7, డిసెంబర్ 2009, సోమవారం

ప్రేమ పేరుతో బంధీని చేస్తే....



వీకెండ్ కావటంతో ఫ్రెండ్స్ అందరం ఎప్పటిలాగానే ఒకరి ఇంట్లో కలవటం...పిచ్చాపాటి కబుర్లు...జోకులు...చెణుకులు మధ్య హాయిగా గడిచిపోయింది. తెలంగాణ బంద్ వల్ల దియేటర్లు, షాపింగ్ సెంటర్లు, గోకార్టింగ్ లాంటి ఎంటర్టైన్మంట్ జోన్స్ మూసెయ్యటం మా ఆనందాల మీద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సాయింత్రం అందరం కలిసి సరదాగా కారులో అంతర్జాతీయ విమానాశ్రయంకి బయలుదేరాం. ఏ ప్లేస్ కి వెళ్ళినా మొదట అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లు పై పడటం మా వాళ్ళకు అలవాటు. ఎప్పటిలాగే వినడానికి వింతగా ఉండే అయిటేమ్స్ మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో ఆర్డర్ ఇచ్చేసి బాతాఖానీలో పడ్డాం. అయిటెమ్స్ రాగానే మారుమాట్లాడకుండా అందరం మెక్కుతూ కూర్చున్నాం...ఇంతలో మా అశ్విన్ గాడు బర్గర్ ని చేతిలోకి తీసుకుని కొంచెం సాస్ పోసి అభిమానంగా "ఏరా శేఖ్...తింటావా" అని నన్ను అడిగాడు. అంతే ఆ దృశ్యం చూసిన అశ్విన్ వాళ్ళావిడ ప్రణవి "తింటావా అని నన్నడకుండా శేఖర్ ని అడుగుతావా" అంటూ అలిగింది. మిగిలిన వాళ్ళకు ఏమీ అర్ధం కాలేదు. "ఎదురుగా నేను కనపడుతుంటే నన్నడకుండా వాడిని అడుగుతావా" అని మరోసారి అంది. అప్పుడువాడు బర్గర్ ని తనకు ఇవ్వబోయాడు. అంతే తను కోపంగా తిరస్కరించింది. నువ్వు ఇంకోబర్గర్ ని తింటావేమో అని నిన్నడగలేదు అని తను ఏదో వివరణ ఇవ్వబోతుండగా "ఎప్పుడైనా నువ్వు తినకుండా నేను తిన్నానా? ప్రతీసారి మనం షేర్ చేసుకుంటాం కదా" అని అంది. అంతే మా గ్యాంగ్ లోని మిగిలినవాళ్ళు నేను ప్రణవికి సవతిపోరు కలిగించానా అని ఆశ్చర్యంగానూ, వాడు నాకు ఇస్తున్నప్పుడు ప్రణవికి ఇవ్వరా అని వీడెందుకు అనలేదు అన్నట్టు వింతగానూ చూశారు.

ప్రణవికి అశ్విన్ మీద పొసెసివ్ నెస్ చాలా ఎక్కువ. తను ఎంత ఎక్కువగా అశ్విన్ ని ఇష్టపడుతుందో అంతే ఇదిగా అశ్విన్ కూడా తనను చూసుకోవాలని అనుకుంటుంది. అయితే అశ్విన్ కూడా తనపై అంతకు రెట్టింపు ప్రేమ చూపిస్తాడు. కానీ చిన్న విషయాలను కూడా ప్రణవి, అశ్విన్ కి తనపై ఉన్న ప్రేమని బేరీజువేసుకోడానికి ఉపయోగించటం వల్ల అశ్విన్ లైఫ్లో ఇలాంటి సంఘటనలు జరగటం మామూలు అయిపోయింది.

పొసెసివ్ నెస్....అంటే ఎదుటివాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని మనకు నచ్చినట్టు ప్రవర్తించేలా చేసుకోవటం ఏమో అని అనిపిస్తుంటుంది నాకు.

నిజానికి పొసెసివ్ నెస్ అనేది నిత్యం మనం చుట్టు ప్రక్కల మనుషుల్లో చూస్తునే ఉంటాం. ఒక తల్లి తన కొడుకు ఎప్పుడూ తనకి అడిగే అన్నీ కొనాలంటుంది. ఎప్పుడైనా వీలుకాక అడిగికొనటం కుదరకపోతే అతను ఏ పరిస్థితిలో తనని అడగలేదు అని ఆలోచించి అర్ధం చేసుకోడానికి ప్రయత్నించదు. తనపై గౌరవమర్యాదలు తగ్గటం వల్లే అలా చేసాడని ఫీలవుతుంది.

ఓ భార్య తనను ప్రతీరోజు ఆఫీసు నుండి ఇంటికి తీసుకొచ్చే భర్త ఏరోజైనా "నా చిన్నప్పటి స్నేహితుణ్ణి కలవాలి...ఈ రోజు నువ్వు ఆటోలో వెళ్ళు" అని గొంతులో స్నేహితుణ్ణి కలవబోతున్నానన్న ఆనందం చూపి చెబితే అర్ధం చేసుకోకుండా తెగ కోపం తెచ్చుకుంటుంది. పైగా తనకంటే స్నేహితుడే ఎక్కువా అంటూ వాదనకు దిగుతుంది.

ఓ పాతికేళ్ళ కుర్రాడు రూంలో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బయటకు వెళ్ళిన ప్రతీసారి తనతో ఎక్కడికి వెళుతున్నాడో చెప్పి వెళ్ళాలని ఆశిస్తాడు. ఎప్పుడైనా చెప్పకపోతే స్నేహితుడు మారిపోయాడని అనుకుంటాడు. అంతేగానీ తిరిగి వచ్చిన తర్వాత తనతో విషయాలన్నీ చెబుతాడు అన్న భరోసాతో ఉండడు.

ఎదుటివాళ్ళ స్వేచ్చకి భంగం కలగకుండా చూపించే ప్రేమ/అభిమానం అన్ని విధాల మంచింది. ఎప్పుడైతే మనం ప్రేమ/అభిమానం పేరుతో వాళ్లని వాళ్ళుగా ఉండనీకుండా కట్టడి చేస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమ పేరుతో విధించిన సంకెళ్ళను తెంచుకోడానికే ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పొసెసివ్ నెస్ వల్ల ప్రాక్టికాలిటీనీ మిస్సవుతాం. ఎవరైనా అశ్విన్ లాంటి ఒకలిద్దరు మాత్రం ఆ ప్రేమని అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చేస్తారంతే. మిగిలిన వాళ్ళు వారినుండి తప్పించుకోడానికి విషయాలను దాచిపెట్టడం, అబద్దాలతో మేనేజ్ చేసుకోవటం, నస కేసురా బాబు అంటూ వేరొకరిదగ్గర గోడు వెళ్ళబోసుకోవటం లాంటివి చెయ్యాల్సివస్తుంది.

27 కామెంట్‌లు:

ajaY vegeSna చెప్పారు...

మీ బ్లాగ్ టైటిల్ 'ఏటిగట్టు' చాలా బాగుంది
possessiveness మీద టపా అధ్బుతంగా రాసారు

సుజాత వేల్పూరి చెప్పారు...

అత్తాకోడళ్ళ మధ్య మొదలయ్యే గొడవలకు కూడా ఈ పొసెసివ్ నెస్సే కారణం. అందుకే భార్యా భర్తలిద్దరికీ ఎవరి space వాళ్ళకుండాలి. ఒకరి స్నేహితుల్ని మరొకరు గౌరవించుకోవడం లోనూ, ఒకరి అభిరుచులకు మరొకరు గౌరవించుకోవడంలోనూ, ఒకరి స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు మరొకరు గౌరవం ఇవ్వడంలోనూ ఎంతో కంఫర్ట్, ఆనందం ఉంటాయి. ఇది ప్రాక్టికల్ గా అర్థం కావలసిందే తప్ప థీరీ మనం చెప్తే అర్థం కాదు.

అవతలి వారు మనల్ని "పట్టించుకోవడం లేదు"అన్న ఒక చిన్న భావన ఇగో సమస్యలకు దారి తీయకుండా ఉండాలి. మీ ఫ్రెండ్ అశ్విన్ లాగా కొందరు మాత్రమే ఆ ప్రేమను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. అలా అర్థం చేసుకోవడం ఇక రెగ్యులర్ గా అలవాటు చేస్తే అదొక అడ్వాంటేజ్ అయిపోతుంది. కాబట్టి మొహమాటాలకు పోకుండా మొదట్లోనే ఈ విషయాలన్నీ వివరంగా, ఓపెన్ గా చర్చించుకోవాలి.ఎవరి స్పేస్ ని వాళ్ళకుండాలనే కామన్ సెన్స్ ఇద్దరూ డెవలప్ చేసుకోవాలి.

మంచి టాపిక్! బోల్డంత చర్చ జరగాలి నా లెక్క ప్రకారం దీనిమీద!

శిశిర చెప్పారు...

నిజానికి పైకి చిన్నదిగా కనిపించే పెద్ద సమస్యండి ఇది. బాగా రాశారు. మీ బ్లాగు పేరు బాగుంది.

మధురవాణి చెప్పారు...

చాలా చాలా మంచి టపా..!
శిశిర గారన్నట్టు చిన్న ఆలోచనతో మొదలయ్యి చివరికి పెద్ద పెద్ద గొడవలకి మనస్పర్దాలకి దారి తీసే సమస్య ఇది.
నాకనిపిస్తుంది 'బద్ధకం' లాగా ఈ 'పొసెసివ్ నెస్' అనేది కూడా ఒక బాడ్ హాబిట్ లాంటిదేమో అని. ఒకోసారి మనకి ఆ లక్షణం ఉందని తెలిసినా దాన్ని మార్చుకోడానికి సీరియస్ గా ప్రయత్నించం :(
సుజాత గారన్నట్టు..'నేనకున్నట్టు ఉండట్లేదు. నన్ను పట్టించుకోట్లేదు' అనుకునే ప్రతీసారి కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించితే సమస్య పెద్దదవకుండా ఉంటుందేమో.!
అలాగే...'అర్ధం చేసుకోడం' అనేది కూడా ఒక అలవాటులా అయిపోకూడదేమో కొన్ని విషయాల్లో..
చక్కటి పోస్టు రాశారు. అభినందనలు.

kiranmayi చెప్పారు...

మంచి టాపిక్. బాగా రాసారు.

తృష్ణ చెప్పారు...

చాలా మంచి టాపిక్...సుజాతగారన్న మాటలు నూరుశాతం కరక్ట్.
ఎన్ని అనుకున్నా ఒకోసారి ప్రాక్టికల్ గా అమలుపరచటంలో విఫలమౌతూనే ఉంటాము...మీరన్నట్లు అది ఎదుటివ్యక్తి మనల్ని అర్ధం చేసుకోవటంలో కూడా ఉంటుందండీ...

Hima bindu చెప్పారు...

"ఎదుటివాళ్ళ స్వేచ్చకి భంగం కలగకుండా చూపించే ప్రేమ/అభిమానం అన్ని విధాల మంచింది. ఎప్పుడైతే మనం ప్రేమ/అభిమానం పేరుతో వాళ్లని వాళ్ళుగా ఉండనీకుండా కట్టడి చేస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమ పేరుతో విధించిన సంకెళ్ళను తెంచుకోడానికే ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పొసెసివ్ నెస్ వల్ల ప్రాక్టికాలిటీనీ మిస్సవుతాం. ఎవరైనా అశ్విన్ లాంటి ఒకలిద్దరు మాత్రం ఆ ప్రేమని అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చేస్తారంతే. మిగిలిన వాళ్ళు వారినుండి తప్పించుకోడానికి విషయాలను దాచిపెట్టడం, అబద్దాలతో మేనేజ్ చేసుకోవటం, నస కేసురా బాబు అంటూ వేరొకరిదగ్గర గోడు వెళ్ళబోసుకోవటం లాంటివి చెయ్యాల్సివస్తుంది."
శేఖర్ మీరు చాల చక్కగా చెప్పారు ...ఇది నిజం .నాకు ఒకరిద్దరితో అనుభవం (స్నేహితులతో ) ఒక్కోసారి నేను ఆలోచిస్తాను నేను కూడా ఇలా ప్రవర్తిస్తాన అని పోస్సేసివ్ గా ఫీల్ అవ్వుతాం ఎక్కువ అయితేనే ప్రాబ్లం .చక్కగా రాసారు

Padmarpita చెప్పారు...

చాలా మంచి టపా..!
చాలా బాగా రాశారు..!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@అజయ్ గారు,
థాంక్యు...

@సుజాత గారు,
>>>అలా అర్థం చేసుకోవడం ఇక రెగ్యులర్ గా అలవాటు చేస్తే అదొక అడ్వాంటేజ్ అయిపోతుంది..<<
ఈ మాట నూరు శాతం కరెక్టండి. మీరన్నట్టు స్పేస్ చాలా ముఖ్యం..నిజమే ఇలాంటివి థీరీ విన్నా అర్ధం కావు..ఎవరికి వారు అర్ధం చేసుకుని మెలగాల్సిన విషయాలు.
థాంక్యు.

@శిశిర గారు,
థాంక్యు..."ఇబ్బంది పెడుతున్నాం" అనే కోణంలో ఎవరూ ఆలోచించకపోవటం వలన ఇది చిన్నదిగా కనిపించే పెద్ద సమస్య అయి కూర్చొందని నాకనిపిస్తుందండి.

@మధురవాణి గారు,
>>>'అర్ధం చేసుకోడం' అనేది కూడా ఒక అలవాటులా అయిపోకూడదేమో కొన్ని విషయాల్లో..<<
అవునండి..అలా చేయటం వల్ల ఇంకా చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళని పట్టించుకుంటున్నారా లేదా అని ఆలోచిస్తారు. దాని వల్ల సమస్య తీరకపోగా మరింత పెద్దదయ్యే ప్రమాదముంది.

@కిరణ్మయి గారు,
థాంక్యు...

@తృష్ణ గారు,
అవును..థాంక్యు..

@చిన్ని గారు,
నిజమండి...ఏదైనా పరిమితంగా ఉంటేనే బాగుంటుంది...ఈ విషయాల్లో నాకు కొన్ని అనుభవమే...ఆ చివరి ఎగ్జాంపుల్ నేను రూంలో ఉన్నప్పుడు స్వయానా గమనించింది.
థాంక్యు..

@పద్మగారు,
థాంక్యు..

నిషిగంధ చెప్పారు...

ఒక ఆసక్తికరమైన విషయాన్ని స్పృశించారు! అమ్మో ఈ పొసెసివ్ నెస్ మొదట్లోనే సరిదిద్దకపోతే కష్టం.. అబ్బాయిలేమో సాధారణంగా స్నేహితులతో ఎక్కువగా ఆలోచనలు పంచుకుంటారు.. అందులో భార్యకి చెప్పేంత విషయమేమీ లేదనుకుంటారు.. కానీ అమ్మాయిలేమో పొద్దున్న పొరపాటున పొంగిన పాల దగ్గర్నుంచీ ప్రతీ విషయం పంచుకుంటారు.. అవతలివారూ అలానే ఉండాలని ఆశిస్తారు.. 'నువ్వే నా ప్రపంచం!' ఇది వినడానికి చాలా బావుంటుంది కానీ ఆచరణలో చూస్తుంటే 'నన్నొదులు బొమ్మాళీ.. నన్నొదులు..' అనాలనిపిస్తుంది :))

మోహన చెప్పారు...

"తన గురించి వ్యక్తపరిచావు బాగుంది. మరి నీ ప్రపంచం లో నేనెక్కడ??"
ప్రతి ఘటనతోనూ తమ ఉనికిని ప్రశ్నించుకుకోవటం. Trying to find one's identity through others.

చాలా బాగా చెప్పారు. A post to be marked.

మురళి చెప్పారు...

సుజాతగారి మాటే నాదీను.. విషయాలని అవతలి వారి కోణం నుంచి కూడా ఆలోచించడం వల్ల కొంతవరకూ ఇబ్బందులు తొలుగుతాయి.. ఎప్పటిలాగే మంచి టపా..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@నిషిగంధ గారు,
:)
మీరన్నది అక్షరాలా నిజమండీ...కొంతమంది తమ ప్రపంచాన్ని చిన్నది చేసుకోవటం వల్ల వచ్చిన చిక్కండి ఇది.
థాంక్యు..

@మోహన గారు,
మొదట మీ వ్యాఖ్య చదివాక చెయ్యి అప్రయత్నంగానే బుర్ర మీదకు వెళ్ళింది :)..ప్చ్ లాభం లేదనిపించి కాసేపు మోకాలిని గీరుకున్నాక అర్ధం అయిన తర్వాత...:-)నేను పదాలు వెతుక్కుని టపా ద్వారా చెప్పాలనుకున్నది మీరొక్క వాక్యంలో అద్భుతంగా చెప్పేసారనిపించింది.
థాంక్యు..

@మురళి గారు,
అవునండీ..
మీ ప్రోత్సాహానికి థాంక్యు..

భావన చెప్పారు...

చాలా మంచి విషయం చెప్పేరు. ఆల్ రడీ సుజతా, నిషి, మధుర, తృష్ణ ఇంకా అందరు చెప్పేసేరు నేను చెప్పాలనుకున్నది. దీని గురిన్చి బాల చందర్ అనుకుంటా ఒక సినిమా కూడా తీసేరు గీత తో..

సృజన చెప్పారు...

ఎంత బాగా చెప్పారు.
ఏటిగట్టున కూర్చుని ఆలోచిస్తున్న ఫీలింగ్.....

జయ చెప్పారు...

శేఖర్ గారు, ఎంత బాగా చెప్పారండి బాబూ. ఇదిమాత్రం అక్షరసత్యం.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@భావన గారు,
దీని గురించి ఎంత మాట్లాడినా ఇంకా మిగిలిపోయే ఉంటుందండి.
నాకు లీలగా గుర్తుందండీ..ఈ కాన్సప్ట్ తో ఏదో సినిమా ఉందని...
థాంక్యు..

@సృజన గారు,
థాంక్యు..థాంక్యు...

@జయ గారు,
థాంక్యు..

కెక్యూబ్ వర్మ చెప్పారు...

చాలా సమస్యలకు ఇదే మూలం. వివరణాత్మక విశ్లేషణతో మీ టపా బాగుంది. ఇలాంటి విషయాలు పదుగురిలోకి విస్తృతంగా వెలితే చాలా సమస్యలు తొలగి కుటుంబాలమద్య, వ్యక్తులమద్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. మీకు ధన్యవాదాలు.

పరిమళం చెప్పారు...

నిజమే కాని అప్పుడప్పుడూ మనకు ఇష్టమైన వాళ్ళపట్ల ...అనుకోకుండానే పొసెసివ్ గా ప్రవర్తిస్తూ ఉంటాం ....మళ్ళీ వాళ్ళమీద ఉన్న ప్రేమతోనే కదా అని డిఫెన్స్(??) చేసుకుంటూ ఉంటాం ....మానవ నైజం అంతే అనుకుంటా ...మంచి టాపిక్ !
అన్నట్టు శేఖర్ గారు ప్రవరాఖ్యుడు సినిమాలో ఒక సీను...పొలంలో పనిచేస్తున్న అమ్మాయి నచ్చుతుంది జగపతిబాబుకి ..నాకైతే మీ" నెరజాణ "గుర్తోచ్చిందనుకోండి :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@కెక్యూబ్ వర్మ గారు,
అవునండీ..థాంక్యు..

@పరిమళం గారు,
ఒక పరిమితి వరకు ఉన్న పొసెసివ్ నెస్ బాగానే ఉంటుందండీ..కానీ శృతి మించితినే చిన్నా చితకా విషయాలకు కూడా ఆపాదించటం మొదలెట్టి ఇబ్బందులు తెచ్చుకుంటాం.
మా నెరజాణ ని మీరు బాగానే గుర్తు పెట్టుకున్నారే!!
థాంక్యు..థాంక్యు..
అసలు ఈ విషయాన్ని ప్రస్తావించి మీరు మంచి పని చేసేరండీ. లేదంటే సినిమా చూసి, ఆ సీన్ చూసి, మళ్ళీ ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళిపోయి..నానారకాల ఇబ్బందులు వచ్చేవి. :-):-)

లక్ష్మి చెప్పారు...

ఎంత గొప్ప బంధం ఐనా సరే అవతలి వ్యక్తికి స్వేచ్చ ఇవ్వకపోతే అది నరకంలాగే అనిపిస్తుంది. ఎవరికి వారే మొదటి ప్రయారిటీ, తర్వాతే ఎంత ప్రేమించిన వారైనా, అనవసరపు పొసెసివ్ నెస్ వల్ల బంధాలు తెగిపోవటమే కానీ మిగలవు. చక్కటి టపా శేఖర్ గారు

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@లక్ష్మి గారు,
అవునండి...ఎవరికైనా పర్సనల్ స్పేస్ చాలా ముఖ్యం..
థాంక్యు..

Chakravarthy చెప్పారు...

అందరు చెప్పినటు మనకి ఎప్పుడు ఒక పెర్సొనల్ space వుండాలి ఈ విషయంలొ నెను కూడా ఎకీభవిస్తున్నాను being a practical human being. Being practical మనకి life లొ materialistic, selfish and to the point వుండటమ్ అలవాటై పొతుంది. కాని ఒక మనిషికి ప్రెమించ బడటం చలా ముక్యం... కాదంటర??

"ఈ నిమిషం నెను చనిపొతె నెను ఎవరిని ఎక్కువ మిస్స్ అవుతను" అనె ప్రెస్నకి అందరి దగ్గర ఒక జవాబు వుంటుంది. నా జవాబు అమ్మ, నాన్న, నా భార్య. అందుకె వీరిలొ ఎవరు నన్ను పొస్సెస్స్ చెసినా అది నాకు అంతులెని ఆనందం కలిగిస్తుందె తప్ప కష్టం కాదు.

శెఖర్ గారు మీరు బ్లాగు చాలా బాగా రాసారు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చక్రవర్తి గారు,
మనిషి ప్రేమింపబడటం చాలా ముఖ్యం...కాదనను..ప్రేమ రాహిత్యమంత నరకం ఇంకోటి ఉండదు ఎవరికైనా..ముందుగా పొసెసివ్ నెస్ ని కూడా అర్ధం చేసుకునే మీకు అభినందనలు..కానీ చాలా తక్కువశాతం మంది అలా అనుకుని ఉండగలరండీ..లైఫ్లో చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఇంత ఎనాలసిస్, ఆలోచన చెయ్యంకదా!

కొత్త పాళీ చెప్పారు...

Profound observation

dilse చెప్పారు...

మీ బ్లాగు పేరు బాగుంది.

VENKATESH JINUKALA చెప్పారు...

ఇది పొగడ్తకి అర్హమైన టపా. చాలా బాగుంది