వాళ్లు భౌతికంగా అందరిలాంటి వారు కాకపోయినా ప్రతిభా పాటవాల్లల్లో మాత్రం అందరి కంటే ముందు వరసలోనే వుంటారు. ఒకరు తమ గాన మాధుర్యంతో మనల్ని పరవశింప జేస్తే ఇంకొకరు తమ బహుముఖ ప్రతిభతో మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తారు. పోటీనుండి తప్పుకోవలసి వచ్చిన, సహ పోటీదారున్ని మెచ్చుకునే గొప్పమనసుతో మనం చిన్న బుచ్చుకునేలా ప్రవర్తించగలరు. వారి అవరోదాన్ని అదికమించిన తీరుతో మనలో స్ఫూర్తినీ నింపగలరు. వాళ్లు జాబిల్లిని చూడలేక పోవచ్చు. కాని 'చందమామ రావే...జాబిల్లి రావే...' అని పాడి మన కళ్ళ ముందు వెన్నెలని ఆవిష్కరింపజేయగలరు. సరిగమలు, రాగాలలోనే సప్తవర్ణాలు చూడగలరు. వీరందరూ ఎవరో కాదు ఒక ప్రముఖ టెలివిజన్ సంస్థవారు అంధుల కోసం రూపొందించిన పాటల కార్యక్రమంలో పాల్గొన్నవారు.
" Black...The colors of music "
మొదట్లో ఈ కార్యక్రమం ప్రోమో వస్తుందంటే అసలు వీరికి అభ్యర్దులు దొరుకుతారా అని అనిపించింది. కాని మొదటి ఎపిసోడ్ చూసిన తర్వాత తెలిసింది మన రాష్ట్రంలో ఇంతమంది ప్రతిభవున్న గాయకులు వున్నారని. వీరిలో చాలామందికి పాడటం ఒక్కటే వచ్చు అనుకుంటే మీరు పొరబడినట్టే. గాత్రంతో పాటు వివిధ వాద్య పరికరాలనూ వాయించగలరు. మిమిక్రి చేయగలరు. అయితే ఇవన్ని వారికి గురువులు నేర్పించలేదు. నేర్చుకునే స్తోమత ,వెసులుబాటు కూడా కొంత మందికి వుండుండదు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన దిగువ మధ్య తరగతి వారే.
టీవీ వైపు చూడకుండా ఒక్కసారి వారి పాటను వింటే ఇదేదో ఇంకో పాటల కార్యక్రమము అని అనుకుంటాము తప్పితే ఎక్కడా కూడా ఇదేదో అంధుల కోసం రూపొందించిన ప్రోగ్రాం అని ఎక్కడా అనిపించదు. వారి టాలెంట్ ఆ స్థాయిలో వుంటుంది. వాళ్ళల్లో ఎవరికీ వారి లోపాన్ని గురించి అస్సలు దిగులు లేదని కార్యక్రమం చూస్తుంటే ఇట్టే అర్ధమైపోతుంది. అది వారి ఆత్మవిశ్వాసం వారికి ఇచ్చిన భరోసా. ఒకసారి ఒక అమ్మాయి 'ముకుందా ముకుందా ...' పాట పాడిన తర్వాత యాంకర్ ఆమెకు మీకు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటారు అని అడిగితే ఆమె ఏమి సమాదానం చెప్పుంటుందో ఊహించగలరా? కళ్లు ఇమ్మని అడుగుతుందని అనుకుంటున్నారా? తను మంచి గాయని కావాలని అడుగుతానని ఆ అమ్మాయి చెప్పింది. ఇంతకంటే ఏమి రుజువు కావాలి వారి మనోబలం ముందు వైకల్యం తల వంచుకు వుందని.
అయితే ఇటువంటి ప్రోగ్రామ్స్ కి ప్రజల ఆదరణ వుంటుందో లేదో అన్న సందేహం కాబోలు..వారానికి ఒక్కసారికి మాత్రమే పరిమితం చేసారు. సాదారణంగా ఏ 'సరిగమప' లోనో, లేదా 'సప్తస్వరాలు' లోనో పాడేవారికి ఎలిమినేట్ అవ్వడానికి ముందు చాలా సార్లు అవకాశం ఇస్తారు. వైల్డ్ ఎంట్రీ అని...అదని ఇదని చాలా చేస్తారు..ఎపిసోడ్ లను పెంచటానికి కాబోలు. కానీ ఈ ప్రతిభా మూర్తుల కార్యక్రమం లో అటువంటి అవకాశమే లేదు. ప్రోగ్రాం మొదలైన రెండవ భాగం నుండే ఎలిమినేట్ చేసేస్తున్నారు. అయినా ఈ విషయంలో నిర్వాహకులను అనేకంటే ముందు తెలుగు ప్రేక్షకులను అనాలి. ఇలాంటివి మనం చూస్తేనే కదా టీ.ఆర్.పీ రేటింగులు పెరిగేవి. అప్పుడేమరి ఎపిసోడ్ లను పెంచాలి అని నిర్వాహకులకు అనిపిస్తుంది. తద్వారా కార్యక్రమంలో పాల్గొన్న వారికి వారి ప్రతిభను మరింత సాన పెట్టుకునే అవకాశం వస్తుంది. వారిని ప్రోత్సహిస్తున్నట్టు వుంటుంది.
ఒక్క ఎపిసోడ్ తోనే వెనుతిరిగే వారిని చూస్తుంటే చాలా కష్టంగా అనిపించక మానదు. అసలే మన టీవీ వాళ్లు లేక లేక ఇలాంటి కార్య క్రమంను ప్రసారం చేస్తున్నారు. చేసిన వారు కూడా ప్రజల స్పందనను చూసి వెనక్కి తిరిగితే ఎంతో మంది ప్రతిభా మూర్తుల టాలెంట్ తెరమరుగు అవుతుంది.
అయినా వాళ్లందరూ ఎప్పుడో జీవితంలో గెలిచిన వారు. ఒక వేదిక నిర్ణయించే 'విజేత' అనే గుర్తింపు వాళ్లు నిజజీవితంలో గెలిచిన ట్రోఫీ ముందు చిన్నదే.
OTT Entertainment : 2
3 వారాల క్రితం
4 కామెంట్లు:
బ్లాక్ కార్యక్రమం ఆదివారం ఉదయం పునః ప్రసారం అవుతోందండీ నేను మొన్ననే చూసాను. చాలా మంచి కార్యక్రమం గురించి చాలా బాగా రాసారు. అభినందనలు.
@విరజాజి గారు,
పునః ప్రసారం తో పాటు వారానికి రెండు కొత్త ఎపిసోడ్స్ వెయ్యాలన్నదే నా ఆశ.
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
శేఖర్ గారు, మంచి విషయాన్ని ప్రస్తావించారు..
చాలా రోజుల తర్వాత నేను పాటల కార్యక్రమాన్ని శ్రద్ధగా చూడటం మొదలుపెట్టింది 'బ్లాక్ ' నించే!! మీరన్నట్లు ఇందులో పాల్గొనే వాళ్ళందరూ బహుముఖప్రజ్ఞాశాలులే! సరదాగా కబుర్లు చెప్తూ, ఎప్పుడూ తోటి పార్టిసిపెంట్స్ ని పొగుడుతూ ఉండే వీళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది వీళ్ళ ప్రపంచం ఎంత విశాలమైనదో అని! ఇక ఎలిమినేషన్ చూడటం మాత్రం నావల్ల కావడంలేదు :(
If you don't mind please remove the word verification in the comments section...
@నిషిగంధ గారు,
మీ కామెంట్ చూడగానే "ఓ ...'ఉసులాడే ఒక జాబిలట' నిషిగంధ గారు " అని వెంటనే స్ఫురించింది. ఆ నవల మీకు ఒక ఇంటి పేరుగా మారినా ఆశర్య పడకండి.
నా పోస్ట్ పై మీ స్పందనను తెలియజేసినందుకు నెనర్లు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి