4, ఏప్రిల్ 2010, ఆదివారం

"సానియా ఇంట..మాలిక్ అంట..బిర్యానీ వంట" ( Exclusive Live Show )

సమయం ఎనిమిది గంటలు అవుతోంది...

నివారణ్ 99 టీవీ చానల్ ఆఫీస్ లోపల...చానల్ హెడ్ 'బ్రేకింగ్ న్యూస్' బాబూరావ్ పరుగు పరుగున న్యూస్ రీడర్ నస, రిపోర్టర్ కల్పిత రావు ఉన్న గదిలోకి వెళ్ళాడు....(ఇతను ఎలకకి ఒకతోక, ఒక తల ఉన్నాసరే ఆ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా మార్చగలిగే సమర్ధుడని ఆయన్ని చానల్లో సబార్డినేట్స్ అందరూ అలా పిలుస్తుంటారు)

"దొరికింది..దొరికింది...మీరిద్దరూ ఒకరి తల్లో ఒకరు పేలు తీసుకోకుండా కాలక్షేపం చేసుకునే న్యూస్ అయిటేం ఒకటి దొరికింది..తొందరగా వెళ్ళండయ్యా..." అంటూ హడావిడిగా హెడ్ రావటంతో ఇద్దరూ అలర్ట్ అయ్యారు..

"ఆ తకాతక్ హిందీ చానల్ వాళ్ళు సోయబ్ మాలిక్ హైదరాబాదుకు వచ్చిన విషయం..సానియా ఇంట్లోకి వచ్చిన విషయం బ్రేకింగ్ న్యూస్ గా వేసేస్తున్నారయ్యా...తెలుగు చానల్లో ఎవరూ ఈ విషయం వెయ్యకముందే మనం వెయ్యాలి...తొందరగా సానియా ఇంటి ముందు కెమెరా సెట్ చెయ్యండయ్యా..." అని 'బ్రేకింగ్ న్యూస్' బాబూరావ్ ఇంకా ఏదో చెబుతుండగా రిపోర్టర్స్ నస న్యూస్ రూంలోకి, కల్పితరావు లైవ్ వేన్లోకి జంప్ చేశారు....


కాసేపయ్యాక...

నస మొబైల్ కి కల్పిత్ ఫోన్ చేశాడు....

నస: ఆ...కల్పిత్ సానియా ఇంటి ముందు పరిస్థితి ఎలా ఉందో చెబుతావా?

కల్పిత్: ఏంటి చెప్పేది నా మొహం....

నస: ఓ పరిస్థితి చెండాలంగా ఉందన్నమాట....ఫోన్ పెట్టు..తొందరగా లైవ్లో ఈ విషయం చెప్పాలి...

కల్పిత్: ఓ నస...ఇక్కడ ఏమీ జరగటం లేదు...ఏమి చూపించమంటావ్...

నస: అయితే ఆ తకాతక్ వాళ్ళు మాలిక్ సానియా బాల్కనీలో సెల్ మాట్లాడుతున్న వీడియో, సానియాని వాళ్ళమ్మ బుజ్జగిస్తున్న వీడియో చూపిస్తున్నారు..వాటిని మనం స్క్రీన్ మీద చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించేద్దాం... నువ్వు విషయాన్ని నీ కళ్ళతో నువ్వే చూస్తున్నట్టు ఫీలయ్యి వీడియో చూస్తూ నాకు చెప్పేసెయ్...నేను కనపడిన వీడియో బట్టి ప్రశ్నలు అడిగేస్తాను..సరేనా....తొందరగా ఫోన్ పెట్టు..మన హెడ్ సంగతి తెలుసుగా...లేట్ చేస్తే మనల్ని చంపేసి దాన్నే బ్రేకింగ్ న్యూస్ గా వేసేస్తాడు...


నస బ్రేకింగ్ న్యూస్ లు చెప్పేటప్పుడు వేసుకునే ఎర్రకోటు వేసుకుంది...లైట్స్ ఆన్ అయ్యాయి...కెమెరా నస మొహం వైపు తిరిగింది....టీవీ స్క్రీన్ రెండు తెరలుగా విడిపోయింది...ఒక తెర మీద న్యూస్ రీడర్ నస..ఇంకో తెరమీద సానియా, మలిక్ ల వీడియో క్లిప్పింగ్లు...

న్యూస్ రీడర్ నస నసపెట్టడం మొదలు పెట్టింది....

"ఇప్పుడు మీరు చూడబోతుంది మా చానల్ 'నివారణ్ 99' లో మాత్రమే వీక్షించ గలిగే ఒక ప్రత్యేక లైవ్ ప్రోగ్రాం...ఆ ప్రోగ్రామే 'సానియా ఇంట..మాలిక్ అంట..బిర్యానీ వంట'...మరి మనకు వివరాలు అందించేందుకు మా ప్రతినిధి కల్పిత్ సానియా ఇంటి ముందు ఓ గుడారం వేసుకుని పళ్ళు కూడా ఇంకా తోముకోకుండా ఎప్పటి కప్పుడు తాజా వివరాలు మనకు అందించడానికి పొద్దునే అక్కడకు వెళ్ళిపోయాడు..మరి ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం"

"ఆ చెప్పు కల్పిత్...మాలిక్ సానియా ఇంటికి ఎప్పుడొచ్చాడు...."

"ఆ నస...మాలిక్, సానియా ఇంటికి, జెట్ ఎయిర్ వేస్ లో RAC సీటు కన్ఫర్మ్ కాకపోతే కింగ్ ఫిషర్ విమానంలో వచ్చాడు..ఆ విమానంలో ఎయిర్ హోస్టస్ ఎవరో తనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదంట...కనీసం నవ్వనైనా నవ్వలేదట...దానికి మాలిక్ హర్ట్ అయ్యి, ఆ విషయం వెంటనే సానియాతో చెబుదామని అర్ధరాత్రే వాళ్ళింటికి వచ్చేసాడు....అయితే ఆ టైంలో సానియా వీడియో గేం ఆడుతుండటంతో తనని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక రాత్రంతా మంచులో, చెవిలో దూది కూడా పెట్టుకోకుండా వాళ్ళింటి అరుగుమీదే పడుకున్నాడంట..." తను అల్లిన మొదటి కల్పిత వాక్యాలను మురిసిపోతూ చెప్పాడు..సార్ధక నామదేయుడు కల్పిత్

"ఓ అలాగా...సరేకానీ మాలిక్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నాడు వీడియోలో..ఏంటి విషయం..." కోటు సర్దుకుంటూ అడిగింది నస..

"మాలిక్ చాలా డిస్టర్బ్ డ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు...పొద్దున్న సానియా ఇంటిలో తనకు కబాబ్ లు చేసి పెట్టలేదని చాలా ఫీలయినట్టు వీడియో ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నది...ఆ విషయాన్ని పాకిస్తాన్లో ఉన్న వాళ్ళమ్మతో చెప్పుకుంటున్నాడు.."

ఇంతలో నస కళ్ళు వీడియోలో సానియా ఇంటి మీద వాలిన కాకి మీద పడింది...ఇంకేం నస కి స్పాంటేనియస్ గా కొశ్చన్ ఫ్రేం చేసుకోడానికి క్లూ దొరికినందుకు ఎగిరి గెంతినంత పని చెయ్యబోయి లైవ్ షో అని గుర్తొచ్చి మళ్ళీ కోటు సర్దుకుని

"కల్పిత్..వ్యవహారం చూస్తే మాలిక్..అదే అల్లుడు (అప్పుడే సానియాకి మొగుడ్ని..వాళ్ళమ్మ నాన్నకి అల్లుడిని చేసి పడేసింది న్యూస్ రీడర్)..ఇంటికి వచ్చినందున సానియా ఇంటిలో వంటలు ఎలాంటివి వండుతున్నారు..హైదరాబాదీ బిర్యాని అంటే మాలిక్ కి చాలా ఇష్టం కదా(ఈవిడితో సొయంగా చెప్పినట్టు)..మరి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.."

కల్పిత్ దృష్టి కూడా వీడియోలో ఉన్న కాకి పై పడినట్టుంది..

"నస..నేను కూడా ఇప్పుడు దాని గురించే చెప్పబోతున్నాను...ఇప్పుడు నువ్వు ఈ వీడియోలో చూసినట్టయితే సానియా ఇంటి మీద అరగంట క్రితం ఒక కాకి మాత్రమే వాలింది..ఇప్పుడు చూస్తే ఒకటికి పది కాకులు అయ్యాయి..అంటే ఆ ఇంట్లో కొత్తల్లుడుకు హైదరాబాదీ బిర్యాని చేస్తున్నారనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు...బిర్యానీ వాసనకే కాకులన్నీ మూకుమ్మడిగా వాలాయి.... మాలిక్ కి కూడా సెల్లో మాట్లాడుతూ బిర్యాని వాసన తగలటంతో టెంప్టేషన్ ఆపుకోలేక అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ విషయం కూడా వీడియోలో మనం చూడొచ్చు...."

తన స్పాంటేనియస్ కొశ్చన్ కి కత్తిలాంటి జవాబు ఇచ్చిన కల్పిత్ తెగ ముద్దొచ్చేశాడు నసకి....అనుకున్నంత పనీ చేద్దామనుకుంది..కానీ మళ్ళీ లైవ్ షో అని తెలిసి ఏమీ చెయ్యలేక కోటు జేబులో చెయ్యి పెట్టి వేయించిన అప్పడాలను టప టపా సౌండ్ వచ్చినట్టు నలిపింది..నస లైవ్ షో ఎప్పుడు చేసినా ఓ రెండు మూడు అప్పడాలు జేబులో పెట్టుకుని వస్తుంది...తను చెయ్యాలనుకుంది చెయ్యలేనప్పుడు ఇలా అప్పడాలను సింగిల్ హేండ్ తో, సింగిల్ జేబులో పిండి పిండి చేసేస్తుంది...

లైవ్ ప్రోగ్రాముల్లో తను చెయ్యగలిగింది ఒక్కటే..కోటు సర్దుకుని..మధ్య మద్యలో అప్పడాలు చిదుముతూ నోటికొచ్చిన ప్రశ్నలు మాట్లాడటం అని నసకి గుర్తొచ్చి కోటు సర్దుకుని మళ్ళీ కల్పిత్ ను ప్రశ్న అడిగింది...

"మరి ఆ ఇంకో వీడియోలో సానియా తల్లి ఆమెను గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతుంది కదా...దాని సంగతేంటీ..నాకెందుకో సానియా మాలిక్ నే చేసుకుంటాను అని తల్లితో అన్నట్టుంది...వాళ్ళమ్మ మా బంగారం కదూ... వాడు వద్దమ్మా...వాడికంటే ఒసామ బిన్ లాడెన్ ఎర్రగా బుర్రగా ఉంటాడు..అతనే బెటర్ అని బ్రతిమిలాడుతుంది కదూ..."

"నస..నేను కూడా అదే అనుకున్నాను... కానీ విషయం అది కాదు..నువ్వు పొరబడ్డావు...సానియా ఇంట్లో హైదరాబాదీ బిర్యానీ చేస్తున్నారని ఇందాకే మనకు తెలిసింది కదా..( వీడప్పుడే బిర్యానీ కాన్సేప్ట్ ని కన్ఫర్మ్ చేసి పడేసాడు)....వాళ్ళమ్మ సానియాతో బిర్యానీకి కావలసిన మసాలాను రోట్లో నూరమంటుంది..సానియా ఏమో నా వల్ల కాదు...నువ్వెన్ని చెప్పినా నేను కనీసం బిర్యానీకి ఉల్లిపాయలు తొక్కలు కూడా తియ్యను అని అంటుంది...అంతే..."

బ్రేక్ ఇవ్వాలని కెమెరామెన్ సైగ చేయటంతో నస కెమెరా వైపు చూసి..."సానియా ఇంట..మాలిక్ అంట..బిర్యానీ వంట" లైవ్ కార్యక్రమాన్ని బ్రేక్ తర్వాత చూస్తారు...అంత వరకూ స్టే ట్యూన్ టు 'నివారన్ 99'

ఓ రెండు నిమిషాలు నివారణ్ 99 చానల్ కు సంభందించి ఓ ప్రకటన వచ్చింది...

టింగ్..టింగ్..టింగ్...

'మీలో విషయం ఏమీ లేకపోయినా గల గలా ఓ అంశం పై మాట్లాడే టాలెంట్ ఉందా....బాంబు దాడులు, ఏసిడ్ దాడి వంటివి జరిగినప్పుడు సమయానికి ఎటువంటి వీడియో క్లిప్పింగులు అందుబాటులో లేకపోయినా ఏం జరుగుతుందో ఊహించగలిగే అపరిమిత ఊహాశక్తి ఉందా...అయితే మిమ్మల్ని మా నివారణ్ 99 సాదరంగా ఆహ్వానిస్తుంది...రిపోర్టర్లుగా, న్యూస్ రీడర్లుగా చేస్తాం రండి...మన అతీతమైన ఊహాశక్తితో నవ సమాజాన్ని నిర్మిద్దాం రండి'

టింగ్..టింగ్..టింగ్...

ప్రకటన అయిపోగానే నస మళ్ళీ టీవీ తెర మీద కనపడింది...

"వెల్కం బేక్ టు...'సానియా ఇంట..మాలిక్ అంట..బిర్యానీ వంట' లైవ్ షో....."

"ఇంకేమైనా క్లూ దొరికిందా కల్పిత్ అక్కడ... ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటి....?"

............

"హలో..హలో...కల్పిత్...ఉన్నావా...అక్కడ తాజా పరిస్థితి చెప్పు.." ఈ సారి కొంచెం బిగ్గరగా అడిగింది నస....

............

"ఏదో టెక్నికల్ ప్రోబ్లం వచ్చినట్టుంది...ఇంతలో మీకు ఎస్సెమ్మెస్ ప్రష్న అడుగుతాను...చెప్పండి...నా ప్రష్న...సానియా ఇంటికి మాలిక్ ఎందుకొచ్చాడు? ఏ) బిర్యానీ కోసం బి) ఎయిర్ హోస్టస్ హర్ట్ చేసినందుకు సి) ఊసుపోక.. నా ఈ ప్రష్నకు మీ అనుమానాన్ని 116 నంబర్కు ఎసెమెస్ చేయండి.." అని లక్ష్మీ టాక్ షో మంచు లక్ష్మి అడిగినట్టు అడిగింది....

కల్పిత్ ఇంకా లైన్లోకి రాకపోవటంతో మళ్ళీ బ్రేక్ అని చెప్పేసింది నస...

బ్రేక్ సాగుతుండంగా కల్పిత్ లైన్లోకి వచ్చాడు...

"ఎక్కడికెళ్ళావ్ నువ్వు...ఏం మాట్లాడాలో తెలియక బ్రేక్ ఇచ్చాను..అసలు నీకు బుద్దుందా..ఇలా లైవ్లో నుండీ సడన్ గా వెళ్ళిపోతే నా గతేం కానూ.." కస్సుబుస్సు మని ఎగిరింది నస కల్పిత్ పై....

"అరె..కూల్ బాబా...నాకు తెలుసు నీ పరిస్థితి..ఇక్కడ నా పరిస్థితి కూడా అలానే ఉంది...అందుకనే జనాల్లోకి వెళ్ళి సానియా మాలిక్ ను పెళ్ళి చేసుకుంటుందా లేక బిర్యాని పెట్టేసి పంపించేస్తుందా అని అడిగి అభిప్రాయం తీసుకున్నాను....ఓ నలగురు అభిప్రాయం లైవ్లో చూపిస్తే మన టైం గడుస్తుంది కదా.." విషయం చెప్పాడు కల్పిత్..

"అయితే మటుకు ఇంత లేటా..." ఇంకా కోపం చల్లరలేదు నసకు..

"నీకలాగే ఉంటుందమ్మా...నీకేం పోయింది..ఎర్రకోటు వేసుకుని..మద్య మద్యలో అప్పడం చిదుముకుంటూ నోటికొచ్చిన ప్రశ్నలు అడుగుతావు..ఇక్కడ నేను ఎంత కష్టపడీ ఈ బైట్స్ చేశానో తెలుసా...ఒక్కొక్కల్లకు నూట ఏభై రూపాయలు దొబ్బెట్టి, ఏం మాట్లాడాలో నేనే చెప్పి వీడియో తీశాను..తెలుసా...."

బ్రేక్ అయిపోవటంతో కల్పిత్ ఇచ్చిన జనాల అభిప్రాయల వీడియోను ప్లే చెయ్యబోతూ "ఇప్పుడు ఈ విషయం గురించి జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాం..." అని చెప్పేసి వీడియో ప్లే చేసింది నస....

ఎర్రమ్మ ఇలా అంది...

'సానియా ఇలా దొంగతనంగా మాలిక్ కు బిర్యానీ వండటం ఏం బాలేదు..అయినా ఓ భారతీయురాలయ్యుండి ఓ పాకిస్తానీకి ఇలా బిర్యానీ ఎలా వండి పెడుతుంది? ఇది ముమ్మాటికీ దేశ ద్రోహం కిందే లెక్క...నేను సానియాను క్షమించను...'

యాద్గిరి ఇలా అన్నాడు...

'సానియా గిట్లా సేయడం మంచిగా లే...ఆడ ఆల్లింట్లో వాలిన కాకులకు కూడా బిర్యానీ ఎట్టకుండా గా మాలిక్ గాడికి ఎట్టడం సానా అన్నాయం...గిట్లనే సేస్తే పరేషాన్ కాకుండా ఏట్టా ఉంటాం....గీ విషయంలో సానియా పోరగాళ్ళ నుండి పెద్దోల్ల దాక అందర్కీ చెమాపణ చెప్పాలే....'

వేలిముద్ర పుల్లమ్మ ఇలా అంది...

'అయినా మన ఇండియాలో కోట్లమంది కుర్రాళ్ళు బిర్యానీ తినేటోళ్ళూ ఉంటే ఆయమ్మ మాలిక్ కే ఇవ్వటం క్షమించరాని నేరం..ఘోరం...ఇలాంటి నేరం చేసినందుకు ఇకపై సానీయాకి ఇండియాలో బిర్యానీ వండే హక్కుని తొలగించాలి...'

ఇంతలో 'బ్రేకింగ్ న్యూస్' బాబూ రావ్ మళ్ళీ పరుగు పరుగున వచ్చి లైవ్ షో ఆపేయమని చెప్పటంతో నస షో ని ఆపేసింది...

"ఏమయ్యింది సార్..."

"ఏం లేదమ్మా...ఇప్పుడు మనకు లైవ్లో చెప్పడానికి ఇంకో హాట్ న్యూస్ దొరికింది...ఆ వైజాగ్ లో ఎవడో జమిందారు పనిమనిషిని మోసం చేసాడంట...ఆ అమ్మాయి జమిందారుని బండ బూతులు తిట్టడానికి రెడీగా ఉండటంతో మనవాళ్ళు ఒక్క బూతూ మిస్ కాకుండా కవర్ చేశారు...మిగిలిన బూతులు లైవ్లో నే తిట్టమని చెప్పాము..అప్పుడే లైవ్ ప్రోగ్రాం లైవ్లీగా ఉంటుంది కదా.... నువ్వెలాగూ ఓ మూడు నిమిషాల సానియా క్లిప్పింగ్ తో మూడున్నర గంటలు ఎంగేజ్ చేసావ్....ఇప్పుడు కాంచనమాల ఈ హాట్ న్యూస్ చెప్పడానికి సిద్దంగా ఉంది...లేటైతే మిగిలిన చానళ్ళ వాళ్ళు మనకంటే ముందు చూపించేస్తారు ఆ బూతులన్నీ...." అని అసలు విషయం చెప్పాడు చానల్ హెడ్...


న్యూస్ రీడర్ నస న్యూస్ రూం నుండి, సానియా ఇంటి ముందున్న రిపోర్టర్ కల్పిత్ స్టూడియోకి తిరిగి వచ్చేశారు... ఎప్పటిలాగే ఒకరి తల్లో మరొకరు మళ్ళీ పేలు తీసుకోడానికి వాళ్ళ స్టాఫ్ రూంలోకి నడిచారు..


*********


PS : శని వారం రోజు టీవీలో ఓ చానల్ వాళ్ళు మాలిక్ సానియా ఇంటికి వచ్చిన ఓ అర నిమిషం క్లిప్పింగులు రెండింటిని పట్టుకుని, పదే పదే అవే ప్లే చేస్తూ దానికి కొంత పైత్యపు వ్యాఖ్యానలు జోడించి షో ని నడిపించారు...కొద్ది సేపు తర్వాత మిగిలిన చానల్లు కూడా అదే బాట నడిచాయి... నా గ్రహాలు ఒకదాన్ని ఇంకోటీ కొట్టుకోవటంతో నా టైం బాలేక నేను దాన్ని కొద్ది సేపు చూడాల్సి వచ్చింది...అప్పుడు కలిగిన మంటకు నా అవుట్ లెట్ ఈ టపా....

24 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

హ...హ.....హ్హ..
భలే నవ్వించేశారండీ! పేర్లు బాగా పెట్టారు.
అందుకే ఈ మధ్య వార్తలు చూడ్డం కన్నా సీరియల్స్ చూడ్డం మేలనిపిస్తుంది.

శిశిర చెప్పారు...

"నా గ్రహాలు ఒకదాన్ని ఇంకోటీ కొట్టుకోవటంతో నా టైం బాలేక నేను దాన్ని కొద్ది సేపు చూడాల్సి వచ్చింది...అప్పుడు కలిగిన మంటకు నా అవుట్ లెట్ ఈ టపా...."
హ్హ.. హ్హ.. హ్హ..

మురళి చెప్పారు...

'మన అతీతమైన ఊహాశక్తితో నవ సమాజాన్ని నిర్మిద్దాం రండి'
too good

Hima bindu చెప్పారు...

బాగు బాగు .............................గోపు
సూపరో సూపరో ..................బాబురావు -:):) నవ్వలేక చచ్చాం ...మా పిల్లకాయి కి కూడా చదివి వినిపించాను .ఇకపోతే మీలో మంచి రచయిత వున్నాడని అతడ్ని సీరియస్ గా బయటకి తీసుకురావాలని పాఠకుల తరుపున డిమాండ్ చేస్తున్నాం .

Ramu S చెప్పారు...

బాగుందండీ...
మంచి సృజనాత్మక బిట్.
కీప్ ఇట్ అప్
ramu
apmediakaburlu.blogspot.com

జయ చెప్పారు...

సింప్లీ సుపర్బ్. ఏం చెప్పాలండి బాబూ...తొందరగా ఇంకో బ్రేకింగ్ న్యూస్ తో రెడీ అయిపోండి సార్. అదిగో, ఆ చానల్ వాళ్ళేదో చూపించేస్తున్నారు. ఒక న్యూస్ కి రెండు న్యూస్ లు ఫ్రీ. Common, get ready:)

Padmarpita చెప్పారు...

భలే భలే:) సండే రోజున భలే స్పైసీ పోస్ట్...అదిరింది:)

సృజన చెప్పారు...

super post:)

నేస్తం చెప్పారు...

హా....హా..హా శేకర్ సూపర్ ...:))))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ బాగుందండీ :-) పేర్లు కూడా బాగా పెట్టారు.

మోహన చెప్పారు...

>>ఇది ముమ్మాటికీ దేశ ద్రోహం కిందే లెక్క...నేను సానియాను క్షమించను...

>>గీ విషయంలో సానియా పోరగాళ్ళ నుండి పెద్దోల్ల దాక అందర్కీ చెమాపణ చెప్పాలే....

హహహా.... Good one!

మంచు చెప్పారు...

భలే రాసారు..మీ టాలెంట్ చూస్గ్తుంతే అర్జెంట్గా మీరో టి వి చానల్ పెట్తేయచ్చు అనిపిస్తొంది... చెప్పండి మనమూ ఒక నవ సమాజాన్ని నిర్మిద్దాం..
మందాకిని గారు మీ కామెంట్ కూడా కేక

కౌండిన్య చెప్పారు...

హ హ సూపరు
"నా గ్రహాలు ఒకదాన్ని ఇంకోటీ కొట్టుకోవటంతో"
:) :)

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Nice one.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మందాకిని గారు,
అమ్మో సీరియల్సా...పోలిక వరకూ పర్వాలేకున్నా వద్దండి బాబు...వాటితో మరో రకం కష్టాలు ఉంటాయి....ఆ బ్యాక్ గ్రౌండ్ సౌండ్లు, అవసరానికి మించి ఎక్స్ ప్రెషన్స్ వినడానికి/చూడటానికి కష్టంగా ఉంటుంది....:-)
మీ స్పందనకు థాంక్సండి...

@శిశిర గారు,
:-)
చాలా రోజులకు కనపడ్డారండి మీరు....
థాంక్యూ...

@మురళి గారు,
థాంక్యూ..

@చిన్ని గారు,
:-)
ఇక్కడంత సీన్ లేదండీ...ఏదో నెలకో టపాతో, మీలాంటి వారు ఇస్తున్న ప్రోత్సాహంతో కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకుని అలా అలా బ్లాగ్ బండిని నడిపించేస్తున్నాను....తప్పకుండా ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తానండీ....
థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్...రియల్లీ ఐ మీన్ ఇట్...

@రాము గారు,
మీడియాని, అందులో ఉన్న వ్యక్తులను వ్యంగ్యంగా చూపినా మీడియా పెర్సన్ అయిఉండి కూడా కోపగించుకోకుండా సహృదయంతో అర్ధం చేసుకున్నందుకు చాలా థాక్సండీ....

@జయ గారు,
>>> ఒక న్యూస్ కి రెండు న్యూస్ లు ఫ్రీ...
ఆహా..ఏం స్కీం అండీ...ఈ అయిడియా మీడియా వాళ్ళకు తెలిస్తే వెంటనే అమల్లోకి పెట్టేస్తారేమోనండీ....:-)
ఇంకో చానల్ వాళ్ళు ఏదో చూపిస్తున్నారని నన్ను మళ్ళీ చూట్టానికి రెడీ అయిపోమంటారా...ఇది అన్యాయం అండీ...:-)
థాంక్యూ..


@పద్మ గారు, @సృజన గారు, @నేస్తం గారు, @వేణు గారు, @మోహన గారు
:-)
థాంక్యూ...


@మంచు పల్లకీ గారు,
:-)
మరో టీ.వీ చానల్?? ఏందుకండీ... ఇప్పటికే ఉన్నవాళ్ళు జనాలను వెర్రి బాగులను చేస్తున్నారు...మనం మళ్ళీ ఇంకో టీ.వీ చానల్ పెట్టి జనాలతో ఆడుకోవటం అస్సలు బాగోదు...:-)
థాంక్యూ...

@కౌండిన్యా గారు, @వీరు భొట్ల గణేష్ గారు
:-)
థాంక్యూ...

సవ్వడి చెప్పారు...

Excellent plus plus..

ప్రణీత స్వాతి చెప్పారు...

హ్హ హ్హ హ్హ హ్హ హ్హ...శేఖర్ గారూ ఇక నవ్వలేను నా వల్ల కాదు.

Vasuki చెప్పారు...

బ్లాగ్ లోకంలో మీరు మరో జంధ్యాల అన్నమాట. బాగా వ్రాసారు. హాస్యం పండింది.
శ్రీవాసుకి

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@సవ్వడి గారు,
@ప్రణీత గారు,
థాంక్యూ సో మచ్..:-)

@వాసుకి గారు,
చాలా పెద్ద ప్రశంసే ఇచ్చారండీ...థాంక్యూ...జంధ్యాల లాంటి మహానుభావుడని అనుకరించటం ఎవ్వరి వల్ల కాదండీ...ఇలాంటి రాతలు ఆయన ప్రతిభ ముందు కుప్పిగంతుల్లాంటివి...:)
థాంక్యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్...

సుజాత వేల్పూరి చెప్పారు...

Sekhar,Can you give me your Email ID plz?

అజ్ఞాత చెప్పారు...

Simply Superb !!

తృష్ణ చెప్పారు...

గతంలో సానియా ఎంగేజ్మెంట్ గురించి న్యూస్ చానల్స్ హడావుడి చేసినప్పుడు సుజాతగారు రాసిన టపా గుర్తుంది.మళ్ళీ ఇప్పుడు ఎవరు రాస్తారా అని చూసా...కాస్త ఆలస్యంగా ఇప్పుడే మీ టపా చూసాను.చాలా బాగుంది.సూపర్....!!

Unknown చెప్పారు...

shekar gaaru
thanks a lot for the visit, meeru cheppinatte chesthaanu. kaanee elago na blog choosaaru kada, mee viluvaina comments pettandi please.
aparna

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@సుజాత గారు,
మీకు నా మెయిల్ ఐడీ తెలిసిందనుకుంటా....

@హరేఫల గారు,
@తృష్ణ గారు,
థాంక్యూ..