24, నవంబర్ 2009, మంగళవారం

ఓటు - లోకం తీరు

"ఏంటే సుబ్బులూ...ఇయ్యాల ఏ కూరొండినావ్...."

"నీ కిట్టం అని బొమ్మిడాయల పులుసు సేసినాను మావ.."

"తొందరగా ఎట్టే...సేపల పులుసు ఇనగానే ఆకలి దంచేస్తుంది.."

సుబ్బులు తన భర్త ఎంకయ్య ముందు కంచం పెట్టి భోజనం వడ్డించింది.

"ఏమాటకామాటే సెప్పుకోవాలి...నీ సేత్తో సేసిన పులుసు కూర ముందు జేజమ్మల వంట కూడా దిగదుడుపేనే....అవునే...యపార్ట్ మెంట్ లో అలికిడి లేదేంటే...సానా మట్టుకు ఫ్లాటుల్లో లేట్లు ఎలగట్లేదేంటే...." పులుసు ముక్క సప్పరిస్తూ అడిగాడు ఎంకయ్య...

"ఇంకెక్కడి జనాలు మావ...ఫాట్లలో సానామందికి ఈ రోజు ఆపీసుల్లేవుగదా....ఓట్లు ఏస్తారని సెలవు ఇచ్చీరు...వరసగా మూడు రోజులు సెలవుల వల్ల అందరూ సొంతూళ్ళకు, ఇహార యాత్రలకు పోనారు...." కంచంలో మరికొంచెం అన్నం వడ్డిస్తూ చెప్పింది సుబ్బులు...

"ఈ రోజు పోలింగ్ బూతుకాడ సూసినావే....సదూకున్నోల్లు ఒక్కలైనా అగుపించారా?...మరి ఈల్లకు సెలవులెందుకే...ఆలే ఓటు ఎయ్యకపోతే మనలాంటోళ్ళు ఎవరేస్తారే?.."

"అట్టా అనకు మావ....కూసింత మనలాటోల్లే ఓట్లు ఎయ్యడానికి పోతారు...ఆలెందుకు ఏస్తారు...రేట్లెంత పెంచినా తిట్టుకుంటూ కొనుకుంటారు...కడుపు నింపుకుంటారు...కడుపునిండినోళ్ళకి ఏడకైనా పోయి సికారు చెయ్యాలనిపిత్తాది...లేపోతే టీవీకాడ కూకొని ఏ సినిమానో సూత్తారు గానీ ఈ రోజు ఓటేయ్యాల..అని ఎందుకు అనిపిస్తది మావ..."

"కరెస్ట్ గా సెప్పినావే...మన యపాట్మెంట్ ఎనకాల ఉన్న పేదల బస్తీలో ఉన్న గుడిసోల్లు శానామంది బూత్ కాడకి వచ్చినారు...అదే మన సుట్టూ పెద్ద పెద్ద సదువులు సదూతున్నోల్లు, ఉజ్జోగాలు సేసుకునే వాళ్ళు సగం మందైనా బూత్ కాడకి రానేదు...అంతేలే ఎంతసేపు సంపాదన..ఆల్ల జీవితాలు ఆల్లు సూసుకోడానికి సూపించుకుంటున్న శద్ద నగర అభివుద్దికి ఎందుకు సూపిత్తారులే....అయినా ఇట్టాంటి ఇసయాల్లో సదూకున్న ఆలికి మనకి పెద్దగా తేడా ఏమీలేదే సుబ్బులు"

"అవును మావ....ఈళ్ళ ఓట్లన్ని రిగ్గింగ్ సేసేసి అవి కూడా లెక్కల్లోకి కలిపేత్తారు....దానివల్ల మంచోడు ఎవడో రాడానికి బదులు ఏ తలమాసినోడో గెలిచి మన పానాలు తోడేస్తాడు....ఆల్లెవరో ఓటు ఎయ్యకపోవటం వల్ల మన జీవితాలు నాశనమవుతాయి....ఆల్లంతా బానే ఉంటారు....ఎటొచ్చి మనలాంటోల్లకే ఏది జరిగినా..."

"అవునే...సుబ్బులు..."

"సరేగానీ మాటల్లో పడి నువ్వు సక్కగ తిన్నావా మావ?"

"తిన్నానే...నీ పులుసు తింటున్నాను కాబట్టే బుర్ర బాగా పనిచేసి ఇయాల నీకు బదులు సెప్పగలుగుతున్నాను....లేపోతే నువ్వు ఇట్టాంటి ఇసయలా మీద మాటాడినట్టు నేనెలాగ మాటాడగలనే.."

"పో మావ...నీకన్నీ పరాచికాలే...." అంటూ తన చీర కొంగుతో ఎంకయ్య మూతి తుడిచి ఆప్యాయంగా అతడిని హత్తుకుంది సుబ్బులు.

14 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...

శేఖర్,
నిన్న పోలయిన వోట్లలో తొంభై శాతం ఇలాంటి ఎంకయ్య, సుబ్బులు, లచ్చులు, యాదయ్య...వీళ్ళవే! "ఓటు వేసి తీరాలి"అనే నిబద్ధత చదువుకోని వారిలోనే ఎక్కువగా కనపడ్డం ఒక పక్క సంతోషాన్నీ, మరో పక్క నిర్వేదాన్నీ కల్గిస్తోంది.

మురళి చెప్పారు...

మంచి టాపిక్ శేఖర్ గారూ.. నిజమే, ఇది ఆలోచించాల్సిన విషయం.. మీరు రాయడం లో కొత్తదనం కోసం చేస్తున్న ప్రయత్నాలు ముచ్చటగా ఉన్నాయి.. మొన్న నెరజాణ.. ఇవాళ చదువుకోని దంపతులు.. పిడకల వేట అనుకోక పొతే అక్కడక్కడా యాస మిస్సయింది...

పరిమళం చెప్పారు...

"పెద్ద పెద్ద సదువులు సదూతున్నోల్లు, ఉజ్జోగాలు సేసుకునే వాళ్ళు సగం మందైనా బూత్ కాడకి రానేదు"ఇది నిజమే!

మోహన చెప్పారు...

మురళి గారి మాటే నాదీ....
మంచి టాపిక్. చాలా చోట్ల యాస మిస్ అయ్యింది.

పుల్లాయన చెప్పారు...

మీరు రాసిన యాస ఇరగ ఉందండి.

చిన్ని చెప్పారు...

యంటబ్బాయ ,,,బొమ్మిడాయల కూరోండుకునిఒక్కడివే మెక్కేసావా ?కూసంత రుసికైన పంపోద్దా?,,,మీ ఎన్నికల భాద కన్నా ఇదే రుచిగా వుంది ,కీప్ ఇట్ అప్ -:)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@సుజాత గారు,
అవునండీ..ధన్యవాదాలు.

@మురళి గారు,
నా ప్రయత్నాన్ని గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా థాంక్స్.
యాస నాకు పెద్దగా తెలీదండీ..ఏదో తెలిసిన కొన్నింటితో మేనేజ్ చెసేసాను. పిడకలవేట అని అస్సలు అనుకోను...అలా తెలుసుకుంటేనే కదా నా తర్వాత ప్రయత్నం మరింత సఫలమయ్యేది.

@పరిమళం గారు,
థాంక్యు..

@మోహన గారు,
ఏంటండీ చాలా రోజులకు స్పందించారు...కొంపదీసి నా పోస్ట్లు మరీ అంత బోర్ కొట్టించాయా ఏంటి?
మీ సూచనకు థాంక్యు..

@పుల్లాయన గారు,
నెనర్లు..

@చిన్ని గారు,
ముందు మీరు ఓటేసారో లేదో చెప్పండి...అప్పుడే మీకు 'పులుసు కూర' మా సుబ్బులు తో పంపిస్తాను..:-)
థాంక్యు..

జయ చెప్పారు...

చాలా బాగుంది శేఖర్ గారు. రెండు రోజులు ఊరెళ్ళి నేను ఓటు వేయలేదు. నా ఓటు ఎవరు వేసేశారో ఏమో! నా ఓటు ఏ పార్టీ లోకి వెళ్ళిపోయిందో, ఏవిటో!

'Padmarpita' చెప్పారు...

చాలా బాగుంది శేఖర్ గారు..
నా ఓటు ఎవరో వేసారు:(

చిన్ని చెప్పారు...

మనది హైదరాబాద్ కాదె ..ప్చ్ దొంగ ఓటు వేసే అలవాటు లేదే,ఎలాగబ్బా !

మోహన చెప్పారు...

చిన్ని గారి అనుమానం నాకూ ఉంది.
ఆన్లైన్ ఆప్షన్ ఎలా ఉంటుందా అని ఆలోచించా.... హ్మ్.. బాగానే ఉండచ్చు, ఓటు వెయ్యటానికి. ఐతే అప్పుడు నాకు ఇంకొన్ని బేసిక్ అనుమానాలు వచ్చాయి.
అసలు ఓటు ఎందుకు వెయ్యాలి/వేస్తున్నాం?
ఎక్కడో ఉండి వేసే ఓటుతో ఏమిటి లాభం? మన ఊరి వాళ్ళకి లాభం కలుగుతుందనా?
అసలు ఈ ఊరు వెళ్ళి ఓటేసే నస ఏమిటీ??? నేను బ్రతికేది ఇక్కడ కదా!!!!
ఏంటో!!!! :(

శివ చెరువు చెప్పారు...

సదువుకున్నోళ్ళు ఏటి ఆలోసిత్తారు..?

ఆ.. ఈ వోటు ఏపాటి పనికోత్తాది.. మనం ఏసినా ఏయ్యకున్నా పెద్ద పోయేదేముంది ఓ రోజు ఆపీసుకి సెలవు తప్ప... ఆ వచ్చేతోడు మన్నేంఉద్దరిస్తాడు గనుక..

(అందరూ కాదు వోటు హక్కు వినియోగించుకొని వారి సంగతి మాత్రమే )

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@జయ గారు,
అయ్యో! వెయ్యలేదా?
నెనర్లు.

@పద్మ గారు,
మీరు కూడానా?
ధన్యవాదాలు.

@చిన్ని గారు,
Oops...మీది హైదరాబాదు కాదు కదా..మర్చిపోయానండి...అయితే పులుసు కూర అంత మీకే పంపిస్తాను..:-)

@మోహన గారు,
>>>అసలు ఓటు ఎందుకు వెయ్యాలి/వేస్తున్నాం?
అయ్యో! మీరు ఇలా అడుగుతున్నారా? మీరు ఏ ఉద్దేశంతో ఇలా అడిగారో నాకు అర్ధం కాలేదండి...

@శివ గారు,
బాగా చెప్పారు..చాలా మంది ఆలోచనలు ఇంచుమించుగా అలానే ఉంటాయి...
థాంక్యు ఫర్ యువర్ రెస్పాన్స్...

కార్తీక్ చెప్పారు...

శేఖర్ గారు చాలా బాగుంది..

నాకు క్రితం ఏడాదే ఓటు హక్కు వచ్చింది.. చెన్నై నుంచి పరుగు పరుగున వచ్చా ఏమ్లాబం నే వెళ్ళే సరికి నా ఓటు ఎవరో వేసేసారట.... :(


www.tholiadugu.blogspot.com