6, జూన్ 2009, శనివారం

నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి....( శభాష్ ప్రణీత )


గత సంవత్సరం డిసెంబర్ లో ఓ ఇద్దరు అమ్మయిలపై వరంగల్ లో ఒక మానవ మృగం యాసిడ్ దాడి చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. దాడిలో తీవ్రంగా గాయపడ్డ స్వప్నిక పరిస్థితులతో పోరాడి మరణించగా ఇంకో అమ్మాయి ప్రణీత కూడా చావు బతుకులు మధ్య కొట్టుమిట్టాడి చివరికి ప్రాణాలు నిలుపుకుంది. కొద్ది నెలలు ఆస్పత్రిలోనే గడిపిన ఆ అమ్మాయి తన ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఎనభై మూడు శాతం మార్కులతో డిస్టింక్షన్ లో పాసయ్యింది. ఇన్ఫోసిస్ లో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఎందరో అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది.

మామూలుగా అయితే అమ్మాయిలపై దాడులు జరిగినప్పుడు తల్లిదండ్రులుకు పరిస్థితులను ఎలా డీల్ చెయ్యాలో తెలియక చాలా డిప్రషన్ లో,షాక్ లో ఉండిపోతారు. దానికి తోడు చుట్టు పక్కల వాళ్ళల్లో కూడా అమ్మాయి సరిగ్గా ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అనే మూర్ఖశిఖామనులు ఉండనే ఉంటారు. తన చుట్టూ ఉన్న వాతావరణం ఆ విధంగా ఉండటంతో భాదితులు మరింత కుంగిపోతారు. మన వల్లే కదా అమ్మా, నాన్నఇలా భాదపడుతున్నారు అని తమలో తామే మధనపడి జరిగిన సంఘటనను పదే పదే తలుచుకుని కన్నీటిని ఆశ్రయిస్తారు. అలాంటి పరిస్థితులలో వారు ఏదో సాదించటం సంగతి పక్కన పెడితే...తిరిగి మామూలు మనిషిగా మారటానికే చాలా సమయం పడుతుంది. భవిష్యత్తు గురించి వారు కన్న కలల సౌధం కూలిపోయిందని, తాము ఇంకేమీ చెయ్యలేమని..ఇలా రకరకాల ఆలోచనలు వారి మనస్సును తొలిచేస్తుంటే ఇది వరకు ఉన్న ఆత్మవిశ్వాశాన్ని తిరిగి పొందటం ఎవరికైనా కష్టమైన పనే. ఒకవేళ పొందినా సంవత్సరాల సమయం తీసుకుంటుంది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రణీత తల్లిదండ్రులు, భందువులు ఇతరులకు భిన్నంగా జరిగిన సంఘటనను తీసుకున్నారు. మనసులో భాద తొలిచేస్తున్నా ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదనే ఉద్దేశంతో పంటి బిగువున తమ భాదని దిగమింగి ధైర్యం అందించారు. తల్లి ప్రణీతకి భౌతికంగా సపర్యలు చేస్తూ, జోక్స్ వేస్తూ పక్కన ఉంటే, తండ్రి, అన్నయ్య, మామయ్య తనకి మానసికోల్లాసాన్ని అందించి తను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటంలో సహకరించారు. పరీక్షల సమయంలో కాలేజీ లెక్చరర్ల తోడ్పాటు, స్నేహితుల పోద్భలం, సహాయం తోడైయ్యింది. ప్రణీత ఆస్పత్రిలో చాలా తక్కువ సార్లు మాత్రమే ఏడిచిందని చెప్పే వాళ్ళమ్మ గారి మాటలే ఇందుకు నిదర్శనం. సంవత్సరం వృధా కాకూడదన్న పట్టుదలతో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరీక్షలుకు సిద్దమైంది. ఫలితం....ఒక విద్యాకుసుమం మళ్ళీ వికసించింది..తను ఎదుర్కొన్న తీరుతో రాష్ట్ర మహిళల గుండెల్లో స్పూర్తిని నింపింది...పరిస్థితులకు ఆత్మవిశ్వాసం తో ఎదురీదటం పెద్ద కష్టం కాదని నిరూపించింది. మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్దంలో అతికొద్ది నెలలోనే విజేతగా నిలిచింది.

దాడి జరిగి ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆంధ్ర అంతా వారి ఇంటిలోన అమ్మాయికే జరిగినట్టు భాదపడ్డారు. ఎంతో మంది తను తొందరగా కోలుకోవాలని ప్రార్ధించారు. తను డిస్టింక్షన్ తో పాసయ్యిందని తెలియగానే ఎంతో సంతోషించారు. TV9 లో ఈ రోజు పొద్దున్న ప్రణీత తన కుటుంబసభ్యులతో పాల్గొన్న 'నింగి నేల నాదే' అన్న కార్యక్రమంలో తనకు వచ్చిన ఫోన్ కాల్సే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.

భవిష్యత్తులో సివిల్స్ రాయటమే తన లక్ష్యం అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్న ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తను అనుకున్న ఆశయాన్ని సాదించాలని ఆకాంక్షిద్దాం.

13 కామెంట్‌లు:

మరువం ఉష చెప్పారు...

ప్రణీత ఈ తరం యువత నిబ్బరానికి, నిశ్చయానికి ప్రతీక.
నిజమండి, సంకల్పం ముందు ఏ ఆటంకమూ ఎక్కువ కాలం నిలవలేదు. నా కవితలు "నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది! " http://maruvam.blogspot.com/2009/03/blog-post_11.html , "కమనీయ కావ్యం, మనిషి జీవితం" http://maruvam.blogspot.com/2009/05/blog-post_15.html మనిషిలోని ఆ స్ఫూర్తిని, "అబల అన్న సమాజాన్ని, ఆమె మాత్రమే మార్చాలి" http://maruvam.blogspot.com/2009/05/blog-post_29.html స్త్రీలోని ఆ శక్తిని గురించే ప్రస్తావించింది. వీటి ప్రస్తావన తెచ్చింది ఆలోచనా సామిప్యమున్న మనస్తత్వాన్ని చూపటమే.

హరే కృష్ణ చెప్పారు...

చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈరోజుల్లో
ఇంత దారుణం జరిగాక కూడా వెంనట్టి నడిచిన కుటుంబ సభ్యులకు ఆమె దీక్షకు జోహార్లు

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

"...విధి సైతం చేతులెత్తాలి..."

ఇది దైవదూషణ. కించపఱచడం. ఇలాంటిది హిందువులు మాత్రమే చేస్తారు. ఇతరమతస్థుల్లో ఈ విధమైన సంభాషణాశైలి కనిపించదు. ఇందువల్ల ఇతరదేశాల కంటే మన దేశం మీద దైవానుగ్రహం తక్కువగా ఉంది. ఈ అలవాటుని మనం మానుకోవాలి. దైవాన్ని పొగడ్డానికే తప్ప మఱింకే ప్రయోజనానికీ ఆయన నామాన్ని ఉపయోగించకుండా జాగ్రత్త వహిద్దాం.

మీకు ఈ వ్యాఖ్య చదవడానికి కష్టంగా ఉన్నా, విషయాలు తెలిసినవాడిగా నేను చెప్పకతప్పదు. మీరు దీన్ని ప్రచురించకపోయినా ఫర్వాలేదు. విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.

మురళి చెప్పారు...

ప్రణీత ఆత్మవిశ్వాసాన్ని అభినందించకుండా ఉండలేం.. ఆమె కుటుంబ సభ్యులకీ ఈ విజయంలో భాగం దక్కుతుంది.. మంచి టపా...

జీడిపప్పు చెప్పారు...

Wonderful! hats-off to her.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అభిప్రాయాన్ని తెలిపిన ప్రతి ఒక్క బ్లాగ్ మిత్రులకు ధన్యవాదాలు.

@ఉష గారు,
మీరు లింక్ లో ఇచ్చిన పోస్ట్ లు నేను అవి పబ్లిష్ అయినప్పుడే చూశానండి. బావున్నాయి.
@హరేకృష్ణ గారు,
మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం.
@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు,
మీ అభిప్రాయాలతో నేను ఏకీభవించలేను. మరోలా అనుకోవద్దు...అలాంటి విషయాలు చర్చించే ఆసక్తి కూడా లేదు.
@మురళి గారు,
అవునండి.
@జీడిపప్పు గారు,
ఇలా అందరూ పోత్సాహన్ని పొందితే తప్పకుండా ఆ అమ్మాయి తను అనుకున్నది సాధిస్తుంది.

భావన చెప్పారు...

మంచి పోస్ట్ ... కావాలి మన సమాజానికి ఇంకా ఎందరో ప్రణీత లు ఎదురు తిరిగి ధైర్యంగా నిలిచిన వీర వనితలు తోడు గా నిలిచిన కుటుంబం కూడ ప్రశంసనీయమే...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@భావన గారు,
కుటుంబ అండదండలు, పోత్సాహం ఉంటే విపత్కర పరిస్థితుల్లో ప్రతీ మహిళ సమాజంలో ఒక ప్రణీత కాగలదు. ఉన్న లోటు అంతా ఆ రెండు అందకపోవటమే.
అభిప్రాయాన్ని పంచుకున్నందుకు నెనెర్లు.

నేస్తం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నేస్తం చెప్పారు...

మొన్న ఒక మారు వార్తల్లో ఈ న్యూస్ చూసి ఆక్చర్య పోయాను.. నిజమే మీరు అన్న ట్లు కుటుంబ అండదండలు, పోత్సాహం ఉంటే విపత్కర పరిస్థితుల్లో ప్రతీ మహిళ సమాజంలో ఒక ప్రణీత కాగలదు. ఉన్న లోటు అంతా ఆ రెండు అందకపోవటమే

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@నేస్తం గారు,
వ్యాఖ్యానించినందుకు నెనెర్లు.

Unknown చెప్పారు...

ee roju eeanaadu lo mee blog gurinchi chadivi deeni gurinchi telusukunnanu. naaku telisi inta andamaina pradesam mana vala prapancham lo ledu. nirvaahakulaku naa abhinandanalu. mallee kaluddam..