9, మే 2009, శనివారం

మళ్లీ...చందమామతో ఒక ఆట ఆడాలి...ఒక పాట పాడాలి...

సాయింత్రం ఏడవుతుంది..అరుగు మీద కూర్చొని రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళు నాలుగు అంటూ టాప్ లేచి పోయేటట్టు చదువుతున్నాను. నాతో పాటు మరో పది మంది పిల్ల సైన్యం చదువుతో ( గోలతో )ఆ అరుగు అంతా రణభేరిని తలపిస్తుంది. ఇంతలో సడన్ గా కరెంటు పోయింది. ఓ..ఓ..ఓయ్..అంటు పిల్లకాయలు అందరూ ఎక్కడ పుస్తకాలు అక్కడ పడేసి అరుగు దిగి ఇంటి ముందున్న వాకిలిలో చేరి ఆటలు మొదలు పెట్టేశారు. కొద్దిసేపట్లోనే అందరి ఇళ్ళ ముందు ఒకేసారి నులక మంచాలు బయట వెయ్యబడాయి. చీకట్లో ఆడటానికి భయం ఉన్నవాళ్ళు ఆ మంచాలపై పోటా పోటీగా తమ ప్లేస్ ను ముందుగా ఆక్రమంచుకుంటున్నారు. అలా నేను కూడా ఆ పోటీలో ఉండి ప్లేస్ ను సాధించుకుని మంచంలో ఒక పక్కకు తిరిగి పడుకుని చుట్టూరా చూసాను. అంతవరకు నా దృష్టి గోల మీదనే ఉంది. అంతలోనే చుట్టూ వాతావరణం నా దృష్టిని తీసుకుంది. అల్లంత దూరంలో ఆడుతున్న జోగారావు కనిపిస్తున్నాడు. పెరట్లో కూరగాయలు కడిగిన నీరుని పారబోస్తున్న అమ్మ వాకిలి నుండే చక్కగా కనిపిస్తుంది. అరె...ఎప్పుడూ లేనిది ఏమిటిది...రోజు వాకిలి అంతా చీకటి పరచుకుని ఉంటుంది. గొల్లభామలు కీచు కీచు మని అరుస్తుంటాయి. ఈ రోజేంటి ఇలా మొత్తం వెలుగు కనిపిస్తుంది....ఇలా ఆలోచనల మధ్య ఒక్కసారి ఆకాశం వైపు చూశాను. అప్పుడే వాడు ఆకాశంలో కనిపించాడు. వాడినే అలా చూస్తూ ఉన్నాను. పక్కన కూర్చొని ఉన్న అమ్మ అది చూసి ఏంటమ్మా...అలా అకాశం వైపు చూస్తున్నావు? చందమామనా? అంటూ నాన్న వైపు తిరిగి గుర్తుందా...వీడు నాలుగేళ్ళప్పుడు రోజూ చందమామని చూపించమనేవాడు...వెన్నెల నుండి ఇంట్లోకి తేగానే "అక్కలకు పద" అని వాకిలి చూపిస్తూ చాలా గోల చేసేవాడు అంది. నేను వాడిని చూస్తున్నాననో ఏమో వాడు దరిదాపుల్లో మేఘాలు ఉన్నప్పటికీ బుల్లి బుల్లి మేఘాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో నవ్వుతున్నట్టుగా ఉన్నాడు. ఒరేయ్..మనం ఆడుకుందామా అని వాడిని అడగాలనిపించింది. నా మనస్సును వాడు అర్ధం చేసుకున్నట్టు వున్నాడు..వెంటనే నన్ను ముట్టుకో అంటూ సవాలు విసిరి మబ్బుల చాటు నుండి పరిగెత్తుతూ ఉన్నాడు. నా కళ్ళు వాడిని వెంబడిస్తునే ఉన్నాయి. ఇద్దరం అలసిపోయాము. వాడు ఒక చోట ఆగిపోయాడు. రా కన్నా బువ్వ తిందువు గాని అని అమ్మ నన్ను ఎత్తుకుని వరండాలో నీల్చొని అన్నం ఉండలుగా చుట్టి నా నోట్లో పెడుతుంది. వాడిని వదిలేసి వచ్చానని దిగులుతో అన్నం సరిగా తినలే. ఓ నాలుగు ముద్దలు తిని మళ్ళీ వాకిట్లో మంచం మీద పడుకుని ఆకాశంలో వాడి గురించి వెతికాను. ఒక పెద్ద మబ్బు వెనకాల దాక్కున్నాడు. చాలా సేపయ్యింది. కాని వాడు మబ్బు వెనకాల నుండి బయటకు రాలేదు. నేను వాడిని వదిలేసి వెళ్ళిపోయినందుకు నా మీద అలిగాడు. రారా....నా వైపు చూడరా..అని బ్రతిమిలాడిన తర్వాత నెమ్మదిగా మబ్బు వెనకాల నుండి బయటపడ్డాడు. వాడితో ఊసులాడుతూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. అలా మొదలయ్యింది మా స్నేహం. కొద్ది రోజులయ్యాక వాడు కనిపించటం మానేసాడు. అప్పుడు నాన్న దగ్గరకు వెళ్ళి నాన్న మొన్నటిలాగా ఎందుకు వెలుగు వాకిట్లో లేదు అని అడిగాను. వాడు నెలకు ఒకసారే వస్తాడని నాన్న చెప్పారు. వాడు ఎప్పుడు వస్తాడా అని రోజూ వాకిట్లో కి వెళ్ళి ఆకాశం వంక చూసే వాడిని. నాన్న చెప్పినట్టే నెలకోసారి వచ్చేవాడు. మేమిద్దరం కబుర్లు చెప్పుకునే వాళ్ళం. వాడు నా మీద అలిగితే ఎలా మబ్బుల వెనక ఉండేవాడో నేను వాడు చాలా రోజుల తర్వాత కనిపిస్తే అలిగి కొబ్బరిమట్ట వెనకాల నుండి వాడిని చూసేవాడిని. అలా చిన్న వయసులోనే వాడితో మానసిక బంధం ఏర్పడిపోయింది.

కొంచం పెద్దయ్యాక మేము వేరే ఊరికి వెళ్ళిపోయాము. సాయింత్రం ట్యూషన్లు, చదువుల వల్ల కొన్ని సార్లు వాడిని మిస్ అయ్యేవాడిని. అదేంటో గాని కరెంట్ పోయినప్పుడు మాత్రమే వాడి ఉనికి ఉండేది. మిగిలిన సమయాల్లో వీధి దీపాలు, ఇళ్ళ వెలుగులు మధ్య వాడి ఉనికి ఆకాశంలో మాత్రమే
ఉన్నట్టు ఉండేది. అలాంటి సమయంలో ఒక కొత్త అతిధి లాగా కనిపించేవాడు. మేము ఉన్న ఊళ్ళో ఎప్పుడయినా కరెంట్ పోయిందంటే, వాడు ఆకాశంలో ఉంటే చాలు మా కాలనీ పిల్లలందరం తోటలో ఉన్న ఇసుక దగ్గరకు పరిగెత్తేవాళ్ళం. ఎంతో ఉత్సాహంతో ఇసుక దగ్గరకు పరిగెడుతున్న మమ్మల్ని చూసి వాడికి కూడా ఆడుకోవాలనిపించేదో ఏమో గాని ఆకాశంలో ఉన్న నక్షత్రాల మధ్యకు పరిగెత్తేవాడు. వాడి ఉత్సాహం చూసి గాలి కూడా నేనేం తక్కువ తిన్నాన అన్నట్టు మా మొహాలను గబగబా తాకుతూ పరిగెత్తేది. అల్లంత దూరంలో ఉన్న ఏటిలో, అవతలి ఊరువాళ్ళు వారి వారి ఊళ్ళకి వెళ్ళటానికి పడవ సిద్దంగా ఉండేది. అవతలి ఊరుకు పోవటంకోసం జనాలు పడవ దగ్గరకు వెలుతుండేవారు. ఇదంతా వాడి వెలుగులో వర్ణ చిత్రం లా కనిపించేది. ఇసుకలో రకరకాల గూళ్ళు కట్టేవాళ్ళం. నేనేమో నేను కట్టిన ఇసుకగూడులో వాడు లోనికి వచ్చేటట్టు గూడు పైన ఒక చిన్న కిటికీ లాగా ఉంచేవాడిని. చీకటిగా ఉన్న గూడులో వాడి వెన్నెల పైన కిటికీ ద్వారా చేరి లోపల మొత్తం పరచుకునేది. నా గూడు పక్కన అలానే ఇసకలోనే పడుకుని వాడి వైపు చూస్తూ ఊసులాడుతూ, ఏటి వైపు చూస్తూ అలా ఉండిపోయే వాడిని. ఏం మహత్తు ఉందో గాని వాడు కురిపించే చల్లని వెన్నెల్లో గడుపుతుంటే గొప్ప మానసిక ఆనందం ఉండేది. అంతలోనే కరెంట్ వస్తే పిల్లలందరూ వారి వారి గూడులను విరిచేసి ఇంటికి బయలుదేరేవారు. నాకు మాత్రం వాడి సమక్షంలో అక్కడే అలా ఉండిపోవాలనిపించేది. ఇలాంటి అనుభవాల వల్ల వాడంటే మరింత ఇష్టం వచ్చేసింది.

ఇంజనీరింగ్ చదువంతా ఒక పల్లెటూరిలో సాగింది. అక్కడ ఎప్పుడూ కరెంట్ కోతే. సాయింత్రం సరిగ్గా చదవడం మొదలెట్టే సమయానికి పవర్ తీసేసేవాడు. బయటేమో వెన్నెల. లోపల ఉక్కపోత. రూమ్మేట్స్ అందరం డాబా పైకి ఎక్కి అనుభూతులు, ఆలోచనలు పంచుకునే వాళ్ళం. మా రూం ఎదురుగా ఉన్న కాలువగట్టు, పంట పొలాలు, కల్లు కోసం కుండలు కట్టివున్న పొడువాటి తాటి చెట్లు, చుట్టు పక్కల ఫ్యాక్టరీ లలో పని చేసుకుని ఇళ్ళకు గబ గబా మట్టిరోడ్డున వెళుతున్న కార్మికులు...ఇవన్నీ వెన్నెలలో చూస్తుంటే రెట్టింపు అందంతో కనపడేవి. వెన్నెలతో ఇంతకు ముందు ఎలాంటి అనుభవం లేని నా రూమ్మేట్స్ ( సిటీ నుండీ వచ్చినవారు ) ఈ దృశ్యాలను మొదటి సారి చూడటం వల్ల ఎంతో ఆనందపడేవారు. ఇలా కాదు వెన్నెల రాత్రులను ఎంజాయ్ చెయ్యటం అని అనుకుని అందరం ఓసారి దగ్గర్లోని పంట పొలాల్లోకి వెళ్ళాం. వెలుతున్న దారిలో ఒక చెట్టు కింద నీడలో మిణుగురు పురుగులు గుంపులు గుంపులుగా మిణుకు మిణుకు మని ఒకే చోట మెరుస్తున్నాయి. ఇంక ఎవ్వరికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ దృశ్యం మా మనసులలో చెరగని ముద్ర వేసింది. ఎలాగోలా మనసుని దాని నుండి మళ్ళించి ఒక గట్టు మీద కూర్చొని గ్రామాన్ని చూస్తుంటే ఆ గ్రామం అంతా ఎవరైనా వెండి పూత పూసారా అన్నట్టు సందేహం వచ్చింది. అప్పటినుండి వాడి మీద ఉన్న అభిమానం కాస్తా పిచ్చి అభిమానం అయింది. పరీక్షల రోజు వాడు కనిపించినా సరే ఈ అనుభూతులను ఎవ్వరం మిస్ చేసుకునేవాళ్ళం కాదు..ముఖ్యంగా నేను.

చదువు పూర్తయిన తర్వాత ఒకసారి మా రూమ్మేట్ వాడి సిటీలో బోర్ కొడితే, మమ్మల్ని ( రూమ్మేట్స్ లో ఇంకోడు మా ఊరి వాడే ) చూడాలని పించి మా ఊరు వచ్చాడు. రాత్రి ఎనిమిది అవుతుంది. ఆ రోజు అకాశంలో మా వాడు కనిపించాడు. అది చాలదా మాకు సేద తీరేందుకు...అందుకే ఎప్పటినుండో వెన్నెల్లో సముద్రం చూడాలన్న కోరికని ఆ రోజు నిజం చేసుకోవాలనిపించింది. ముగ్గురం ఒకే బైక్ ఎక్కి ఆ సమయంలో దగ్గరలోని బీచ్ కి బయలు దేరాము. దారిలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో తప్పించి మిగిలిన రోడ్డు అంతా వెన్నెల పరచుకుని ఉంది. అప్పటికే తొమ్మిది దాటడంతో రోడ్డు మీద ఒక్క వాహనం కూడా లేదు. అలా ప్రశాంతంగా ఉన్న రోడ్డు మీద బైక్ మీద పోయిన మార్గమంతా ఆకాశంలో వాడిని చూస్తునే ఉన్నాను. వెన్నెల వర్షంలో తడిసి ముద్దవుతున్న పచ్చని చెట్లు, పంట పొలాలు, అక్కడక్కడా పిల్ల కాలువలు కూడా మాలాగే వాడి వెన్నెలను ఆస్వాదిస్తున్నాయనుకుంటా....హోరున వీచే సముద్రం గాలికి మనసంతా తేలిపోతున్నట్టు ఉంది. బీచ్ కి కొంత దూరంలో బైక్ ఉంచి ఇసుకలో సముద్రం వైపు నడిచాము. నా దృష్టి ఆకాశం మీద పడింది. ఇంకొంచం కిందికి దిగితే వాడు సముద్రాన్ని తాకేసేలా ఉన్నాడు. వాడి సైజ్ కూడా కొంచం పెద్దగా ఉంది. వాడి వెన్నెల్లో కెరటాలు ఎగిసి పడుతున్న ప్రతీసారి మెరుస్తూ నురగలో నక్షత్రాలను దాచుకున్నట్టు ఉన్నాయి. ఎంతో రొమాంటిక్ గా ఉంది వాతావరణం. ఒంటిపై ఉన్న షర్ట్, పాంట్ తీసేసి లోదుస్తులతో ఒడ్డున పడుకున్నాను. తాకనా వద్దా అన్నట్టు అలలు ఒంటిని తాకుతుంటే వాడిని చూస్తూ ఉండిపోయాను. ఈ సారి ఎందుకో వాడు స్నేహితుడు లాగా కనపడలే. కవ్విస్తున్న చెలి లాగా కనిపించాడు. అప్రయత్నంగానే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను. యూ నాటీ అనే ప్రియురాలిలాగా సిగ్గుపడుతూ మబ్బుల చాటుకు పోయాడు. అలా మా ముగ్గురు స్నేహితులం తమదైన ప్రపంచాల నుండి బయటకు వచ్చి వెనుతిరిగాము.


అది సోమాజీగూడ బస్టాప్.....రాత్రి తొమ్మిదవుతుంది...ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళటం కోసం బస్టాప్ లో నిలబడివున్నాను. వాహనాల శబ్దం చెవులను వద్దంటున్నా తాకుతున్నాయి. బస్టాప్ లో ఆగిన ప్రతీ బస్సు జనాలతో కిక్కిరిసి ఉంది. చుట్టూ అంతా షాపింగ్ మాల్స్ లైటింగ్. ఆఫీస్ లో క్లిష్టమైన బగ్ ఫిక్స్ చేయటంతో బుర్రలో దానితాలుకు ఆలోచనలే తిరుగాడుతున్నాయి. చాలా అలసిపోయివున్నాను. క్యాజువల్ గా తల పైకెత్తి చూసాను. వాడు కనిపించాడు. వెంటనే తల కిందకు తిప్పేసాను. ఎప్పుడూ వాడు కనిపిస్తే ఊసులాడాలని ప్రయత్నించే మనసు ఈ సారి అసలు వాడి గురించే అలోచించటంలే. ఆఫీస్ వ్యవహారాలు.. ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం వలన వాడిని చూసి ఆస్వాదించే సున్నితత్వాన్ని నా మనసు కోల్పోయింది. ఇంతలో త్వరలో మాకు ఇవ్వబోయే హైక్స్ మీదకి ఆలోచనలు మళ్లాయి. దాని తర్వాత ఈ సారి అయినా బస్సు ఖాళీగా వస్తే బావుణ్ణు...ఇంటికి తొందరగా వెళ్ళి పడుకోవాలి అన్న ఆలోచనలు..రోజులన్నీ ఇలాగే గడిచిపోతున్నాయి. ఒక్కసారి కాదు...రెండు సార్లు కాదు...దాదాపుగా వాడు ఆకాశంలో ఉన్న ప్రతీసారి మనసు ఎదో ఒక ఆలోచనల్లో ఉంటుంది. కొన్నిసార్లు అయితే వాడు వచ్చాడో లేదో కూడా తెలియదు. చుట్టూ ఉన్న అపార్ట్ మెంట్స్ కప్పేస్తుంటాయి. రకరకాల ఆలోచనలు, భాద్యతలు, భయాలు, వాడిని ఆస్వాదించే పరిస్థితుల లేమి....ఇవన్నీ నాలో ఉన్న వాడి స్నేహితుడిని చంపేశాయి. ఒకసారి వాడితో నాకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని నాలో ఉన్న వాడి స్నేహితుడికి మళ్ళీ ప్రాణంపోసే ప్రయత్నమే ఈ టపా.