15, ఫిబ్రవరి 2009, ఆదివారం

బ్లాగుల చుట్టూ తిరిగే కొన్ని తెలుగు సినిమా పేర్లు, వాటి కధలు టూకీగా....

బ్లాగులు ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత, అవే తెలుగు సినిమా కి కధా వస్తువు అయితే ఎలా వుంటుందో అన్న చిలిపి ఊహకి తట్టిన ఆలోచనే టపా. ఎవ్వరినీ ఉద్దేశించి, కించ పరచాలన్న భావంతో రాసింది ఎంతమాత్రం కాదు. మరింకెందుకు ఆలస్యం చూడండి మరి...

టైటిల్ ఒకటి:

" బ్లాగానులే..! "

పదవతరగతిలో ఉండే అబ్బాయి తన క్లాస్ మేట్ ని ప్రేమిస్తాడు. అమ్మాయి మనోడ్ని తిరస్కరిస్తుంది. చదువు సంధ్యా లేని కుంక అని నానా రకాలుగా తిట్టి పోస్తుంది. మనోడు పదో తరగతి తర్వాత అమ్మాయికి మొహం కూడా చూపించడు. అమ్మాయికి ఎప్పటినుండో బ్లాగురాసే అలవాటు ఉంటుంది. అలా బ్లాగులోకంలో పరిచయాలు పెరిగి ఒకతనితో ప్రేమలో పడుతుంది. అతని రచనలంటే ఆమెకి విపరీతమైన పిచ్చి. అభిప్రాయాలు పంచుకోవడమే గాని ఒకరి నొకరు చూసుకోవటం గాని , కలుసుకోవటం గాని జరగదు. ఒక ఫైన్ డే ఇద్దరూ కలుసుకోవాలని అనుకుంటారు. అమ్మాయి పార్క్ లో అతనికోసం చూస్తూవుంటుంది. అతను రానే వచ్చాడు. ఒక్కసారి అతన్ని చూస్తూ ఆశ్చర్య పడుతుంది. నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. అతను ఎవరో కాదు...చిన్నప్పుడు మన హీరోయిన్ చేత పదోతరగతిలో తిరస్కరింపబడ్డ యువకుడు.

అమ్మాయి అతన్ని ఒప్పుకుంటుందా లేకా మళ్ళీ తిరస్కరిస్తుందా అనేది వెండితెరపై చూడాల్సిందే......
******

టైటిల్ రెండు:
" స్లం బ్లాగర్ మిలేనియర్ "

టైటిల్ చూసి మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది. దీని కదా ఏంటో అని....గిరిజన తండాలో మురికి వాడలో పెరిగిన ఒక యువకుడు తన బ్లాగు రచనల ద్వారా ఎలా పాపులర్ అయ్యాడు, ప్రపంచపు దృష్టిని ఎలా ఆకర్షించాడు, తద్వారా గూగిల్, యాహూ లాంటి బడా కంపనీలు అతని బ్లాగులో వ్యాపార ప్రకటనలని చొప్పించడానికి ఎలా పోటీ పడ్డాయి....అవి అతనిని ఎలా మిలేనియర్ని చేసాయి అన్నది చిత్ర కధాంశం.
******
టైటిల్ మూడు:
" బ్లాగు నీది..టెంప్లేట్ నాది "

ఇది కొంచం కుటుంబ కధా చిత్రాల కోవలోకి వచ్చిన కామెడీ చిత్రం. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు తను త్వరలో ప్రారంబించ బోయే బ్లాగు కోసం తన రచనలను, మనస్తత్వాన్ని ప్రతిబంబించేలా ఒక టెంప్లేట్ కోసం నెట్ ఆంతా వెతికి ఫెయిల్ అవుతాడు. చివరికి అతని మనసెరిగిన సహోద్యోగి రాత్రింబవళ్ళూ కష్టపడి ఒక టెంప్లేట్ తయారుచెయ్యాలని పూనుకొంటుంది. ఆమె అతని మనసుకు తగ్గ టెంప్లేట్ చెయ్యగలిగిందా, అతను బ్లాగు మొదలు పెట్టి పాపులర్ అయ్యాడా?, ఆ టెంప్లేట్ వారిద్దరి స్నేహాన్ని ఎటువైపు తీసుకెళ్ళింది అన్నది 'పది పైసలు' బ్యానర్ పై త్వరలో రిలీజ్ కాబోతున్న " బ్లాగు నీది..టెంప్లేట్ నాది " చిత్రం చూడాల్సిందే.
******

టైటిల్ నాలుగు:
" బ్లాగేశ్వర రెడ్డి "
ఓ ఫ్యాక్షన్ సినిమా......

బ్లాగుల టపాల నేపధ్యంలో జరిగే ఫ్యాక్షన్ కధ ఇది. ఒక సీమ బ్లాగరి, బ్లాగ్సేనా రెడ్డి తన బ్లాగులో తన ప్రత్యర్ది బ్లాగేశ్వర రెడ్డి గురించి, వారి కుటుంబం గురించి రక రకాలుగా రాసి ఇబ్బంది పెడుతుంటాడు. సహనం నశించిన బ్లాగేశ్వర రెడ్డి " ఇక తల తెగుడే... " అనే టపా రాసి తన ప్రత్యర్దిని పోరాటానికి సిద్దం చేస్తాడు. రెండు మూడు సుమోలను గాల్లోకి లేపిన తర్వాత బ్లాగేశ్వర రెడ్డి అనుచరుడు ఇకపై తమ ఊళ్ళో వాళ్ళెవ్వరూ బ్లాగర్ ని ఓపెన్ చెయ్యలేరని, ఇంటర్నెట్ నడిపే వాడిని లేపేసారని, ప్రత్యర్ది బ్లాగరి ఇకపై టపాలు రాయలేడని చెప్పటంతో ఇంక కత్తులతో పని లేదని బ్లాగేశ్వర రెడ్డి వాటిని పడేసి వెనుతిరుగుతాడు. అయితే ఈ చర్య బ్లాగ్సేనా రెడ్డి ని మార్చిందా లేకా డేటా కార్డ్ తో తన టపాలను తిరిగి కొనసాగించాడా అన్నది తెరపై చూడాల్సిందే.
******

టైటిల్ ఐదు:
" బ్లాగవే మయూరి "

చిన్నప్పుడే తల్లీ తండ్రి కోల్పోయిన ఒక యుక్త వయసు అమ్మాయి తన బాబాయి దగ్గర పెరుగుతుంటుంది. స్వతహాగా రచనా నైపుణ్యాన్ని ఒంటబట్టించుకున్న ఆ అమ్మాయి ఫ్రీ లాన్స్ బ్లాగర్ గా మిగతా బ్లాగర్లకు అప్పుడప్పుడూ టపాలు రాస్తూ పాకెట్ మనీ సంపాదించుకుంటుంది. తాగుబోతైన బాబాయి తన పాకెట్ మనీ కూడా కాజేస్తూ ఇంకా ఇంకా ఎక్కువరాసి డబ్బు సంపాదించమని వేదిస్తుంటాడు. తన లక్ష్యం సాదించనీయకుండా ప్రతి దశలో అడ్డుకున్టుంటాడు. తన బాబాయి చెర నుండి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుని తన లక్ష్యాన్ని చేరుకుందో మల్టిప్లెక్స్ లో వీక్షించాల్సిందే.
******
టైటిల్ ఆరు:
" బ్లాగుతో రా... "

తెలుగు బ్లాగర్ల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి బ్లాగశ్రీ కుమార్తెను, తన పేరుకూడా సరిగ్గా రాసుకోలేని ఒక యువకుడు ప్రేమిస్తాడు. అయితే బ్లాగశ్రీ తన అల్లుడు పాపులర్ బ్లాగర్ అయివుండాలని, అప్పుడే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తుంది. చివరికి ఏమైంది? బ్లాగశ్రీ పాపులర్ బ్లాగర్ని తన అల్లుడుగా చేసుకుందా లేక ఆ యువకుడు బ్లాగుతో బ్లాగాశ్రీ ని ఇంప్రెస్స్ చేసి ఆవిడ కుమార్తెను దక్కించుకున్నాడా అన్నది మిగతా భాగం. ఈ సినిమాని జరిగిన కధ ఆధారంగా తీసారని నిర్మాత చెబుతున్నారు. మరి "బ్లాగుతో రా..." బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు చేస్తుందో వేచి చూడాల్సిందే.
******

ఇంకా కధల చర్చల్లోనే ఉన్న టైటిల్స్ :

౧) బ్లాగాయణంలో బఠానీల వేట
౨) బ్లాగు బాబ్జీ
౩) బ్లాగు భందం


20 వ్యాఖ్యలు:

Shiva Bandaru చెప్పారు...

:)))

సుభద్ర చెప్పారు...

blogeswara reddy peru superr......

చెడుగుడు చెప్పారు...

చాలా బాగుంది

అజ్ఞాత చెప్పారు...

:-)

Unknown చెప్పారు...

బ్లాగంతా నువ్వే
ఒక నిరుద్యోగ యువకుడు గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళ నాన్న నువ్వు నెలరోజుల్లో కోటి రూపాయిలు సంపాయించుకు వస్తే నా పిల్లని ఇస్తా అంటాడు. అప్పుడు హీరో వంటలు రాసే వంటావిడ బ్లాగ్ ఓపెన్ చేసి అందులో రాసినవన్నీ గబ గబా చేసేసి ట్యాంక్ బండ్ మీద అమ్మకానికి పెడతాడు.ఆవిడ ఏమి రాసిన వహ్వా వహ్వా అనే భజన బ్లాగర్స్ asociation తమ తమ బ్లాగ్స్ లో ట్యాంక్ బండ్ లో కొత్త గా మన బ్లాగ్ లో వచ్చిన వంటకాలు చేసి అమ్ముతున్నారు అది తిన్న తర్వాత రక్త పరిక్షలు చేయించు కుంటే షుగర్ , కోలేస్త్రోలు ,triglycerides, అన్ని వంద లోపే వుండడం తో రోగిష్టి వాళ్ళంతా అక్కడ క్యు లో నిల బడి ఎగ బడి కొనుక్కు తింటున్నారని ప్రచారం చెయ్యడం తో నెల లోపే కోటి రూపాయలు సంపాయించి ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకుని తమ ప్రేమ విజయవంతం కావడానికి వుపయోగ పడిన సదరు బ్లాగర్ ను బ్లాగంతా నువ్వే అంటు పాడుకుంటూ వెళ్ళిపోతారు tankbund కి దూకడానికి కాదండి బాబు అమ్ముకోడానికి.

పరిమళం చెప్పారు...

ha..hha...hhaa...:)

జీడిపప్పు చెప్పారు...

హ హ్హ హ్హా బాగు బ్లాగు :)

సమిధ ఆన౦ద్ చెప్పారు...

క్రియెటివిటీ అనేది పుట్టుకతొ వస్తు౦దో లేక అనుభవ౦లో పెరుగుతు౦దో తెలియదుగాని,
మీ సృష్టి చూసి మాత్ర౦ మురిసిపోవాలి. ఇ౦త ఆలోచన ఏ మూల ను౦చి తెచ్చార౦డీ బాబూ?
తెలుగు సినిమావాళ్ళు చూస్తే ఏడుస్తారేమోన౦డీ. వ్య౦గ౦లో మీది మహబాగు బ్లాగులె౦డి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శివ గారికి,
@సుభద్ర గారికి,
@డా. శ్రీను గారికి,
@వికటకవి గారికి,
@పరిమళం గారికి,
@జీడిపప్పు గారికి,

టపా చదివి వదిలేయకుండా సమయం వెచ్చించి మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు చాలా థాంక్సండి.
మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.

@సూర౦పూడి ఆన౦ద్ గారికి,
మీ కామెంట్ చదివిన తర్వాత మనసు ములగ చెట్టెక్కి దిగనని తెగ మారాం చేస్తుందండి.
>> ఇ౦త ఆలోచన ఏ మూల ను౦చి తెచ్చార౦డీ బాబూ?
నిజానికి ఈ ఐడియా వారాంతం కదా అని తీరిగ్గా తలకు షాంపూ చేసుకుంటుంటే వచ్చిందండి. ఎన్నాళ్ళ నుండి దాగుందో పేను లాగ తెలీదు గాని, ఆ టైం లో కింద పడింది. ఇంక చేతులు ఊరికే ఉరుకోవుకదండి.

>>వ్య౦గ౦లో మీది మహబాగు బ్లాగులె౦డి.
నిజానికి ఈ టపా రాస్తున్నప్పుడు ఎవరినో దృష్టిలో పెట్టుకుని రాయలేదండి. ఒక సరదా ఆలోచనని అంతే సరదాగా తోటి బ్లాగు మిత్రులతో పంచుకోవాలనిపించింది.
వ్యంగంగా రాసేంత రచనా నైపుణ్యం కూడా నాకు ఉందని నేను అనుకోవటంలేదు.
ఎంతో అభిమానంతో కామెంట్ రాసినందుకు మీకు కృతజ్ఞతలు.

అజ్ఞాత చెప్పారు...

very nice

మోహన చెప్పారు...

:) Nice one.

శేఖర్ గారూ, మీ బ్లాగు ఈ రోజే చూస్తున్నాను. బాగుందండి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@అస్వినిశ్రీ గారు,
@మోహన గారు,
థాంక్సండి.

Unknown చెప్పారు...

sheker na coment ni gurtinchaka povadam yadruchhikama?leka pote deliberate act?nenu kuda time spend chese raasa aa story .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

రవి గారు,
మీ కామెంట్ చదివాక బావుందనిపించింది.
కానీ....సమాధానం ఇవ్వడం వల్ల దానిలో ఉన్న కొన్ని సున్నితమైన అంశాలను సపోర్ట్ చేసినట్టవుతుందని భావించి ఉద్దేశ్యపూర్వకంగానే సమాధానం ఇవ్వలేదు.
ప్రయోజనంలేని వాదోపవాదాలకి, చర్చలకు నా బ్లాగు వేదిక కాకూడదన్నది నా అభిమతం. అంతే గాని మిమ్మల్ని నొప్పించాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు.

అజ్ఞాత చెప్పారు...

సరదాగా మరి కొన్ని

బ్లాగు దొంగ
బ్లాగు అల్లుడు
బ్లాగు మొగుడు
బ్లాగు బావ
అల్లరి బ్లాగు
భలే బ్లాగు
బ్లాగు కోసం

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@bonagiri gaaru,

బావున్నాయండి.....మీ సరదా టైటిల్స్.

శ్రీనివాస్ చెప్పారు...

బ్లాగో బ్లాగేతి బ్లాగితః

Chakravarthy చెప్పారు...

Bava... KEKA!!!
'బ్లాగేశ్వర రెడ్డి...' was too good :)

మధురవాణి చెప్పారు...

భలే ఉన్నాయండీ మీ సినిమాల పేర్లు.. వాటి కథలూ..
ఇహ ఎవరో ఒకరు 'బ్లాగ్ ప్రొడక్షన్స్' మొదలెట్టి.. సినిమాలు తీసేయ్యడమే ఆలస్యం.! ;-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

:-)
థాంక్యూ..