21, ఫిబ్రవరి 2009, శనివారం

జ్ఞాపకమొచ్చెలే...బాల్య స్మృతులన్నీ....1

మేము ఒక చిన్న పల్లెటూరు నుండి టౌన్ కి వచ్చేటప్పటికి నేను నాలుగో తరగతి చదువుతున్నాను. అయితే మేము ఉంటున్న కాలనీలో పిల్లలందరి వయస్సు ఆరు నుండి పన్నెండేళ్ళు మధ్య ఉంటాయి. అందరూ కాన్వెంట్ లలో చదువుతున్నవారే. కాని నాన్న మాత్రం నన్ను కాలనీ దుంపల బడిలోనే వేసారు. అదేనండి ప్రభుత్వ స్కూళ్ళు. వాటిని మా టౌన్లో అలాగే అనేవారు. ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు ఉండగా ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకని నాన్న ఉద్దేశం. మా కాలనీ నాగావళి నది ఒడ్డున ఉండేది. దానికి మంగువారి తోట అని పేరు. పేరుకు తగ్గట్టుగానే కాలనీకి ఎడమ వైపు మామిడి తోట ఉండేది. వెనక వైపు తాటాకు గుడిసెల్లో ఉన్న కుటుంబాలు ఉండేవి. ఏటి ఒడ్డున ఉండటం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఇసక ఎక్కువ గా ఉండేది. మా బడిలో దాదాపుగా అందరూ పూరి పాకల్లో ఉండే పిల్లలే. అందువల్ల నా స్నేహితుల్లో పూరి గుడిసె పిల్లల నుండి అంతస్తుల్లో ఉండే పిల్లల వరకూ అందరూ ఉండేవారు. కాలనీ ఎప్పుడూ పిల్లలతో సందడిగా ఉండేది.

ఆటల
సరదాలు.....


దుంపల బడిలో సాయింత్రం నాలుగింటికే వదిలేసేవాళ్ళు. ఇంక అప్పుడు చూస్కోండి..ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. పూల కుండీని విరగ్గొడతావేమో లేక పూల మొక్కని తొక్కుతామో అని తెగ భయపడేవారు. మాకు యూనిఫాం లేకపోవటం వల్ల, అదే బట్టలతో ఆటకి రెడి. మా కాన్వెంట్ స్నేహితులు అప్పటికి స్కూలు నుండి వచ్చేవారు కాదు. స్కూలు మిక్సీలో తిప్పబడుతుండే వారు. నేను, నా మాస్ స్నేహితులు మంచి కర్రలు, దొంగాటలో దాక్కోడానికి కొత్త కొత్త ప్రదేశాలు వెతికే పనిలో ఉండేవాళ్లము. ఎలాంటి ప్రదేశాలు అంటే కాలనీలో ఉండే వాళ్లకు తెలిసేవి కావు. కాసేపయ్యాక కాన్వెంట్ నుండి మిగతావాళ్ళు యునిఫాంతో అలానే వచ్చేసేవారు.

ఇక అందరూ దొంగాటకి రెడి. స్వచ్చందంగా మొదటిసారి ఒకడు అంకెలు లెక్కపెట్టే వాడు. ఎవరు చివరికి దొరికితే వాడు సాయింత్రం కి హీరో అన్నమాట. మేమందరం ముందే వెతికి పెట్టుకున్న జాగాల్లోకి పోయి దాక్కునే వాళ్ళం. ఇక చూడాలి...అప్పుడు కష్టాలు స్టార్ట్...మేము దాక్కున్న ప్రదేశాల్లో చీమలు...దోమలు....జేర్రిలు చాలా రకాల జీవులు మాకంటే ముందే అక్కడ సిద్దంగా ఉండేవి మా రాక కోసం. ఎక్కడ పడితే అక్కడ కుట్టేవి. మరి సాయింత్రంకి హీరో కావాలంటే మాత్రం భరించాలి కదా! చివరిగా దొరికితే రోజు అందరూ చుట్టూ ముట్టి ఒరేయ్.. ప్లేసు నీకు ఎలా తెలుసురా.. అని మనల్ని సెలబ్రిటిని చేసి ప్రశ్నల వర్షం కురిపించేవారు.

ఒక్కోసారి నా దుంపల బడి స్నేహితులు చాక్లెట్లకు, తాండ్ర లకు, ఉప్పుకారం వేసిన మామిడి ముక్కలకు ఆశ పడి నేను ఎంతో జాగ్రత్తగా చూస్కున్న ప్లేస్ ప్రత్యర్దికి చెప్పేసేవాళ్లు. అప్పుడు మనం దాక్కున్న ప్లేస్ కనుక్కున్న వాడు హీరో అయిపోయేవాడు. అందరూ దొరికిపోయేక దొరికిన ఆర్డర్లో పేర్లు చెప్పాలి. ప్రత్యర్ది మనల్ని పట్టేసాడు అన్న అక్కసుతో ఘట్టాన్ని మేము రసాబాసగా చేసేసే వాళ్ళం. వాడు ఆర్డర్లో పేర్లు చెప్పక పొతే మళ్లీ వాడే దొంగలను వెతకాలన్న మాట. అందుకని వాడిని గందరగోళం లో పడేసేవాళ్ళం. వాడు కరెక్టగానే చెప్పినా మేము తప్పు తప్పు అని గోల చేసి మళ్లీ వాడిచేతే అంకెలు లెక్కబెట్టించేవాళ్లము. ఘట్టాన్ని కింత్రీ చేయటం అంటారు. అన్నట్టు... ఆటలో...'ఆటలో అరటి పండు' అనే జాబితా ఆటగాళ్ళు కూడా ఉండేవారు. అంటే..వీళ్ళు మొదట దొరికినా వారు దొంగలను పట్టుకోరన్నమాట...ఫ్యుచర్లో ఎలా కింత్రీ చెయ్యాలో నేర్చుకుంటున్న పిల్లగాళ్ళు అన్నమాట.

ఇక కర్రాట... అదేనండి...కర్రని రాయిమీద ఉంచుతూ ప్రత్యర్ది కర్రను కొడుతుండాలి..ప్రత్యర్ది కర్ర కొడుతున్నప్పుడు వాడు మనల్ని పట్టేస్తే, వాడి కర్ర ఉన్న ప్లేస్ నుండి ప్రారంభ లొకేషన్ కు కుంటూ కుంటూ వాడు రావాలి. తర్వాత, దొరికిన వాడి కర్రని అందరూ కొడుతుంటారు. ఇక్కడే మాకు పాత కక్ష్యలు గుర్తొచ్చేవి. పెద్ద పెద్ద బండలు చూసుకొని ప్రత్యర్ది కర్రను మొత్తం బలం ఉపయోగించి ఒక అర కిలోమీటరైనా ఎగిరి పడేటట్టు కొట్టే వాళ్లము. పాపం ప్రత్యర్ది కాలు, కాలు మార్చుకుంటూ కష్టపడి కుంటేవాడు. ఇక కింత్రీ రాయుల్లైతే...జేబుల్లో రాళ్ళు పెట్టుకునే వారు. ఒక వేళ కర్ర పడివున్న ప్రదేశానికి దరిదాపుగా రాల్లేవీ లేక పొతే జేబులో వున్న రాళ్ళు విసిరి కర్ర దగ్గరకు చేరుకునే వాళ్లు. ఆటలో రూల్స్ ఉన్నవి పక్కవాడు పాటించడానికే తప్ప మనకు కాదు అన్న క్లారిటీ అందరకూ ఉండేది.

వైకుంటపాళి....దాదాపు న్యూస్ పేపర్ అంత ఉన్నవైకుంటపాళి ని ఇంటి అరుగుపై పెట్టుకుని ఒక పది మంది ఆడేవాళ్ళం.
అప్పుడు ఉండేది అసలైన గోల...ఎవడైనా పెద్ద పాము మింగి మళ్లీ మొదటికోచ్చాడో వాడిని తెగ ఆట పట్టించేవాళ్ళం. అందరూ చింత పిక్కలు గిలకరించి వేసేముందు పాము బారిన పడకుండా మంత్రాలు అవి చదివి అప్పుడు వేసేవాళ్ళు.
పరీక్షలప్పుడు కూడా దేవుణ్ణి స్మరించి ఎరుగం. అలాంటిది వైకుంటపాళి అంటే దేవుళ్ళందరిని స్మరించాల్సిందే.

ఇంకా చాలా ఆటలు....గిల్లీ దండ, గోలీలు, క్రికెట్, ఏడు పెంకులాట....చాలానే ఉన్నాయి.

మా ఆటల గాంగ్ లో పేద, ధనిక అన్న బేధం ఉండేది కాదు. మాటకొస్తే.... వయసు పిల్లల్లో ఎవ్వరికీ ఉండదు. కానీ మాలో కొంతమంది తల్లిదండ్రులు మేము పూరి గుడిసె పిల్లలతో కలసి ఆడటానికి ఒప్పుకునేవారు కాదు. తీవ్రంగా కోప్పడేవారు. ఒకసారి గడప దాటితే అందరం ఇవన్నీ మర్చిపోయి హాయిగా చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్ళము.

ఆదివారాలు, సెకండ్ శనివారాల మజా ......

పిల్లలు అందరూ రెండు రోజులు సెలవులు వస్తే మద్యాహ్నం పడుకోవాలి అన్న ఉద్దేశంతో ఎవ్వరి ఇంట్లోనూ బయటకు పంపించేవారు కాదు. ఇంట్లో అందరూ పడుకున్నారని నిర్దారించుకున్నాక, నెమ్మదిగా మేడ ఎక్కి, కాలి మడమలతో గబ గబా డాబాపై నడిచేవాడిని. అది నాకు, మా పక్కింటి పిల్లలకు ఒక రకమైన సైన్ అన్నమాట. పక్క వాటాలో పిల్లలు ఇంటిలోపల సౌండ్ విని నేను మేడ మీద ఉన్నానని తెలుసుకొని నాన్న పక్క లోంచి జారుకునే వారు. అలా మేము అందరి ఇళ్ళపైకి వెళ్లి సౌండ్ చేసి వారిని లేపేసేవాళ్ళము.

గాంగ్ మళ్లీ తయార్. తక్షణ కర్తవ్యం ఆలోచించేవాళ్ళము. ఒక చురుకైనవాడు "ఒరేయ్...మన వెనకింటి ఆంటీ డాబాపై ఉరేసిన మామిడి ముక్కలు ఎండబెట్టారురా.." అని చెప్పిన వెంటనే అందరికీ నోట్లో నీళ్లు ఊరేవి . పిల్ల సైన్యం ను రంగంలోకి దించేవాళ్ళం. కట్ చేస్తే ....అందరూ మామిడి ముక్కలు లోని ఇంకి వున్న ఉప్పు నీటిని జుర్రుకుని తినటం... కార్యక్రమం అయిన తర్వాత ఏటి ఒడ్డున అందరం కూర్చొని అవతలి ఒడ్డు గురించి రకరకాల కధలు చెప్పుకునే వాళ్లము. ఒకడేమో అవతలి ఒడ్డున పెద్ద అడవి ఉందని, పులులు, సింహాలు ఉంటాయని చెప్తే, ఇంకొకడు మేము ఎలా అక్కడకు చేరుకోవాలా అని ప్లాన్ చేస్తుండేవాడు. మా గాంగ్లో ఉన్నచిన్నపిల్లకాయలు ఆసక్తిగా వింటుండేవారు.

.......మిగతావి తర్వాత టపాల్లో

19 వ్యాఖ్యలు:

MURALI చెప్పారు...

వైకుంఠపాళిలో పెద్దపాము పేరు అరుకాషుడు అనుకుంటా.

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

బాగున్నాయి మీ స్మృతులు...
నేను చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తుకువచ్చాయి....

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మురళి గారు,

పెద్ద పాము పేరు మీకు భలే గుర్తుందే....మాకు ఆ వయసులో వైకుంఠపాళి లో కొన్ని పదాలకు నాలిక తిరిగేది కాదు.

వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

@ప్రపుల్ల చంద్ర గారు,

>>నేను చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తుకువచ్చాయి....
టపా రాసిన ఉద్దేశం కొంతవరకు నెరవేరినట్టే అన్నమాట.

మీ వ్యాఖ్యకు నెనర్లు.

సిరిసిరిమువ్వ చెప్పారు...

బాగున్నాయి మీ ఆటలు వాటి జ్ఞాపకాలు. దుంపల బడి-మా ఇంట్లో కూడా ఈ మాట వాడుతూ వుంటారు:).

మురళి గారు,పెద్ద పాము పేరు భలే గుర్తుపెట్టుకున్నారే!

మోహన చెప్పారు...

మీ బ్లాగుకు అందుకేనా ఏటిగట్టు అని పేరు ? :)
బాగుందండీ.. చదువుతున్నంతసేపూ నేను ఊహించుకుంటూనే ఉన్నాను.
>>చింత పిక్కలు గిలకరించి వేసేముందు పాము బారిన పడకుండా మంత్రాలు అవి చదివి అప్పుడు వేసేవాళ్ళు.

మా అన్నయ్య[పెద్దమ్మ కొడుకు] ఇప్పుడు ఆడినా అలాగే వేస్తాడు. ఏం మంత్రమో గానీ 90% అనుకున్నట్టే పడేవి వాడికి. అందుకే మాంత్రికుడు అనే వాళ్ళం వాడిని.

నేను పూర్తిగా కాన్వెంట్ లోనే చదివాను. స్కూల్ లోనే అయినా చాలా ఆటలు ఆడే వాళ్ళం. కరెంట్-షాక్, తొక్కుడు బిళ్ళ, కోతి కొమ్మచ్చి, సబ్జా-ఇండోర్.. ఇలా బోలెడు. ఒక స్టేజ్ లో ఐతే కనపడిన ప్రతి దానితో కోతి-కొమ్మచ్చి ఆడేసేవాళ్ళం. గచ్చకాయలతో, గులక రాళ్ళు, కంకర రాళ్ళూ ఇలా చేతికి ఏది దొరికితే దానితో, ఎక్కడ పడితే అక్కడ ఆడేసే వాళ్ళం. ఇంకా బుక్ క్రికెట్ అని, క్రికెట్ లాంటి ఆటల్ని కూడా ఇండోర్ గేంస్ చేసి పారేసాం.

ఇంట్ళో అమ్మ చదువుకోండర్రా అని విధి గదిలో పెట్టి తలుపు వేసేసేది, టీవీ కనిపించకుండా. నేను, తమ్ముడు ఎప్పుడూ ఒకే జట్టు. మా ఇంట్లో ఉన్న పేద్ద చెక్క టేబుల్ కి మధ్యలో ఉన్న గూడు లాంటి జాగా లో కూర్చుని రక రకాల ఆటలు.. అది ఒక నౌక లాగ, తుఫాను, షార్క్ లు ఇలా సాగేది మా చదువు... :)

వేసవి సెలవుల్లో అయితే, అష్టా-చమ్మా , వైకుంఠపాళీ, పేకలు.. ఇంకా లక్క-పిడతలతో. ఇక అవుట్ డోర్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద ఖాళీ స్థలం లోనే.. మ అన్నయ్య, నేను ఫుల్ల్ ఆక్షన్ అన్నమాట. కొబ్బరి మట్టలతో కత్తి యుద్ధాలు, చెక్క గన్నుల ఫైట్ లు.. ఆ చిన్ని ఖాళీ లోనే క్రికెట్ లు.. నేను పిచ్ లో సగం దూరం నుంచి బౌలింగ్ చేసేదాన్ని. :D అవుట్ అయితే బాట్ ఇవ్వటానికి, ఎన్ని వంకలు పెట్టి, ఎంత మారాం చేసే వాళ్ళమో. నేనైతే మొహమాటం ఏమీ లెకుండా, బాట్ వెనక దాచేసి, "ఒరేయ్, ఒక్క బాల్ సరిగ్గా [అంటే, నేను కొట్టేలా] వెయ్యరా అని" అడిగేసేదాన్ని. ఏమీ చెయ్యలేక, ఛీ అని మళ్ళీ వేసేవారు. ఫాస్ట్ గా వేస్తే కొబ్బరి చెట్టు వెనక దాక్కునే దాన్ని. మెల్లగా వేస్తే విజృంబించేసి బాల్ ని గాట్టిగా కోట్టేసేదాన్ని. అది కాస్తా వెళ్ళి పక్కింట్లో పడేది. దాని వల్ల నాకు అన్నయ్యతో ఎప్పుడూ తిట్లే..! :P అప్పుడప్పుడూ గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. మాతో పాటు, మావయ్య, పెద్ద నాన్న గారు, డాడీ కూడా వచ్చేవారు. ఒక సారి మా తమ్ముడు బాలుని తుప్పల్లోకి కొట్టేసి, ఆపకుండా రన్స్ తియ్యటం మొదలెట్టాడు. ఆ విషయం తలచుకుని ఇప్పటికీ నవ్వుకుంటాం. వాడిని చాలా ఏడిపిస్తాం. :)

ఏంటండీ చూడబోతే మీ పోస్ట్ కి నా కామెంట్ నా పోస్టు ల కంటే పొడవుగా ఉన్నట్టుంది. ఇంత చెప్పినా ఒక పార్ట్ కూడా అవ్వలేదు నాకు. :) అలా అని రాస్తూ పోతే తెల్లారిపోయినా రాయటం అయ్యేలా లేదు. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@సిరిసిరిమువ్వ గారు,

వ్యాఖ్యానించినందుకు నెనర్లు.

@మోహన గారు,

అందమైన అనుభూతులు, జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే అవి మనల్ని ఎక్కడికో తీసుకెల్తాయని మీ సుదీర్గమైన కామెంట్ బట్టి ఇంకొకసారి రుజువైంది. టపా చదివి మీ జ్ఞాపకాలు కూడా పంచుకున్నందుకు నెనర్లు.

>>మీ బ్లాగుకు అందుకేనా ఏటిగట్టు అని పేరు ?

ఏటిగట్టు తో నాకు ఒక ప్రత్యేకమైన అనుభందం ఉందని నేను అనుకుంటాను. నేను మా ఊరు వెళితే ఇప్పటికీ నా చిన్నప్పటి స్నేహితులతో మా నాగావళి ఒడ్డునే పిచ్చాపాటి మాట్లాడుకుంటాము. వెన్నెల్లో, ఇసక తిన్నెల్లో ఎన్నో అనుభవాలు, అనుభూతులు నాకు సొంతం. అందుకే కబుర్లు చెప్పుకోవాలనిపిస్తే ఏటిగట్టు గుర్తు రావాల్సిందే. అలా ఇంకో ఆలోచన లేకుండా నా బ్లాగుకు ఆ పేరు పెట్టేసాను.

>>ఏంటండీ చూడబోతే మీ పోస్ట్ కి నా కామెంట్ నా పోస్టు ల కంటే పొడవుగా ఉన్నట్టుంది. ఇంత చెప్పినా ఒక పార్ట్ కూడా అవ్వలేదు నాకు. అలా అని రాస్తూ పోతే తెల్లారిపోయినా రాయటం అయ్యేలా లేదు. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను.

చిన్నప్పటి విషయాలు రాయాలి అని అనుకుని రాయటం మొదలు పెట్టానో లేదో, నా చేతి వేళ్లు నా మనసు వేగాన్ని అందుకోలేక పోయి బుంగమూతి పెట్టాయి. సరే వాటిమీద జాలితో మనసు కొంతదూరం వెళ్లి పోయాకా బలవంతంగా తనని తాను నిగ్రహించుకుంది. మీ విషయంలో కూడా అదే జరిగినట్టుంది.

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది.
సుంకోజి దేవేంద్ర అనే యువరచయిత మన మంచి ఆటలు అనే పేరుతో తాను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ వివరాలతో సహా రాసి పొందు పరిచారు. విశాలాంధ్ర లో దొరుకుతుంది.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@కొత్త పాళీ గారు,
మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.

మీరు చెప్పిన పుస్తకం గురించి మాకు దగ్గర్లో ఉన్న పుస్తక ప్రదర్శనలో దొరుకుతుందేమో చూస్తాను. తెలియజేసినందుకు ధన్యవాదములు.

మోహన చెప్పారు...

ఏటిగట్టు, ఇసుక తిన్నెలు, వెన్నెల.. కుళ్ళుగా ఉంది నాకు :)
వేళ్లు బుంగమూతి పెట్టాయా ??
:)) బాగుంది. వాటి అలకలు, మీ బుజ్జగింపులు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మోహన గారు,
:))

మురళి చెప్పారు...

తర్వాత టపాలు ఎప్పుడండి.. ?

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మురళి గారు,
కొంచం బిజీ.త్వరలోనే రాస్తానండి.
మీ స్పందనకు నెనర్లు.

Mahitha చెప్పారు...

నాకీ ఆటలేవీ తెలియదు కాని చదువుతుంటే చాలా సరదగా అనిపించింది

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మహి గారు,

మీకు వైకుంటపాలి తెలిసే ఉండాలే......నేను ఇక్కడ ప్రస్తావించిన ఆటలన్నీ ఇంచు మించు అందరికీ తెలిసేవే అనుకుంటా.....కాకపొతే వాటి పేర్లు ప్రాంతాల బట్టి మారి ఉండొచ్చు...బహుసా అందుకే మీరు ఈ ఆటలను గుర్తించలేక పోయుంటారు.

మీ స్పందనకు ధన్యవాదాలు.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

anni gurtuku vachhayi........night bayata opandukonte gurtukochhevi eve.........

7 penkulata,karrata,billamgodu,pichhi banti ila enno abbo..alane cinemala perlu raasi vaatiki value ichhi star ane aata vundedi ...mmm eppudu pelli avutundo marala pillalato eppudu aadukuntaamo....

ippudu kooda aadukovachhu but maa naanna gaaru venakane vachhestaaru...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

వినయ్ చక్రవర్తి గారు ,
సినిమాల పేర్లు ఆట మేం కూడా ఆడేవాళ్ళం. పిల్లలతో ఆడుకొవాలన్న మీ కోరిక బాగుంది. కానీ ఈ జనరేషన్ పిల్లలకు ఆ ఆటలు అస్సలు తెలీవండి. ఏదో పల్లెటూళ్ళల్లో తప్పించి సిటీ పిల్లలకు ఆడుకోడానికి అంత ఖాళీ ప్రదేశం ఎక్కడ ఉంటుంది చెప్పండి? పెళ్లి అయ్యాక పిల్లలతో ఆడుకోడానికి టైం ఎక్కడ ఉంటుంది? టైం అంతా షాపింగ్ మాల్స్ లోనే కదా గడిచిపోయేది. :))

నేస్తం చెప్పారు...

హూం ఒకసారి నేనూ పాత రోజులకు వెళ్ళి ఒక రౌండ్ తిరిగి వచ్చాను. బాగా రాసారు శేకర్ .ఇంకా మొహన గారి వాక్య లు కూడా బాగున్నాయి :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం గారు,
థాక్సండి.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

మా ఇల్లు బొందిలిపురం స్టేట్ బ్యాంక్ కోలనీలో ఉంది. మంగువారితోట నేను వెళ్ళలేదు. మంగువారితోట కిన్నెరా థియేటర్ అవతల ఉందా, జిల్లా పరిషత్ ఆఫీస్ అవతల ఉందా?