31, డిసెంబర్ 2009, గురువారం

డిసెంబర్ 31 రాత్రి, జ్ఞాపకాల రంగవల్లి

- ఒక డిసెంబర్ 31
సాయింత్రం ఆరుగంటలు...
చిన్న చెడ్డీలో బొడ్డు కనిపించే బనీను వేసుకుని నేను...

మా రోజక్క బోల్డన్ని ముగ్గుల పుస్తకాలు, పేపర్లో వచ్చే వాటి కటింగ్స్ అన్నీ కుప్పగా ముందేసుకుని కూర్చొనుంది. ఏ ముగ్గు వేద్దామా అని ఆలోచిస్తూ...
"రోజా ఇది బాగుంది.." పక్కింటి ఆంటీగారు అప్పుడే వంట పూర్తి చేసుకుని వచ్చారు.
"అక్కా ఇది సూపర్.." వెనకింటి అమ్మాయి తన నిర్ణయం తెలిపేసింది.
"టీచర్..దిస్ ఈస్ గుడ్.." ట్యూషన్ కుర్రాడి మాటలు..

రోజక్క స్వతహాగా ఆర్టిస్ట్ కావటం వల్ల తను ముగ్గులు చాలా వీజీగా వేసేది.

చీకటి పడుతుందనగా ముగ్గులపోటీకి మేం సిద్దం అని సంకేతాలిస్తూ ఒక్కొక్కళ్ళ వాకిళ్ళు పేడనీళ్ళ కళ్ళాపుతో తడిసేవి...

ఇంటి అటక మీద ముగ్గు దిద్దడానికి ఉంచిన రంగుల పొట్లాలు అన్నీ తీసి ఒక ఇత్తడి పల్లెంలో పెట్టేది అమ్మ. అటకమీద ఎందుకు పెట్టేదంటే మాకు అందినంత ఎత్తులో ఉంటే వాటితో మధ్యాహ్నానికే యాపీ న్యూయియర్ అంటూ ఎక్కడపడితే అక్కడ సొట్ట సొట్టగా రాసిపడేస్తాం కదా..అందుకన్నమాట...చిన్న చిన్న తెరిచిన పొట్లాలలో ఉన్న రంగులు పల్లెంలోనే ఒక ఇంధ్రధనస్సు ఏర్పడిందా అన్నట్టు ఉండేవి. ఇంతలో చమ్కీ పొడి కొనలేదా అంటూ పెద్దక్క హడావిడి..."రోజమ్మా.. ఆ ధనలక్ష్మి(ముగ్గుల్లో అక్క కాంపిటేటర్) ఈ సారి నీకంటే పెద్ద ముగ్గేసి అందరు చేత పొగిడించుకోవాలని తెగ ఆరాటం పడుతుంది.." అని మా పనమ్మాయి చాడీలు ఒక పక్క...

చీకటి చిక్కగా పరుచుకున్నాక...కాలనీలో అందరి వాకిళ్ళో కళ్ళాపు కొంచెం ఆరాక ఒక్కో ఇంటి నుండి ఒక్కొక్కలు వచ్చి ముగ్గుపెట్టడం మొదలెట్టేవారు. చలి బాగా ఉండటం వల్ల పిల్లకాయలం అందరం మొహానికి దొంగోళ్ళలా మంకీ కేప్ లు వేసుకుని, నాన్నమ్మ సాలువానో తాతయ్య సాలువానో కప్పుకుని ముగ్గుల విజిటింగ్ కి వెళ్ళాం....ఒక్కోసేపు ఒక్కో ముగ్గు దగ్గర నిలబడటం...చూసిన ముగ్గుని వేరే వాళ్ళు వేసిన దానితో పోల్చి చూసుకోవటం..ఎవరిది గొప్ప అంటే ఎవరిది గొప్ప అని...మా ఎదిరింటి అనసూయమ్మ గారు మాత్రం ఓ అయిదు రెక్కలున్న ముగ్గు తొందరగా వేసేసి వాళ్ళ వాకిట్లో ఉన్న ముద్ద బంతి, చీమ బంతి పూలను రెక్కలు రెక్కలుగా విడగొట్టి వాటిని ముగ్గును నింపడానికి వాడేది. అది చూసి పెద్దవాళ్ళందరూ "అబ్బో..ఏమి పిసినారితనం" అంటూ బుగ్గలు నొక్కుకుంటుంటే పిల్లలందరూ ఆంటీ మీరు ఎప్పుడూ రంగులతో ఎందుకు ముగ్గు పెట్టరు అని డైరెక్టుగా అడిగేసేవారు. పాపం ఆవిడ ఏమి చెప్పాలో తెలియక పిల్లలను "ఇక్కడ నుండి ఎల్లండెల్లండి.." అంటూ మొహం మాడ్చుకుని తరిమేసేది.

మా ఇంటి ముందు ముగ్గు వేసేసేటప్పుడు చాలా మంది గుమిగూడేవారు. ఎందుకంటే అప్పటికే అక్క వేసిన ముగ్గులు వరసగా మూడు సంవత్సరాలు ఉత్తమ ముగ్గుగా కాలనీ వాళ్ళ ప్రశంసలు పొందాయి. ఈ సారి ఏ ముగ్గు వేస్తుందో చూద్దామని జనాల ఆరాటం....అందరికంటే లేటుగా అక్క ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసినా తొందరగా వేసేసేది. అదికూడా ముగ్గురక్కలు రంగులు దిద్దటంలో తలో చెయ్యి వెయ్యటం వల్ల తొందరగానే అయిపోయేది. నేనేమో రంగులు దిద్దుతానని ఒకటే అల్లరి చేసేవాణ్ణి. అమ్మేమో వీడికి చమ్కీలు అద్దే పని ఇవ్వండర్రా అంటూ అక్కలకు నన్ను సిఫారసు చేసేది. కానీ అక్కవాళ్ళు ఆ చాన్స్ కూడా ఇవ్వక హాపీ న్యూ ఇయర్ రాసే అక్షరాలలో ఏ పీ లెటరో వై లెటరో దిద్దమని ఇచ్చేవారు. కనీసం ముగ్గులో ఒక వైపు ఉన్న పువ్వో, ఫలమో, ఆకో రంగులద్దడానికి కావాలి అన్నది నా ప్రధాన డిమాండ్లు...ఇవ్వకపోతే ముగ్గు చెరిపేస్తా అంటూ బెదిరించేవాణ్ణి. కానీ చిన్నక్క నా చెయ్యిని గట్టిగా పట్టేసుకుని నాకు చెరిపే అవకాశం ఇచ్చేదికాదు..అలా ప్రతీసంవత్సరం చెరిపే చాన్స్ మిస్సయ్యేది.

తొమ్మిదయితే సగం రంగులు అద్ది అందరూ భోజనాలకి వెళ్ళి పిల్లకాయలను ఆవులు గట్రా ముగ్గును తొక్కకుండా కాపలాగా పెట్టేవారు. మా అక్క అయితే "ఒరేయ్..రంగులేమైనా అద్దావో వీపు పగిలిపోద్ది.." అంటూ హెచ్చరిక జారీ చేసి కాపలా ఉండమంది. నాకేమో రంగులద్దాలని తెగ కోరికగా ఉండేది. చేసేదేంలేక వంటిట్లోకి దొంగలా వెళ్ళి, మైదా పిండిని ఓ చిన్న పేకట్ కట్టుకుని పరిగెత్తాను. ఏ డొంకల్లోనో ఓ చిన్న ప్లేస్ చూసుకుని మూడు చుక్కలు మూడు వరసల ముగ్గేసి, ధనలక్ష్మి ఇంటికెళ్ళి ముగ్గు దగ్గర ఎవ్వరూ లేరని అనుకున్నాక అక్కడ ఉంచిన రంగులు కొంచెం కొంచెం కొట్టేసి పొట్లం చుట్టి తెచ్చుకుని దానికి రంగులు నింపాను. ఓ కళాఖండం రెడీ అయిపోయింది. నా చెడ్డీ దోస్తులకి దాన్ని చూపిద్దామని వాళ్ళని పిలవడానికని వెళ్ళాను. వాళ్ళను వెంటేసుకుని నేను వేసిన ముగ్గు దగ్గరకు వెళ్ళాను. కానీ విచిత్రంగా అక్కడ నా మూడు చుక్కల ముగ్గులేదు కానీ ఆవు పేడ అయితే ఉంది..ప్చ్..నా ముగ్గేమయిందో!!. మళ్ళీ వేసుకున్నాను..కానీ ఈ సారి బ్లాక్ అండ్ వైట్ మూడు చుక్కల ముగ్గుతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

అందరు ఇళ్ళల్లో ఒంటి గంట రెండు వరకు లైట్లు వెలుగుతూనే ఉండేవి. పాటలు..ఆటలతో తెగ సందండి...మా అక్క చేత వాళ్ళింటి ముందర ముగ్గు పెట్టించుకోడానికి ఓ ఇద్దరు ముగ్గురు మా ఇంటిలో ఉండేవారు. అందరి ముగ్గుల కార్యక్రమం అయ్యాక చూస్తే వీధి లైట్లలో ముగ్గులన్నీ చమ్కీపొడితో ధగ ధగ మెరిసిపోయేవి. కొంత సేపటికి ముగ్గును సన్నటి మంచుతెర కప్పుతుంటే మసకగా మెరిసిపోతూ కన్పించే ముగ్గు చాలా అందంగా ఉండేది. ఆ టైంలో అమ్మ అందరికీ టీ పెట్టి ఇచ్చేది. నాకు ప్రత్యేక గ్లాసులో ఇవ్వక తను కొంచెం తాగి ఇచ్చింది. అప్పుడే అర్ధమైంది...తొందరగా పెద్దయిపోవాలి..లేదంటే ఫుల్ గ్లాసు టీ ఇవ్వరని.

ముగ్గులు చూడడానికి పక్క కాలనీవాళ్ళు, మా కాలనీ వాళ్ళు కూడా ఇంటింటికీ తిరిగేవారు. కాలనీ అంతా ఏదో తిరనాళ్ళలా ఉండేది. ఎప్పటిలాగే అందరూ మా ఇంటి ముందున్న ముగ్గు దగ్గర కొంచెం ఎక్కువసేపు ఆగి మా అక్కని మెచ్చుకునేవారు. నేను ఇదిగో ఆంటీ నా ముగ్గు కూడా చూడండి అంటూ నా మూడు చుక్కలు మూడు వరసల ముగ్గు చూపించాను. కానీ ఒక్కరూ మెచ్చుకోలే...కనీసం అనసూయమ్మ ముగ్గుకంటే బాగుందని కూడా చెప్పలే...గొప్ప కోపం వచ్చింది ఆ టైంలో...

న్యూఇయర్ అయిపోయాక ప్రతీ వాళ్ళు ఇంటి ముందు కొత్త ముగ్గు వెయ్యక ఓ రెండు రోజులు అదే ముగ్గు ఉంచేవారు. కళ్ళముందు ఎప్పుడైనా చీపురుతో పాతముగ్గును అక్క తుడిచేస్తున్నప్పుడు నాలో ఒక బాల కళాకారుడు జారిపోతున్న చెడ్డీ ఎత్తుకుంటూ లేచేవాడు. చాలా భాద వేసేది. "అందుకేనమ్మా..నేను అంత కష్టపడి ముగ్గుపెట్టి రంగులద్దను...ఎప్పటికైనా తుడిచేయాల్సిందేగా.." అనసూయమ్మగారు అమ్మతో అనటం సన్నగా వినిపించేది.




బ్లాగ్మిత్రులందరికీ పేరు పేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు

30 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

'స్వాతిముత్యం' లో పక్కింటి నుంచి గొబ్బిళ్ళు తెచ్చేసే కమల్ హాసన్ గుర్తొచ్చాడండీ నాకు.. చిన్నప్పుడు వేసిన బ్లాక్ అండ్ వైట్ ముగ్గేమో కానీ, ఇప్పుడు కంప్యూటర్ మౌస్ తో వేసిన ముగ్గు మాత్రం బ్రహ్మాండం.. ఈ కొత్తసంవత్సరం మీకు రంగుల ముగ్గులా అందంగా, ఆనందంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మరువం ఉష చెప్పారు...

కళ్ళ ముందు కదలాడిన సీన్ చదివి/చూసి వచ్చాను. ఇదే సీనులో నేనూ జీవించాను కొన్నేళ్ళు, కాకపోతే మాది ఉదయం రంగవల్లుల రంగశాల. నేను కూడా మీ అందరికన్నా నిజంగా బాగావేసేదాన్నని మీ టపా చూసి అనుకుంటున్నాను. ;) మార్నింగ్ వాక్ కి వెళ్ళే అంకుల్స్ అంతా నా ముగ్గే బాగుందని అనలేదో ఇక నాన్నగారు స్పూన్ పుచ్చుకుని ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా నా నోరు తినటానికి, తాగటానికి, మాట్లాడటానికి, కనీసం నవ్వటానికి కూడా తెరుచుకునేది కాదు. కానీ అలా ఒక రోజో రెండో అంతే, నేను ఆ ప్రహసనాలు జరిపిన దాదాపు ఎనిమిదేళ్ళలోనూ అలా అవటం. ఇక్కడ కూడా వర్క్ లో దీపావళి సెలబ్రేషన్స్ కి మంచి ముగ్గు ఇరవై ఒక్క చుక్కలనుండీ, మధ్యగా పెడుతూ పన్నేండు వరకు వరసలు వేసి కలిపేది - వేసి, రంగులు దిద్దితే అంతా అడిగిన రెండు ప్రశ్నలు - ఈ ముగ్గు నేర్చుకోవటానికి ఎంత కాలం పడుతుంది? వేయటానికి ఎంత సేపు పడుతుంది? నీకు చాలా టాలెంట్ వుందీ అనీను. మురళీ గారి కన్నా గట్టిగా చెప్తున్నాను ;) ఈ కొత్తసంవత్సరం మీకు రంగుల ముగ్గులా అందంగా, ఆనందంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..

సిరిసిరిమువ్వ చెప్పారు...

ముగ్గుల గురించి ఎంత బాగా వ్రాసారో! ఏంటో ఈ అపార్టుమెంట్ల జీవితాలల్లో చెయ్యారా ముగ్గులు వేసుకునే భాగ్యం లేదే అని అసలే నాకు బాధగా ఉంటే మీ టపా ఆ బాధని ఇంకా రెట్టింపు చేసింది.

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శిశిర చెప్పారు...

:) మీకు కూడా యాపీ నూ ఇయర్ శేఖర్ గారు. బాల్యాన్ని కళ్ళముందుంచారు. కాకపోతే ఈ సీనంతా సంక్రాతికి జరిగేది మా ఊళ్ళో.

budugu చెప్పారు...

బాగుందండీ మీ ముగ్గులటపా. టపాలో ముగ్గుకూడా అదిరింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఇంట్లో మేమ్ముగ్గురం అబ్బాయిలం. కొంచెం మీ అనసూయమ్మగారి ముగ్గుకు అటుఇటుగా ఏదో తంతు నడిచేది. :)) ఒక వింటర్లో మాత్రం ఇంటి పక్క అక్క నేర్పింది ముగ్గు. కాని పేపర్మీదే. నేనిప్పటికీ మర్చిపోని ఆ ముగ్గు పేరు LML ముగ్గు :) 7-7 చుక్కలు వేసి, మధ్య 3-3 మీ బ్లాగు ముగ్గు బార్డర్స్లో LML రాయొచ్చు..మీ టపా పుణ్యమా అని ఎది గుర్తొచ్చింది.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హన్నన్నా ఎంత పనైపోయింది. ఎవరో ఎందుకండీ నే చెప్తున్నా ఇనుకోండి మీ మూడు చుక్కలు మూడు గీతల ముగ్గు సూపరు :-)
హ హ టపా బాగుంది. మంచి ఙ్ఞాపకాలను కదిలించారు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సుజాత వేల్పూరి చెప్పారు...

ఎప్పటెప్పటి జ్ఞాపకాలో కదిలించారు. కింద వేసిన పెద్ద ముగ్గు కంటే మూడు చుక్కలు-మూడు వరసల ముగ్గు బహు ఖష్టంగా ఉంది!

వరూధిని గారూ,

నేనైతే అపార్ట్ మెంట్ ని కూడా క్షమించి వదిలేయను. ఇక్కడ కూడా పండగ రోజుల్లో ముగ్గు వేస్తా. కార్లు తొక్కకుండా వేరే గేటు తీసి పెట్టి అక్కడికి బాణం గుర్తు కూడా వేస్తా.."ఇటొస్తే కుదర్దు అటు పొండి"అని తెలిసేలా!

కొత్త పాళీ చెప్పారు...

బాబూరావ్ (మీరే) చిన్నప్పటి జ్ఞాపకాల్ని పూయించడంలో అతిరథ మహారథుల్ని మించిపోతున్నారు. కొత్త సమస్తరంలో కూడా ఇది క్రమంతప్పకుండా కొనసాగిస్తారని ఆశిస్తూ ...

sunita చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

పరిమళం చెప్పారు...

కొత్త సంవత్సరానికి రంగులద్ది ఆహ్వానం పలుకుతున్న బుడుగు (సారీ ) కనబడుతున్నాడు :) ముగ్గొక్కటీ రంగులతో మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ లో .....
ప్రస్తుతం : శేఖర్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ! అన్నట్టు ముగ్గు బావుందండీ ...మీది కూడా :)

జయ చెప్పారు...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Hima bindu చెప్పారు...

ఎంత బాగా రాసారో ...ప్రతి వాక్యం కళ్ళ ముందు కనబడింది .మా చిన్నతనం లో మా తమ్ముళ్ళుఇలానే వెనకాల తిరిగే వాళ్ళు మా చిన్న తమ్ముడు మరీను ...ఈ నెలలో వచ్చిన పోస్ట్ లు అన్నిటిలోనూ అధ్బుతంగా ఉంది మీ ''జ్ఞాపకాల రంగవల్లి "..కొంచెం ప్రయత్నిస్తే మీరు మంచి రచయితా కాగలరు .

తృష్ణ చెప్పారు...

నా చిన్ననాటి రొజులు గుర్తు చేసారండీ...
నేనూ అలాగే ముగ్గుల పుస్తకం దగ్గర పెట్టుకుని ఏ ముగ్గు వెయ్యాలా అని ఆలోచించేసి...అందరికన్నా పేధ్ధ ముగ్గు వేసేసి..సందులో అమ్దరి దగ్గరా మర్కులు కొట్టేసేదాన్ని...!!

మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మాలా కుమార్ చెప్పారు...

నూతనసంవత్సర శుభాకాంక్షలు .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మురళి గారు,
:-)
థాంక్యు..థాంక్యు..

@ఉష గారు,
:-)
ఎంతైనా ముగ్గు వెయ్యటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనండీ....ఓ సారి కాలేజ్ లో మిక్కిమౌస్ బొమ్మ వేసి దానికి రంగులద్దినప్పుడు తెలిసింది ఈ విషయం....ఎవరైనా ఆ మాత్రం గుర్తింపు కోరుకోవటం చాలా న్యాయం...
మీరు ఎప్పటిలాగే ఈ సంవత్సరంలో కూడా మరిన్ని అనుభవాలతో, అనుభూతులతో మంచి మంచి కవితలల్లాలని కోరుకుంటున్నాను.
థాంక్యు..

@వరూధిని గారు,
అయ్యో..సారీ అండి...నిజానికి ఇప్పటి పరిస్థితి మీద కాసింత అసంతృప్తి ఉండటం వల్లనే నేను పనిగట్టుకుని మరీ ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళిపోయాను. త్వరలోనే ఓ పేద్ద రధం ముగ్గు వేసే అదృష్టం మీకు కలగాలని కోరుకుంటున్నాను. :-)
థాంక్యు..

@శిశిర గారు,
మా ఊళ్ళో కూడా సంక్రాతికి వేస్తారండీ...కాకపోతే ఈ రోజు వేసినప్పుడు ఉండే ఉత్సాహం,పోటీ, సందండి అప్పుడు ఉండదు. థాంక్యు..

@బుడుగు గారు,
ఎల్ ఎమ్ ఎల్ ముగ్గా? భలే ఉందండి పేరు...ఎల్ ఎమ్ ఎల్ వెస్పా స్కూటర్ లాగ...
ఇంతకు ఇప్పుడు మీరు దాన్ని వెయ్యగలరా లేదా?
థాంక్యు...

@వేణూ శ్రీకాంత్ గారు,
థాంక్సండీ...కనీసం మీరైనా నా మనోభావాలు పట్టించుకున్నారు..:-)

@సుజాత గారు,
బాణం గుర్తు పెట్టేవారా.... :-)
థాంక్యు...

@కొత్తపాళీ గారు,
>>> బాబూరావ్
:-) :-) ఈ పేరు చూసి నా రూమ్మేట్ నన్ను అలానే పిలవటం మొదలెట్టాడండి.
ఏదో అంతా మీ అభిమానం....మీ ప్రోత్సాహానికి థాక్సండి...జ్ఞాపకాల్ని నెమరువేసుకోవడంలో నాకు అదోరకమైన కిక్ ఉంటుందండి...అందుకే అస్తమానం అటువైపు పరిగెత్తాలని తాపత్రయపడుతుంటాను.

@సునీత గారు,
థాంక్యు...

@పరిమళం గారు,
సారీ ఎందుకండీ...
టపాలో మీకు బుడుగు గాడు కనపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి.
చూసారా! చూసారా!...మీరు కూడా ముందు దిగువన ఉన్న ముగ్గు మెచ్చుకుని తర్వాత నాది బాగుందన్నారు...:(
థాంక్యు...మీకు కూడా హేపీ న్యూ ఇయర్...

@జయ గారు,
థాంక్యు..విషింగ్ యు ద సేం..

@చిన్ని గారు,
మొదటగా మీ కాంప్లిమెంట్ కి, ప్రోత్సాహానికి బోల్డన్ని థాంకులండీ...
ఇక్కడంత సీను ఉందా అని కొంచెం డౌటండి...ఏదో కాస్త తెలిసినదానితో అలా బండి నడిపించేస్తున్నానంతే!!
కానీ తప్పకుండా బాగా రాయడానికి ప్రయత్నం చేస్తాను.

@తృష్ణ గారు,
మా రోజక్క కూడా మీలాగే కళలపట్ల కాస్త మక్కువ ఉన్న అమ్మాయి...మీ బ్లాగు మొదటసారి అంతా పరిశీలనగా చూసినప్పుడు నాకు తనే గుర్తొచ్చింది.
థాంక్యు...

@మాలా కుమార్ గారు,
థాక్సండి...మీకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు

Bhadrasimha చెప్పారు...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ -2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

మోహన చెప్పారు...

బేసికల్ గా మనకి పోటీ తత్త్వం కొంచం ఎక్కువే తక్కువ. :) అందుకే మా పిన్ని ముగ్గులేస్తుంటే నోరేల్లబెట్టుకుని చూస్తూ తనకి సాయం గా [దోమలతో కుట్టించుకోటం లో :P] నిల్చుని తెగ సంబరాపడేదాన్ని. పిన్ని కి ఏదైనా కావాలంటే మనం లోపలికి బయటకు పరుగెత్తేవాళ్లం అన్నమాట:) మా ఉళ్ళో కుడా ఇదంతా సంక్రాంతి కి జరిగేది. ఒక 15 రోజులు ఇలా రోజుకో ముగ్గుతో తంటాలు. అప్పుడప్పుడు అమ్మ, పెద్దమ్మ కుడా తలా చెయ్యి వేసేవారు:) సంక్రాంతి రోజుల్లో ముగ్గు పక్కన పేట్టే చందమామ, రథం మ్ముగ్గు వేసిన రోజు తాళ్ల బాధ్యత మాది :D అవి మా copyrights. ఎవరూ అందులో వేలు పెట్టటానికి వీల్లేదు!! పెడితే ఇక అంతే.... వా(.... వా...:(( అని రాగం ఎత్తుకునే వాళ్లం.

అన్నట్టు same pinch. ఈ రోజు నేను ఒక ఫ్రెండ్ కి 'Aappy New year' అని చాట్ బాక్స్ లో wish చేస్తే typo అనుకుంది. :P

మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. :)
Wish you all cherishable moments in this new year Mr.Baburao :P

అజ్ఞాత చెప్పారు...

డిసెంబరు 31 రాత్రి జ్ఞాపకాలు మీకూ వున్నాయన్నమాట. అయినా మీకు ముగ్గులొచ్చని కాస్త ముందె తెలిసుంటే ఈ డిసెంబరు 31 రాత్రి ఇంచక్కా మా వాకిట్లో మీచేతే ముగ్గు వేయించేదాన్నికదండీ , మా అత్తగారి పర్యవేక్షణలో....

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@భద్ర సింహ గారు,
థాంక్యు..మీకు కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు..

@మోహన గారు,
రధం ముగ్గులో తాళ్ళు వేసేవారా?..ఎంత కష్టమైన పనో కదండీ..:-)
హన్నా! నన్ను అలా పిలుస్తారా...
మీకు కూడా యాపీ నూ ఇయర్...:P

@లలిత గారు,
మీదింత పాషణ హృదయం అని ఇప్పుడే తెలిసిందండి...లేకపోతే నాకింత శిక్ష విధించడానికి ఫిక్స్ అయిపోతారా? నేను వేసే అష్టవంకర మూడు చుక్కల ముగ్గుని సరిచేస్తూ మళ్ళీ వచ్చేసంవత్సరం డిసెంబర్ 31 వరకు మీ వాకిట్లోనే ఉండిపోవాలప్పుడు.:-)

sreenika చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

లక్ష్మి చెప్పారు...

భలే చెప్పారు కదా మీ ముగ్గుల అనుభవాలు. మీకు కూడా హాప్పీ హాప్పీ న్యూ ఇయరూ ఇంకా బోల్డన్ని సంబరాలు

నిషిగంధ చెప్పారు...

ఈ ముగ్గుల విషయంలో మాత్రం నేను మీకంటే చాలా బెటర్ తెలుసా! నేను నిద్రలో కూడా తడుముకోకుండా వేయగలిగే అతి పెద్ద ముగ్గు ఐదు చుక్కలు ఐదు వరుసలది!! :-)

భలే క్యూట్ గా ఉంది మీ టపా.. బాబూరావ్ మాత్రం కేక :))

కొంచెం ఆలశ్యంగా, మీకూ, మీ కుటుంబసభ్యులకీ, మే రూమ్మేట్స్ కీ, మీ కొలీగ్స్ కీ, మొత్తమ్మీద మీకు తెలిసినవారందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శ్రీనిక గారు,
@లక్ష్మీ గారు,
థాంక్యు..

@నిషిగంధ గారు,
అమ్మో! రెండు కాదు..మూడు కాదు..ఏకంగాఅయిదు చుక్కల ముగ్గే! మీరు నిజ్జంగా బెటరండి.. :-)
మీరు కూడా ఆపేరుతో...వా..:(
మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో పాఠకుల మదిని దోచే టపాలెన్నింటినో రాయలని కోరుకుంటున్నాను.
థాంక్యు..

divya vani చెప్పారు...

చాలా బాగుంది అండీ మి 31 రాత్రి రంగవల్లి ,మి మూడు చుక్కల ముగ్గు కూడా బాగుంది ,ఇంతకి నాలుగో సారి కూడా మీ రోజా అక్క పోటిలో గెలిచిందా చెప్పలేదు .. మీకు happy new year

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

దివ్య వాణి గారు,
థాంక్ యు సో మచ్....అసలు ఆ కాలనీలో మేము ఉన్నన్ని రోజులు మా అక్కదే మొదటి బహుమతి...
మీకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

Sirisha చెప్పారు...

last lo unna muggu chala bagundhi adi evaru vesindhi....chala bagundhi aa muggu

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

శిరీష గారు,
అది గూగుల్ ఇమేజ్ అండి....

Unknown చెప్పారు...

namasthe.. shekar garu...iroju modatisari me blog chusanu. chakkanaina, chikkanaina vyakhyalatho me blog etigattunu maripinchindi. ellapudu vijayam kalagalani korukuntu.. dhanyavadalau shekar garu.!!!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@Lavanya గారు,

థాంక్యూ!..

అజ్ఞాత చెప్పారు...

Budugu App in google playstore for android

https://play.google.com/store/apps/details?id=com.budugu&feature=search_result#?t=W251bGwsMSwxLDEsImNvbS5idWR1Z3UiXQ..