అయినా సరే కార్టూన్ కారెక్టర్ల కదలికలు బట్టి అక్కడ ఏం జరుగుతుందో అలవోకగా పట్టేసి అర్ధం చేసుకునేవాళ్ళం. ఒకవేళ అర్ధం కాకపోతే సొంతంగా కధ అల్లుకునో, ట్రాజెడీ సీన్ వస్తున్నప్పుడు పకపకా నవ్వేసో ఫాలో అయిపోయేవాళ్ళం. ఓ సారి దూరదర్శన్(hyd) వాడికి పందుల కార్యక్రమం ప్రసారం చేయటంలో ఎక్కువ శ్రద్ద పెట్టడంతో సడన్ గా మెదడువాపు వ్యాధి వచ్చింది. దాని ఫలితంగా జంగిల్ బుక్ తెలుగులో ప్రసారం చేయాలన్న కోరిక కలిగింది. అప్పటి వరకూ దూరదర్శన్ అంటే బ్లాక్ అండ్ వైట్ పాటలు, మొహానికి సున్నం పూసుకుని తలపై పిచిగ్గూడు మెయింటెయిన్ చేసే యాంకర్లు(eg: రోజా రమణి ఆంటీ, విజయ దుర్గ ఆంటీ), చీనీ నిమ్మతోటలు అని అనుకుంటుండే మాకు జంగిల్ బుక్ కార్టూన్ తెలుగులో చూసే సరికి దూరదర్శన్ వాడికి ఓ కర్పూరం వెలిగించి పూజించాలన్నంత ఆనందం కలిగింది.
చెడ్డీ వేసుకునే రోజులనుండి ప్యాంట్ వేసుకునే రోజులు వచ్చాయి. అప్పుడు కార్టూన్లకు బ్రహ్మరధం పట్టిన రోజులు పోయి స్టార్ మూవీస్ చూసే రోజులు మొదలయ్యాయి. ఆ టైంలో పెద్దగా ఫాలో అయిన కార్టూన్లు కూడా లేవు. కొద్ది రోజులు మాత్రం పుస్తకాల అట్టలపై మాత్రం కార్టూన్ కారెక్టర్ల లేబుళ్ళు అతికించేవాళ్ళం. ఓ సారి ఎంసెట్ ఎగ్జామ్ రాయటం కోసం మా అమ్మమ్మ వాళ్ళూరు వెళ్ళినప్పుడు 'బాబోయ్ డెన్నిస్' అనే కార్టూన్ చూస్తుంటే "ఇంకా చిన్న పిల్లడివి అనుకుంటున్నావా" అంటూ నా మనోభావాలు ఆవిడ గాయపరిచేసరికి కార్టూన్ ఫిల్ములు చూడటం చిన్నతనం కాబోలు అనుకుని ఎప్పటికీ వాటిని చూడకూడదనుకున్నాను. కార్టూన్లు చూడటంలో నేను మళ్ళీ నా పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటానని అప్పుడు నాకు తెలీదు.

ఓ సారి మాటల మద్యలో నా కొలీగ్ Tom n Jerry కార్టూన్ ఇప్పటికీ చూస్తానని చెప్పినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా చూడాలనిపించినా ఎవరైనా మా అమ్మమ్మలాగ అంటారేమోనని భయం నాకు. అలాంటిది వాడికి ఎవరూ ఏమీ అనరా అని ఆశ్చర్యం అన్నమాట. ఆ తర్వాత నా ఫ్లాష్ బాక్ ఒక్కసారి గుర్తొచ్చి Tom n Jerry కొన్ని ఎపిసోడ్లు డౌన్లోడ్ చేసుకుని చూసాను. ఎందుకో తెలీదు నేను ఈ కార్టూన్ని చిన్నప్పుడు చూడటం మిస్సయాను. బహుశా ఇంట్లో టీ.వీ ఎప్పుడు పడితే అప్పుడు చూసే వీలులేనందువల్ల కావచ్చు. ఇప్పుడు నేను ఆ కార్టూన్ అంటే పడిచచ్చేటైపు. మా ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ టైంలో టీ.వీ చానల్ మార్చుతున్నప్పుడు Tom n Jerry గానీ కార్టూన్ నెట్ వర్క్ చానల్లో వస్తే ఇంక దాన్నే ఉంచేసి ధైర్యంగా చూసేస్తాను. ఆ టైంలో నాతోపాటు ఇంచుమించు అక్కడున్న ప్రతీఒక్కరూ దాన్ని చూడటానికి ఇష్టపడేవారే.
టామ్ మరియు జెర్రీ ఇద్దరూ స్నేహితులే. కాకపోతే టామ్ చేసే ప్రతీ పనికి అడ్డం తగులుతూ దానికి కోపం తెప్పించి తనతో పోట్లాట

రెండు ప్రధాన కారెక్టర్లతో మాటలు వీలయినంత తక్కువగా పెట్టి చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా అర్ధమైయ్యేలా చూపటం ఈ కార్టూన్ ఫిల్మ్ ప్రత్యేకత. ఒకళ్ళు చెప్పేకంటే చూస్తేనే దీని మజా తెలుస్తుంది. ఇప్పటికే దీన్ని చూసినవాళ్ళకు ఆ విషయం తెలిసే ఉంటుంది.
ఈ వయసులో కార్టూన్ ఫిల్మ్ ఏం చూస్తాం అని అనుకోకండి. కూసింత పెద్దరికాన్ని గోద్రేజ్ బీరువాలో పెట్టేసి, ప్రస్తుతం మనం పెద్దవాళ్ళం అన్న విషయాన్ని మర్చిపోయి, పిల్లలుంటే వాళ్ళతో కలిసి ఎప్పుడైనా సరదాగా టామ్ అండ్ జెర్రీ చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది.