4, ఆగస్టు 2009, మంగళవారం

మరపురాని భందం...మరిచిపోలేని అనుభందం

రాఖీ పండుగ వచ్చిందంటే పిల్లలందరం నీ రాఖీ చూపించంటే నీ రాఖీ చూపించు అని, నీ రాఖీ పెద్దదా లేక నా రాఖీ పెద్దదా అని పోల్చుకుంటూ తెగ సందడి చేసే రోజులవి. ఆ సందండి లోనూ మనసు ఫీలయ్యే మరో ఆనందం ఉండేది. ఎందుకంటే రోజా ఎంతో కష్టపడి ఎన్నెన్నో షాపులు తిరిగి నా మనసుకు నచ్చుతుంది అని నిర్ధారించుకున్నకే రాఖీ కొనేది. నిజంగా తను నా చేతికి కట్టిన రాఖీ నా స్నేహితులందరు కట్టుకున్న దానికంటే చాలా బాగుండేది. పిల్లలందరు "ఒరేయ్..నీ రాఖీ చాలా బావుందిరా" అని అంటున్నప్పుడు నా మొహంలో కనపడే ఆనందం చూసి రోజా మురిసిపోయేది.

రోజా నాకు అక్క. నాకంటే తొమ్మిదేళ్ళు పెద్ద. కానీ ఎందుకో తను నాతో ఉన్నప్పుడు చిన్నపిల్లయిపోయేది. అలా దగ్గరితనం వల్లనేమో నేను తనని రోజా అనే పిలిచేవాడిని. తను కూడా ఎప్పుడూ అక్క అని పిలవమని బలవంతం చెయ్యలేదు.

ఆరేళ్ళ వయసు నుండి నేను ఏదైతే వద్దంటారో దాన్నే చేసేవాడిని. దానికి తోడు నాన్నకేమో ముక్కు చివరనే కోపం ఉండేది. రెండు మూడు రోజులకొకసారి తప్పనిసరిగా దెబ్బలు పడేవి. నా ప్రవర్తన, ఏడుపు అలవాటు పడిపోయిన అమ్మ నేను వెక్కి వెక్కి ఏడుస్తే పెద్దగా పట్టించుకోకుండా తన రోజువారి పనిలో నిమగ్నమై ఉండేది. అలాంటి టైంలో రోజా నన్ను ఎత్తుకుని వరండా అవతలకి తీసుకొచ్చి కబుర్లు చెప్పి నా ఏడుపును తొందరగానే ఆపించేది. తన ఒడిలో కూర్చొబెట్టుకుని ఏవేవో కబుర్లు చెప్పటం వల్ల నాకు నాన్న మీద కోపం పోయి చాలా సాంత్వనగా ఉండేది. ఎప్పుడైనా తను ఖాళీగా ఉన్నప్పుడు వీపు మీద గుమ్మడి పండు వేయించుకుని ఇల్లంతా తిప్పేది. ఇంట్లో అటకల మీద కూర్చోబెట్టేది.

రోజా ముగ్గులు బాగా వేసేది. తన దగ్గర ఒక పెద్ద ముగ్గుల కలెక్షనే ఉండేది. ప్రతీ కొత్త సంవత్సరం తను ఓ రెండు, మూడు ముగ్గులు తనకు నచ్చినవి నాదగ్గరకు తీసుకొచ్చి ఏ ముగ్గు బాగుందిరా అని అడిగేది. ఇంచుమించుగా ప్రతీసారి నేను చెప్పిన ముగ్గునే వేసేది. రంగులు తను అద్దుతూ నాకు ఇచ్చి అద్దమనేది. అలా తను ముగ్గు వేస్తూ రంగులు అద్దినంతవరకూ నేను తన పక్కనే ఉండేవాడిని. తెచ్చుకున్న రంగులు, ముగ్గు పిండి అయిపోతే రయ్యిన ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళి తేవటం, వేసిన ముగ్గుకు చమ్కీ పొడి అద్దటం వంటివి చేసేవాడిని.

నాలుగో తరగతి వరకు పాడటమంటే ఇంట్లోని, ఎవరైనా చుట్టాలు వస్తే, స్కూల్లో పాడటం మాత్రమే నాకు తెలుసు. ఓసారి ఏదో పేపర్ లో పాటల పోటీలు జరుగుతున్నాయి అని చూసి రోజా నాకు చెప్పింది. ఆ రోజు స్కూలుకి వెళ్ళనీయకుండా మా ఇంటికి చాలా దూరంలో ఉన్న పోటీ జరిగే ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడ చూస్తే అందరు పెద్దవాళ్ళే ఉన్నారు. నాకు భయం వేసింది. రోజ ఆ విషయం గమనించి నన్ను స్టేజి వెనుకకు తీసుకెళ్ళింది. నన్ను ఒక పాట పాడమంది. కొన్ని తప్పొప్పులు సరిచేసింది. ధైర్యం చెప్పింది. నువ్వు పాడిన తర్వాత అందరు మెచ్చుకుంటారు అని ప్రోత్సహించింది. తను అలా చెప్పేసరికి నేను ఎటువంటి బెరుకు లేకుండా చంటి సినిమాలోని "జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమెలే...." అనే పాట పాడాను. పాట పూర్తయ్యాక రోజా దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో కూర్చొన్నాను. వెంటనే అందరూ అక్క ముందర నన్ను పొగుడుతుంటే తను ఎంతో ఆనందంగా కనిపించేది. పోటీ అయిపోయేక ఇంటికి వచ్చేదారిలో నేను ఏవి కొనమంటే అవి కొనేసేది.

రోజా తన ఇంటర్ తర్వాత కొన్నాళ్ళు ఒక స్కూల్లో టీచర్ గా పనిచేసేది. ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే అలవాటు ఎవ్వరికీ లేదు. బాగా చిన్నప్పుడు నాన్న బట్టలు కొనేవారు గాని ఆ తర్వాత్తర్వాత అది కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే రోజ సంపాదించటం మొదలు పెట్టిందో అప్పటినుండి ప్రతీ సంవత్సరం తనే నాకు పుట్టినరోజుకు బట్టలు కొనేది. ఇంచుమించు తన జీతం మొత్తం నా బట్టలకే ఖర్చు చేసేసేది. బట్టలు మాత్రమే కాకుండా నా అభిరుచికి తగ్గట్టు ఓ స్కెచ్ పెన్ పెకెట్టో, వాటర్ కలర్సో గిఫ్ట్ గా ఇచ్చేది. ఓ సారి రాఖీ పౌర్ణమి రోజు తన శక్తికి మించిందే అయినా నాకు వెండి రాఖీ ఒకటి కొని కట్టింది. మా ఇంటి చుట్టు పక్కన ఉండేవాళ్ళు రోజమ్మ వాళ్ళ తమ్ముడికి వెండి రాఖీ కట్టింది అని ఓ సంవత్సరం చెప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే తనతో ఎన్నో ఆత్మీయ అనుభవాలు...

అలా మా ఇంట్లో నాకు, రోజాకి మధ్య మిగిలిన అక్కలకు నాకు ఉన్న సంభందం కంటే ఒక ప్రత్యేకమైన అనుభందం ఉండేది. మిగిలిన అక్కలకు పూర్తి భిన్నంగా ఉండేది నా పట్ల తన ప్రవర్తన. అసలు ఒక మనిషి ప్రేమ పొందినప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందో తనవల్లే నాకు మొదట తెలిసివచ్చింది. నాకు బాగా గుర్తు. నాకప్పుడు పదేళ్ళు ఉంటాయి. తను నాకు ఎన్నెన్నో ఇష్టమైనని కొనిస్తుంది అని ఓ రోజు పిడతలో ఉన్న రెండు రూపాయలతో జడకి ఇరువైపులా పెట్టుకునే క్లిప్పులు కొనిచ్చాను. ఇవ్వడంలో ఉన్న ఆనందం మొదటిసారి తెలుసుకున్న రోజది. రోజ కూడా ఎంతో మురిసిపోయి అవి పాడైనంత వరకు కూడా రోజు స్కూలుకి పెట్టుకునే వెళ్ళేది.

నేను పదో తరగతి చదువుకునే రోజులవి. ఓసారి ఎందుకో రోజాకి బాగా జ్వరం వచ్చింది. మామూలు జ్వరం అని అనుకుని ఇంట్లో మాత్రలు వేశారు. రెండు మూడు రోజులయ్యింది. అయినా తనకి జ్వరం తగ్గలేదు. ఓ రాత్రి అందరం మంచి నిద్రలో ఉన్న వేళ తను హటాత్తుగా లేచి గుండేల్లో నొప్పంది. అమ్మ, అక్క చాతీమీద మర్ధన చెస్తే పడుకుంది. కానీ కాసేపటికే మళ్ళీ నొప్పి అని లేచింది. అర్ధరాత్రి టైం మూడవుతుంది. ఆ టైంలో మా ఊర్లో డాక్టర్లు ఉండరు. అందుకని కొంచెం తెల్లవారయితే హాస్పిటల్ కి తీసుకువెళ్ళొచ్చు అని నాన్న అనుకున్నారు. నాకు ఆ టైం లో తగినంత మెచ్యురిటీ లేకపోవటం వల్లనేమో మధ్యలో ఓసారి లేచి మూమూలు పరిస్థితే అనుకుని ముసుగుతన్ని పడుకున్నాను. తెల్లవారుతుందనగా రోజకి గుండెల్లో పెయిన్ ఎక్కువయ్యి, చాలా నీరసించిపోయి నాన్న భుజాలకు ఎత్తుకుని హాస్పటల్ కి తీసుకెళుతున్నరనగా నాన్న భుజాల మీదే ప్రాణాలు వదిలింది. అప్పుడు నాకు నిద్ర మత్తు వదిలి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను. కొన్నిరోజుల వరకు తను లేదన్న విషయంలో నాకు నమ్మకం కుదరలేదు.

తను ఎక్కడ ఉన్నా నా అభివృద్దిని చూస్తుంటుంది. పది మందికి నా గురించి గొప్పగా చెప్పుకుని ఆనందిస్తూ ఉంటుంది. చేతికి తనుకట్టిన రాఖీ లేకపోతేనేం....తను వెండి రాఖీ కట్టిన జ్ఞాపకం ఇంకా వాడిపోకుండా స్వచ్చంగానే ఉందికదా....అది చాలు.

27 కామెంట్‌లు:

MURALI చెప్పారు...

చాలారోజుల క్రితం పల్లేటి చదివా మీ బ్లాగులో. ఈ రోజు మీ అక్క గురించి. మనసుని తాకి వెంటాడే స్మృతులు. మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు, వారిని అంతగా గుర్తు చేసుకుంటున్న మీరు అభినందనీయులు. మనసు భారమయి మాటలు వెతుక్కుంటున్నా.

సుభద్ర చెప్పారు...

చాలా బాగు౦ది,ఇ౦కా చాలా ఆత్మీయ౦గా ఉ౦ది.కాని చాలా బాధగా కుడా ఉ౦ది.

iam so sorry.ఎమి రాయలో తెలియట౦ లేదు.

కొత్త పాళీ చెప్పారు...

మీరేంటండీ ఏటిగట్టు అని చెప్పి ఎట్లా గుండె మెలిపెట్టేసే కథల్రాస్తారు!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

’జాతస్య హి ధ్రువో మృత్యుః’ అని మనస్సును ఎంత సమాధానపరచుకుందామనుకున్నా ఆత్మీయుల మృతి గుండెలను పిండేస్తుంది.నాలుగు రోజుల క్రితం స్నేహితుని కుమారుని మరణం నన్ను మానసికంగా చాలా బాధించింది. మరలా మీ టపా గాయాన్ని కెలికినట్లయింది..

మోహన చెప్పారు...

శేఖర్ గారూ.. ఇలా అయితే నేను మీ బ్లాగు చదవను. బెదిరించట్లేదు కానీ, మరి ఇప్పుడు నాకు గుండెల్లొ నొప్పి వస్తోంది. :(
మీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు జరిగిన ఘటనలు కావటం వల్ల ఇవి మీకు సమయంతో ఆ ఘటన, ఆ బాధ అలవాటయిపోయి ఉండచ్చు. ఆ సంగతులన్నీ గిర్రున రీల్ తిప్పినట్టు ఒక 10 నిమిషాల్లో చెప్పేసి కాస్త ఊయయలలూపేసి, ఒకే ఉదుటున పడదోస్తున్నారు, ఆ రీల్ తో పాటు మనసుల్ని కూడా గ్రయిండర్లో వేసేస్తున్నారు. మీకిది భావ్యం కాదు.
వ్యాఖ్య రాస్తున్నప్పుడు మధ్యలో అనిపించింది. ఇలానే నన్నెవరైన అడిగితే వింటానా అని. అయినా అడుగుతున్నాను, పూర్తి స్వార్థంతో! ఒకవేళ ఇలాంటి ఘటనలు రాయాలి అనుకుంటే కనీసం కాస్త వ్యవధి తో వేరు వేరు భాగాలుగా రాయమని మనవి. అయినా మీ బ్లాగు.. మీ ఇష్టం.

రాఖీ పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నా మొదటి శుభాకాంక్షలు మీకే.. :)

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

mimmalni choosi rojagaaru ekkado okadaggara happy ga feel avutuvuntaaru le........

మురళి చెప్పారు...

శేఖర్ గారూ.. మళ్ళీ ఏడిపించారు.. చదువుతుండగా మధ్యలో ఎందుకో 'పల్లేటి' జ్ఞాపకం వచ్చాడు.. 'అలాంటి ముగింపు ఉండకూడదు' అని బాగా కోరుకుంటూ చదివాను.. ప్చ్.. ఏం లాభం? ముగింపులు మన చేతిలో ఉండవు కదండీ..

సిరిసిరిమువ్వ చెప్పారు...

Very touching! ఏం చెప్పాలో తెలియటం లేదు.

Kathi Mahesh Kumar చెప్పారు...

హ్మ్మ్

నేస్తం చెప్పారు...

:(

Hima bindu చెప్పారు...

యేం రాయాలి ....ఈ క్షణాన మీతో దుఖాన్ని పంచుకోగలను...ఈ లోటు ఎంతమంది వున్నా తీరనిది .బ్రతికి వున్నంతవరకు వెంటాడే స్వప్నం .....అలానే ఒక చేదు జ్ఞాపకం {మరణం}

తృష్ణ చెప్పారు...

కళ్లల్లో నీళ్ళే కానీ చేతికి వాక్యాలు రావటం లేదండి...మీ వయసు నాకు తెలిదు..నేనే మి అక్క/చెల్లి అనుకుని నా బ్లాగులొ ఇవాళ నే పెట్టిన రాఖీ చూడండి.నేను కట్టానని అనుకోండి...దీనివల్ల ఆవగింజలో ఆరోవంతైనా మీ మనసుకు సాంత్వన కలిగించగలిగితే ఒక చెల్లిగా,అక్కగా ఇవాళ నేను నా అన్నదమ్ములకి కట్టిన రాఖీలకు అర్ధం ఏర్పడుతుంది..!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

MURALI గారు,
సుభద్ర గారు,
Vinay Chakravarthy గారు,
సిరిసిరిమువ్వ గారు,
మహేష్ గారు,
నేస్తం గారు,
స్పందించినందుకు ధన్యవాదాలు.

కొత్తపాళీ గారు,
అన్ని భావోద్వేగాలను, పిచ్చాపాటి కబుర్లను మన మిత్రులతో పంచుకునేందుకు అనుకూలంగా ఉండే ప్రదేశమే కదండీ ఏటిగట్టు. రాఖీ ముందు రోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నా ఆలోచనల్ని గతం వైపు నడిపించాయి. ధన్యవాదాలు.

విజయమోహన్ గారు,
నా టపా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మన్నించాలి. కొన్నిసార్లు నా బ్లాగు నాకు ఎమోషనల్ అవుట్ లెట్ అవుతుంది. అలాంటి సందర్భం లో రాయక తప్పటం లేదు. ధన్యవాదాలు.

మోహన గారు,
మిమ్మల్ని అందర్నీ బాగా ఎమోషనల్ గా ఫీలయ్యేటట్టు చేయటం నా అభిమతం కాదు. బుర్రలో ఒక్కసారి గిర్రున తిరిగే ఆలోచనలకి అక్షర రూపం ఇచ్చేసాను గానీ ఇది చదువరులలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అని ఆ సమయంలో ఆలోచించలేదు. ఇకమీదట ఇలాంటివి రాయాల్సి వస్తే మీ సూచనని పరిగణనలోకి తీసుకుంటాను. నెనెర్లు.

మురళి గారు,
అవును..ముగింపులు మన చేతిల్లో ఉండవు. నెనెర్లు.

చిన్ని గారు,
మీలాంటి బ్లాగ్మిత్రులు ఉంటారనే నమ్మకంతోనే పరాయితనం ఫీలవ్వకుండా దీన్ని బ్లాగులో పెట్టేసాను. ధన్యవాదాలు.

తృష్ణ గారు,
నా టపాకి అక్కలాగ స్పందించిన మీకు వేవేల కృతఙ్ఞతలు. నిజంగానే మీ వ్యాఖ్య, మీరు రాసిన టపా చదవగానే మనసు కాస్త తేలికయిన అనుభూతి కలిగింది. మీరందించిన సపోర్ట్ కి ఒక థాంక్స్ తో సరిపెట్టడం తక్కువే అవుతుంది.

రాధిక చెప్పారు...

శేఖర్ గారూ..ఏం చెప్పాలో తెలియటం లేదు.

రాఖీ పండగ శుభాకాంక్షలు

భావన చెప్పారు...

శేఖర్ గారు,
మనసులో ఒక్క సారి బాధ మెలి తిప్పినట్లయ్యింది ఇప్పుడే నా స్నేహితురాలు గుర్తు వచ్చి అచ్చం గా ఇలాంటిదే పోస్ట్ రాసేను రాయగానే మీ పోస్ట్ చదివేను... చిన్నతనమే కాదు పెద్దయ్యక కూడా ప్రేమించిన వాళ్ళు లేరనే సత్యం చాలా కష్టం గా వుంటుంది జీర్ణం చేసుకోవటానికి... ఏమి చెయ్యగలం జీవితం తో సాగి పోయే ఏరల్లే కదిలిపోవటం తప్ప.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

రాధిక గారు,
ధన్యవాదాలు.

భావన గారు,
మీ టపా ఇంకా చూడాలి. నెనెర్లు.

ప్రణీత స్వాతి చెప్పారు...

ఆత్మీయులు దూరమవుతే ఆ బాధ మర్చిపోలేనిది... ఏం మాట్లాడాలో తెలియట్లేదండి...

పరిమళం చెప్పారు...

శేఖర్ గారూ!ఇంత ఆలస్యంగా చదివాను అయినా ఏం రాయకుండా వెళ్ళ లేకపోతున్నా ! మనసు భారమయిపోయింది .మన డైరీలో కొన్నిపేజీలు చేదు జ్ఞాపకాలే !

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@ప్రణీత గారు,
ధన్యవాదాలు.

@పరిమళం గారు,
అవునండి...కొన్ని పేజీలు చూసుకోకూడదనుకున్నా ఏదో రకంగా అవి గుర్తొస్తూనే ఉంటాయి. వాటి నుండి తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు.
ఆలస్యంగా చదివిన, వదిలేయకుండా అన్ని టపాలపై మీ స్పందనను తెలిపినందుకు నెనెర్లు.

లక్ష్మి చెప్పారు...

:(శేఖర్ గారు, నా తమ్ముడు గుర్తుకొచ్చాడండీ. మీరెలా తన రాఖీ ని మిస్ అవుతున్నారో నేను కూడా వాడికి కట్టే రాఖీ ని మిస్ అవుతున్నా. ఏంటో మనసు భారంగా అయిపోయింది

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

లక్ష్మి గారు,
మీకు కూడా ఇంచు మించుగా నాలాంటి గతమే ఉందన్నమాట...మీలోటును నేను పూర్తిగా అర్ధం చేసుకోగలను. మీ స్పందనకు నెనెర్లు.

కార్తీక్ చెప్పారు...

chaalaa bavundanDi

Mauli చెప్పారు...

ammo nizam kadu ani teliste bagunnu ani, comments anni chadivaa :(


ippudu rakhi kakapoyina, happy rakhi wishes :)

Unknown చెప్పారు...

boss edipinchavu... :( mi akka and palleti gurinchi cheppi... naku akka chellellu leruga... :(

Unknown చెప్పారు...

naku enno gnapakalu unnai, but rayadaniki radhu... :(

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శిరీష్
మీరు రాయడానికి ప్రయత్నించండి...ఆటోమెటిగ్గా మీ అంతట మీరే రాయగలుగుతారు...మీకు వీలయినప్పుడు మిగిలిన వాళ్ళ బ్లాగులు చూస్తూ, పరిశీలిస్తూ ఉండండి...ఆ తర్వాత మీదైన సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించండి. తొందరగానే సఫలీకృతులవుతారు...నేను కూడా మొదట్లో మీలానే భయపడేవాడిని..ఇప్పుడిప్పుడే కాస్త కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేసుకుంటున్నాను...

Swetha చెప్పారు...

chaala rojula tharvaatha mee blog chadivaanu.....ee post tho meeru nannu edpinchaarandi.....ippudu kooda mansantha edo baadha....ee blog post chadavatam modalu pettinappati nunchi....meeru annee past tense lo "undedi, chesedi" ani cheputhuntene manasu edo keedu shankinchindi kaani...naaku ee ending chaala baadagaa anipinchindandi....i'm very very very sorry for your loss