12, నవంబర్ 2009, గురువారం

హ్యాపీడేస్ -- 'నెరజాణ'

నేను అశోక్..అందరూ బండ వెదవ అని అంటుంటారు..కానీ ఆ బక్కోడు శేఖర్ గాడు మాత్రం నా గాళ్ ఫ్రెండ్ ముందు అలా పిలవడానికి భయపడతాడు. అదిగోండి అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడే...వాడే శ్రీను గాడు...పొడుగ్గా సన్నగా ఉండి అన్నింటికీ ఒకటే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడు చూశారూ..వాడే విజయ్...అదిగోండీ మాటల్లోనే వచ్చాడు మా మదుగాడు..వాడి గాళ్ ఫ్రెండ్ ఇప్పుడు వాడిని బయటకు వదిలినట్టుంది...ఏంటి ఈ బక్కోడిని పరిచయం చేయలేదంటారా? వాడు మీకు తెలుసు కదండీ..వాడి రాతలతో ఓ బ్లాగు పెట్టి మీ సహనాన్ని పరీక్షిస్తుంటాడు...just kidding రా శేఖ్...మేమందరం ఇంజనీరింగ్ లో రూమ్మేట్స్...ఇప్పుడు సోల్ మేట్స్..సరేగానీ శ్రీను నువ్వు చెప్పరా మన 'నెరజాణ' గురించి...

'నెరజాణ' పేరు ఎత్తగానే గ్యాంగ్ లో అందరూ చుట్టూ వచ్చేశారు చూశారా?

అవి మేము ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులు..ఓ చిన్న పల్లెటూళ్ళో అయిదుగురం రూం తీసుకొని ఉండేవాళ్ళం...ఓ సారి కార్తీకంలో వీధి వాకిట్లో మా రూం ముందు తెరలు తెరలుగా మంచు పడుతోంది. అప్పుడు సమయం అయిదు గంటలు కావస్తోంది. ఎప్పటి లాగానే చదవటం కోసం నేను వాకిట్లో ఉన్న గడప మీద కూర్చి వేసి కూర్చొన్నాను. మామూలుగా అయితే ఆ టైంలో శేఖ్ గాడు కూడా లేచి చదువుతాడు..కానీ కాస్త చలిగా ఉండటంతో అశోక్ గాడి కంబలిని లాగేసుకుని, వంటికి చుట్టేసుకుని పందికి కజిన్ లాగా పడుకున్నాడు. చుట్టూ అల్లంత దూరంలో మంచు...ఇంటి ముందు వాకిట, అక్కడే ఉన్న సన్నజాజి మొక్క తప్పించి రోడ్డుకి అవతల వైపు ఉన్న చెరువు, పంటపొలాలు ఏమీ కనపడుట లేదు....కొద్ది సేపు తర్వాత సూర్యుడు లేలేత కిరణాలు మంచు బిందువులను ముద్దాడి నేలను తాకుతున్నాయి.

కాసేపటికి చదువుతూ చదువుతూ తలపైకెత్తి చూశాను. రోడ్డు మీద పొలం పనులు చేసుకునే వారు నడిచిపోతున్నారు. చెరువు కూడా మెరుస్తూ కనపడుతుంది. అకస్మాత్తుగా నా చూపు ఓ యుక్తవయసు అమ్మయిల గుంపు మీద పడింది. అందరూ ఇంచుమించు పదహారు,పదిహేడు వయసు మద్యనే ఉంటారు. ఒక్కొక్కరు స్టీలు కారియరు, గంప, పార పట్టుకుని చెప్పులైనా లేకుండా నడిచి పనులకు వెళుతున్నారు. మెరుపువేగంతో అందులో ఉన్న ఓ అమ్మాయి మీద నాదృష్టి పడింది. ఆమె పసుపు వర్ణ చాయ సూర్యుని లేలేత కిరణాలకు బంగారంలా మెరుస్తూ ఉంది. స్వచ్చమైన నవ్వు..చందమామ లాంటి మోము...పాదాలైతే ఆ కంకర తేలిన రోడ్డు మీద కందిపోతాయేమో అన్నంత సుతిమెత్తగా కనపడ్డాయి...సాదా సీదా మాసిన లంగా జాకెట్ వేసుకుని ఉంది. ఓ అప్సరస ఆ గుంపులో తిరుగుతుందేమో అన్నంత ఆశ్చర్యం కలిగింది నాకు. చూసి చూడగానే నాకు తెలీకుండానే ఏదో పాటలో ఉన్న చిన్న లిరిక్ పాడేసుకున్నాను.

"నే గనక నీరైతే నీ నుదుటిపైనే జారీ..అందాల నీ యదపై హుందాగ కొలువుంటా.."

కొన్ని రోజుల వరకు రూమ్మేట్స్ ఎవరికీ ఆ అమ్మాయి గురించి చెప్పలేదు.

"రేయ్ అశోక్ తర్వాత రోజు ఏమి జరిగింది?..."

చెప్తా..చెప్తా...ఇది నేనే చెప్పాలి..ఎందుకంటే ఆ రోజు శేక్ గాడు మొహంలో ఎక్స్ ప్రెషన్స్, వాడి కవితలు నాకింకా గుర్తున్నాయి..

శ్రీను గాడు కొద్దిరోజుల తర్వాత మా గుంపులో ఆ అప్సరస గురించి అందరికీ చెప్పాడు. ఎప్పుడూ తొమ్మిదింటికి కాలేజీ అయితే ఎనిమిదిన్నరకు ముందు ఎప్పుడూ లేవని నేను ఆ రోజు వేకువ ఝామునే లేచాను...శేఖర్, శ్రీను తో పాటు చదివేద్దామని.. కాదు ఆ అమ్మాయిని చూద్దామని..పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. శేఖ్ గాడు, నేను ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి కనపడుతుందా అని బుక్కు వైపు, రోడ్డు వైపు మార్చి మార్చి చూస్తున్నాము. కాసేపయ్యాక మాకు విసుగొచ్చి చదవటంలో మునిగిపోయాము.."రేయ్..అటు చూడండి" అన్న శ్రీను గాడి మాటతో రోడ్డువైపు చూశాము. ఓ నిమిషం ఇద్దరం ఆమెను చూస్తూ అలా ఉండిపోయాం. "గోదావరిలో మునకలు వేసే నిండు చందమామా...నేను చూసిన తొలి అందం నీ రూపం..ప్రకృతిలోని అందమంతా నీ రూపు దాల్చింది..నీ అందాన్ని వర్ణించ భాష లేదు నాలో.." అని శేఖ్ గాడు సినిమాలోని కవితలన్నీ చదివేస్తున్నాడు. నేనేం తక్కువ తిన్నానా? Every night in my dreams...I see u..I feel u...అని టైటానిగ్ సాంగ్ అందుకున్నాను. "నెల్లూరు నెరజాణ..నే కుంకమల్లే మారిపోనా..నువ్వు స్నానమాడు పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే.." అని శ్రీను గాడు మళ్ళీ పాట అందుకున్నాడు. నిజంగా ఆ అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఆ అమ్మాయి మట్టి పనులు చేసుకోడానికి వెళుతుందంటే మాకు అస్సలు నమ్మకం కుదరలేదు. శ్రీనుగాడు 'నెరజాణ' అని పేరు పెట్టేసాడు.

రోజూ అందరం అరుగు మీద చదివిన ప్రతీసారీ ఆ అమ్మాయికి సైటు కొట్టుకునేవాళ్ళం...ఓ సారి శ్రీను గాడు రొటీన్ కి భిన్నంగా మేడ ఎక్కి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే "ఓయ్.." అని గట్టిగా అరిచాడు 'దిల్ సే' సినిమా అప్పటికే చాలా సార్లు చూసిన అనుభవంతో...ఆ అమ్మాయి చూసింది. వాళ్ళ గుంపులో వాళ్ళు కూడా చూశారు..చూసి ముసి ముసిగా నవ్వుకుని వెళ్ళిపోయారు. ఇలా రోజూ వీడు మేడ మీదకెక్కి అరవటం..ఆ నెరజాణ చూడటం..ఓ సారి వీడు అరిచిన "ఓయ్" శభ్దం పక్కింటి అక్క(ఓనరుగారి అమ్మాయి) విని మా దగ్గరకు వచ్చింది. "ఏంటర్రా ఎవర్నో పిలుస్తున్నాడు శ్రీను.." అని అడిగింది. విషయం చెప్పి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాము...పేరు తనకు తెలీదు అంది..వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ "చూసుకోండర్రా..ఈ ఊరులో ఉన్న ఎవరైనా ఇలా మీరు అల్లరి చేయటం చూస్తే గుంపులుగా వచ్చి కొట్టడానికి చూస్తారు...అది మాత్రమే కాదు కాలో చెయ్యో తీసేయడానికి కూడ వెనుకాడరు...కాస్త జాగ్రత్త" అని చెప్పింది.

అక్క మాటలు విన్న విజ్జుగాడు, మధు గాడు సైటు కొట్టడం మానేసారు. ఆ అమ్మాయి అందం ముందు అక్క మాటలేవీ మా ముగ్గురి చెవికి ఎక్కలేదు. పొద్దున్న,సాయింత్రం ఫ్రీగా సైటు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం.

ఎప్పుడూ కాస్తంత దూరం నుండే ఆ అమ్మాయిని చూడటం...ఓ సారి రూంలో వంటకి సామానులు కావాలంటే నేను,శేఖ్ గాడు, శ్రీను గాడు ముగ్గురం రెండు సైకిళ్ళమీద చెరువు గట్టు పక్కనుండీ బజారుకు వెళుతున్నాము. సాయింత్రం అయిదు అవుతుంది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ నెరజాణ అండ్ బృందం ఎదురుపడ్డారు...వాళ్ళ గుంపు ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు, మేము ఎదురెదురు వచ్చాక ఆ అమ్మాయిని దగ్గరనుండి తినేసేటట్టు చూశాం..మా చూపులకి ఆ అమ్మాయి తలదించుకుంది...రావే అంటూ ఆ అమ్మాయిని మిగిలిన అమ్మాయిలు లాక్కొనిపోతున్నారు. మేము మాత్రం సైకిల్ దిగి అక్కడే ఉన్నాము. కొద్ది సెకనుల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి, ఆ గుంపులో మిగిలిన వాళ్ళు మా వైపు చూశారు...మేము చూస్తున్నామని గమనించి వెంటనే తలలు ముందుకు తిప్పేశారు...ఏవేవో మాట్లాడుకుంటూ, ముసి ముసి నవ్వులు కురిపిస్తూ వెళ్ళిపోతున్నారు...అయినా ఇంకా మేము అక్కడే ఉన్నాము...ఈ సారి నెరజాణ మాత్రమే వెనక్కి తిరిగి చూసింది మళ్ళీ...మా ముగ్గురి హృదయాల్లో ఏ.ఆర్ రెహమాన్ హై పిచ్ లో శాక్సాఫోన్ వాయించాడు.

కొద్దిరోజుల తర్వాత ఓ రోజు మేము ఫైనల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే పక్కింటి అక్క మా ఇంటికి వచ్చింది. "తెలుసా...మీ నెరజాణకి పెళ్ళి అయిపోయింది." అని చెప్పింది. పెళ్ళికొడుకు వాళ్ళు అంకుల్ కి తెలుసంట....ఆ మాట విన్న శేఖర్ గాడు లేక లేక ఉతుకుతున్న వాడి టవల్ ని అలాగే పడేసి పరిగెత్తుకొచ్చాడు...బుక్ చదువుతున్న శ్రీనుగాడు అజంతా శిల్పంలాగ వార్త విన్న వింటనే అలా ఉండిపోయాడు. నేను తలను గోడకి ఆన్చేసి విచారం ప్రకటించాను. అంతలోనే "ఎవరక్కా ఆ అబ్బాయి" అని అడిగాను.
"ఆ అబ్బాయి తాపీ మేస్త్రీ అట..టౌన్ లోనే పనిచేస్తున్నాడు.." అని చెప్పింది అక్క. "తాపీ మేస్త్రీ" అన్న పదం మా ముగ్గురి చెవిన పడగనే మొదటి సారి అనిపించింది మాకు....అనవవరంగా ఇంజనీరింగ్ చదువుతున్నామని...అదే టౌన్లో తాపీమేస్త్రీ చేసుకునుంటే మా ముగ్గిరిలో ఎవరో ఒకరం 'నెరజాణ' ని చేసుకునేవాళ్ళం కదా అని. బెడ్ రూంలో నుండి విజ్జుగాడి గొంతు "విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేనని.." సన్నగా పాడుతోందప్పుడు. ఆ సుకుమారి ఓ తాపీమేస్త్రీ చేతిలో పడటం అనే విషయం జీర్ణించుకోడానికి మాకు చాలా రోజులే పట్టింది.

27 కామెంట్‌లు:

ప్రణీత స్వాతి చెప్పారు...

అయ్యో పాపం శేఖర్ గారూ..
తాపీ మేస్త్రి అవ్వాల్సిన మీరు ఇలా సాఫ్టువేర్ ఇంజినీర్ అయిపోయారా :):)

సుజాత వేల్పూరి చెప్పారు...

శేఖర్,
మా ముగ్గురి హృదయాల్లో ఏ.ఆర్ రెహమాన్ హై పిచ్ లో శాక్సాఫోన్ వాయించాడు.

భలే రాస్తున్నారు మీరు! అది సరే, ఇంతకీ నెరజాణ మిస్ అయినందుకా, తాపే మేస్త్రీ కాలేకపోయినందుకా మీ బాధ! రెంటికీ సంబంధం ఉందనుకోండి.

మీ బ్లాగులో ఏటిగట్టు ఫోటో ఇదివరకుదే చాలా బావుందండీ ఇప్పటి ఫొటో కంటే!ఇది గోదావరి ఒడ్డనుకుంటా!

నేస్తం చెప్పారు...

హెంత పనైపోయింది శేకర్ ...మా స్కూల్ లోని ఒక అమ్మాయి ఉండేది ..చిన తల్లి ఆమె పేరు ..ఆమెవరో తెలుసా వీదులు శుభ్రం చేసే వాళ్ళ అమ్మాయి..కాని అప్సరసే అప్సరస..ఆ అమ్మాయి పేరు కూడా ఇంకా గుర్తుందంటే చూడు ..పాపం ఆ అమ్మాయిని చూసి నీలాంటి అబ్బాయిలు వాళ్ళ లా ఎందుకు పుట్టలేదని ఎంత బాధ పడి ఉంటారో కదా .. :)

చదువరి చెప్పారు...

బక్కోడి బ్లాగులో బండోడి టపా అన్నమాట! కాస్త తికమక్ పెట్టారు శేఖ్!

మురళి చెప్పారు...

"పందికి కజిన్ లాగా పడుకున్నాడు.." ఇక్కడ మొదలు పెట్టానండీ నవ్వడం.. భలేగా ఉంది టపా.. నిజమే కదా 'సిరివెన్నెల' ఊరికే అన్నారా 'బోడి చదువులు వేస్టు..' అని..

పరిమళం చెప్పారు...

శేఖర్ గారు , పల్లెటూరి సుకుమారి కోసం తాపీ మేస్త్రి అవుదామనుకున్నారా ...హ ...హ్హ ...హ్హా ....నవ్వాపుకోలేక పగలపడి నవ్వేస్తుంటే నాకేదో ఐపోయిందనుకొని పరిగెత్తుకు వచ్చారు మా శ్రీవారు ! నెరజాణ పేరు మాత్రం భలే ఉందండీ ...మీరు సైటు కొడుతున్నారని తెలిసి అర్జంటుగా పెళ్లి చేసేశారేమో వాళ్ళింట్లో ...అసలే మీరు మేస్త్రీలు కూడా కాదాయె :)

నిషిగంధ చెప్పారు...

:))) మీ హ్యాపీ డేస్ బావున్నాయి..
ఎంచక్కా మీరు తాపీమేస్త్రీ అయిఉంటే, మీరు కట్టిస్తున్న భవనం దగ్గరకి మీ నెరజాణ మండుటెండలో నెత్తిమీద గంపలో మీకోసం భోజనం తెస్తే, చేతిలోని సుత్తి కత్తి అన్నీ అవతల పడేసి 'ఇదే ఇదే నేను కోరుకుందీ.. ఇలా ఇలా చూడాలనిఉందీ' అని పాడుకునేవాళ్ళేమో! ప్చ్.. చాలా మిస్ అయిపోయారుగా! :))

Hima bindu చెప్పారు...

హెంతపనయ్యింది ?గుండె బ్రద్దలయ్యిన ఇలా బ్లాగులు రాసుకుంటున్నార?
"తాపీమేస్త్రి నాయినా కాకపోతిని నెరజాణచూపు సోకగ .....అంటూ పాడుకోవడం లేదా ?
చాల చాల బాగా రాసారండి ...అయిన ఏదో చదుకుంటారని అమ్మ వాళ్ళు పంపిస్తే ఇలా పల్లెటూరి పిల్లకాయలకి సైట్ కొట్టడమేనా ..హమ్మ !

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@ప్రణీత గారు,
:))
ధన్యవాదాలు.

@సుజాత గారు,
నెరజాణ మిస్ అయినందుకేనండీ..:)
బ్లాగు హెడర్ ఫోటో పాతది కొంచెం బోరుకొట్టి కొత్తది పెట్టానండీ..కొద్దిరోజుల తర్వాత మళ్ళీ దాన్ని మార్చేసి పాతదే ఉంచుతాను.
థాంక్యు..

@నేస్తం గారు,
అవునండీ..ఏమాటకామాటే చెప్పాలి...వీళ్ళందరూ మట్టిలో పుట్టిన మాణిక్యాలండీ...:)
నెనర్లు.

@చదువరి గారు,
:)
థాంక్యు..

@మురళి గారు,
ఇప్పటికీ నేను అలానే పడుకుంటానని మా ఫ్రెండ్స్ ఫిర్యాదు అండీ...అప్పట్లో ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండుంటే నిజంగానే పలుగు,పార పట్టి ఉండేవాళ్ళమేమో!! :)
థాంక్యు..

@పరిమళం గారు,
మీరు చెబితే నమ్మరు కానీ హీరోయిన్ హన్సిక కూడా ఆ అమ్మాయి ముందు దిగదుడుపేనండీ...ఇప్పటికీ నాకు డౌటే..ఆ అమ్మాయి అక్కడి పిల్లేనా అని..
మావల్ల కాదు గానీ..పల్లెటూరు కదా! తొందరగానే పెళ్ళి చేసేస్తారు..ఇక అలాంటి అమ్మాయి అయితే జనాలు క్యు కడతారు కదండి...అంత అందమైన అమ్మాయికి మళ్ళీ మట్టి పిసుక్కునే రాత ఉన్నందుకు మాకు అప్పట్లో చాలా భాదేసిందండి..ధన్యవాదాలు.

@'ఊసులాడే ఒక జాబిలంట' నిషిగంధ గారు,
:)) భలేవారే మీరు..ఆ సుకుమారిని అంతే సుకుమారంగా చూసుకోవాలి గానీ అలా ఎండలో నడిపిస్తారా చెప్పండీ...ఎంత మాట..నో వే..:)
థాంక్యు..

@చిన్ని గారు,
బద్దలైన గుండె అతుక్కోవడం ఎంతపని చెప్పండీ? :)
పాటలా..? అప్పుడప్పుడూ..
అయినా ఇరవైనాలుగ్గంటలూ పుస్తకాలేనా చెప్పండీ..చుట్టూ ఉన్న ప్రకృతిని అప్పుడప్పుడైనా పరిశీలించాలి కదా!! :))
థాంక్యు..

లక్ష్మి చెప్పారు...

:D too good

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ మీ హ్యాపీడేస్ బాగున్నాయ్ శేఖర్ గారు. ఏ.ఆర్ రెహమాన్ హై పిచ్ శాక్సాఫోన్ కేక :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@లక్ష్మి గారు,
@వేణు శ్రీకాంత్ గారు,
థాంక్యు...:)

మా ఊరు చెప్పారు...

ఆ మాట విన్న శేఖర్ గాడు లేక లేక ఉతుకుతున్న వాడి టవల్ ని అలాగే పడేసి పరిగెత్తుకొచ్చాడు.

hahahahahahhaa

idi super

మాలా కుమార్ చెప్పారు...

మీ నెరజాణ బాగుంది .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మాఊరు,
@మాలా కుమార్ గారు,
ధన్యవాదాలు..

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

ఏదైనా ఇంజనీరింగ్ జీవితం వేరు కదండీ ...........

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@vamsi,
కరెక్ట్ గా చెప్పావు...ఆ రోజులు మళ్ళీ ఎక్కడా రిపీట్ కావు లైఫ్ లో...

తృష్ణ చెప్పారు...

ఇంతకీ మీ గుండె ఇలా బద్దలవ్వటం ఇది ఎన్నో మారూ...?అని నాకు డౌటు వచ్చేసింది..:) :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ష్..ష్..!!!..తృష్ణ గారు...మీరలా పబ్లిక్ గా అడిగేస్తే ఎలా? మనం మనం తర్వాత మాట్లాడుకుందాం... :-)

భావన చెప్పారు...

హయ్యో పాపం శేఖర్ గారు ఎంత పనై పోయిందండి. నేను కూడా ఒక డ్రీమ్మ్ వేసేను ఆ అమ్మాయి తాపి పని చేస్తున్న మీ దగ్గరకు వచ్చి హెంతో ఎదగవలసిన నువ్వు ఇలా నాకోసం తాపి పని చేస్తున్నవు కదా అని బాధ పడుతూ కొంగుతో మీ చెమట తుడీచి చేపల పులుసు పెడీతే అప్పుడు మీరు నెల్లూరి నెరజాణ అని పాట పాడీనట్లు ఏంటో ఒకటే డ్రీమ్ లు అండీ. :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@భావన గారు,
మీ డ్రీమ్ చదివి నేను కూడా పట్ట పగలే ఈస్ట్ మన్ కలర్లో ఆ సీన్ ఊహించేసుకున్నానండీ...ఏమాట కామాటే చెప్పాలి... ఆ ఊహ ఎంత హాయిగా అనిపించిందో తెలుసా! :P

కొత్త పాళీ చెప్పారు...

హ హ హ. సూపర్. నేను రాసుకున్న మొదటి కథ ఓరి భగవంతుడా గుర్తొచ్చింది.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@కొత్తపాళీ గారు,
:-)
థాక్సండీ...ఓరి భగవంతుడా! మీరు కూడా నేను చదవాల్సిన కధల ఖాతాలో ఇంకోటి వేసేసారు. తొందర్లోనే చదివేస్తా..

అజ్ఞాత చెప్పారు...

ప్చ్.....నెరజాణకి పెళ్ళయిపోయింది . ఇంతకీ ఈ కధలో అదృష్టవంతు లెవరూ ? ఇంజనీరా? మేస్త్రా ? నెరజాణా ? సమాధానం ఠపీమని చెప్పలి మరి

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@లలిత గారు,
ఓ ఏడేళ్ళ క్రిందట అయితే నా సమాధానం మేస్త్రీ..
ఇప్పుడైతే ఇంజనీరు..:-)
థాంక్యూ..

Unknown చెప్పారు...

adbhutam ga undandi... ilanti anubhavalu dadapu andariki untayi.. kani lenivariki kuda alanti anubhutini tisukuragaladu mee 'etigattu'.. dhanyavadalu shekargaru..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@Lavanya గారు,
థాంక్యూ!...