" పలుకులు నీ పేరే తలుచుకున్నా..పెదవుల అంచుల్లో అణుచుకున్నా..
మౌనముతో నీ మదిని భందించా...మన్నించు ప్రియా..
తరిమే వరమా...తడిమే స్వరమా...
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా...
వింటున్నావా...వింటున్నావా...వింటున్నావా... "
- అనంత శ్రీరాం
- సెలయేరుకు అటువైపు....
కదిలే మేఘాలు తనకోసం ఏవో తీసుకురావాలని అతను ఆశిస్తున్నాడు...ప్రతీ మేఘం ఇటే వస్తుంది...కానీ ఏమీ తేలేదన్నట్లుగా ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాయి...మనసు మెలిపెట్టినట్టుంది అతనికి...ఆమె ఎడబాటు భరించలేనిదిగా ఉంది...కాలితో ఓ రాయిని బలంగా తన్నాడు...కాసేపటికి వెలిసిందనుకున్న వాన మళ్ళీ మొదలైంది...కొన్ని చినుకులు అతన్ని సుతిమెత్తగా తాకాయి...ఏదో తెలుసుకుంటున్నట్టుగా అతను రెండు చేతులనూ చాచి, ఆకాశం వైపు చూస్తూ, చినుకులను తన గుండె మీదకు ఆహ్వానించాడు...మనసు మురిపెం పాటయ్యింది...
" విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా...
తొలిసారి నీ మాటల్లో...పులకింతల పదనిసలు విన్నా...
చాలు చాలే..చెలియా..చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా...
ఓ..ఓ...బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా... "
- అనంత శ్రీరాం
............
.......
ఇది కొద్ది రోజులుగా ఓ పాట వింటున్నప్పుడు నా కళ్ళముందు కనిపిస్తున్న ఓ దృశ్యం...కొన్ని పాటలు వింటుంటే ఊహలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి...అప్రయత్నంగా కళ్ళ ముందు ఓ దృశ్యం అలా కనిపించేస్తుంది...ఆ విరహ వేదనలో మనమే ఉన్నామా అన్నంత భావోద్వేగానికి లోనయిపోతుంటాము. కొన్ని రోజులనుండి ఆ పాట అలాంటి అనుభూతినే కలిగించేస్తుంది. అసలే మన రహ్మాన్ ట్యూన్ చేసాడు ఆ పాటని. అనంత శ్రీరాం రాసిన అందమైన సాహిత్యానికి శ్రేయా ఘోషల్ గళం కలిపింది..అది కూడా కార్తీక్ తో కలిసి...అసలు ఈ అమ్మాయి ఉంది చూశారూ...తను పాడిన పాటలు వింటున్నప్పుడే, ఆ గొంతుతో మన మనస్సులోకి పర్మిషన్ తీసుకోకుండా దూరి, రకరకాల భావోద్వేగాలను కలిగించి, కుళ్ళ బొడిచి వదిలేస్తుంది ...సున్నిత మనస్కులు అయితే పాట వింటూ ఎవరో అమ్మాయి తన కోసమే పాడుతుందేమో అన్న భ్రమల్లోకి పోయినా పోతారు కాసేపు...ఇక ఆ కార్తీక్ అయితే "నీ మనసు నాకు తెలుసు సోదరా..దాని వ్యధ కూడా తెలుసు.." అంటూ మన భావాన్ని తన గొంతులో పలికిస్తూ మన వెర్షన్ పాడేస్తుంటాడు. ఇది చాలదన్నట్టు మన దర్శకులు శ్రేయా గొంతును సినిమాల్లో జెస్సీలాంటి ఓ అందమైన అమ్మాయికి తగిలించేస్తారు...ఇంక కష్టాలు అప్పుడు మెదలు నాకు...ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ, కళ్ళు మూసినా ఎదురుగా కనపడుతున్న దృశ్యం చూసుకుని, గొప్ప అనుభూతికి లోనయిపోయి, పాట అయిపోయిన వెంటనే "ఈ నిమిషం చచ్చిపోయినా పరవాలేదు" లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పుట్టేస్తుంటాయి...
అందుకే నేను ఇకపై శ్రేయా ఘోషల్ పాడిన కొన్ని విరహంతో కూడిన పాటలు వినకూడదనుకుంటున్నాను...ముఖ్యంగా కార్తీక్ తో తను పాడిన ఈ విరహ గీతం అస్సలు వినను...
మీకు నచ్చితే ఇక్కడ నుండి మీ కంప్యూటర్లోకి దింపుకోండి.
******
( ఐపాడ్ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నాను..ఓ సాంగ్ ప్లే చేశాను..చేతిలోని ఐపాడ్ నా వైపు అదోలా చూసింది...సాంగ్ ప్లే అవుతోంది...'తరిమే వరమా...తడిమే స్వరమా...ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా'..ఎభై ఒకటోసారి అదేపాట మంద్ర స్థాయిలో మళ్ళీ వినిపిస్తుంది శ్రేయా గొంతులోంచి జాలువారుతూ.. )