లెక్కలు సబ్జెక్ట్ అనగానే అప్పటివరకు లయబద్దంగా కొట్టుకుంటుండే గుండెకాయ కాస్త శ్రీలక్ష్మి పాట లాగ అపశృతిలో కొట్టుకునేది. అంకెలు, కూడికలు, హెచ్చవేతలు, భాగాహారాలు..ఈ పేర్లు వింటేనే
చెయ్యి నాకు తెలీకుండానే బుర్రమీ
దకు పరిగెత్తేది. కళ్ళేమో నా మనస్థితిని తెలుపాలన్నట్టుగా రంగులరాట్నంలా తిరిగేసేవి. కొట్టడం, తిట్టడం వల్ల లాభం లేదనుకున్న ప్రవేటు టీచర్ భాగ్యలక్ష్మి నేను కొంచెం సిగ్గరి అని తెలుసుకుని, ఇవన్నీ నేర్చుకోకపోతే చొక్కాతీసి (నిక్కరుకు కన్సెషన్ ఇచ్చేసి) రోడ్డుమీద నిలబెట్టిస్తాను అని భయపెట్టి, ఒకటికి పదిసార్లు నాతో లెక్కలు చేయించటం మొదలుపెట్టింది. ఎప్పుడైనా అర్ధం కాక త్వరగా నేర్చుకోకపోతే నాకంటే పెద్దపిల్లలతో "ఒరేయ్ వీడి నిక్కరు విప్పి రోడ్డుమీద నిలబెట్టించండి" అనేసరికి ఏడుపు తన్నుకొచ్చేసేది. ఆవిడ భయపెట్టడం వల్లో లేక ఆవిడ అర్ధమయ్యే రీతిలో ఒకటికి రెండుసార్లు చెప్పటం వల్లో తెలీదుగానీ ఆరేళ్ళకే నేను అన్నీ నేర్చేసుకున్నాను. స్కూల్లో జాయిన్ అవడానికి అమ్మతో వెళ్ళినప్పుడు హెడ్మాస్టర్ చిన్న పరీక్ష పెట్టి "ఈ అబ్బాయిని మూడో తరగతిలో జాయిన్ చేయండి" అని మా అమ్మతో చెప్పి నన్ను మూడో తరగతి క్లాసులో కూర్చొబెట్టించారు.
ఇంక అప్పటినుండి నా లెక్కల కష్టాలు మళ్ళీ మొదలు. తరగతిలో ఓ ఏభైమందికి పైగా పిల్లలు ఉన్న దుంపలబడి స్కూల్లో ఎవడూ పట్టించుకోకపోవటంతో నా లెక్కల నాలెడ్జ్ నిధులు లేక సగం కట్టి ఆపేసిన గవర్నమెంట్ బిల్డింగ్ లా భాగ్యలక్ష్మీ టీచర్ వేసిన పునాది దగ్గరే ఆగిపోయింది.
నాలుగో తరగతి లో ప్రతీరోజు ఓ రెండు లెక్కలు క్లాసులో చెప్పనివి హోం వర్క్ ఇచ్చి మరుసటిరోజు చేసుకురమ్మనేవారు. ఇంట్లో అక్కావాళ్ళకు కూడా లెక్కల్లో పెద్ద ప్రావీణ్యం లేకపోవటంతో, నా బుర్రలో గుడ్డిలో మెల్లగా ఉన్న నాలెడ్జ్ ని బలవంతంగా బయటకు లాగినా ప్రయోజనం లేకపోవటంతో టెక్స్ట్ బుక్ వెనుక ఉన్న ఆన్స్ ర్ వేసి, దానికి ముందు ఓ నాలుగు పిచ్చి స్టెప్లు వేసేసి మరుసటి రోజు స్కూలుకి పోయేవాడిని. అప్ప్పుడప్పుడూ దొరికినప్పుడు మాత్రం 'జనకు జన పాయల్ భాజే' అయ్యేది. ('సీతాకోక చిలుక' సినిమాలో చిన్న ఆలీని వాళ్ళమ్మ కొట్టే సీను గుర్తుకుతెచ్చుకోండి)
అలా ఓ మూడు బూతు స్టెప్ లు, ఆరు కిట్టించిన ఆన్సర్ల తో సాగిపోతున్న నా లెక్కల ప్రయాణంలో విధి టీ.సి లాగా ఎంటరయ్యింది నవోదయ పరీక్ష రూపంలో.... "మీ అబ్బాయి బాగా చదువుతాడు కదా, అందుకని ఒకలిద్దరి పిల్లలకోసం నవోదయ అప్లికేషన్ తెచ్చి ఉంచాను. మీ వాడి చేత నింపిన ఫారాలు పంపించండి" అని మా హెడ్ లేని మాస్టారు మా నాన్నకు నవోదయ అప్లికేషన్ ఇచ్చారు. అంతే ఆ సాయింత్రం మా నాన్న బుక్ షాపుకు తీసుకెళ్ళి పేద్ద నవోదయ గైడ్ కొన్నారు. అందులో అన్నీ విభాగాలు ఇంటరెస్టింగ్ గానే ఉండేవి...ఒక్క లెక్కలు తప్ప..ఓర్నాయనో..మళ్ళీ ఈ లెక్కల భాద తప్పేట్టు లేదు అనుకొని అయిష్టం గానే చూశాను. "ఫలానాది సాధించండి..."--"దీన్ని తిప్పి కొడితే ఏమవుతుంది"--"దాన్ని తిరగేసి మరగేస్తే ఏమవుతుంది" లాంటి ప్రశ్నలు చూసి జడుసుకొని మళ్ళీ ఎప్పుడు ఆ సెక్షన్ మొహం చూడలే.
ఓసారి నాన్న నా నవోదయ ప్రిపరేషన్ ఏస్థాయిలో ఉందో అని బుక్ తీసి లెక్కల్లో కొన్ని ప్రశ్నలు వేశారు.
నాన్న: పన్నెండుకి క.సా.గు (కనిష్ట సామాన్య గుణిజం L.C.F) ఎంత?
నేను : లెక్కల్లో సామాన్య శాస్త్రం ఎందుకొచ్చిందబ్బా అని డవుట్ వచ్చి పిచ్చి చూపులు...
నాన్న : చెప్పు ( గట్టిగా గద్దిస్తూ..)
నేను : £$%&*$£%$
----టంగ్----( గుడిలో గంటలాగ నా బుర్ర మీద మొట్టికాయ శబ్దం )
నాన్న : వంద రూపాయల్ని ఇద్దరు 2:3 నిష్పత్తి ( Ratio ) లో పంచుకుంటే ఒక్కక్కరికి ఎంత వస్తుంది?
నేను: సమానం గా పంచుకోకుండా పత్తిలాగా పంచుకోవటం ఏంటో అనుకుని కె.ఏ. పాల్ గారి లాగ నోటికొచ్చిన సమాధానం చెప్పాను.
----టంగ్------
మా నాన్నకు విషయం అర్ధమయ్యింది. ఆ రోజు ప్రతీ లెక్క నాకు అర్ధం అవుతుందో లేదో కూడా తెలుసుకోకుండా దగ్గరుండి చెబుతూ మధ్య మధ్య లో బుర్ర మీద గుడి గంటలు మోగిస్తూ ఓ పాతిక లెక్కలు వరసపెట్టి చెప్పారు. నాకేమో ఒక లెక్క అర్ధమయ్యేసరికే మొదడు మోకాళ్ళలోకి జారిపోయేది. అంతా అయ్యాక చూస్తే నాకు మిగిలింది ఖాళీ బుర్ర మీద మొట్టికాయల తీపిగుర్తులు. నా వయసు నవోదయ పరీక్ష రాయడానికి సరిపోదని తర్వాత అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. అప్పటినుండి జింబకు జిల్లో...జింబకు జిల్లో...అని పాడుకుంటూ, తలాండించుకుంటూ ఎప్పటిలాగే ఆటకి సిద్దం అయిపోయాను.
ఏడో తరగతిలో ఓ రిటైర్డ్ లెక్కల లెక్చరర్ దగ్గర నాకు ట్యూషన్...ఆయన తప్పు చెబితే చాలు చెవి చివర తెగ చిక్కేసేవాడు. సహనం తక్కువ, కోపం ఎక్కువ ఆయనకి. అక్కడకెళ్ళే కంటే మా నాన్న దగ్గర లెక్కలు చెప్పించుకొని గుడి గంటలు
మోగించుకోవటమే బెటర్ అనిపించేది నాకు. ఎప్పుడు చూసినా నీకు బేసిక్స్ రావు అని సంకలన తత్సమాంసం(association laws) అంటే ఇది... గుణకార తత్సమాంసం అంటే ఇది....గాడిద గుడ్డుమాంసం అంటే ఇది అని తెగ విసిగించేవారు. ఆయన చిక్కుడు భరించలేక ఓ సారి నేనే ఓ పేపర్ లో టెక్స్ట్ బుక్ చూసి ప్రశ్నలు,జవాబులు రాసేసి, మంచి మార్కులు వేసుకుని, ట్యూషన్ లో పరీక్ష పెట్టారని నాన్నకు, స్కూల్లో పరీక్ష పెట్టారని ట్యూషన్ సార్ కి అబద్దం చెప్పేసి కొంచెం ఇంప్రెషన్ కొట్టేసరికి ఆయన చిక్కుడు కొంచెం తగ్గింది.
ఏడో తరగతి పబ్లిక్ పరీక్ష కావటంతో ఫైనల్ పరీక్షలు అయ్యాక రిజల్ట్ వచ్చినప్పుడు నాన్న స్కూలుకి వెళ్ళి నా మార్కులు కనుక్కొన్నారు. మా హెడ్మాస్టర్ "మీ అబ్బాయికి అన్నింటిలోనూ ఇంచు మించు ఎనభై శాతం మార్కులు వచ్చాయి..కానీ లెక్కల్లో మాత్రం నలభై అయిదు శాతం వచ్చాయి...కొంచెంలో స్కూలు టాపర్ అవ్వటం మిస్సయ్యాడు" అని చెప్పటంతో లెక్కల్లో వీడి రేంజ్ ఇంతే అని నాన్న ఫిక్స్ అయిపోయారు.
మొదటిసారి ధర్మారావు మాస్టారు లెక్కలు చెబుతుంటే ఏందుకో చాలా ఇంటరెస్ట్ కలిగింది. ఆయన చెబితే ఎవ్వరికైన అర్ధం అవ్వాల్సిందే అని నాన్నకు ఎవరో చెప్పినట్టు ఉన్నారు. ఎనిమిదిలో నన్ను అక్కడ ట్యూషన్ పెట్టించారు. ఆయన లెక్కలను దేనికో ఒక దానికి అన్వయించి చెప్పేవారు. అలా లెక్కలపట్ల నాలో కొంచెం ఆసక్తి కలిగింది. ఆ తర్వాత దుంపలబడి వదిలి ప్రవేటు స్కూలు చేరటంతో ట్యూషన్ కి టైమింగ్ కుదరక వెళ్ళటం కాలేదు. సరిగ్గా ఇక్కడే కంచికి వెళుతుందనుకున్న నా లెక్కల కధ ట్రాఫిక్ జాం లో ఇరుక్కుని కోటీ మార్కెట్ దగ్గరే ఆగిపోయింది.
మనకి ఒక మాథ్స్ టెక్స్ట్ బుక్ చూస్తేనే భయం...అలాంటిది ఆ స్కూల్లో తొమ్మిదో తరగతిలోనే తొమ్మిది,పది తరగతుల మాథ్స్ ( కొన్ని చాప్టర్లు ) చెప్పేసేవారు. అసలు ఒక్క మాథ్స్ టెక్స్ట్ బుక్ తోనే నాకు బాలయ్య సినిమా కనపడేది. అలాంటిది రెండు మాథ్స్ బుక్ లు...అంటే రెండు బాలయ్య సినిమాలు...ఇంక నా కష్టాలు దేవుడికెరుక...క్లాసులో ఎప్పుడూ నన్నే నిలబెట్టి లెక్కల టీచర్ ప్రశ్నలు వేసేది. ఏదో ఒకటి చెప్పమని బెత్తంతో కొట్టేది. భయంతో నేను సౌండ్ లేకుండా లిప్ మూమెంట్ ఇచ్చేసరికి ఆవిడకి ఒళ్ళు మండి ఆన్సర్ చెప్పమంటే మంత్రాలు చదువుతావేమిరా అని నాలుగు పీకేది. ఇలా తొమ్మిదో తరగతి లెక్కల క్లాసంతా పిచ్చి చూపులు, జడ్డి హావభావాలతో అప్పుడప్పుడూ రొటీన్ కి భిన్నంగా ఆర్. నారాయణమూర్తి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ గడిపేశాను.
పదిలో మళ్ళీ ధర్మారావు మాస్టారి ట్యూషన్. పొద్దున్నే ఆరింటికే ట్యుషన్ అవ్వటం వల్ల అక్కడకు వెళ్ళడానికి వీలయ్యేది. ఆయన లెక్కలు చెబితే మనమే సొంతంగా చెయ్యాలి అన్న ఆసక్తి ఆటోమేటిగ్గా వచ్చేసేది. ట్యూషన్ లో అందరూ ప్రాబ్లం కి స్టెప్స్ చెప్పటానికి పోటీ పడేవారు. అలా ఉండేది ఆయన క్లాసు. కోటీ మార్కెట్ దగ్గరే ఆగిపోయిందనుకున్న నా కధ మళ్ళీ ప్రారంభమయ్యింది. మాస్టారి పుణ్యమాని నెమ్మది నెమ్మదిగా లెక్కల మీద పట్టు రావటం మొదలైంది. సాయింత్రం స్టడీ అవర్స్ లో అప్పుడప్పుడూ మా లెక్కల టీచర్ లెక్కల విషయంలో నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అనేది.
ఇంతలో పదో తరగతిలో మొదటి మంత్లీ ఎగ్జాం రానే వచ్చింది. అన్నీ పరీక్షలు అయిపోయాయి. నా లెక్కల పేపర్ దిద్దినప్పుడు మా టీచర్ కి బాలయ్య కొండ ఎక్కి కుందేలుని రక్షించే సీన్ చూపించకుండానే మూర్చవచ్చినంత పనైంది. నా పేపరేనా అని రెండు మూడు సార్లు నా పేరు చూసుకుందట. కారణం టెస్ట్ లో లెక్కల పేపర్-1 మరియు పేపర్-2 లో నూటికి నూరు మార్కులు రావటమే. నాకైతే ఏ దశలోనూ హిట్టు కాని నా లెక్కల సినిమా ఆ రోజు సూపర్ హిట్టు అవ్వటం వల్ల ప్రపంచాన్ని జయించినంత ఆనందం. అటు తర్వాత కొన్ని రోజులకి టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్....అక్కడ కూడా 96 మార్కులతో లెక్కలు పాసవటం...ఇంక అప్పటి నుండి లెక్కల్లో ఎప్పుడూ తొంభై శాతం మార్కులకు తక్కువ కాకుండా( ఎంసెట్ తో సహా) తెచ్చుకోవటం వల్ల నా లెక్కలు సినిమా మెగా హిట్టుకి చేరువైంది. ఇలా ఒక వయసు వచ్చేవరకు గణితం నన్ను తకధిమితోం ఆడించింది.
46 కామెంట్లు:
నాకు స్కూల్లో 'తొలి బెత్తం దెబ్బ' రుచి చూపించింది గణితమే.. మీతోనూ ఆడుకుందన్న మాట.. నేను ఓటమిని అంగీకరించి వెనక్కి తగ్గాను..మీరు పోరాడి గెలిచారు.. అభినందనలు..ఎప్పటిలాగే చక్కగా ఉంది టపా..
>>ఓ సారి నేనే ఓ పేపర్ లో టెక్స్ట్ బుక్ చూసి ప్రశ్నలు,జవాబులు రాసేసి, మంచి మార్కులు వేసుకుని, ట్యూషన్ లో పరీక్ష పెట్టారని నాన్నకు, స్కూల్లో పరీక్ష పెట్టారని ట్యూషన్ సార్ కి అబద్దం చెప్పేసి కొంచెం ఇంప్రెషన్ కొట్టేసరికి ఆయన చిక్కుడు కొంచెం తగ్గింది.
ఆహా..! ఏమి తెలివి... :D
>>అప్పుడప్పుడూ రొటీన్ కి భిన్నంగా ఆర్. నారాయణమూర్తి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ గడిపేశాను.
హహహహ..... :)
మీ ధర్మా రావు మేష్టారు దేవుడు సార్ ! దేవుడే.. !
నాకు లెక్కలంటే ఫోబియా. ముఖ్యంగా లెక్కల క్లాసులో సాధారణంగా జరిగే బహిరంగ అవమానాలు! వా..! పైగా, లెక్కలు వచ్చినోళ్ళే క్లెవర్లు అనే బిల్డప్పూ - మిగతా వాళ్ళు - వేస్టు ఫెలోస్ అన్న తీర్మానాలు నాకు నచ్చెవి కావు. అయినా, లెక్కలు వచ్చిన వాళ్ళే జీవితంలో, బాగా నిలదొక్కుకున్నారు. తెలుగు భాషలో ..(అసలే భాషలో అయినాసరే) నాకు నచ్చని ఒకే ఒక్క పదం - లెక్కలు !
చాలా బాగా రాసారు. స్కూలు రోజులు గుర్తొచ్చాయి.
ఛీ.....వెధవ లెక్కలు ,లెక్కల మాస్టర్లను చూస్తె రాక్షసుడని చూసినట్లుండేది ...మనము ఎప్పుడు లెక్కల్లో వీకే ,ఆఖరకి ఇంట్లో డబ్బులు లెక్క పెట్టడంలో కూడా వేరి పూర్ ,కాబట్టి ఈ లెక్కలకి మనము చాల దూరం ......ఆద్యంతం హాస్యంగా ,ఆసక్తిగా రాసారు చక్కని బొమ్మలతో .
అబ్బ, నాకింత మంది తోడున్నారా ఇక్కడ! థాంక్యూ గైస్!
అమ్మో.. నాకు చిన్నప్పటినుండి లెక్కలంటే చాలా ఇష్టం.. కాని ఆల్జీబ్రానే గాభరా పుట్టించేది.. మిగతావన్నీ ఈజీనే. క్లాసులో టీచర్ కంటే ఎన్నో లెక్కల ముందు చేసుకుని ఉండేదాన్ని. నన్ను చూసి మిగతావాళ్లు మొదలుపెట్టారు. ఇక ఎవరు ఎక్కువ లెక్కలు పూర్తి చేస్తారని పోటీ..
@మురళి గారు,
థాక్సండీ..
@మోహన గారు,
ఏంటండీ..మిమ్మల్ని లెక్కలు ఇబ్బంది పెట్టాయో లేదో చెప్పలేదు. అంటే మీరు లెక్కల్లో చాలా షార్ప్ అన్నమాట. ధన్యవాదాలు.
@Sujata గారు,
అవునండీ నిజంగా ఆ సార్ నా పాలిట దేవుడే.
>>పైగా, లెక్కలు వచ్చినోళ్ళే క్లెవర్లు అనే బిల్డప్పూ - మిగతా వాళ్ళు - వేస్టు ఫెలోస్ అన్న తీర్మానాలు<<<
ఇక్కడే కరెక్ట్ గా మన ఆత్మవిశ్వాశం దెబ్బతినేది. మా సార్ అలా చేయ్యకపోబట్టే నేను అలా మారగలిగాను.
>>తెలుగు భాషలో ..(అసలే భాషలో అయినాసరే) నాకు నచ్చని ఒకే ఒక్క పదం - లెక్కలు ! <<
హాహ్హ్హహా..హాహ్హ
థాక్సండీ.
@చిన్ని గారు,
హాహ్హ..హ్హా..
అసలు లెక్కలు మా ధర్మారావు మాస్టారిలాగ చెప్పే విధానంలో చెబితే మనకందరికీ ఇన్ని కష్టాలు ఉండేవికాదండి. పైగా ఇష్టం వచ్చేది కూడా.
ధన్యవాదాలు.
@సుజాత గారు,
మీ స్పందనకు నెనర్లు.
@జ్యోతి గారు,
అంటే మీరు లెక్కల విషయంలో మంచి క్లెవర్ స్టూడెంట్ అన్నమాట. మీలాంటి స్నేహితురాలు నాకు ఆ టైంలో ఉండి ఉంటే నేను అన్ని లెక్కలు కాపీ కొట్టేసి బోల్డన్ని దెబ్బలు నుండి తప్పించుకునుండేవాడినండి. ఇంతకు పోటీలో మీరే ఎప్పుడూ ముందుండేవారా?
ధన్యవాదములు.
భలే! భలే!..మీ టపా బెస్ట్!
నేను మాత్రం లెక్కల్లో ఫస్ట్!
@padmarpita గారు,
మీ స్టైల్ లో భలే కమెంటారు. థాక్సండీ..
@శేఖర్ గారూ..
నాకూ ఉన్నాయండీ కష్టాలు.. ఇప్పుడు మీరు కదిపారుగా.. చెప్తా వినండి... :)
నా కష్టాలు, అవి లెక్కలతో కాదు. లెక్కల మాష్టార్లతో.. నాకూ వాళ్ళకీ ఎప్పుడూ పడేది కాదు. నా పద్ధతిలో చేస్తా అంటే ఒప్పుకునేవారు కాదు మరి.. అలా అని తప్పేంటో చెప్పేవారు కూడా కాదు..!! మనం అసలే మొండి ఘటాలం. తప్పేంటో చెప్తే కానీ పద్ధతి మార్చుకోం!! దానికి తోడు, రెండు సార్లు రాష్ట్ర స్థాయి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారం అందుకున్న లెక్కల మాష్టారి మనమరాలిని, ఆయన ప్రియ శిష్యురాలిని.... మరి ఆ మాత్రం మొండి ఉంటుంది కదండీ... ఈ దెబ్బతో నేను చదివిన ప్రతి చోటా, ఆఖరికి ఇంజనీరింగ్ లో కూడా నాకు ఈ తగువులు తప్పలేదు. ఇదంతా చెప్తే ఎక్కడ సొంత డబ్బా అనిపిస్తుందా అని చెప్పలేదండీ.. :P
మోహన గారు,
:)
మీ అనుభవాలు పంచుకున్నందుకు నెనెర్లు.
FANTASTIC!!!
ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క ప్రయోగం ఆస్వాదించి ఆనందించా. సెబాషు.
నాకు మూడో క్లాసులో భిన్నాల మీద మా టీచరుగారు పెట్టిన స్లిప్ టెస్టుల్ని తల్చుకుంటే ఇప్పటికీ ఠారెత్తుతుంది. ఈ స్లిప్ టెస్టుల పద్ధతి ఈ విధంగా ఉండేది.
ఐదు ప్రశ్నలు. ప్రశ్న (లెక్క) ఎక్కడా రాసి ఉండదు. టీచరు నోటితో చెబుతారు. చెప్పాక మనకి ఆలోచించుకోడానికి ఒక క్షణం టైమిస్తారు. ఒకటి అనంగానే పెనిసిలు చేతిలో తీసుకోవాలి. రెండు అనంగానే సమాధానం రాసెయ్యాలి. మూడు అనంగానే పెనిసిలు కింద పెట్టెయ్యాలి. నేను పీహెచ్ డీ ఓరల్ ఎగ్జాములో కూడా ఇంత టెన్షను పళ్ళా!
శేఖర్ గారూ,
టపా శీర్షిక నుంచి చివరివరకు చాలా చాలా బాగుంది..కొన్ని వాక్యాలయితే మరీనూ..
ఇక్కడి చాలామందిలా నేనూ లెక్కల్లొ చాలావీక్. చిన్నప్పుడయితే 13, 17, 19 ఎక్కాలు ఓ పట్టాన వచ్చేవి కావు ..ఏదో అలా నెట్టకొచ్చేశా చదువు బండిని..
లెక్కల సబ్జెక్ట్ లో యూనిట్ టెస్టుల్లొ మార్కులు చూసి మాష్టార్లు "నువ్వు తప్పక తప్పుతావు నాయనా" అని దీవించేవారు... అదేంటో ఫైనల్ పరీక్షల్లొ క్లాసులొ మొదటి ఐదారు స్థానాల్లొ ఉండేవాడిని..నాకిప్పటికీ అర్ధంకానిది నా లెక్కల చదువే..ఫైనల్ పరీక్ష కదా అని భయంతొ వీరోచితంగా పోరాడేవాడిననుకుంటా...
అదరహో!
@కొత్తపాళీ గారు,
మీ కాంప్లిమెంట్ చదివి 'గాల్లో తేలినట్టుందే..' అని పాడుకోవటం మొదలుపెట్టాను. చాలా ధాంక్స్.
మీ లెక్కల టీచర్ లెక్కలు చేయించే విధానం కొత్తగా ఉందే!
@ఉమాశంకర్ గారు,
ధాక్సండీ..
హ..హా..ఒక రకంగా మీవీ నాలాంటి కష్టాలే అన్నమాట.
@మహేష్ గారు,
నెనర్లు.
శేఖర్ గారూ కేసేసుకోవాలి మీ ఇంటి అడ్రస్ చెప్తారా క.సా.గు లు,త్రికోణమితిలు అన్నీ గుర్తుచేసి నన్ను బాధపెట్టినందుకు,నా గుండె వేగాన్ని పెంచినందుకు,మర్చిపోయిన నా అసమర్ధతను గుర్తుఏసినందుకు మీ మీద కేసేస్తున్నాను.
>>ఓ సారి నేనే ఓ పేపర్ లో టెక్స్ట్ బుక్ చూసి ప్రశ్నలు,జవాబులు రాసేసి, మంచి మార్కులు వేసుకుని, ట్యూషన్ లో పరీక్ష పెట్టారని నాన్నకు, స్కూల్లో పరీక్ష పెట్టారని ట్యూషన్ సార్ కి అబద్దం చెప్పేసి కొంచెం ఇంప్రెషన్ కొట్టేసరికి ఆయన చిక్కుడు కొంచెం తగ్గింది
అప్పట్లో ఇన్ని ఇన్ని మంచి మంచి అయిడియాలు నాకు ఎందుకు రాలేదబ్బా ????అబ్బా ఏం రాసారండి,అందరికి బాల్య స్మృతులు గుర్తు వచ్చేసి ఉంటాయి దెబ్బకు
రాధిక గారు,
:))
అయ్యో అలా ఎందుకండీ అనుకుంటున్నారు...మీరు కవితలు రాసినట్టు మేధమేటీషియన్ రామానుజన్ రాయగలడా చెప్పండి?
ధన్యవాదాలు.
నేస్తం గారు,
అప్పట్లో మీకు నాలాంటి వాళ్ళతో సహవాసం లేనట్టుంది. అందుకే తింగరి అవిడియాలు లేక బుద్దిగా చదివేసుకునుంటారు:).
ధాక్సండి.
జనక్ జనక్ పాయల్ బాజే లాంటివి వాడాం గానీ, బాలయ్య సినిమాలు, నిధులు లేక సగం కట్టి ఆపేసిన.. ఆహా, అదరగొట్టేసారు. బ్రహ్మాండమైన ఉపమానాలు!
అయినా లెక్కలు మరీ బాలయ్య సినిమా అంత ఘోరం కాదులెండి. :)
@చదువరి గారు,
అవునండి లెక్కలు మీరన్నట్టు మరీ అంత ఘోరం కాదని నాకు కొద్ది రోజులకే తెలిసింది. కానీ ఆ విషయం అర్ధంకాక ముందు మాత్రం నిజంగా బాలయ్య సినిమానే 70MM లో కనపడేది:). మీ స్పందనకు ధన్యవాదాలు.
hahahha baagundi........
lekkalu ante chaala mandiki bhayam vunntlunde.........
ఇలా తొమ్మిదో తరగతి లెక్కల క్లాసంతా పిచ్చి చూపులు, జడ్డి హావభావాలతో ...hi hi
అసలు తొమ్మిదో క్లాసు నుండి లెక్కలు చిరాగ్గా ఉంటాయి ..ఏంటో చక్రం లోపల త్రిభుజం, చక్రం బయట త్రిభుజం, ఇంకా ఎమిటేమిటొ నిరూపించమంటారు ...నేను ఎం చదివి మాథ్స్ లో ఫస్ట్ అని నాకే తెలిదు ...
ఉపమానాలు అదిరిపోయాయండీ!
నాకూ ఓ టపా రాయాలనిపిస్తుంది. ఈ నాటికీ తీరని నా లెక్కల కష్టం గురించి . బుడుగు బొమ్మలు భలే సరిపోయాయి మీ టపాకి. మొత్తానికి అదుర్స్
@లలిత గారు,
:-)
థాంక్యూ..ఇందాకే మీ లెక్కల టపా చూశానండి..
naaku meetho oo cup coffee thagalani undi...naaku oka project idea undi daaniki mee sahakaaram kaavaali..nijanga idi chaala challga undi ...
ఈ టపా చదువుతున్నపుడు చాలా నవ్వుకున్నాను :-)
నాకు ఐదవ తరగతి వరకు ఇదు,పది ఎక్కాలు తప్ప వేరేవి సరిగ్గా వచ్చేవి కాదు, మా శ్రీనివాసు సారూ గారు పదిహేను ఎక్కం వరకు ఒక్కోక్కకరిని లక్కీ డ్రా వేసి మరి ఒక్కో ఎక్కం అడిగేవారు, నేను మాత్రం "దేవుడా" నన్ను ఐదు లేదా పది ఎక్కం అడగాలని మొక్కేదాన్ని ఆ క్లాసులో.
నాకు లెక్కలకి ఏనాటి అనుబంధమో BSc(Maths) లో మొదటి,రెండు సంవత్సరాల లో 150/150 మూడో ఏడాది 140+ రావడం తో "university Gold Medal" కాస్త దొబ్బింది.
కొసమెరుపు ఏమిటంటే ఇప్పటి కి కూడ నాకు 12 ఎక్కని కి మించి సరిగా రావు :-)
హహహ. చాలా బావుంది. ముఖ్యంగా మీ సొంత పరీక్ష పేపర్ ఐడియా అదిరింది. సూపర్ అసలు.
నాది ఆల్మోస్ట్ సేం టు సేం స్టొరీనే. కాకపోతే సబ్జక్ట్ ఫిజిక్స్. I still hate Physics for one teacher in the 10th. :(
@సుభాష్ గారు,
సారీ మీకు ఆలస్యంగా ప్రతిస్పందించినందుకు...మీ కమెంట్ చూడటం మిస్సయ్యాను..
ఏంటండి..నేనేమైనా సెలబ్రిటినా? నాతో కాఫీ అని అడుగుతున్నారు...మీ ప్రాజెక్ట్ ఐడియా ఏంటో చెప్పండి మరి..
థాంక్స్ ఫర్ ది రెస్పాన్స్..
@పద్మ గారు,
థాంక్యూ...మాకు ఫిజిక్స్ సార్ చాలా చక్కగా చెప్పేవారండి..అయినప్పటికీ ఇంటర్లో ఫస్టియర్ ఫిజిక్స్ చాలా టఫ్ గా ఉంటుంది..అప్పుడు మాత్రం నేను భయపడ్డాను కొంచెం...
@రాధిక గారు,
ఎక్కం కోసం మొక్కటం..హాహ్హ..హ్హ..హ
అయ్యో..మీకు కొంచెంలో గోల్డ్ మెడల్ మిస్సయిదన్నమాట...మనలో మన మాటండి..నాక్కూడా పన్నెండో ఎక్కం తర్వాత అంత బాగా రాదు...ష్!!..ఎవరికీ చెప్పొద్దు..:-)
ఒక్కొక్క టపా చదవటమే కాకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలుపుతున్నందుకు మీకు బోల్డన్ని థాంకులండీ...
రెండు మాథ్స్ బుక్ లు...అంటే రెండు బాలయ్య సినిమాలు
ante Allari Pidigu naa
ఏది ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రూవ్ చేయండి...
పడీ పడీ నవ్వలేక చస్తున్నానండీ. మా చెల్లి నాకు పిచ్చెక్కిందేమోనని నన్నే గమనిస్తూంది. ఈ సంకలన తత్సమాంసం ఏమిటండీ అసలు గుర్తుకురావడంలేదు. నాకు లెక్కలతో ఏ పాట్లూ లేవు కానీ ఫిజిక్స్ ఉంది చూశారా అమ్మో ఆ సబ్జెక్ట్ తో పడరాని పాట్లు పడ్డానండి బాబూ. మార్క్స్లిస్ట్లో మిగతా సబ్జెక్ట్లన్నీ ఎనబైలకి తగ్గితే ఆశ్చర్యంగానూ, ఫిజిక్స్ 35 దాటితే ఆనందంగానూ ఉండేది. ఇప్పటికీ భయమే ఆ సబ్జెక్ట్ అంటే.
@జొన్నాధుల గారు,
మీరడిగింది నాకర్ధం కాలేదండీ..నేను ఆయన కొన్ని సినిమాలు వరసగా చూడమంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాకు రెండు మేధ్స్లు చదవటం అని చెప్పాలనుకుని అలా రాసాను..
థాంక్యూ..
@తార గారు,
ప్రూవ్ చేయాలంటే పెన్నూ పేపర్ ఉండాలి కదండీ..:-)
థాంక్యూ..
@శిశిర గారు,
:)
"సంకలన తత్సమాంసం" అంటే (a+b)+c చేసినా a+(b+c) చేసినా రిజల్ట్ ఒకటే అని ఇది చెబుతుంది... Association Laws ఉన్నాయి కదండి మేధ్స్ లో..వాటిల్లో ఒకటన్న మాట ఇది..ఇంగ్లీష్‌లో దాన్ని ఎమంటారో నాకు తెలీదు మరి..:-)
ఫిజిక్స్ చెప్పే సార్ బట్టీ ఉంటుందండీ..మేధ్స్ చేయగలిగిన వాళ్ళు ఫిజిక్స్ కూడా బాగానే చేయగలుగుతారు భయం పోగొట్టుకుంటే అని మా ఇంటర్ సార్ మాతో అనేవారు ఎప్పుడూ...:)
థాంక్యూ..
ఆ థీరం కనిపెట్టినప్పుడు పెన్నూ, పేపరు లేవు కదండి, మీరూ అలనే నోటి లెఖ్ఖగా చెప్పండి.
(a+b) = (b+a) Commutative (Abelian.)
a+(b+c) = (a+b)+c associative
a+b = b+a = 0 Inverse
a+e=e+a = a Identity.
ఆ థీరం కనిపెట్టినప్పుడు పెన్నూ, పేపరు లేవు కదండి, మీరూ అలనే నోటి లెఖ్ఖగా చెప్పండి.
వీటిని చిన్నప్పుడు మన చేత బట్టీ కొట్టియ్యటం తప్ప వివరించి చెప్పిన పాపాన ఒక్కరూ ఒక్కరూ లేరు.
@తార గారు,
అది నోటి లెక్కగా చెప్తే అర్ధం కావటం కష్టమండి..ఎందుకంటే విజువలైజేషన్ అవసరం అవుతుంది..కమెంట్ బాక్స్ ఇమేజ్ లు allow చేయదు కనుక, చూపించటం కుదరదని మీకలా పెన్ను, పేపర్ లేవని సింపుల్ గా చెప్పేసాను...మీరడిగారు కాబట్టి నేను మాగ్జిమమ్ మీకు అర్ధమైనట్టు వివరించడానికి ప్రయత్నిస్తాను..
ఒక చతురస్త్రం A తీసుకోండి...అలాగే చతురస్త్రం B ని A లోపల ఉన్నట్టు ఊహించండి...B యొక్క భుజము x పొడవు అనుకోండి..
B, A లోపల ఎలా ఉందంటే B యొక్క శీర్షం A యొక్క భుజాన్ని రెండు భాగాలుగా విభజించేటట్టు ఉంది...ఈ రెండు భాగాల పొడవులను y,z అనుకోండి..
______\/_________
y z
పైన చెప్పిన విధంగా మీరు బొమ్మ గీస్తే మీకు ఎలా కనిపిస్తుందంటే A చతురస్త్రం లోపల నాలుగు త్రిభుజాలు, ఒక చత్రురస్త్రం(B) ఉన్నట్టు ఉంటుంది..
A యొక్క వైశాల్యం = B యొక్క వైశాల్యం + 4(ఒక్కొక్క త్రిభుజం యొక్క వైశాల్యం)
(y+z)2= x2 + 4(1/2*y*z)
దీన్ని విశదీకరిస్తే y2+z2+2yz = x2+2yz
రిజల్ట్ y2 + z2 =x2
అంటే ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల(కర్ణం కాకుండా మిగిలినవి) పొడవు వర్గాల మొత్తం దాని కర్ణం పొడవు వర్గానికి సమానం...
శేఖర్ నేనూ ట్యూషన్ లో చేరుతాను ప్లీజ్ :)
బాగున్నది.
మీరు చెప్పిన ప్రూప్ మీకు పూర్వమే వచ్చా? లేక నేను అడిగాక అలోచించారా?
పూర్వమే నేర్చుకుంటే గనుకు ఎప్పుడు , ఎక్కడ (క్లాస్ లోనా? బయటా?) నేర్చుకున్నారు? (నాకు??) ఇవి చాలా అవసరం అందుకే అడుగుతున్నాను, మరొలా అనుకోకండి.
నోటి లెఖ్ఖగా అంటే, రియల్ యాక్సిస్ తీసుకొని, (a,0) (0,b) ని కలిపితే వచ్చే మూడూ (lines, right angled triangle), వాటి మధ్య దూరం{a, b, root (a^2+b^2)}, సరిపోతుంది కదా..
@నేస్తం గారు,
మీరు పది కాలాల పాటు మీ పోస్టులతో అలరిస్తూ ఉండాలని నా కోరిక...తిక్క తిక్క లెక్కలతో మీ బుర్రను పాడు చేసి మీ అభిమానుల ఆగ్రహానికి గురవ్వలేను..కాబట్టి మీకు ట్యూషన్ కేన్సిలంటే కేన్సిలే!! :-)
@తార గారు,
ఇంతకు ముందు తెలీదండీ..మీరడిగారని బుర్రని కాస్త బూజు దులిపి ఉపయోగించటం మొదలెట్టాను..చాలా చించానులెండి..చివరికి ఆ ఐడియా వచ్చింది.. ఇదివరకు నేను ఇలాంటిది ఎప్పుడో చేసుంటాను..స్పష్టంగా గుర్తులేదు..ఎక్కడ ఎప్పుడు అంటే చెప్పలేనండీ..
ఇంక మీరు చెప్పింది సింపుల్ గా చక్కగా ఉంది. కాకపోతే మీరు రేఖాగణితం వాడి చేసారు. రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవటం తెలిస్తేగానీ అది చేయలేరు..మీ ప్రూవ్ చూసాక పాత బెడ్ లైట్ ఒకటి వెలిగింది నా బుర్రలో..:)
మొన్న ఒక రోజు 6-12 వరకు పుస్తకాలు తిరగేశాను, ఒక్క చోటా ప్రూవ్ లేదు, అలనే త్రికొణం మూడు కోణాలు కలిపి 180, ఇవి ఎవీ మనకి లేవు, అలా ఏడిచాయి, ఇవి తెలియకుండా మనం చదివేశాం, అసలు ఎంత మందికి ఈ బేసిక్స్ తెలుసో చూస్తున్నాను అందుకనే అడిగాను, తప్పుగా అనుకోకండి.
@తార,
పదవ తరగతి పుస్తకం లో ఉండాలి కదా,
శెఖర్ గారు జామెట్రీ ప్రకారం చెప్పారు.. ఇదే కాక పైథాగరన్ థీరం ప్రూవ్ చెయ్యడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి..
ఇక త్రికోణం సంగతి: ఆరవ తరగతిలో ఒక ప్రూఫ్ చదివినట్టు నాకు బాగా గుర్తు.. మీరు మరొకసారి చెక్ చెయ్యండి..
ఇక నాకున్న ఒక డౌట్ ఏమిటంటే పై=3.14 ఎందుకు అయ్యింది? దీని వెనకాల ఉన్న రేషనల్ ఏమిటి??
మైల్ చేయ్యనా కార్తీక్?? పై గురించి??
త్రికొణంది వునట్టు వున్నది, కానీ మనం ప్రూప్లకి ఇవ్వల్సినంత విలువ ఇవ్వకుండా, అన్నీ ఫార్ములాల కిందే వేస్తున్నాము, దాని వలన, మనం మంచి గణిత శస్త్రవేత్తలని మన దేశంలొనే తయ్యారు చేసుకోలేకపోతున్నాం, ఎప్పుడైతే లెఖ్ఖలు చిక్కిపొతయ్యో, శాస్త్ర విజ్ఞానం 3 కాళ్ళ మీద నడుస్తునట్టే,
బాబోయ్ లెక్కలు . మీరు నాకు పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పినా సరే...మళ్ళీ మీ బ్లాగుకేసి వస్తానేమో చూడండి .....వా...ఆ......
@లలిత గారు,
బాబ్బాబు..మీరలా ఏడవకండీ...ప్లీజ్..నేను తార గారికి చెప్పింది ఒట్టి ఖాకి లెక్క... పార్టీ టికట్ ఏంటండి చీప్ గా...మీకు పార్టీ రాష్ట్ర మహిళా విభాగానికి ప్రెసిడెంట్ పదవి ఇచ్చేస్తాను...ప్లీజ్ నా బ్లాగుకు రాకుండా మానకండేం :-)...ఇంకా అలక మానరా..అయితే మీరు ఈ సారి వడియాలు పెట్టినప్పుడు మొత్తం వడియాలన్నీ నేనే పెడతాను..సరేనా!!:-)
శేఖర్ అసలే నోట్లో నాలుక లేనిదాన్ని నేనాపదవికి న్యాయం చెయ్యలేను కానీ , మీరు వడియాలు పెట్టడం ప్రాక్టీస్ చెయ్యండి గుండ్రంగా......
ఇప్పుడే మీ గణితంతో కుస్తీ టపా చదివా...
ఒక్క నిమిషం ఏం రాయాలో అర్ధం అవ్వలేదు...ఒక పక్క మనసుని అంతగా పిండేస్తూ మరో అలా నవ్వు తెప్పించే టపాలు ఎలా రాయగలుగుతున్నరండీ... మీకు నిజ్జంగా hatsoff!!
ఇక పొతే ఈ టపా విషయానికి వస్తే నాది మీ లాంటి స్టోరినే ..నాకు ఓ ఎనభైల్లో అలా మార్కులు వచ్చేవి...అవి తెచ్చుకోవడానికే చాలా కష్టపడేదాన్ని,ఆ మాత్రం తెచ్చుకోకపోతే మా క్లాస్ అందరూ చీప్‌గా చూస్తారు అనే భయం ...ఎందుకంటే నేనే మా క్లాస్ టాపర్‌ని. టాపర్‌కి లెక్కల్లో తక్కువ వస్తే ఎంత అవమానం చెప్పండీ..పరీక్షలప్పుడు ఉన్న దేవుళ్ళందరికి మొక్కులు మొక్కేసి...ఓ రెండు నైట్ అవుట్లు చేసేసి ఇంట్లో అందరికి లెక్కల యుద్దానికి వెళ్తున్నాను అని తెలిసిపొయేదన్న మాట...మధ్యలో చిన్న ట్విస్ట్...ఏ ట్యూషన్లకి నేను వెళ్ళలేదు...అదేంటో 9వ తరగతిలో ఫైనల్ పరీక్షల్లో 98 మార్కులు వచ్చేసాయి..నాకు ఒక నిమిషం అర్ధం కాలేదు అది నాకెనా అన్ని మార్క్స్ వచ్చాయి అని...దాంతో నాకు లెక్కలు అన్న సబ్జెక్ట్ బ్రహ్మ విద్య కాదు అని బోధపడింది... దాని పై ఉన్న భయాన్ని పోగొట్టింది....
మళ్ళీ ఆ కబుర్లన్నీ గుర్తుకి తెచ్చినందుకు మీకు బోలెడు
కృతఙ్ఞతలు ...:)
@స్నిగ్ధ గారు,
థాంక్యూ...మీరు కూడా మద్యలోనే లెక్కలని మీ ఆధీనంలోకి తెచ్చుకున్నారన్నమాట...నిజం చెప్పాలంటే ఆ ఫోబియా అంత త్వరగా పోదండీ..ఈ విషయంలో మీరు, నేను చాలా అదృష్టవంతులం...అందులో ఎలాంటి సందేహం లేదు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి