28, జూన్ 2009, ఆదివారం

టైలర్ చిట్టిబాబు...కాప్షన్ : వీడి పేరు చెబితే కత్తెర కూడా జడుసుకుంటుంది

చిన్నప్పుడు పండక్కి కొత్త బట్టలు కొంటున్నారంటే గొప్ప ఆనందంగా ఉండేది. ఈ విషయంలో అందరికీ ఉండే ఆనందం కంటే నాకు రెండాకులు ఎక్కువే సంతోషం. దానికి కారణం నాన్న రెడీమేడ్ బట్టలు కొనడం, గుడ్డ తీసి మా కాలనీలో ఉండే టైలర్ చిట్టిబాబుకి ఇచ్చి కుట్టించాల్సిన అవసరం లేకపోవడం. అందుకే మరి ఆ రెండాకులు ఎగస్టా ఆనందం. చిట్టిబాబు...ఎవరి పేరు చెబితే మీటరు గుడ్డ అరమీటరుకు కుచించుకుపోతుందో...చిన్న పిల్లలు కొత్తబట్టలు( వాడు కుట్టినవి ) వేసుకునే కంటే నంగగా ఉండటానికి ఇష్టపడతారో...ఆడవాళ్ళు కొత్త జాకెట్ కుట్టించుకునే కంటే పాతదే వాడుకుంటే పోలే అని సిల్లీగా కాంప్రమైజ్ అయిపోతారో, ఎవడు పట్టుకుంటే కత్తెర అష్టవంకరులుగా బట్టని కత్తిరిస్తుందో వాడే చిట్టిబాబు. మూతి పైన కుంకుడు గింజంత నల్లటి ఉలిపిరి కాయతో సిఫాన్ గుడ్డలాగ నిగనిగలాడుతూ కనపడతాడు.

నలుగురు ఆడపిల్లలున్న ఏ ఇంటిలో అయినా కొంచం ఆచి తూచి ఖర్చుపెడతారు కదా..అలాగే మా ఇంటిలో కూడా నాన్న సంవత్సరానికి రెండేసార్లు కొత్త బట్టలు కొనేవారు. అక్కావాళ్ళు వారి బట్టలు ఫ్రెండ్స్ చెప్పిన టైలర్ కు కాలేజీకు వెళుతూ ఇచ్చేసేవారు. పెద్దవాళ్ళు చొక్కాలు, పేంట్ లు చిన్నపిల్లలకు ఎడ్జస్ట్ చేసి బాగా కుడతాడు అన్న ఫాల్స్ టాక్ చిట్టిబాబుకు ఉండేది. అందువల్ల కాలనీలో సగం మంది పిల్లలకి చిట్టిబాబు సైజ్ చేసిన బట్టలే తొడగాల్సిన అగత్యం. నాన్న తను కొత్తగా కుట్టించుకుని, తర్వాత అవి నచ్చక వేసుకోని షర్ట్లు, పేంట్లు మా బిరువా నిండా ఉండేవి. అమ్మ ఎప్పుడైనా బీరువా సర్దుతున్నప్పుడు నాన్న వాడని బట్టలు చూడగానే వెంటనే వీటిని ఏం చెయ్యలి అన్న ఆలోచన వచ్చిందే తడవుగా బూమర్ లాంటి బుడగలో అమ్మకు చిట్టిబాబుగాడు కనపడేవాడు.

చిట్టిబాబు రావటం..బట్టలు తీసుకెళ్ళటం..అవి వాడి దగ్గర రెణ్ణెళ్ళ పాటు ముక్కుతూ ఉండటం...ఏం కుట్టలేదు అని అడిగితే అప్పుడు మన ముందు షర్ట్ కత్తిరించటం..చిట్టిబాబు టైలరింగ్ అల్గారిధం లో మొదటి స్టెప్ ఇది. తొందర పెట్టిన పెట్టక పోయినా పెద్దవాళ్ళ బట్టలు పిల్లలకి సైజ్ చెయ్యటం అనే ప్రక్రియలో వాడు ఖచ్చితంగా ఫాలో అయ్యే స్టెప్ అది. మొత్తానికి అమ్మ ఇచ్చిన బట్టలు ఒక శుభముహుర్తాన ( వాడికి..మనకు కాదు ) తీసుకొచ్చాడు. కవర్ ఓపెన్ చేసి షర్ట్ తొడుకున్నా..ఒక్క గుండీకి కూడా దాని అనుబంద కాజా దానికి ఎదురుగా కుట్టలేదు. కొంచం కిందికి కుట్టడంతో షర్ట్ కాస్తా స్క్రర్ట్ లాగా ఉగ్గు ఉగ్గులుగా వచ్చింది. ఒకసారి అద్దం ముందుకెళ్ళీ కొంచం వెనక్కి తిరిగి చూసుకున్న..మా నాన్న కాలరే యధతధంగా ఉంచి దానికి మధ్యలో మడతపెట్టి, పొట్టిగా చేసి నాకు కుట్టేసాడు. ఆ సమయంలో చిట్టిబాబు బుర్రని ఒక బండ రాయితో కొట్టాలనిపించింది. అప్పటి నుండి చిట్టిబాబుని చూస్తే, నాకు కుట్టిన పాత షర్ట్ లన్నీ రింగులు రింగులుగా గుర్తొచ్చి, వాడిని ఏమీ చెయ్యలేక దుంఖం తన్నుకు వచ్చేది.

ఒకసారి నాన్న బట్టలకు తనకు అవసరం అయిన దానికన్న ఎక్కువ గుడ్డ తీసుకున్నారు. మిగిలిన గుడ్డ నాకు షర్ట్ అవుతుందని చిట్టిబాబుకు పిలిపించారు. నాకు చిట్టి బాబు వద్దు...అని గట్టిగా అరిచాను..ఆ తర్వాత నాన్న 'ఏంటీ' అన్న గంభీరమైన మాట విని పిల్లి అయిపోయాను. చిట్టిబాబు రావటం..గుడ్డ తీసుకెళ్ళటం..మా నాన్న ఇవ్వటంతో దాన్ని వారం తిరిగే లోపలే కుట్టి తీసుకురావడం అన్నీ చక చకా జరిగిపోయాయి. నాన్న నన్ను వేసుకోమన్నారు. తీరా చూస్తే ముమైత్ఖాన్ లాగా నా బొడ్డు కనిపించేటట్టు కుట్టాడు. మళ్ళీ వళ్ళు మండింది. కానీ నాన్న పక్కన ఉండటంతో 'మ్యావ్' అని ఊరుకున్నాను. చిట్టిబాబు వెకిలి నవ్వు ఒకటి నవ్వి 'గుడ్డ సరిపోలేదు సార్' అని నాన్నతో అనటంతో వస్తున్న నవ్వుని నాకు తెలీకోడదని ఆపుకుని 'వెదవ ఇంట్లో వేసుకుంటాడులే' అనేసారు. కొద్దిరోజుల తర్వాత నేను ఇసకలో ఆడటానికి వెళ్తే అక్కడ మా చిట్టిబాబుగాడి చిన్న కూతురిని చూసి అవాక్కయ్యాను. ఆ అమ్మాయి గౌనుకు చేతులు, కుచ్చిలు నా షర్ట్ క్లాత్ నుండే తీసుకుని కుట్టేసాడు. ఆ రోజు అదేషర్ట్ నేను వేసుకోవడంతో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను 'అమ్మాయి క్లాత్ ని వీడు షర్ట్ కుట్టించుకున్నాడురా' అని ఏడిపించారు.

వేసవి సెలవుల తర్వాత, చిరిగిపోయి ఉన్న నా బ్యాగు చూసి నాన్న కొత్తది కొంటాను అని చెప్పారు. అదేంటో గాని కొత్త వస్తువులు కొంటున్నామంటే ఏదో తెలియని గొప్ప ఆనందం. ఒరేయ్ రేపటి నుండి నేను కొత్త బ్యాగు తో స్కూలుకి వస్తాను అని దోస్తు గాళ్ళతో చెబుతున్నప్పుడు ఓ రకమైన గొప్ప ఫీలింగ్ ఉంటుంది. కాని నా ఆనందాన్ని దూరం చేయ్యడానికి చిట్టిబాబుకు నిక్కరు వంకరగా కుట్టినంత టైం పట్టలేదు. ఇంట్లో కర్టేన్ లు కుట్టడానికి అప్పటికే మా ఇంట్లో కిటికీలు కొలతలు తీసుకుంటున్న చిట్టిబాబుకు ఈ విషయం తెలిసి 'అయ్యో! కొత్త బ్యాగు ఎందుకండి? మీ పాత ప్యాంటు ఏదైనా ఉంటే ఇవ్వండి...ఓ రెండు స్కూలు బ్యాగులు కుట్టి తెస్తాను' అని నాన్నతో అన్నాడు. దాంతో నాన్న కొత్త బ్యాగు కొనాలన్న ఆలోచనని మానుకుని వాడి చేతిలో ఒక ప్యాంటు పెట్టారు. ఇది చూసిన నాకు తిక్క రేగింది. వెంటనే మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న పొట్టెమ్మ, మా పక్కింటిలో పనిచేసే పనావిడ, అంతకుముందు పక్కింటి ఆంటీతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ' అమ్మా! ఆ చిట్టిబాబు దొంగ సచ్చినోడు జాకెట్ కుట్టమని ఇస్తే చూడమ్మా ఎలా కుట్టాడో...వెనక్కు ఎత్తేస్తుంది ' అని తను వేసుకున్న అష్ట అవకారాలు ఉన్న జాకెట్ చూపించి ' ఆ గొల్లిగాడు ఇటేపు వస్తే ఓ సుట్టు సెప్పమ్మా' అని ఆవేశంతో ఊగిపోతూ ఆంటీతో చెప్పింది. ఇది గుర్తుకు రావటం తరువాయి రయ్యిన పొట్టెమ్మ ఇంటికి వెళ్ళి చిట్టిబాబు మా ఇంట్లో ఉన్నట్టు చెప్పాను. వెంటనే పొట్టెమ్మ ఉన్న పళాన జాకేట్ తీసుకుని పరిగెత్తి మా ఇంటికి వచ్చింది. ఇక చూస్కోండి...చిట్టిబాబు గాడిని తిట్టి కొట్టినంత పని చేసింది. మళ్ళీ కొత్తది ఇస్తానని చెప్పిన తర్వాత గాని వాడిని వదలలేదు. చిట్టి బాబుగాడి మీద ఎప్పటినుండో నాకున్న కోపం ఆ రోజు కొంచం తీరింది.

తర్వాత కుట్టి తెచ్చిన స్కూలు బ్యాగులు కూరగాయలు తీసుకెళ్ళడానికి తప్ప బుక్స్ తీసుకుపోవడానికి పనికి రాదన్నట్టుగా కుట్టాడు. ఇలా మా కాలనీలో ఉన్న అందరి పిల్లల ఆనందంతో చిట్టిబాబు ఆటలాడుకున్నాడు. స్కూలు యునిఫాం లాగుకి కిస్తా అవసరమైనదాని కన్న ఎక్కువ కుట్టడం....టీ.వి కవర్ కుడతానని చెప్పి హార్మోనియం పెట్టెకు సూటయ్యే కవర్ కుట్టడం....లాగు కుట్టరా అంటే.....త్రీ ఫోర్త్ పేంట్ లేదా తెలుగుసినిమా హీరోయిన్ వెసుకునే పొట్టి నిక్కరు కుట్టడం...కొంచం తిండికే వాడుకుట్టే లాగు కడుపుదగ్గర టైట్ గా పట్టేసి కాస్త చిన్న పిల్లలు అర్జెంటు అయినప్పుడు లాగు విప్పుకోవటంలో కష్టపడుతూ
( పెద్ద గుండీకి చిన్న కాజా కుట్టడం మూలాన వచ్చిన చిక్కది ) నిక్కరులోనే రెండో పని కానిచ్చేయటం...ఇలా ఉండేవి చిట్టిబాబు ఘనకార్యాలు. పొరపాటున పెద్దవాళ్ళు రోడ్డు మీద టైలర్ కి అంతదూరం వెళ్ళి ఏమిస్తాములే అని బద్దకించారా ఇక అంతే సంగతులు. వాడు సరిగ్గ కుట్టేవరకూ బట్టలు రెండు, మూడు సార్లు ఇటు..అటూ..తిరగాల్సిందే.

మొత్తానికి మేము వేరే కాలనీకి మారిన తర్వాతే చిట్టిబాబు భాద తప్పింది. అసలు విషయం ఏంటంటే..ఒకప్పుడు చిట్టిబాబుకి పని పాట లేనప్పటికీ, సంభందం చూసి, వీడికి టైలరింగ్ వచ్చని అబద్దమాడి, పెళ్ళి చేసేశారు. ఆ తర్వాత నెలరోజులు ఇంకొకరి దగ్గర ఓ నెలపాటు అసిస్టెంట్ గా పనిచేసి, మామ గారు ఇచ్చిన కొత్త మిషన్ తొక్కడం పారంభించాడు. గత్యంతరం లేక టైలరింగ్ నే వృత్తిగా చేసుకున్నాడు. మా కాలనీ కూడా టౌన్ కి దూరంగా ఉండటం వల్ల, దరిదాపుల్లో టైలర్లు ఎవరూ లేకపోవడంతో చిట్టిబాబు అదే మంచి స్పాట్ అని ఫిక్స్ అయిపోయి అందర్నీ ఓ ఆట ఆడుకున్నాడు.

ఇప్పుడు చిట్టిబాబు అదే కాలనీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సొంతంగా ఓ షాపు పెట్టి వాడితో పాటు ముగ్గురు టైలర్లను పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా పాత ప్యాంట్లు, షర్ట్లు తీసుకుని చిన్నపిల్లలకి కుడుతున్నావా అని అడిగితే..'ఎక్కడ బాబు..ఈ కాలం చిన్నపిల్లలు మీరు ఉన్నట్టు ఎక్కడ ఉన్నారు...పుట్టగానే పుల్ ప్యాంట్ వేయందే ఒప్పుకోరు కదా' అని నిట్టూర్చాడు. నేను వెళ్ళిపోతున్నప్పుడు 'బాబు మీ లాప్ టాప్ కి ఓ కవర్ కుట్టనా' అని అడిగాడు. అయ్యబాబోయ్ అని చిట్టిబాబు వంక చూసేసరికి, ఇద్దరం గట్టిగా నవ్వేసుకున్నాం.

43 వ్యాఖ్యలు:

ఏక లింగం చెప్పారు...

LOL...I cannot stop laughing.

you are one of the best comedy writers.

రిషి చెప్పారు...

మీ టపా అదిరింది....నా చిన్నప్పడు కూడా ఇలానే ఒక తలకుమాసిన వెధవ ఉండేవాడు.
చిన్న పెద్దా ముసలి ముతక తేడా లేకుండా అందరికీ ఒకే ఆదితో కుట్టడం వాడికి తెలిసిన ఒకేఒక విధ్య. నాకు బాగా గుర్తు ఒకసారి నా చొక్కా కి క్లాత్ సరిపోలేదని వేరే ఎర్రక్లాతు జాకెట్ ముక్కతో జేబులు, కాలర్ కుట్టేసాడు.... :(

Alapati Ramesh Babu చెప్పారు...

fine experience.

నాగప్రసాద్ చెప్పారు...

హ హ హ :)

నాక్కూడా ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. పల్లెల్లో మనముందర కొలతలు ఎంత కరెక్టుగా తీసుకున్నా, కుట్టేటప్పుడు మాత్రం రెండించులు ఎక్కువ కొలత పెట్టి కుడతారు. అవి చాలా పొడవుగా, లూజుగా చూడటానికి అదో మాదిరిగా ఉండేవి. ఒకసారి నాకు ఒక టైలర్ 7వ తరగతిలో కుట్టిన అంగీ B.Techకు వచ్చేటప్పటికి కరెక్టుగా సరిపోయింది. :)

Sujata చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Sujata చెప్పారు...

హమ్మయ్య - చాలా చాలా బావుంది. అమ్మ బూమెర్ బల్బులో చిట్టిబాబు వెలగడం, నాన్న దగ్గర మ్యావ్ లూ అదిరాయి. ఈ లోకంలో టైలరు చేతుల్లో బాధలు పడనిది ఎవరు ? మా వూర్లో కెల్లా ఎక్కువ డబ్బులు తీసుకునే ఫేషన్ టైలరు (షాపు పేరే అది) వారానికి ముప్పాతిక సార్లు రిమైండ్ చేయించుకుని కూడా (అక్కడి దాకా వెళ్ళడానికి టైం, పెట్రోల్, సహనం - అన్నీ దండగ) టైట్ట్ ..ట్ట్ గా డ్రెస్సులు కుట్టి చస్తాడు. పోనీ ఇంట్లో వొదులు చేద్దామంటే - ఫేషన్ పేరుతో వేలాది రూపాయల బట్ట కూడా సెంటీమీటరు వొదలకుండా కట్ చేసి, ఇరికించి ఇరికించి కుట్టేస్తాడు.


@రిషి - మీకు తెలీట్లేదు - ఇది లేటెస్ట్ ఫేషన్ సుమండీ ! (ఏమైనా అష్ట వంకర్లొస్తే - అలానే చెప్పేసి గట్టెక్కెసెయ్యాలి)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@ఏక లింగం గారు,
మీకు ఇప్పుడు నవ్వొచ్చింది కానీ నాకు ఆ టైం లో దుంఖం తన్నుకొచ్చేదండీ. మీ కాంప్లీమెంట్ కు ధాక్సండీ.

@రిషి గారు,
>>నా చొక్కా కి క్లాత్ సరిపోలేదని వేరే ఎర్రక్లాతు జాకెట్ ముక్కతో జేబులు, కాలర్ కుట్టేసాడు....
:)
మీరు గమనించారో లేదో...అప్పటి మన టైలర్ లు చేసిన ప్రయోగాలే నేడు ఫ్యాషన్ అయిఫోయాయి.

rameshsssbd గారు,
ధన్యవాదములు.

నాగప్రసాద్ గారు,
>>7వ తరగతిలో కుట్టిన అంగీ B.Techకు వచ్చేటప్పటికి...
మీ టైలర్ మా చిట్టిబాబు గాడికి వేలు విడిచిన బందువు అయివుంటాడేమో కదా!! :)
ధన్యవాదములు.

Sujata గారు,
ధాక్సండీ..
మీరు చెప్పిన ప్రాబ్లం ని మా అక్క ఇప్పటికీ అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్తే ఈ విషయంలో తన గోడు వెళ్ళబోసుకుని కాస్త మనసు తేలిక చేసుకుంటుంటుంది.

పానీపూరి123 చెప్పారు...

> 'బాబు మీ లాప్ టాప్ కి ఓ కవర్ కుట్టనా' అని అడిగాడు. అయ్యబాబోయ్ అని చిట్టిబాబు వంక చూసేసరికి, ఇద్దరం గట్టిగా నవ్వేసుకున్నాం

adi mee external HDD ki saripotumdemO :-P

నేస్తం చెప్పారు...

ప్రొద్దున్న ప్రొద్దున్నే భలే నవ్వించారుగా
:)

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

mmm bagundi.......nijamgaa ilantivi gurtuku vaste chala happy a vuntundi.........memu chinnappudu inta badhalu padaledu gaani ............bga wait cheyinche vaadu.........

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@పానీపూరి123 గారు,
:)
ఇప్పుడు ఆ భయం లేదులెండి. 17 yrs ఇండస్ట్రీ కదా! బాగానే కుడతాడు.
ధన్యవాదములు.

@నేస్తం గారు,
మొన్న ఒకసారి సిటీలో టైలర్ ఒకడు నా ప్యాంట్ ని కొంచం తిక్కగా కుట్టాడు. ఆ శుభ సందర్భలో మా చిట్టిబాబు గుర్తొచ్చి నేను, నా ఫ్రెండ్ నవ్వుకున్నాము. ఇదే విషయం బ్లాగ్మిత్రులతో కూడా పంచుకొంటే వాళ్ళు కూడా కొద్దిసేపు నవ్వుకుంటారు కదాని ఇలా బ్లాగులో పెట్టేసా.
ధన్యవాదములు.

vinay chakravarthy గారు,
అవునండీ... జ్ఞాపకాలే నిట్టూర్పు..జ్ఞాపకాలే ఓదార్పు అని ఊరికే అనలేదు.
మీ స్పందనకు ధాంకులు.

మురళి చెప్పారు...

ఇవాళే వచ్చి మొదట మీ బ్లాగే చూశానండి.. భలే బాగుంది టపా.. మా సూరిబాబు, కొయిటా సాయి, పద్మనాభం.. ఇలా టైలర్లందరూ గుర్తొచ్చారు.. అందరం ఒకేలాంటి బాధలు పడ్డాం, కొంచం అటూఇటుగా..

మోహన చెప్పారు...

కుట్టు వదలని భట్టి మీ చిట్టి [బాబు] అన్నమాటా :) బాగుంది..... అతని ఇండస్ట్రీ. మీరు రాసింది కూడా అనుకోండీ... :P
మీరు జ్ఞాపకల కొలనులో భలే ఈదుతారు. చిన్న చిన్న డీటాఇల్స్ కూడా బాగా రాస్తున్నారు.
ఎలాగైతేనేమీ, మీ చిట్టిబాబుకు పొట్టెమ్మ దగ్గర స్పాట్ పెట్టి కాస్త కసి తీర్చుకున్నారన్నమాట.. గుడ్ :D ఎండింగ్ అదిరింది.. ! Nice work. I had a happy read.

నాకైతే చిన్నప్పుడు ఈ ప్రాబ్లెంస్ లేవు. అలా అని అస్సలు ప్రాబ్లెంస్ లేవని కాదు :(( పట్టు పరికిణీలు తప్పితే మిగతా అన్నీ రెడీమేడ్ నే కొనేది అమ్మ... అమ్మ అన్నీ నాకన్న పెద్ద సైజ్లు కొనేసేది. 'కాంప్లాన్ ' తాగుతుంది కదా అనుకుంది కాబోలు. కాని యాడ్ లో అంత సీన్ లేక ఆ డ్రెస్సులు యేళ్ళ తరబడి నా భుజాలకు వేళ్ళాడుతుండేవి. సో.. నేను ఎప్పుడూ టైలర్ దగ్గరకు ఎప్పుడు వెళ్ళి నా ఆది బట్టలు కుట్టించుకుంటానా... అని ఉండేది. బెంగళూరు వచ్చాకా తీరిపోయింది, ఆ సరదా కూడా:D ఇక్కడ ఎంతమంది చిట్టిబాబులని[టైలర్స్]... ఒకడైతే, సుజాత గారు చెప్పినట్టు.. ఒక అంగుళం కురచ పెట్టి, "ఇదేంటీ?" అని అడిగితే.. "అయ్యో.. మీరింకా అలా ఓల్డ్ ఫాషన్.. ఇప్పుడు అందరూ ఇలాగే వేసుకుంటున్నారు.." అని వెటకారంగా అంటే... ఇంకోడు వేసుకుంటే హాంగర్ కి తగిలించినట్టు ఉండేలా కుట్టేసి.. మీరు లూస్ గా కుట్టమన్నారు కదా అని వెకిలిగా నవ్వుతాడు!! :( అసలే ఒక పక్క ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ ఖరాబయ్యిందని ఏడుస్తుంటే.. దానికి తోడు చెత్త కబుర్లు, సలహాలు ఇచ్చేసరికి, వాడి చేతిలోని కత్తెర తీసుకుని, పర పరా వాడి బుర్ర మీద ఉన్న వెంట్రుకలన్నీ కత్తిరించెయ్యాలన్నంత కోపం వచ్చేది. కానీ నేను ఎప్పుడూ స్పాట్ పెట్టాలేకపోయా.. :(
ఇవి.. నా పీత కష్టాలు......

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మురళి గారు,
మీ టైలర్ ల లిస్టు చూస్తుంటే పెద్ద 'చిట్టిబాబు'ల నమూహమే కనపడుతుంది. ఒక్కడినే మేము భరించలేకపోయాం...అంతమందిని ఎలా భరించారండీ బాబు.
ధాంకులు.

మోహన గారు,
>>కుట్టు వదలని భట్టి మీ చిట్టి..
వహవా..వహవా..మీ ప్రాస అదిరింది.
>>అమ్మ అన్నీ నాకన్న పెద్ద సైజ్లు కొనేసేది. 'కాంప్లాన్ ' తాగుతుంది కదా అనుకుంది కాబోలు
హ్హ...హ్హహ..కామెడీ లైన్స్ కూడా బాగా రాస్తారన్నమాట.
మీ కాంప్లిమెంట్ కి ధాంకులు.

Hima bindu చెప్పారు...

చాల ఆలస్యంగా చదివానండి ,మీ చిట్టిబాబు కూతురు ,మీరు మాచింగ్ డ్రెస్ వేసుకుని మరి ఆటలా ,హ హ్హ ....చాల చాల నవ్వించారు ,బాగుందండీ .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చిన్నిగారు,
మీలాగే నా ఫ్రెండ్స్ కూడా అని నన్ను అప్పట్లో ఏడిపించేవారండి.
మీ స్పందనకు నెనర్లు.

పరిమళం చెప్పారు...

శేఖర్ గారూ ! నవ్వి నవ్వి కంట్లోంచి నీళ్ళొచ్చేశాయండీ ... లాప్ టాప్ కి ఓ కవర్...హ హ్హ హ్హ ....

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

పరిమళం గారు,
మా చిట్టిబాబా..మజాకా!!..వాడు చేసే పనులు అలా ఉంటాయి మరి.
నెనెర్లు.

కొత్త పాళీ చెప్పారు...

హ హ హ, భలే. మా చిన్నప్పటి ఆస్థాన టెయిలర్ని గుర్తు చేశారు. నేనూ రాస్తాను త్వరలో.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

కొత్తపాళీ గారు,
టైలర్ల దగ్గర, జుట్టు కత్తిరించేవాడి దగ్గర బుక్కుకాని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారెమోనండీ! ముఖ్యంగా కాస్త చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేటప్పుడు తక్కువ ఆప్షన్లు ఉండటం మూలాన వీటినుండి అస్సలు తప్పించుకోలేము. మీ ఆస్థాన దర్జీ లీలలు టపా కోసం ఎదురుచూస్తుంటాను.
ధన్యవాదాలు.

MIRCHY VARMA OKA MANCHI PILLODU చెప్పారు...

SEkhar garu nijam ga navvu apukolekapoyanu chaala bagundi
kep it up andi
Please watch my blog also at
http://mirchyvarma.blogspot.com

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మిర్చి వర్మ గారు,
ధాక్సండీ..మీ బ్లాగు చూశాను. బావున్నాయి టపాలు. రాస్తూ ఉండండి.

MIRCHY VARMA OKA MANCHI PILLODU చెప్పారు...

evandyoo shekar garu,
na blog chusi marii mee amulyamina coment enduku ivvaledu andii
malla vachhi chusi mee amulyamina coments ivvandi pratisarii
untanu andi

ఆత్రేయ కొండూరు చెప్పారు...

చాలా బాగుందండి.. ఇప్పుడే పైకి లేచి దులుపుకుని (అదేనండి క్రిందపడి దొర్లి నవ్వానుకదా.. ) కామెంటుతున్నా...

Padmarpita చెప్పారు...

రాంబాబు(లేడీస్ టైలర్) మరియు చిట్టిబాబు ఒకేబడిలో చదువుకున్నట్టున్నారు. ఏమైనా టపా అదిరిందండి..

రాధిక చెప్పారు...

మా ఊరిలో నాగూర్ అని ఒక టైలర్ వుండేవాడు.బట్టలు చాలా బాగా కుట్టేవాడు.మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడే సినిమావాళ్ళు తీసుకెళ్ళిపోయారు అతన్ని.తరువాత ఎవరూ కుట్టేవీ నచ్చక రెడీమేడ్లోకి దిగిపోయాము.కాలేజీ లోకొచ్చాకా ఫాషన్ లు పెరిగి మళ్ళా టైలర్ వేట మొదలెట్టా.మా ఊరికి ఒకే ఒక్క లేడీస్ టైలర్ సీను.అతన్ని తిట్టినట్టు నేను ఎవరినీ తిట్టలేదు జన్మలో.ఇప్పటికీ నాకు అతనే దిక్కు.ఫ్లైట్ ఎక్కే ముందు క్షణం లో మాత్రమే ఇస్తాడు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఆత్రేయ గారు,
హ..హ్హ..
థాక్సండీ.

పద్మ గారు,
ఆ రాంబాబు పుట్టుమచ్చ మీద కాన్సంట్రేషన్ పెట్టి బట్ట మీద తగ్గించాడు. కాబట్టి కొంతవరకూ క్షమించేయొచ్చు. కానీ మా చిట్టిబాబు గాడు రోజు మొత్తం బట్టనే 70MM లో చూస్తుంటాడు.
నెనెర్లు.

రాధిక గారు,
అంతేలెండి బాగా కుట్టిన వాళ్ళు ఊళ్ళలో ఉండటానికి ఇష్టపడరు. చివరి నిమిషం లో తీసుకున్నా వాడు కుట్టే బట్టల్లో మా చిట్టిబాబు లాగా కనిపించకుండా ఉంటే అదే పదివేలు.
వ్యాఖ్యానానికి నెనెర్లు.

ప్రణీత స్వాతి చెప్పారు...

shekhar garu..superb!!

prastuta ma tailor gurtochadu..
kurtha pyzama kuttara ani iste kurtha yentha podavu vuntundo pyzama kuda (3/4th pant laga annamata) antha varake kuttadu..
asalu kurtha kinda pyzama kanipinchaliga..yedi???
adannamata maa fashion designer design chesina oka namuna..

annattu na peru praneeta..satsaangatyabhilashini..
muraligari blog dwara mee blog chadive avakasam dorikindi naku..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ప్రణీత గారు,
ధాక్సండీ.
మీరు కూడా టైలర్ల భాదితులే అన్నమాట!!

MIRCHY VARMA OKA MANCHI PILLODU చెప్పారు...

శేఖర్ గారు ఎక్కడ తర్వాత టపా.

Please watch my latest posting

సుభద్ర చెప్పారు...

అబ్బ ఎమి రాసార౦డి...
జ౦ద్యలగారి కామెడి గుర్తు వచ్చి౦ది.

MURALI చెప్పారు...

chala bagundandi.

lalitha చెప్పారు...

"తీరా చూస్తే ముమైత్ఖాన్ లాగా నా బొడ్డు కనిపించేటట్టు కుట్టాడు"
పోలిక చాలా బాగుంది, కానీ నాకు లేడీస్ టైలర్ సినిమా లో ఒక్క సిను గుర్తుకు వస్తుందీ, అదే బట్టల సత్యం(మల్లికార్జున రావు) షర్టు సిను.

"ఇక చూస్కోండి...చిట్టిబాబు గాడిని తిట్టి కొట్టినంత పని చేసింది. మళ్ళీ కొత్తది ఇస్తానని చెప్పిన తర్వాత గాని వాడిని వదలలేదు. చిట్టి బాబుగాడి మీద ఎప్పటినుండో నాకున్న కోపం ఆ రోజు కొంచం తీరింది."
మొత్తానికి మీ కసి తిరుచ్చుకున్నారు.

"నేను వెళ్ళిపోతున్నప్పుడు 'బాబు మీ లాప్ టాప్ కి ఓ కవర్ కుట్టనా' అని అడిగాడు. అయ్యబాబోయ్ అని చిట్టిబాబు వంక చూసేసరికి, ఇద్దరం గట్టిగా నవ్వేసుకున్నాం."
హా హా .... చిట్టిబాబు టాలెంట్ మల్లి మీకు చూపించాలి అని అనుకునట్టు వున్నాడు.

Gupta చెప్పారు...

chaala bagundi, enta sepu navvano naake teliyadu

ramesh

subhash@smiling stone చెప్పారు...

sekhar gariki,
nenu regular ga eenadu lo sunday magazine storys chustnau...daani tharuvatha first time naaku chaala nachhinadi idi chala bagundi..keep it up..

debo చెప్పారు...

super brother...nenu inni rojulu blog enduku miss ayyana ani bada vesindi... mee writings chala chala bagunnay..hilarious..oh..lol..navvu agadam ledu...
enadu paper lo mee blog gurinchi eppude chusa..inka full time abhimanini ayya meeku...keep it up bro...

రాధిక చెప్పారు...

while reading this post i was laughing like anything.

he played with your life sorry with your clothes...haaaaaaaaaaaaaaaa

nice post,funny
:-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

Thanks to all....

స్నిగ్ధ చెప్పారు...

శేఖర్ గారు, ఇంత సేపు నవ్వలేక చచ్చానండీ బాబు...మీ టపా అదిరింది..
:)

కొన్ని పద ప్రయోగాలు,పోలికలైతే చాలా బాగుంది...

Unknown చెప్పారు...

టైలర్ చిట్టిబాబు ఆగడాలు .... నవ్వులే నవ్వులు ...

బాగా వ్రాశారు..

Unknown చెప్పారు...

టైలర్ చిట్టిబాబు ఆగడాలు .... నవ్వులే నవ్వులు ...

బాగా వ్రాశారు..

Unknown చెప్పారు...

టైలర్ చిట్టిబాబు ఆగడాలు .... నవ్వులే నవ్వులు ...

బాగా వ్రాశారు..

Unknown చెప్పారు...

టైలర్ చిట్టిబాబు ఆగడాలు .... నవ్వులే నవ్వులు ...

బాగా వ్రాశారు..