19, జులై 2009, ఆదివారం

గణితంతో తకధిమితోం


లెక్కలు సబ్జెక్ట్ అనగానే అప్పటివరకు లయబద్దంగా కొట్టుకుంటుండే గుండెకాయ కాస్త శ్రీలక్ష్మి పాట లాగ అపశృతిలో కొట్టుకునేది. అంకెలు, కూడికలు, హెచ్చవేతలు, భాగాహారాలు..ఈ పేర్లు వింటేనే చెయ్యి నాకు తెలీకుండానే బుర్రమీదకు పరిగెత్తేది. కళ్ళేమో నా మనస్థితిని తెలుపాలన్నట్టుగా రంగులరాట్నంలా తిరిగేసేవి. కొట్టడం, తిట్టడం వల్ల లాభం లేదనుకున్న ప్రవేటు టీచర్ భాగ్యలక్ష్మి నేను కొంచెం సిగ్గరి అని తెలుసుకుని, ఇవన్నీ నేర్చుకోకపోతే చొక్కాతీసి (నిక్కరుకు కన్సెషన్ ఇచ్చేసి) రోడ్డుమీద నిలబెట్టిస్తాను అని భయపెట్టి, ఒకటికి పదిసార్లు నాతో లెక్కలు చేయించటం మొదలుపెట్టింది. ఎప్పుడైనా అర్ధం కాక త్వరగా నేర్చుకోకపోతే నాకంటే పెద్దపిల్లలతో "ఒరేయ్ వీడి నిక్కరు విప్పి రోడ్డుమీద నిలబెట్టించండి" అనేసరికి ఏడుపు తన్నుకొచ్చేసేది. ఆవిడ భయపెట్టడం వల్లో లేక ఆవిడ అర్ధమయ్యే రీతిలో ఒకటికి రెండుసార్లు చెప్పటం వల్లో తెలీదుగానీ ఆరేళ్ళకే నేను అన్నీ నేర్చేసుకున్నాను. స్కూల్లో జాయిన్ అవడానికి అమ్మతో వెళ్ళినప్పుడు హెడ్మాస్టర్ చిన్న పరీక్ష పెట్టి "ఈ అబ్బాయిని మూడో తరగతిలో జాయిన్ చేయండి" అని మా అమ్మతో చెప్పి నన్ను మూడో తరగతి క్లాసులో కూర్చొబెట్టించారు.

ఇంక అప్పటినుండి నా లెక్కల కష్టాలు మళ్ళీ మొదలు. తరగతిలో ఓ ఏభైమందికి పైగా పిల్లలు ఉన్న దుంపలబడి స్కూల్లో ఎవడూ పట్టించుకోకపోవటంతో నా లెక్కల నాలెడ్జ్ నిధులు లేక సగం కట్టి ఆపేసిన గవర్నమెంట్ బిల్డింగ్ లా భాగ్యలక్ష్మీ టీచర్ వేసిన పునాది దగ్గరే ఆగిపోయింది.

నాలుగో తరగతి లో ప్రతీరోజు ఓ రెండు లెక్కలు క్లాసులో చెప్పనివి హోం వర్క్ ఇచ్చి మరుసటిరోజు చేసుకురమ్మనేవారు. ఇంట్లో అక్కావాళ్ళకు కూడా లెక్కల్లో పెద్ద ప్రావీణ్యం లేకపోవటంతో, నా బుర్రలో గుడ్డిలో మెల్లగా ఉన్న నాలెడ్జ్ ని బలవంతంగా బయటకు లాగినా ప్రయోజనం లేకపోవటంతో టెక్స్ట్ బుక్ వెనుక ఉన్న ఆన్స్ ర్ వేసి, దానికి ముందు ఓ నాలుగు పిచ్చి స్టెప్లు వేసేసి మరుసటి రోజు స్కూలుకి పోయేవాడిని. అప్ప్పుడప్పుడూ దొరికినప్పుడు మాత్రం 'జనకు జన పాయల్ భాజే' అయ్యేది. ('సీతాకోక చిలుక' సినిమాలో చిన్న ఆలీని వాళ్ళమ్మ కొట్టే సీను గుర్తుకుతెచ్చుకోండి)

అలా ఓ మూడు బూతు స్టెప్ లు, ఆరు కిట్టించిన ఆన్సర్ల తో సాగిపోతున్న నా లెక్కల ప్రయాణంలో విధి టీ.సి లాగా ఎంటరయ్యింది నవోదయ పరీక్ష రూపంలో.... "మీ అబ్బాయి బాగా చదువుతాడు కదా, అందుకని ఒకలిద్దరి పిల్లలకోసం నవోదయ అప్లికేషన్ తెచ్చి ఉంచాను. మీ వాడి చేత నింపిన ఫారాలు పంపించండి" అని మా హెడ్ లేని మాస్టారు మా నాన్నకు నవోదయ అప్లికేషన్ ఇచ్చారు. అంతే ఆ సాయింత్రం మా నాన్న బుక్ షాపుకు తీసుకెళ్ళి పేద్ద నవోదయ గైడ్ కొన్నారు. అందులో అన్నీ విభాగాలు ఇంటరెస్టింగ్ గానే ఉండేవి...ఒక్క లెక్కలు తప్ప..ఓర్నాయనో..మళ్ళీ ఈ లెక్కల భాద తప్పేట్టు లేదు అనుకొని అయిష్టం గానే చూశాను. "ఫలానాది సాధించండి..."--"దీన్ని తిప్పి కొడితే ఏమవుతుంది"--"దాన్ని తిరగేసి మరగేస్తే ఏమవుతుంది" లాంటి ప్రశ్నలు చూసి జడుసుకొని మళ్ళీ ఎప్పుడు ఆ సెక్షన్ మొహం చూడలే.

ఓసారి నాన్న నా నవోదయ ప్రిపరేషన్ ఏస్థాయిలో ఉందో అని బుక్ తీసి లెక్కల్లో కొన్ని ప్రశ్నలు వేశారు.

నాన్న: పన్నెండుకి క.సా.గు (కనిష్ట సామాన్య గుణిజం L.C.F) ఎంత?

నేను : లెక్కల్లో సామాన్య శాస్త్రం ఎందుకొచ్చిందబ్బా అని డవుట్ వచ్చి పిచ్చి చూపులు...

నాన్న : చెప్పు ( గట్టిగా గద్దిస్తూ..)

నేను : £$%‌&*$£‌%$

----టంగ్----( గుడిలో గంటలాగ నా బుర్ర మీద మొట్టికాయ శబ్దం )

నాన్న : వంద రూపాయల్ని ఇద్దరు 2:3 నిష్పత్తి ( Ratio ) లో పంచుకుంటే ఒక్కక్కరికి ఎంత వస్తుంది?

నేను: సమానం గా పంచుకోకుండా పత్తిలాగా పంచుకోవటం ఏంటో అనుకుని కె.ఏ. పాల్ గారి లాగ నోటికొచ్చిన సమాధానం చెప్పాను.

----టంగ్------

మా నాన్నకు విషయం అర్ధమయ్యింది. ఆ రోజు ప్రతీ లెక్క నాకు అర్ధం అవుతుందో లేదో కూడా తెలుసుకోకుండా దగ్గరుండి చెబుతూ మధ్య మధ్య లో బుర్ర మీద గుడి గంటలు మోగిస్తూ ఓ పాతిక లెక్కలు వరసపెట్టి చెప్పారు. నాకేమో ఒక లెక్క అర్ధమయ్యేసరికే మొదడు మోకాళ్ళలోకి జారిపోయేది. అంతా అయ్యాక చూస్తే నాకు మిగిలింది ఖాళీ బుర్ర మీద మొట్టికాయల తీపిగుర్తులు. నా వయసు నవోదయ పరీక్ష రాయడానికి సరిపోదని తర్వాత అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. అప్పటినుండి జింబకు జిల్లో...జింబకు జిల్లో...అని పాడుకుంటూ, తలాండించుకుంటూ ఎప్పటిలాగే ఆటకి సిద్దం అయిపోయాను.

ఏడో తరగతిలో ఓ రిటైర్డ్ లెక్కల లెక్చరర్ దగ్గర నాకు ట్యూషన్...ఆయన తప్పు చెబితే చాలు చెవి చివర తెగ చిక్కేసేవాడు. సహనం తక్కువ, కోపం ఎక్కువ ఆయనకి. అక్కడకెళ్ళే కంటే మా నాన్న దగ్గర లెక్కలు చెప్పించుకొని గుడి గంటలు మోగించుకోవటమే బెటర్ అనిపించేది నాకు. ఎప్పుడు చూసినా నీకు బేసిక్స్ రావు అని సంకలన తత్సమాంసం(association laws) అంటే ఇది... గుణకార తత్సమాంసం అంటే ఇది....గాడిద గుడ్డుమాంసం అంటే ఇది అని తెగ విసిగించేవారు. ఆయన చిక్కుడు భరించలేక ఓ సారి నేనే ఓ పేపర్ లో టెక్స్ట్ బుక్ చూసి ప్రశ్నలు,జవాబులు రాసేసి, మంచి మార్కులు వేసుకుని, ట్యూషన్ లో పరీక్ష పెట్టారని నాన్నకు, స్కూల్లో పరీక్ష పెట్టారని ట్యూషన్ సార్ కి అబద్దం చెప్పేసి కొంచెం ఇంప్రెషన్ కొట్టేసరికి ఆయన చిక్కుడు కొంచెం తగ్గింది.

ఏడో తరగతి పబ్లిక్ పరీక్ష కావటంతో ఫైనల్ పరీక్షలు అయ్యాక రిజల్ట్ వచ్చినప్పుడు నాన్న స్కూలుకి వెళ్ళి నా మార్కులు కనుక్కొన్నారు. మా హెడ్మాస్టర్ "మీ అబ్బాయికి అన్నింటిలోనూ ఇంచు మించు ఎనభై శాతం మార్కులు వచ్చాయి..కానీ లెక్కల్లో మాత్రం నలభై అయిదు శాతం వచ్చాయి...కొంచెంలో స్కూలు టాపర్ అవ్వటం మిస్సయ్యాడు" అని చెప్పటంతో లెక్కల్లో వీడి రేంజ్ ఇంతే అని నాన్న ఫిక్స్ అయిపోయారు.

మొదటిసారి ధర్మారావు మాస్టారు లెక్కలు చెబుతుంటే ఏందుకో చాలా ఇంటరెస్ట్ కలిగింది. ఆయన చెబితే ఎవ్వరికైన అర్ధం అవ్వాల్సిందే అని నాన్నకు ఎవరో చెప్పినట్టు ఉన్నారు. ఎనిమిదిలో నన్ను అక్కడ ట్యూషన్ పెట్టించారు. ఆయన లెక్కలను దేనికో ఒక దానికి అన్వయించి చెప్పేవారు. అలా లెక్కలపట్ల నాలో కొంచెం ఆసక్తి కలిగింది. ఆ తర్వాత దుంపలబడి వదిలి ప్రవేటు స్కూలు చేరటంతో ట్యూషన్ కి టైమింగ్ కుదరక వెళ్ళటం కాలేదు. సరిగ్గా ఇక్కడే కంచికి వెళుతుందనుకున్న నా లెక్కల కధ ట్రాఫిక్ జాం లో ఇరుక్కుని కోటీ మార్కెట్ దగ్గరే ఆగిపోయింది.

మనకి ఒక మాథ్స్ టెక్స్ట్ బుక్ చూస్తేనే భయం...అలాంటిది ఆ స్కూల్లో తొమ్మిదో తరగతిలోనే తొమ్మిది,పది తరగతుల మాథ్స్ ( కొన్ని చాప్టర్లు ) చెప్పేసేవారు. అసలు ఒక్క మాథ్స్ టెక్స్ట్ బుక్ తోనే నాకు బాలయ్య సినిమా కనపడేది. అలాంటిది రెండు మాథ్స్ బుక్ లు...అంటే రెండు బాలయ్య సినిమాలు...ఇంక నా కష్టాలు దేవుడికెరుక...క్లాసులో ఎప్పుడూ నన్నే నిలబెట్టి లెక్కల టీచర్ ప్రశ్నలు వేసేది. ఏదో ఒకటి చెప్పమని బెత్తంతో కొట్టేది. భయంతో నేను సౌండ్ లేకుండా లిప్ మూమెంట్ ఇచ్చేసరికి ఆవిడకి ఒళ్ళు మండి ఆన్సర్ చెప్పమంటే మంత్రాలు చదువుతావేమిరా అని నాలుగు పీకేది. ఇలా తొమ్మిదో తరగతి లెక్కల క్లాసంతా పిచ్చి చూపులు, జడ్డి హావభావాలతో అప్పుడప్పుడూ రొటీన్ కి భిన్నంగా ఆర్. నారాయణమూర్తి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ గడిపేశాను.

పదిలో మళ్ళీ ధర్మారావు మాస్టారి ట్యూషన్. పొద్దున్నే ఆరింటికే ట్యుషన్ అవ్వటం వల్ల అక్కడకు వెళ్ళడానికి వీలయ్యేది. ఆయన లెక్కలు చెబితే మనమే సొంతంగా చెయ్యాలి అన్న ఆసక్తి ఆటోమేటిగ్గా వచ్చేసేది. ట్యూషన్ లో అందరూ ప్రాబ్లం కి స్టెప్స్ చెప్పటానికి పోటీ పడేవారు. అలా ఉండేది ఆయన క్లాసు. కోటీ మార్కెట్ దగ్గరే ఆగిపోయిందనుకున్న నా కధ మళ్ళీ ప్రారంభమయ్యింది. మాస్టారి పుణ్యమాని నెమ్మది నెమ్మదిగా లెక్కల మీద పట్టు రావటం మొదలైంది. సాయింత్రం స్టడీ అవర్స్ లో అప్పుడప్పుడూ మా లెక్కల టీచర్ లెక్కల విషయంలో నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అనేది.

ఇంతలో పదో తరగతిలో మొదటి మంత్లీ ఎగ్జాం రానే వచ్చింది. అన్నీ పరీక్షలు అయిపోయాయి. నా లెక్కల పేపర్ దిద్దినప్పుడు మా టీచర్ కి బాలయ్య కొండ ఎక్కి కుందేలుని రక్షించే సీన్ చూపించకుండానే మూర్చవచ్చినంత పనైంది. నా పేపరేనా అని రెండు మూడు సార్లు నా పేరు చూసుకుందట. కారణం టెస్ట్ లో లెక్కల పేపర్-1 మరియు పేపర్-2 లో నూటికి నూరు మార్కులు రావటమే. నాకైతే ఏ దశలోనూ హిట్టు కాని నా లెక్కల సినిమా ఆ రోజు సూపర్ హిట్టు అవ్వటం వల్ల ప్రపంచాన్ని జయించినంత ఆనందం. అటు తర్వాత కొన్ని రోజులకి టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్....అక్కడ కూడా 96 మార్కులతో లెక్కలు పాసవటం...ఇంక అప్పటి నుండి లెక్కల్లో ఎప్పుడూ తొంభై శాతం మార్కులకు తక్కువ కాకుండా( ఎంసెట్ తో సహా) తెచ్చుకోవటం వల్ల నా లెక్కలు సినిమా మెగా హిట్టుకి చేరువైంది. ఇలా ఒక వయసు వచ్చేవరకు గణితం నన్ను తకధిమితోం ఆడించింది.