ఆటల సరదాలు.....
దుంపల బడిలో సాయింత్రం నాలుగింటికే వదిలేసేవాళ్ళు. ఇంక అప్పుడు చూస్కోండి..ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. ఏ పూల కుండీని విరగ్గొడతావేమో లేక ఏ పూల మొక్కని తొక్కుతామో అని తెగ భయపడేవారు. మాకు యూనిఫాం లేకపోవటం వల్ల, అదే బట్టలతో ఆటకి రెడి. మా కాన్వెంట్ స్నేహితులు అప్పటికి స్కూలు నుండి వచ్చేవారు కాదు. స్కూలు మిక్సీలో తిప్పబడుతుండే వారు. నేను, నా మాస్ స్నేహితులు మంచి కర్రలు, దొంగాటలో దాక్కోడానికి కొత్త కొత్త ప్రదేశాలు వెతికే పనిలో ఉండేవాళ్లము. ఎలాంటి ప్రదేశాలు అంటే కాలనీలో ఉండే వాళ్లకు తెలిసేవి కావు. కాసేపయ్యాక కాన్వెంట్ నుండి మిగతావాళ్ళు యునిఫాంతో అలానే వచ్చేసేవారు.
ఇక అందరూ దొంగాటకి రెడి. స్వచ్చందంగా మొదటిసారి ఒకడు అంకెలు లెక్కపెట్టే వాడు. ఎవరు చివరికి దొరికితే వాడు ఆ సాయింత్రం కి హీరో అన్నమాట. మేమందరం ముందే వెతికి పెట్టుకున్న జాగాల్లోకి పోయి దాక్కునే వాళ్ళం. ఇక చూడాలి...అప్పుడు కష్టాలు స్టార్ట్...మేము దాక్కున్న ప్రదేశాల్లో చీమలు...దోమలు....జేర్రిలు చాలా రకాల జీవులు మాకంటే ముందే అక్కడ సిద్దంగా ఉండేవి మా రాక కోసం. ఎక్కడ పడితే అక్కడ కుట్టేవి. మరి సాయింత్రంకి హీరో కావాలంటే ఆ మాత్రం భరించాలి కదా! చివరిగా దొరికితే ఆ రోజు అందరూ చుట్టూ ముట్టి ఒరేయ్..ఆ ప్లేసు నీకు ఎలా తెలుసురా.. అని మనల్ని సెలబ్రిటిని చేసి ప్రశ్నల వర్షం కురిపించేవారు.
ఒక్కోసారి నా దుంపల బడి స్నేహితులు చాక్లెట్లకు, తాండ్ర లకు, ఉప్పుకారం వేసిన మామిడి ముక్కలకు ఆశ పడి నేను ఎంతో జాగ్రత్తగా చూస్కున్న ప్లేస్ ప్రత్యర్దికి చెప్పేసేవాళ్లు. అప్పుడు మనం దాక్కున్న ప్లేస్ కనుక్కున్న వాడు హీరో అయిపోయేవాడు. అందరూ దొరికిపోయేక దొరికిన ఆర్డర్లో పేర్లు చెప్పాలి. ప్రత్యర్ది మనల్ని పట్టేసాడు అన్న అక్కసుతో ఈ ఘట్టాన్ని మేము రసాబాసగా చేసేసే వాళ్ళం. వాడు ఆర్డర్లో పేర్లు చెప్పక పొతే మళ్లీ వాడే దొంగలను వెతకాలన్న మాట. అందుకని వాడిని గందరగోళం లో పడేసేవాళ్ళం. వాడు కరెక్టగానే చెప్పినా మేము తప్పు తప్పు అని గోల చేసి మళ్లీ వాడిచేతే అంకెలు లెక్కబెట్టించేవాళ్లము. ఈ ఘట్టాన్ని కింత్రీ చేయటం అంటారు. అన్నట్టు...ఈ ఆటలో...'ఆటలో అరటి పండు' అనే జాబితా ఆటగాళ్ళు కూడా ఉండేవారు. అంటే..వీళ్ళు మొదట దొరికినా వారు దొంగలను పట్టుకోరన్నమాట...ఫ్యుచర్లో ఎలా కింత్రీ చెయ్యాలో నేర్చుకుంటున్న పిల్లగాళ్ళు అన్నమాట.
ఇక కర్రాట... అదేనండి...కర్రని రాయిమీద ఉంచుతూ ప్రత్యర్ది కర్రను కొడుతుండాలి..ప్రత్యర్ది కర్ర కొడుతున్నప్పుడు వాడు మనల్ని పట్టేస్తే, వాడి కర్ర ఉన్న ప్లేస్ నుండి ప్రారంభ లొకేషన్ కు కుంటూ కుంటూ వాడు రావాలి. తర్వాత, దొరికిన వాడి కర్రని అందరూ కొడుతుంటారు. ఇక్కడే మాకు పాత కక్ష్యలు గుర్తొచ్చేవి.
పెద్ద పెద్ద బండలు చూసుకొని ప్రత్యర్ది కర్రను మొత్తం బలం ఉపయోగించి ఒక అర కిలోమీటరైనా ఎగిరి పడేటట్టు కొట్టే వాళ్లము. పాపం ప్రత్యర్ది కాలు, కాలు మార్చుకుంటూ కష్టపడి కుంటేవాడు. ఇక కింత్రీ రాయుల్లైతే...జేబుల్లో రాళ్ళు పెట్టుకునే వారు. ఒక వేళ కర్ర పడివున్న ప్రదేశానికి దరిదాపుగా రాల్లేవీ లేక పొతే జేబులో వున్న రాళ్ళు విసిరి కర్ర దగ్గరకు చేరుకునే వాళ్లు. ఆటలో రూల్స్ ఉన్నవి పక్కవాడు పాటించడానికే తప్ప మనకు కాదు అన్న క్లారిటీ అందరకూ ఉండేది.

వైకుంటపాళి....దాదాపు న్యూస్ పేపర్ అంత ఉన్నవైకుంటపాళి ని ఇంటి అరుగుపై పెట్టుకుని ఒక పది మంది ఆడేవాళ్ళం.
అప్పుడు ఉండేది అసలైన గోల...ఎవడైనా పెద్ద పాము మింగి మళ్లీ మొదటికోచ్చాడో వాడిని తెగ ఆట పట్టించేవాళ్ళం. అందరూ చింత పిక్కలు గిలకరించి వేసేముందు పాము బారిన పడకుండా మంత్రాలు అవి చదివి అప్పుడు వేసేవాళ్ళు.
పరీక్షలప్పుడు కూడా దేవుణ్ణి స్మరించి ఎరుగం. అలాంటిది వైకుంటపాళి అంటే దేవుళ్ళందరిని స్మరించాల్సిందే.
ఇంకా చాలా ఆటలు....గిల్లీ దండ, గోలీలు, క్రికెట్, ఏడు పెంకులాట....చాలానే ఉన్నాయి.
మా ఆటల గాంగ్ లో పేద, ధనిక అన్న బేధం ఉండేది కాదు. ఆ మాటకొస్తే.... ఆ వయసు పిల్లల్లో ఎవ్వరికీ ఉండదు. కానీ మాలో కొంతమంది తల్లిదండ్రులు మేము పూరి గుడిసె పిల్లలతో కలసి ఆడటానికి ఒప్పుకునేవారు కాదు. తీవ్రంగా కోప్పడేవారు. ఒకసారి గడప దాటితే అందరం ఇవన్నీ మర్చిపోయి హాయిగా చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్ళము.
ఆదివారాలు, సెకండ్ శనివారాల మజా ......
పిల్లలు అందరూ రెండు రోజులు సెలవులు వస్తే మద్యాహ్నం పడుకోవాలి అన్న ఉద్దేశంతో ఎవ్వరి ఇంట్లోనూ బయటకు పంపించేవారు కాదు. ఇంట్లో అందరూ పడుకున్నారని నిర్దారించుకున్నాక, నెమ్మదిగా మేడ ఎక్కి, కాలి మడమలతో గబ గబా డాబాపై నడిచేవాడిని. అది నాకు, మా పక్కింటి పిల్లలకు ఒక రకమైన సైన్ అన్నమాట. పక్క వాటాలో పిల్లలు ఇంటిలోపల ఆ సౌండ్ విని నేను మేడ మీద ఉన్నానని తెలుసుకొని నాన్న పక్క లోంచి జారుకునే వారు. అలా మేము అందరి ఇళ్ళపైకి వెళ్లి సౌండ్ చేసి వారిని లేపేసేవాళ్ళము.
గాంగ్ మళ్లీ తయార్. తక్షణ కర్తవ్యం ఆలోచించేవాళ్ళము. ఒక చురుకైనవాడు "ఒరేయ్...మన వెనకింటి ఆంటీ డాబాపై ఉరేసిన మామిడి ముక్కలు ఎండబెట్టారురా.." అని చెప్పిన వెంటనే అందరికీ నోట్లో నీళ్లు ఊరేవి . పిల్ల సైన్యం ను రంగంలోకి దించేవాళ్ళం. కట్ చేస్తే ....అందరూ మామిడి ముక్కలు లోని ఇంకి వున్న ఉప్పు నీటిని జుర్రుకుని తినటం...ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏటి ఒడ్డున అందరం కూర్చొని అవతలి ఒడ్డు గురించి రకరకాల కధలు చెప్పుకునే వాళ్లము. ఒకడేమో అవతలి ఒడ్డున పెద్ద అడవి ఉందని, పులులు, సింహాలు ఉంటాయని చెప్తే, ఇంకొకడు మేము ఎలా అక్కడకు చేరుకోవాలా అని ప్లాన్ చేస్తుండేవాడు. మా గాంగ్లో ఉన్నచిన్నపిల్లకాయలు ఆసక్తిగా వింటుండేవారు.
.......మిగతావి తర్వాత టపాల్లో