28, అక్టోబర్ 2009, బుధవారం

అజ్ఞాత భక్తులూ... కాస్త ఆలోచించరూ...!!

మనిషికి ఏదైనా కష్టం వస్తే వెంటనే చేసేది దైవాన్ని తల్చ్చుకోవటం..ఆపై ప్రార్ధించి మన కష్టాన్ని గట్టేక్కిస్తే తనను దర్శించుకుంటానని మొక్కుకోవటం. కాస్త ఉన్నోళ్ళు అయితే కళ్యాణం చేయిస్తామనో, తృణమో పణమో చెల్లించుకుంటామనో వేడుకుంటారు. ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు, వాళ్ళ మనోభావాలను అనుసరించి వారి వారి మొక్కులు తీర్చుకుంటారు. పాత తరం లోనిది ఈతరంలో మారకుండా ఉన్నది ఏదైనా ఉందంటే అది ఈ మొక్కులు తీర్చుకునే కార్యక్రమమే అని అనిపిస్తుంది.

ప్రసిద్ది దేవాలయాలు తప్పించి చిన్న చిన్న గుడులకు భక్తులు హుండీలో వేసిన డబ్బులే గుడి నిర్వహణకి వాడతారు. ఇతరత్రా ఇంకేమీ ఆదాయమార్గాలు ఉండవు. అలాంటి గుళ్ళకు శక్తి మేరకు కానుకలు సమర్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తిరుపతి దేవుని విషయం తీసుకుంటే ఆ దేవాలయానికి ప్రభుత్వాల శ్రద్ద(అది ఏ రకమైనది అన్నది పక్కన పెడితే) మెండుగా ఉంటుంది. దాన్ని చూసుకోడానికి ఒక సంస్థ కూడా ఉంది. నిత్యం భక్తులు నుండి వచ్చే కానుకలు విలువ కోట్ల లోనే ఉంటాయి. వాటితో టీ.టీ.డీ వారు అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, హాస్పటల్లు ఇలా ఎన్నో నిర్మిస్తుంటారు. అవి కూడా తిరుపతిలోనే ఉంటాయి తప్పించి( కళ్యాణ మండపాలు మినహాయిస్తే..అవి కూడ డబ్బులకే ఇస్తారు)ఒక్క ఊళ్ళో నైనా ఫలాన స్కూలు టీ.టీ.డీ వాళ్ళు కట్టారు..ఫలాన గ్రామానికి నిత్యం త్రాగు నీరు టీ.టీ.డీ వాళ్ళు ఏర్పాటు చేసేరని మీరు విన్నారా? లేదంటే అంటురోగాలు ప్రబలిన గిరిజన ఊళ్ళో మందులు ఉచితంగా పంచివ్వటం చూశారా?

"అజ్ఞాత భక్తుడు మూడు కోట్ల విలువైన వస్తువు సమర్పించాడు.."

"అజ్ఞాత భక్తుడు ఆరుకోట్ల విలువైన వజ్రాలు స్వామి వారికి ఇచ్చారు.."

"తిరుపతి హుండీలో వెయ్యినోట్ల కట్టలు భారీగా కనుగొన్న ఆలయ నిర్వాహకులు.."

ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే/చూస్తూనే ఉంటాం. అంత పెద్ద పెద్ద మొత్తం వేసిన వారు పేరు ఎందుకు గోప్యంగా ఉంచుతారనేది పక్కన పెడితే అంతలా అభివృద్ది చెందిన దేవాలయానికి కోట్లు కోట్లు కుమ్మరించే బదులు వారి వారి ఊళ్ళకు ఏదైనా చెయ్యొచ్చు కదా అని అనిపించకమానదు. గతంలో ఓ సారి ఈనాడులో ఓ భక్తుడు తిరుపతి హుండీలో కోటి రూపాయలు వేశాడు అని వార్త పడింది. మరుసటి రోజే ఓ నిరుపేద గ్రామీణ అమ్మాయి ఆ అజ్ఞాత భక్తుడకు లేఖ రాసి ఈనాడుకు పంపించింది. దాన్ని ఈనాడులో మరుసటి రోజు ప్రచురించారు కూడా. ఆ లేఖలో ఆ అమ్మాయి 'అన్నికోట్లు దేవుని హుండీలో వేసే బదులు నాలాంటి కూలి చేసుకుని చదువంటే ఆసక్తి ఉన్నా చదవలేని వారికి కాసింత ఆర్ధికపరమైన అండ ఇచ్చి చదివించొచ్చు కదా' అని అడిగింది. ఆ అమ్మాయి కోరిక సబబైనదే. కాదంటారా?

ఓ కోటి రూపాయల్తో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎప్పుడూ బురదగా ఉండే రోడ్లు ను బాగు చేసి సిమెంట్ రోడ్డు వెయ్యిచ్చు. మంచి నీళ్ళకోసం కిలో మీటర్లు కాలినడకన వెళ్ళే ప్రాంతల్లో సురక్షిత నీరు ట్యాంకులు కట్టించి అందించవచ్చు. ఓ ప్రభుత్వ స్కూలుకు మంచి లైబ్రరీ సమకూర్చవచ్చు..భర్త పీడిత మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చెయ్యొచ్చు.. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. మనసుంటే మార్గాలెన్నెన్నో.. పైగా దేవుని హుండీలో వేస్తే వచ్చే తృప్తి కంటే వేల రెట్లు తృప్తి మన సొంతం అవుతుందంటే అతిశయోక్తికాదేమో! మనం చేసే పనిని దైవం తప్పక హర్షిస్తుంది.

కాబట్టి అజ్ఞాతలు కాస్త ఆలోచించండి. కోట్ల రూపాయలు వెచ్చించి దేవుడిని సంతోషపెడతారా లేక ఆ డబ్బుని మీ గ్రామ అభివృద్దికి గానీ, నిరుపేద వ్యక్తుల అభివృద్దికి గానీ వాడతారా? మీ ఎంపిక మొదటిదే అయితే మీరు చేస్తున్న పనికి ఏ దేవుడు ఎంతమాత్రం సంతోషపడడు. ఆయనను సంతోషపర్చాను అన్న భ్రమే మీకు మిగులుతుంది. మీ భక్తికి పెద్ద పెద్ద కానుకలు కొలమానంగా ఎప్పటికీ నిలవవు.

నాకు అనిపించిదేమిటంటే ఇకపై ఎప్పుడైనా వెంకన్నను గానీ మరే దేవుడిని గానీ మొక్కుకోవలసి వచ్చినప్పుడు నావంతుగా ఓ వెయ్యిరూపాయలు నీతరపున వేరే వాళ్ళకి అని మొక్కుకుంటాను...కోరిక తీరిన వెంటనే ఆ డబ్బును ఏదైనా అనాధ ఆశ్రమం వారికి పళ్ళు, స్వీట్లు పంచడమో, వచ్చినన్ని వంటసామాను కొనివ్వటమో లాంటివి చేస్తాను. అంతేగానీ హుండీలో మాత్రం వెయ్యకూడదనుకుంటున్నాను.

27 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

కోరిక తీరిన వెంటనే ఆ డబ్బును ఏదైనా అనాధ ఆశ్రమం వారికి పళ్ళు, స్వీట్లు పంచడమో, వచ్చినన్ని వంటసామాను కొనివ్వటమో లాంటివి చేస్తాను. అంతేగానీ హుండీలో మాత్రం వెయ్యకూడదనుకుంటున్నాను.... ఎంతమంచి ఆలోచనండి!

తృష్ణ చెప్పారు...

మంచి ఆలోచన...GOOD WORK!

SRRao చెప్పారు...

శేఖర్ గారూ !
మీ ఆలోచన అద్భుతమైనదని చెప్పడం చాలా చిన్న విషయం. కానీ అజ్ఞాన భక్తులెవరో మనకి తెలియని విషయం కాదు. వాళ్ళు అజ్ఞాతంగా చేసేదే నల్లధనం కరిగించుకునెందుకు. ఇక బాహాటంగా చేసి ఎందుకు ఇరుక్కుంటారు ? అవసరానికి మించి కూడబెట్టడం అనే అలవాటు సమాజంలో పోయేవరకూ ఈ అజ్ఞాన దక్షిణలు నోరులేని దేముడుకి అందుతూనే ఉంటాయి.

aswinisri చెప్పారు...

కోరిక తీరిన వెంటనే ఆ డబ్బును ఏదైనా అనాధ ఆశ్రమం వారికి పళ్ళు, స్వీట్లు పంచడమో, వచ్చినన్ని వంటసామాను కొనివ్వటమో లాంటివి చేస్తాను. Wonderful! keep it up!

సుజాత వేల్పూరి చెప్పారు...

అజ్ఞాతంగా కోట్ల రూపాయలు విలువ చేసే కానుకలు ఇస్తున్నారంటే ఆ కానుకల తాలూకు కోట్లు సక్రమంగా సంపాదించినవి కావనే విషయం స్పష్టం! లేకపోతే దేవుడికి కూడా పేరు చెప్పుకుని ఇచ్చే ధైర్యం లేకపోవడమేం?

అలాంటి వారు స్కూళ్ళకీ వగైరాలకు ఖర్చు పెట్టడం కుదరదు, పేరు అజ్ఞాతంగా ఉంచడం కుదర్దు కాబట్టి, ఆపై ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు వచ్చి పడే ప్రమాదం ఉంది కాబట్టి!

నా మటుకు నేను ఏ దేవాలయంలో అయినా హుండీ లో పైసా కూడా వెయ్యను.పూజారికి ఇస్తాను. ఇంకా, పేదలకు అన్నదానానికి ఇస్తాను. ఇలాంటివి ఆలయం తరఫున సేవా కార్యక్రమాలుంటే వాటికి ఖర్చు పెట్టడానికి సిద్ధమే

ఇంకో విషయం ఆలోచించమని మనవి! "కోరిక తీరితే....ఖర్చు పెడతా"అని కండిషన్ పెట్టి మొక్కుకోవడం మరీ బేరమాడినట్లు అనిపిస్తుంది!కుటుంబరావు గారు ఒక కథలో అంటారు "దేవుడు లంచాలకు పాల్పడతాడని అనుకోవడం నాకిష్టం లేదు"అని!

కానీ ఇది వ్యక్తిగత విశ్వాసం కాబట్టి ఖండించలేనిది.

అజ్ఞాత భక్తుల్లో ఆలోచనలు రేకెత్తించే మంచి టపా!

jeevani చెప్పారు...

టీటీడీ వాళ్ల కంటే మా సాయిబాబా చాలా మేలు. ప్రతి ఊళ్ళోనూ నీటి వసటి కల్పించాడు. మీ ఆలోచన అబినందనీయం. అఙ్ఞాత భక్తులకు మనం ఎలాగూ చెప్పలేం. కనీసం మన లాంటి వారి స్థాయి నుంచి మార్పు వచ్చినా చాలు. దేవుడు ( నాకు అంతగా ఫ్రెండ్షిప్ లేదులెండి ) మిమ్మల్ని చల్లగా చూడాలి. అయితే ఒక విషయం దీన్ని మన పరిధిలో మరి కొందరితో ఆచరింపచేయాలి. all the best.

మురళి చెప్పారు...

నేనెప్పుడూ ఆలోచించే విషయం.. అజ్ఞాత భక్తులు చేసినా చేయకపోయినా మనవంతుగా మనం చేయగలిగింది చేద్దామండి .. మంచి టపా..

Hima bindu చెప్పారు...

బాగుంది ,ఆలోచించే దిశగా ..."మానవ సేవే మాధవ సేవ "....అన్నది నిజం ...ఆ అమ్మాయితో పూర్తిగా ఏకీభవిస్తాను ,ఆలయభివృద్దికి వేలకు వేలు లక్షలు ఇచ్చే కొందరు ఎంగిలి చేతితో కాకిని కూడా తోలని వారిని చూసాను ...అర్ధం కారు .

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చక్కటి ఆలోచన.దేవాదాయశాఖ ఆదాయంలో ఎక్కువభాగం ఇతర మతాలకు వినియోగిస్తున్నారని తెలిసిన తర్వాత నేను మాత్రం దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల హుండీల్లో డబ్బు వేయదలచుకోలేదు.నేను ఎక్కువగా ఇస్కాన్ దేవాలయాలలో ‘అక్షయ’ (బడిపిల్లల మధ్యాహ్న భోజన కార్యక్రమం) కు ఇస్తుంటాను.ఇక మీదట దేవాదాయశాఖ పరిధిలోలేని స్థానిక గుడులలోని హుండీలలో వేయడంగానీ,ఆ గుడులలో పండుగ దినాలలో ఖర్చుకు ఇవ్వడంగానీ చేయాలని నిర్ణయించుకున్నాను

Mauli చెప్పారు...

@సుజాత గారు :ఇంకో విషయం ఆలోచించమని మనవి! "కోరిక తీరితే....ఖర్చు పెడతా"అని కండిషన్ పెట్టి మొక్కుకోవడం
---------------------------

సుజాత గారు ఇది లంచం ఇవ్వడం అస్సలు కాదు అండి. ప్రకృతి ఎవ్వరికీ ఏది ఉచితం గ ఇవ్వదు. నీకేం కావాలో అడిగే ముందు నువ్వు ఏమి త్యాగం చెయ్య గలవో చెప్పాలి అన్నమాట. నీ( అంటే కోరిక ఉన్నవారు) శక్తీ కి తగ్గట్టు గ ప్రామిస్ చేస్తేనే, అడిగినది నెరవేరుతుంది.

దేవుడు ( ప్రకృతి) మీరు ఇచినది వేరేవాళ్ళకి ఇచ్చి వారు ఇచినది ఇంకొకరి ...ఇలా చెయిన్ ప్రాసెస్. లేక పోతే ఆయన డబ్బులు సృష్టిస్తాడా ఏమిటి.

Mauli చెప్పారు...

@ శేఖర్ పెద్దగోపు

ఈ అజ్ఞాత లు ఇచ్చిందంతా గుడి వాళ్ళు మిన్గేస్తున్నారు అంటారా ...పర్లేదు అండి వాళ్లే మళ్లి వాళ్ళ పాపాలు కడిగేసుకోడానికి గుడికి ఇస్తారు కొంచెం కొంచెం, అంటే దేవుడు వాళ్ళకి పర్సనల్ లోను లా ఇచ్చి మెల్లిగా installments లో ఒక 20 years లో కవర్ చేస్తారు లెండి.

సిరిసిరిమువ్వ చెప్పారు...

శేఖరు గారూ, మంచి ఆలోచింపచేసే టపా. అజ్ఞాన భక్తుల సంపద కూడా అజ్ఞాతంగానే ఉంటుంది కాబట్టి వాళ్లనుండి ఇలాంటివి ఆశించలేము..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@పద్మ గారు,
@తృష్ణ గారు,
@అశ్వినిశ్రీ గారు,
థాంక్సండి.

@S R రావు గారు,
అవునండీ మీరన్నది నిజమే..అయితే పెద్ద మొత్తంలో సహాయం చేసినప్పుడు టాక్స్ చిక్కులు వస్తాయనుకుంటే చిన్న చిన్న మొత్తంగా చేసినప్పుడు ఎవరి దృష్టిలో అయినా పడే అవకాశం తక్కువ ఉంటుంది కదా!
ధన్యవాదాలండీ..

@సుజాత గారు,
>>>"కోరిక తీరితే....ఖర్చు పెడతా"అని కండిషన్ పెట్టి మొక్కుకోవడం మరీ బేరమాడినట్లు అనిపిస్తుంది!....
- అవునండీ మీరన్నది కరెక్టే...కానీ మనం ఎలాంటి వాతావరణం నుండి వచ్చాము..అమ్మేమో కొడుకుకి అమెరికా చాన్స్ వస్తే కళ్యాణం చేయిస్తానంటుంది...చెల్లేమో బావకి ప్రమోషన్ వస్తే కాలినడకన కొండెక్కి వచ్చి ఓ కాసు వేస్తానంటుంది...ఎదురింటి ఆంటీ వాళ్ళ కొడుకుకి ఐ ఐ టి సీటు వస్తే ముడుపులిచ్చుకుంటానంటుంది...ఇలా ఉంటాయి చుట్టూ పరిస్థితులు..సో ఇలాంటివి చూసి మనకు తెలీకుండానే దేవునికి లంచం ఇవ్వటానికి అలవాటుపడిపోయాము. వ్యక్తి గతంగా నాకూ ఇలాంటివి నచ్చకపోయినా ఇంట్లో వాళ్ళ కోరికను కాదనలేక అప్పుడప్పుడూ లంచం ఇవ్వాల్సి వస్తుంటుంది నాకు. నాకు తెలిసీ ఏమీ కోరుకోకుండా గుళ్ళకు,యాత్రలకు వెళ్ళేవాళ్ళు కొంచెం అరుదేనండీ.

@జీవని గారు,
నేనూ విన్నానండీ సాయి బాబా గారు కట్టించిన నీటీ ప్రాజెక్టులు, వసతి వగైరా...
>>>కనీసం మన లాంటి వారి స్థాయి నుంచి మార్పు వచ్చినా చాలు..
- అసలు ఇలాంటి ఆలోచనలు/మార్పు వచ్చేది కష్టపడి సంపాదించే మనలాంటి వాళ్ళకేనండీ..
>>>దీన్ని మన పరిధిలో మరి కొందరితో ఆచరింపచేయాలి.
- అవునండీ..కనీసం మన కుటుంబ సభ్యుల నుండే మొదలు పెడితే బాగుంటుంది.
థాంక్యు..

@మురళి గారు,
అవునండీ..తప్పకుండా..
ధన్యవాదాలు.

@చిన్ని గారు,
చివరి వాఖ్యం అక్షర సత్యం..అలాంటి వారు మన చుట్టూ కోకొల్లలు గా ఉంటారండీ..
నెనర్లు.

@విజయ మోహన్ గారు,
ఇస్కాన్ దేవాలయాలంటే కృష్ణుడు ఉండే దేవాలయాలే కదండీ..నాకు అంతగా అయిడియా లేదు వాటిమీద..ఈసారెప్పుడైనా వెళ్ళీ అక్షయ ప్రోగ్రాం గురించి తెలుసుకోవాలి.
మీ ఆలోచన పంచుకున్నందుకు థాక్సండీ.

@సిరిసిరిమువ్వగారు,
మీరన్నది నిజమే..కాకపోతే ఎప్పుడు ఆ వార్తలు విన్నా అదోలా అనిపిస్తుందండీ..నిన్ననే ఎవరో మూడు కోట్ల బంగారు గంగాళం ఇచ్చారని తెలిసి ఆలోచనలు ఆపుకోలేక ఇలా టపా రాసేసాను.
థాంక్యు.

@మౌళీ గారు,
మీ థియరీ బాగుంది. మా అమ్మ కూడా మీలానే అంటుంది...కాకపోతే అలా చెప్పుకుని సమాధానపరచుకోవటం కష్టంగా ఉంటుంది నాకు.
ధన్యవాదాలు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

బళ్ళు, ఆస్పత్రులూ గట్రా ఇవి దేవాలయాల పని కాదు. అందుకోసం ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ముక్కుపిండి పన్నులు చేస్తుంది. దాని కాలర్ పట్టుకొని అడగాలి. గుళ్ళకి రమ్మని హుండీల్లో డబ్బులు వెయ్యమనీ దేవాలయాలు అడ్వర్టైజ్ చెయ్యడంలేదు. మీకేమైనా సంఘసేవా ఆలోచనలుంటే మంచిదే. అమలుజఱపండి. కానీ మీ ఆలోచనల్ని దేవాలయాలూ, వాటికి వెళ్లే భక్తులూ అమలు జఱపాలంటే బహుశా అది సాధ్యపడదేమో. ఎందుకంటే మన ప్రణాళికలు మనకున్నట్లే వాళ్ళ ప్రణాళికలూ వాళ్ళకుంటాయి. అయినా టి.టి.డి. ఇఱవైవేలమందికి ప్రతినెలా జీతాలిస్తోంది. అది సంఘసేవ కాదా ? మనం హుండీలో డబ్బులు వేయడం మానేస్తే ఱేపు ఆ యిఱవైవేల మందీ రోడ్డున పడతారు.

ఈ దేశంలో ప్రతిపైసా అంతిమంగా సద్వినియోగం అవుతూనే ఉంది. ప్రతిపైసా ఎవరో ఒకఱి కష్టాన్ని అవసరాన్నీ తీఱుస్తూనే ఉంటుంది. దాని గుఱించి మనం ఊరికే తలలు పట్టుకోవడం అనవసరం..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@సుజాత గారు,
థాక్సండీ..అంత పెద్ద కమెంట్ పెట్టేసరికి మర్చిపోయాను చెప్పటం.

@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు,
బళ్ళు, ఆస్పత్రులూ గట్రా ఇవి దేవాలయాల పనికాదంటున్నారు మీరు...
ఈ వాక్యంలో నాకు తిరుపతిలో టీ.టీ.డి వారు దేవాలయాలు కాకుండా ఇంకేమీ నిర్మించలేదు అన్న అర్ధం తోస్తుంది ...ఇది నిజం అంటారా?

ప్రభుత్వాలు ఉన్నాయి..దేనికి? ఎక్కడ సంపద ఉంటుందో అవి తేరగా దోచుకోడానికి..అంతేగానీ అవే సక్రమంగా ఆలోచిస్తుంటే ఇంత చర్చ దేనికి చెప్పండి?

నా ఆలోచనలని దేవాలయాలు,భక్తులందరూ అమలు జరపాలని నేను కోరుకోవటం లేదు. పెద్ద మొత్తంలో వేసే వారు కాస్త ఆలోచించండి..ఇలా వాడితే బాగుంటుంది..అని మాత్రమే అడుగుతున్నాను. అది కూడా అభ్యర్ధన తో...నేను హుండీలో వెయ్యను అన్నాను గానీ మీరు వెయ్యొద్దు అని టపాలో ఎక్కడా చెప్పలేదు.

మనం ఇప్పుడు ఉన్న పళాన డబ్బులివ్వటం మానేస్తే మీరన్నట్టు ఇరవై వేల మంది రోడ్డున పడతారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. టీ.టీ.డి దగ్గర నిధులు అంత తక్కువగా ఉంటాయని నేననుకోవటం లేదు.

>>>>>ఈ దేశంలో ప్రతిపైసా అంతిమంగా సద్వినియోగం అవుతూనే ఉంది. ప్రతిపైసా ఎవరో ఒకఱి కష్టాన్ని అవసరాన్నీ తీఱుస్తూనే ఉంటుంది.

'సద్వినియోగం' ఏవిధంగా అవుతుందన్నదే నా ప్రశ్న...ఒక పార్టీ ఫండ్ లాగానా లేక పెద్దోళ్ళ బెంజ్ కారు రూపంలోన... అలాగే 'ఎవరో ఒకరి అవసరాన్ని' అన్నారు మీరు..ఎవరి అవసరాన్ని?..పేదలదా లేక రాజకీయనాయకులదా లేక అధికారులదా?

ఇంతటితో దీని మీద నా తరపునుండి చర్చని ముగిద్దామనుకుంటున్నాను. మీరు నిరభ్యంతరంగా మీరు చెప్పలనుకున్నది చెప్పొచ్చు.

మీ అభిప్ర్రాయం పంచుకున్నందుకు నెనెర్లు.

Mauli చెప్పారు...

@మౌళీ గారు,
మీ థియరీ బాగుంది


ఇది నా థియరీ ఎంత మాత్రము కాదు. అసలు థియరీనే కాదు ఇది .వాస్తవం.

ప్రపంచం అంత అనుసరిస్తోంది. కాకపోతే ఇలా మొక్కు, దానం అని వేరు వేరు పేర్లు తో అందరూ ఏదో ఒకలా ఆచరించే విధం గా అన్న మాట.

మా ఊరు చెప్పారు...

మంచి ఆలోచన
నేను కూడా ప్రయత్నిస్తా

జయ చెప్పారు...

అవునండి శేఖర్ గారు, అంతంత డబ్బు హుండీల్లో వేయవలసిన పనే లేదు. ఎవరికవసరమో వాళ్ళకిస్తే అదే దేవుడికిచ్చినంత పుణ్యం. మానవ సేవే మాధవ సేవ కదా!

భావన చెప్పారు...

బాగుంది అండి.. మానవ సేవే మాధ వ సేవ అన్నారు కదా. ఏమి చేస్తే ఎమి మీరు చేసెది ఇంకా మానసిక సంతృప్తి ని ఇస్తుంది కదా. మంచి ఆలోచన

అజ్ఞాత చెప్పారు...

మీరనుకుంటున్నది వాస్తవం కాదు. తి.తి.దే. దగ్గఱ క్యాష్ తక్కువ. దేవాలయాలూ, పొలాలూ, స్థలాలూ, భవనాలూ, ఆభరణాల రూపంలో ఆస్తులెక్కువ. ఆ ఆస్తులు ట్రస్టీషిప్ కనుక ఏదైనా అవసరమొచ్చినా అమ్మడానికి చట్టప్రకారం. సాధ్యం కాదు. నగదు నిలవలు ఉన్నాయి. కానీ వాటిమీద ఏడాదికి రు. 400 కోట్ల చిల్లఱ వడ్డి మాత్రమే వస్తుంది. కానీ అది జీతాలివ్వడానికే చాలదు. ఇహ మిగతా అవసరాలు, భక్తుల సౌకర్యాలూ గడవడం ఇంకా కష్టం. కనుక మనం దేవుడి పేరు చెప్పుకొని ప్రతిసంవత్సరం తి.తి.దే. కి ఇస్తూనే ఉండాలి. లేకపోతే అందులో పనిచేసేవారి జీవితాలు ఆరిపోతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నెత్తిమీదొచ్చిపడే ప్రతి అదనపు ఖర్చుకీ తి.తి.దే. నుంచి అప్పు తీసుకుని గడుపుకుంటుంది. (రాజశేఖరరెడ్డి హయాములో ఈ వ్యవహారం మఱీ శ్రుతిమించి) ఈ మధ్యకాలంలో తి.తి.దే. కోశాగారం బోసిపోయిందనే అనుమానాన్ని ప్రముఖ దినపత్రికలు వ్యక్తం చేశాయి కూడా. మఱి ప్రభుత్వం అంటే మన దృష్టిలో మనమే కదా !

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మౌళీ గారు,
మరోసారి సమయం వెచ్చించి మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు నెనెర్లు.

@మా ఊరు,
థాంక్సండీ...మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను.

@జయ గారు,
నా పాయింట్ ని కరెక్ట్ గా అర్దం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

@భావన గారు,
థాంక్యు..

@LBS గారు,
మీకు తెలిసిన వివరాలతో ఇక్కడ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

sreenika చెప్పారు...

LBS గారు చెప్పింది నిజమే...
తితిదే వారు భక్తులకు ప్రతి సదుపాయం దాతలద్వారనే..ఉదా. ఓ రోజు కూరగాయలన్నీ ఏదో సంస్థ వారు డొనేట్ చేస్తారు. నిజానికి ఈ డొనేషన్ డేట్స్ నెలల ముందే బుక్ అయిపోతాయి.
కాని మీ ఐడియా అధ్భుతం. గో ఎహడ్.

కార్తీక్ చెప్పారు...

శేఖర్ గారు మంచి ఆలోచన.....

www.tholiadugu.blogspot.com

నేస్తం చెప్పారు...

హుం మంచి ఆలోచన .. కాని అమ్మో ఆ మొక్కు తీర్చకపోతే ఏమవుతుందో అన్న భయం కూడా కేవలం హుండీలలో డబ్బు వేసేటట్లు గా భక్తులు ఫీలవ్వడం జరుగుతుంది.. ఏదేమైనా మంచి చర్చ..

పరిమళం చెప్పారు...

శేఖర్ గారు ,మంచి టపా ! నేను ప్రతి నెలా కొంత డబ్బు దేవుడికి పక్కనపెట్టి ఎవరిసహాయార్ధమైనా ఉపయోగిస్తాను . ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ కదండీ !

ప్రణీత స్వాతి చెప్పారు...

చక్కటి ఆలోచన రేకెత్తించారండీ..నేను ఆల్రెడీ చేస్తున్నా..ఇకమీదట కూడా చేస్తూనే వుంటాను.

Unknown చెప్పారు...

really good work...
veelu aithe poor people ki help cheyyochu....leda inka emina cheyyochu..kani..agnyatha bhakthulu matram peda vallaki sahayam cheyyavalisi vasthe matram cheyaru...this is very sad..
mee alochana chala bagundi shekhar garu....really thinking point.