8, ఫిబ్రవరి 2009, ఆదివారం

బామ్మ సంతోషం కోసం పెళ్లి చేసుకోవాలా ?

అనీల్....తను ఎక్కడుంటే అక్కడ ఆనందం వెల్లివిరియాల్సిందే. తన స్నేహ ప్రపంచంలో ఇగోకు అస్సలు స్థానం వుండదు. అందరికిలానే నాకు కూడా తను మంచి స్నేహితుడు. బిజీ బతుకుల వల్ల నెలకు ఒక్కసారి తప్పకుండా మాట్లాడు కుంటాం. మాటల ప్రవాహంలో ఎన్నో ఉసులు, భావాలు ఒకరినుండి ఒకరికి బదిలీ అవుతుంటాయి. మొన్న వాడికి పెళ్లి కుదిరిందని చెప్పాడు. అందరిలానే నేను సంతోషించాను. అయితే సంతోషం తనలో కొంచం తక్కువగా వుందనిపించింది. మాటలు ప్రవాహం పెరుగుతూ ఉంది. దానికి అడ్డుకట్ట వేసి అసలు విషయం రాబట్టడానికి ప్రయత్నించాను.

అనీల్ మొన్ననే తన ఉద్యోగం మారాడు. అయితే కొత్త ఉద్యోగంలో కొత్త భాద్యతలు వచ్చాయి. అవి తనకి పూర్తిగా కొత్త. వాటికి తోడు పని ఒత్తిడి, చావు గీతలు సరేసరి... పరిస్థితిలో తను కొన్నాళ్ళు పనికి అలవాటు పడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని, ఇంకొద్ది రోజులు ఆఫీస్ లో సెలవు అడిగే పరిస్థితి కూడా లేదని ఇంట్లోవాళ్ళకి చెప్పేసాడు. అయితే మన వాళ్లు అర్ధంచేసుకుని కొద్దిలో కొద్దిగా సహకారం అందింద్దామనుకునేలోపే వాళ్ల చుట్టూ పని పాటలేని వాళ్లు, ఇంటివిషయాలు వదిలి పక్కింట్లో ఏమిజరుగుతుందో ఆసక్తిగా గమనించే ఔత్సాహిక అమ్మలక్కలు, పదవీ విరమణ చేసి చాదస్తాన్ని వంటబట్టించుకునే అంకుల్స్, ముఖ్యంగా రాబందుల్లా అవతలివారి మనోభావాలు పట్టించుకోకుండా మాటల తూటాలతో హృదయాన్ని చీల్చి చెండాడే బంధుగణం ఉరికే వుంటారా ? మీ వాడికి వయసుమీరుతుందేమో అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇంతమందికి సమాదానం చెప్పుకోలేని నిస్సహాయ తల్లిదండ్రులు మనోడికి తొందరగా పెళ్లి చేసేస్తే పని అయిపోతుందని ఫిక్స్ అయిపోయారు.

మనోడి పరిస్థితితో సంబంధం లేకుండా పిల్లని చూడ్డం, ఖాయం చేసుకోవడం అన్ని చక చకా జరిగిపోయాయి. తర్వాత విషయం వాడికి తెలిసింది. ఇప్పుడు నాకు పెళ్లి వద్దురో మొర్రో అన్నందుకు పెద్ద రభసే జరిగింది. పెద్దవాళ్ళ ఏడుపులు పెడబొబ్బలు సరేసరి. మొత్తానికి మా వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు. అయితే తనకి కొన్ని నెలల సమయం కావాలన్నాడు. కానీ అమ్మాయి నాన్నమ్మ వీడి పాలిట విలన్ అయింది. ఆవిడ బతికుండగా పెద్ద మనవరాలి పెళ్లి చూసేయ్యాలని కోరికంట. అందుకని త్వరగా లగ్నాలు పెట్టించారు. మా వాడి వాళ్ళమ్మ గారికి ఒక వేళ పెళ్లి వాయిదా వేసి నట్టయితే, లోపు బామ్మగారు హరీ అంటే వీళ్ళని అంటారని, పరువు ప్రతిష్టల సమస్యలోస్తాయేమో అన్న భయం. వాడికి సెలవులు కూడా కుదరవని చెప్పినా అమ్మాయి తండ్రి 'మీకు సెలవులు లేకపోతె మీ సిటీ కే వచ్చి పెళ్లి జరిపిస్తాము బాబు' అంటూ తల్లి పట్ల తన విధేయతను కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ వారి వారి కోణాలనుంచి, వారి సంతోషం, భయాలు గురించి ఆలోచించుకున్నవారే కాని ఒక్కరు కూడా వీడి గురించి ఆలోచించలేదు.

ఇదీ సంగతి.

ఇంకో నెలలో పెళ్లి అయినా మా వాడు ఇంకా తన హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోలేదు. నేను అడిగే వరకు తను అస్సలు దాని గురించే ఆలోచించ లేదట. అసలు పెళ్లి అవుతుందన్న ఆనందం మనసులో ఉప్పొంగితే కదా ఇలాంటి ఆలోచనల వైపు మనసు మళ్ళుతుంది. వాడి బుర్ర నిండా ఇప్పుడు ఒక్కటే ఆలోచన ....పని మీద మంచి గ్రిప్ తెచ్చుకొని నైటౌట్లు,ఒత్తిడి లేకుండా వుండటం.

వీడి పరిస్థితి ఇలావుంటే అక్కడ అమ్మయి పరీక్షల సమయంలో పెళ్లి జరగబోతున్నందుకు అస్సలు పెళ్లి ఆనందంతోనే లేదట. ఇక్కడ అబ్బాయికే మెడలు వంచిన వారు అమ్మాయి గురించి కొంచమైనా ఎందుకు ఆలోచిస్తారు?

అసలు పెళ్లి అంటే జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందమైన, మధురమైన ఘటన. అలాంటి పెళ్ళే ఎవరెవరి ఆనందంకోసమో, పరువు ప్రతిష్టల కోసమో చేసుకుంటుంటే మన జీవితానికి ఏమైనా అర్ధం వుంటుందా? ఉన్నా అలాంటి జీవితం మనకు సంతోషం తెచ్చి పెడుతుందా?

ఎంతమంది 'అనీల్' లు ఇలా మౌనంగా బాధపడుతున్నారో, చెప్పుకుందామన్నా అర్ధం చేసుకునేవాళ్ళు లేక గుండె గూటిలో పెల్లుబికని లావాలా వేదనను దాచుకుంటున్నారో......

మనకు చిన్నప్పుడు నచ్చిన ఆటను ఆడుకోనివ్వరు.....చదువుకున్నప్పుడు గ్రూప్ తీసుకోవాలో మనల్ని నిర్ణయించుకోనివ్వరు....ఇంజనీరింగా లేకా ఫైన్ ఆర్ట్స్ అన్నది కూడా చేతుల్లోవుండదు.....సాఫ్టవేర్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబా అన్నది కూడా మనం డేసిసన్ తీసుకోం.....చివరికి జీవితంలో ముఖ్యమైన పెళ్లి కూడా మనకు నచ్చినట్టు జరగదు.....

ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఉందంటారా?

5 కామెంట్‌లు:

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

పాపం అతని పరిస్థితి. బలవంతపు పెళ్ళిళ్ళ విషయంలో మన వాళ్ళు మారాలి. తరాలు మారుతూ ఉంటే ఈ విషయాలలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది, కాని కొద్దిగా సమయం పడుతుంది...

మధురవాణి చెప్పారు...

శేఖర్ గారు మీరు చెప్పింది అక్షర సత్యం. ఎంత చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్నా..చదువులో మీకేమన్నా ఎక్కువ తెలుసేమో కానీ.. జీవితంలో ఎన్నో అనుభవించిన వాళ్ళం.. పెళ్లి లాంటి విషయాలు మేమే సరిగ్గా చేయగలం అంటారు పెద్దోళ్ళు. బామ్మ గారి కోసం కాకపోతే.. అందరూ అడుగుతున్నరనో.. ఇంతకంటే గొప్ప సంబంధం మళ్లీ రాదనో.. కావాలంటే పెళ్లి అయ్యాక నీ ఇష్టం అనో.. ఏ రాయి అయితేనేం పళ్ళు రాలగోట్టుకోడానికి :)
అసలు పాపం పెద్దలు చూసిన పెళ్లి చేసుకునే వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే.. ఇంకా ప్రేమ పెళ్లి సంగతయితే మాట్లాడడం అనవసరమేమో :)
ఎంత గ్లోబలైజేషన్ వచ్చిన.. ఎంత అభివృద్ధి జరిగినా.. మన సమాజం (ఆంధ్ర) మాత్రం పెళ్ళిళ్ళు, కులాలు విషయంలో మారే ప్రసక్తే లేదు.

మరో మాట.. మెత్తగా ఉన్నోడిని చూస్తే మొత్తబుద్దేస్తుందంట... అన్న చందంగా.. చెప్పిన మాట బుద్దిగా వినే పిల్లల మీదే ఇంకా ఎక్కువ రుద్దేస్తుంటారు అన్నీ..తల్లిదండ్రుల ఏడుపు చూల్లేరు అనే బలహీనతని ఆధారం చేసుకుని ఎమోషనల్ బ్లాక్మైలింగ్ ప్రతీదానికి :(

Mahitha చెప్పారు...

:)

బాగా రాశారు

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@ప్రపుల్ల చంద్ర గారికి,
అలానే ఆశిద్దాం.
ధన్యవాదాలు.

@మధుర వాణి గారికి,
>>ఎంత గ్లోబలైజేషన్ వచ్చిన.. ఎంత అభివృద్ధి జరిగినా.. మన సమాజం (ఆంధ్ర) మాత్రం పెళ్ళిళ్ళు, కులాలు విషయంలో మారే ప్రసక్తే లేదు.

>>మెత్తగా ఉన్నోడిని చూస్తే మొత్తబుద్దేస్తుందంట... అన్న చందంగా.. చెప్పిన మాట బుద్దిగా వినే పిల్లల మీదే ఇంకా ఎక్కువ రుద్దేస్తుంటారు అన్నీ..

మీరు చెప్పింది నూటికి రెండొందల పాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది.
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు నెనెర్లు.

@Mahi garu,

థాంక్సండి.

మోహన చెప్పారు...

ఏం చెప్పమంటారూ? ఇలాంటి సున్నితమైన విషయాలు ఎవరినీ నొప్పించకుండా, తానూ నొచ్చుకోకుండా డీల్ చెయ్యాలంటే చాలా సంయమనం, అవతలి వారి దృష్ఠి వారి కంటే ముందుగా తెలుసుకోగల నేర్పు ఉండాలి. కానీ ఉద్యోగాలు చేసుకునే అందునా బిజీ గా ఉన్న మీ ఫ్రెండ్ లాంటి వాళ్ళకి అంత టైం ఎక్కడిది ? :(

జీవితంలో జరిగే ప్రతి దానికీ ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను. అలాగే మంచి ఆలొచించిన వారికి మంచే జరుగుతుందని కూడా నమ్ముతాను. మీ స్నేహితుడు చాలా మంచివారిలా, నెమ్మదస్తుల్లా ఉన్నారు. అతనికి అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నాను.