా నేను కనీసం బిర్యానీకి ఉల్లిపాయలు తొక్కలు కూడా తియ్యను అని అంటుంది...అంతే..."

బ్రేక్ ఇవ్వాలని కెమెరామెన్ సైగ చేయటంతో నస కెమెరా వైపు చూసి..."సానియా ఇంట..మాలిక్ అంట..బిర్యానీ వంట" లైవ్ కార్యక్రమాన్ని బ్రేక్ తర్వాత చూస్తారు...అంత వరకూ స్టే ట్యూన్ టు 'నివారన్ 99'

ఓ రెండు నిమిషాలు నివారణ్ 99 చానల్ కు సంభందించి ఓ ప్రకటన వచ్చింది...

టింగ్..టింగ్..టింగ్...

'మీలో విషయం ఏమీ లేకపోయినా గల గలా ఓ అంశం పై మాట్లాడే టాలెంట్ ఉందా....బాంబు దాడులు, ఏసిడ్ దాడి వంటివి జరిగినప్పుడు సమయానికి ఎటువంటి వీడియో క్లిప్పింగులు అందుబాటులో లేకపోయినా ఏం జరుగుతుందో ఊహించగలిగే అపరిమిత ఊహాశక్తి ఉందా...అయితే మిమ్మల్ని మా నివారణ్ 99 సాదరంగా ఆహ్వానిస్తుంది...రిపోర్టర్లుగా, న్యూస్ రీడర్లుగా చేస్తాం రండి...మన అతీతమైన ఊహాశక్తితో నవ సమాజాన్ని నిర్మిద్దాం రండి'

టింగ్..టింగ్..టింగ్...

ప్రకటన అయిపోగానే నస మళ్ళీ టీవీ తెర మీద కనపడింది...

"వెల్కం బేక్ టు...'సానియా ఇంట..మాలిక్ అంట..బిర్యానీ వంట' లైవ్ షో....."

"ఇంకేమైనా క్లూ దొరికిందా కల్పిత్ అక్కడ... ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటి....?"

............

"హలో..హలో...కల్పిత్...ఉన్నావా...అక్కడ తాజా పరిస్థితి చెప్పు.." ఈ సారి కొంచెం బిగ్గరగా అడిగింది నస....

............

"ఏదో టెక్నికల్ ప్రోబ్లం వచ్చినట్టుంది...ఇంతలో మీకు ఎస్సెమ్మెస్ ప్రష్న అడుగుతాను...చెప్పండి...నా ప్రష్న...సానియా ఇంటికి మాలిక్ ఎందుకొచ్చాడు? ఏ) బిర్యానీ కోసం బి) ఎయిర్ హోస్టస్ హర్ట్ చేసినందుకు సి) ఊసుపోక.. నా ఈ ప్రష్నకు మీ అనుమానాన్ని 116 నంబర్కు ఎసెమెస్ చేయండి.." అని లక్ష్మీ టాక్ షో మంచు లక్ష్మి అడిగినట్టు అడిగింది....

కల్పిత్ ఇంకా లైన్లోకి రాకపోవటంతో మళ్ళీ బ్రేక్ అని చెప్పేసింది నస...

బ్రేక్ సాగుతుండంగా కల్పిత్ లైన్లోకి వచ్చాడు...

"ఎక్కడికెళ్ళావ్ నువ్వు...ఏం మాట్లాడాలో తెలియక బ్రేక్ ఇచ్చాను..అసలు నీకు బుద్దుందా..ఇలా లైవ్లో నుండీ సడన్ గా వెళ్ళిపోతే నా గతేం కానూ.." కస్సుబుస్సు మని ఎగిరింది నస కల్పిత్ పై....

"అరె..కూల్ బాబా...నాకు తెలుసు నీ పరిస్థితి..ఇక్కడ నా పరిస్థితి కూడా అలానే ఉంది...అందుకనే జనాల్లోకి వెళ్ళి సానియా మాలిక్ ను పెళ్ళి చేసుకుంటుందా లేక బిర్యాని పెట్టేసి పంపించేస్తుందా అని అడిగి అభిప్రాయం తీసుకున్నాను....ఓ నలగురు అభిప్రాయం లైవ్లో చూపిస్తే మన టైం గడుస్తుంది కదా.." విషయం చెప్పాడు కల్పిత్..

"అయితే మటుకు ఇంత లేటా..." ఇంకా కోపం చల్లరలేదు నసకు..

"నీకలాగే ఉంటుందమ్మా...నీకేం పోయింది..ఎర్రకోటు వేసుకుని..మద్య మద్యలో అప్పడం చిదుముకుంటూ నోటికొచ్చిన ప్రశ్నలు అడుగుతావు..ఇక్కడ నేను ఎంత కష్టపడీ ఈ బైట్స్ చేశానో తెలుసా...ఒక్కొక్కల్లకు నూట ఏభై రూపాయలు దొబ్బెట్టి, ఏం మాట్లాడాలో నేనే చెప్పి వీడియో తీశాను..తెలుసా...."

బ్రేక్ అయిపోవటంతో కల్పిత్ ఇచ్చిన జనాల అభిప్రాయల వీడియోను ప్లే చెయ్యబోతూ "ఇప్పుడు ఈ విషయం గురించి జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాం..." అని చెప్పేసి వీడియో ప్లే చేసింది నస....

ఎర్రమ్మ ఇలా అంది...

'సానియా ఇలా దొంగతనంగా మాలిక్ కు బిర్యానీ వండటం ఏం బాలేదు..అయినా ఓ భారతీయురాలయ్యుండి ఓ పాకిస్తానీకి ఇలా బిర్యానీ ఎలా వండి పెడుతుంది? ఇది ముమ్మాటికీ దేశ ద్రోహం కిందే లెక్క...నేను సానియాను క్షమించను...'

యాద్గిరి ఇలా అన్నాడు...

'సానియా గిట్లా సేయడం మంచిగా లే...ఆడ ఆల్లింట్లో వాలిన కాకులకు కూడా బిర్యానీ ఎట్టకుండా గా మాలిక్ గాడికి ఎట్టడం సానా అన్నాయం...గిట్లనే సేస్తే పరేషాన్ కాకుండా ఏట్టా ఉంటాం....గీ విషయంలో సానియా పోరగాళ్ళ నుండి పెద్దోల్ల దాక అందర్కీ చెమాపణ చెప్పాలే....'

వేలిముద్ర పుల్లమ్మ ఇలా అంది...

'అయినా మన ఇండియాలో కోట్లమంది కుర్రాళ్ళు బిర్యానీ తినేటోళ్ళూ ఉంటే ఆయమ్మ మాలిక్ కే ఇవ్వటం క్షమించరాని నేరం..ఘోరం...ఇలాంటి నేరం చేసినందుకు ఇకపై సానీయాకి ఇండియాలో బిర్యానీ వండే హక్కుని తొలగించాలి...'

ఇంతలో 'బ్రేకింగ్ న్యూస్' బాబూ రావ్ మళ్ళీ పరుగు పరుగున వచ్చి లైవ్ షో ఆపేయమని చెప్పటంతో నస షో ని ఆపేసింది...

"ఏమయ్యింది సార్..."

"ఏం లేదమ్మా...ఇప్పుడు మనకు లైవ్లో చెప్పడానికి ఇంకో హాట్ న్యూస్ దొరికింది...ఆ వైజాగ్ లో ఎవడో జమిందారు పనిమనిషిని మోసం చేసాడంట...ఆ అమ్మాయి జమిందారుని బండ బూతులు తిట్టడానికి రెడీగా ఉండటంతో మనవాళ్ళు ఒక్క బూతూ మిస్ కాకుండా కవర్ చేశారు...మిగిలిన బూతులు లైవ్లో నే తిట్టమని చెప్పాము..అప్పుడే లైవ్ ప్రోగ్రాం లైవ్లీగా ఉంటుంది కదా.... నువ్వెలాగూ ఓ మూడు నిమిషాల సానియా క్లిప్పింగ్ తో మూడున్నర గంటలు ఎంగేజ్ చేసావ్....ఇప్పుడు కాంచనమాల ఈ హాట్ న్యూస్ చెప్పడానికి సిద్దంగా ఉంది...లేటైతే మిగిలిన చానళ్ళ వాళ్ళు మనకంటే ముందు చూపించేస్తారు ఆ బూతులన్నీ...." అని అసలు విషయం చెప్పాడు చానల్ హెడ్...


న్యూస్ రీడర్ నస న్యూస్ రూం నుండి, సానియా ఇంటి ముందున్న రిపోర్టర్ కల్పిత్ స్టూడియోకి తిరిగి వచ్చేశారు... ఎప్పటిలాగే ఒకరి తల్లో మరొకరు మళ్ళీ పేలు తీసుకోడానికి వాళ్ళ స్టాఫ్ రూంలోకి నడిచారు..


*********


PS : శని వారం రోజు టీవీలో ఓ చానల్ వాళ్ళు మాలిక్ సానియా ఇంటికి వచ్చిన ఓ అర నిమిషం క్లిప్పింగులు రెండింటిని పట్టుకుని, పదే పదే అవే ప్లే చేస్తూ దానికి కొంత పైత్యపు వ్యాఖ్యానలు జోడించి షో ని నడిపించారు...కొద్ది సేపు తర్వాత మిగిలిన చానల్లు కూడా అదే బాట నడిచాయి... నా గ్రహాలు ఒకదాన్ని ఇంకోటీ కొట్టుకోవటంతో నా టైం బాలేక నేను దాన్ని కొద్ది సేపు చూడాల్సి వచ్చింది...అప్పుడు కలిగిన మంటకు నా అవుట్ లెట్ ఈ టపా....

20, మార్చి 2010, శనివారం

బుల్లి పిచ్చుక

అవి చుట్టు పక్కల ఎక్కడైనా గుంపులు గుంపులుగా కిచ కిచ మని అరిస్తే, వాటిని చూసినప్పుడల్లా కనీసం ఒక్కటైనా నాకు మచ్చికయితే ఎంత బావుణ్ణో అని మనసులో అనుకోని సంధర్బం బహుశా నాకు తెలిసి లేదేమో! అంతిష్టం అవంటే...అంత కలర్ ఫుల్ గా లేక పోయినా వాటి అమాయక చూపులు, కరెంట్ తీగల మీదో లేకపోతే బట్టలు ఆరేసుకునే తాళ్ళ మీదో వాటి గొడవలు, చిట్టి రొమాన్స్...వాటిల్లో అవి చేసుకునే స్నేహాలు...ఇవన్నీ నాకు భలే నచ్చేవి. ఎప్పుడైనా వాటిల్లో కనీసం ఒక్కదాన్ని నా చేతిల్లోకి తీసుకుని ప్రేమగా ఓ సారి దాని రెక్కలు నిమిరి, ఓ గుప్పెడు వడ్ల గింజలు దాని నోటికి అందించకపోతానా అన్న ఆశతో కాలం వెళ్ళదీస్తున్న రోజులవి. అవే చిట్టి పొట్టి పిచ్చుకలు...

ఓ సారి మేము ఇళ్ళు మారే క్రమంలో కొత్త ఇంటిలోకి వచ్చాము. ఆ ఇళ్ళు ఇది వరకటి ఇంటితో పోల్చితే ఏరుకు దగ్గరగా ఉండేది. చుట్టూ కొంత దూరం వరకు ఇంకే ఇళ్ళూ ఉండేవి కాదు. అక్కడ మా బెడ్ రూంలో వెంటిలేటర్లు మూడు వైపులా ఉండేవి. వెలుతురు, ఎండ ఎక్కువగా ప్రసరిస్తున్నందున, మా ఇంటి ఓనరు గారు ఏరువైపు తెరుచుకునున్న వెంటిలేటర్ను ఓ రేకు ముక్కతో గోడకు అవతలవైపు మూయించేశారు. బెడ్ రూం లోపల నుండి చూసినప్పుడు ఆ వెంటిలేటర్ ఒక గూటిలాగ తయారైంది.

ఓ వేసవి మధ్యాహ్నం, ఎండలో తిరిగి ఆడుతామని, తలుపుకు పైన గడియ పెట్టేసి, పెద్దక్క బలవంతంగా నన్ను పడుకోబెట్టడానికి ప్రయత్నించింది. ఆ గడియ నాకు అందదు కనుక ఇక పడుకోక తప్పేట్టు లేదని అలా అటూ ఇటూ మంచంపై దొర్లుతున్నాను. ఇంతలో ఓ తెరిచిన కిటికీ తలుపుపై ఓ పిచ్చుక, నోటితో చిన్న గడ్డి పరక పట్టుకుని, అటూ ఇటూ చూస్తూ, మద్య మద్యలో కిచ్ కిచ్ మంటూ, ఎవ్వరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాక సరాసరి మా వెంటిలేటర్లోకి దూరింది. వెంటనే కళ్ళని పావు వంతు మాత్రమే తెరచి, పడుకున్నట్టు నటిస్తూ అటువైపే చూస్తున్నాను. పిచ్చుక గడ్డిపరకని లోపల పేర్చేసి బయటకు వచ్చింది.. మళ్ళీ కిటికీ మీద కూర్చొంది..ఇంతలో ఇంకో పిచ్చుక కిచ్ కిచ్ మంటూ సన్నటి గుడ్డపీలికలను నోటితో పట్టుకుని సరాసరి వెంటిలేటర్లోకి దూరింది. పిచ్చుక అక్కడ గూడు పెడుతుందని నాకు తెలియడానికి అట్టే సమయం పట్టలేదు.

పక్కింట్లో ఉండే ప్రసాద్ గాడికి ఈ విషయం చెప్పాను. వాడు "ఒరేయ్...ఆ పిచ్చుక పిల్లల్లో నా కొకటి...నీ కొకటి...ఇద్దరం పెంచుకుందామే.." అన్నాడు. రోజు రోజుకు ఆ గూడు సైజు పెరుగుతూనే ఉంది. ఇంకా ఇంకా ఏవో పుల్లలు, కొబ్బరి పీచు, దూది పింజలు ఆ రెండు పిచ్చుకలు నోటకరచుకుని గూటిలోకి దూరి వదిలేసి వస్తూనే ఉన్నాయి. నాకేమో అవి ఎప్పుడు పిల్లలు పెడతాయో, ఆ పిల్లలు ఎప్పుడు పెద్దవవుతాయో, వాటిని నేను ఎప్పుడు చేత్తో పట్టుకుంటానో అని ఒకటే ఆశగా ఉండేది.

ప్రసాద్ వాళ్ళమ్మ మా ఇంట్లో అమ్మతో మాట్లాడుతూ ఉండగా, పిచ్చుకలు పుల్లలతో వెంటిలేటర్ లోకి దూరటం గమనించినట్టుంది. పిచ్చుకలు అలా ఇళ్ళల్లో గూళ్ళు కట్టడం అంత మంచిది కాదని, అందులో పిచ్చుక గుడ్లు పెట్టక ముందే తీసేస్తేసరి అని అమ్మతో అంది. అసలే ఇలాంటి విషయాల్లో రెండో ఆలోచనకు తావివ్వని అమ్మ ఆ గూడును తీసేద్దామని చీపురు పట్టుకుంది. వెంటనే నేను అమ్మతో అందులో పిల్లలు ఉన్నాయని, వాటి అరుపులు కూడా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయని అబద్దం చెప్పేసి బేర్ మని ఏడవటం మొదలుపెట్టాను. ఇంక అమ్మకి కూడా గూడు తీయడానికి మనసొప్పినట్టు లేదు. చీపురుని కింద పడేసింది. హమ్మయ్య అని అనుకొన్నాను.

ఓ రోజు నేను టిఫిన్ తింటుండగా ఆడ పిచ్చుక నోటితోని ఓ పురుగుని పట్టుకుని గూటిలోకి దూరింది. అది అలా దూరగానే నిజంగానే కిచకిచమని చిన్న చిన్న అరుపులు వినపడ్డాయి. పిచ్చుక గుడ్లు పొదిగిందని అర్దమై, వెంటనే ఈ విషయం ప్రసాద్ గాడితో చెప్పాలని టిఫిన్ టేబుల్ మీద పడేసి పరిగెత్తాను. "ఒరేయ్..పిచ్చుకను పట్టుకోడానికి పెద్ద కష్టం పడకుండానే మనకు త్వరలో దొరకబోతోందిరా..." అని అన్నాడు వాడు. పిచ్చుకను పట్టుకున్నాక దాన్ని పెట్టడానికి అట్టముక్కలతో చిన్న ఇల్లు కూడా సిద్దం చేసేసాను నేను. ఇంక అది పెద్దదవ్వటమే ఆలస్యం..

ఓ రాత్రి గూడులో పిల్లలు ఎలా ఉన్నాయో చూడాలనిపించింది. ఒకటి రెండు సార్లు కిటికీ దగ్గర నిలబడి 'హుష్..హుష్' అని అన్నాను..ఒకవేళ పెద్ద పిచ్చుక అందులో ఉంటే పిల్లను తీసి చూడటం కుదరదు కదా...అందుకన్నమాట...ఆ పాటికే పెద్ద పిచ్చుక ఉంటే బయటకు వచ్చేసేది...రాలేదంటే లేదని అనుకుని, ఓ పొడుగాటి స్టూల్ కిటికీ దగ్గర వేసుకుని, నెమ్మదిగా గూటిలోకి చెయ్యి పెట్టాను...ఏదో మాంసం ముద్దలాగ చెయ్యికి తగిలింది...కొంచెం అదోలా అనిపించింది...అయినా ఆత్రుత ఆపుకోలేక దాన్ని బయటకు తీసాను...ఈకలు లేకుండా ఒట్టి చర్మంతో, మూతికి ఇరువైపులా పసుపురంగుతో వికృతంగా కనిపించింది. నేను దాని మూతి దగ్గర వేలితో తాకితే తల్లి ఆహారం ఏదో పెడుతుందనుకొని పెద్దగా నోరు తెరిచి, కిచ్..కిచ్..మంది. కొంచెం భయమేసి గూటిలో పెట్టేసాను. అప్పుడే తెలిసింది పుట్టిన వెంటనే పక్షికి ఈకలు ఉండవని....పిచ్చుక పిల్లలు కొంచెం పెద్దవవుతున్న కొద్దీ అవి ఒకదాన్ని ఇంకోటి తోసుకుని గూటిలోంచి బయటకు చూసేవి. ముద్దు ముద్దుగా భలే కనిపించేవి నాకు.

కొద్దిరోజులు తర్వాత వాటికి కొంచెం ఎగరగలిగే శక్తి రావటం వల్ల గూడు వదిలి బయటకు వచ్చేసాయి. కొన్ని ఏటో వెళ్ళిపోయాయి. ఇదే సరైన సమయం పిచ్చుకను పట్టుకోడానికి అని గూటిలో చెయ్యి పెడదామని అనుకుంటుండగా, మా టీ.వి స్టాండు వెనుక సరిగ్గా ఎగరటం చేతగాని ఓ పిల్ల కనిపించింది. వాళ్ళమ్మ అక్కడికే దానికి ఆహారం తెచ్చి నోట్లో పెడుతుంది. అదేమో వాళ్ళమ్మ ఎగిరిపోతున్నప్పుడు దాని వెనకే ఎగరడానికి ప్రయత్నిస్తుంది. ఇంక దాన్ని అలాగే వదిలేస్తే ఎగిరిపోతుందని పట్టుకోబోయాను. అది కప్పగెంతులు వేసుకుంటూ నడిచి, కొద్ది దూరం ఎగిరింది. ఇలా లాభం లేదని ప్రసాద్ గాడిని పిలిచాను. వాడు పిచ్చుకని అటువైపు కాపు కాస్తే నేను ఇటువైపు నుండి దాని పట్టుకోగలిగాను. ఇంకో పిచ్చుక పిల్ల ప్రసాద్ గాడి కోసమని నేను ఆ రాత్రి గూటిలో చెయ్యి పెడితే ఒక్కటి కూడా లేదు.

నా కల నిజమైన రోజు వచ్చేసిందని గొప్ప ఆనందం వేసింది. నేను దాన్ని ఇదివరకు తయారు చేసిన అట్ట ఇంట్లో ఉంచాను. నాకు పక్షులంటే పిచ్చి అని అక్క వాళ్ళకి తెలీటంతో చూసి చూడనట్టు వదిలేసారు..అమ్మ మాత్రం "పాపం రా..అలా పట్టుకోకూడదు" అనేది. నేను మాత్రం కొద్దిరోజుల తర్వాత దాన్ని వదిలేస్తాను అని చెప్పటంతో అమ్మ ఒప్పుకుంది. కొద్ది రోజులు పెద్ద పిచ్చుక అట్ట ఇంటి బయటనుండే దానికి ఆహారం తినిపించేది. తర్వాత అది పెద్దది అవ్వటం వల్లనేమో తల్లి రావటం మానేసింది. పిచ్చుక పిల్ల బాగా పెద్దది అయ్యింది. రెక్కలు బాగా ఎదిగాయి. దాని మూతికి ఇరువైపులా పసుపు రంగు కొంచెం మిగిలేఉంది. రోజూ దాన్ని చేతిలోకి తీసుకుని, వడ్ల గింజలు నోటికి అందించేవాళ్ళం...నేనూ ప్రసాద్ గాడూనూ...

ఓ సారి సడన్ గా తల్లి పిచ్చుక, తండ్రి పిచ్చుక నా అట్ట ఇంటి చుట్టూ ప్రదక్షణ చేయటం మొదలు పెట్టాయి...అవి కిచ కిచ మని అరిస్తే ఇది కూడా లోపలి నుండి అరిచేది. ఎందుకో జాలేసింది..ప్రసాద్ గాడితో వదిలేద్దాం రా దాన్ని అన్నాను. వెంటనే దాన్ని బయటకు తీసి అరుగుమీద పెట్టాను. ఎగరటం నేర్చుకుంటున్న దశలో మేము పట్టుకోవటం వల్లనేమో అది అటూ ఇటూ చూసింది గానీ ఎగరలేదు. మేమిద్దరం కొంచెం దూరం నుండి దాన్ని చూస్తునే ఉన్నాం. ఇంతలో పెద్ద పిచ్చుకలు రెండూ దాని దగ్గరకు వచ్చాయి. పిల్ల పిచ్చుక దాని రెక్కలు కొంచెం ఉబ్బినట్టుపెట్టి వాటి దగ్గర తెగ గారాలు పోయింది. కొంచెం సేపు మూడు కలిసి కుచ్..కుచ్ అని అరిచాయి. మొదట మగ పిచ్చుక ఎగిరింది..దాని వెనుక తల్లి పిచ్చుక ఎగిరింది...ఆ వెంటనే పిల్ల పిచ్చుక వాటిని అనుసరిస్తూ ఎగిరిపోయింది.***********


PS: ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం...పాపం..అమాయకమైన ఈ పక్షులు ఇప్పుడు అంతరిస్తున్న పక్షుల జాబితాలోకి చేరిపోయాయట....ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఇవి ఇప్పుడు మాత్రం తమ ఉనికేనే కోల్పోబోతున్నాయట...ఇవన్నీ చదవగానే ఒక్కసారి ఆ బుల్లి పిచ్చుకతో నా అనుభందం గుర్తొచ్చి ఇలా టపా అయింది. ఆ బుల్లి పక్షుల జీవనంలో మళ్ళీ పూర్వ వైభవం రావాలని ఆకాంక్షిద్దాం.

13, ఫిబ్రవరి 2010, శనివారం

నేను నా కార్టూన్ సీరియల్స్....

తొమ్మిదేళ్ళ వయసప్పుడు కార్టూన్ సీరియల్లు వస్తున్నాయంటే మేము తప్పకుండా చూసి తీరాల్సిందే! ఇప్పటిలా బోల్డన్ని చానల్లు లేనందువల్ల దూరదర్శన్(నేషనల్) వాడు ఒక్క ఆదివారం మాత్రమే ఇచ్చే మోగ్లీ 'Jungle Book', అంకుల్ స్క్రూచ్ ఉండే 'Duck Tales', 'Ales in Wonderland' మొదలైన కార్టూన్లు రెప్పార్పకుండా చూసేవాళ్ళం. ఒక్క చూడ్డమే కాదండోయ్ 'జంగల్ జంగల్ బాత్ చలీహై పతా చలాహై...అరె చడ్డీ పెహన్ కె ఫూల్ కిలాహై..ఫూల్ కిలాహై...' అంటూ పాడుకుంటూ జారిపోతున్న చెడ్డీని ఎత్తుకుంటూ మోగ్లీగాడి boomrang లా వీ షేప్ లో ఉన్న కర్ర ముక్కతో అచ్చం వాడిలాగే పరిగెత్తిన సందర్భాలు కోకొల్లలు. కాస్త చిన్న పిల్లలు చెడ్డీకూడా వేసుకోకుండా మమ్మల్ని ఫాలో అయిపోయేవారు. అయితే ఈ కార్టూన్లన్నీ ఇంగ్లీష్ లోనో, హిందీలోనో వచ్చేవి. చిన్న ఊళ్ళల్లో దుంపలబడి చదువులు వెలగబెడుతున్న వాళ్ళకు అవి ఎంత అర్ధం అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.అయినా సరే కార్టూన్ కారెక్టర్ల కదలికలు బట్టి అక్కడ ఏం జరుగుతుందో అలవోకగా పట్టేసి అర్ధం చేసుకునేవాళ్ళం. ఒకవేళ అర్ధం కాకపోతే సొంతంగా కధ అల్లుకునో, ట్రాజెడీ సీన్ వస్తున్నప్పుడు పకపకా నవ్వేసో ఫాలో అయిపోయేవాళ్ళం. ఓ సారి దూరదర్శన్(hyd) వాడికి పందుల కార్యక్రమం ప్రసారం చేయటంలో ఎక్కువ శ్రద్ద పెట్టడంతో సడన్ గా మెదడువాపు వ్యాధి వచ్చింది. దాని ఫలితంగా జంగిల్ బుక్ తెలుగులో ప్రసారం చేయాలన్న కోరిక కలిగింది. అప్పటి వరకూ దూరదర్శన్ అంటే బ్లాక్ అండ్ వైట్ పాటలు, మొహానికి సున్నం పూసుకుని తలపై పిచిగ్గూడు మెయింటెయిన్ చేసే యాంకర్లు(eg: రోజా రమణి ఆంటీ, విజయ దుర్గ ఆంటీ), చీనీ నిమ్మతోటలు అని అనుకుంటుండే మాకు జంగిల్ బుక్ కార్టూన్ తెలుగులో చూసే సరికి దూరదర్శన్ వాడికి ఓ కర్పూరం వెలిగించి పూజించాలన్నంత ఆనందం కలిగింది.

చెడ్డీ వేసుకునే రోజులనుండి ప్యాంట్ వేసుకునే రోజులు వచ్చాయి. అప్పుడు కార్టూన్లకు బ్రహ్మరధం పట్టిన రోజులు పోయి స్టార్ మూవీస్ చూసే రోజులు మొదలయ్యాయి. ఆ టైంలో పెద్దగా ఫాలో అయిన కార్టూన్లు కూడా లేవు. కొద్ది రోజులు మాత్రం పుస్తకాల అట్టలపై మాత్రం కార్టూన్ కారెక్టర్ల లేబుళ్ళు అతికించేవాళ్ళం. ఓ సారి ఎంసెట్ ఎగ్జామ్ రాయటం కోసం మా అమ్మమ్మ వాళ్ళూరు వెళ్ళినప్పుడు 'బాబోయ్ డెన్నిస్' అనే కార్టూన్ చూస్తుంటే "ఇంకా చిన్న పిల్లడివి అనుకుంటున్నావా" అంటూ నా మనోభావాలు ఆవిడ గాయపరిచేసరికి కార్టూన్ ఫిల్ములు చూడటం చిన్నతనం కాబోలు అనుకుని ఎప్పటికీ వాటిని చూడకూడదనుకున్నాను. కార్టూన్లు చూడటంలో నేను మళ్ళీ నా పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటానని అప్పుడు నాకు తెలీదు.

అసలు కార్టూన్ ఫిల్మ్ వస్తుంటే టీ.వీకి అతుక్కుని చూడని పిల్లలు చాలా అరుదుగా ఉంటారు. అయితే పిల్లలతో పాటు పెద్దలు కూడా చూస్తూ ఆనందిస్తూ టీ.వికి అతుక్కునేలా చేసే ఒక కార్టూన్ ప్రోగ్రాం ఉందని ఓ సంవత్సరం క్రిందట తెలిసింది. అదే టామ్ అండ్ జెర్రీ. ఈ కార్టూన్ ఒకటుందని నాకు ఇదివరకే తెలిసినా కుటుంబ సమేతంగా చూసుకోదగ్గది అన్న విషయం కొంచెం లేటుగా తెలిసింది. ఒక చిన్న ఎలక మరియు పిల్లి మధ్య జరిగే గొడవలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లు, అల్లర్లు...ఇలా కొన్ని అంశాలను తీసుకుని వాటి మధ్య ఓ చిన్న చిన్న స్టోరీలను అల్లి తయారు చేసిన బుల్లి బుల్లి కార్టూన్ ఫిల్మ్స్.

ఓ సారి మాటల మద్యలో నా కొలీగ్ Tom n Jerry కార్టూన్ ఇప్పటికీ చూస్తానని చెప్పినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా చూడాలనిపించినా ఎవరైనా మా అమ్మమ్మలాగ అంటారేమోనని భయం నాకు. అలాంటిది వాడికి ఎవరూ ఏమీ అనరా అని ఆశ్చర్యం అన్నమాట. ఆ తర్వాత నా ఫ్లాష్ బాక్ ఒక్కసారి గుర్తొచ్చి Tom n Jerry కొన్ని ఎపిసోడ్లు డౌన్లోడ్ చేసుకుని చూసాను. ఎందుకో తెలీదు నేను ఈ కార్టూన్ని చిన్నప్పుడు చూడటం మిస్సయాను. బహుశా ఇంట్లో టీ.వీ ఎప్పుడు పడితే అప్పుడు చూసే వీలులేనందువల్ల కావచ్చు. ఇప్పుడు నేను ఆ కార్టూన్ అంటే పడిచచ్చేటైపు. మా ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ టైంలో టీ.వీ చానల్ మార్చుతున్నప్పుడు Tom n Jerry గానీ కార్టూన్ నెట్ వర్క్ చానల్లో వస్తే ఇంక దాన్నే ఉంచేసి ధైర్యంగా చూసేస్తాను. ఆ టైంలో నాతోపాటు ఇంచుమించు అక్కడున్న ప్రతీఒక్కరూ దాన్ని చూడటానికి ఇష్టపడేవారే.

టామ్ మరియు జెర్రీ ఇద్దరూ స్నేహితులే. కాకపోతే టామ్ చేసే ప్రతీ పనికి అడ్డం తగులుతూ దానికి కోపం తెప్పించి తనతో పోట్లాట పెట్టుకునేలా చేస్తుంది జెర్రీ..అదే విధంగా జెర్రీ విషయంలో కూడా టామ్ ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇంకేం ఇద్దరూ కొట్టుకునే సన్నివేశాలు క్రియేట్ అయ్యి మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఒక్క కొట్లాటలే కాదు...అవి చేసే తిక్క పనులు, తింగరి వేషాలు చూస్తే ఎవ్వరైనా నవ్వితీరాల్సిందే.

రెండు ప్రధాన కారెక్టర్లతో మాటలు వీలయినంత తక్కువగా పెట్టి చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా అర్ధమైయ్యేలా చూపటం ఈ కార్టూన్ ఫిల్మ్ ప్రత్యేకత. ఒకళ్ళు చెప్పేకంటే చూస్తేనే దీని మజా తెలుస్తుంది. ఇప్పటికే దీన్ని చూసినవాళ్ళకు ఆ విషయం తెలిసే ఉంటుంది.

ఈ వయసులో కార్టూన్ ఫిల్మ్ ఏం చూస్తాం అని అనుకోకండి. కూసింత పెద్దరికాన్ని గోద్రేజ్ బీరువాలో పెట్టేసి, ప్రస్తుతం మనం పెద్దవాళ్ళం అన్న విషయాన్ని మర్చిపోయి, పిల్లలుంటే వాళ్ళతో కలిసి ఎప్పుడైనా సరదాగా టామ్ అండ్ జెర్రీ చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది.